నా బ్లాగులకు కొంతకాలం విరామం ప్రకటిస్తున్నాను. నా ఙ్ఞాపకాలు, అనుభూతులు, అనుభవాలు, ఆలోచనలు మళ్ళీ మీ అందరితో పంచుకోవాలని అనిపించినపుడు మళ్ళీ వస్తాను. అంతవరకూ శలవు.

అమ్మ జ్ఞాపకాల కబుర్లు
చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం
మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు
నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్
ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..
నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.
సోమవారం, జనవరి 24, 2011
విరామం
నా బ్లాగులకు కొంతకాలం విరామం ప్రకటిస్తున్నాను. నా ఙ్ఞాపకాలు, అనుభూతులు, అనుభవాలు, ఆలోచనలు మళ్ళీ మీ అందరితో పంచుకోవాలని అనిపించినపుడు మళ్ళీ వస్తాను. అంతవరకూ శలవు.
శనివారం, జనవరి 22, 2011
ఒక్కసారి మాట్లాడాలని ఉంది..
“ఇక్కడ ఉండి చదవవని కాదురా.. అక్కడ ప్రత్యేక శ్రద్ద తీసుకుని చదివిస్తారు నీ ఫ్యూచర్ కే మంచిది. ఈ రెండేళ్ళు కష్టపడి చదివావనుకో స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది అప్పుడు ఇంక నీ ఇష్టం.. అయినా నీకు చెప్తున్నాం కానీ మేం మాత్రం ఉండగలమా.. ప్రతి ఆదివారం వస్తావు కదా. మధ్యలో ఒక రోజు పక్కింట్ అంకుల్ వాళ్ళ ఫోన్ కి ఫోన్ చేయి ఇంకా తరుచుగా ఉత్తరాలు కూడా రాస్తుండు. అక్కడ నీకు బోలెడంత మంది కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు.. తర్వాత మమ్మల్ని మర్చిపోతావ్ లే.. ఆ స్నేహాలతో జాగ్రత్తగా ఉండమ్మా.. ఎవర్ని పడితే వాళ్లని నమ్మకూడదు...” అమ్మ ఆపకుండా ఏదో చెబుతూనే ఉంది.. నేను మాటలు వినడం మానేసి అమ్మనే చూస్తూ ఉండిపోయాను. రేపటి నుండి ఇలా ఎపుడు పడితే అపుడు అమ్మ కనపడదు కదా వారం అంతా ఎదురు చూడాలి. అమ్మని వదిలి దూరంగా వెళ్ళడం అదే మొదటి సారి.
హాస్టల్ కు వెళ్ళిన తర్వాత ప్రతి ఆదివారం ఇంటికి వెళ్తూనే ఉన్నా మధ్యలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆఖరికి ఏదైనా పీడకల వచ్చినా అమ్మకి ఫోన్ చేసేవాడ్ని. సెల్ ఫోన్లు ఇంకా పరిచయమవని ఆరోజుల్లో ఇప్పుడున్నంత విరివిగా ఫోన్లు ఉండేవి కాదు ఒక ల్యాండ్ లైన్ కనెక్షన్ కోసం కొన్ని నెలలపాటు ఎదురు చూడవలసి వచ్చేది. హాస్టల్లో కొన్ని నిర్ణీత సమయాల్లోనే మాట్లాడుకోవడానికి అనుమతినిస్తారు కనుక ఆ సమయంలో క్యూలు ఎక్కువగా ఉండేవి అందులోనే నిలబడి కాళ్ళునొప్పులు పుట్టేవరకూ ఎదురు చూసి మాట్లాడే నాలుగు మాటలు కూడా ఎంత మధురంగా ఉండేవో. ఎప్పుడైనా నాన్న వాళ్ళే అడ్మిన్ ఆఫీసుకు కాల్ చేస్తే ఆఫీస్ నుండి అరిచిన అరుపు విని ఎగిరిగంతేసి పొడవైన కారిడార్ లో కిందపడిపోతామేమో అన్నంత వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్ళి మాట్లాడటం ఇప్పటికీ గుర్తుంది...
“ఒరే నువ్వు విజయవాడ లో ఉన్నప్పటిలా కాదు ఇపుడు చాలా దూరంలో ఉంటున్నావ్ కదా.. అదీకాక యూనివర్సిటీ హాస్టల్ పెద్దగా పరిమితులు ఉండవు రాత్రి తొమ్మిది తర్వాత రేట్ తక్కువ కాబట్టి కాస్త ఎక్కువ మాట్లాడుకోవచ్చు. కనీసం రెండు మూడు రోజులకి ఒక సారి కాల్ చేయాలి సరేనా...” ఇంజనీరింగ్ కు వైజాగ్ పంపేముందు అమ్మ ఎన్ని సార్లు చెప్పిందో ఈ మాట. “అలాగే అమ్మా హాస్టల్ దగ్గరలో ఫోన్ బూత్ ఉంటే రోజూ చేస్తాను సరేనా...” అని చెప్పిన ప్రతిసారి నే జవాబిచ్చాను.
మొదటి ఏడాదంతా ఇంచు మించూ రోజూ ఏదో టైంలో ఇంటికి కాల్ చేసి కాసేపు మాట్లాడిన నేను ఆ ఏడు చివరికి వచ్చేసరికి “అమ్మా హాస్టల్ నుండి ఫోన్ బూత్ చాలా దూరమమ్మా రాత్రుళ్ళు 9 తర్వాత చీకట్లో ఇంతదూరం నడిచొచ్చి మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళడం కష్టంగా ఉంది అందుకే నాలుగురోజులకో వారానికో ఒక సారి చేస్తున్నా అంటే అర్ధం చేసుకోవేంటి..” అని అంటూనే.. కుదిరిన ప్రతిసారి అమ్మతో గంటకి తక్కువకాకుండా ఫోన్లో మాట్లాడిన రోజులు ఎన్నో... అప్పట్లో రాత్రుళ్ళు ఒకరిద్దరు నా తర్వాత మాట్లాడడానికి వరుసలొ ఎదురు చూస్తుంటే వాళ్ళని ముందు చేసుకోమ్మని చెప్పేసి నేను చివరన ఫోన్ చేసే వాడ్ని ఆఖరున ఉండేది నేనైతే ఏ అవాంతరాలు లేకుండా అమ్మతో కావాలిసినంత సేపు మాట్లాడుకోవచ్చని నిద్రని కూడా త్యాగం చేసే వాడ్ని.

అమ్మతో మాటలంటే ఇంకో విషయం గుర్తొచ్చింది.. సాధారణంగా ఎవరితోనూ గొడవపడని నేను అప్పట్లో కాస్తైనా కోపంగా మాట్లాడేది ఒక్క అమ్మతోనే.. మాకు ముఖ్యంగా ఒక్క విషయంలో చాలా పెద్ద గొడవయ్యేది. ఇంటర్ లో తక్కువే కానీ ఇంజనీరింగ్ లో సెలవలకు వచ్చిన ప్రతిసారీ మీ స్నేహితులకోసం కూడా తీసుకువెళ్ళు అని చెప్పి పిండివంటలు పచ్చళ్ళు బోలెడు ప్యాక్ చేసేది అమ్మ. నాకేమో అవన్నీ మోసుకుని బస్సుల్లో వెళ్ళడం ఒక కష్టమయితే అసలు కాలేజికి వెళుతూ నే ఒక్కడ్నే అన్నేసి తినుబండారాలు తీసుకుని వెళ్ళడం పెద్ద నామోషీగా ఫీల్ అయ్యేవాడ్ని. మిగతావాళ్లెవరూ అన్ని తెచ్చుకునేవారు కాదు మరి అందుకే నాకలా అనిపించేది..
