
చికాగో నుండి ఫ్రాంక్ఫర్ట్ కు చేసిన ప్రయాణం కన్నా అక్కడ నుండి హైదరాబాద్ వరకు చేసిన ప్రయాణం కాస్త సౌకర్యవంతంగా అనిపించింది. ప్రయాణం లో రెండు సినిమాలు కవర్ చేసేసాను. విమానం ఎక్కే సమయం లో ప్రవేశ ద్వారానికి దగ్గరగా వార్తా పత్రికలు, వార, మాస పత్రికలు ఉంచారు కావాలి అనుకున్న వారు వాటి నుండి ఏదైనా ఎన్నుకుని ఉచితంగా ప్రయాణం లో చదువుకోడానికి తీసుకు వెళ్ళవచ్చు. నాకు ఇండియాటుడే మరో ఇండియన్ న్యూస్ పేపర్ కనిపించేసరికి సరె అని అవి అందుకుని లోపలికి వెళ్ళాను. నా సీటు దగ్గరకు చేరుకున్న వెంటనే ఆ పత్రికలు సీట్ లో పడేసి సామాను పైన పెట్టడానికి ప్రయత్నిస్తుండగానే పక్క సీట్ లో కూర్చున్న ఓ అపరిచితుడు ఆవేశంగా పేపర్ తీసుకుని ఇష్టమొచ్చిన రీతిలో నలిపేస్తూ చదవడం మొదలు పెట్టాడు. నాకు చాలా చిరాకు వేసింది నా అనుమతి అడగ లేదు కనీసం నే సీట్ లో సెటిల్ అయ్యె వరకు ఎదురు చూడ లేదు సరికదా ఇంటి ముందు పడేసిన పేపర్ లా నిర్లక్ష్యం గా తీసుకుని చదవడం మొదలు పెట్టటం చూస్తే నేనేదో పేపర్ బోయ్ లాగా అతనికి పేపర్ తెచ్చిఇచ్చిన ఫీలింగ్ వచ్చి ఒళ్ళు మండింది.
నాకు ఎందుకో చిన్నప్పటి నుండీ ఉదయం తాజా గా వచ్చిన వార్తాపత్రిక నుండి వచ్చే తాజా సువాసనని ఆస్వాదిస్తూ మడత నలగని న్యూస్ పేపర్ అలానే మడతలు పడకుండా జాగ్రత్త గా చదివి ఎలా వచ్చిందో అలా మడత పెట్టి పక్కన పెట్టేయటం అంటే చాలా ఇష్టం. మన హీరో నన్నడగకుండా తన ఇష్టం వచ్చినట్లు తీసుకు చదవడమే కాకుండా నలిపేస్తుంటే, చూస్తూ ఇక ఊరికే కూర్చోలేక "మే ఐ.." అని అతను చదువుతున్న పేపర్ తీసుకుని నేను పూర్తిగా చదివిన తర్వాత అతనికి ఇచ్చాను. మరి నా టోన్ కి భయపడ్డాడేమో అతను ఏమీ మాట్లాడలేదు. ఈ మధ్య లో నాకు అదేదో యస్వీ కృష్ణారెడ్డి సినిమా లొ ప్రకాష్ రాజ్ యమ్ యస్ నారాయణ కి క్లాస్ పీకే సీన్ గుర్తొచ్చింది. ప్రకాష్ రాజ్ కార్లో కనిపించిన పేపర్ ని తీసుకుని యంయస్ చదువుతుంటే అక్కడికి వచ్చిన ప్రకాష్ రాజ్ అతనితో "నాకు చద్ది పేపర్ చదివే అలవాటు లేదు...నువ్వు నా పేపర్ చదివావ్ కదా నాకు వార్తలు చెప్పు..." అని ప్రకటనలు, వార్తలు షేర్స్ గట్రా అన్ని వివరాలు చెప్పించుకోడం కాక... "కొని చదివితే వాడి చేతిలో పేపర్ ఉంటుంది... కొనకుండా చదివితే ఇంకొకళ్ళ చేతిలో వాడు పేపర్ అవుతాడు..." అని చెప్పి భయపడతాడు. అంటే ఇక్కడ నేను పేపర్ కొన్నది కాదు కనుక ఓ సీరియస్ లుక్ తో సరిపెట్టాను. కొని ఉంటే నేనూ అదే రేంజ్ లో క్లాస్ పీకే వాడ్ని :-)

