నేను ఇండియా వెళ్ళినప్పుడు చెన్నై అయితే వెళ్ళాను కానీ చాలా బిజీ స్కెడ్యూల్ అవడం వల్ల శరవణ భవన్ లో ఫిల్టర్ కాఫీ తాగే అవకాశం దొరక లేదు. కానీ అక్కడ ఉన్నంత సేపూ తలచుకుంటూనే ఉన్నా. అక్కడ నుండి గుంటూర్ వచ్చాక ఈ సారి తీసుకు వెళ్ళాల్సిన వాటిలో కాఫీ ఫిల్టర్ మర్చిపోకుండా చేర్చమ్మా అని చెప్పా. దాందేముంది రా మన ఇంట్లో ఉన్నది ఎలాగు వాడటం లేదు అది ఇప్పుడే సూట్కేస్ లో పెట్టేసుకో అని అమ్మ ఇచ్చేసింది. మా ఇంట్లో అందరూ టీ ప్రియులు లెండి నేను ఒక్కడ్నే కాఫీ కి అంకితమయ్యా... మొత్తం మీద అలా మర్చిపోకుండా తీసుకు వచ్చిన ఫిల్టర్ ని వాడటానికి ఈ రోజే తీరిక దొరికింది.
ఎలా వాడాలి అనే బేసిక్ ట్రైనింగ్ టెలిపోన్ లో అల్రెడీ ఓ నేస్తం దగ్గర తీసుకుని ఉండటం తో "జయమ్ము నిశ్చయమ్ము రా భయమ్ము లేదు రా... " అనుకుంటూ మొదలు పెట్టాను. ముందు నీళ్ళు మైక్రోవేవ్ లో వేడి చేయాలి దానికోసం ఒక ప్లాస్టిక్ గ్లాస్ లో నీళ్ళు పోసి ఓ ప్లాస్టిక్ స్పూన్ వేసి ఓవెన్ లో పెట్టా (మైక్రో వేవ్ ఓవెన్ లో నీళ్ళు యధాతధం గా వేడి చేయకూడదు ఓ స్పూనో స్టిర్రరో వేసి చేయాలి అని వీడియోలతో మరీ చెప్పారు కదా అది వంట పట్టించుకున్నా లెండి అందుకే ముందు జాగ్రత్త) కానీ ఓ 3 నిముషాలు ఆగి చూస్తే ఆ స్పూన్ కాస్తా వంగి పోయి ఉంది.
హతవిధీ ఆదిలోనే హంసపాదా అనుకుని సరే ఆ వంగిన ప్లాస్టిక్ స్పూన్ కరిగి పోయి ఏ కెమికల్స్ నీళ్ళలో కలిసి ఉంటాయో అని అనుమానం వచ్చి అవన్ని పడేసి ఈ సారి పింగాణీ కప్ దాన్లోకి ఒక స్ట్రాంగ్ స్పూన్ పడేసి కాసింత తక్కువ టైం వేడి చేసా. నీళ్ళు వేడయ్యే సరికి ఫిల్టర్ లో ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసి దాని పైన రెండో ఫిల్టర్ పెట్టి రెడీ చేసి, ఆ వేడి నీళ్ళు ఫిల్టర్ లో పోసి మూత పెట్టేసా. ఇక అక్కడ నుండి మొదలు నా కష్టాలు.
ఫిల్టర్ అంతా స్టీల్ అదీ కాక Airtight ఎక్కడ ముట్టుకున్నా కాలి పోతుంది కనీసం ఒక పక్కకి జరపడానికి కూడా లేదు. పొనీ హేండిల్ ఏమన్నా ఇచ్చాడా అంటే అదీ లేదు ముందు ఇది ఇలా డిజైన్ చేసిన వాడ్ని తన్నాలి అనుకున్నా పోని చల్ల బడే వరకు ఆగుదాం అంటే మనకి ఆత్రం ఆగి చావదు. ఏదైనా గుడ్డ తోనో లేదా పేపర్ టవల్ తోనో ట్రై చేద్దాం అంటే ముందు గ్రిప్ దొరకడం లేదు దానికి తోడు మొత్తం Airtight అవడం వల్లనేమో రెండు కంపార్ట్మెంట్ లు పైన మూత అన్నీ బిగుసుకు పోయి కదిలి చావడం లేదు, లోపలేం జరుగుతుందో తెలీడం లేదు.