అలా చేసిపెట్టేవాళ్ళు ఉండటం నా అదృష్టమని అప్పట్లో తెలుసుకోలేకపోయాను కొన్నిసార్లు అంతే ఉన్నపుడు విలువ తెలీదు తెలిసేప్పటికి ఏమీ ఉండదు. ఇలాంటిదే ఇంకోటి ఇంట్లోఉన్నపుడు అమ్మ “మధ్యాహ్నం మూడవుతుంది భోజనానికి లేమ్మా” అని చెప్తుంటే “ఏంటీనస నాకు ఆకలేస్తే తినాలని తెలీదా” అని అనిపించేది అదే ఒంటరిగా ఉన్నపుడు ఒకోరోజు “ఏంటో జన్మ ఉన్నావా తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా లేరు” అని అనిపిస్తుంటుంది. మళ్ళీ డివియేట్ అవుతున్నాను.. అలా మోసుకెళ్ళడం మనకి నామోషీ కనుక అమ్మ చేయించిన వాటిలో సగం తీసుకు వెళ్తా అని నేనూ తను చెప్పినవన్నీ తీసుకువెళ్ళాలని తనూ పట్టుపట్టి కూర్చునేవాళ్ళం. అదేంటో కానీ ఎప్పుడూ అమ్మే గెలిచేదిలెండి ఎప్పుడైనా నేను కాస్త గట్టిగా కోప్పడితే తను నామాట వినేది కాని అలా అమ్మమీద కోప్పడి వెళ్ళినపుడు నాకు మళ్ళీ ఇంటికి వచ్చేవరకూ హాస్టల్ లో ఏవో ఒక ఇబ్బందులు వచ్చేవి అస్సలు బాగుండేది కాదు అదో సెంటిమెంట్.
సరే ఇక ఇంజనీరింగ్ నాలుగో ఏటికి వచ్చేసరికి మళ్ళీ రెండ్రోజులకి ఒక సారి ఫోన్ చేయడం ఒకోసారి ప్రతిరోజూ మాట్లాడటం చేసేవాడ్ని. ఎంతగా అంటే హాస్టల్ దగ్గరలోని ఫోన్ బూత్ ల వాళ్ళు మా దగ్గరకి రమ్మంటే మా దగ్గరికి రమ్మంటూ అచ్చంగా ఈనాటి క్రెడిట్ కార్డ్ వాళ్ళలా అప్పులు సైతం ఇవ్వడానికి వెనుకాడేవారు కాదు. అదేంటో అమ్మతో మాట్లాడినపుడు మేం మాట్లాడుకునేవి సాధారణమైన విషయాలే అయినా కాల్ అయ్యాక ఏదో తెలియని శక్తి ఆవహించేది బోలెడంత ధైర్యంగా కొండంత కాన్ఫిడెన్స్ తో రొమ్మువిరుచుకుని చీకటి వెలుతురు అనే ఆలోచన లేకుండా ఎంత రాత్రయినా నిర్బయంగా తుప్పల్లో పడి నడుచుకుంటూ రూంకి వెళ్ళేవాడ్ని. ఆ శక్తి దదాపు ఒక రోజంతా అలానే ఉండేది. అందుకే పరీక్షల టైంలో అసలే చివరినిముషంలో ముక్కున పట్టడానికి సమయం చాలకపోయినా సరే ప్రతిరోజూ కాసేపయినా అమ్మతో మాట్లాడటం మాత్రం మిస్ అయ్యేవాడ్ని కాదు. ఒక్క ఇంజనీరింగ్ పరీక్షలనేనా జీవితంలో ఎలాంటి పరీక్షలనైనా అమ్మతో ఒక సారి చర్చించి సమస్యపై తన ఇన్ సైట్ తీసుకుని ముందుకు సాగేవాడ్ని.
ఉద్యోగార్ధినై హైదరాబాద్ లో ఉన్నా.. ఉద్యోగనిమిత్తం చెన్నై లో ఉన్నా, బెంగళూరు, అమెరికా ఇలా ఒకటేమిటి ఎక్కడైనా ఎప్పుడైనా అమ్మతో మాట్లాడటం ఓ చక్కని అనుభూతి, కొండంత బలం. అమెరికా వెళ్ళాక చాన్నాళ్ళకి ఒక సారి నేను “అమ్మా ఇంజనీరింగ్ లో ఉన్నపుడు నువ్వు చెప్పినమాటలు గుర్తున్నాయా.. ఇప్పుడంటే చిన్నపిల్లాడివి ఒక్కడివి ఎలా ఉన్నావో అన్న బెంగ కాబట్టి రోజూ చేయమంటున్నాను కానీ.. పెద్దై ఉద్యోగం చేస్తుంటే రోజూ కాల్ చేయాల్సిన పనేమి ఉంటుంది అప్పుడు అఖ్ఖర్లేదు... అన్నావ్ కాని మనం ఇప్పటికి కూడా ఆ డైలీ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాం కదా..” అంటే అమ్మ తేలిగ్గా అందంగా ఒక నవ్వు నవ్వేసేది.

శుక్రవారం, జనవరి 14, 2011
హాస్టల్ – 10 (జిల్ జిల్ జిలాని)

ఇక అదయ్యాక ఉదయం 9 గంటలకి ఒక గంటపాటు రోజుమార్చి రోజు ఏదో ఒక సబ్జెక్ట్ లో మాకు స్లిప్ టెస్ట్ లు పెట్టేవారు. వార్డెన్లే పేపర్ సెట్ చేసి గంటకి సరిపోయేలా నాలుగైదు ప్రశ్నలకన్నా ఎక్కువ లేకుండా పెట్టే చిన్న పరీక్ష కాబట్టి దాన్ని స్లిప్ టెస్ట్ అనేవారు. కానీ మా జిలానీ మాత్రం స్లిప్పులు పెట్టుకుని చూసి రాసేది కాబట్టి దాన్ని స్లిప్ టెస్ట్ అంటారు కాబోలునని వాడంతట వాడే సొంతంగా నిర్వచనం చెప్పేసుకున్నాడు. దాంతో ప్రతి టెస్ట్ కూ ఖచ్చితంగా స్లిప్పులు ప్రిపేర్ చేసుకుని తెచ్చుకునేవాడు. వాటిని వార్డెన్ కం ఇన్విజిలేటర్లకి కనపడకుండా రోజుకో కొత్త ప్రదేశంలో కొత్త రకంగా దాచిపెట్టి వార్డెన్ కి తెలీకుండా వాటిని చూసి రాయడానికి విశ్వప్రయత్నం చేసేవాడు.

