
అమ్మ జ్ఞాపకాల కబుర్లు
చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం
మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు
నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్
ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..
నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.
శనివారం, ఏప్రిల్ 17, 2021
భయపడి జాగ్రత్తపడదాం...
శనివారం, మార్చి 21, 2020
భయం మంచిదే...
"అబ్బే మనది వేడి ప్రదేశం సార్ మనకేం కాదు.."
వేడి /చలి /హ్యుమిడిటీ లాంటి వాటికీ కరోనా వైరస్ కి ఏ విధమైన సంబంధం లేదు. అయినా దుబాయ్ తో సహా ఈ వైరస్ ఇప్పటికే విస్తరించిన నూటనలభై దేశాల్లో లేని ఎండలు కానీ ఉష్ణోగ్రతలు కానీ కాదు మనవి. మన దేశంలో కన్నా అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది ఐనా అక్కడ రోజు రోజుకీ ఎలా వ్యాపిస్తుందో చూస్తూనే ఉన్నాం.
"ఎవడో ఎక్కడో నాన్వెజ్ తిని తెచ్చుకున్న రోగం ఇది, నేను శాఖాహారిని నాకేం కాదు"

"ఆ ఎయిడ్స్, సార్స్, ఎబోలా, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఇలా ఎన్ని చూళ్ళేదు అవన్ని ఎక్కడెక్కడో వస్తాయ్ కానీ మనకేం కాదు"
తిన కూడనిది తిని మానవాళికి ఈ వైరస్ అంటించిన వారిది ఎంత తప్పో. తీస్కోవలసిన జాగ్రత్తలు తీస్కోకుండా నిర్లక్ష్య ధోరణితో ఈ వైరస్ వ్యాప్తికి కారణమయ్యే మీలాంటి వారిదీ అంతే తప్పు. మీకు ఇమ్యూనిటీ/రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉండచ్చు సాధారణ ట్రీట్మెంట్ తో మీరు కోలుకోవచ్చు. కానీ మీ నిర్లక్ష్యంతో మరో పదిమందికి అంటించడం వారిలో ఇంత ఇమ్యూనిటీ లేని వారి మరణానికి కారణం అవడం క్షమించరాని నేరం.
అందుకే ఎలాంటి అపోహలకు తావు లేకుండా ప్రభుత్వ సూచనలను తూ.చ. తప్పకుండా పాటిద్దాం, సమిష్టి కృషితో ఈ వైరస్ వ్యాప్తిని అరికడదాం. ఇటలీలా, చైనాలా పరిస్థితి చేయి దాటక ముందే, సైన్యమో, పోలీసులో మనలని బలవంతంగా నిర్భంధించాల్సిన పరిస్థితి రాకముందే మేలుకుందాం.
సాధ్యమైనంత వరకూ ఇంటిపట్టునే ఉండండి. ప్రభుత్వం ఇస్తున్న శలవులని వినోద యాత్రలకు విహరాలకు తీర్థయాత్రలకూ వాడకండి. అత్యవసరమైతే తప్ప బయట తిరగకండి. సమూహాలలోకి అసలే వెళ్ళ వద్దు. ప్రయాణాలను వాయిదా వేస్కోండి. షాపింగ్ మాల్స్ /థియేటర్లు /గుడి/చర్చ్/మసీదు/ వాకింగ్ పార్కులు వీటి దరిదాపులకు కూడా వెళ్ళకండి. మీకు దొరికిన ఈ అనుకోని విశ్రాంతిని పూర్తిగా ఇంట్లోనే కుటుంబంతో క్వాలిటీ టైమ్ గడపడానికి కేటాయించండి. అలాగని బంధుమిత్రులతో గెట్ టుగెదర్ లు కూడా ప్లాన్ చేయకండి.
చేతులను మోచేతుల వరకూ శుభ్రపరచుకోండి. కేవలం పంపుకింద చేతులు పెట్టి వదిలేయకుండా సోప్ తో అరచేతులు, వాటి పైనా, వేళ్ళు, బొటన వేళ్ళు, వేళ్ళ మధ్యలో, గోర్లకింద (గోర్లు పెరగనివ్వక పోవడం మంచిది) మొత్తం ఇరవై సెకన్ల పాటు (హ్యాపీ బర్త్ డే పాట పూర్తిగా పాడేంత సేపు) సబ్బుతో రుద్దుకోండి. తుమ్ము లేదా దగ్గు వచ్చినపుడు కర్చీఫ్, టిష్యూ పేపర్ నో లేదా మోచేతిని అడ్డుగా పెట్టుకుని తుమ్మండి. కేవలం అరచేతులు అడ్డుపెట్టుకోవడం సరిపోదు. ఆ తర్వాత ఆ టిష్యూని జాగ్రత్తగా మూత వున్న డస్ట్ బిన్ లో పారేయండి. ముఖాన్ని, ముఖ్యంగా నోరు, ముక్కు, కళ్ళని చేతితో తాకకండి. కౌగిలింతలు, కరచాలనం / షేక్ హ్యాండ్ బదులు నమస్కారం తో సరిపెట్టండి కొన్ని రోజులు.
పబ్లిక్ ప్రదేశాలనే కాదు మీ అపార్ట్మెంట్ లోని గేట్లు, లిఫ్ట్, మెట్లు, వాటికి అనుకోడానికి ఉండే బార్స్, మీ ఇంటి డోర్ నాబ్స్ అన్నిటిని సాధ్యమైనంత వరకు ముట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. తప్పనిసరి పరిస్థితులలో టిష్యూ ఉపయోగించండి. జ్వరం, జలుబు, దగ్గు, ఊపిరి తీస్కోవడానికి ఇబ్బంది లాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మాస్క్ ధరించి మీ దగ్గరలోని హాస్పటల్ ను సంప్రదించండి. ఈ లక్షణాలు లేని వాళ్లు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.
ఇంటికి వచ్చే హెల్పర్స్ / పనిమనుషులకు తగిన జాగ్రత్తలు చెప్పండి. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఇంట్లో దేన్నైనా తాకనివ్వండి. వంటమనిషి ఉంటే మాస్క్ వేసుకుని వంట చేయించడం శ్రేయస్కరం. మొహామాటాలకన్నా ప్రాణం మిన్న అందుకే ఇలాంటి నియమాలను వారికి చెప్పడానికి ఇబ్బంది పడకండి. మన ఇంటికి వచ్చేప్పుడే కాదు ఇక్కడి నుండి వారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా చేతులు కడుక్కోకుండా వాళ్ళ ఇంట్లో దేన్ని ముట్టుకోవద్దని చెప్పండి. సమయం వెచ్చించి అయినా వారికి అర్ధమయ్యేలా చెప్పడం మన బాధ్యత.
మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూస్కోండి. ఇమ్యూనిటీ/రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి లిమ్ సీ లాంటి సి.విటమిన్ టాబ్లెట్స్ వేస్కోండి. అల్లం, సొంఠి, నిమ్మకాయ, వెల్లుల్లి, తెల్ల మిరియాలు, పసుపు గుమ్మడి లాంటి ఇమ్యూనిటీ పెంచే సహజమైన ఆహార పదార్ధాలు తినండి. ఐతే ఇవి కేవలం మీ రోగనిరోధక శక్తి పుంజుకోడానికే తప్ప వైరస్ ని నివారించలేవని గుర్తించండి.
షాపింగ్ కి సాధ్యమైనంత వరకూ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఈ వాలెట్స్, పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే లాంటి వాటిని ఉపయోగించండి. డబ్బులు ఒకరి చేతి నుండి ఒకరికి మార్చడాన్ని వీలైనంతగా తగ్గించండి.
మన ఇంటి మెయిన్ గేట్లు, డోర్ నాబ్స్, ఇంటికి రోజూ తీసుకు వచ్చే పాలు, పేపర్, కూరలు, ఇంకా చెత్త తీస్కుని వెళ్ళే వాళ్ళు హాండిల్ చేసే వేస్ట్ బాస్కెట్/చెత్త బుట్ట, వీటన్నిటిని స్టెరిలైజ్ చేసిన తర్వాతే వాడండి.
స్టెరిలైజేషన్ కి ఆల్కహాల్ బేస్డ్ శానిటైజింగ్ లిక్విడ్స్ దొరికితె సరే లేకపోతే నాకు ఓ నేస్తం చెప్పిన ఈ పద్దతి ఫాలో అవండి. సోప్ సొల్యూషన్ని లేక వెనిగర్ మరియూ నీళ్ళని సమపాళ్ళలో కలిపి కోలిన్ లాంటి స్ప్రే బాటిల్స్ లో పోసుకుని పైన చెప్పిన వాటిపై స్ప్రే చేయవచ్చు ఈ మిశ్రమానికి నిమ్మరసం ఉప్పు కూడా కలపవచ్చు. ఇదే కాక డెట్టాల్ లాంటి లిక్విడ్ ని నీటిలో డైల్యూట్ చేసి దాన్ని కూడా స్ప్రే బాటిల్స్ లో నింపి దాన్ని కూడా వాడుకోవచ్చు.
