అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

ఆదివారం, మే 24, 2009

బదిలీ...

2009 కొత్త సంవత్సరం మొదటి రోజు నన్ను ఏమిటి రా విశేషాలు? అని అడిగిన వారికీ, అడగని వారికీ నేను ఒకటే జవాబు చెప్పాను."ఆ ఏముంది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అదే రొటీన్ రోజూ, "లైఫ్ ఈజ్ బోరింగ్ యూనో..." అని. మరి శేషతల్పం పై విశ్రమిస్తున్న విష్ణుమూర్తి ఓ అరక్షణం కనులు అరమోడ్పులు చేసి, చెవులు రిక్కించి నా మాటలు విని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడో... లేకా హిమగిరి పై తపస్సు చేసుకుంటున్న మహేశ్వరుడు ఓ క్షణం కనులు తెరిచి ఆహా అవునా అని వెటకారం గా అనుకున్నాడో కానీ...ఆ క్షణం నుండీ శివకేశవులు ఇద్దరూ కలిసి చెరో వైపూ నుండి నా జీవితం తో బంతాట ఆడేసుకుంటున్నారు... ఈ రెండువేల తొమ్మిది అంతా వరసగా బోర్ అనే మాట దరిచేరనివ్వకుండా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అచ్చం టెన్నిస్ కోర్ట్ లో ప్రత్యర్ధి ని చూస్తూ ఓ నువ్వు ఆ షాట్ కొట్టావా ఇప్పుడు నా షాట్ చూడు ఎలా కొడతానో అని ఒకర్ని మించి ఒకరు పోటీ పడి నా జీవితం లో ట్విస్ట్ లు ఇస్తున్నారనమాట.

అదుగో రమణారెడ్డి లా సన్నగా పొడవుగా తెల్లగా ఉన్న భవంతి పక్కనే రేలంగి లా లావుగా పొట్టిగా బులుగు రంగులో blue cross blue shield అని రాసి ఉన్న భవంతే నేను ఇన్ని రోజులూ చికాగో లో పని చేసిన ఆఫీస్.

సరే ఇంత ఉపోద్ఘాతం దేనికయ్యా అంటే... నేను ప్రస్తుతం (ఆదివారం మే 17) ఫ్రాంక్ఫర్ట్, జెర్మనీ విమానాశ్రయం నుండి ఈ బ్లాగ్ రాసుకుంటున్నాను. నిన్న శనివారం బయల్దేరి ఇండియా వచ్చేస్తున్నాను. ఈ గురువారం అనగా మే ఇరవైఒకటిన బెంగళూరు నుండి పని మొదలు పెట్టాలి... మధ్యలో ఓ మూడు రోజులు శలవు అనమాట. అదీ సంగతి.. ఈ టపా నాకు విషయం తెలిసిన దగ్గర నుండీ రాద్దాం అని అనుకుంటున్నాను కానీ గత రెండు మూడు వారాలుగా ఈ బదిలీ హడావిడి లొ పడి అస్సలు కుదరలేదు... ఇదే అనేమిటి లే ఈ మధ్య నా బ్లాగ్ కేవలం ముఖ్యమైన విషయాలను తెలియచేసే నోటీస్ బోర్డ్ లా ఉపయోగిస్తున్నానేమో కదా. చూడాలి బెంగళూరు నుండైనా తరచూ బ్లాగడానికి వీలు దొరుకుతుందేమో... కానీ సమస్యేమిటంటే బెంగళూరు వెళ్ళినా నాకు ఇదే ఆఫీసు పని అక్కడ నుండి కొనసాగించాలి సో ఏమాత్రం వీలు చిక్కుతుందో చూడాలి. ఏవిటో ఇదే పని సగం జీతానికి ఇండియానుండి చేయాలి అంటే కొంచెం కష్టమే కానీ మన అసలు జీతం అదే రా బాబు ఇప్పటి వరకు డబల్ జీతానికి పని చేసావు అంతే అని సర్ది చెప్పుకోటమే... జీతం ఎక్కువైనా ఖర్చులు కూడా అంతే ఉండి చస్తాయ్ లెండి అమెరికా లో ఒక మాదిరిగా బతకాలి అంటే...

