అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శనివారం, ఏప్రిల్ 11, 2009

ఇది విన్నారా !! సూపర్ బ్రెయిన్ యోగా !!

ఇది విన్నారా !! ఈ సూపర్ బ్రెయిన్ యోగా గురించి విన్నారా... ఎంత వరకూ నిజమో నాకు తెలియదు కానీ ఈ వీడియో ఇది వరకు చూసి ఉండక పోతే ఓ సారి చూడండి. ఇది దదాపు ఒక సంవత్సరం క్రితం 2008 ఆగస్ట్ లోది, అయినా నేను ఇప్పుడే చూసాను, మీరూ ఇదివరకు చూసి ఉండక పోతే ఓ సారి చూడండి."ఓసోస్ ఇది మాకెందుకు తెలియదు చిన్నప్పటి నుండి ఎన్ని సార్లు తీయలేదు మనకి చిరపరిచితమైన గుంజీళ్ళేగా.." అంటారా. అదే మరి నాకూ అలా అనిపించి మన బడి లో ఇచ్చే సాధారణమైన పనిష్మంట్ వెనకాల ఇంత ప్రయోజనం ఉందా అని ఆశ్చర్య పడిపోయే ఇలా బ్లాగుతున్నా. ఈ ప్రయోజనం గుర్తెరిగే మన బడి లో ఉపాధ్యాయులు ఈ దండనని ప్రవేశ పెట్టారా లేకా ఇది చూసి దీని మీద పరిశోధనలు చేసి ప్రయోజనాన్ని బయటకి లాగారో తెలియదు కానీ వీడియో లో చూపిన ప్రకారం. ఆక్యూపంచర్ పద్దతి లో కుడి చెవితమ్మె(ear loab) పట్టుకోడం ద్వారా ఎడమ మెదడు, ఎడమ చెవి ద్వారా కుడి మెదడు ఉత్తేజితమై మైండ్ పవర్ పెరుగుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ కొందరు మానసిక వికలాంగులు ఈ యోగా తర్వాత కొన్ని పనులను సక్రమంగా చేయగలిగారు అనీ, ఇంకా ఈ యోగా చేసిన అనంతరం మెదడుకు చేసిన EEG Scanning లో కుడి ఎడమ మెదడుల మధ్య సంతులన కనిపించింది అని చూసాక నిజమే నేమో అనిపిస్తుంది.

అన్నట్లు మన బడి లోనూ, ఇంటిలోనూ పిల్లల కి దండన గానే కాదు, తమిళనాడు లో గణేశుని ఎదురుగా పెద్దలు సైతం ఇలా గుంజీళ్ళు తీసే పద్దతి ఉంది. ఈ మధ్య ఆంధ్రా లో కూడా మొదలు పెట్టారేమో తెలియదు కానీ నేను మొదట గమనించింది మాత్రం తమిళనాడు లోనే. బుద్ది కుశలత కోసం పూజించే దేవుడు విఘ్నేశ్వరుడే కనుక ఆ స్వామి ఎదురుగా ఇలా గుంజీళ్ళు తీయడం మొదలు పెట్టారేమో మరి. అంటే చాలా చోట్ల వినాయకుడి ఎదురుగా ప్రస్తుతం ఈ గుంజీళ్ళని మోడర్నైజ్ చేసి ఇలా క్రాస్ గా కొండక చో మాములుగా చెవులు పట్టుకొని స్టయిల్ గా కొద్దిగా మోకాళ్ళు వంచి తీస్తున్నారు, పూర్తిగా యోగా పద్దతి లో ఎవరూ తీయడం లేదు. సో కుడి చేత్తో ఎడమ చెవి తమ్మె(earloab) , ఎడమ చేత్తో కుడి చెవి తమ్మె పట్టుకొని, కిందకి కూర్చునేప్పుడు గాలి పీలుస్తూ కూర్చుని, పైకి లేచేప్పుడు ఆ గాలిని నెమ్మదిగా వదిలేయాలి. అదీ సంగతి, ఇంకెందుకు ఆలస్యం ? ఉదయం లేవగానే ఆపకుండా గబ గబ గబ ఓ ఫ్ఫదో ముఫ్ఫయ్యో గుంజీళ్ళు తీసేయండి ఇక :)

మరికొన్ని వివరాల కోసం సూపర్ బ్రెయిన్ యోగా వారి వెబ్ సైట్ కై ఇక్కడ క్లిక్ చెయండి.

