పిల్లల్ని కొట్టి శారీరకంగా హింసించే తల్లి దండ్రులు పిల్లల భవిష్యత్ పాలిట, వారి వ్యక్తిత్వం పాలిట మొదటి శతృవులు అని నా ప్రఘాడ విశ్వాసం. అయితే ఇది నాలుగు గోడల మధ్య అయినపుడు కొంతలో కొంత పర్వాలేదేమో అనిపిస్తుంది, కానీ పిల్లలకు కూడా ఆత్మ గౌరవమనేది ఒకటుంటుందనే విషయం మరిచి నలుగురు ముందు హేళన చేయడం, చేయి చేసుకోడం, అవమానించడం లాంటి పనులతో వారిని మానసికంగా గాయపరిచే తల్లిదండ్రులు భవిష్యత్ లో ఆ పిల్లలు సైకోలు గా తయారవడానికి స్వచ్చందంగా రహదారులు వేస్తున్నారు అని నా అభిప్రాయం. అయితే ఇది అన్ని సార్లు కరెక్ట్ కాదు అని నిరూపించిన వాడు మా రాజేష్ (పేరు మార్చడమైనది), వాడు ఇంటర్మీడియేట్ లో నా క్లాస్మేట్, నాతో కలిసి మా సిద్ధార్ధ లోనే చదువుకున్నాడు.
గత టపా లలో మా కాలేజ్ బిల్డింగ్ చూశారు కదా, బిల్డింగ్ ముందు బోలెడంత ఖాళీ స్థలం ఉండేది పక్కన పెద్ద పెద్ద చెట్లతో మాంచి ఆహ్లాదకరంగా ఉండేది. ఒకో రోజు ఉదయం పూట స్టడీ ఆవర్ ఆ ఆవరణలో పెట్టేవారు. ఓ రోజు అలానే పిల్లలందరం (అన్ని సెక్షన్స్ కలిపి ఒక వందమంది వరకూ ఉంటాం) కూర్చుని నిశ్శబ్దంగా చదువుకుంటున్నాం. అంతలో ఎవరో కోపం అసహనం కలిపి పెద్ద పెద్ద అడుగులు గట్టిగా వేసుకుంటూ రావడం వినిపించి ఒక్క సారిగా అందరి తలలు ఆ వైపు తిరిగాయి. "సార్ మా రాజేష్ ఎక్కడ సార్" అంటూ అడిగారు ఆ వచ్చినాయన, ఆసరికే విషయం తెలిసిన కొంతమంది పిల్లలు గుస గుసలాడుకోవడం మొదలెట్టారు ఇంకొందరు చిన్నగా నవ్వుకోవడం మొదలెట్టారు. కూర్చున్న పిల్లల్లో వెదికి చూస్తే రాజేష్ కనిపించ లేదు.
ఆ వచ్చినాయన కోపం నషాళానికంటడం మాకందరికీ తెలుస్తూనే ఉంది. ఇంతలో ఒక వార్డెన్ లేచి మీ అబ్బాయి ఈ రోజు కడుపు నొప్పిగా ఉందని స్టడీ అవర్ కి రాలేదండీ రూంలోనే ఉన్నాడు అని చెప్పారు. పాపం మా వార్డెన్ గారు వాడికి సాయం చేద్దామని చెప్పారో వాడి మీద కక్షకొద్దీ చెప్పారో కాని ఆయన దండకం మొదలెట్టారు ".... అన్నీ నాటకాలు సార్ ఏడీ.. ఎక్కడ వాడి రూం..." అని ఉరిమేంతలో విషయం కాస్త ఆలశ్యంగా తెలిసినట్లుంది మా వాడు మాంచి నిద్ర కళ్ళతో నిద్ర ఎక్కువై ఉబ్బిపోయిన మొహంతో ఓ పుస్తకం పుచ్చుకుని బయటకి వచ్చాడు. వాడ్ని ఆ అవతారం లో చూసిన ఆయన ఇక ఎక్కడ ఉన్నారూ ఏమిటీ అనే విషయం మరిచి పోయి శివతాండవం మొదలెట్టేశారు, బెల్ట్ తీసి అందరి ముందు మా వాడికి వీరలెవల్ లో చాకిరేవెట్టేశారు.
ఇటువంటి సంఘటనలు కోకొల్లలు, అలా అని మా వాడు సుద్ద మొద్దు అల్లరి తప్ప ఏమీ ఎరగని వాడు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే :-) వాడు మా క్లాస్ టాపర్స్ లో ఒకడు కానీ ఎంత ఇంటెలిజెంటో ఎంతబాగా చదివి మార్కులు తెచ్చుకునేవాడో అంతే అల్లరి కూడా చేసేవాడు. ఉదాహరణకి పరోఠాల బిజినెస్ బ్యాచ్ లో వీడూ ఓ మెంబర్. అలానే తక్కువసేపు చదివినా (కనీసం మాకందరికి అలా కనిపించినా) మార్కులు మాత్రం చాలా బాగా వచ్చేవి. అసలు వాడిది విజయవాడే అదీకాక వాడి తెలివికి వాడికి రెసిడెన్షియల్ కాలేజ్ అవసరం లేదు కానీ ఇంట్లో ఉంటే చదవడు అని వాళ్ళనాన్న ఇక్కడ చేర్చారు.
