గురువారం, డిసెంబర్ 31, 2009

ఎత్తరుగుల అమెరికా వీధి - ఈనాడు కథ

"ఈనాడు" తెలుగు వార్తాపత్రికల పాఠకులకు చిర పరిచితమైన పేరు. ఈ దినపత్రిక ఆదివారం అనుబంధం ప్రచురించటం మొదలు పెట్టాక, నిజం చెప్పొద్దూ వారపత్రిక ప్లస్ దినపత్రిక కలిపి ఒకే రేటుకు వస్తుంది అనిపించింది. ఒకప్పుడు ఈ ఆదివారం అనుభందం లో నేను తరచుగా చదివేది బాలవినోదిని, కథ, ఇది కథకాదు, పదవినోదిని(cross word puzzle). కానీ రాను రాను నాకు కవర్ పేజి వెనక వేసే తారల విశేషాలు ప్రత్యేకమైన బొమ్మలుకూడా వదలకుండా మొదటి పేజి లోని ’మాయా’లోకం నుండి చివరి పేజీ లోని ’పదవినోదిని’ వరకూ ప్రతి అక్షరం చదవడం అలవాటు అయింది. ఎన్ని చదివినా అప్పటినుండి ఇప్పటివరకు చదవకపోతే మిస్ అయ్యేంతగా అలవాటైనవి మాత్రం కథ, శ్రీధర్ రాజకీయ కార్టూన్స్, బాలు కార్టూన్. వీటిలో ఈ మధ్య కాలంలో వస్తున్న కథలు అన్నీ చాలా వరకు నిరాశ పరుస్తూనే ఉన్నాయి.

అయినా ఎక్కడో ఓ మంచి కథ దొరకకపోతుందా అనే ఆశతో అలా ప్రతివారం చదువుతూనే ఉన్నాను. అలాంటి టైం లో మొన్న ఆదివారం డిశంబర్ 27 సంచికలో ఓ అందమైన కథ నా కంట పడింది. చదువుతుండగా ఆహా అనిపించింది చదివిన వెంటనే ఓహో అనిపించింది. నాకు పన్నెండు ఇళ్ళు వద్దులే బాబు అటువంటిదే ఒక ఇల్లు ఉన్నా చాలు అనిపించింది. నా ఊహలను ఈ రచయిత ఎలా చదివేశాడా అనిపించింది. వెంటనే ఆ హీరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేయాలని అనిపించింది. మనసుండాలే కానీ అటువంటి జీవితం ఎప్పటికైనా ఆచరణ సాధ్యం కాక పోతుందా అనిపించింది.

ఇంకా... పెరటి గుమ్మానికి చేరగిలపడి నేను కూర్చుంటే మొదటి మెట్టుపై తను కూర్చుని మడిచిన నా కాళ్ళపై అలవోకగా వాలి నా మోకాళ్ళ పై తన తల ఆన్చిన నా శ్రీమతితో కలిసి, జాబిలి తో ఆటలాడుకుంటున్న మేఘాలనూ, పెరట్లోని మందారాల వయ్యారాలనూ పరికిస్తూ, నైట్ క్వీన్, సన్నజాజుల పరిమళాలు మట్టివాసనతో కలిసి మైమరపిస్తుంటే ఆస్వాదిస్తూ, తనకి నా స్వరంతో ఈ కథ చదివి వినిపించాలని అనిపించింది. అదిగో అందుకోసమే ఆ అనుభూతి కోసమే భద్రంగా ఈ కథను నా బ్లాగులో పదిల పరచుకుంటున్నాను.