శుక్రవారం, ఏప్రిల్ 03, 2009

రామా కనవేమి రా !!

శ్రీ రామ నవమి సంధర్బంగా తోటి బ్లాగరు లందరికీ, పాఠకులకూ, నా హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అంతా ఈ పాటికి పూజలు గట్రా ముగించుకుని రేడియో లో కళ్యాణం వింటూ ఉండి ఉంటారు. రేడియో లో వింటం ఏమిటి నా మొహం నేనింకా ఎనభైల లోనే ఉన్నాను !! ఇప్పుడన్నీ లైవ్ ప్రోగ్రాం లే కదా... సరే లెండి టీవీ లో చూస్తుండి ఉంటారు. నా మటుకు నాకు శ్రీరామ నవమి అనగానే మొదట గుర్తొచ్చేది భద్రాచలం లోని రాముని కళ్యాణం, ఆ వైభవానికి తగ్గట్టుగా ఇక ఉషశ్రీ గారి వ్యాఖ్యానం (ఇక్కడ క్లిక్ చేసి వినవచ్చు), ముఖ్యమంత్రి నెత్తిన పెట్టుకుని మరీ తీసుకు వచ్చే ముత్యాల తలంబ్రాలు, దేనికవే సాటి. వాటి తర్వాత వీధి వీధి నా వెలసే నవమి పందిళ్ళు. ఆ పందిళ్ళ లో దొరికే బెల్లం పానకమూ, వడపప్పూ. ఇక ఒకో బజారు లో పోగైన చందాల ను పట్టీ అక్కడ ఉండే కలిగిన వాళ్ళని బట్టీ వాళ్ళ వాళ్ళ శక్తి కి తగ్గట్టు గా ఒకప్పుడు నాటకాలు, కోలాటాలు, డ్యాన్సు లు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత అంటే నేను కాస్త పెద్దయ్యాక 16mm ప్రొజక్టర్ లతో సినిమాలు, ఆ తర్వాత మరికొన్నాళ్ళకి వీధి కొకటి గా వెలసిన దివాకరం వీడియో షాపు నుండి వీడియో క్యాసెట్ లు టీవీ సెట్ లు అద్దెకు తెచ్చి వాటిలో పాత సినిమాలు వేసే వాళ్ళు. ప్రస్తుతం డీవీడీ లతో పైరసీ సినిమాలు వేసే స్థాయి కి ఎదిగి పోయుంటార్లెండి.

