"రాముడు అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా ఆనందంగానే ఉంటాడు. కానీ చూడ్డానికి భక్తుల మనసుకే కష్టంగా ఉంటుంది.""అడుక్కుంటే అన్నం దొరుకుతుంది కష్టపడితే నీడ దొరుకుతుంది కానీ ఏం చేసినా సామాన్యులకి న్యాయం మాత్రం దొరకడం లేదు.""కాళ్ళ క్రింద యాక్సిలేటర్ ఉంది కదా అని తొక్కితే రూల్సే కాదు బోన్స్ కూడా బ్రేక్ అవుతాయి.""ఆడవాళ్ళు మనకు ఆనందాన్ని మాత్రమే ఇవ్వాలి, హక్కుల గురించి అడిగితే.. ఇలా బోన్ లో నిలబెట్టి వేశ్య అని ముద్ర వేస్తాం. ఇదేం న్యాయం ?""ఆడది అంటే వాడి బాత్ రూం గోడమీద బొమ్మ కాదు వాడిని కనిపెంచిన అమ్మ కూడా.""చీడ పురుగులు మగవాళ్ళ తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడితే ఎలా.""ఓటమి అంటే అవమానం కాదు, మనల్ని మనం తెలుసుకునే గొప్ప అవకాశం.""మద్యం తాగడం హానికరం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మగవాళ్ళు తాగితే పడిపోతారు ఆడవాళ్ళు తాగితే పడుకుంటారు అనుకోవద్దు.""ఒక మనిషికి ఉన్న అలవాట్లను బట్టి క్యారెక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తాం.""మన ఇంట్లో ఉండే గడియారంలో చిన్న ముల్లు కూడా అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది.""రాత్రి పూట ఓ అమ్మాయి ఒంటరిగా వెళ్తే బైకులూ, కార్లు ఆటోలు అన్నీ స్లోడౌన్ అవుతాయ్. సైడ్ విండోలు కిందకి దిగుతాయ్, జిరాఫీల్లా తలలు పొడుచుకొస్తాయి.. చూపులు సూదులవుతాయి..""అబ్బాయిలు బయటకొస్తే సరదా.. అమ్మాయిలు బయటకొస్తే మాత్రం తేడా!""అమ్మాయిలు మనస్ఫూర్తిగా అబ్బాయితో నవ్వుతూ మాట్లడకూడదు, మాట్లాడేప్పుడు అసలు టచ్ చేయకూడదు, హింట్ ఇచ్చేసింది సిగ్నల్ ఇస్తుంది అని ఫీలైపోతారు. ఇదేం న్యాయం.""అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యునికేషన్ ఆడబిడ్డలు నవ్వుతూ మాట్లాడితే కొంపలు కూల్చే క్యారెక్టర్.""నవ్వడమనే ఒక సహజ ప్రవర్తన కూడా ఒక అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది బరితెగించిన క్యారెక్టర్ అని ముద్ర వేస్తుంది.""అమ్మాయి ఒంటరిగా అబ్బాయిలతో ఎక్కడికీ వెళ్ళకూడదు, వెళ్తే దేనికైనా రెడీ అని ఊహించుకుంటారు, తనని ఆ అబ్బాయి ముట్టుకోడానికి, పట్టుకోడానికి బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేసింది అని ఫిక్సయిపోతారు.""అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికీ లేదు. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బోయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా ఏ మగాడైనా.""ఆశతో ఉన్నోడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది.""నిజం ఎప్పుడూ ఒంటరిదే కానీ దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే.""నువ్వు గెలుపుకోసం వచ్చావు.. నేను న్యాయం కోసం వచ్చాను. నీది స్వార్ధం నాది ధర్మం.""వాళ్ళు సామాన్యులు నీలాంటోడు పెడతా అంటే ఆశపడ్తారు బెదిరిస్తే భయపడతారు. ఆశకీ భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి.""కోర్టులో వాదించడమూ తెలుసు. కోటు తీసి కొట్టడమూ తెలుసు.""జనం కోసమే ప్రాణం ఇచ్చేవాడు. తనే ప్రాణం అనుకుని వచ్చిన దాన్ని నన్నింక ఎంత బాగా చూసుకుంటాడు.""బలహీనంగా ఉన్నదాని గురించి బలంగా నిలబడతాడు. తనకి ఏది ఉందో అందరికీ అదే ఉండాలి అనుకుంటాడు.""ఆయన ఒక మాటన్నాడంటే దానికో విలువుంటుంది. ఏదన్నా జేసిండంటే అందరికీ ఉపయోగం ఉంటది.""ఒకప్పుడు ఊళ్ళకోసం రోడ్లేసేటోళ్ళు ఇపుడు రోడ్లకోసం ఊళ్ళే ఖాళీ చేయిస్తున్నారు.""మనిషి బతికేది ఆశతో.. ఆ ఆశే సచ్చినాక మనిషికి చావే సుఖమనిపిస్తుంది.""ఆవేశంతో చేస్తే కొందరికే న్యాయం చేయగలం అదే ఆలోచనతో చేస్తే అందరికీ న్యాయం చేయగలం.""మీరు జనం కోసం చాలా కోల్పోయారు. కానీ మీరు దూరమై జనాలు జీవితాల్నే కోల్పోతున్నారు, మీ మౌనం సమాన్యులకు శాపం కాకూడదు.""ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నాలో ఆవేశం తగ్గదు ఆశయం మారదు. నల్లకోటు వేస్కున్నానంటే వేస్కోటనికి పిటీషన్లు తీస్కోటానికి బెయిళ్ళు ఉండవు."
అమ్మ జ్ఞాపకాల కబుర్లు
చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.
అందమైన బాల్యం
మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.
ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు
నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.
ఇంజనీరింగ్ కాలేజ్
ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.
సినిమాలు రివ్యూలు..
నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.
గురువారం, ఏప్రిల్ 15, 2021
వకీల్ సాబ్ - డైలాగ్స్...
శనివారం, ఏప్రిల్ 10, 2021
వకీల్ సాబ్...
మంగళవారం, జనవరి 19, 2021
కంబాలపల్లి కథలు - మెయిల్
శనివారం, డిసెంబర్ 26, 2020
సోలో బ్రతుకే సో బెటర్...
శుక్రవారం, సెప్టెంబర్ 04, 2020
మణియారయిలె అశోకన్ & c u soon...
ఈ 2020 లో కాస్తో కూస్తో లాభ పడిన వాటిలో మలయాళ సినీ పరిశ్రమ ఒకటి అని చెప్పచ్చేమో. తెలుగు సినిమాలు పూర్తిగా ఆగిపోవడంతో ఆన్లైన్ అండ్ ఓటీటీ తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మలయాళ సినిమాల బాట పట్టారు. దానికి తగ్గట్లే హ్యూమన్ ఎమోషన్స్ కి విలువిస్తూ కథకు పెద్ద పీట వేసి తీస్తున్న ఆ సినిమాలు కూడా బావుంటున్నాయి. ఓటీటీలలో అందుబాటులో ఉంటున్న సబ్ టైటిల్స్ భాష తెలియకపోయినా సులువుగా చూసేయడానికి సహాయపడుతున్నాయ్.
శుక్రవారం, ఆగస్టు 14, 2020
గుంజన్ సక్సేనా...

![]() |
| రియల్ అండ్ రీల్ గుంజన్ సక్సేనా |
మంగళవారం, ఆగస్టు 04, 2020
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..