ఇంత మంచి కథను రాసిన వట్టికూటి చక్రవర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కథకు కేవలం  కన్సొలేషన్ బహుమతి తో సరిపెట్టినందుకు ఈనాడు జడ్జిలపై కాస్త కోపం వచ్చినా.. అసలు పోటీ అంటూ పెట్టి మంచి కథలు రాబట్టినందుకు ఈనాడు ఆదివారం బృందాన్ని కూడా అభినందిస్తున్నాను. ఇంతకీ ఈ కథ మీరు చదివారా... ఒకవేళ చదవకపోతే వెంటనే చదివేయండి మరి. పనిలో పనిగా వైవిధ్యభరితమైన కథ అంటూ ఈ కథకు నెమలికన్ను మురళి గారు రాసిన పరిచయాన్ని కూడా ఇక్కడ నొక్కి చదివేయండి. 

మిత్రులు అందరికీ 2010 నూతన సంవత్సర శుభాకాంక్షలు, కాస్త ముందుగా :-). నూతన సంవత్సర వేడుకలను మనసారా ఆస్వాదించండి.


27 కామెంట్‌లు:

 1. ఈనాడు ఆదివారం అనుబంధంతో నాకు కూడా చక్కని బంధం వుంది. కార్టూన్స్, బాలు చెప్పే మాట, తారల విశేషాలు క్రమం తప్పక చదివేవాడిని.
  ఈ కధ గురుంచి మురళి గారి టపా చూసాను. కధలు చదివే అలవాటు లేకపోవడంతో బద్దకించాను. ఇంత మంది జడ్జిలపై ఘరం ఘరంగా వున్నారు అంటే, ఇందులో ఏదో ఉందనమాట.
  ఇక్కడే అందించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 2. నిజం వేణు గారూ, రొటీన్ కథల మధ్య ఓ వైవిద్యభరితమైన కథ చూడగానే భలే సంతోషంగా అనిపించింది.. అన్నట్టు మీ కల త్వరలోనే నిజమవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

  రిప్లయితొలగించండి
 3. మీ వూహ కలకే కాక వాస్తవంలోనూ మీకు అనుభవమవ్వాలని దీవిస్తూ...

  రిప్లయితొలగించండి
 4. దీన్ని బట్టి మీకేమర్థమయిందీ..? న్యాయనిర్ణేతలది.. ఏ కథకు ఏ బహుమతివ్వాలో కూడా నిర్ణయించలేని న్యాయం!

  కథాంశం ఎంత బావుంది! అది పక్కన పెడితే శైలి? ఎంతో సంక్లిష్టంగానే అనిపిస్తూ మరో పక్క హాయిగా సేదదీరినట్లుంది కాదూ!

  రెండో బహుమతి వచ్చిన కథ చదివారా అసలు? "నీతి కథలు"మాత్రమే ప్రచురించడానికి అలవాటు పడిపోయింది ఈనాడు ఆదివారం. అసలు ఆ వూపులో ఈ కథ ఎన్నిక కావడమే ఆశ్చర్యం నాకు!

  అన్నట్లు వేణూ, మీ ఊహ చాలా బావుంది. త్వరగా నిజం చేసుకునే ఏర్పాట్లు చూడండి మరి.

  రిప్లయితొలగించండి
 5. నాకు పన్నెండు ఇళ్ళు వద్దులే బాబు అటువంటిదే ఒక ఇల్లు ఉన్నా చాలు అనిపించింది :)

  మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కూడా అస్సలు రోడ్డుమీదకి రాకుండా ఇళ్ళన్నీ తిరిగేయొచ్చు...పెద్ద మండువా ఇళు, ఎత్తైన అరుగు, మందార మొక్కలు, మొత్తం అలికి ముగ్గు వేసిన వాకిలి, ఎత్తైన గడప, అందంగా చెక్కిన పేద్ద పేద్ద తలుపులు...వెళ్ళింది రెండు, మూడు సార్లే ఐనా తలుచుకున్నది ఎక్కువే...
  ఈ కధ తో మళ్ళీ అక్కడికి ఓసారి వెళ్ళి వచ్చాను, మా కాకినాడ ప్రస్తావనతో మళ్ళీ చినప్పటి రోజులన్ని గుర్తొచ్చాయి...ఈనాడు కధలను ప్రతివారం చదువుతాను, కానీ ఈ వారం జ్ఞాపకాలలో మునిగాను...