ఇక క్లాస్ లు జరిగేటప్పుడు మా లెక్చరర్లందరికీ మావాడు శుద్దమొద్దని ప్రగాఢమైన విశ్వాసం కనుక వాడిమీద ప్రత్యేకమైన శ్రద్ద చూపించేవారు. బి.ఎన్.కె. గారనీ మాకు రేఖాగణితం చెప్పడానికి ఒక సార్ వచ్చేవారు ఆయనకి మా జిలానీ ప్రియశిష్యుడు. మా సార్ తరహానే ప్రత్యేకంగా ఉండేది, బ్లాక్ బోర్డ్ దగ్గరలో ఉన్నంత సేపు బాగానే కుదురుగా ఉండేవారు కానీ ఆ ఏరియా దాటి మా మధ్యలోకి వస్తే బాక్సింగ్ రింగ్ లో కదులుతున్న బాక్సర్ గుర్తొచ్చేవాడు. అచ్చం అలానే మునివేళ్ళ మీద అటు ఇటు వేగంగా కదులుతూ ఒక్కొక్కరినీ ప్రశ్నలడుగుతూ జవాబు చెప్పలేని వాళ్ళని వంగోబెట్టి వీపు మీద అరచేత్తో ఘాఠ్టిగా ఒక్క చరుపు చరిచేవాడు మాలో కొందరికైతే వాతలు తేలి సాయంత్రం వరకూ స్పష్టంగా అంతే ఉండేవి. అబ్బ ఆయన గురించి తలుచుకుంటుంటేనే వీపు మీద మంట పుట్టి వెన్నులోంచి వణుకు వస్తుంది :-(
ఆయన క్లాస్ లో మా జిలానీ హైడ్రామా నడిపేవాడు వాడ్ని ప్రశ్న అడగడంతోనే స్టార్ట్ వాడికెలాగూ రాదని తెలుసు పక్కన మేమెవరమన్నా అందిస్తే మా వీపులు సాఫ్ చేసేవారు మా బి.ఎన్.కె అందుకని మేం నోర్మూసుకుని కూర్చునే వాళ్ళం. మనకసలే హెల్పింగ్ నేచరెక్కువకదా మొదటిసారి అలా అందించబోయి ఆయన చేతిలో దెబ్బలు తిన్నది నేనే. ఇక మా సార్ దగ్గరికి రావడం తోనే మా వాడు పెద్దగా పొలికేకలు “సార్ సార్ వద్దుసార్.. కొట్టద్దు సార్.. వీపు మీద సెగ్గడ్డ లేచింది సార్.. కావాలంటే రేపు కొట్టండి సార్.. లేదంటే చేతిమీద కొట్టండి సార్.. రేపు చదువుకుని వస్తాను సార్..” ఇలా వాడికి తోచిన విధంగా డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించేవాడు, సార్ చెయ్యెత్తగానే “అయ్యో.. అమ్మో.. అబ్బో..” అని పెడబొబ్బలు పెట్టి గోల గోలగా క్లాస్ అంతా కల్లుతాగిన కోతిలా గంతులేసి పెద్ద సీన్ క్రియేట్ చేసేవాడు. మా సార్ ఒకోసారి నేను ఇంకా కొట్టలేదురా సరే ఈ రోజు వదిలేస్తాలే అని వాడు కాస్త సైలెంట్ అవ్వగానే ఠపీమని పీకేవారు.
ఇలాంటి రోజుల్లో ఒక వింటర్ లో మా జిలాని గాడికి ఈ దెబ్బలు తప్పించుకోడానికి మహత్తరమైన ఐడియా వచ్చింది ఒక రోజు ఉదయాన్నే క్లాసులు మొదలయ్యే ముందరే మా అందరితో ఛాలెంజ్ చేశాడు “ఒరే చూడండ్రా ఈ రోజు బి.ఎన్.కె గారి నుండి ఎలా తప్పించుకుంటానో..” అని మేం అంతా రోజూకన్నా కాస్త బొద్దుగా కనిపిస్తున్న జిలానీ గాడ్ని చూస్తూ ఏం చేస్తాడబ్బా అని అనుకున్నాం. క్లాసు మొదలైంది మా సార్ యథావిధిగా మావాడ్ని ఏదో ప్రశ్న అడగటం వీడు చెప్పలేకపోవడం జరిగాయి ఎప్పట్లానే మావాడు డ్రామా స్టార్ట్ చేసినా కాస్తంత విజయంతోకూడిన నవ్వు వాడిమొహంలో మాకు తెలుస్తుంది. మా సార్ వాడ్ని వంగోబెట్టి అరచేత్తో ఒక్కటిచ్చాడు ఎప్పుడూ వచ్చే టపామనే శబ్దం కాకుండా ఏదో పరుపు మీద కొట్టినట్లు చప్పుడైంది.
మా సార్ సామాన్యుడా వెంటనే విషయం గ్రహించేశారు ఒరే నువ్ అలాగే ఉండరా అని చొక్కా పైకెత్తారు.. లోపల ఇంకో చొక్కాకనిపించింది.. మా జిలాని గాడి ఫేస్ లో నవ్వు మాయమైంది :-) మా సార్ ఆ లోపలి చొక్కాని కూడా పైకెత్తారు దానిలోపల ఇంకోటి అలా మొత్తం నాలుగు చొక్కాలు లోపల ఒక పలచని స్వెటర్ వేసుకుని మాంచి కుషన్ లాగా తయారు చేసుకుని వచ్చాడు మా వాడు. మా సార్ ఆ స్వెటర్ కూడా పైకిలెపే సరికి ఇక మా వాడి విలయతాండవం మళ్ళీ మొదలైంది “సార్ సార్ తప్పైపోయింది సార్ ఒక చొక్కా అయినా ఉంచి కొట్టండి సార్..” అని ఒకటే గోల కానీ అలా చేస్తే మా సార్ బి.ఎన్.కె ఎందుకౌతారు మొత్తం తీసేసి ఒట్టి వీపు మీద చాచిపెట్టి ఒక్కటిస్తే ఆ వాతలు తెల్లారేవరకూ తగ్గలేదు పాపం. అంతే మావాడు మళ్ళీ ఆయన ముందు ఇంకెప్పుడూ అలాంటి ట్రిక్కులు ప్రయోగించే ధైర్యం చేయలేదు.
చెప్పడం మరిచాను ఆయన దెబ్బలు తప్పించుకోవడానికి నేను కూడా ఓ చిన్న ట్రిక్ ప్లే చేసేవాడ్ని :-) ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం గురించి ఏకొంచెం సంశయమున్నా కాస్త భయపడుతూ బిక్కు బిక్కు మంటూ బెదురు చూపులు చూసేవారి మీదే ఆయన దృష్టి ఎక్కువ ఉండేది, అలాంటివారిని ఎక్కువగా లేపి జవాబు చెప్పమనేవాడు. అందుకని ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలిసినా తెలియక పోయినా నాకు అన్నీ తెలిసినట్లు నన్ను అడగట్లేదేమిటి అన్నట్లుగా అత్యుత్సాహం ప్రదర్శించేవాడ్ని. ఆయన వీడికి జవాబు తెలుసులే అనుకుని నాలాంటివారిని అడిగేవాడు కాదు, నా ట్రిక్ చాలా కాలమే పని చేసి నన్ను దెబ్బలనుండి రష్చించేసింది.