ఓ రెండు నిముషాల పాటు "బావగారు బాగున్నారా" సినిమాలో శ్రీహరి సీసా మూత తీయడానికి చేసే ప్రయత్నం గుర్తు చేసుకోండి ఇంచు మించు అదే రేంజ్ లో తిప్పలు పడ్డా... మరో రెండు నిముషాలు "తమ్ముడు" సినిమాలో అవధాన్లు మాష్టారి దుష్యంతుడు పాఠం గుర్తొచ్చింది. బాణం గాట్టిగా లాగాడు... రాలా !!... మళ్ళీ లాగాడు...బాణం లో నుంచి చెయ్యొచ్చింది కాని బాణం రాలా!!.. అదే టైప్ లో గాట్టిగా లాగాను కానీ చేయి జారిపోయింది కానీ మూత రాలేదు కింద కంపార్ట్మెంటూ రాలేదు !! అలా ఓ అయిదు నిముషాలు కుస్తీ పట్టాక వేసుకున్న టీషర్ట్ ని కాఫీ షర్ట్ చేస్తూ హఠాత్తు గా ఊడి వచ్చేసింది.
అయ్యో రామా మొత్తం అంతా ఒలికి పోయిందా మళ్ళీ పెట్టాలా అనుకుని చూస్తే ఏదో కాస్త షర్ట్ మీదా నేల మీద కిచెన్ టాప్ మీదా చిందిందనే కానీ మళ్ళీ చేయాల్సిన అవసరం రాలేదు, బ్రతుకు జేవుడా అనుకుంటూ అవన్ని క్లీన్ చేసి, 3 వంతులు పాలు ఓ వంతు డికాక్షను కలిపి కాసింత చక్కెర వేసి మళ్ళీ కాసేపు వేడి చేసి. చివరగా కాఫీని మంచి నురగ వచ్చేలా స్టీల్ గ్లాస్ లోకి ఇంకో కప్ తోటి తిరగ కొట్టి వేడి వేడి ఫిల్టర్ కాఫీ ని ఆస్వాదించేసా. ఈ చివర తిరగకొట్టడం అనబడు ఘట్టం అతిముఖ్యం స్పూన్ తో తిప్పినా Ikea లో దొరికే Milk frother లాంటి టూల్స్ వాడినా ఇలా ఒక కప్ నుండి ఇంకో కప్ లోకి తిరగ కొడితే వచ్చే టేస్ట్ కానీ అలాంటి నురగ కానీ రాదు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఎంత కష్ట పడైనా ఫిల్టర్ కాఫీ నే మళ్ళీ తాగాలనిపిస్తుంది కాని ఇంచు మించు సరి సాటి అని చెప్పుకునే ఇన్స్టంట్ జోలికి ఇక వెళ్ళ బుద్ది కావడం లేదంటే నమ్మండీ. ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ స్టీల్ కి కాఫీ కి ఏదో కనెక్షన్ ఉండీ ఉంటుంది. అరిటాకులో వేసి ఇచ్చిన వేడి వేడి పెసరట్టు అరిటాకు రసం పీల్చి మరింత రుచి గా తయారయినట్లు స్టిల్ ఫిల్టర్ లో, స్టీల్ గ్లాస్ ల్లో ఏదో ప్రత్యేకమైన రుచి ని సంతరించుకుంటుంది మన కాఫీ. ఇది వరకు ఇక్కడి electric coffee maker లో చేసిన ఫిల్టర్ కాఫీ ఇంత రుచి గా లేకపోడమే అందుకు నిదర్శనం.
సో అదనమాట నా ఫిల్టర్ కాఫీ కధ, ఇంకెందుకాలశ్యం వెళ్ళి ఓ మంచి ఫిల్టర్ కాఫీ తాగేయండి.
మళ్ళీ మరో టపా లో కలుద్దాం శలవ్.