  రిప్లయితొలగించండి
 6. ఈనాడు కథలు చదవటం మానేసి ఏళ్లయింది - సరుకు లేనివైపోయి. మీ రికమండేషన్‌తో ఈ వారం కథ చదివాను, ఇప్పుడే. భావుకత దట్టించిన నాస్టాల్జియా కథ. పేరు వినగానే కాన్సెప్ట్ అర్ధమైంది. మొదటాఫ్ అంతా గజిబిజి గందరగోళం బిల్డప్పులతో సరి పెట్టాడు రచయిత. చిట్టి కథకి ఆ స్థాయిలో కారక్టర్ ఇంట్రడక్షన్లూ, ఎస్టాబ్లిష్‌మెంట్లూ, ప్రకృతి వర్ణనలు, వాతావరణ నివేదికలు అవసరమా!

  మొత్తమ్మీద - ఈ కాలంలో సగటు ఎన్నారైలు రాసే అన్ని కథల్లానే ఉంది ఇదీ. విభిన్నత ఏముందీ? కన్సొలేషన్ ప్రైజూ ఎక్కువే.

  (మీకందరికీ నచ్చింది, నాకు నచ్చలా. నచ్చితేనే వింతని మీలో కొందరికి తెలుసనుకోండి. పుర్రెకో బుద్ధి కదా :-) )

  రిప్లయితొలగించండి
 7. హి హీ అబ్రకదబ్ర గారు, నా పుర్రెదీ మీ బుద్ధే. చాలా వరకు మీ కామెంట్తో ఏకీభవిస్తున్నాను. నాకు కూడా కథ లో భావుకత్వం పాళ్ళు చాలా ఎక్కువైనట్టు అనిపించింది (బహుసా ఒక పదేళ్ళ కితం నచ్చి ఉండేదేమో). కాని శైలి బాగుంది.

  రిప్లయితొలగించండి
 8. "మొదటి పేజి లోని ’మాయా’లోకం నుండి చివరి పేజీ లోని ’పదవినోదిని’ వరకూ ప్రతి అక్షరం చదవడం అలవాటు అయింది"..నేనూ నాతోపాటు మా పిల్లలూ..మీ బాపతే.

  ఈ కథ మాత్రం నాకంత గొప్పగా ఏం అనిపించల..కాని మీ ఊహ ఉంది చూసారూ..అది త్వరలోనే తీరాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 9. ధన వ్యాఖ్యకు నెనర్లు. హ హ అందరు అనగానెందరు? నేను, మురళి ’ఇందరే’ కదా ? ఇంకెవరైనా చెప్పారా నే మిస్ అయ్యానా.. ఏం లేదండి అసలు ఆకట్టుకోని కథల మధ్య ఇది కనిపించేసరికి కాస్త ఉత్సాహం అంతే..

  ఫణిగారు నెనర్లు. మరిచదివారా.. జడ్జిలపై గరం గరం ఏమీలేదండీ.. అభిప్రాయ భేదాలు మాత్రమే, వాళ్ళు గొప్ప కథ అని తేల్చినవి నాకు అంతగా నచ్చలేదు, ఈ కథ నచ్చింది అంతే తేడా.

  మురళి గారు నెనర్లు. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు.

  ఉష గారు నెనర్లు, మీ దీవెనలకు ధన్యవాదాలు.

  సుజాత గారు నెనర్లు, నిజమేనండీ ఈ ఊపులో కథ ఎన్నిక కావడమే ఆశ్చర్య పడాల్సిన విషయం. అలాగే ఊహను నిజం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తాను :-)

  నేను గారు నెనర్లు. రెండు మూడు సార్లైనా మీ అమ్మమ్మగారి ఇంట అంత అందమైన ఙ్ఞాపకాలు మీ సొంతం చేసుకున్నందుకు ధన్యజీవులండీ. అలా ఙ్ఞాపకాలలోనూ ఊహల్లోనూ పడేసినందుకే నాకు ఈ వారం కథ అంతగా నచ్చింది.