ఇంతటి ఉద్దండుల మధ్య కూడా చాయ్ బిస్కట్ ఫేం సుహాస్ తన రోల్ తో నటనతో కామిక్ టైమింగ్ తో కట్టిపడేశాడు. సినిమాలో సత్య తర్వాత బాగా నచ్చేసే కారెక్టర్ సుహాస్ దే. తను ఎన్నుకుంటున్న రోల్స్ కూడా బావుంటున్నాయ్ కమెడియన్ గానే కాక మంచి నటుడిగా తెలుగుతెరమీద ఇంకా మంచి పేరు తెచ్చుకుని నిలిచి ఉంటాడనిపించింది. ఇక సినిమా నిడివి గల ఇంటర్వూలతో పాపులర్ ఐన ఐడ్రీమ్ టి.ఎన్.ఆర్. గారు పంచాయితి మెంబర్ నాంచారయ్య గా ఓ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించారు. తన మిగిలిన సినిమాలకన్నా కాస్త కంఫర్టబుల్ గా నటించారనిపించింది. పలాస దర్శకుడు కరుణ కుమార్(కరుణ), ఈ సినిమా దర్శకుడు వెంకటేష్ మహా(టీకొట్టు ఓనర్) రెండు చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. "ఆలోచనలు, జ్ఞాపకాలు ప్రపంచంలో అన్నిటికంటే బరువైనవట, ఏడ్చేస్తే కన్నీరు ఆవిరైపోతుంది, మనసు తేలికవుతుంది.""జీవితంలో ఏదో తప్పుచేశాననుకుంటూ బతకమాకు అది అన్నింటికంటే ప్రమాదకరం""ఇద్దరు మనుషులు కలుస్తారు, రెండు మనసులు విడిపోతాయి. మనిషి శరీరంలో ఎక్కడుందో తెలియని మనసును ఎంతకాలమని నిందిస్తావ్.""వెళ్ళిపోవాలనుకున్న వారిని వెళ్ళనివ్వకపోతే... ఉన్నా వెలితిగానే ఉంటుంది.""కళ అనేది పాఠాలు వింటే రాదు పరితపిస్తే వస్తుంది""నవరసాలు అంటే మనకు కనపడే ముఖంలో కండరాల కదలిక కాదు మనలో జరగాల్సిన రసాయన ప్రక్రియ""ఎమోషన్ అనేది నీలో పుట్టాలి నువ్వు చూసే వస్తువులో కాదు""ఆడపిల్లల తండ్రులు అబ్బాయిలందరూ ఎదవలే అని ఎంత గట్టిగా నమ్ముతారో వాళ్ళ పిల్లలక్కూడా విచక్షణ ఉండిద్దని అంత గట్టిగ నమ్మినరోజే ఈ దేశం బాగుపడిద్ది""నొప్పి రుచి తెలియని వాడే ఎదుటి వాడి మీద చేయి చేసుకుంటాడు. తెలిసిన వాడు చేయి ఎత్తడానికి కూడా ఆలోచిస్తాడు""శవానికి మాత్రమే నొప్పి కలగదు. ప్రాణముంటే నొప్పి ఉంటుంది""అందరికీ తెలియాలంటే చూడక్కర్లేదు వింటే చాలు.. వీళ్ళు చూశారుగా మిగతా వాళ్ళు వింటారు"
బుధవారం, మే 20, 2020
కనులు కనులను దోచాయంటే...
ఓ రకంగా చెప్పుకోవాలంటే ఇది కూడా ప్రేమ కథ లాంటిదే కానీ ప్రేమ కథ కాదు. ఆ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూశాక కానీ మనకు పూర్తిగా అర్ధం కాదు. ఈ జెనర్ లో వచ్చే సినిమాల్లో హాలీఉడ్ సినిమాలకీ మన సినిమాలకీ ఓ ప్రధానమైన తేడా ఉంటుంది అది నైతికత. హీరో దొంగ ఐనా కూడా రాబిన్ హుడ్ తరహా మంచి దొంగలా ఉండాల్సిందే తప్ప మామూలుగా రియలిస్టిక్ గా ఉంటే కుదరదు.
ఈ సినిమా ఆవిషయంలో కాస్త వెసులుబాటుతో ఇచ్చిన క్లైమాక్స్ నాకు నచ్చింది. "ఇలాంటి సినిమాలతో సభ్యసమాజానికి ముఖ్యంగా యువతకి ఏం మెసేజ్ ఇద్దామని" అని అనుకునే టైప్ మీరైతే బహుశా ఈ సినిమా మీకు నచ్చకపోవచ్చు. ఓ కథని కాస్త సినిమాటిక్ లిబర్టీస్ తో అక్కడక్కడా థ్రిల్ చేస్తూ ఎంటర్ టైనింగ్ గా చెప్తే చాలు అని అనుకుంటే మీకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇట్సె క్లీన్ ఎంటర్టైనర్.
సినిమాలోని థ్రిల్స్ ఎంజాయ్ చేయాలంటే ఇక ముందుకు చదవకుండా ’ఆహా’ ఓటీటీ ప్లాట్ఫార్మ్ లోనో, టీవీలో ప్రదర్శించినపుడో ఈ సినిమా చూసొచ్చాక చదవండి.
కథ విషయానికి వస్తే ఈజీ గోయింగ్ ఆవారా బ్యాచ్ అయిన అనాథ హీరో గారు(డుల్కర్) ఓ ఫ్రెండ్ తో కలిసి రకరకాల మోసాలతో డబ్బు సంపాదిస్తూ లావిష్ గా బతికేస్తుంటారు. అలాంటి సమయంలో అందం అమాయకత్వం కలబోసిన హీరోయిన్(రీతూ వర్మ) తో ప్రేమలో పడతారు. ఆ ప్రేమ ప్రభావంతో ఈ పనులన్నిటికి స్వస్తి చెప్పి ఎక్కడైనా గౌరవంగా పని చేసుకుంటూ బ్రతకాలని నిర్ణయించుకుంటారు.
ఐతే చేసిన పాపం వెంటాడకుండా ఊరుకోదు కదా ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ (గౌతం మీనన్) వీరి మోసాల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. హీరోగారు పోలీసులకి దొరికి పోయారా, చేసిన తప్పులకు శిక్ష అనుభవించారా, వారి ప్రేమ కథ ఏమైంది అసలు చేసిన మోసాలు ఎటువంటివి అనేది తెలియాలంటే మీరు కనులుకనులను దోచాయంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పూర్తిగా దర్శకుడి సినిమా, ముఖ్యంగా స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నాడు. అక్కడక్కడా కొన్ని మోసాల విషయంలో ఇది ఇంత సులువా అనిపించేలా కాస్త సినిమాటిక్ లిబర్టీస్ తీస్కున్నప్పటికీ చాలా వరకూ థ్రిల్ చేయగలిగాడు. ఈ సినిమా చూశాక ఆన్ లైన్ షాపింగ్ చేసే ముందు ఓ నిముషం ఆలోచించకుండా ఉండలేం. ఇంకా ఇందులో టచ్ చేసిన ఇతర మోసాలు కూడా కొత్తగా ఉన్నాయి.
కాస్టింగ్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది ముఖ్యంగా హీరోయిన్ గా రీతూ వర్మని తీస్కోడం చాలా ప్లస్ అయింది. డుల్కర్ ఆల్రెడీ ప్రూవెన్ నటుడు ఈ పాత్ర తను మరింత అలవోకగా చేసేశాడు. మిగిలిన నటీనటులంతా కూడా పాత్రల్లో ఒదిగిపోయారు. పాటలు ప్రత్యేకంగా గుర్తుండక పోయినా నేపథ్య సంగీతం సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ చక్కగా అమరింది. సినిమాటోగ్రఫీ తో సహా మిగతా టెక్నికల్ టీమ్ అంతా కూడా మంచి ఔట్ పుట్ ఇచ్చారు.
