అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

భీష్మ...

త్రివిక్రం గారి ప్రియ శిష్యుడు వెంకీ కుడుముల ఇంటిల్లి పాది హాయిగా నవ్వుకుంటూ చూసొచ్చేలా తీసిన సినిమా భీష్మ. సినిమాలో అక్కడక్కడ మనం త్రివిక్రమ్ సినిమా చూస్తున్నామా లేక వెంకీ కుడుముల సినిమా చూస్తున్నామా అనిపిస్తుంటుంది. చిత్రమైన విషయమేంటంటే ఇదే దర్శకుని మొదటి సినిమా ’ఛలో’ చూసినపుడు ఇలాంటి ఆలోచన రాలేదు. అది చాలా రిఫ్రెషింగ్ గా కొత్తగా ఉంటుంది కానీ ఈ సినిమాలో మాత్రం గురువు గారి ప్రభావం బాగా కనిపించింది.బహుశా ఎన్నుకున్న స్క్రిప్ట్ వల్లేమో.

ఏదైనా కానీ అలవైకుంఠపురం లానే ఈ సినిమా కూడా అద్యంతం హాస్యంలో ముంచి తేలుస్తుంది. దానితో పాటు ఎరువులు పెస్టిసైడ్స్ లాంటి కెమికల్స్ ఉపయోగించకుండా చేసే ఆర్గానిక్ ఫార్మింగ్ / సహజ సిద్దమైన సేద్యం గురించి కూడా ప్రజల మనసుల్లో నాటుకునేలా చెప్తుంది. 

కథ విషయానికి వస్తే సేంద్రియ వ్యవసాయాన్ని (ఆర్గానిక్ ఫార్మింగ్) ప్రోత్సహిస్తూ రైతులకి ప్రజలకి మధ్య ఒక బిజినెస్ మాన్ గా కాక విలువలను నమ్మిన వారధిగా వ్యవహరిస్తూ ఉంటారు భీష్మ ఆర్గానిక్స్ వ్యవస్థాపకులు భీష్మ(అనంత నాగ్). వారసులు లేని తన తదనంతరం సి.ఇ.ఓ గా ఎవర్ని నియమించేదీ తన కంపెనీ యాభయ్యవ వార్షికోత్సవం రోజు ప్రకటిస్తానని చెప్తారు. మరోపక్క ఫీల్డ్ సైన్స్ ఎం.డీ. రాఘవన్ (జిష్షూ సేన్ గుప్తా) తక్కువ సమయంలో అధిక ఉత్పత్తి సాధించే ఒక ఇన్స్టంట్ కెమికల్ కిట్ తయారు చేసి వ్యాపారాభివృద్ధి కోసం భీష్మా ఆర్గానిక్స్ కంపెనీని భూస్థాపితం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.

ఇదిలా ఉంటే మహాభారతంలో అన్ని పాత్రలున్నా ఆజన్మ బ్రహ్మచారి భీష్మ అనే పేరు పెట్టడం వల్లే తనకి ఏ అమ్మాయి ఓకే చెప్పడం లేదని తను కూడా సింగిల్ ఫరెవర్ గా మిగిలి పోవాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటాడు భీష్మ (నితిన్). అలాంటి టైమ్ లో తనకి భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తున్న చైత్ర (రష్మిక) పరిచయమౌతుంది. తన పేరు మీద ఓ కంపెనీ ఉందా అని ఆశ్చర్య పడిపోయిన భీష్మ చైత్రని ఇంప్రెస్ చేయడానికి ఆమెకి ఇష్టమైన ఆర్గానిక్ ఫార్మింగ్ గురించిన పుస్తకాలు చదువుతాడు.

ఆ కాస్త నాలెడ్జ్ తో అతను ఓ ప్రెస్మీట్ లో మాట్లాడిన నాలుగు మాటలు డిగ్రీ డ్రాపౌట్ అయిన అతనిని ఆ కంపెనీ సి.ఇ.ఓ కుర్చీలో కూర్చోబెడతాయి. అతనిని నమ్మి ఆ అవకాశం ఇచ్చిన సీనియర్ భీష్మ నెలరోజుల్లో తన నమ్మకం సరైనదేనని నిరూపిస్తే అసలు తను ఎందుకు అతన్ని సెలెక్ట్ చేశాడో చెప్తానని చెప్తాడు. మన యంగ్ భీష్మ ఫీల్డ్ సైన్స్ రాఘవన్ ప్రయత్నాలని ఎలా తిప్పికొట్టాడు, తనని తాను నిరూపించుకుని కంపెనీని చైత్ర ప్రేమనీ ఎలా గెలుచుకున్నాడో తెలియాలంటే మీరు భీష్మ సినిమా చూడాలి.