ఈ పై యానిమేషన్ చూశారా. పూర్తిపాటకి ఇక్కడ చూడండి. చాలా పాత వీడియో నాలుగేళ్ళక్రితంది కానీ నాకు చాలా నచ్చిన వీడియో.. ఆ పాటే సింప్లీ సూపర్బ్ అనుకుంటే ఎవరు చేశారో కానీ యానిమేషన్ చాలా బాగా చేశారు. పాటపాడేటప్పుడు హిప్పో ముఖ కవళికలు, కుక్క డ్యాన్స్, దాని డ్యాన్స్ చూసి హిప్పో ఫేస్ లో ఏహే ఏంటీ అల్లరి అన్నట్లు చూసే చూపులు మొత్తం నాకు చాలా చాలా ఇష్టం.. ఎలాంటి మూడ్ లో ఉన్నపుడైనా నన్ను హాయిగా నవ్వించేస్తుంది ఈ వీడియో. డాన్స్ పేరుతో ఈ కుక్కచేసే అల్లరి చూస్తే అప్పుడప్పుడు మా జిలానీ గుర్తొస్తుంటాడు. ఇప్పుడెక్కడున్నాడో తెలీదు కానీ ఈ టపా చదివి మళ్ళీ కలిస్తే బాగుండు అనిపిస్తుంది.
సర్వేజనా సుజనోభవంతు,
సర్వేసుజనా సుఖినోభవంతు.
గురువారం, జనవరి 13, 2011
హాస్టల్ - 9 (రాకుమారుని రాఖీ చెల్లి)
ఒద్దికగా చిరుసవ్వడితో పారే సెలయేరు ’సహజ’ ఐతే.. హోరుమని ఎగిరి దూకే జలపాతం ’శ్రుతి’. వీళ్ళిద్దరూ ఇంచుమించు 120 మంది అబ్బాయిలు నాలుగు సెక్షన్ లు ఉన్న మా ఇంటర్మీడియట్ కాలేజ్ లో మా సెక్షన్ లో మాతోపాటు చదువుకునే అమ్మాయిలు. ఒకే క్యాంపస్ లో ఉన్న స్కూల్ ని మినహాయిస్తే మా కాలేజ్ మొత్తానికి వీరిద్దరే అమ్మాయిలు. శ్రుతి అవసరాన్ని బట్టి అబ్బాయిలతో మాట్లాడుతూ కామెంట్లకు కౌంటర్లు వేస్తూ ఉండేది కానీ సహజ బొత్తిగా వంచిన తల ఎత్తకుండా తిరిగేది, ఎవరికైనా తను ఎదురు పడినా బుద్దిగా పక్కకు తప్పుకునేవాళ్ళే కానీ తనని కామెంట్ చేసేవాళ్ళెవరూ ఉండేవారు కాదు తనని తన వైఖరిని చూస్తే ఒక ఆరాధనా భావమే తప్పించి అల్లరి చేయాలని ఎవరికీ అనిపించదు.
మా రూం S8 లో ఉన్న ఏడుగురిలో నేను, భరత్, బాజీ ఒకటీంలా కలిసి తిరిగేవాళ్ళం మిగిలిన వాళ్ళలో రాకుమర్ ఒకడు. మేం హాస్టల్లో చేరిన కొత్తలో మాకు వీడో పెద్ద ఆశ్చర్యార్ధకం ఎందుకంటే మొదటి సారి హాస్టల్లో చేరిన మేమందరం ఇంటి మీద బోలెడంత బెంగపెట్టుకుని సొంతంగా మాపనులు మేం సరిగా చేసుకోలేక బిక్కు బిక్కుమంటూ భయం భయంగా తిరుగుతుంటే మా రాకుమార్ గాడు తన మూడో తరగతి నుండీ తల్లిదండ్రులకి దూరంగా హాస్టల్ లో ఉండటం వల్ల ఏ విధమైన బెంగ, దిగులు లేకుండా ఎవర్నీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరిగేవాడు. వీడు ఇలా ఎలా ఉండగలిగేవాడా అని అప్పట్లో అంతగా అవగాహనలేని మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. వాళ్ళ అమ్మానాన్న మాంచి సౌండ్ పార్టీ అవడంతో మాకు అపుడపుడు క్యాంటీన్ లో కేకులు కూల్డ్రింక్ లు స్పాన్సర్ చేసేవాడు. వాడి ధోరణి రూపం అన్నిటిని కలిపి వాడిని ఇదివరకు హాస్టల్ లో గాబ్రేల్ అని పిలిచేవారని తనే చెప్పుకున్నాడు మేంకూడా అదేపేరుతో పిలిచేవాళ్ళం.

ఒక రోజు సాయంత్రం నేను ఏదో కొనుక్కోవడానికి క్యాంటీన్ వైపు వెళ్ళాను అక్కడే ఉన్నా మా రాకుమార్ గాడు వేణూ ఈ రోజు నీకు పార్టీరా అంటూ తినలేను రా బాబు అంటున్నా వినకుండా నాకు సమోసా, కేక్, కూల్ డ్రింక్ ఇప్పించాడు. అక్కడ కూర్చున్నంతసేపు వాడి మాటతీరు కొంచెం తేడాగా అనిపించింది అప్పగింతలు చెప్తున్నట్లు.. మిమ్మల్ని ఎపుడైనా బాధ పెడ్తే క్షమించమని అడుగుతూ ఇలా ఏదేదో మాట్లాడాడు.

డిన్నర్ అయ్యే సరికి శ్రుతిద్వారా మాకు తెలిసిన విషయమేమిటంటే మావాడు తనకి జీవితం మీద విరక్తి కలుగుతుందని తనంటే ఎవరికీ ఇష్టం లేదనీ తను ఎవ్వరికీ అఖ్ఖర్లేదనీ సహజ దగ్గర నానా రకాల వాగుడూ వాగి తానా రోజు రాత్రి ఆత్మహత్య చేసుకోబోతున్నానని చాలా సీరియస్ గా చెప్పాడుట. పాపం మా సహజ ఎవరైనా మా లెక్చరర్ గట్టిగా హోంవర్క్ చేశావా అని అడిగితేనే బొటా బొటా కన్నీళ్ళు కార్చేరకం ఇంక మావాడు వేసిన సినిమాకి పూర్తిగా డీలా పడిపోయి ఆ ముందురోజు తిండికూడా తినకుండా ఏడుస్తూ కూర్చుందట. మావాడికేం కాకుండా మేం చూసుకుంటాం అని అమ్మాయిలిద్దరికీ హామీ ఇచ్చి పంపేసి నేను భరత్ గాడు మావాడ్ని రక్షించే ప్రయత్నంలో పడ్డాం. జీవితం ఎంత విలువైనదో ఇండైరెక్ట్ గా వాడికి అర్ధమయ్యేలా మాట్లాడుకోవడం ఎదిగొచ్చిన పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో ఏవో వేరేసంఘటనలు ఉదహరిస్తూ మాట్లాడుకోవడం లాంటివి చేసి.