అవసరానికి మించి స్టాక్ చేసుకునే అలవాటుని మానండి. గుర్తుంచుకోండి మీరీ వైరస్ భారిన పడకుండా ఉండాలంటే వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే మీరొక్కరే జాగ్రత్తలు తీస్కుంటే చాలదు మీ తోటి వారు సైతం తగిన జాగ్రత్తలు తీస్కోవాలి. అందుకే మాస్క్ లు శానిటైజర్స్ లాంటి వాటిని అవసరానికి మించి స్టాక్ పెట్టుకోకుండా అందరికీ అందేలా జాగ్రత్తలు తీస్కుందాం.
ఈ అనుకోని ఉపద్రవం ఇంకా మహమ్మారి కాకముందే ప్రతి ఒక్కరం మన సామాజిక బాధ్యతను అర్ధం చేసుకుని వ్యక్తిగత శుభ్రతని పాటిస్తూ సంఘటితంగా పోరాడి వ్యాపించకుండా అరికడదాం.
మొన్న గురువారం ప్రధాని మోడీ గారు చెప్పినది వినే ఉంటారు కదా. జనతా కర్ఫ్యూ మంచి ఆలోచన, ముందు ముందు ఒక్క రోజు కన్నా ఇంకా ఎక్కువ పాటించాల్సిన అవసరం రావచ్చు. ముందుగా ఈ ఒక్క రోజు పాటిస్తే వైరస్ వ్యాప్తిని కొంత వరకు నెమ్మదింపచేయచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ ఆదివారం మార్చి 22 న ఉదయం ఏడు నుండి రాత్రి తొమ్మిది వరకు జనతా కర్ఫ్యూలో పాల్గొనండి. వీలైతే ఆదివారం రాత్రి పూట కూడా బయట తిరగకుండా ఉంటే మంచిది. అలాగే ఈ ఆపస్సమయంలో ప్రాణాలకు సైతం తెగించి సహాయం అందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీస్, రవాణా, మున్సిపల్, పారిశుధ్య కార్మికులు మరియూ ఇతర అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. విదేశాలనుండి వచ్చిన వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ట్రేస్ చేసి పట్టుకుంటున్న ఇంటెలిజెన్స్ టీమ్స్ సేవలు కూడా అమోఘం. ఈ ఆదివారం అంతా జనతా కర్ఫ్యూని పాటించి సాయంత్రం ఐదుగంటలకు మన ఇంటి గుమ్మం నుండో కిటికీ నుండో చప్పట్లు కొడుతూ వీరందరి సేవలను అభినందిద్దాం. నేను జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నాను మీరూ పాల్గొనండి.
వైరస్ గురించి సమగ్రమైన సమాచరం యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. ఇదే కాక అసలు చేతులను సబ్బుతో ఎందుకు ఇరవై సెకన్లు కడగాలి అనేది అర్ధమవడానికి ఈ వీడియో కూడా చూడండి.
కరోనా వైరస్ ౼ ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.H.O) మార్గదర్శక సూత్రాలు
కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. సరైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం ఆందోళన పడనవసరం లేదు. తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.H.O) సూచించిన గైడ్ లైన్స్ పాటిస్తే కరోనా బారిన పడకుండా మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవచ్చు. కరోనా వైరస్ గాలిలో ప్రయాణించలేదు. COVID-19 వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వచ్చే తుంపర ద్వారా బయటకు వెదజల్లబడుతుంది. ఆ తుంపర గాలిలో ఎంత సేపు నిలిచి ఉంటే, అంతసేపు ఉంటుంది. అలా బయటకు వచ్చిన డ్రాప్లెట్స్ కుర్చీ, టేబుల్, తలుపులు, డోర్ నాబ్స్, బస్సు, ట్రెయిన్ లో ఉండే స్టీల్ రాడ్స్ మొదలైనటువంటి ఉపరితలాల(surfaces)కి అంటుకొని ఉంటుంది. వాటిని మనం తాకి అదే చేతితో నోరు, ముక్కు, కంటిని తాకితే, మన శరీరంలోకి చేరుతుంది. ఇతరుల్ని తాకితే, వారికి అంటుకుంటుంది.
కరోనా ఏ మార్గం ద్వారా ఒకరి నుండి ఒకరికి వెళుతుందో గుర్తు పెట్టుకొని, W.H.O సూచించిన క్రింది జాగ్రత్తలు పాటించాలి.
1. మీ చేతులను తరచుగా కడగాలి
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ లో ఉన్న surfaces ని తాకడం వల్ల వైరస్ అంటుకుంటుంది కాబట్టి, చేతులను ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్ తో రుద్దుకోవాలి. లేదా సబ్బు మరియు నీటితో కడగాలి. అలా చేస్తే మీ చేతుల్లో ఉండే వైరస్లు చనిపోతాయి.
2. సామాజిక దూరాన్ని పాటించండి.
దగ్గు లేదా తుమ్ము ఉన్నవారికీ మీకూ మధ్య కనీసం ఒక మీటర్ (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోండి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వారి ముక్కు లేదా నోటి నుండి వచ్చే తుంపర(ద్రవ బిందువులు)లో వైరస్ ఉండవచ్చు. వారికి దగ్గరగా ఉండటం వల్ల ఆ బిందువులలో పాటు కరోనా వైరస్ ని పీల్చుకోవడం వల్ల COVID-19 రావొచ్చు.
3. కళ్ళు, ముక్కు మరియు నోరు తాకడం మానుకోవాలి. పూర్తి స్పృహలో ఉండి, ముఖాన్ని తాకే అలవాటును మార్చుకోండి. ఎందుకంటే, మనం బయటకు వెళ్ళినప్పుడు కుర్చీలు, టేబుల్స్, బస్సులో, ట్రెయిన్ లో సపోర్టు కోసం వాడే స్టీల్ రాడ్స్ వంటి ఉపరితలాలను చేతులతో తాకుతాము. అలా వైరస్లు చేతులకు అంటుకొని, మీ కళ్ళు, ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్థాయి.
4. మీరు మరియు మీ చుట్టుపక్కల ప్రజలు శ్వాసకోశ పరిశుభ్రతను పాటించేలా చూసుకోండి. దగ్గు లేదా తుమ్ము ఉన్నప్పుడు మీ వంచిన మోచేయి లేదా టిష్యూ పేపర్ తో నోరు మరియు ముక్కును కప్పాలి. అలా వాడిన టిష్యూ పేపర్ ని వెంటనే పారవేయాలి. ఇలా కాకుండా నేరుగా చేతులు అడ్డు పెట్టుకోవడం వల్ల, ఆ వైరస్ మీ చేతులకు అంటుకొని, ఇతర ఉపరితలాలకు వ్యాప్తి చెందుతుంది.
5. మీకు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, వైద్య సహాయం తీసుకోండి. స్థానిక ఆరోగ్య అధికారుల సూచనలను అనుసరించండి. వారి వద్ద తాజా సమాచారం ఉంటుంది. ముందుగానే కాల్ చేస్తే, మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత మిమ్మల్ని త్వరగా సరైన ఆరోగ్య సదుపాయాన్ని కల్పిస్తారు.
6. COVID-19 వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో లేదా ఇటీవల(గత 14 రోజులు) సందర్శించి ఉంటే, ముందుగా స్థానిక ఆరోగ్య అధికారికి ఫోన్ చేసి సమాచారం అందించండి. వారు అవసరమైన పరీక్షలు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతారు.
మాస్క్ ఎప్పుడు, ఎలా ధరించాలి?
మీ ఆరోగ్యం బాగుగా ఉండి, COVID-19 సంక్రమించినట్టు అనుమానం ఉన్న వ్యక్తికి సపర్యలు చేస్తూ ఉంటే మాస్క్ ధరించాలి. లేదా మీకు దగ్గు లేదా తుమ్ము ఉంటే ధరించాలి. లేదా మూడు అడుగుల సామాజిక దూరాన్ని పాటించడం కుదరని బస్సు, ట్రెయిన్ లో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలి. ఇవేమీ లేనప్పుడు, ఇంటిలో ఉండగా మాస్క్ అవసరం లేదు.
ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్ లేదా సబ్బు మరియు నీటితో చేతిని శుభ్రపరచుకున్నాకే మాస్క్ ని తాకాలి. లేకుంటే, చేతికి ఉన్న వైరస్ మాస్క్ కి అంటుకొని వైరస్ శరారంలోకి ప్రవేశించవచ్చు. మాస్క్ తో నోరు మరియు ముక్కును పూర్తిగా కప్పండి. మరియు మీ ముఖం మరియు ముసుగు మధ్య ఖాళీ లేకుండా చూసుకోవాలి. మాస్క్ వేసుకున్నాక దాన్ని తాకడం మానుకోండి. ఒక వేళ తాకితే ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్ లేదా సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి. మాస్క్ తడిగా ఉంటే అది పడేసి కొత్తది వేసుకోండి. సింగిల్-యూజ్ మాస్క్‌లను తిరిగి ఉపయోగించవద్దు. మాస్క్ తొలగించడానికి తాళ్లను పట్టుకొని మాత్రమే తొలగించాలి. (ముసుగు ముందు భాగంలో తాకవద్దు) మూత ఉన్న చెత్త డబ్బాలో వెంటనే పడేసి, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ లేదా సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రం చేయండి.