మొత్తం మీద హైదరాబాద్ వచ్చి పడ్డాను అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఓ అరగంట ముందు. విమానం రావాల్సిన సమయానికన్నా ముందే ల్యాండ్ అయింది దాంతో కాసేపు రన్ వే పైనే ఎదురు చూసాక అప్పుడు గేట్ దగ్గరకు వెళ్ళే అవకాశం దొరికింది. మొత్తం మీద అనుకున్న సమయానికి వచ్చాం లే అని విమానం లో నుండి అడుగు బయట పెడదామని చూద్దునుకదా ఓ క్షణం తటపటాయించి కాలు వెనక్కి తీసుకుందామా అని అనిపించింది. ఏమైంది వీళ్ళందరికీ, ఈ చిత్రమైన స్వాగతం వెనుక గల ఆంతర్యమేమీ, ఈ ముసుగు వీరుల అవతారాలేంటి, ఆపరేషన్ థియేటర్ లో లా మూతినీ ముక్కునీ కలిపేస్తూ మొహానికి అసలీ ముసుగులేంటి? అసలే మనం ఎన్నికల ఫలితాలు వెలువడిన మే పదహారో తేదీన విమానం ఎక్కాం, గాల్లో ఉండగా హైదరాబాద్ పై ఏమైనా బయో యటాక్ జరిగిందా కొంపదీసి, దేవుడా నా రాష్ట్రాన్ని కాపాడు. అయినా అలా జరగడానికి వీలు లేదే బయల్దేరే ముందు ఇంటికి ఫోన్ చేస్తే కాంగ్రెస్ గెలిచింది కనుక ఇక గొడవలు జరగవ్ అని అనుకుంటున్నారు అని చెప్పాకనే కదా బయల్దేరాం, ఇలా బోలెడు ప్రశ్నలు, ఆలోచనల మధ్య లో హఠాత్తుగా వెలిగింది, విమానం లో ఇమ్మిగ్రేషన్ పత్రం తో పాటు ఇచ్చిన స్వైన్ ఫ్లూ డిక్లరేషన్ పత్రం.
ఆరోగ్యానికి సంబందించిన వివిధ ప్రశ్నలు, విమానం ఎక్కే ముందు ఏ ఏ దేశాలు తిరిగావు, జలుబు జ్వరం లాటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఇత్యాది ప్రశ్న లతో ఒక నాలుగు పేజీల పత్రం ఇచ్చారు అది చూసే అనుకున్నాను మన వాళ్ళు బాగా సీరియస్ గానే తీసుకున్నారనమాట విషయాన్ని అని. కానీ ఎప్పటిలా విమానం నుండి దిగగానే ఇమ్మిగ్రేషన్ కాకుండా... దానికన్నా ముందే ఒక నలుగురు డాక్టర్స్ ని కుర్చీలు వేసి కూర్చో పెట్టారు, వాళ్ళు ప్రయాణీకులనందరిని ప్రశ్నలు అడిగి పరీక్షించి డిక్లరేషన్ పత్రాలు పరిశీలించిన తర్వాత పంపించారు. అక్కడ సిబ్బంది మొత్తం ఇమ్మిగ్రేషన్ అధికారులతో సహా అంతా కూడా మాస్క్ లు వేసుకుని ఉన్నారు. అంటే చాలా మంది సిన్సియర్ గా వేసుకుని కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు కాని ఇక్కడ కూడా కొందరు నిర్లక్ష్య వీరులు ఉంటారు కదా వాల్లు నోటికి ముక్కు కి ఉండాల్సిన మాస్క్ ని కిందకి నెట్టేసి గడ్డానికి వేసుకుని పని చేస్తున్నారు. వాళ్ళని చూస్తే నవ్వొచ్చింది, అది అలంకారం కాదు నాయనా అలా వేసుకుని ఏమిటి ఉపయోగం, నీ ఆరోగ్యం కోసమే కదా ఈ రూల్స్ అని చెప్దాం అనిపించింది.