ఈ తరహా దోపిడీ దొంగల సినిమాలు ఇష్టపడే వాళ్ళు మాత్రమే కాకుండా వైవిధ్యభరితమైన ఎంటర్టైనింగ్ సినిమాలు నచ్చే వాళ్ళు మిస్ అవకుండా చూడదగిన సినిమా కనులు కనులను దోచాయంటే.
శుక్రవారం, మార్చి 06, 2020
మన ఊరి రామాయణం...
వాళ్ళిద్దరిని డైరెక్టర్ స్క్రిప్ట్ తో సహా కొట్లో పెట్టి బయట నుండి తాళం వేసి వెళ్ళిన శివ అనుకోని పరిస్థితులలో గరుడతో కలిసి ఓ చోట చిక్కుకు పోతాడు. తెల్లారితే చుట్టూ ఉన్న కొట్లు తెరిచి జనంతో సందడిగా ఉండే ఆ ఏరియా నుండి భుజంగయ్య పరువు పోకుండా బయటపడ గలిగాడా లేదా ? తను ఎంతగానో అభిమానించే తన గురువుని ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలోకి నెట్టిన శివ గరుడ సాయంతో ఏం చేశాడు ? గరుడకి తన స్క్రిప్ట్ దొరికిందా ? ఇలాంటి సంఘటన తర్వాత భుజంగయ్య ప్రవర్తనలోనూ ఆలోచనల్లోనూ ఏమైనా మార్పొచ్చిందా ? అనేవి తెలుసుకోవాలంటే ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో 2016 లో విడుదలైన "మన ఊరి రామాయణం" అనే సినిమా చూడాలి.
విడుదలైనపుడు అక్కడక్కడ సినిమా గురించి మంచి మాటలు వినీ ప్రమోషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించి చూద్దామనుకుని కూడా వీలు పడక చూడలేక పోయాను. నిన్న యాథాలాపంగా ప్రైమ్ లో టైటిల్స్ చూస్తూ అనుకోకుండా చూసిన ఈ సినిమా నాకో పెద్ద ప్లజెంట్ సర్ ప్రైజ్, ఇంత బావుంటుందని అస్సలు ఊహించలేదు, చాలా చాలా నచ్చేసింది. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా పాటలు ఫైట్లు లేకుండా కథమీద మాత్రమే ఫోకస్ చేసిన సినిమా ఇది. పేజీల కొద్దీ డైలాగులు చెప్పకుండానే సున్నితమైన మానవ సంబంధాల గురించీ విలువల గురించీ వీపుపై ఛెళ్ళుమనిపించి ఆలోచింపజేసే సినిమా.కొన్ని సినిమాలు కథ తెలుసుకోడానికి, కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం మరికొన్ని సినిమాలు విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నట్లే కొన్ని సినిమాలు నటీనటుల నటన కోసం సినిమా టేకింగ్ కోసం చూడాల్సినవి ఉంటాయి. మన ఊరి రామాయణం సరిగ్గా అలాంటి సినిమానే. రెండు గంటలకు పావుగంట తక్కువే ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ అనే మాట గుర్తు కూడా రానీయదు. ఉన్నది అతి తక్కువ పాత్రలూ పరిమితమైన లొకేషన్స్ అయినప్పటికీ నటీనటులు సన్నివేశాలు కట్టిపడేస్తాయి.
చిత్రీకరణ సన్నివేశాలు ఎమోషన్స్ ఎంత సహజంగా ఉన్నాయంటే ప్రతి పాత్రా నిజజీవితంలో మనకు పరిచయమైనదే అనిపిస్తుంటుంది ఇలాంటి వాళ్ళని మనం ఎక్కడో చూశాం అని అనిపించక మానదు. అసలు మనం ఒక సినిమా చూస్తున్నామన్న విషయాన్ని మర్చిపోయి ఆ ఊరు మధ్యలో ఉండి వాళ్ళతో పాటు శివ ఆటో ఎక్కి తిరిగేస్తున్నట్లుగా ఫీలవుతాం. భుజంగయ్య లోటు పాట్లు తెలిసినప్పటికీ పాపం అతను త్వరగా బయటపడితే బావుండు అని అనిపిస్తుందంటే దానికి ముఖ్య కారణం రాసుకున్న సన్నివేశాలు వాటిని రక్తికట్టించిన నటులు దానికి తోడైన ఇళయరాజా నేపధ్య సంగీతం.
ప్రకాష్ రాజ్ ఎంత విలక్షణమైన నటుడో అందరికీ తెలిసిందే కానీ ఈ సినిమాలో పూర్తిగా భుజంగయ్యగా మారిపోయాడు. పెద్దమనిషిగా దర్పం, అహం, కోపం, ఓ బలహీన క్షణంలో తప్పువైపు మొగ్గుచూపినా ఆ తర్వాత తను పడే సంఘర్షణ, పరువు గురించి పడే తపన, స్నేహితుల అభిప్రాయాలు వింటున్నపుడు నిస్సహాయత, అహం దిగిపోయాక కుటుంబంపై కూతురిపై ప్రేమ అన్నీ తన హావభావాలతోనే మనకర్థమయేలా చేయడమే కాక తన ఎమోషన్స్ తో కనెక్ట్ అయి తన వైపు నుండి ఆలోచించేంతగా ప్రేక్షకులని ప్రభావితం చేశాడు.
ఇక జాతీయ అవార్డ్ గ్రహీత ప్రియమణిని తెలుగు సినిమా గ్లామర్ కు పరిమితం చేసింది కానీ తన ప్రతిభ ఈ పాత్ర పోషణలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది. వేశ్య పాత్ర అయినప్పటికీ ఎక్కడా అసభ్యతకి తావులేకుండా హుందాగా పోషించిన తీరు అనితరసాధ్యం అనిపిస్తుంది. అంత పెద్దమనిషిని రా అంటున్నా అతని మంచితనం గుర్తించిన తీరు చివరికి అతని ఇబ్బందిని గ్రహించి చివరికి మారి అతన్నీ మార్చిన తీరు హావభావాల్లోనే కాక బాడీలాంగ్వేజ్ లో కూడా చూపించి కట్టి పడేస్తుంది. భుజంగయ్య పరువు గురించి ఆలోచించకుండా అలవాటుగా ఫోన్ లో పెద్దగా మాట్లాడుతున్న ఆమెని చూసి మనకే "అమ్మాయ్ కాస్త చిన్నగ మాట్లాడు" అని చెప్దామా అనిపిస్తుందంటే మనకి ఆ విషయాన్ని అంతగా రిజిష్టర్ చేసిన ఈ ఇద్దరి నటనే కారణం.