కరోనా గురించి ఉన్న కొన్ని అపోహలు.
1. కరోనా వైరస్ వేడిగా ఉండే మన దేశంలో వ్యాపించదు అనేది కేవలం అపోహ. ఇప్పటివరకు లభించిన ఆధారాల నుండి, COVID-19 వైరస్ వేడి మరియు తేమతో కూడిన వాతావరణంతో సహా అన్ని ప్రాంతాలలో వ్యాపిస్తుంది.
2. వేడి స్నానం చేయడం వల్ల కొత్త కరోనావైరస్ వ్యాధి రాదు అనేది కూడా అపోహ మాత్రమే. ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయడం ప్రమాదకరం.
3. హ్యాండ్ డ్రైయర్స్ తో చేతుల్ని పొడిగా చేసుకోవడం వల్ల వైరస్ పోతుంది అనేది కూడా అపోహ. సబ్బు, నీటితో చేయి కడుక్కోవడం తప్పని సరి.
4. థర్మల్ స్కానర్లు కరోనా వైరస్ ని గుర్తిస్తాయా? జ్వరం వచ్చిన వ్యక్తులను మాత్రమే థర్మల్ స్కానర్లు గుర్తిస్తాయి. వ్యాధి బారిన పడి, జ్వరం రాని వారిని గుర్తించలేవు. వ్యాధి బారిన పడినవారు అనారోగ్యానికి గురై జ్వరం రావడానికి 2 నుండి 10 రోజుల మధ్య సమయం పడుతుంది.
5. శరీరమంతా ఆల్కహాల్ లేదా బ్లీచింగ్ పౌడర్/క్లోరిన్ చల్లడం వల్ల కరోనావైరస్ను చంపగలమా?
శరీరమంతా ఆల్కహాల్ లేదా క్లోరిన్ చల్లినా, శరీరంలోపలి వైరస్లను చంపలేము. అటువంటి పదార్థాలను చల్లడం బట్టలు లేదా శ్లేష్మ పొరలకు (అంటే కళ్ళు, నోరు) హానికరం. ఉపరితలాలను క్రిమిసంహారక చేయడానికి ఆల్కహాల్ మరియు క్లోరిన్ రెండూ ఉపయోగపడతాయి. అయితే అవి తగిన సిఫారసుల క్రింద ఉపయోగించాల్సిన అవసరం ఉంది.
6. న్యుమోనియా కోసం వేసుకున్న టీకాలు కొత్త కరోనావైరస్ నుండి రక్షిస్తాయనేది అపోహ. కరోనాకి స్వంత టీకాని తయారు చేయడం అవసరం. పరిశోధకులు 2019-nCoV కి వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి తయారవ్వలేదు.
7. క్రొత్త కరోనావైరస్ సంక్రమణను నివారించడానికి ఉప్పు కలిపిన నీళ్లతో ముక్కును క్రమం తప్పకుండా కడగడం సహాయపడుతుందా? జలుబుతో ముక్కును క్రమం తప్పకుండా కడగడం వల్ల జలుబు నుండి ప్రజలు త్వరగా కోలుకోగలరని కొన్ని పరిమిత ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడానికి అది సరిపోదు.
8. వెల్లుల్లి తినడం కొత్త కరోనావైరస్ సంక్రమణను నివారించగలదా?
వెల్లుల్లి ఆరోగ్యకరమైన ఆహారం, ఇది కొన్ని యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అయినప్పటికీ వెల్లుల్లి తినడం ప్రజలను కొత్త కరోనావైరస్ నుండి రక్షించిందని ప్రస్తుత వ్యాప్తి నుండి ఎటువంటి ఆధారాలు లేవు.
9. కొత్త కరోనావైరస్ వృద్ధులను ప్రభావితం చేస్తుందా, లేదా యువకులు కూడా బారిన పడుతున్నారా?
అన్ని వయసుల వారికి కొత్త కరోనావైరస్ (2019-nCoV) సోకుతుంది. వృద్ధులు, మరియు ముందుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు (ఉబ్బసం, మధుమేహం, గుండె జబ్బులు వంటివి), వ్యాధి నిరోధకాశక్తి తక్కువ ఉన్నవారు ఈ వైరస్‌తో తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
10. కొత్త కరోనావైరస్ను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా ఉన్నాయా?
లేదు, యాంటీబయాటిక్స్ వైరస్లకు వ్యతిరేకంగా పనిచేయవు. కేవలం బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తాయి. అయినప్పటికీ, మీరు 2019-nCoV కోసం ఆసుపత్రిలో ఉంటే, మీరు యాంటీబయాటిక్స్ పొందవచ్చు ఎందుకంటే బాక్టీరియల్ కో-ఇన్ఫెక్షన్ సాధ్యమే.
11. కొత్త కరోనావైరస్ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఏదైనా నిర్దిష్ట మందులు ఉన్నాయా?
ఈ రోజు వరకు, కొత్త కరోనావైరస్ (2019-nCoV) ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి నిర్దిష్టమైన మందు సిఫారసు చేయబడలేదు. అయినప్పటికీ, వైరస్ సోకిన వారు లక్షణాల నుండి ఉపశమనం పొందటానికి మరియు చికిత్స చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు, సహాయక వైద్యాన్ని పొందాలి.
అన్నింటికంటే ముఖ్యంగా వదంతులను, వాట్సాప్ మెస్సేజులనూ నమ్మకండి. W.H.O సూచనలు పాటించండి. చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవడం, ముక్కు నోరు, కంటిని తాకకుండా ఉండటం, మూడు అడుగుల సామాజిక దూరానికి కట్టుబడి ఉండటం, తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ అడ్డుపెట్టుకొని దాన్ని డస్ట్ బిన్ లో పడేయడం చేస్తూ ఉంటే, కరోనాపై మనమంతా విజయం సాధించవచ్చు.
Link : https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/advice-for-public
గురువారం, ఆగస్టు 01, 2013
దొంగా - పోలీసూ - ఓ కోర్టు.
సమయం తెల్లవారుఝామున సుమారుగా మూడున్నరై ఉంటుంది, అప్పటికి గంటక్రితమే పడుకున్న నేను నాన్నగారి పిలుపుకు ఉలికిపడి నిద్రలేచాను. తను “వెనుకవేపు తలుపేయడం మరచిపోయావా తీసుంది” అని అడిగారు. నేను “లేదండీ గంటక్రితమే మంచినీళ్ళు తాగుతూ కూడా చెక్ చేశాను వేసే ఉండాలే” అనుకుంటూ హాల్ లోకి వచ్చి తలుపు చూస్తే బార్లా తెరచి ఉంది.
ఒకడుగు బయటకి వెళ్లి ఎవరైనా ఉన్నారేమో చూసి వచ్చి తలుపు వేసి ఎందుకో అనుమానం వచ్చి ఇంట్లో సామాన్లు చెక్ చేయడం మొదలెట్టాను. టేబుల్ మీద ఉండాల్సిన లాప్ టాప్ లేదు, టీవి మీద పెట్టిన స్మార్ట్ ఫోన్, కప్ బోర్డ్స్ లో ఉండాల్సిన మరో మూడు సెల్ఫోన్స్ కూడా లేవు, కొన్ని అల్మారాలలో వస్తువులు చిందరవందర చేసి ఉన్నాయ్. దాంతో ఇంట్లో దొంగతనం జరిగిందని అర్ధమైంది.
వెంటనే మిస్సింగ్ ఫోన్స్ కి రింగ్ ఇవ్వడం మొదలెట్టాం. మూడు ఫోన్లు స్విచ్చాఫ్ అని మెసేజ్ వచ్చింది నాలుగో ఫోన్ రింగ్ ఇంటి బయటనుండి వినిపించడం మొదలైంది. దానితోపాటే ప్లాస్టిక్ షీట్ మీద ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. మాకు దొంగ అక్కడే ఉన్నాడేమోనన్న అనుమానం వచ్చింది. వెంటనే పోలీసుల కోసం 100 కి ఫోన్ చేసి విషయం చెప్పి అడ్రస్ ఇచ్చి ఎదురు చూడ్డం మొదలెట్టాం.
అడుగుల చప్పుడు ఆగిపోయింది కానీ ఫోన్ రింగ్ మాత్రం అక్కడనుండే వినిపిస్తుంది. ఐదునిముషాలకి కొంచెం ధైర్యం వచ్చి సేఫ్టీకోసం పక్కనే ఉన్న పచ్చడిబండ తీస్కుని మెల్లగా తలుపు తీసి ఫోన్ రింగ్ వచ్చిన వైపు వెళ్ళాను. అక్కడ కాంపౌండ్ వాల్ మీద ఒక ఫోన్ ఉంది. లైట్ వేసి ఆ చుట్టు పక్కల ఇతర ఫోన్లు కానీ లాప్ టాప్ కానీ దొరుకుతుందేమోనని వెతికాను. ఇంకేవీ లేవు, ఫోన్ ఉన్న ప్రదేశాన్ని చాక్ పీస్ తో మార్క్ చేసి దాన్ని లోపలికి తెచ్చేసాను. పదినిముషాలకి పోలీసులు వచ్చారు.