రూంలో ఉన్న కత్తి, కత్తెర, బ్లేడ్లు లాంటి పదునైన వస్తువులన్నీ టంగ్ క్లీనర్ తో సహా ఇంకా తాళ్ళు బ్యాట్లు లాంటివన్నీ పక్క ఫ్రెండ్స్ రూంలో దాచిపెట్టేసి, ఆ రాత్రి వాడు నిద్ర పోయాక ఇక బయటకి రాకుండా లోపల కొందరం ఉండి రూం బయట నుండి తాళం వేసి లోపల ఒకళ్ళం బయట ఒకళ్ళం నిద్ర మానుకుని కాపలా కాసాం. ఆ రాత్రి ఎలా గడిపామో తలచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు జలదరిస్తుంది. ఇంత డ్రామా ఎందుకు వాడ్ని ఒక్కటి పీకి ప్రిన్సిపాల్ కి అప్పగిస్తే పోయేది కదా అంటారా.. మాకు స్పష్టంగా వాడి ఉద్దేశ్యం తెలిసే సరికి రాత్రి అయింది అదీకాక మాకు వాడి ప్లాన్ తెలిసిందని తెలిస్తే వాడు మాకు దూరంగా వెళ్ళి మరేదన్నా ప్రయత్నం చేయచ్చు అందుకని మేం ఏమీ తెలియనట్లే వాడ్ని కాపాడే ప్రయత్నం చేశామనమాట. ఎలా అయితేనేం ఆ రాత్రి గడిచింది తెల్లవారి స్టడీ అవర్ నడుస్తుండగా నేను మా భరత్ గాడు రాకుమార్ గాడ్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాం చివరలో ఎనిమిది గంటలు కావస్తుందనగా వాడు లేచి బయటకి వెళ్ళాడు వెంటనే మేం కూడా అనుసరించబోతుండగా ఎదురుగా ఛండశాసనుడిలా మా ఏ.ఓ గారు ఎదురయ్యారు ఆయన వెనుకే మా రాకుమార్ గాడు కూడా..
కిక్కురు మనకుండా మేం గిరుక్కున వెనక్కితిరిగి రూంలోకి వచ్చి కూర్చున్నాం ఏ.ఓ గారు లోపలికి వచ్చి అమ్మాయిలను S8 రూమ్మెట్సునూ రాకుమారుడితో సహా మా క్లాస్ లో ఉండమని మిగిలిన వాళ్ళందరినీ బయటకి వెళ్ళిపోమన్నారు. మాకు బెల్టు దెబ్బలు ఖాయమని తెలిసిపోతుంది 6th sense అప్పటికే హెచ్చరించటం మొదలెట్టింది ఏఏ దెబ్బలని ఎలా కాచుకోవాలా అని ప్లాన్లు గీయడం మొదలెట్టాను.

ఆ తర్వాత ఎపుడో పరీక్షలు రాయడానికి మా క్యాంపస్ కి వచ్చిన రాకుమారుడితో మాట్లాడాక తను కేవలం ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడని అందరితో అనిపించుకోవడానికి మా సహజతో పరిచయం పెంచుకోవడానికీ రాఖీని అడ్డంపెట్టుకున్నాడే కానీ నిజమైన అభిమానం కాదనీ... అలా కొంత కాలం మాట్లాడాకా బుద్దిమారి ఆత్మహత్య డ్రామాద్వారా సింపతీ సంపాదించి సహజకు దగ్గరవ్వాలని పన్నాగం పన్నాడనీ అర్ధం చేసుకుని నివ్వెరపోయాం. తీవ్రమైన మానసిక సమస్యలతో బాధ పడుతున్న వాడికి మా రూంమేట్స్ అంతా కూర్చుని కాస్త హితబోధ చేయడానికి ప్రయత్నించాం.
ఒక దుస్సంఘటన మన మనసుల్లో ముద్రించుకుపోయినంత ఘాడంగా మంచి సంఘటనలు గుర్తుండవు కదా, ఆ తర్వాత ఎన్నోసార్లు పరాయి స్త్రీలో తోబుట్టువును చూసే ఎందరో నిజాయితీపరులను నా కళ్ళారా చూసినప్పటికీ ఇప్పటికి కూడా పరిచయం పెంచుకోవడానికి చెల్లెమ్మా అంటూ దగ్గరయి అరవ సినిమా సిస్టర్ సెంటిమెంట్ సీన్లను కళ్ళముందు నిలబెట్టే అన్నలను చూస్తే అరక్షణం పాటైనా నా మనసు కీడు శంకిస్తూనే ఉంటుంది. ఆనాటి మా సహజ పడిన మెంటల్ టార్చర్ గుర్తొస్తూనే ఉంటుంది.
శనివారం, జనవరి 08, 2011
ఎల్విస్ ది కింగ్
భయం భయంగా చుట్టూ చూస్తూ.. హస్టల్ ముందున్న సిమెంట్ బెంచీల మీద కూర్చున్న సీనియర్స్ ని “నన్నా సార్” అని అడిగాను.
“ఆ నిన్నేరా.. నువ్వుకాకుండా ఇంకెవరున్నారు అక్కడ.. బాగా తెలివిమీరారురా” ఒకతను జవాబిచ్చాడు.
నా కాళ్ళలో శక్తి మొత్తం ఎవరో లాగేసుకున్నట్లు కాళ్ళలో వణుకు మొదలైంది అడుగు ముందుకు పడటం లేదు “చచ్చాంరా బాబు.. ఏం పని లేనట్లు వీళ్ళిక్కడే తగలడాలా నేనైనా చూసుకోవచ్చుగా.. ఇప్పుడు ర్యాగింగ్ అంటూ ఏమేం విచిత్రమైన ఫీట్లు చేయించి చస్తారో ఏంటో.. అసలే ఈ హాస్టల్ మెయిన్ రోడ్ కి దగ్గర ఆ రోడ్లో అమ్మాయిలు కూడా తిరుగుతుంటారు ఒకళ్ళు చూసినా పరువంతా పోయినట్లే..” అని ఫీల్ అవుతూ ఎలాగో కష్టపడి వాళ్లదగ్గరకి వెళ్ళాను.
“ఫస్టియరా ?”
“అవునండి..”
“అండి ఏంటిరా మొగుడ్ని పిలిచినట్లు, సార్ అనాలని చెప్పలేదా ఎవరూ.. ఏ బ్రాంచ్ ?”
“Instrumentation సార్”
“ఓహో.. అవునూ సీనియర్స్ ఇక్కడ కూర్చుని ఉంటే కనపడటం లేదారా విష్ చేయకుండా సైలెంట్ గా అలా వెళ్ళిపోతున్నావ్ ?”
“రూం కి వెళ్ళాలన్న తొందరలో చూస్కోలేదు సార్”
“ఏం పీకాలేంటి అంతతొందరగా వెళ్ళి రూంలో ?”
“చదువుకోవాలి సార్..” (అది పచ్చిఆబద్దమని తెలిసిన నాఅంతరాత్మ గాడు కింద పడి గిలగిల కొట్టుకుంటూ నవ్వసాగాడు వాడ్ని బలవంతంగా ఊరుకోబెట్టి మొహంలో సీరియస్ నెస్ పోకుండా జాగ్రత్తపడ్డాను)
“ఎగస్ట్రాలెక్కువేరా నీకు..” అంటూ సరదాగా ఒకడు పొట్టమీద గుద్దాడు..