అలాగే సత్యదేవ్ ఇప్పుడంటే ఎస్టాబ్లిష్డ్ నటుడుగా పేరు తెచ్చేసుకున్నాడు కానీ తన కెరీర్ మొదట్లోదనుకుంటాను ఈ సినిమా. తను కూడా ఆటో డ్రైవర్ గా భుజంగయ్య నమ్మిన బంటుగా ఒదిగిపోయాడీ సినిమాలో. తన గురు సమానంగా అభిమానించే భుజంగయ్య తన వల్ల ఇబ్బందిలో పడ్డాడని ఎలాగైనా కాపాడాలని అతను చేసే ప్రయత్నాలు చూస్తే తన తరఫున మనం కూడా దేవుడ్ని వేడుకుంటాం. సినిమా దర్శకుడు గరుడ గా చేసిన తర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా తనకి అలవాటైన లౌడ్ నెస్ ని పక్కన పెట్టి సటిల్ గా చేశాడు. ఎదుటి వారి పరిస్థితిని పట్టించుకోకుండా తన ధోరణిలో తను పిచ్చి జోకులేసే పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో రఘుబాబు కూడా ఆకట్టుకుంటాడు. ప్రకాష్ రాజ్ కూతురుగా చేసిన అమ్మాయి కూడా మెప్పిస్తుంది.
టెక్నికల్ డిపార్మెంట్ లో ముందుగా చెప్పుకోవలసింది ఇళయరాజా గారి నేపథ్య సంగీతం. సినిమాలో ఎక్కడా ప్రత్యేకంగా తెలియకుండా అంతర్లీనంగా కలిసిపోయి సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ ఎమోషన్స్ ని మనకి కనెక్ట్ చేయడానికి దోహద పడింది ఈ సంగీతమే. అలాగే థీం సాంగ్ గా చివర్లో వచ్చే పాట కూడా గుర్తుండి పోతుంది. ఆ తరువాత స్థానం ఛాయగ్రహణం అందించిన ముఖేశ్ గారిది మనల్ని థియేటర్ల నుండీ సోఫాసెట్ ల నుండీ అలా అలవోకగా తీస్కెళ్ళి ఈ ఊరి మధ్యలో నిలబెట్టేశాడంటే ఆ గొప్పతనం ఇతనిదే. సినిమా ఏదైనా నిజమైన ఊర్లో చిత్రీకరించారో స్టూడియో సెట్స్ లోనా అన్నది తెలియదు కానీ సెట్స్ అయితే మాత్రం ఆర్ట్ డైరెక్టర్ శశిధర్ అడవి నీ మెచ్చుకుని తీరాలి.
మొత్తం మీద చూసినంత సేపూ ఉత్కంఠతో నటులతో పాటు ప్రయాణించి ముగిసాక ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతిని మిగిల్చే సినిమా "మన ఊరి రామాయణం". 2016 లో విడుదలైనపుడు మిస్సయిన వాళ్ళు ఈ సినిమా ఈ వారమే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది తప్పక చూడండి. రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చేమో కానీ వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళూ మిస్సవకుండా చూడవలసిన సినిమా ఇది. ఈ సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు. ఈ సినిమా లో ఉన్న ఒకే ఒక్క పాట భాస్కరభట్ల గారు చాలా చక్కగా రాశారు. థీమ్ సాంగ్ అనవచ్చు ఇది కూడా ఎండ్ క్రెడిట్స్ లో వస్తుంది. ఆ సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. మేకింగ్ వీడియో లో ఈ పాట ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మన ఊరి రామాయణం (2016)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : ఇళయరాజా, నిహాల్
ఏవేవో ఏవేవొ
చూస్తూనే ఉంటాం
మనలోని లోపం తప్పా
ఏమేమొ ఏమేమొ
మాటాడుతుంటాం
పనికొచ్చే విషయం తప్పా...
భలే చెప్పావ్
చెవులారా వినుకోండి
మనసారా చెబుతా
మన ఊరి రామాయణం ఆఆఆఆఆ..
ఇది మనలోని రామాయణం ఆఆఆఆఆ..
మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం
పైకేమో శ్రీరామచంద్రుడులా ఉంటాం
ఎనలేని దయ చూపుతాం
అవకాశం దొరికిందో అవతారం మార్చి
రావణుడై చెలరేగుతాం
సహనంలో శాంతంలో కరుణించడంలో
కనిపిస్తాం సీతమ్మలా
సాదింపులు వేదింపులు బెదిరింపుల్లోన
సరిపోతాం శూర్పణఖలా
లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం
ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోసం
ఉసురే కసిరే వరకూ తెగదీ జంఝాటం
మన ఊరిరామాయణం ఆఆ...ఆఅ
ఇది మనలోని రామాయణం ఆఆఆ...
మన శక్తిని మనకెవ్వరొ చెప్పేంతదాకా
కూర్చుంటాం హనుమంతుడిలా
మసిపూసే మంధరల మాటలకే బాగా
ఊ కొడతాం కైకేయిలా
ఆ కుంభకర్ణుడిలా నిదురోతు ఉంటాం
మన చుట్టూ ఏమైనా కాని
మధమెక్కిన మైకంలో తెగవాలిపోతాం
వావీవరసలు అన్నీ మాని
మెరపెట్టిన తిరిగొచ్చున పరిగెట్టిన కాలం
పగపట్టద పనిపట్టద పడగెత్తిన లోకం
మనలో చెడుపై మనమే చేద్దాం పోరాటం
మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం
ఏమేమొ ఏమేమొ
మాటాడుతుంటాం
పనికొచ్చే విషయం తప్ప
చెవులారా వినుకోండి
మనసారా చెబుతా
మన ఊరి రామాయణం ఆఆ...
ఇది మనలోని రామాయణం ఓఓఓ...
మన ఊరి రామాయణం ఆఆ..
ఇది మనలోని రామాయణం ఓఓఓ..
బుధవారం, మార్చి 04, 2020
హిట్ - ది ఫస్ట్ కేస్...
హిట్ (Homicide Intervention Team) లో పని చేస్తున్న ఇంటెలిజెంట్ అండ్ ఎఫీషియంట్ ఆఫీసర్ విక్కీ(విశ్వక్ సేన్) తనని వెంటాడుతున్న కొన్ని జ్ఞాపకాల వల్ల పానిక్ అటాక్ కు గురవుతుంటాడు. దాని వలన బీపి పెరిగిపోయి లైఫ్ రిస్క్ ఉందని తను చేస్తున్న జాబ్ లో అలాంటి అవకాశాలు ఎక్కువున్నందున జాబ్ మానేయమని లేకపోతే కనీసం కొన్ని రోజులు శలవన్నా తీస్కోమని తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ సలహా ఇస్తుంది. ఇది తెలిసిన తన ప్రియురాలు నేహ(రుహాని శర్మ) వత్తిడి చేయడంతో ఆర్నెలలు శలవు తీస్కుంటాడు.
శలవులో సిటీకి దూరంగా ఉన్న విక్కీకి ఒక రోజు నేహ మిస్సింగ్ అని తెలుస్తుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న నేహ మిస్సయ్యే సమయానికి ’ప్రీతి’ అనే అమ్మాయి మిస్సింగ్ కేస్ మీద పనిచేస్తూ ఉందని తెలుస్తుంది. ఆ కేస్ సాల్వ్ చేయగలిగితే నేహ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలియచ్చని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు.
ఇన్వెస్టిగేషన్ లో లోతుకు వెళ్ళే కొద్దీ ప్రీతితో సంబంధమున్న ప్రతి ఒక్కరు అనుమానితులలాగానే కనిపిస్తుంటారు. విక్కీ అనుకున్నట్లు ఈ రెండు మిస్సింగ్ కేస్ లలో ముద్దాయి ఒకరేనా అసలు ఈ రెండు కేస్ లను తను ఎలా సాల్వ్ చేశాడు, ప్రీతి అండ్ నేహా ఏమయ్యారు అనేది తెలియాలంటే మీరు ’హిట్’ సినిమా చూడాలి.
