"A picture is worth a thousand words", ఏదైనా ఒక విషయాన్ని వేయి మాటల్లో కన్నా ఒక్క చిత్రంతో హృదయానికి హత్తుకునేలా చెప్పవచ్చు అన్నది జగమెరిగిన సామెత. అలాంటి చిత్రాల(scenes) సమాహారమైన చలనచిత్రానికి కొన్ని శక్తివంతమైన మాటలతో కూడిన నేపథ్యసంగీతం తోడైతే చెప్పవలసిన విషయం మరింత సూటిగా ప్రేక్షకునికి చేరుతుంది కదా, అదే మర్యాద రామన్న సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ప్రతి ఫ్రేమ్ లోనూ రాజమౌళీ అతని టెక్నికల్ టీం, వాళ్లలో కూడా ముఖ్యంగా కీరవాణి కనిపించారు. అలా అని సునీల్ యాక్షన్ ని తీసివేయడం నా ఉద్దేశ్యం కాదు, అతని సాధారణమైన మ్యానరిజమ్స్ నుండి బయటికి వచ్చి వైవిధ్యమైన నటన కనబరిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటివరకు తను నేర్చుకున్న నటన మర్చిపోయి ఫ్రెష్ గా రాజమౌళి స్కూల్ లో మళ్ళీ నేర్చుకున్నాడా అని అనిపించింది.
ప్రాణాలిచ్చే మమతల్లో.. ప్రాణం తీసే పంతాల్లో..
నేలను చిందిన నెత్తురు చుక్కల లెక్కలు తేలని ఇతిహాసాలు...
అరెరెరె అరెరెరె అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..
ఈ సినిమా పాటలు విన్నపుడు రెండు పాటలు తప్ప అంత పెద్దగా ఆకట్టుకోకున్నా సినిమా చూసినపుడు సంధర్బోచితంగా ఉన్న ప్లేస్మెంట్ మరియూ రాజమౌళి చిత్రీకరణ తోడై దదాపు అన్ని పాటలు బాగున్నాయ్ అనిపించాయ్. "అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది", "తెలుగమ్మాయి" మంచి మెలోడీని అందిస్తే "రాయె రాయె" మాస్ ఫీల్ ను, "ఉద్యోగం ఊడిపోయింది" సరదాగానూ "పరుగులు తీయ్" స్ఫూర్తిదాయకంగాను ఉన్నాయి. ఈ పరుగులు తీయ్ పాటలోనూ చేజ్ లో నేపధ్యానికి వాడిని "హరోం హర హర హర హర" కూడా చాలా మంచి ఫీల్ ఇచ్చింది. ఇక సినిమా అంతా అక్కడక్కడ నేపధ్యానికి వాడిన చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాట సినిమా ఫీల్ ను ఎలివేట్ చేయడానికి ఎంతగా ఉపయోగపడిందో ఈ చిన్న క్లిప్ లో మీరే చూడండి.
ఇంకా ఇదే కాక "చెట్టులెక్క గలవా" పాటకు పేరడీగా మధ్యలొ వచ్చే ఈ చిన్న బిట్ సాంగ్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. మొత్తం మీద ఈ సినిమా విజయంలో సింహ బాగం కీరవాణికే సొంతం అనడం లో ఏమాత్రం సందేహం అక్కర్లేదు అనిపిస్తుంది.
ఇక ఈ సినిమా లో హాస్యం విషయానికి వస్తే సైకిలు కి మాటలు నేర్పిన రవితేజ తన వంతు వినోదాన్ని అందించారు. ఎక్కడా వెకిలి హాస్యం, చొక్కాలు చింపు కోవడం, అల్లరి చేయడం లాంటివి లేకుండా కేవలం హీరో భయం లోనుండి అమాయకత్వం నుండి చక్కని హాస్యాన్ని సృష్టించారు. సినిమా ట్రైలర్స్ లోనే రాజమౌళి ఇతర సినిమాల హీరోలను చూపించి చివరిలో సునిల్ వచ్చి "నేను అలాంటోడిని కాదండి" అని అంటూ ప్రేక్షకుల అంచనాలను సరిగా సెట్ చేశారు. అలానే హీరో ఇంట్రడక్షన్ సీన్ ఇంచుమించు పోకిరిని తలిపించినా సునీల్ మొహంలో హీరోయిజం కన్నా భయవిహ్వలుడైనట్లు ముఖకవళికలు చూపించి ఒక కంటిన్యుటీ మెయింటెయిన్ చేశారు. కథా రచయిత కాంచి ఓ చిన్న పాత్రలో నవ్వులను పంచారు. రావు రమేష్ ఒక్క సీన్ కే పరిమితమైనా సినిమాకు చాలా ముఖ్యమైన సీన్ లో చాలా చక్కగా నటించి ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ పాత్ర కూడా బాగుంది. అవసరానికి మించకుండా సినిమా నిడివి రెండుగంటలు మాత్రమే ఉంచడం కూడా చెప్పుకోవలసిన విషయం, సినిమా ఎక్కడా బోరు కొట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మొత్తం మీద మీరు ఇంకా ఈ సినిమా చూడనట్లైతే వీలైనంత త్వరగా కుటుంబ సమేతంగా వెళ్ళి చూసేయండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.