ఒకడుగు వెనక్కేసి బ్యాలన్స్ చేసుకుంటూ “హి హి హి హి..” అని ఏడవలేక ఒక వెధవ నవ్వు నవ్వాను.
“సరే ఇప్పుడేం చేసి మమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తావ్..”
“మీ ఇష్టం సార్..” (మనసులో: నేనేమైనా సర్కస్ జోకర్నేంటిరా మిమ్మల్ని ఎంటర్ టైన్ చెయడానికి ఒక ఏడు ముందు పుట్టి సీనియర్స్ అని మాతో ఏం ఆటలాడుకుంటున్నార్రా!!)
“రాక్ అండ్ రోల్ తెలుసా ?”
“తెలుసు సార్..”
“ఎలా తెలుసు ?”
“మైఖేల్ మదన కామరాజు సినిమాలో చూశాను సార్..” (ఈసినిమానే ఎందుకు గుర్తొచ్చిందని నన్నడక్కండి)
“అబ్బో.. ఏం తెలుసో చూపించు..”
వెంటనే ఈస్ట్మన్ కలర్ లో నాకళ్ళముందు ఆ సినిమాలో కమల్ వేసిన స్టెప్పులు కనిపించాయ్.. “బంబం ఆరంభం.. భంభం ప్రారంభం.. ఆరేడు రోజులాయె కాదే..నీ మీద మనసుపడ్డ నాకు నిదురలేదే..” అంటూ పాట అందుకొని నడుము ట్విస్ట్ చేస్తూ ఓ ఊపేస్తూ సగం గోడకుర్చీ వేసిన ఫోజులోకి వంగి మెల్లగా మళ్ళీ నిటారుగా నిలబడుతూ ఇలా నాకు తోచిన డ్యాన్స్ మొదలెట్టాను :-)
“హ హ హ నువ్వలా ఊగుతుంటే చూడటానికి భలే ఉందిరా.. ఐనా దీన్ని రాక్ అండ్ రోల్ అంటారు అని ఎవరు చప్పారు రా” అని కామెంట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఎంతకీ ఆగమని చెప్పడంలేదు.
చెప్తున్నా వినకుండా “నాలుగు రోజులు రావాలికదా” అంటూ అమ్మ లూజుగా కుట్టించిన నా ప్యాంట్ ఎక్కడ ఊడి జారిపోతుందో అనే టెన్షన్ ఒక వేపు.. అప్పటికే భయంతో శక్తిలేకుండా బలహీనంగా తయారైన నా కాళ్ళు ఎక్కడ సహకరించడమ్ మానేసి నన్ను కిందపడేస్తాయోననే గాబరా మరో వేపు.. నాకు నేనుగా ఆపేస్తే సీనియర్స్ ఏమంటారో అని భయం మరోవేపు తినేస్తుండగా ఇక చేయలేక సంశయిస్తూనే ఆపేశాను.
అదుగో అలాంటి విపత్కరమైన పరిస్థితులలో మొదటిసారి విన్నాను Elvis Presley పేరు
“ఇక చాలులేగానీ నీకు ఎల్విస్ ప్రెస్లీ తెలుసారా ?” పక్కనున్న మరో సీనియర్ అడిగారు.
“తెలీదు సార్.. ఎవరు సార్ ఆయన ?”
“కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్ రా.. మహానుభావుడు చచ్చిబ్రతికిపోయాడుకానీ తను నీ రాక్ అండ్ రోల్ డ్యాన్స్ చూసుంటే ఇప్పుడు గిటార్ తీగల్తో ఉరేసుకుని మరీ చచ్చిపోయేవాడు.. ఇంకెప్పుడు ఎవరన్నా అడిగినా చేయబాక అంతగా అంటే నాపేరు చెప్పి ఆసార్ చేయద్దన్నారని అని చెప్పు.. ఇక పో రూంకి” అన్నారు.
ఎల్విసో ఎవరో మహానుభావుడు..” పైనెక్కడున్నావో కానీ నన్ను ర్యాగింగ్ నుండి రక్షించినందుకు నీకు థ్యాంక్స్ బాసు” అని మనస్ఫూర్తిగా చెప్పుకుని బ్రతుకుజీవుడా అనుకుంటూ సంధించిన బాణంలా ఒక్క పరుగులో వెళ్ళి రూంలో పడ్డాను.
కట్ చేస్తే...
నేను అమెరికా వెళ్ళిన మొదటి రోజులు.. అట్లాంటాలోని ఒక థియేటర్ లో టాంహ్యాంక్స్ నటించిన కాస్టెవే(The Castaway) సినిమా చూస్తున్నాను. సినిమా మొదట్లోనే చాలా వైవిధ్యమైన గొంతుతో “I am in Love” సాంగ్ ప్లే అవుతుంది నా పక్కన కూర్చున్న నేస్తం తన కాలు మీద దరువేస్తూ పాటను ఎంజాయ్ చేస్తున్నాడు. “ఇదేంపాట బాస్ నీకు తెలుసా ?” అని అడిగాను.. “ఏల్విస్ తెలీకపోవడమేంటి సూపర్ సాంగ్ అసలు.. ఇంటికెళ్ళాక వినిపిస్తాను లే..” అని చెప్పాడు. అదే సినిమాలో మరోచోట ఒక చిన్న పిల్లవాడికి సిడి ప్లేయర్ బహుకరిస్తూ “Listen to Elvis Presley’s CDs.. 50 million fans can’t be wrong” అని అంటాడు హీరో.. ఇంటికి వచ్చి కాస్త రీసెర్చ్ చేశాక ఆమాటలు చాలా కరెక్ట్ అనిపించింది.
Elvis Presley గురించి అప్పుడు మరికొంత తెలిసింది కానీ అప్పటికి ఇంకా ఇప్పటంతగా అంతర్జాలం మరియూ యుట్యూబ్ ప్రచారంలోకి రాలేదు కనుక కేవలం ఫ్రెండ్స్ దగ్గరో లేక లైబ్రరీలో కలెక్ట్ చేసిన సిడిలూ గట్రా వినేవాడ్ని తర్వాత వీడియోలు కూడా చూడగలిగే అవకాశం వచ్చింది. గమ్మత్తైన స్వరంతో ఉర్రూతలూగించే స్వరాల్తో స్ఫురద్రూపంతో ఆకట్టుకునే ఎల్విస్ కు 50 మిలియన్ ఫ్యాన్స్ పెద్ద నంబరేమీ కాదు అనిపించింది. తన సంగీతం ఇప్పుడున్న ప్రసారమాధ్యమాల నడుమ ఐతే మరింతమందిని చేరుకుని ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పొంది ఉండేదని అనిపించింది. తన రూపమే మెస్మరైజింగ్ ఐతే కొన్నిపాటలకు సింపుల్ గా కులుకుతూ చేసే డ్యాన్స్ మరికొన్ని రాక్ సాంగ్స్ కు మనిషి అంతా చిత్రవిచిత్రంగా కదిలిపోతూ చేసే డ్యాన్స్ ఆకట్టుకుంటుంది. మన షమ్మీకపూర్ గారి డ్యాన్సులు చాలావాటికి ఎల్విసే పెద్ద ప్రేరణ అనుకుంటాను.