నటీనటులలో విశ్వక్ శేన్ ఈ పాత్రలో ఒదిగి పోయాడు. తన ఆటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకి బాగా సూట్ అయ్యాయి. హీరోయిన్ రుహానీ శర్మకి రోల్ తక్కువే కానీ తనలో ఏదో తెలియని ఛార్మ్ ఉంటుంది. "ఆ ఏముందీ అమ్మాయిలో" అనుకునేంతలో చిన్న చిరునవ్వు నవ్వి "ఏదో ఉందీ అమ్మాయిలో" అనిపించేసుకుంటుంది. కనిపించిన కాసేపు ప్లీజింగ్ గా ఉంది. హరితేజకి ఈ రోల్ డిఫరెంట్, తను కూడా బాగా చేసింది. భానుచందర్ గారిని చాలా రోజుల తర్వాత చూడ్డం బావుంది. ఇంకా విక్కీతో పోటీపడే మరో ఆఫీసర్ అండ్ విక్కీ అసిస్టెంట్ గా చేసిన మరో నటుడు ఇద్దరు కూడా గుర్తుండి పోతారు.ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ గురించి ఎక్కువ చెప్తే థ్రిల్ మిస్సవుతారు కాబట్తి ఎక్కువ రాయలేకపోతున్నాను. ఈ జెనర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒక సారి తప్పక చూడాల్సిన సినిమా హిట్. ఈ సినిమా టీజర్ ఇక్కడ థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ మరియూ స్నీక్ పీక్ ఇక్కడ చూడవచ్చు.
మంగళవారం, ఫిబ్రవరి 25, 2020
భీష్మ...
ఏదైనా కానీ అలవైకుంఠపురం లానే ఈ సినిమా కూడా అద్యంతం హాస్యంలో ముంచి తేలుస్తుంది. దానితో పాటు ఎరువులు పెస్టిసైడ్స్ లాంటి కెమికల్స్ ఉపయోగించకుండా చేసే ఆర్గానిక్ ఫార్మింగ్ / సహజ సిద్దమైన సేద్యం గురించి కూడా ప్రజల మనసుల్లో నాటుకునేలా చెప్తుంది.
కథ విషయానికి వస్తే సేంద్రియ వ్యవసాయాన్ని (ఆర్గానిక్ ఫార్మింగ్) ప్రోత్సహిస్తూ రైతులకి ప్రజలకి మధ్య ఒక బిజినెస్ మాన్ గా కాక విలువలను నమ్మిన వారధిగా వ్యవహరిస్తూ ఉంటారు భీష్మ ఆర్గానిక్స్ వ్యవస్థాపకులు భీష్మ(అనంత నాగ్). వారసులు లేని తన తదనంతరం సి.ఇ.ఓ గా ఎవర్ని నియమించేదీ తన కంపెనీ యాభయ్యవ వార్షికోత్సవం రోజు ప్రకటిస్తానని చెప్తారు. మరోపక్క ఫీల్డ్ సైన్స్ ఎం.డీ. రాఘవన్ (జిష్షూ సేన్ గుప్తా) తక్కువ సమయంలో అధిక ఉత్పత్తి సాధించే ఒక ఇన్స్టంట్ కెమికల్ కిట్ తయారు చేసి వ్యాపారాభివృద్ధి కోసం భీష్మా ఆర్గానిక్స్ కంపెనీని భూస్థాపితం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.
ఇదిలా ఉంటే మహాభారతంలో అన్ని పాత్రలున్నా ఆజన్మ బ్రహ్మచారి భీష్మ అనే పేరు పెట్టడం వల్లే తనకి ఏ అమ్మాయి ఓకే చెప్పడం లేదని తను కూడా సింగిల్ ఫరెవర్ గా మిగిలి పోవాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటాడు భీష్మ (నితిన్). అలాంటి టైమ్ లో తనకి భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తున్న చైత్ర (రష్మిక) పరిచయమౌతుంది. తన పేరు మీద ఓ కంపెనీ ఉందా అని ఆశ్చర్య పడిపోయిన భీష్మ చైత్రని ఇంప్రెస్ చేయడానికి ఆమెకి ఇష్టమైన ఆర్గానిక్ ఫార్మింగ్ గురించిన పుస్తకాలు చదువుతాడు. ఆ కాస్త నాలెడ్జ్ తో అతను ఓ ప్రెస్మీట్ లో మాట్లాడిన నాలుగు మాటలు డిగ్రీ డ్రాపౌట్ అయిన అతనిని ఆ కంపెనీ సి.ఇ.ఓ కుర్చీలో కూర్చోబెడతాయి. అతనిని నమ్మి ఆ అవకాశం ఇచ్చిన సీనియర్ భీష్మ నెలరోజుల్లో తన నమ్మకం సరైనదేనని నిరూపిస్తే అసలు తను ఎందుకు అతన్ని సెలెక్ట్ చేశాడో చెప్తానని చెప్తాడు. మన యంగ్ భీష్మ ఫీల్డ్ సైన్స్ రాఘవన్ ప్రయత్నాలని ఎలా తిప్పికొట్టాడు, తనని తాను నిరూపించుకుని కంపెనీని చైత్ర ప్రేమనీ ఎలా గెలుచుకున్నాడో తెలియాలంటే మీరు భీష్మ సినిమా చూడాలి.
నితిన్ కి ఇలాంటి రోల్స్ బాగా సూట్ అవుతాయ్ చాలా ఈజ్ తో చేసేస్తాడు. ఈ సినిమాలో మరింత కాన్ఫిడెంట్ గా కంఫర్టబుల్ గా కనిపించాడు. రష్మిక క్యూట్ గా అందంగా కనిపించడమే కాక సీ.ఈ.ఓ కి రైట్ హాండ్ గా కాన్ఫిడెంట్ గర్ల్ రోల్ లో ఆకట్టుకుంటుంది. అనంతనాగ్ గారిని చూడడం బావుంది. వెన్నెలకిషోర్ రోల్ బాగా నవ్విస్తుంది అలానే తను రఘుబాబు కాంబినేషన్ లో సీన్స్ కూడా నవ్విస్తాయి. సంపత్ రోల్ కూడా బావుంది తను నితిన్ కాంబినేషన్ సీన్స్ కూడా నవ్విస్తాయ్ చాటింగ్ సీన్ బాగా నవ్విస్తుంది. అలానె కార్పొరేట్ విలన్ పాత్రలో జిష్షూసేన్ గుప్తా ఆకట్టుకున్నాడు. అజయ్ రోల్ గుడ్ సర్ప్రైజ్ అండ్ ఎంటర్ టైనింగ్.
టెక్నికల్ డిపార్ట్మెంట్ లో సంగీతం కాస్త వీక్ గా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ బావున్నాయ్. ఫైట్స్ కొన్ని త్రివిక్రమ్ సినిమాలని తలపించాయి. డైలాగ్స్ విషయానికి వస్తే గుర్తుండి పోయే డైలాగ్స్ కోట్స్ గా మిగిలిపోయే డైలాగ్స్ తక్కువే కానీ చూసినంత సేపు సిట్యుయేషన్ కి తగ్గట్టు గిలిగింతలు పెడుతూ నవ్విస్తూ ఉంటాయ్."నలుగురు ఫ్రెండ్స్ కలిసి రోడ్ మీద దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రనా బాధ్యత లేదనుకుంటే ఎలా" లాంటి డైలాగ్ ఇంకా స్కూల్ బెల్ ని ఉదాహరణగా చూపిస్తూ ఒపీనియన్స్ సిట్యుయేషన్ ని బట్టి మారతాయని చెప్పే డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి.