అసలు వాళ్ళ నాన్న గారి మితిమీరిన క్రమశిక్షణ వల్ల వీడు ఇలా బాగు పడ్డాడా లేక వీడు ముందునుండి ఇంటెలిజెంట్ అయినా కూడా అల్లరి ఉండటం వలన కేవలం అదుపులో పెట్టడానికి ఆయన ఇలా చేస్తున్నారా అన్నది నాకు ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్నే. ఆయన అన్ని కొట్టినా తిట్టినా మా వాడికి చీమ కుట్టినట్లు కూడా ఉండేది కాదు అస్సలు పట్టించుకోడు అదేమంటే "ఆయనంతే బాబాయ్ అయినదానికి కానిదానికి అలానే కొడుతుంటారు మనం లైట్" అని చాలా తేలికగ అనేసేవాడు. ఆయన ఫ్లోలో ఆయన వెళ్తుంటే మా వాడి ఫ్లోలో మా వాడు వెళ్తుంటాడు.
ఇలాంటి మా రాజేష్ ఓ ఆదివారం ఔటింగ్ కి ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారు సాయంత్రం తీసుకుని వచ్చి కాలేజ్ లో దిగబెట్టారు. వీడ్ని ఇక్కడ దించేసి ఒక అరగంట గడిచిందేమో ఆయన తిరిగి మళ్ళీ కాలేజ్ కి వచ్చారు "ఏమైంది అంకుల్" అని అడిగితే "మీ ఫ్రెండ్ కి డబ్బులు ఇవ్వడం మర్చిపోయానమ్మా నా జేబులోనే ఉండిపోయాయ్ ఒక సారి పిలవండి" అని చాలా సౌమ్యంగా అడిగారు. ఆహా మా అంకుల్ ఇంత కూల్ గా కూడా ఉంటారా అనుకుంటూ మా వాడు ఎక్కడ ఉన్నాడా అని వెతకడం మొదలెట్టాం.
క్యాంపస్ అంతా గాలించినా మా వాడు ఎక్కడా కనిపించలేదు. ఆయన సహనం మెల్లగా నశించడం మొదలెట్టింది, "మాకివ్వండి అంకుల్ మేము ఇస్తాం" అని అడగడానికి మాకు మొహమాటం అడ్డం వస్తుంది. క్షణ క్షణానికి ఆయన మొహంలో ఫీలింగ్స్ మారిపోతున్నాయ్ "మీకు తెలిసే ఉంటుంది ఎక్కడికి వెళ్ళాడో చెప్పండమ్మా" అని అడుగుతున్నారు మేం "వీడికి మళ్ళీ మూడింది రా బాబు" అనుకుంటున్నాం. ఇంతలో మా వెనక నుంచున్న కుర్రాడొకడు సినిమాకి వెళ్ళాడనుకుంటా అంకుల్ అని ఉప్పందించాడు.
సాధారణంగా మేం కొత్త సినిమాలకి వెళ్ళాలంటే ఇటు కంకిపాడు కానీ లేదంటే అటు విజయవాడ కానీ వెళ్ళాలి. మా కాలెజ్ కి దగ్గరలో ఈడ్పుగల్లు ఊర్లోనో లేదంటే ఇంకొంచెం దూరంలోనో ఒక సినిమా హాల్ ఉండేది దాని పేరు సరిగా గుర్తులేదు. వాడు ఏవో పాత అరిగిపోయిన సినిమాలు తెచ్చి వేస్తుంటాడు. దాని టికెట్‍కౌంటర్ సినిమా నడుస్తున్నంత సేపు తెరిచే ఉంటుంది, మాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి టిక్కెట్ కొనుక్కుని లోపల కూర్చోవచ్చనమాట. గాలిరావడం కోసమని సాయంత్రం ఫస్ట్ షో సెకండ్ షో జరిగేప్పుడు తలుపులు కూడా వేయరు, మాంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఫీల్ వస్తూ చాలా బాగుంటుంది లెండి. ఆ రోజు ఆ థియేటర్ లో వెంకటేశ్ విజయశాంతి నటించిన శతృవు సినిమా నడుస్తుంది.
మా రాజేష్ గాడు వాళ్ళ నాన్న రిటర్న్ బస్ ఎక్కడం ఆలశ్యం ఇంకొంతమంది కోతి బ్యాచ్ ని వేసుకుని ఆ సినిమాకి చెక్కేసాడు. సినిమా మాంచి హుషారుగా నడుస్తుంది మావాడు జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమాలో వాలీబాల్ గ్రౌండ్ లో ఫైట్ సీన్ నడుస్తుంది. హీరో బాల్ పట్టుకుని దాని మీద కాలు పెట్టి ఇలా స్టైల్ గా నుంచున్నాడు "ఇక చూడ్రా విలన్ నాయాళ్ళకి ఇత్తడైపోతుంది.." అని కామెంట్ చేస్తూ మావాడు సడెన్ గా తెరకి ఎవరో అడ్డం వచ్చేసరికి "హెయ్ తప్పుకోవోయ్.." అంటూ తలపైకెత్తాడు. స్క్రీన్ మీద వెంకీ బాల్ మీద కాలేసి ఈ ఫోటోలో చూపించినట్లు నుంచునుంటే వీడి ఎదురుగా వీళ్ళనాన్న కుర్చీపై ఒక కాలుపెట్టి ఇలా నుంచుని సీరియస్ గా చూస్తున్నాడు. ఇక ఇత్తడి ఎవరికైందో ఇంత టపా చదివాక మీకు ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు కదా.. కాలర్ పుచ్చుకుని లేపి "ఎదవా కాలేజ్ లో దింపి అరగంట కూడా కావడం లేదు అప్పుడే సినిమానా....." అంటూ వీర ఉతుకుడు ఉతికేశారు ఆ హాల్లోనే...