![]() |
ఇవే టవర్ బోల్ట్స్, మా తలుపు కిటికి ఇంతే ఉంటై. |
పోలీస్ స్టేషన్ లోని క్రైం డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ గారికి విషయమంతా వివరించాక అతనూ మరో కానిస్టేబుల్ కలిసి ఇంటికి వచ్చి వివరాలు నోట్ చేస్కుని వెళ్ళారు. ఉన్న వస్తువులేవీ కూడా వేలి ముద్రలు తీస్కోడానికి అనువుగా లేవని వదిలేశారు. ఆ సాయంత్రం మళ్ళీ స్టేషన్ కు రమ్మని చెప్పారు. ఆ సాయంత్రం నేను తెలుగులో రాసిచ్చిన రిపోర్ట్ తోపాటు దానిని వాళ్ళు ఆంగ్లంలోకి తర్జుమా చేసి కంప్యూటర్ లో టైప్ చేసిన FIR కాపీ ఒకటి ఇచ్చారు. కేస్ లో పురోగతి ఉంటే మేమే కాల్ చేస్తామని చెప్పి నంబర్ నోట్ చేస్కుని పంపించేశారు. ఓవరాల్ గా పోలీసుల రెస్పాన్స్ నాకు చాలా బాగా నచ్చింది.
21st April 2013:
మధ్యాహ్నం ఒంటిగంట దాటింది, భోజనానికి కూర్చోబోతుండగా ఒక అన్నోన్ నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఎవరా అనుకుంటూ మాట్లాడితే “మేము ఫలానా పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నాం, మీ లాప్ టాప్ దొరికింది వచ్చి ఐడెంటిఫై చేయండి” అని చెప్పారు. నేనూ తమ్ముడూ భోజనం కూడా చేయకుండా పరుగున పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. ఒక లాప్ టాప్ ఆరో ఏడో సెల్ఫోన్స్ తీసుకువచ్చి వీటిలో మీ వస్తువులు గుర్తుపట్టండి అని అడిగారు. లాప్ టాప్, ఒక సెల్ఫోన్ మావే అని చెప్పాం. దొంగ దగ్గర ఈ మాత్రమే రికవర్ చేయగలిగామని నోకియా ఫోన్ లాక్ ఓపెన్ చేయలేక ఫ్రస్టేషన్ తో పగలగొట్టాడనీ మరో ఫోన్ పోయిందంటున్నాడనీ చెప్పారు.
"సర్లెండి ఈ మాత్రమైనా వచ్చాయి మా వస్తువులు మేం పట్టుకుపోతాం" అని చెప్పాం. ఆయన మమ్మల్ని పిచ్చివాళ్ళని చూసినట్లు చూసి నవ్వి అదంత వీజీకాదు దానికో ప్రొసీజరుంది అని మొదలెట్టారు. ఇక అక్కడ నుండి మా కష్టాలు మొదలయ్యాయ్ కేస్ బబుల్ గమ్ లా సాగడం మొదలైంది, సామాన్లు పోలీస్ స్టేషన్ లో లాకర్ లో భద్రంగా దాచారు. ఆ పక్కనే మరో సెల్ లో దొంగని కూడా పెట్టి మేపుతున్నారు. నేను మాత్రం పోలీస్ స్టేషన్ కి ఇంటికీ మధ్య చక్కర్లు కొట్టడం మొదలెట్టాను.
లీగల్ సిస్టం ఎంత చిత్రమైందంటే పోలీసులు ఇన్ఫార్మర్స్ ద్వారానో అనుమానితులపై నిఘా వేసో దొంగలను పట్టుకున్నామని చెప్తే కోర్ట్ నమ్మదట. వాళ్ళని సక్రమంగా పట్టుకున్నట్లు కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించాలిట. ముందుగా అలాంటి ఇద్దరు సాక్షులను అరేంజ్ చేయిస్తే రెండు మూడు వారాలలో మీ సామాను మీకు ఇప్పిస్తామని చెప్పారు కానీ అలా చెప్పగలిగిన వాళ్ళు నాకు ఎవరూ తెలియరని చెప్పాను. అయితే బాగా ఆలశ్యమవుతుంది ముద్దాయి కూడా శిక్ష తప్పించుకోవచ్చు అన్నారు. నేను చేయగలిగింది ఏమీలేదని చెప్పడంతో సాధారణంగా ఎప్పటిలాగే వారి పద్దతులలో కేస్ ఫైల్ చేస్తామని చెప్పారు.
కేస్ ఫైల్ చేశాక నేను ఒక లాయర్ ని పెట్టుకుని రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కేస్ ఫైల్ చేయాలట దానికి లాయర్ ప్లస్ కోర్ట్ ఫీజులూ చెల్లించాలి అదీకాక గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి శాలరీ సర్టిఫికెట్ తో వస్తువుల ధరకి హామీ ఇప్పించాలిట. అంటే నేను కేస్ హియరింగ్ కి వచ్చినరోజున వస్తువులని మళ్ళీ కోర్ట్ లో హాజరుపరచాలి అలా కాని పక్షంలో ఆ ఆఫీసర్ కోర్టుకు డబ్బులు కట్టాలన్నమాట. లేదా కేస్ హియరింగ్ కి వచ్చిన రోజున కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి మీ వస్తువులు మీరు తీసుకు వెళ్ళవచ్చు అన్నారు. కేస్ కోర్ట్ లో ఫైల్ చేయడానికి కొన్ని రోజులు ఆలశ్యం అయింది. ఆ తర్వాత ఒక లాయర్ ని మాట్లాడాలని చెప్పి మరికొన్ని రోజులు తాత్సారం చేసి తిప్పుకున్నారు. అంతలో హియరింగ్ దగ్గర పడింది.
26th July 2013
అంతకు నాలుగు రోజుల ముందే ఈరోజు మీ కేస్ హియరింగ్ అని చెప్పడంతో పదిన్నరకు కోర్ట్ ఆవరణకు చేరుకున్నాను. నా జీవితంలో మొట్ట మొదటి సారి అక్కడికి వెళ్ళడం, కోర్ట్ అనగానే సినిమాలలో చూపించినట్లు ఎత్తైన మెట్లు భారీ సెట్టింగ్ ఊహించుకున్న నాకు మాములు భవన సముదాయం కనిపించి నిరాశపరిచింది. సరే ఇక్కడిలాగే ఉంటుందేమో అని కాస్త లోపలికి నడవగానే చెడు వినకు, అనకు, కనకు అంటూ బక్కచిక్కిన మూడు కోతి బొమ్మలు వెల్కం చెప్పాయ్. నాకు కావలసిన కోర్ట్ రూం ఎక్కడుందో వాకబు చేస్తూ మరికొంచెం ముందుకు వెళ్ళగానే న్యాయదేవత ఎదురైంది ఆవిడని తప్పుకుని ముందుకు వెళ్తే నేను వెతుకుతున్న కోర్ట్ హాల్ కనిపించింది అక్కడే ఉన్న మా పోలీస్ స్టేషన్ HC(Head constable) ని పలకరించాను. ఆయన నాతరఫున వస్తువులను రిటర్న్ చేయమంటూ లెటర్ రాసి సంతకం పెట్టించుకుని కోర్ట్ లో సబ్మిట్ చేసి "మీ పేరు పిలుస్తారు ఎదురు చూడండి" అని చెప్పారు.
మాములు పాత యూనివర్సిటీ/గవర్నమెంట్ బిల్డింగ్స్ లాగా పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన భవనం అది. ముందు కొన్ని నీడనిచ్చేచెట్లున్నాయ్ వాటికింద నాలుగైదు సిమెంట్ బల్లలు ఉన్నాయి. వాటిమీద ముద్దాయిలు సంకెళ్ళతో కూర్చుని ఉన్నారు వారిపక్కన వారికి ఎస్కార్ట్ గా వచ్చిన పోలీసులు గన్నులతో ఉన్నారు. సంకెళ్ళనీ గన్నునీ కూడా అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి. వీళ్ళేకాక రకరకాల పనులమీద వచ్చిన ఇతర వ్యక్తులు కూర్చుని ఉన్నారు. కులం జాతి మతం ప్రాంతం అనే బేధాలకి అతీతంగా అందరూ కలిసి కూచుని జడ్జిగారికోసం ఎదురు చూస్తున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పసిపిల్లలని వెంట తీస్కొని వచ్చిన వాళ్లు, యువకులు, పండు ముదుసలులు అందరూ ఉన్నారు.
ఆవేళ కాస్త ఆలశ్యంగా పదకొండుముప్పావుకి వచ్చారు జడ్జిగారు. ఆవిడ వచ్చీ రాగానే అప్పటివరకూ రిలాక్స్ గా ఉన్న వాతావరణం మారిపోయింది. ముందుగా వాయిదాలు ఇచ్చే కేసులను ఒకదాని తర్వాత ఒకటి పిలిచి పెద్దగా చర్చలేకుండానే తరువాతి వాయిదా తారీఖుని ఇచ్చి పంపించి వేస్తున్నారు. అలా ఒక పది హేను కేసులు ఇచ్చి ఉంటారు వాటిలో కొన్ని 2005 అంటే ఎనిమిదేళ్ళక్రితం పెట్టినవి కూడా ఉన్నాయ్. కాసేపటికి నా పేరు పిలిచారు లోపలికి అడుగు పెట్టాను.