అసలీ పానకం వడపప్పు గురించి అడిగితే మీకో చిన్న పిట్ట కధ చెప్పాలి. అంటే అడక్క పొయినా చెప్తా అనుకోండి మరి ఈ బ్లాగే నా సొంత డబ్బా కొట్టుకోడానికి పెట్టుకున్న బ్లాగ్ కదా... కనుక వినండి మరి హ హ "మా తాతలు ముగ్గురు... " అని అంటూ నేను అహనా పెళ్ళంట లో నూతన్ ప్రసాద్ లా నా ఆటో బయోగ్రఫీ అంతా చెప్పబోవడం లేదు లేండి బయపడకండి. నేను ఇంటర్ మీడియట్ నుండీ హాస్టళ్ళ లో ఉండి చదువుకున్నాను. ఇంటర్ విజయవాడ లో కనుక సందు దొరికితే నరసరావు పేట లో ఇంటికి పరిగెట్టే వాడిని. ఇదే అలవాటు వైజాగ్ లో ఇంజనీరింగ్ చేరినా కూడా వదల లేదు. సాధారణంగా పుట్టిన రోజు దగ్గర నుండి చిన్న చిన్న పండగలకు కూడా ఇంటికి వెళ్ళి పోయే వాడ్ని. మహ మహా పరీక్షలని కూడా లెక్క చేయకుండా ఇంటికి వెళ్ళి సరీగ్గా పరీక్ష ముందు రోజో ఆ రోజో ఊర్నుండి దిగిన చరిత్ర మనది. ఇక విషయానికి వస్తే ఇంటరె చదివే టైం లో అవసరం రాలేదు కానీ ఇంజనీరింగ్ లో చేరాక మొదటి ఏడు నవమి కి ఇంటికి వెళ్ళడం కుదర్లేదు. అప్పటికి ఫ్రెషర్స్ పార్టీ అయిపోయినా ఇంకా అడపా దడపా సీనియర్స్ కనిపిస్తే సార్ అని పిలుస్తూనే ఉండే వాళ్ళం అప్పుడప్పుడూ వాళ్ళు కూడా యస్ డీ చెప్పరా అని అడుగుతూనే ఉండే వాళ్ళు..
ఇదిగో వైజాగ్ లో నేను నాలుగేళ్ళు ఉద్దరించిన మా హాస్టల్స్ ఇవే క్లిక్కితే కాస్త పెద్ద ఫోటో తెలుస్తుంది. 7thబ్లాక్ అని ఉన్న దాన్లో మొదట ఏడు ఉన్నాను ఆ తర్వాత కాస్త ముందుకి 4thబ్లాక్ కి వచ్చి అక్కడే మిగిలిన మూడేళ్ళు పూర్తి చేసా.. ఈ మూలనున్నది క్రికెట్ గ్రౌండ్ దాని కధ త్వర లోనే చెప్తా :)

అలాంటి టైం లో ఎందుకో గుర్తు లేదు కానీ శ్రీరామ నవమి కి హాస్టల్ లోనే ఉండాల్సి వచ్చింది. మా మెస్ వాడు పానకం వడపప్పు లాటి పనులేమీ పెట్టుకోకుండా ఎప్పటిలానే సగం ఉడికిన క్యాబేజీ నీళ్ళ కూర, డేగిసా లో వలేసి పడితే కాని కూరగాయ ముక్కలు దొరకని మిక్సుడు వెజిటబులు సాంబార్ చేసేసి చేతులు దులిపేసుకున్నాడు. నవమి రోజు ఎదో తిండి తింటే తిన్నాం కానీ పానకం వడపప్పు లేకుండా ఏమిటి రా రామా!! అని అనుకుని. బయట ఎక్కడకో వెళ్ళి పందిళ్ళ లో తాగడం కాదు అని నేనే పూనుకుని. మెస్ వాడ్ని బతిమి లాడి కొన్ని గిన్నెలు, ఐస్ వాటర్ సంపాదించి భారి ఎత్తున పానకం తయారు చేసేసి మా బ్లాక్ లో సీనియర్స్ జూనియర్స్ అని తేడా లేకుండా అందరికీ పంచేసా... చేసిందంతా ఖాళీ చేసేసినా ఒక్కోళ్ళు ఒక్కో కామెంట్, ఒకడు మిరియాలు ఎక్కువయ్యాయంటే ఇంకోడు బెల్లం తక్కువైందంటాడు మరొకడు యాలుకలు నలగలేదు బాసు పంటికింద తగుల్తున్నాయ్ అంటాడు. మొత్తం మీద ఆ తర్వాత కొన్ని రోజులు మా సీనియర్స్ ఇక నన్ను యస్ డీ అడగాల్సిన అవసరం లేకుండానే పానకం కేండిడేట్ గా గుర్తు పెట్టుకున్నారు :)