హైదరాబాద్ లో నన్ను ఆశ్చర్య పరిచిన మరో విషయం కస్టమ్స్. ప్రపంచవ్యాప్తంగా కస్టమ్స్ గుర్తు ఎడమ వైపు చిత్రం లో లా సూట్కేస్ లోపల చేయి పెట్టి వెతుకుతున్నట్లుంటుంది కానీ మన ఇండియన్ కస్టమ్స్ మాత్రం పర్స్ లోపల చేయి పెట్టి వెతుకుతున్నట్లు ఉండాలి. వాళ్ళ దృష్టి అంతా మన మనీ పర్స్ మీదనే ఉంటుంది మరి. ఇతను ఎవరో తన బ్లాగ్ లో చాలా చక్కగా ఈ ఎంబ్లమ్ ని మార్చి ఒక్క ముక్క లో చెప్పాడు
చూడండి, అవే బొమ్మలు ఇక్కడ ఇస్తున్నాను. ఇక నా విషయానికి వస్తే మెత్తని వాడ్ని చూస్తే మొత్త బుద్దేస్తుంది అని నన్ను చూడగానే కస్టమ్స్ లో ప్రతి ఒక్కడికి డబ్బులు అడగాలి అనిపిస్తుంది. ముంబయి లో ఆఫీసర్ పాస్పోర్ట్ తీసుకుని సతాయిస్తే కానిస్టేబుల్ ఎయిర్పోర్ట్ బయటి వరకు కూడా డబ్బుల కోసం వెంట పడిన సంఘటనలు ఉన్నాయ్. ఢిల్లీ లో అయితే సార్ ఎంతో కొంత మీ ఆనందం కోసం ఇవ్వండి సార్ అని ధీనం గా అడిగిన సంధర్భాలు ఉన్నాయ్. ఎంత ఘోరం అంటే డిల్లీ లో ఒక సారి ఎయిర్ ఇండియా చెక్ ఇన్ చేసే సమయం లో అక్కడి సిబ్బంది ఒక బ్యాగ్ కాస్త ఎక్కువ బరువు ఉందని చూపించి 500 ఇవ్వండి వదిలేస్తాను అని బేరం పెట్టాడు. అంటే ఆ సమయానికి అందరి చెక్ ఇన్ అయిపోయింది నేను ఆఖరు న వెళ్ళాను దాంతో ఎవరూ పట్టించుకోడం లేదు మన వాడు మొదలు పెట్టాడు. నేను హైదరాబాద్ లో చెక్ ఇన్ చేసినప్పుడు పరిమితి లోపు ఉన్న బరువు ఢిల్లీ వచ్చేసరికి ఎలా పెరిగిపోతుంది, ఇంకో కౌంటర్ లో బరువు చూద్దాం అని వాదించే సరికి వదిలేసాడు. ఇలాంటి అనుభవాలు చూసిన నాకు హైదరాబాద్ కస్టమ్స్ ఎలాంటి సినిమా చూపిస్తుందో అని అనుకుంటూ ఉన్న నన్ను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేస్తూ గ్రీన్ ఛానల్ లో నన్ను ఎవరూ అడ్డుకో లేదు. కేవలం కస్టమ్స్ పత్రం మాత్రం కలెక్ట్ చేసుకుని గౌరవంగా పంపించేశారు. బాగు బాగు మొత్తం మీద హైదరాబాద్ స్వాగతం బహు బాగు అని అనుకుంటూ బయట పడ్డాను.
అది సరే కాని నిన్న మాటల మధ్య లో ఒక చిన్న అనుమానం వచ్చింది మీకు తెలిస్తే కాస్త చెప్తారా... అలక ని ఆంగ్లం లో ఏమంటారు? అలక, అలగడం అలకపానుపు ఇత్యాదులని ఆంగ్లం లో ఎలా చెప్పాలో ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు, మీకు తెలిస్తే చెప్పండి.
సరే మళ్ళీ మరో టపా లో కలుద్దాం, అంతవరకూ శలవా మరి.
customs pics from "http://krishashok.wordpress.com/2008/02/04/symbolically-speaking/"