"నా లవ్వు కూడా విజయ్ మాల్య లాంటిదేరా కళ్ళముందు కనిపిస్తుంది కానీ క్యాచ్ చేయలేం." లాంటి కాంటెపరరీ కామెడీ డైలాగ్స్, "మోర్నింగ్ టూ ఎగ్స్ ఈవెనింగ్ టూ పెగ్స్ నైట్ టూ లెగ్స్ అదేనయ్యా ప్రోటీన్స్ కోసం చికెన్ లెగ్స్" లాంటి నాటీ డైలాగ్స్ విన్నప్పుడు కొన్ని రొటీన్ సీన్స్ ని కామికల్ వే లో కన్సీవ్ చేయడం చూస్తే దర్శకుడి వెంకీ సెన్సాఫ్ హ్యూమర్ ని మెచ్చుకోకుండా ఉండలేం.
మొత్తంమీద పెట్టిన టిక్కెట్ డబ్బులకు న్యాయం చేస్తూ ఇంటిల్లిపాదీ హాయిగా కలిసి కూర్చుని ఎంజాయ్ చేయగల క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ భీష్మ. ఇలాంటి లైటర్ వీన్ సినిమాలని ఇష్టపడేవాళ్ళు మిస్సవకుండా చూసేయండి. ఈ సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.
బుధవారం, ఫిబ్రవరి 19, 2020
కార్తీ ఖైదీ...
బిజోయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. అతను ఓ రాత్రి చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న ఒక అతి పెద్ద డ్రగ్ ముఠా తాలూకు డ్రగ్స్ ని పట్టుకుంటాడు. దాదాపు తొమ్మిదివందల కిలోల బరువున్న ఆ కొకెయిన్ ధర తొమ్మిది వందల కోట్లు. తెల్లవారే వరకూ హయ్యర్ అఫీషియల్స్ కి సమాచారం అందించి కోర్ట్ కి సబ్మిట్ చేయలేరు కనుక కమిషనర్ ఆఫీస్ లో భద్ర పరుస్తాడు.
బిజోయ్ తో సహా ఆ ఆపరేషన్ లో ముఖ్య పాత్ర వహించిన ఐదుగురు పోలీసాఫీసర్లు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఐజీ ఇస్తున్న విందుకు హాజరవుతారు. అక్కడ డ్రగ్స్ ముఠాకు హెల్ప్ చేస్తున్న ఓ పోలీస్ ఆల్కహాల్ లో మత్తుమందు కలిపి అందరు స్పృహ తప్పి పడిపోయేలా చేస్తాడు. ఆ ప్రమాదకరమైన మత్తుమందు వల్ల సకాలంలో సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆ ఆఫీసర్స్ అందరూ చనిపోయే ప్రమాదం ఉంది.
డ్రగ్స్ ముఠాలో ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా బిజోయ్ కీ ఈ ఐదుగురు పోలీసులని చంపడానికి ఒక గ్యాంగ్, కమిషనర్ ఆఫీస్ లో ఉన్న కొకెయిన్ దోచుకెళ్ళడానికి ఒక గ్యాంగ్ బయల్దేరారని తెలుస్తుంది. సహాయం కోసం కమీషనర్ ఆఫీస్ ని అలర్ట్ చేయడానికి ప్రయత్నించిన అతనికి తాగి గొడవ చేస్తున్న కేస్ లో స్టేషన్ కి తీస్కొచ్చిన నలుగురు స్టూడెంట్స్ వాళ్ళకోసం వచ్చిన ఒక అమ్మాయి. బదిలీ పై వచ్చి ఇంకా ఛార్జ్ తీస్కోని ఒక కానిస్టేబుల్ నెపోలియన్ మాత్రమే ఆ కమీషనర్ ఆఫీస్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇపుడు అక్కడున్న తొమ్మిదివందల కేజీల కొకెయిన్ ని, జైలు లో ఉన్న ఖైదీలని ఈ ఐదుగురే కాపాడాలి.
అడవిలో గెస్ట్ హౌస్ కి కేటరింగ్ సామానుతో వచ్చిన లారీలో పోలీసాఫీసర్స్ ని ఎక్కించి వాళ్ళని ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పటల్ కి చేర్చడానికి తప్పనిసరి పరిస్థితులలో అక్కడే ఉన్న ఓ ఖైదీ (కార్తీ) సహాయం కోరుతాడు బిజోయ్. అతని పేరు ఢిల్లీ, ఓ హత్య కేసులో పదేళ్ళగా జైలు శిక్ష అనుభవించి ఆ రోజే రిలీజై అనాథాశ్రమంలో పెరుగుతున్న తన కూతురు అమృతను మొదటిసారి చూడడానికి వెళ్తూ ఉంటే, దారిలో అతని గడ్డం వాలకం చూసి అనుమానించిన ఓ పోలీసాఫీసర్ మళ్ళీ అరెస్ట్ చేసి ఎంక్వైరీకి తీస్కెళుతూ ఆ పార్టీ జరుగుతున్న దగ్గర ఆగుతాడు.
పదేళ్ళగా అనాథాశ్రమంలో పెరుగుతున్న అమృతకి తనను చూడడం కోసం పొద్దున్నే ఎవరో వస్తున్నారని తెలుస్తుంది కానీ ఎవరో తెలీదు. కమీషనర్ ఆఫీస్ లో ఉన్న ఐదుగురూ డ్రగ్స్ ని కాపాడగలిగారా, ఢిల్లీ ఆ పోలీసాఫీసర్స్ కి సహాయం చేశాడా, చేస్తే ఎంతవరకూ సాయం చేయగలిగాడు. నరరూప రాక్షసుల్లాంటి డ్రగ్స్ ముఠా చేతిలో పోలీసులు, స్టూడెంట్స్ హతం కాకుండా తప్పించుకో గలిగారా, అమృత తన తండ్రిని కలుసుకుందా లేదా అనేవి తెలియాలంటే మీరు ఖైదీ సినిమా చూడాలి.
సినిమా మొత్తం ఒక్క రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా అల్లిన కథ. చిత్రీకరణ మొత్తం రాత్రే జరుగుతుంది. ఇలాంటి చిత్రానికి స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ కీలకంగా నిలుస్తాయి. సినిమా చాలా వరకూ చీకట్లో షూట్ చేసినా ఎక్కడా మనకి ఆసక్తి సడలకుండా కట్టిపడేశాడు. సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ స్ట్రీట్ లైట్స్ ని హెడ్ లైట్స్ ని మంటలని వాడుకున్న తీరు, లైటింగ్ స్కీమ్ చాలా బావుంది తన వర్క్ ఆకట్టుకుంటుంది.
ఇలాంటి థీమ్ ఎన్నుకున్నందుకు దాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా హీరోయిన్, పాటలు, కామెడీలాంటివి కూడా యాడ్ చేయకుండా కథను మాత్రమే నమ్మి దాన్ని తెరకెక్కించినందుకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని అభినందించి తీరాలి. అలాగే శామ్ సి.ఎస్. నేపథ్య సంగీతం కూడా చాలా సన్నివేశాలని ఎలివేట్ చేస్తుంది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అడవిలో కొన్ని స్టంట్స్ రస్టిక్ గా తీసిన తీరు బావుంది.