జనవరి 8th ఎల్విస్ ప్రెస్లీ జయంతి(పుట్టినరోజు) సంధర్భంగా శ్రద్ధాంజలిఘటిస్తూ ఈరోజు ఈటపా.. ఇదికాక రేపటినుండి ఒక వారం పాటు నా సరిగమల గలగలలు బ్లాగ్ లో నాకు పరిచయమున్న ఎల్విస్ పాటలలో నాకు బాగా నచ్చిన కొన్ని పాటలు లిరిక్స్ తో సహ పరిచయం చేద్దామని అనుకుంటున్నాను మీరూ ఆబ్లాగ్ లో చూసి/విని ఆనందించండి.
ఈ రోజు ప్రచురించేలా ఈ టపా ముందే స్కెడ్యూల్ చేయడమైనది. మరో రెండు రోజులు నాకు పరిమితమైన నెట్ యాక్సెస్ ఉండటం వలన వ్యాఖ్యలకు జవాబివ్వడం ఆలశ్యమవ్వవచ్చు కనుక వ్యాఖ్యాతలకు ముందస్తు ధన్యవాదాలు.
మంగళవారం, జనవరి 04, 2011
హాస్టల్ - 8 (అనగనగా ఓ రాత్రి!!)
“అవునంటరా మొన్న క్యాంటీన్ లో పేపర్ లో చూశాను ఏదో కొత్త సౌండ్ సిస్టం అన్నారు అదేంట్రా..” అడిగాను నేను.
“6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ బే, అదికూడా తెలియదు సినిమా చూట్టానికి రెడీ ఐపోయాడు..” నవ్వుతూ అంటూ ఇంకో పక్కనుండి బాజీ గాడు ఓ టెంకిజెల్ల ఇచ్చాడు.
“తెలుసా సినిమాలో బస్సు కుడిపక్కనుండి ఎడంపక్కకు మన వెనకగా నిజంగా వెళ్తున్నట్లు అనిపిస్తుందంట.. ఇలాంటి ఎఫెక్ట్స్ ఇంకాబోలెడంట..” అంటూ భరత్ కంటిన్యూ చేశాడు.
ఆరోజే రిలీజ్ అయిన రామ్ గోపాల్ వర్మ “రాత్రి” సినిమా గురించి మా డిస్కషన్.. శివ, క్షణంక్షణం ప్రభావంతో వర్మ సినిమాలు అంటే మాస్టర్ పీస్ లు అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చేసిన నాకూ భరత్ గాడికీ ఎలాగైనా ఆ రోజే ఆ సినిమా చూసేయాలని ఉంది. కానీ మా కాలేజ్ లో ఆదివారం తప్ప మధ్యలో ఔటింగ్ సంపాదించడమంటే చాలా కష్టమైన పని, అలాగని ఎవరూ వెళ్ళరు అని కాదు కానీ కాస్త బలమైన కారణం ఉండాలి.
“వార్డెన్ ని మ్యానేజ్ చేసి డిన్నర్ అయ్యాక గోడదూకి వెళ్దాంరా, మనకి దగ్గరలో అంటే కామయ్యతోపులో ఆడుతుంది.. సెకండ్ షోకి అందుకోవచ్చు” మా భరత్ గాడు తీర్మానించేశాడు.
“ఒద్దురా అది చాలా రిస్క్ దొరికితే వీపంతా వాతలు తేల్తాయ్.. అదీకాక సౌండ్ కోసం చూడాలంటే రాజ్/యువరాజ్ లోనే చూడాలి, దగ్గరలోని లోకల్ హాళ్ళలో ఐతే అంత సీన్ ఉండదు చూట్టం వేస్ట్..” అంటూ నేను వాడి తీర్మానాన్ని వీటో చేసేశాను. దెబ్బలుతింటామన్న భయంకన్నా A.O. గారి దగ్గర ’రాముడు మంచి బాలుడు’ అని నాకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుద్దని నా బాధ.
ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తూ మెల్లగా క్లాసులకి వెళ్ళిపోయాము, నేను క్లాస్ లో కూర్చున్నానన్నమాటే కానీ ఆలోచనలన్నీ వర్మ చుట్టూ రాజ్/యువరాజ్ లోఆడుతున్న రాత్రి సినిమా చుట్టూ తిరుగుతూ ఉన్నాయ్. మధ్య మధ్యలో శివలోంచీ క్షణంక్షణంలోంచీ కొన్ని సీన్స్ నామెదడులోంచి ఎదురుగా ఉన్న బ్లాక్ బోర్డ్ మీదకి ప్రొజెక్ట్ ఐ అక్కడ రన్ అవుతున్నాయ్... ఇంతలో రెండుకళ్ళమధ్య ముక్కుదూలం మొదట్లో మంటగా అనిపించింది. “ఛస్ దీనెంకమ్మ కళ్ళజోడు దీనివల్ల ఉపయోగమేమో కానీ దీని బరువుకి వాచిపోతుంది” అని దాన్ని తిట్టుకుంటూ తీసి టేబుల్ మీద పెడుతూ యధాలాపంగా దానికేసి చూశాను... అంతే ఫ్లాష్ వెలిగింది.. దానితో పాటే నా మొహంలో కూడా వెయ్యిమతాబాల వెలుగునిండింది. హుర్రే !! అనుకుని ఆ ఐడియా మావాళ్లతో షేర్ చేస్కోడానికి ఎప్పుడెప్పుడు లంచ్ బ్రేక్ వస్తుందా అని ఎదురు చూడటం మొదలెట్టాను.
అప్పట్లో నాకు భయంకరమైన షార్ట్ సైట్ ఉండేది దాన్ని కాంపెన్సేట్ చేయడానికి -16D పవర్ ఉన్న కళ్ళద్దాలు వాడేవాడిని. ఒకో కంటిఅద్దం ఇంచుమించు ముప్పావు అంగుళం మందం ఉండేది. నాజూకుగా ఉండే మెటల్ ఫ్రేం వాటికి సరిపోదని బరువైన ఆ అద్దాలను ఆపలేదనీ చెప్పి పైన ఫొటోలో చూపించినలాంటి వెడల్పాటి షెల్ ఫ్రేం వేసేవాడు మా ఆప్టీషియన్. ఈ ఫ్రేం మధ్యలో ఒక గాడి ఉంటుంది అద్దం చుట్టూమధ్యలో కోసుగా చేసేవాడు దాన్ని తీసుకువెళ్ళి ఆ గాడిలో అమరేలా బిగిస్తే అద్దం కదలకుండా ఫ్రేంలోనే ఉంటుంది. ఆ రోజు నేను కళ్ళద్దాలు తీసి డస్క్ మీద పెడుతున్నపుడు ఒక మూలన అద్దం ఆఫ్రేంగాడిలోనుండి బయటకు వచ్చి కనిపించింది. చాలా పాతబడడం వల్ల ఫ్రెం లూజ్ అయ్యి ఇలా అప్పుడప్పుడు జరుగుతుంది దాన్ని మళ్ళీ జాగ్రత్తగా లోపలికి నెట్టేసి వాడుకునే వాడ్ని. కానీ ఆ రోజు జాగ్రత్తగా కొంచెం ఫోర్స్ ఉపయోగించి అద్దానికీ ఫ్రేంకి డామేజ్ జరగకుండా అద్దాన్ని ఫ్రేం నుండి విడదీయగలిగాను. కొద్ది ప్రయత్నంతో దాన్ని తిరిగి యధా స్థానానికి చేర్చగలనని నిర్ధారించుకున్నాక మావాళ్లకి విషయం చేరవేశాను.