మొత్తం మీద నా బదిలీ లో మొదటి అంకం పూర్తయింది... చికాగో బంధాలను వదిలించుకుని, రెండున్నరేళ్ళ గా సమకూర్చుకున్నవన్నీ రెండు వారాలలో ఒక్కోటీ పాతిక కేజీలు మించని రెండు సూట్కేస్ లలో సర్దేసుకుని, మళ్ళీ ఎప్పుడు పలకరించడానికి వీలు పడుతుందో అని భారమైన మనసుతో వీడ్కోలు తెలుపుతూ చికాగో నుండి బయటపడ్డాను. ఇక్కడ సమకూర్చుకున్నవన్నీ అలా ఒకటొకటి గా నన్ను వదిలి వెళ్తుంటే ఎంత దిగులేసిందో... ఏవిటో ఈ మనసు, ప్రాణం లేని వస్తువులపై కూడా ఇలా మమకారాన్ని పెంచేసుకుంటుంది. ముఖ్యంగా ఇష్టంగా కొనుక్కున్న నా కారు ను సమయాభావం వల్ల అతి తక్కువ ధరకి అమ్మేసి అప్పగించిన రోజు రాత్రి ఎంత ప్రయత్నించినా పొంగుకు వచ్చే కన్నీళ్ళకి ఆనకట్ట కట్ట లేకపోయాను. మా అమ్మ తను కొన్న ఏ వస్తువునైనా ఎందుకు అలా తిరిగి అమ్మటానికి ఒప్పుకోదో మొదటి సారిగా బోధ పడింది.


అసలు అమ్మా నాన్న ఇద్దరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినా మా కుటుంబం ఈ బదిలీల భారిన పడిన సందర్బాలు తక్కువే అని చెప్పాలి.. అమ్మ నాన్న మా చదువులు మిగిలిన విషయాలు అనవసరం గా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఎలాగో అలా నయానో భయానో చెప్పి ఇలాంటి బదిలీలు ఆపేసేవారు, కొండొకచో రావాల్సిన పదోన్నతులు కూడా త్యాగం చేసిన సందర్భాలు లేకపోలేదు. రెండు సార్లు మాత్రం తప్ప లేదు ఒకసారి నరసరావుపేట వదిలి పిడుగురాళ్ళ వెళ్ళి ఒక రెండేళ్ళు ఉండి తిరిగి వస్తే రెండవసారి నరసరావుపేట నుండి గుంటూరు కు వచ్చి అక్కడే స్థిరపడిపోయాం. మాకు ఇళ్ళు కూడా ఎక్కువగా మారే అలవాటు ఉండేది కాదు. పిడుగురాళ్ళ నుండి వచ్చేసాక దదాపు పదమూడేళ్ళపైగా ఒకే ఇంట్లో ఉన్నాము. ఎంత మంది ఆ ఇంటి వాస్తు మంచిది కాదు అని చెప్పినా ఏం జరిగినా గుంటూరు వచ్చే వరకూ ఆ ఇల్లు మారకుండా అక్కడే ఉన్నాం.