సరే ఇంకా రామనవమి అనగానే నాకు సీతారాముల కల్యాణం చూతము రారండీ పాట గుర్తొస్తుంది. ఆ పాటా, ఇంకా పందిళ్ళ లో క్రమం తప్పకుండా వేసే లవకుశ లో పాటలు భాస్కర్ గారు తన టపా లో అల్రెడీ వేసేసారు (ఆ టపా ఇక్కడ చూడండి) ఇవేకాక ఇంకా సీతారామ కల్యాణం అనగానే ఖచ్చితంగా ఓ రెండు హరికధలు గుర్తుకు వస్తాయి. ఈ రెండూ సోషల్ సినిమాలకు సంభందించినవైనా అందులో సీతా రాములను చూపించక పోయినా ఆ వర్ణన, సంగీతం, గాత్రం మనల్ని మంత్ర ముగ్దులను చేస్తాయి. వాటిలో మొదట గుర్తు వచ్చేది వాగ్దానం సినిమా లో ఘంటసాల గారు గానం చేసిన సీతా కళ్యాణం హరికధ. రేలంగి గారి బాణి లో చిన్న చిన్న చెణుకు లు విసురుతూ నవ్విస్తూ హుషారు గా సాగే కధ లో మనం మైమరచి పోతాం. "రఘూ రాముడూ... రమణీయ..." అని మొదలు పెట్టగనే తెలియకుండానే తన్మయంగా తల ఊపేస్తాం.. "ఎంత సొగసు కాడే.." అంటే అవును కదా అని అనిపించక మానదు... అసలు సొగసు అన్న మాట పలకడం లోనే ఘంటసాల గారు ఆ దివ్య సుందర మూర్తిని సాక్షాత్కరింప చేస్తారు. ఇక చివరికి వచ్చే సరికి హెచ్చు స్వరం లో ఒక్క సారి గా "ఫెళ్ళు మనె విల్లు... " అనగానే సీతమ్మవారి సంగతేమో కానీ కధ వింటున్న వారెవ్వరికైనా గుండె ఝల్లు మనక మానదు అంటే నమ్మండి. ఈ పాట నాకు పూర్తిగా ఎక్కడా దొరక లేదు. దొరికిన వెంటనే పోస్ట్ చేస్తాను.

ఇక రెండోది స్వాతి ముత్యం సినిమా లోనిది. విశ్వనాధ్ గారి దర్శకత్వం, కమల్ అభినయం, హరికధ, భజన, కోలాటం అన్ని కలిపి ఇళయరాజా గారు స్వరకల్పన చేసిన ఈ పాటను బాలు గారు అలరిస్తారు. నాకు ఈ పాట చాలా ఇష్టమ్ ఎక్కువ సార్లు వినడం వలనో ఏమో దదాపు నోటికి కంఠతా వచ్చు :) కాలేజ్ లో కూడా ఒకరిద్దరు ఫ్రెండ్స్ అడిగి మరీ ఈ పాట పాడించుకునే వారు నా చేత... ఈ పాట శ్రీరామ నవమి సంధర్బంగా మీ కోసం.చిత్రం: స్వాతిముత్యం (1986)
గానం : బాలసుబ్రహ్మణ్యం, జానకి
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : ఇళయరాజ

రామా కనవేమి రా
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కనవేమిరా
రామా కనవేమి రా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి.. సుమ గాత్రి..
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమి రా !!

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేసించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగా శ్రీ రామ చంద్ర మూర్తి
కన్నెత్తి సూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

||రామా కనవేమి రా||

ముసి ముసి నగవుల రసిక శిఖామణులు సా నిదమ ప మగరిస
ఒసపరి చూపుల అసదృశ విక్రములు సగరిగ మనిద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు తా తకిట తక ఝణుత
ఒసపరి చూపుల అసదృశ విక్రములు తకఝణు తకధిమి తక
మీసం మీటే రోష పరాయణులు నీ దమప మా గరిగ
మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ.. ఆహ..
క్షణమే.. ఒక దినమై.. నిరీక్షణమే.. ఒక యుగమై...
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా..కనవేమిరా..

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు కక్కిన దొరలు భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు కక్కిన దొరలు భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులూ
తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గేసిన పురుషాగ్రణులూ
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఆ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అరెరె ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
కడక తైయ్యకు తా ధిమి తా..

రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ విరిగెను శివ ధనువు
కళలొలికెను సీతా నవ వధువు
జయ జయ రామ రఘుకుల సొమ ||2||
దశరథ రామ దైత్యవి రామ ||2||
జయ జయ రామ రఘుకుల సొమ ||2||
దశరథ రామ దైత్యవి రామ ||2||

సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే ||2||
కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె ||2||
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కన వేమిరా ఆ.. ఆ.. ఆ..
రామా కనవేమి రా

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.