  రిప్లయితొలగించండి
 10. అబ్రకదబ్ర గారు నెనర్లు. నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. "నచ్చితేనే వింతని మీలో కొందరికి తెలుసనుకోండి" మరే మరే :-)
  మీరే అన్నట్లు పుర్రెకో బుద్దికదా.. "రేయిని వెలిగించడానికి దేవుడు అమర్చిన దీపం జాబిల్లి.." అని ఒకరంటే "ఠాట్.. చందమామ భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం మాత్రమే అసలు దానికి వెలిగే తత్వమే లేదు" అని సైన్స్ పాఠాలు చెప్తారు ఇంకొందరు.
  గజిబిజి విషయం లో నేను కూడా మొదట హడావిడిగా చదవబోయి అలానే ఫీల్ అయ్యాను తర్వాత సర్దుకుని శైలి అర్ధం చేసుకుని మెల్లగా చదివాక బాగా నచ్చేసింది, ముఖ్యంగా కథాంశం.
  బహుశా ఆ న్యాయనిర్ణేతలు కూడా ఇలా చక్కని కథాంశంతో, భావుకత తో నింపిన పాత రకం కథలు కాకుండా మరింత నవ్యత నిండిన కథలకోసం ఎదురు చూస్తుండి ఉంటారు. అలాటి కథలనే వారు ముందు ముందు అందిస్తారు అని ఆశిద్దాం.
  సగటు యన్నారైల కథల్లానే ఉందంటారు.. హ్మ్..

  రూత్ గారు నెనర్లు, భావుకత పాళ్ళు ఎక్కువైందంటూనే బహుశా పదేళ్ల క్రితం నచ్చేదేమో అనడం interesting :-) అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  సిరిసిరిమువ్వ గారు నెనర్లు. ఈనాడు ఆదివారం సంచిక విషయంలో ఖచ్చితంగా చాలా మంది మన బాపతే ఉంటారండీ. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు, నేనూ అదే కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 11. ఈ నూతన సంవత్సరంలో మీ కల నిజమవ్వాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు !

  రిప్లయితొలగించండి
 12. శ్రీ రమణ గారి మిధునం గుర్తుకు తెచ్చినా, బాపు సినిమా గుర్తుకు తెచ్చినా నాకైతే ఈ కధ నచ్చింది.

  ప్రస్తుత పరిస్థితులలొ ఫాంటసీ గానే కనిపించవచ్చు.

  రిప్లయితొలగించండి
 13. ఈ కథ ఎలా చదవాలా అనుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా చదవగలిగాను. థాంక్యు. మీ కల నిజం చేయబోయే మీ శ్రీమతికి, మీకు నా హ్రుదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 14. పరిమళం గారు నెనర్లు. శుభాకాంక్షలకు ధన్యవాదాలు :-)

  బోనగిరి గారు నెనర్లు. నిజమేనండీ ప్రస్తుత పరిస్థితులలో ఫాంటసీగా కనిపించడంలో తప్పులేదు.

