
I have a dream.. ఇది సరైన ప్రయోగమేనా.. MLK గారి స్పీచ్ గుర్తొచ్చి ఆవేశంగా మొదలెట్టాను కానీ సరైన ప్రయోగం కాదేమో, ఎందుకంటే ఈ కల ఇప్పుడు రావడం లేదు, అదీకాక తీరిన ఈ కల గురించే ఈ టపా కనుక ఈ ప్రయోగం సరికాదనే అనుకుంటున్నా. ఏమో లెండి ఇంగ్లీష్ గ్రామర్లో ఈ టెన్స్ లు ఎప్పుడూ నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటాయ్. ఏదేమైనా గ్రామర్ సంగతి ఇంగ్లీష్ టీచరమ్మలకి వదిలేసి అసలు విషయానికి వస్తే, ఈ బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తలో నేనో కలగనే వాడ్ని. నేనేదో బిజినెస్ లంచ్ కో, లేదూ డిన్నర్ పార్టీ కో, పెళ్ళికో, పుట్టినరోజు వేడుకకో వెళ్ళి పదిమందితో కలిసి మాట్లాడుతున్నపుడు హఠాత్తుగా ఒక పరిచయం లేని వ్యక్తి వచ్చి "మీరు ఫలానా కదా ఫలానా బ్లాగ్ రాస్తారు కదా నేను తరచుగా చదువుతుంటాను, బాగా రాస్తారు..బ్లా.. బ్లా.." అని నన్ను పరిచయం చేసుకుని మాట్లాడేస్తున్నట్లూ... నేనేమో అందరి మధ్యలో మొహమాట పడిపోతూ, ఒక పక్క కాస్త గర్వ పడుతూ చిరునవ్వులు చిందిస్తూ అతనితో మాట్లాడుతున్నట్లు.. ఇలా సాగిపోతుంది ఆ కల :-)

మొన్న ఓ రోజు మధ్యాహ్నం ఇంచుమించు ఇలాంటి సంఘటనే జరిగింది. నేను మా ఆఫీస్ కేఫెటీరియాలో టీ తాగుతుండగా ఒకరు వచ్చి మీరు వేణూశ్రీకాంత్ కదా? నాతోనేను నాగురించి బ్లాగ్ రాస్తారు కదా? నేను క్రమం తప్పక చదువుతానండీ మీరు చాలా బాగా రాస్తారు అంటూ పలకరించి మాట్లాడారు. అంతే ఒక్కసారిగా నా మనసులో "కల నిజమాయెగా..", "గాల్లో తేలినట్లుందే" ఇత్యాది పాటలు నేపధ్యంలో మోగుతుండగా అతి కష్టం మీద మొహంలో ఆ భావాలను కనపడనివ్వకుండా కాసేపు మాట్లాడి వచ్చేశాను. అతను నా బ్లాగ్ చూసి నే ఐబియం లో పని చేస్తున్న విషయం తెలుసుకుని మా ఆఫీస్ లోకల్ చాట్ రూం లో నా ఫోటో చూసి నన్ను గుర్తు పట్టాడుట. ఇంట్రెస్టింగ్ అనుకుంటూ అక్కడ నుండి డెస్క్ దగ్గరకు వస్తుంటే దారిలో మరో అపరిచితుడు తన కంప్యూటర్ లో నా బ్లాగ్ ఓపెన్ చేసి చదువుతూ కనిపించాడు. నే వెళ్ళేప్పుడు సాక్షిపేపర్ చదువుతున్న అతన్ని చూసి నవ్వుకున్నాను ఆహా !! ఆఫీస్ టైం మాబాగా ఉపయోగిస్తున్నాడు అని. వచ్చేప్పుడు నా బ్లాగ్ చదువుతున్న అతని గురించి ఏమనుకున్నానో మరి ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు కదా :-) కాకపోతే తనని కదిలించడమెందుకు లే అని నేనేం అడగలేదు. మొత్తం మీద ఒకే రోజు ఆఫీస్ లో ఇలా డబుల్ ధమాకా నా సొంతమైందనమాట.

ఈ సంధర్భంగా మీకో విషయం చెప్పాలి. నిజంగా మీ ఙ్ఞాపకాలను పదిల పరచుకోవాలంటే డైరీ చాలు కదా బ్లాగెందుకు అని ఈ మధ్యే అడిగిన ఓ నేస్తానికి నాకు సంతృప్తి కలిగే జవాబు చెప్పలేకపోయాను. నిజమే కదా అనిపించింది. కానీ నా బ్లాగ్ మొదలెట్టినపుడు నాకు పరిచయమున్న పదుగురిలో ఓ నాలుగురైదుగురు కంప్యూటర్ ఇంటర్నెట్ తో పరిచయమున్న వారు మాత్రమే చూస్తారు లే అని మొదలెట్టాను. కేవలం నాకు బాగా పరిచయమైన ఆత్మీయమైన ఒకరిద్దరు విజిటర్స్ తో ఇంచుమించు నాడైరీ లా సాగుతున్న నా బ్లాగ్ ను ఎలా పట్టుకున్నారో కానీ చావాకిరణ్ గారు మొదటి కామెంట్ రాసి తన ప్రొఫైల్ కి, బ్లాగ్ కి రప్పించుకుని అక్కడ నుండి నన్ను జల్లెడ కీ కూడలికి పరిచయం చేశారు. ఇక అక్కడ నుండి నాకు హిట్ కౌంటర్లు కామెంట్లు ఇత్యాదులు అలవాటైయ్యాయి.