సరే ప్లాన్ వర్కవుట్ అవ్వాలంటే ముందుగా ఊడదీసిన అద్దాన్ని దాచిపెట్టాలి, నా ట్రంక్ లో దాస్తే పొరపాటున మా A.O. కి డౌట్ వచ్చి వెతికిస్తే దొరికిపోతాం కనుక మా రూముకు నాలుగు రూముల అవతల మాకంతగా పరిచయంలేని ఒకడ్ని పట్టుకుని వాడి ట్రంకు పెట్టెలో బట్టలమధ్య ఆ అద్దాన్ని బద్రంగా దాచిపెట్టాను. ఆపై సాయంత్రం 4గంటలకి క్లాసులు అవ్వగానే ఒకఅద్దంలేని ఆఫ్రేంతో మా A.O. గారి దగ్గరకు వెళ్ళి మెట్లుదిగుతుంటే కళ్ళద్దాలు జారిపడిపోయాయనీ ఒక అద్దం పగిలిపోయిందనీ.. అది లేకపోతే బొత్తిగా కనపడదు కనుక వెంటనే విజయవాడ వెళ్లి అద్దం వేయించుకుని వస్తాను అని చెప్పాను. మనకున్న మంచి ఇమేజ్ మూలంగా మా సార్ వెంటనే నమ్మేసి ఎక్కువ ప్రశ్నలు అడగకుండానే నాకూ ప్లస్ నాకుకనపడదు కనుక నాకుతోడుగా ఉండటానికి మా భరత్ గాడికీ పర్మిషన్ ఇచ్చేశారు. వెంటనే ఏమాత్రం ఆలశ్యం చేయకుండా దాచిపెట్టిన అద్దం తీసుకుని దాన్ని దాన్ని కొత్తగా కనిపించేలా శుబ్రంగా సబ్బునీళ్ళతో కడిగి అంచులవెంబడి మెరిసేలా పేపర్ తో పాలిష్ చేసి దాన్ని జోబులో వేసుకుని మళ్ళీ ఎవరి కంటపడకుండా వెనకదారిగుండా బయటపడి రోడ్డెక్కాము. థియేటర్ కి వెళ్ళేవరకూ మాతెలివితేటలకి మేమే నవ్వుకుంటూ జోకులేసుకుంటూగడిపాం..

అప్పటివరకూ సగటు సూపర్ హీరోల తెలుగు సినిమాలు తప్ప హిందీ సినిమాలతో కూడా అంతగా పరిచయంలేని నాకు హాలీఉడ్ హార్రర్ సినిమాల గురించి తెలిసే అవకాశం అస్సలు లేదు. దానివల్ల ఆ సినిమా చూస్తున్నంత సేపు పూర్తిగా వర్మ మాయలో పడిపోయాను. ఎక్కడా జుగుప్సకు తావివ్వకుండా సినిమా అంతా నటీనటుల ముఖ కవళికలు, సర్ ప్రైజ్, సౌండ్, కెమెరా యాంగిల్స్ పైనే ఆధారపడి ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చాడు. గడియారం టిక్ టిక్ సౌండ్, లారీ డోర్, సరిగా మూసుకోని బీరువా తలుపు, మామ్మగారి తెల్లజుట్టు తనుచేసే జపం, తుప్పుపట్టిన స్టోర్ రూం తలుపు చేసే కిర్రు శబ్దాలు, వంటింట్లో మిక్సీ, బాండీలో వేసే పోపూ ఇవీ ఇతను మనని భయపెట్టడానికి ఎంచుకున్న మార్గాలు. వాటినే హఠాత్తుగా వినిపించడం చూపించడం ద్వారా ఉలికిపడేట్లు చేస్తాడు. రేవతి కళ్ళగురించి చెప్పుకుని తీరాలి తను కంటిచూపు తోనే చంపేసింది ఆ సినిమాలో, తనతోపాటు చిన్నపిల్లాడి పెద్ద పెద్ద కళ్ళు కూడా భయపెడతాయ్. అలా మూడు ఆశ్చర్యాలు ఆరు భయాలతో సినిమా చూసి బయట పడ్డాం.
అర్ధరాత్రి పన్నెండుగంటలు మా మిషన్ - విజయవాడ సెంటర్ లోఉన్న రాజ్/యువరాజ్ నుండి బందరురోడ్లో ఊరిపొలిమేరలకు ఆవలనున్న ఈడ్పుగల్లులొని మా హాస్టల్ కు చేరుకోవడం. ఫిబ్రవరి నెల చలి ఇంకా తగ్గక పోవడంతో ఊరు త్వరగా సద్దుమణిగింది నిర్మానుష్యమైన వీధులు.. కన్నుపొడుచుకున్నా కానరాని చీకటి.. నిశ్శబ్దంగానే ఉన్నట్లున్నా ఏవో చిత్ర విచిత్రమైన శబ్దాలు.. ఎలాగో కష్టపడి బెంజి సెంటర్ వరకూ చేరుకున్నాం అక్కడ చాలా సేపు ఎదురు చూశాక మా కాలేజ్ కి ఒక కిలోమీటర్ ఇవతల వరకూ వెళ్ళే ఒక వ్యాన్ దొరికింది వాడ్ని బతిమిలాడి ఎలాగో అక్కడివరకూ వెళ్ళాం. వాడుమమ్మల్ని మెయిన్ రోడ్ లో దింపేసి లోపలికి వెళ్ళిపోయాడు.
అక్కడ ఒకే ఒక చిన్న టీకొట్టు తప్ప ఇంకేమీ లేవు చుట్టూ పొలాలు చిమ్మ చీకటి.. కీచురాళ్ళ రొదలు.. అప్పటివరకూ సినిమాలో చూపించిన సన్నివేశాలన్నీ కళ్ళముందు కనిపించడం మొదలెట్టాయి పెద్ద చెట్టుని చూసినా భయమే.. కదిలే చిత్తుకాయితాన్ని చూసినా భయమే.. ఆ ప్రాంతంలో మేం ఇద్దరం తప్ప ఒక వాహనం కానీ మరో మనిషి కానీ ఎవరూ లేరు. కాసేపు ఎదురు చూశాక నడవాలి అని నిర్ణయించుకున్నాము. ఒకళ్ళ చేతులు ఒకళ్ళుపట్టుకుని వణుకుతూ భయం భయంగా చుట్టూ ఒకటికి పదిసార్లు చూసుకుంటూ ఎలా హాస్టల్ కి చేరుకున్నామో ఆ దేవుడికే ఎరుక. క్షేమంగా హాస్టల్ కు చేరాక ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ హార్రర్ సినిమాలకి సెకండ్ షోలకి వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకుని నిద్రోయాం :-) మొదలే భయస్తుడినైన నాకు తెల్లారేసరికి వచ్చిన జ్వరం తగ్గడానికి రెండ్రోజులు పట్టింది.
నేను ???

- వేణూశ్రీకాంత్
- అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.