  జయగారు నెనర్లు. ఓ అవునా మీచే వెంటనే చదివించగలిగినందుకు సంతోషం, ఇంతకూ నచ్చిందీ లేనిదీ చెప్పలేదు. తప్పకుండానండీ నా జీవిత భాగస్వామికి మీ విషెస్ చూపిస్తాను. మీకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 15. మీ జీవితాన యీ వూహ వాస్తవ జీవన విన్యాసం కావాలని ఆకాంక్షిస్తూ...నూత్న వత్సర శుభాకాంక్షలతో....శ్రేయోభిలాషి ...నూతక్కి


  "పెరటి గుమ్మానికి చేరగిలపడి నేను కూర్చుంటే మొదటి మెట్టుపై తను కూర్చుని మడిచిన నా కాళ్ళపై అలవోకగా వాలి నా మోకాళ్ళ పై తన తల ఆన్చిన నా శ్రీమతితో కలిసి, జాబిలి తో ఆటలాడుకుంటున్న మేఘాలనూ, పెరట్లోని మందారాల వయ్యారాలనూ పరికిస్తూ, నైట్ క్వీన్, సన్నజాజుల పరిమళాలు మట్టివాసనతో కలిసి మైమరపిస్తుంటే ఆస్వాదిస్తూ, తనకి నా స్వరంతో ఈ కథ చదివి వినిపించాలని అనిపించిం"

  రిప్లయితొలగించండి
 16. >> "ఠాట్.. చందమామ భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం మాత్రమే అసలు దానికి వెలిగే తత్వమే లేదు" అని సైన్స్ పాఠాలు చెప్తారు ఇంకొందరు"

  రైఠో :-) నేనీ రెండో టైపు. అందుకేననుకుంటా, భావుకత మసాలా నాకంతగా నచ్చదు.

  అలాగని నేనేమీ అభావుకుడిని కాను. 'వెన్నెల్లో ఆడపిల్ల' ఎన్ని సార్లు చదివానో; చదివిన ప్రతిసారీ క్లైమాక్స్‌లో అలా జరగదేమో అన్న ఆశ్‌తో చివరిదాకా చదివి ఆశోపహతుడినవుతుంటాను.

  అన్నట్టు .. రచయిత శైలి బాగుంది. అతను భవిష్యత్తులో మంచి కథలు రాయగలడనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 17. అబ్రకదబ్ర,
  మీరు ఈనాడు ఆదివారం కథలు చదవడం మానేసి ఎన్నో ఏళ్ళయింది అన్నారుకదా! అందువల్ల రెగ్యులర్ గా వస్తున్న కథలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలీక ఇలా రాశారు మీరు. ఈ కథలో వైవిధ్యం ఏమీ లేదని మీరన్నారంటే (ఉందని ఇందరు అంటున్నపుడు)ఇక ప్రతి వారమూ వచ్చే కథలు ఏ లెవెల్లో ఉన్నాయో ఒక్కసారి ఊహించుకోండి. నేనైతే చిన్నపిల్లల పేజీ కోసమే చూస్తున్నా ఆదివారం సంచిక!

  అలాగని నేనేమీ అభావుకుడిని కాను. ....ఈ ప్రయోగమేదో బావుందే! మీరు వాడకముందే ఏదైనా కథరాసి అందులో వాడేయాలి.

  మిథునం కథతో పోల్చే కథ ఒకటి ఈ భూమ్మీద ఇంకోటి ఉంటుందని నేనొప్పుకోనంతే(నా అభిప్రాయమే ఇది)

  రిప్లయితొలగించండి
 18. హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 19. ఈ మధ్య ఈనాడు అనుబంధం తో పాటు సాక్షి అనుబంధం కూడా వదలకుండా చదవడం చదువుతున్నానండి. అది కూడా బాగుంటుంది. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 20. ఈనాడు కధల పోటీ అనగానే ఏమో అనుకున్నాను . బహుమతి ఇచ్చే లెవెల్లో కధలు లేవనీ ఏదో తప్పక ఉన్నవాటిలోంచే ద్వితీయ తౄతీయ బహుమతులు ఇస్తున్నామని వాళ్ళు ప్రకటించినప్పుడు నాకు సిగ్గేసింది( నేనేం కధ పంపలేదులెండి) వాళ్ళు బహుమతికి ఎంపిక చేసిన కధలు చదివాకా పిచ్చెక్కింది . ఇవే ఈ లెవెల్లో వుంటే ఇక మిగిలినవి ఎలా వుంటాయో అనిపించింది. కానీ చిత్రంగా సాధారణ ప్రచురాణకి ఎంపికైన కధలే వైవిధ్యంగానూ, చదవాలనిపించేలాగానూ వున్నాయి. మరి వాళ్ళు ఏ ప్రాతిపదికన కధల ఎంపిక చేసారో వాళ్ళకే తెలియాలి.