నితిన్ కి ఇలాంటి రోల్స్ బాగా సూట్ అవుతాయ్ చాలా ఈజ్ తో చేసేస్తాడు. ఈ సినిమాలో మరింత కాన్ఫిడెంట్ గా కంఫర్టబుల్ గా కనిపించాడు. రష్మిక క్యూట్ గా అందంగా కనిపించడమే కాక సీ.ఈ.ఓ కి రైట్ హాండ్ గా కాన్ఫిడెంట్ గర్ల్ రోల్ లో ఆకట్టుకుంటుంది. అనంతనాగ్ గారిని చూడడం బావుంది. వెన్నెలకిషోర్ రోల్ బాగా నవ్విస్తుంది అలానే తను రఘుబాబు కాంబినేషన్ లో సీన్స్ కూడా నవ్విస్తాయి. సంపత్ రోల్ కూడా బావుంది తను నితిన్ కాంబినేషన్ సీన్స్ కూడా నవ్విస్తాయ్ చాటింగ్ సీన్ బాగా నవ్విస్తుంది. అలానె కార్పొరేట్ విలన్ పాత్రలో జిష్షూసేన్ గుప్తా ఆకట్టుకున్నాడు. అజయ్ రోల్ గుడ్ సర్ప్రైజ్ అండ్ ఎంటర్ టైనింగ్.

టెక్నికల్ డిపార్ట్మెంట్ లో సంగీతం కాస్త వీక్ గా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ బావున్నాయ్. ఫైట్స్ కొన్ని త్రివిక్రమ్ సినిమాలని తలపించాయి. డైలాగ్స్ విషయానికి వస్తే గుర్తుండి పోయే డైలాగ్స్ కోట్స్ గా మిగిలిపోయే డైలాగ్స్ తక్కువే కానీ చూసినంత సేపు సిట్యుయేషన్ కి తగ్గట్టు గిలిగింతలు పెడుతూ నవ్విస్తూ ఉంటాయ్.

"నలుగురు ఫ్రెండ్స్ కలిసి రోడ్ మీద దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రనా బాధ్యత లేదనుకుంటే ఎలా" లాంటి డైలాగ్ ఇంకా స్కూల్ బెల్ ని ఉదాహరణగా చూపిస్తూ ఒపీనియన్స్ సిట్యుయేషన్ ని బట్టి మారతాయని చెప్పే డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి.

"నా లవ్వు కూడా విజయ్ మాల్య లాంటిదేరా కళ్ళముందు కనిపిస్తుంది కానీ క్యాచ్ చేయలేం." లాంటి కాంటెపరరీ కామెడీ డైలాగ్స్, "మోర్నింగ్ టూ ఎగ్స్ ఈవెనింగ్ టూ పెగ్స్ నైట్ టూ లెగ్స్ అదేనయ్యా ప్రోటీన్స్ కోసం చికెన్ లెగ్స్" లాంటి నాటీ డైలాగ్స్ విన్నప్పుడు కొన్ని రొటీన్ సీన్స్ ని కామికల్ వే లో కన్సీవ్ చేయడం చూస్తే దర్శకుడి వెంకీ సెన్సాఫ్ హ్యూమర్ ని మెచ్చుకోకుండా ఉండలేం. 

మొత్తంమీద పెట్టిన టిక్కెట్ డబ్బులకు న్యాయం చేస్తూ ఇంటిల్లిపాదీ హాయిగా కలిసి కూర్చుని ఎంజాయ్ చేయగల క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ భీష్మ. ఇలాంటి లైటర్ వీన్ సినిమాలని ఇష్టపడేవాళ్ళు మిస్సవకుండా చూసేయండి. ఈ సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.

శుక్రవారం, ఫిబ్రవరి 21, 2020

కోటప్పకొండ తిరణాల జ్ఞాపకాలు...