కార్తీ తప్పించి ఇందులో ఇతర నటీనటులు ఎవ్వరూ నాకు తెలియరు కానీ సినిమా మొదలైన కొంత సేపటికే పాత్రలతో ఐడెంటిఫై చేసేసి కథను ఫాలో ఐపోతాము. కానిస్టేబుల్ నెపోలియన్ గా చేసిన నటుడు గుర్తుండిపోతాడు. ఇక కార్తీ ఢిల్లీ పాత్రలో ఒదిగిపోయాడు, పోలీసుల చేతిలో నానా చిత్రహింసలు అనుభవించి వాళ్ళనే కాపాడాలా వద్దా అసలు బిజోయ్ ని నమ్మచ్చా లేదా అనే మీమాంసలో ఉండే ఖైదీగా, కూతుర్ని మొదటిసారి చూడాలనీ తనకేమైనా పర్లేదు ఆ అమ్మాయి భవిష్యత్ బావుండాలనీ తపించే నాన్నగా, ఇచ్చిన మాట మీద నిలబడి ఒప్పుకున్న పని మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయాలని పోరాడే యోధుడిగా అన్ని షేడ్స్ ని అద్భుతంగా అభినయించాడు. తన గతం చెప్పే సన్నివేశంలో క్లోజప్ లో పలికించిన హావభావాలూ ఆ సన్నివేశం అలా గుర్తుండిపోతాయి.
యాక్షన్ సన్నివేశాలు కొంచెం ఎక్కువున్నా కథకవసరం కనుక ఎక్కడా విసుగు అనిపించకుండా ఇన్వాల్వ్ అయి చూస్తాము. అవి కూడా మరీ కత్తివిడిచి సాము చేయలేదు రియలిస్టిక్ గా తీశాడు. కాకపోతే గాట్లింగ్ గన్స్ సైతం స్మగుల్ చేసేంత పెద్ద డ్రగ్ మాఫియా కనీసం పిస్టల్ కూడా వాడకుండా కత్తులతో దాడులు చేయడం కాస్త ఆశ్చర్యమనిపిస్తుంది. ఐతే రిస్క్ తక్కువని చిత్తూరు లాంటి ఊరును ఎన్నుకుని ఆపరేట్ చేస్తున్నారు కనుక అంతగా అవసరపడవని వాడటం లేదని సరిపెట్టుకోవచ్చు.
సరికొత్త పూర్తి తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం ’ఆహా’ లో మొన్న పదిహేనో తారీఖున విడుదలైన "ఖైదీ" సినిమా వైవిధ్యమైన సినిమాలు యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు మిస్సవకుండా చూడవలసిన సినిమా. టీవీలో వచ్చినపుడైనా మిస్సవకండి. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.
బుధవారం, ఫిబ్రవరి 12, 2020
జాను...
చిన్నప్పటినుండీ కలిసి చదువుకున్న జాను అన్నా తను పాడే పాటలన్నా రామ్ కి ప్రత్యేకమైన ఇష్టం. తనని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు. తనకీ రామ్ అంటే అంతే ఇష్టం. జాను కి ఏం కావాలన్నా రామ్ నే అడుగుతుంది. తన నోటి వెంట మాట రావడం ఆలశ్యం ఆ మాట పూర్తయే లోపే రామ్ ఆ పని చేసి పెట్టేసెవాడు.
తనకి జాను మీదున్న ఫీలింగ్ ప్రేమో ఏంటో కూడా సరిగా తెలియదు కానీ జాను అంటే రామ్ కి ఓ అద్భుతం, అపురూపం, అపూర్వం. తనని చూసినా తను తాకినా అతని గుండె వెయ్యి రెట్లు వేగంగా కొట్టుకుంటుంది, తనమీదే ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నా కానీ ఎదురు పడితే మాత్రం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు మాట్లాడడానికి నోరు కూడా పెగలదు.
ఇష్టాన్ని అపుడపుడు ప్రదర్శించడమే తప్ప తమ ప్రేమ గురించి ఒకరికొకరు చెప్పుకోకుండానే స్కూల్ శలవలకు విడిపోయిన ఆ ఇద్దరూ అనుకోని పరిస్థితులలో తిరిగి కలుసుకోలేరు. దదాపు పదిహేడేళ్ళ తర్వాత రామ్ కి రీయూనియన్ ద్వారా మళ్ళీ జాను ని కలిసే అవకాశం వస్తుంది. జానూ అప్పుడేం చేస్తుంది, ఎలా ఉంది, రామ్ అపుడైనా తన ప్రేమ గురించి చెప్పగలిగాడా. ఆ రాత్రి ఎలా గడిచింది చివరికి ఏమైంది. అసలు ఎందుకు విడిపోయారు ఇలాంటి విషయాలు తెలియాలంటే మీరు "జాను" సినిమా చూడాలి.
ఈ సినిమాలో చూపించినది స్వచ్చమైన ప్రేమ, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్. అందుకే జాను మన మనసుల్లో శాశ్వతమైన ముద్ర వేసుకుని నిలిచి పోతుంది. ఎన్నేళ్ళైనా ప్రేమ ప్రస్తావన రాగానే గుర్తొచ్చే సినిమాగా మిగిలి పోతుంది. అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తామో అంతగా గౌరవమూ ఇవ్వాలి అని నేర్పించే సినిమా. రామ్ జాను ని చూస్కునే పద్దతి చూస్తే ఇలాంటి వాళ్ళు ఇలాంటి మెచ్యూర్డ్ ప్రేమలు ఉంటాయా అని ఆశ్చర్యపరిచే ప్రేమ.సినిమా ప్రారంభంలో దర్శకుడు ఒక స్లైడ్ వేస్తాడు "మార్పులు ప్రశ్న.. మార్పులే సమాధానం" అని. ఈ కథలోలా పరిస్థితుల ప్రభావంతో జరిగిన మార్పులు ప్రశ్నగా ఎదురైనపుడు దానికి సమాధానంగా వాస్తవాన్ని అంగీకరించి ఆ మార్పులకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకుంటూ మనమూ మారుతూ జీవించాలనీ అక్కడే ఆగిపోకూడదని నేర్పించే కథ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవ్ ఆన్ అని నేర్పించే ప్రేమ కథ. నిజానికి ఇన్నేళ్ళ తర్వాత జాను వచ్చింది రామ్ కి ఈ విషయం చెప్పడానికేనేమో అని అనిపించక మానదు.
నిజమే కొన్ని క్లాసిక్స్ ని ముట్టుకోకూడదు, రీమేక్ చేయడానికి ట్రై చేయకూడదు. అలాగే కొన్ని క్లాసిక్ కథలని చెప్పకుండా వదిలేయకూడదు, ఎంత ఎక్కువమందికి చెప్పగలిగితే అంతమందికి చెప్పి తీరాలి. జానూ అలాంటి క్లాసిక్ కథ కథానాలున్న సినిమానే. ఫాస్ట్ ట్రాక్ ప్రేమలు ఎక్కువైన ఈ తరానికి ఇలాంటి ప్రేమ కూడా ఒకటుంటుంది అసలు ప్రేమంటే ఇలాగే ఉండాలి అని చూపించాలి.
బహుశా అందుకేనేమో ఎందరు వద్దన్నా నిర్మాతగా తన ఇరవై ఏళ్ళ ప్రస్థానంలో ఎప్పుడూ రీమేక్ జోలికి వెళ్ళని దిల్ రాజు గారు ఈ సినిమాని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. లాభనష్టాల లెక్కలు ఎలా ఉన్నా నిర్మాతకు "ఇంత మంచి సినిమాని నేను నిర్మించాను" అని గర్వంతో కూడిన ఆనందాన్ని మాత్రం తప్పకుండా మిగిల్చే సినిమా జాను.