మొదటి సారి బదిలీ నన్ను బాధ పెట్టింది నరసరావుపేట లో రామిరెడ్డి పేట కబీర్‍దాస్ గారి ఇంటి లో ఉన్నపుడు. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. ఆ ఇంట్లో కింద మూడు వాటాలు అద్దెకి ఇచ్చి పైన ఇంటి ఓనర్స్ ఉండే వారు. కింద ఇళ్ళల్లో ఓ చివర మేము ఉండే వాళ్ళము ఇంకో చివర ఓ రైల్వే స్టేషన్ మాష్టారు ఉండే వారు. నేను అప్పుడు పేరుకు తొమ్మిదో తరగతి కానీ వయసు పదమూడో పద్నాలుగో ఉండేది అప్పుడే టీనేజికి వచ్చినా ఇంకా నిక్కర్లు వదలని వయసనమాట అందుకని వాళ్ళూ చిన్న వాళ్ళే అయినా నేను వాళ్ళని అంకుల్ ఆంటీ అంటే ఏమీ అనుకునే వాళ్ళు కాదు. నాకు వాళ్ళ ఇంట్లో బాగా కాలక్షేపం ఖాళీ దొరికినప్పుడల్లా వెళ్ళి కూర్చుని వాళ్ళ తో కబుర్లు చెప్పే వాడ్ని, నేను మొదటి సారి వాకెమన్ లో పాటలు విన్నది వాళ్లదగ్గరే. అప్పటి వరకూ మా ఇంట్లో ఫ్లాట్ గా ఉండే ఢిల్లీ మోనో సెట్ (దీని గురించి చెప్పాలంటే ఓ ప్రత్యేక టపా కావాలి మళ్ళీ చెప్తాను) లో పాటలు వినడం అలవాటు. మొదటి సారి స్టీరియో వాక్మన్ చెవులకి పెట్టుకుని బయటకి వినపడకుండా వినడం, ఆ హెడ్ సెట్ తలకి పెట్టుకుని పెద్దగా అరచినట్లు మాట్లాడటం ఇది ఎదుటి వాళ్ళు గుర్తించి చెప్తే నవ్వుకోడం అంతా ఓ వింత అనుభూతి. వాళ్ళ సొంత ఊరు వైజాగ్ అనమాట షిప్ యార్డ్ గురించి వైజాగ్ గురించీ వాళ్ళు కబుర్లు చెప్తుంటే అలా వింటుండేవాడ్ని. అలా నాకు మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు బదిలీ అయి వెళ్ళి పోయినప్పుడు నేను ఏడ్చేసాను. ఆంటీ కూడా వెళ్ళి పోతున్నందుకు ఏడ్చేశారు అప్పుడు. కాని తర్వాత వాళ్ళ తో కాంటాక్ట్ తప్పి పోయింది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మరి.

కౌలాలంపూర్ లోని పెట్రొనాస్ టవర్స్ పోలికతో హెబ్బాల్ కి దగ్గర లో నార్త్ బెంగళూరు కు చిహ్నం గా మారిన ట్విన్‌టవర్స్ అపార్ట్మెంట్స్ ఇవి. నేను ఇదివరకు అంతా సౌత్ బెంగళూర్ లో ఉండటం తో దీని గురించి అస్సలు తెలియదు. మొన్న మొదటి సారిగా ఆఫీస్ కి ఈ వైపు వచ్చినపుడు చూసి అవాక్కయ్యాను.

ఇక నా బదిలీ లో రెండవ అంకం బెంగళూరు లో స్థిరపడటం... అక్కడ మళ్ళీ ఇపుడు అద్దెఇళ్ళ కోసం వేట, దొరికాక వాటికి పదినెల్ల అడ్వాన్సు.. మంచినీళ్ళ నుండీ ఇంటర్‍నెట్ వరకూ అన్నీటికీ వెతుక్కొని సమకూర్చుకోడం అంతా చాలా పెద్ద పనే... ఆఫీసు కి దగ్గర్లో ఇల్లు దొరకకపోతే మళ్ళీ రోజు వెళ్ళి రావడం ఒకటి సమస్య, ఆఫీసు దగ్గర లో అంటే మరీ పల్లెటూరు అదీకాక మొన్నే ఎవరో మా కొలీగ్ ను రాత్రి పదకొండు గంటలప్పుడు ఆఫీసు నుండి ఇంటికి నడిచి వెళ్తుంటే పొడిచారట... అతని అదృష్టం కొద్దీ ప్రాణ హాని లేకపోయినా మన అదృష్టం ఎలా తగలడుతుందో ఏమి తెలుసు. ఏమిటో ఈ రౌడీ వెధవలకి లేటెస్ట్ న్యూస్ చేరుతున్నట్లు లేదు.. ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే బోలెడు డబ్బుంటుంది అనే అపోహ లోనే ఉన్నట్లున్నారు... ప్రస్తుత పరిస్తితులలో ఈడ్చి తంతే దమ్మిడీ రాలట్లేదు అనే విషయం ఇంకా అర్ధమైనట్లు లేదు వాళ్ళకి. అన్నట్లు మా ఆఫీస్ ఐబీయం మాన్యతా లో ఉంది హెబ్బాల్ ఫ్లైఓవర్ దగ్గర లో నాగవరా అనే ఊరిలో అట ఆ చుట్టు పక్కల మీదో మీకు తెలిసిన వాళ్ళదో ఇల్లు అద్దెకి ఉంటే నాకో మాట చెప్పండి.. మీ సాయం మర్చిపోను. అన్నట్లు నేను ప్రస్తుతం సింగిల్ బెడ్రూం ఇల్లు కోసం వెదకాలి. మరీ గవర్నమెంట్ హాస్టళ్ళలా కాక కాస్త డీసెంట్ గా ప్రత్యేకమైన గది ఉండి సౌకర్యవంతమైన పేయింగ్ గెస్ట్ అయినా పర్లేదు అని చూస్తున్నాను.