శివరాత్రి అనగానే అందరికీ ఆ పరమశివుడు, ఉపవాస జాగారాలు గుర్తు రావడం సహజమే కానీ మా నర్సరావుపేట వాళ్ళకి మాత్రం శివరాత్రి అనగానే ముందు కోటప్ప కొండ తిరణాళ్ళే గుర్తొస్తుంది. దక్షయజ్ఞం తర్వాత పన్నెండేళ్ళ బాలుడిగా దక్షిణామూర్తి అవతారంలో త్రికూటాచలమైన మా కోటప్ప కొండపై వెలిశారట ఆ పరమశివుడు.

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా.. కన్నెపిల్ల కనిపిస్తే నాకోసం పడిఛస్తే నూటొక్క టెంకాయ కొడతానని మొక్కుకున్నా అని దాసరి గారు పాట రాసేశారు కానీ మా కోటయ్య బ్రహ్మచారి దేవుడు. అందుకే ఈ కొండమీద కానీ గుడిలో కానీ పెళ్ళిళ్ళు చేయరట. ఇక్కడి గుడి ముందు ద్వజస్తంభం కూడా ఉండదు. ఇంకా గుళ్ళలో ప్రసాదాలంటే లడ్డూలే గుర్తొస్తాయి కదా మా కోటప్పకొండ ప్రత్యేక ప్రసాదం నేతి అరిశలు. సాధారణంగా సంక్రాంతి రోజుల్లో తప్ప మిగిలిన టైంలో అంతగా వండుకోని ఈ నేతి అరిశలని గుళ్ళో ప్రసాదంగా భక్తులకు పంచి పెట్టడం నాకు తెలిసి ఇంకెక్కడా లేదు మా కోటప్పకొండలో తప్ప. 

కాకులు దూరని కారడవిని గురించి కథల్లో విని ఉంటారు కదా మా కోటప్ప కొండ కాకులు వాలని కొండ. గొల్లభామ శాపం వలన ఆ చుట్టుపక్కలెక్కడా ఒక్క కాకికూడా కనిపించదు. అలాగే తిరునాళ్ళ అయ్యాక కొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రద్దీ వలన పేరుకున్న చెత్త అంతా కొట్టుకు పోయి కొండ శుభ్రపడడం కూడా ఓ వింతట. ఇలాంటి వింతలూ వాటి వెనుక స్థలపురాణం, ఇంకా బోలెడు విశేషాలు, ఫోటోలతో సహా మా నరసరావుపేట్రియాట్స్ బ్లాగ్ లో ఒకప్పుడు సుజాత గారు రాసిన టపాలో ఇక్కడ చదవి మీరూ తిరణాళకి వెళ్ళొచ్చిన అనుభూతి చెందచ్చు. అలాగే మా కోటప్పకొండ గురించి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన డాక్యుమెంటరీ వీడియో ఇక్కడ చూడవచ్చు.

త్రికోటేశ్వరుడని కూడా పిలుచుకునే మా కోటయ్యంటే మాకు అమితమైన భక్తి. ఆ భక్తి తో పాటు తిరనాళ్ళంటే కూడా బోల్డంత అనురక్తి. ఐతే నేను కొండమీదకి వెళ్ళి స్వామిని దర్శించుకున్నది నాకు గుర్తుండీ రెండు మూడు సార్లకన్నా ఎక్కువ లేదు. మేం నర్సరావుపేటలో ఉన్న నా చిన్నతనంలో పండగంటే నా  ఎదురు చూపులూ, నా పండగ అంతా ఊర్లో జరిగే హడావిడి గురించే ఉండేది. 

శివరాత్రి వెళ్ళాక శివశివా అనుకుంటూ చలి కూడా పారిపోతుందని మా అమ్మ చెప్పేది. కానీ ఒక్కోసారి పండగ పది రోజులుందనగానే చలి పారిపోయేది. ఇక అప్పుడపుడే మొదలయ్యే ఎండాకాలం ఉక్కపోతలో ఈత లేదా తాటాకు తో చేసిన విసనకర్రలతోనో మడతేసిన న్యూస్ పేపర్లతోనో విసురుకుంటూ అబ్బా ఈ సారి తిరనాళ్ళలో ఓ కొత్త విసనకర్ర కొనాల్రా ఇది బాగా పాతపడిపోయింది అని గుర్తు చేస్కుంటున్నామంటే తిరనాళ్ళ హడావిడి మొదలై పోయినట్లే.