ఈ సినిమా నిర్మాణంలో సగం విజయం ఒరిజినల్ వర్షన్ తీసిన దర్శకుడిని, సంగీత దర్శకుడిని ఈ సినిమాకి కూడా పని చేయడానికి ఒప్పించడం. 96 సినిమా అంత అందంగా రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారణం వీళ్ళిద్దరే.
ఇక విజయ్ సేతుపతి, త్రిషలను రీప్లేస్ చేయడం దదాపు అసాధ్యమైనా కానీ రామ్, జాను పాత్రలకు న్యాయం చేయగల శర్వానంద్ అండ్ సమంతాలను ఎన్నుకోవడం మిగిలిన సక్సెస్. అనౌన్స్ చేసినపుడు అంత నమ్మకం లేకపోయినా సినిమా చూశాక వీళ్ళిద్దరూ కూడా ఆ పాత్రలకు ప్రాణం పోశారనిపించింది.
ఒరిజినల్ వర్షన్ లో పాటలు నేపథ్య సంగీతం చేసిన మ్యాజిక్ అచ్చుగుద్దినట్లుగా ఇందులోనూ అలానే రిపీట్ అయింది. ఈ సినిమాలోని సన్నివేశాలు మన మనసు లోతుల్లో ముద్రపడిపోవడానికి సంగీతం వహించిన ముఖ్య పాత్ర మరిచిపోలేనిది. ముఖ్యంగా జాను రామ్ ఎదపై చేతితో తాకినపుడు బట్టర్ ఫ్లైస్ ఇన్ స్టమక్ ఎఫెక్ట్ ని చూపించేలా వచ్చే ఆ నేపథ్య సంగీతం మరిచి పోలేనిది.
సగటు మాస్ సినిమాలు మాత్రమే ఎంజాయ్ చేసేవారికి జాను నచ్చకపోవచ్చు. మూడు ఫైట్లు ఆరు పాటలు కాసిని కామెడీ సన్నివేశాలతో చుట్టేసిన సినిమా కాదు ఇది. కౌగిలింతలు ముద్దులే కాదు కనీసం హీరో హీరోయిన్ని ముట్టుకునే సన్నివేశాలు కూడా లేని ప్రేమ కథ జాను. ఒక్క ఫైట్, ఒక్క డాన్స్ మూవ్ మెంట్, ఇరికించిన కామెడీ ట్రాక్స్ లేని జాను ఒక ప్యూర్ ఎమోషనల్ రైడ్. మెల్లగా ఒక్కో సీన్ నూ ఆస్వాదిస్తూ, ఆ అనుభూతిని ప్రేమను అనుభవిస్తూ, వారి పెయిన్ ని అర్ధం చేసుకుంటూ నిదానంగా తీరికగా చూడవలసిన సినిమా. అలాగే సినిమా చూసినంత సేపూ మన స్కూల్ డేస్, అప్పట్లో మనం చూసిన ప్రేమ కథలు జ్ఞాపకాలు మనని చుట్టుముట్టేస్తాయి.
కథా కథనాలు తీసిన సన్నివేశాలు కూడా దానికి అనుగుణంగా నెమ్మదిగా ఒక కవిత చదువుతున్నట్లు ఉంటాయి. చిన్నప్పటి రామ్ బిడియం, జాను చొరవ, పెద్దయ్యాక కూడా అవి అలాగే కంటిన్యూ అవడం, రామ్ రాత్రి గడిచే కొద్దీ మెల్లగా మాటల్లో ఓపెనప్ అవడం. జాను రామ్ ని ఫ్యామిలీ మాన్ గా ఎలా చూడాలనుకుంటుందో చెప్పే సన్నివేశాలు, హెయిర్ కట్ సీన్, మెట్రోలో మైండ్ ది గాప్ షాట్, రాత్రంతా కలిసి తిరిగినా ఇద్దరి మధ్యా ఉన్న గౌరవ ప్రదమైన దూరాన్ని చూపే సన్నివేశాలు, మంగళ సూత్రాలను రామ్ కళ్ళకద్దుకునే సన్నివేశం, అన్నీ బావుండి ఉంటే ఎలా ఉండేదో అని ఊహించుకుంటూ జాను చెప్పే సన్నివేశం. వీళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేస్తే ఏమౌతుందో అంటూ మిత్రులు పడే టెన్షన్, జాను కూతురు ఫోటో చూడడానికి రామ్ పడే తపన అన్నీ కూడా క్యూట్ గా అందంగా ఉంటాయి.
అలాగే ఎస్ జానకి పాడిన పాటలు మాత్రమే పాడే జాను తన కోసం దళపతి సినిమాలో స్వర్ణలత పాడిన ’యమునా తటిలో’ పాట పాడితే వినాలని రామ్ ఆశపడడం, ఆసక్తిగా ఎదురు చూడడం. ఆ థ్రెడ్ ని అలానే సినిమా అంతటా కొనసాగించి దాన్ని ముగించిన తీరు ముచ్చటగా అనిపిస్తుంది. ఇలాంటి ముచ్చట గొలిపే చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి సినిమా అంతటా. తమిళ్ వర్షన్ కి తెలుగుకి ముఖ్యమైన తేడా టైమ్. తమిళ్ లో నైంటీ సిక్స్ బ్యాచ్ గా చూపిస్తే తెలుగులో బహుశా నటీనటుల వయసు వల్లో లేక గ్లామర్ దృష్టిలో పెట్టుకునో కానీ 2004 బ్యాచ్ గా చూపించారు. దానితో కథకు సంబంధించిన ముఖ్యమైన నేపధ్యం తాలూకు సెటప్ కొంత దెబ్బతిన్నట్లైంది. ఇంత స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వం, పసిపిల్లలాంటి మనస్తత్వం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అదీ వైజాగ్ లో ఉన్నాయంటే నమ్మబుద్ది కాదు. కాకపోతే ఒకసారి ఎమోషన్ కి కనెక్ట్ అయిన తరువాత సినిమాలోని కథా కథనాలు ఈ లోపాన్ని మర్చిపోయేలా చేస్తాయి.
మొత్తం మీద ’జాను’ ’96’ కి ఒక ఫెయిత్ ఫుల్ రీమేక్, యథాతథంగా తెరకెక్కించారు. తమిళ్ అర్ధమై 96 చూసిన వాళ్ళకి జాను కొత్తగా ఆఫర్ చేసేదేం ఉండదు కనుక కేవలం నటీ నటులకోసం చూడాలనుకుంటే చూడవచ్చు. సబ్ టైటిల్స్ పై ఫోకస్ చేసి చూసిన వాళ్ళు కూడా ఒక సారి ఆ స్ట్రెయిట్ అనుభూతి కోసం మళ్ళీ చూడవచ్చు. ఇక ఒరిజినల్ వర్షన్ చూడని వాళ్ళు మాత్రం ఒక సారి తప్పక చూసి తీరవలసిన చిత్రం జాను. స్వచ్ఛమైన ప్రేమని మనసారా అనుభూతి చెందాలంటే మిస్ అవకూడని సినిమా జాను. ఈ సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు. మరికొన్ని ప్రోమోస్ ఇక్కడ చూడవచ్చు.
నేను ???
- వేణూశ్రీకాంత్
- అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.






