నన్ను ఆ కుర్చీలో కూర్చోమన్నారు. నా పక్కనే పిపి(పబ్లిక్ ప్రాసిక్యూటర్) నుంచున్నారు ఆయనకి కాస్త అవతల డిఫెన్స్ లాయర్ ఉన్నారు. ఈ టేబుల్ తర్వాత వీళ్ళ వెనుక కాస్త ఖాళీ వదిలి పొడవాటి టేబుల్స్ రెండువైపులా వేసి ఉన్నాయ్ వాటిముందు న్యాయవాదులు కూర్చుని ఉన్నారు. ఆ టేబుల్స్ తర్వాత హాలుకు రెండో చివర మరో గుమ్మం ఉంది దాని దగ్గరగా ఖాళీ స్థలం ఉంది అక్కడ ఎస్కార్ట్ గా వచ్చిన పోలీస్ తో కలిసి ముద్దాయి నిలబడ్డాడు.
కోర్టు బంట్రోతు వచ్చి నాతో ప్రమాణం చేయించింది, భగవద్గీత ఏవీ లేదు కానీ చేతులు కట్టుకుని సేం డైలాగ్ “దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్దం చెప్పను” అని చెప్పాను. ఆ తర్వాత పిపి గారు ముందుగా నా పర్సనల్ వివరాలు ఆ తర్వాత జరిగిన అఫెన్స్ గురించి ఏవేవి పోయాయి ఏవి దొరికాయి ఇతరత్రా వివరాలు అడుగుతూంటే నేను చెప్పిన వాటిని తన దగ్గర ఉన్న రిపోర్ట్ తో టాలీ చేస్కుంటూ జడ్జిగారు ఆమోదం తెలపడం మొదలెట్టారు. నేను అంతా పూర్తిచేసి వస్తువులు ఐడెంటిఫై చేశాక డిఫెన్స్ లాయర్ ని ఏవైనా అభ్యంతరాలున్నాయా అని అడిగారు తను లేవని చెప్పాక అతని వస్తువులు అతనికి ఇచ్చేయమంటూ జడ్జిగారు ఆర్డర్ పాస్ చేశారు.
నేను చెప్పిన వివరాలను కోర్ట్ క్లర్క్ అక్కడికక్కడే ఒక పేపర్ మీద రాసి ఇస్తే దాని మీద ప్లస్ ఆరోజు నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినట్లుగా ఒక రిజిస్టర్ లోనూ నేను సంతకం చేయాల్సి ఉంటుంది బయట వెయిట్ చేయమన్నారు. నాతో ప్రమాణం చేయించిన బంట్రోతు వచ్చి సంతకాలు పెట్టించుకుని “డబ్బులు ఇవ్వు” అని డైరెక్ట్ గా అడిగింది. ఒక్క క్షణం స్టన్ అయిన నేను “అదేంటమ్మా పదడుగుల దూరంలో గుమ్మం అవతల న్యాయమూర్తిని పెట్టుకుని ఇలా అడగడానికి భయమేయట్లేదా?” అని అడిగాను. ఇక్కడ ఇదంతా కామనే సార్ కాఫీకైనా ఒక ఇరవై రూపాయలివ్వండి అంటూ దబాయించి మరీ తీస్కుంది.
ఈ ప్రొసీజర్ అంతా అయిన ఒక గంటకి న్యాయవాదుల సంతకాలతో కోర్ట్ ఆర్డర్ విడుదలయ్యాక దాన్ని తీస్కుని అదే ఆవరణలో ఉన్న క్లరికల్ ఆఫీస్ కి వెళ్ళి వస్తువులు హాండోవర్ చేస్కున్నట్లు ఒక పర్సనల్ బాండ్ మీద రెవెన్యూ స్టాంపులపై సంతకాలు చేసాక నా వస్తువులు నా చేతికి వచ్చాయి. రికవర్ చేయని రెండు సెల్ఫోన్స్ పై ఆశలు వదిలేసుకోవడమే తప్ప ఇక చేయగలిగింది ఏం లేదని చెప్పారు. ఐతే లాప్ టాప్ చెక్కుచెదరకుండా ఎలా ఉన్నది అలానే చేతికి రావడం మాత్రం బోలెడంత సంతోషాన్నిచ్చింది.

ఆదివారం, ఫిబ్రవరి 10, 2013
క్రైస్తవ 'కడలి'
బుధవారం, అక్టోబర్ 17, 2012
బ్రదర్స్-లెంత్ తో బెదుర్స్

మంగళవారం, అక్టోబర్ 16, 2012
RGV 3D బూచి !!
మంగళవారం, అక్టోబర్ 19, 2010
ఓంకార్ పై ఓ సరదా వీడియో
ఇతనెవరు అంటే వివరించే ఓపిక నాకిప్పుడులేదు కానీ వీలైతే ఈ టపా చదవండి. ఇతను ఈ మధ్య జీనియస్ అని ఇతను తీసే సిన్మాలో సెలెక్షన్ కోసం ఒక కొత్త రియాలిటీ షో ఒకటి మొదలెట్టాడు. దానికి కొన్ని తెలుగు కామెడీ సీన్లు కలిపి ఇతని మీదఉన్న కసి అంతా తీరేలా బహు చక్కగా తయారు చేసిన ఈ కామెడీ వీడీయో చూసి హాయిగా నవ్వుకోండి. ఇతగాడికి ఇలాంటి ఎన్ని వీడియోలు తయారు చేసినా బుద్దిరాదు. కాస్త నిడివి ఎక్కువే కానీ ఏం భయపడకండి ఇతన్ని అంత సేపు భరించాల్సిన దౌర్భాగ్యాన్ని నాబ్లాగుద్వారా మీకు కలుగ నిస్తానా. అందులో అధికభాగం కామెడీ క్లిప్సే ఉన్నాయి అదీకాక ఈ వీడియో ఖచ్చితంగా మీకితని మీదున్న కసిని కొంతైనా తీరుస్తుందని నాదీ హామి.
ఈ వీడియో తయారు చేసిన అసలు జీనియస్ కు నా జోహార్లు. ఇందులో వాడిన మహెష్ ఖలేజ క్లిప్ అయితే అసలు ముందు సీన్లో ఓంకార్ వైపే చూస్తూ తిడుతున్నట్లనిపించింది. ఇక బ్రహ్మానందం మేడమీదనుండి పరిగెట్టుకు వస్తూ చెప్పే "దరిద్రనారాయణుని దిక్కుమాలిన అవతారం" ఆ మ్యూజిక్కూ ఎంత చక్కగా సరిపోయిందో మాటల్లో చెప్పలేను. ఇక ఆర్తి పెట్టిన చీవాట్లు, "తిక్క కుదిరింది తింగరి వెధవకి" లాంటి బ్రహ్మానందం తిట్టిన తిట్లు, వీరభద్రరావుగారు ఇతని వెర్రిపై చేసిన వ్యాఖ్యానం గురించి చెప్పనే అక్కర్లేదు కంక్లూజన్ కూడా కేక. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇతనెవరో కానీ ఓంకార్ బాదితుల సంఘం అద్యక్షుడిలా ఉన్నాడు అందరి మనోభావాలను ఇట్టే పట్టుకుని ఎంచక్కా ప్రజెంట్ చేసేశాడు. చూసి ఆనందించండి.
మంగళవారం, ఏప్రిల్ 20, 2010
ఈ వేసవి లో పక్షులు చల్లగా ఉండాలని..

నాకు ఫార్వర్డ్ చేయబడిన ఒక ఈమెయిల్ సాధ్యమైనంత మందికి చేరుకోవాలని. మనవంతుగా ప్రతి ఒక్కరు ఆచరించాలని ఇక్కడ ఇస్తున్నాను. నాకు ఫార్వర్డ్ చేసిన నానేస్తానికీ (జాజిపూలు నేస్తం కాదు:-) ఈ బ్యానర్ తయారు చేసిన http://www.chennaiepages.com/ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వేసవి అనే కాదు అన్ని కాలాల్లోనూ మీ బాల్కనీల్లోనో పిట్టగోడ పైనో తోటలోనో ఇంటి ఆవరణ లోనో మీకు వీలైన ప్రదేశం లో పక్షులకోసం ఒక చిన్న పాత్రలో ఇలా నీటిని అందుబాటులో ఉంచడం మంచి ఆలోచన. బ్యానర్ చేసినపుడు 37C మాత్రమే దాటినట్లుంది ఇపుడు 42C కూడా దాటిందనుకుంటాను వేసవి తాపం.
ఆస్ట్రేలియాలో ఓ వారం రోజులపాటు 120F డిగ్రీల ఉష్ణోగ్రత మాడ్చేసినపుడు ఇదివరకు ఎన్నడూ లేని విథంగా అక్కడి Koalas ( వీటి గురించి వివరాల కోసం ఇక్కడ నొక్కండి ) మనుషులను నీటి కోసం ప్రాథేయపడటం ఈ చిత్రాలలో చూడవచ్చు. వేసవి తాపం మూగజీవాలను సైతం ఎంతగా బాధపెడుతుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.