  మరో విషయవండోయ్.......కూడలిలోనూ ,జల్లెడలోనూ తప్ప ఇంకెక్కడా ఇంతవరకూ నా బ్లాగ్ కనిపించలేదు. బ్లాగ్ లిస్ట్ లో నా పేరు చేర్చినవారిలో మీరు మొదటివారు అందుకు మీకు ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 21. నూతక్కి గారు నెనర్లు. మీ ఆశీస్సులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.

  అబ్రకదబ్ర గారు నెనర్లు. నిజమే నండీ మీరు ఆ రెండో టైపు అని మాకు ముందే తెలుసు. అయినా యండమూరి అభిమానై ఆయన నవలలోని పాత్రపేరు మీ కలంపేరుగా పెట్టుకున్నా మేము మీకు అస్సలు భావుకత్వం లేదు అని ఎలా అనగలం. దీన్లో బాగా ఎక్కువైంది అని మాత్రమే అంటున్నారని అర్ధమైంది. మీ వెన్నెల్లో ఆడపిల్ల ప్రహసనం బాగుంది :-) అభావకుడు పద ప్రయోగం ఇంకా బాగుంది.

  సుజాత గారు మిథునం విషయం లో కరెక్ట్ గా చెప్పారు. అయినా రమణ గారిని అందుకోడమా !!

  మంచుపల్లకీ గారు నెనర్లు, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  శిశిర గారు నెనర్లు, సాక్షి పుస్తకం ఇంకా నాకు అంటుకోలేదండి :-) మొదలెట్టాలి మెల్లగా..

  లలిత గారు నెనర్లు, ఈ సారి న్యాయనిర్ణేతల నిర్ణయం చాలా మందిని నిరాశ పరచినట్లు ఉందండీ. నిన్ననే తృష్ణ గారి పుణ్యమా అని మీ కెవ్వ్ కేక టపా చదివానండీ, భవిష్యత్తులో అలాటి టపాలు మిస్ అవకూడదని వెంటనే చదవేయాలని వెంటనే నా బ్లాగ్ లిస్ట్ లో కలిపేశాను.

  మహేష్ గారు నెనర్లు. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 22. నన్ను కూడా అవతలి వర్గం వైపు వేసుకోండి వేణూ.. భావుకత అంటే బోల్డంత ఇష్టమున్నా ఎందుకో ఈ కధ నచ్చలేదు.. మొన్న మురళీ గారి బ్లాగులో కూడా ఇదే మాట చెప్పేసాక మళ్ళీ నామీద నాకే అనుమానమొచ్చి ఇంకో రెండుసార్లు చదివాను.. ప్చ్.. లాభం లేకపోయింది :(

  రిప్లయితొలగించండి
 23. నెనర్లు నిషిగంధా... మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నాను. మీకూ నచ్చలేదంటే ఆసక్తికరమైన విషయమే :-)

  రిప్లయితొలగించండి
 24. వేణు నాకు అంత నచ్చలేదు ఈ కధ. మరి కల్పానికం అనిపించింది. అడగగానే వుద్యోగాలు ఇచ్చెయ్యటం 12 ఇళ్ళు బాగానే బోర్ కొట్టింది. కధ మాట ఎట్లా వున్న మీ కల మాత్రం ఫలించాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నా.

  రిప్లయితొలగించండి
 25. భావన గారు నెనర్లు. హ హ పన్నెండు ఇళ్ళు గురించి మీరు చెప్పింది నిజమే :-)

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.