అద్దె ఇల్లంటే గుర్తొచ్చింది జిల్లా కి ముఖ్య పట్నం అయిన గుంటూర్ లో కూడా అద్దెకి ఇల్లు వెతుకుతుంటే మీరెవరు? మీ సామాజిక వర్గం ఏమిటీ, వెజ్జా నాన్వెజ్జా ఇత్యాది ప్రశ్నలు సర్వసాధారణం అయిపొయాయి ఒకరు చౌదర్లకి మాత్రమే అంటే ఇంకోరు రెడ్లకి మాత్రమే అంటారు మరొకరు క్రిస్టియన్సె కే అంటే ఇంకోరు హిందూస్ ఓన్లీ అంటారు అన్నీ నిరూపించుకుని ఇల్లు వెదకడం బోలెడు కష్టం అయిపోతుంది.. నా అదృష్టమో ఏజంట్ల ద్వారా వెళ్ళడం వలన వాళ్ళు అవన్నీ ముందే ఫిల్టర్ చేసారో కానీ నాకు ఇంతవరకూ బెంగళూరు లో ఎప్పుడూ ఆ సమస్య రాలేదు మరి, ప్రస్తుతం బెంగళూరు లో అదీ పల్లె వాతావరణం తో ఉండే నాగవరా లో నాకు ఎన్ని శల్య పరీక్షలు పెట్టనున్నారో ???

ఈ టపా నేను మే పదిహేడున ఎయిర్‍పోర్ట్ లో కూర్చుని రాసాను కాని అప్పటి నుండి ఇప్పటి వరకూ ఇంటరెనెట్ దొరకక పోస్ట్ చేయలేదు. అంటే అక్కడ ఎందుకో నెట్ పని చేయలేదు. నెట్‍సెంటర్ కి వెళ్ళాలంటే బద్దకం :-) ఆఫీసు లోనేమో చాలా బిజీ, హోటల్ లో ఇంటర్నెట్ వైఫై ఉంది కానీ నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకి బీయస్‍యన్‍యల్ తీగలు తెగాయిట అప్పటి నుండీ అది పని చేయడం లేదు, రిసెప్షన్ వాడికి కాల్ చేసిన ప్రతిసారీ "ఎవరో రావాలీ ఈ తీగలు సవరించాలీ..." అని అదే పాట పదే పదే పాడుతున్నాడు. అందుకే ఇక లాభం లేదు అని ఈ ఆదివారం ప్రత్యేకంగా ఆఫీసుకు వచ్చి బ్లాగ్ మరియూ కొన్ని ముఖ్యమైన ఈమెయిల్స్ కి జవాబివ్వాల్సిన పని ముగించాను. అన్నట్లు నాకు వెంటనే అన్ని విధాలా అనుకూలమైన వసతి దొరకాలని ఆశీర్వదించడం మరవకండేం, ఇంకా ఈ మధ్య దేవుళ్ళెవరూ నా మొర ఆలకించడం లేదల్లే ఉంది సో మీ రికమెండేషన్ పని చేస్తుందేమో మరి, కాస్త ప్రయత్నించి చూద్దురూ...

సరే త్వరలో మరో టపా లో మళ్ళీ కలుద్దాం అంతవరకూ శలవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.