AT 120 DEGREES IN AUSTRALIA , IT WAS SO HOT FOR A WEEK THAT KOALAS WERE ASKING PEOPLE FOR WATER . IT'S NEVER BEEN SEEN BEFORE.
"Until one has loved an animal, part of their soul remains unawakened."
శుక్రవారం, ఫిబ్రవరి 05, 2010
Happy to Help - ఛా! నిజమా!!
అదేమిటో పొలిమేరల్లోనూ, ఊరి బయట హైవేస్ మీదా ఉన్నంత సిగ్నల్ స్ట్రెంత్ సిటీల్లోనూ ఇంట్లోనూ ఆఫీసుల్లోనూ ఉండి చావదు. సరే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలిగా మరి చీప్ గా ఇస్తున్నపుడు ఇలాటివి భరించాలి లే అని వదిలేశాను. సిగ్నల్ సంగతి పక్కన పెడితే నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ ఏ కాల్ చేసినా కూడా 30 నిముషాలు దాటనివ్వడు. సరిగ్గా ఇరవైతొమ్మిది నిముషాల యాభైఏడు సెకన్లకు కట్ చేసి పడేస్తాడు. మంచి ఫ్లోలో సాగుతున్న సంభాషణ మధ్య ఈ అంతరాయం చాలా చిరాకు కలిగిస్తుంది, ఈ సరికే దీనికి కూడా అలవాటు పడిపోయాను అనుకోండి. ఒకోసారి లైన్ కలవదు నంబరు బిజీ అనో నాట్ ఇన్ కవరేజ్ ఏరియా అనో వస్తుంది అవతల వ్యక్తి ఫోన్ పట్టుకుని మనకోసమే ఎదురుచూస్తున్నారు అని మనకి తెలుసు అయినా వీడి నాటకాలు ఇవి. ఒకోసారి ఉన్నట్లుండి 4-5 నిముషాలు కూడా గడవక ముందే చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం వచ్చి కాల్ కట్ అయిపోతుంది. నాకైతే ఆ సమయంలో zozo బొమ్మ ఒక ఎర్రడబ్బా పై కూచుని నా వైపే చూస్తూ "అచ్చికిచ్చి.. అచ్చికిచ్చి.. అయ్యిందా అబ్బాయిగారి పని యిహ్హిహిహిహి..." అని గేలిచేస్తూ నవ్వుతున్నట్లు కనిపిస్తుంది (అచ్చంగా ఈ కింది వీడియోలో చూపించినట్లు). ఇంక కాల్స్ రద్దీ ఎక్కువ ఉండే సమయంలో మాట్లాడాలంటే గగనమే, లైన్స్ దొరకక పోవడం ఒక ఎత్తైతే కలిసినా చిత్రమైన శబ్దాలు కొండకచో అవతలి మనిషి గొంతు రోబోట్ గొంతులా వినపడటం జరుగుతుంటుంది.
సరే ఇన్ని జరిగుతున్నా మనకి కాస్త సహనం పాళ్ళు ఎక్కువే కనుక భరిస్తూ వచ్చాను. ఓ వారం క్రితం ఉన్నట్లుండి నో యాక్సెస్ అని ఫోన్ లో నెట్వర్క్ రిజిస్టర్ అవడం మానేసింది. ఫోన్ లో ఏ విధమైన సమస్య లేదని నిర్ధారించుకుని కాసేపు మాన్యువల్ ఆటోమాటిక్ మధ్య మారుస్తూ ఎలాగో మళ్ళీ సాధించాను. ఒక రెండ్రోజుల క్రితం మళ్ళీ పోయింది ఈ సారి ఎంత ప్రయత్నించినా రాలేదు. సరే ఒక సారి ప్రకటన గుర్తుతెచ్చుకుని హ్యాపీ అట కదా చూద్దాం అని కాల్ చేస్తే సంతోషం సంగతి దేవుడెరుగు కనీసం తీరిగ్గా సమస్య ఏంటో విని సలహా ఇద్దాం అనే ఆసక్తి ఏమాత్రం కనిపించలేదు. ఎప్పుడు ఫోన్ పెట్టేద్దామా అని ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. సరే ఆవిడ సలహాలు నోట్ చేసుకుని అవన్నీ పాటించి అయినా ఉపయోగం లేదని ఇంకోసారి కాల్ చేస్తే ఈవిడ ఒక పదినిముషాలు సతాయించి "ఈ జిడ్డుగాడు వదిలే లా లేడు" అనుకుని కంప్లైంట్ రిజస్టర్ చేసి కంప్లైంట్ నంబర్ SMS వస్తుంది అని చెప్పింది. నాకు తిక్క నషాలానికంటింది, "నెట్వర్క్ లేదు మొర్రో అంటే sms" ఎలా వస్తుంది అని అడిగా.. "నెట్వర్క్ వచ్చిన తర్వాత వస్తుంది" అంది, నేను "నెట్వర్క్ వచ్చిన తర్వాత కంప్లైంట్ నంబర్ నాకెందుకు నాలుక గీసుకోడానికి కూడా పనికి రాదు" అంటే సరే మీకు ఇప్పుడే ఇస్తాను ఉండండి అని కాసేపు హోల్డ్ లో పెట్టి ఫైనల్ గా ఇచ్చింది. ఆ తర్వాత ఆ నంబర్ పట్టుకుని మళ్ళీ కాల్ చేసి ఎస్కలేట్ చేయిస్తే ఒక గంటకు నెట్వర్క్ వచ్చింది, వీళ్ళు సాయం చేసే విథానం ఇది.
అక్కడితో కథ సుఖాంతమైతే ఈ టపా ఉండేది కాదు. నిన్నటి నుండి నేను ఏ నంబర్ కు కాల్ చేసినా చేసిన ప్రతిసారి "మీ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, అప్లికేషన్ ఏదైనా వొడాఫోన్ స్టోర్ లో ఇవ్వడానికి ఆఖరి రోజు" అంటూ మెసేజ్ వస్తుంది, నిన్న ఇదే విషయమై ఒక sms కూడా వచ్చింది. సరే సంగంతేంటి గురూ అని రాత్రి మళ్ళీ కాల్ చేశాను, ఇతను మరో ఖంగారు కనకయ్య బట్టీ పట్టిన నాలుగుముక్కలు లొడ లొడ మంటూ కక్కేయడమే కానీ అసలు నే చెప్పేది వినే తీరికే లేదు. పోని ఆ దిక్కుమాలిన స్టోర్ ఎక్కడ ఉందో చెప్పరా బాబు అని అడిగితే, నేను కమ్మన హళ్ళి లో ఉందేమో చూడరా నాయనా అంటే తను ఒన్లీ ఇన్ సిటీస్ సార్ హళ్ళి పల్లి ల్లో ఉండదు సారు బీటీయమ్ కోరమంగళ అంటూ నాకు పాతిక కి.మి. దూరంలో ఉన్న ప్రదేశాలు చెప్పాడు. సరే ఎలాగైతేనేం రాత్రి వాళ్ళ వెబ్సైట్ స్టోర్ లొకేటర్ లో ఓ స్టోర్ అడ్రస్ పట్టుకుని నా అలవాటుకు విరుద్దంగా కాస్త ఉదయాన్నే నిద్ర లేచి పదిగంటలకు స్టోర్ కి వెళితే అది మూసేసి ఉంది. పదకొండు గంటలకు తెరుస్తారుట పోనీ డాక్యుమెంట్స్ ఏ కదా ఎక్కడైనా డ్రాప్ చేయచ్చా అంటే ఆ వీలు లేదు. కనీసం స్టోర్ ఫోన్ నంబరు వెబ్సైట్ లో లేదు అక్కడ టైమింగ్స్ కూడా లిస్ట్ చేసి చావలేదు. మళ్ళీ ఈసురోమంటూ కాళ్ళీడ్చుకుంటూ సాయంత్రం వెళ్ళాలి. ఈ సారి ఏ టీబ్రేకో అని మళ్ళీ మూసేస్తారేమో అలా చేస్తే తలుపులు పగలగొట్టి లోపలేసి వచ్చేస్తా అంత చిరాకు గా ఉంది వీళ్ల సర్వీసు మీద.
అవండీ నా సినిమా కష్టాలు ప్రీపెయిడ్ ఫోన్ గత జూన్ లో నేను తీసుకునేప్పుడే అన్ని ప్రూఫ్ లు ఇచ్చి కొన్న కొట్లో "అన్నీ జాగ్రత్త గా పంపించరా" అని పది సార్లు చెప్పినా ఉపయోగం లేక అవన్నీ పోగొట్టుకుని ఇలా మళ్ళీ కస్టమర్స్ ని టార్చర్ చేస్తున్న వీళ్ళనేం అనాలి. కాకపోతే ఆన్లైన్ రిచార్జ్ ఫెసిలిటీ, చవకగా దొరికే std & sms ప్లాన్లకు తోడు మళ్ళీ ఇపుడు అందరికీ కొత్త నంబరు ఎక్కడ చెప్తాం అనే బండెడు బద్దకం పుణ్యమా అని ఈ టార్చర్ అంతా అవలీలగా భరించేస్తున్నాను.