నాతో కాస్త పరిచయమున్న వారెవరైనా నాకు కాస్త కీ.క. అదేనండీ కీర్తి కండూతి ఎక్కువే అని ఒప్పుకుంటారు. అంటే పైకి కాస్త మాడెస్టీ ప్రదర్శించినా పొగడ్తలకి పడిపోని మనిషెవరుంటారు చెప్పండి :-) ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు మీడియాలో మన పేరు చూసుకోవడం అనుకోని ధ్రిల్ ను మనసొంతం చేస్తాయి. బహుశా అవే నన్ను బ్లాగ్ కు అడిక్ట్ చేసేసి నన్ను అడ్రినలిన్ జంకీ ని చేశాయేమో అనిపించింది. చాలా మంది ఫేమస్ బ్లాగర్స్ తో పోలిస్తే నా రాతలు చాలా సబ్ స్టాండర్డ్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. అలానే నా టపాల సంఖ్య కానీ కామెంట్ల సంఖ్యకానీ విజిటర్స్ సంఖ్యకానీ చాలా ఇతర బ్లాగులతో పోలిస్తే అతి తక్కువ కనుక నేను బ్లాగ్ కు ఎడిక్ట్ అయ్యాను అన్నమాట నిజం కాదేమో అనికూడా అనిపిస్తుంది.
కానీ బ్లాగ్ నాకు తెలియకుండానే నా జీవితం లో ఒక సింహ భాగం అయిపోయింది. ఫ్యామిలీ ని, ఆత్మీయ నేస్తాలనీ మించి కేవలం నాకుమాత్రమే స్థానం కలిగిన నాకంటూ ఒక ప్రపంచం సృష్టించుకుని దానిలో సోలోగా బతికేస్తున్నాను అనిపిస్తుంది. బ్లాగ్ ద్వారా పరిచయమైన మితృలు బాహ్య ప్రపంచంలో పరిచయం కాకపోవడం బాహ్యప్రపంచంలోని

మితృలు సన్నిహితుల దగ్గర బ్లాగ్ గురించి అతి తక్కువ మాట్లాడటం వారికి నా బ్లాగ్ లో వ్యక్తపరిచే అభిప్రాయాలలో చోటులేకపోవడం ఒక కారణం కావచ్చు. బ్లాగ్ పూర్తిగా వ్యక్తిగతమైన అభిప్రాయాల వేదిక అని అందులో ఇతరులకు చోటు లేదనీ ఒక అభిప్రాయంలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. కానీ ఆ ఇతరులు ఎవరు అనేది నిర్ణయించుకోవడం లో కూడా ఒక చిన్న పొరపాటు చేసి ఆత్మీయులను నొప్పించాను ఆ విషయం అర్ధమయ్యాక చాలా బాధ పడ్డాను.
ఇదిగో ఈ పైన రాసినటువంటి అంతర్మధనం జరిగినపుడు ఎపుడైనా బ్లాగ్ మూసేయాలి అనిపిస్తే ఆఆలోచన కు స్వస్తి చెప్పేలా చేసేది బ్లాగ్ మితృల ప్రోత్సాహమే. ఈ బ్లాగ్, చదివిన వారిని కాసేపు వారి కష్టాలను మరిచి ఙ్ఞాపకాలలోకి వెళ్ళి ఓ చిన్న చిరునవ్వును వారి మొహంపై పూయించ గలిగితే ఈ బ్లాగ్ ఓపెన్ గా అందరూ చదివేలా ఉంచడం వెనుక ధ్యేయం నెరవేరినట్లే. ఏదేమైనా నేను రాసినది ఓపికగా చదివి కామెంట్లు రాస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మితృలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. కామెంట్ రాయకపోయినా క్రమం తప్పక చదివే పాఠకులకు కూడా పేరు పేరునా ధన్యవాదాలు. అలానే మొదటి కామెంట్ రాసిన చావా కిరణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.

అసలు నేను రాసినది మరొకరు చదవగలరు, చదివి ఆస్వాదించగలరు అనే నమ్మకాన్ని నాలో కలిగించి ఈ బ్లాగ్ ప్రారంభించడానికి ముఖ్య కారణమై నా వేలు పట్టుకుని నా బ్లాగు రూపు రేఖలను దిద్దించి. తను మాత్రం, తను మాటలు నేర్పిన కొడుకు పెద్ద పెద్ద డిబేట్లు గెలుస్తుంటే దూరం నుండి మురిపెంగా చూసుకుని ఆనందించే అమ్మలా. తన వేలు పట్టుకుని నడక నేర్చుకున్న కొడుకు ఆ వేలు విడిపించుకుని తోటి పిల్లలతో ఆటలాడు కోవడానికి పరిగెడితే ఆ ఆటలలో తనకే భాగస్వామ్యం లేకపోయినా దూరం నుండి ముచ్చటగా చూస్తూ మురిసిపోయే నాన్నలా. దూరం నుండి చూస్తూ నిరంతరం ప్రోత్సహిస్తున్న నా ఆత్మీయ నేస్తానికి ఈ సంధర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. బ్లాగ్ ప్రపంచంలో మునిగిపోయి నాకే తెలియకుండా నే చేసిన పొరపాట్లను తను మనస్ఫూర్తిగా మన్నిస్తారని తలుస్తూ...
ఈ టపాను తనకి అంకితమిస్తూ...
ప్రస్తుతానికి శలవు...