మంగళవారం, జనవరి 19, 2010
స్పాములూ - స్కాములూ (Spam & Scam)

ఉదాహరణకు మీరు మీ అడ్రస్ బుక్ లోఉన్న అందరికీ ఒక ఈ మెయిల్ పంపిద్దాము అనుకున్నపుడు ’బిసిసి(Bcc)’ ఉపయోగించడం ఉత్తమమైన పద్దతి. దీనివలన మిగిలినవారికి ఎవరెవరికి మెయిల్ పంపబడినదో తెలిసే అవకాశం లేదు అలానే ఇతరుల ఐడి లు ఎవరికి కనిపించనందున స్పామ్ ను నివారించవచ్చు. ముందుగా అందరికీ బిసిసిలో ఈమెయిల్ పంపించి ఫలానా డిస్కషన్ మొదలు పెడదాము అనుకుంటున్నాను మీకు పాల్గొనడం ఇష్టమైతే జవాబివ్వండి అని అడిగి స్పందించిన వారి ఐడి లను బయల్పరుస్తూ అప్పుడు 'To' లో పొందుపరిచి మెయిల్ ఇవ్వడం చాలా మంచి అలవాటు.

సరే ఈ విషయాలు తెలియక పొరపాటున మీ ఐడిని మీకు ఇష్టం లేని ఒక డిస్కషన్ త్రెడ్ లో మీ అనుమతి లేకుండా కలిపారనుకుందాం. డిస్కషన్ టాపిక్ తో వచ్చే మెయిల్స్ రెండు ఉంటే "Please remove my id from this discussion" అంటూ గ్రూప్ అందరికీ పంపించే మెయిల్స్ ఒక ఇరవై వస్తుంటాయ్. ఇటువంటి మెయిల్స్ స్పామింగ్ కు ముఖ్య కారణం. మీకు ఇటువంటి మెయిల్స్ వచ్చినపుడు ఉత్తమమైన పని జవాబివ్వకుండా వదిలేయడం. లేదంటే "reply all" or "అందరికి సమాధానమివ్వు" ఆప్షన్ ఉపయోగించక కేవలం ఎవరైతే మీకు మొదట ఈమెయిల్ పంపారో వారికి మాత్రమే జవాబివ్వడం ఉత్తమమైన పద్దతి. మీకు ఓపిక ఉంటే ఇలాంటి మెయిల్స్ ని మీ మెయిల్ సెట్టింగ్స్ లో ఫిల్టర్ ఆప్షన్ ఉపయోగించి పూర్తిగా నివారించవచ్చు. GMAIL లో నేను ఫిల్టర్ ఉపయోగించి విజయవంతంగా ఇటువంటి మెయిల్స్ ను నిరోధించగలిగాను. మీరు చేయవలసిందల్లా ఆ మెయిల్ యొక్క సబ్జెక్ట్ లైన్ ను కాపీ చేసి ఈ సబ్జెక్ట్ తో ఉన్న మెయిల్స్ ను తొలగించు అని ఫిల్టర్ క్రియేట్ చేయడమే. ప్రతి మెయిల్ సిస్టం ఈ ఆప్షన్ ను ఇస్తుందనే అనుకుంటున్నాను.

Photos courtesy www.solarpowerrocks.com, http://sayiamgreen.com/
ఆదివారం, నవంబర్ 22, 2009
బండీ రా.. పొగబండీ రా..
ఇది చాలా రోజుల క్రితం కథ, అప్పటికింకా వోల్వోబస్సులు మన ఆర్టీసీకి రాని రోజుల్లో.. బస్సుల్లో కూడా హైటెక్ హవా నడుస్తున్నరోజుల్లో ఓ శుభముహుర్తాన బెంగళూరు నుండి ఓ ప్రైవేట్ హైటెక్ బస్సు లో గుంటూరు బయల్దేరాను. రాత్రి పదకొండుగంటల ప్రాంతంలో భోజనమయ్యాక వాక్మన్ లో పాటలు వింటూ నిద్రకుపక్రమిస్తుండగా "థడ్‍డ్..డాం.." మంటూ పెద్ద శబ్దం అంతకన్నా పెద్ద కుదుపుతో బస్ ఆగిపోయింది. దదాపు కూర్చున్న ప్రతిఒక్కరికి మొహమో కాళ్ళకో ముందు సీట్ కి తగిలి చిన్న దెబ్బలు తగిలాయి. బస్ ముందు అద్దం పగిలింది కదిలే స్థితిలో ఉందో లేదో తెలీదు. భోజనాల దగ్గర మందుకొట్టి ఎక్కిన డ్రైవర్ క్లీనర్ ఇద్దరూ కూడా ప్రయాణీకులతో పాటు నిద్రకుపక్రమిస్తూ యాక్సిడెంట్ చేయడం కాకుండా వెంటనే బస్ ని, ప్రయాణీకులని గాలికి ఒదిలేసి పరారయ్యారు. వీడు ఎదురుగా గుద్దినది ఒక అర్టీసీ బస్ ని ఆ బస్ స్టాఫ్ మా రూట్ లో వెళ్ళే ఇతర ఆర్టీసీ బస్సులను ఆపి మమ్మల్ని ఎక్కించి పంపించారు. నాదగ్గర ఉన్న అన్ని డబ్బులు ప్రైవేట్ బస్ వాడి టికెట్ కి పెట్టేయడం తో ఈ కొత్త బస్ లో టికెట్ కి పదిరూపాయలు తగ్గితే ఓ అపరిచితుడ్ని అడిగి టికెట్ తీసుకున్నాను అతను మా కొలీగ్ తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడనుకోండి. ఈ సంఘటన నాకు రెండు పాఠాలు నేర్పింది. ఒకటి కేవలం గవర్నమెంట్ బస్సులు మాత్రమే ఎక్కడం. ఇంకోటి ప్రయాణం లో ఎప్పుడూ టికెట్ డబ్బుకి రెట్టింపు డబ్బు దగ్గర ఉంచుకోడం.
అలా బస్ ఆగిపోయి రెండునిముషాలు కూడా అవ్వలేదు అతి దగ్గరలో వెనక నుండి పెద్దగా రైలు కూత !! వెనక్కి తిరిగి చూస్తే.. నాకైతే ఒక్క క్షణం వెన్నుజలదరించింది, ఆ రైలు నా గుండెల్లోనే పరిగెట్టినట్లు అనిపించింది. రైల్వే ట్రాక్ కు మా బస్ కూమధ్య రెండు బస్సులు పట్టే అంత దూరం అంతే.. గేటు దాటిన వెంటనే మా బస్ ఆగిపోయింది కాబట్టి సరిపోయింది అదే ట్రాక్ మీద ఆగితే మా పరిస్థితి ఏంటి. బస్ లో పసిపిల్లలు, మహిళలు, వృద్దులు అన్ని రకాల వాళ్ళు మంచి నిద్ర లో ఉన్నారు అందర్ని లేపి సమయానికి బస్ నుండి దింపడం సాధ్యమయ్యే పనేనా.. బస్ ను ట్రాక్ పైనుండి నెట్టి ఇవతలికి తీసుకురావాలన్నా అంత తక్కువ వ్యవధిలో అయ్యేనా... అసలు ఇలాటి ఎమర్జన్సీ సమయం లో గేట్ పడకపోతే అతి తక్కువ సమయంలో రైలు ను ఆపటానికి సరైన ఎక్విప్ మెంట్ మరియూ భద్రతా వ్యవస్థ ఆగేట్ దగ్గర ఉందా ఇలాటి ప్రశ్నలు చుట్టుముట్టాయి. నాకు తెలిసి ఇది వరకు 5 నిముషాలకు ముందే గేట్ వేసేవాడు ఇపుడు బెటర్ ఎక్విప్మెంట్ ఉండటం వల్ల ఆ వ్యవధి తగ్గించాడా లేక కేవలం ట్రాఫిక్ ఒత్తిడి వలనా అనేది తెలియదు.
సరే బస్ ఆగింది సెల్ఫ్ స్టార్ట్ అవడం లేదు ఇక మార్గాంతరం బస్ తోయడమే అయి ఉంటుంది అనుకుంటూ బస్ దిగి ఏమైందా అని నిలబడి చూస్తున్నాను. అప్పటికే నాలాటి ఎంతూసియాస్ట్స్ కొందరు దిగి ఇంజన్ చుట్టు పక్కల మూగి మాట్లాడుకుంటున్నారు. ఇదే సందు అని సిగరెట్ వెలిగించి హడావిడిగా దమ్ము లాగేస్తున్నారెవరో..
"ఇందాక వాళ్ళ బస్ ఫెయిల్ అయిందని ఎవర్నో చాలామందిని ఎక్కించారు వాళ్ళని దించేయండోయ్ ఎవరో స్ట్రాంగ్ లెగ్ గాడున్నట్లున్నాడు " ఒకాయన జోక్.
"ఛ ఏపీయస్ ఆర్టీసీ వాళ్ళు ఇంత చెత్త బస్సులు నడుపుతున్నారా.. ఇంకోసారి వీళ్ళ బస్ అసలు ఎక్క కూడదు.." ఓ యూత్ అప్పటికప్పుడు తీసేసుకున్న రిజల్యూషన్.
"కుదుపులకి బ్యాటరీ వైర్లేవో లూజ్ అయి ఉంటాయి చూడండి మాష్టారు.." గుండు సూది నుండి అణుబాంబు వరకూ తనకు తెలియని విషయం లేదని ఫీల్ అయ్యే ఓ పెద్దాయన ఉచిత సలహా...
"అబ్బా బంగారం లాంటి నిద్ర పాడు చేశారు.. బయల్దేరిన దగ్గరనుండి డొక్కు సినిమా ’బిల్లా’ పెట్టి. ఇప్పుడేమో ఇలా హు.. అవును మాష్టారూ ఇంతకీ ఇది ఏ ఊరంటారు ??" ఇంకొకాయన భోగట్టా..
"......." చిరునవ్వుతో మౌనంగా వీళ్ళమాటలు వింటూ, మనసులో "ఇవి జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని బ్లాగ్ లో రాసేయాలి.." అనుకుంటూ నేనూ, ఇదీ అక్కడి సన్నివేశం.

వోల్వో వెబ్ సైట్ ని బట్టి చూస్తే వాళ్ళ బస్సులు అన్ని Euro 2/Euro 3 ఎమిషన్ క్లాసుకు చెందినవే అయి ఉంటాయి, వాటికి ఇంత ఘోరమైన నల్లని పొగ రాకూడదు. మరి మన వాళ్ళు కిరోసిన్ కల్తీ అయిన డీజిల్ తోనడుపుతున్నారో లేక బస్ కొనడమే కానీ బొత్తిగా మెయింటెనెన్స్ విషయం పట్టించుకోవడం లేదో అర్ధం కాలేదు. నాకైతే మెయింటెనెన్స్ లోపమే అనిపించింది, అలా అనుకోవడానికి బస్ వాలకం కూడా ఒక కారణం. కనీసం సరిగా బస్ కడిగే విషయం కూడా పట్టించుకోని వాళ్ళు క్రమం తప్పకుండా సర్వీస్ చేయించే అవకాశం నాకైతే కనిపించలేదు. అలా చేయిస్తే ఇలాటి సంధర్భం ఎదురు పడదు అని నా నమ్మకం. దాదాపు యాభై నుండి అరవై లక్షల వరకూ పోసి కొనే బస్సులు ఇలా గాలికి వదిలేస్తే వాటి లైఫ్ స్పాన్ తగ్గిపోవడం ఒక నష్టం. అదేకాక ఇందాక చెప్పినట్లు ఏ రైల్వే ట్రాక్ మధ్య లోనో ఆగిపోయి ఫాటల్ యాక్సిడెంట్ కి కారణం అయితే ఎవరి నిర్లక్ష్యానికి ఎవరు మూల్యం చెల్లించినట్లు ? వీళ్ళు మారేదెన్నడు ??
సోమవారం, నవంబర్ 16, 2009
టీవీ ఛానళ్ళూ - సృజనాత్మక తలలు !
"అసలెవరీ ఓంకార్ ఒకప్పుడు 90 లలో టివీ సీరియల్స్ లోనూ కొన్ని సినిమాలలోనూ తన వైవిధ్యమైన గొంతుతో వెటకారపు సంభాషణలతో కనిపించేవాడు అతనేనా?" అని అడుగుతున్నారా.. కానే కాదు. ఇతను మొదట జీతెలుగు చానల్ లో డ్యాన్స్ కాంపిటీషన్ ద్వారా కెరీర్ మొదలు పెట్టాడనుకుంటా ప్రస్తుతం మాటీవీ జీ రెండిటిలోనూ కొన్ని ప్రోగ్రాంస్ చేస్తున్నాడు. ఈ టీవీ అంతరంగాలకు సుమన్ కధ, మాటలు, పాటలు దర్శకత్వం అని పేరేసుకోడంతో మొదలుపెట్టినట్లు ప్రస్తుతం ఇతను కూడా కాన్సెప్ట్, రచన, నిర్మాత, దర్శకత్వం ఇలా నాలుగైదు విభాగాలకు పేరు వేసుకోవడం మొదలు పెట్టాడు. కాకపోతే చిన్న తేడా ఏంటంటే ఇతనివి సీరియల్స్ కాదు కేవలం టాలెంట్ షోస్ కే పరిమితమైనట్లున్నాడు ప్రస్తుతం. ఇతని ఓవర్ యాక్షన్ చూడాలంటే ప్రఖ్యాత మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి గారు ఇతన్ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఈ కింది వీడియో చూడండి. ఇందులో బ్లాక్ డ్రస్ లో ఏంకరింగ్ చేస్తూ కనిపించే వ్యక్తే ఓంకార్.
ఇతను మొదట్లో జీటీవీ లో ఆట పేరుతో ఒక డాన్స్ కాంపిటీషన్ ప్రోగ్రాం మొదలు పెట్టారు, పిల్లలతో సైతం చిత్రవేషధారణ కుప్పిగంతులు వేయించేవాడు. తర్వాత ఇంకేదో చిత్రమైన పిల్లల ప్రోగ్రాం ఒకటి చేశాడు అందులో కూడా ఎలిమినేషన్ పేరుతో పిల్లల్ని ఏడిపించి నానా యాగీ చేసేవాడు. ఇక ప్రస్తుతం మాటీవీ లో ఛాలెంజ్ పేరుతో ఓ డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తున్నాడు, ఇంత కాలం ఇలాటి ప్రోగ్రాంలో వీళ్ళ వింత వేషధారణ, డ్యాన్స్ పేరుతో చేసే వికృత చేష్టలు, న్యాయనిర్ణేతల ఓవర్ యాక్షన్ మాత్రమే భరించాల్సి వచ్చేది, ఇపుడు ఛాలెంజ్ పేరుతో డ్యాన్సర్లు వాళ్లల్లో వాళ్ళే మరీ చెత్తకుండీల దగ్గర కుక్కల కన్నా ఘోరంగా కొట్టుకుంటున్నారు. పోలిక కాస్త ఘాటుగా ఉన్నా ఒకటి రెండు ఎపిసోడ్స్ చూసిన నాకు అలానే అనిపించింది. అది చాలదన్నట్లు ఈ కొట్లాటనే ప్రోమోస్ గా చూపిస్తుంటే ఏం చేస్తాం.
ఇతని మరో ప్రోగ్రాం మాటివి లో అదృష్టం, అమెరికా లోని డీల్ నో డీల్ ప్రోగ్రాం కి కాసిని మార్పులు చేసి ప్రసారం చేసే ఈ ప్రోగ్రాం లో ఇతని ఓవర్ యాక్షన్ చూసి తీరాల్సిందే.. మొదట్లో కాస్త సెలబ్రిటీస్ ని పిలిస్తే వాళ్ళు ఇతన్ని ఆడుకుని మొత్తం ప్రోగ్రాం ని హాస్యభరితం చేసారు, దానితో ఇలా లాభం లేదు అని పిల్లలను అతని మిగిలిన ప్రోగ్రాంస్ లో పార్టిసిపెంట్స్ ని పిలిచి వాళ్ళతో ఆడుకోడం మొదలు పెట్టాడు. అలా అని ఇతనిమీద అన్నీ కంప్లైంట్స్ లేవు నాకు, ఉదాహరణకి ఛాలెంజ్ పేరుతో వస్తున్న ప్రోగ్రాంలో పార్టిసిపెంట్స్ అప్పొనెంట్ కోసం పాట సెలెక్ట్ చేసి ఇవ్వడం. ఇద్దరిమధ్య ఒకే పాటకి పోటీ పెట్టడం లాంటి మంచి ఐడియాలు కూడ ఉన్నాయి. చేతిలో అవకాశం విద్య రెండూ ఉన్నపుడు కాస్త తెలివిగా వ్యవహరించి సక్రమంగా ఉపయోగిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశ్యం.
టీవీ అంటే గుర్తొచ్చింది. జూడాలు గురించి విన్నారా... వినే ఉంటారు లెండి ’జూనియర్‍డాక్టర్’ అన్న పదానికి వచ్చిన తిప్పలు ఇవి. నిన్న వార్తలు చూస్తుంటే లైన్ కి మూడు నాలుగు సార్లు జూడాలు అని చదువుతుంటే వినడానికి చాలా అసహనంగా అనిపించింది. కంపోజర్ కన్వీనియన్స్ కోసం అలా జూ.డా లు అని రాసిస్తే దాన్ని యధాతధంగా చదివేస్తున్నాడా లేక టీవీ వాళ్ళు కొత్త పదాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనే విషయం అర్ధంకావడం లేదు. వార్తల్లో ఈమధ్య గమనించిన మరో అంశం వార్తలు వేగంగా చదవడం. ప్రయత్న పూర్వకంగా అలా హడావిడిగా చదివేయడం ప్రత్యక్షంగా తెలుస్తూంటే విసుగొస్తుంది. క్వాలిటీ కన్నా క్వాంటిటీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల వచ్చిన తిప్పలు కావచ్చేమో.
సోమవారం, సెప్టెంబర్ 21, 2009
సంస్కారం a.k.a. manners




నేను ???

- వేణూశ్రీకాంత్
- అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.