విసనకర్రలకి తిరనాళ్ళకి ఏంటీ సంబంధం అంటారా. ఒకటి తిరనాళ్ళ టైమ్ లో పండగరోజు ఆ రాత్రి కోటప్ప కొండ దగ్గర ఉండే విశాలమైన మైదానంలో పెట్టని కొట్టూ దొరకని వస్తువూ ఉండేది కాదు. పండగ మర్నాడు వాటిలో చాలా కొట్లు తీస్కొచ్చి నర్సరావుపేటలో పెట్టేవారు. మార్కెట్ ఏరియా, చిత్రాలయ దగ్గర మొదలుపెట్టి కోటప్పకొండ రోడ్ లో చాలా దూరం రోడ్డు పక్కన ఈ తాత్కాలిక షాపులు వెలిసేవి. పండగకి రెండు మూడు నెలల ముందునుండే మాకు ఏం కావాలని అడిగినా "తిరణాలలో కొనుక్కుందాంలేరా" అనేసి వాయిదా వేసేసేది అమ్మ.

ఇక అసలు విసనకర్రలు ఎందుకు గుర్తొచ్చాయంటే శివరాత్రికి రెండు రోజుల ముందు నుండే ప్రభలు కొండ దగ్గరకి బయల్దేరేవి అవి ఊరుదాటేప్పుడు తిరిగి వచ్చేటప్పుడూ వాటికోసమని ఆ దారి కవర్ అయ్యే ఏరియాల్లో అన్నిట్లోనూ పగలంతా కరెంట్ తీసేసేవారు. దాంతో శివరాత్రి అంటే తిరణాల సంబరాలతో పాటు నాకు కరెంట్ కష్టాలు కూడా గుర్తొచ్చేవనమాట. ఇపుడు బహుశా ఊరు చుట్టూ రహదారి మార్గం హైటెన్షన్ వైర్లని తప్పించుకువెళ్ళే మార్గం ఏర్పాటు చేస్కుని ఉండి ఉంటారేమో కానీ ఓ ముప్పై ఏళ్ళ క్రితం మాత్రం ఇంతే ఉండేది.  

మా కోటప్పకొండ తిరణాళ్ళలో ముఖ్యమైన అట్రాక్షన్ ప్రభలు. టూ డైమెన్షనల్ గుడి గోపురాన్ని గుర్తు చేస్తూ డెబై ఎనభై అడుగుల ఎత్తులో ఆకాశాన్నంటుతున్నట్లుగా దీర్ఘ చతురస్రాకారంలో ఒక వెడల్పాటి వెదురు పట్టా. దాని పైన త్రికోణపు శిఖరం ఉండి రకరకాల అలంకరణలతో తీర్చి దిద్దేదానినే ప్రభ అని అంటారు. దానికి పైనుండీ నిలువెల్లా తాళ్ళు కట్టి నేలమీదనుండే ముందుకు వెనక్కు లాగడానికి వీలుగా అరేంజ్మెంట్ చేసిన దానిని సైజ్ బట్టి ఎడ్లబండి మీదో ట్రాక్టర్ మీదో నిలబెట్టి కొండకి తరలిస్తారు. వీటిలో అరచేతిలో ఇమిడి పోయే పిల్లల ప్రభలనుండి వంద అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బల్బులతో అలంకరణలతో మెరిసిపోయే భారీ ప్రభల వరకూ ఉంటాయి.

నా చిన్నతనంలో వీటిని చూడ్డానికి మా నాన్న గారి చేయి పట్టుకుని చిత్రాలయ దగ్గరకి వెళ్ళడం ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడ ఆ జనం హడావిడిలో వందలమంది ఉన్నా క్రమశిక్షణతో ఏ తొక్కిసలాట లేకుండా ప్రభలను జాగ్రత్తగా తీస్కెళ్ళేవాళ్ళు. గులామ్ లు చల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ డాన్సులు వేసుకుంటూ వీటిని తీస్కెళ్ళే జనాన్ని ఆ కోలాహలాన్ని చూడ్డానికి నాకు రెండు కళ్ళూ సరిపోయేవి కాదు. ఇక కొండదగ్గరైతే చుట్టూ విశాలమైన మైదానంలో ఇసకేస్తే రాలనట్లుగా ఎటు చూసినా జనం, వాళ్ళమధ్యలో అక్కడక్కడా నుంచుని పైకి ఠీవిగా చూసే వందల కొద్ది ప్రభలను ఒకే చోట చూడడం ఓ అద్భుతం అంతే.

ఇలా ముందు రోజు సాయంత్రం ప్రభలను చూడ్డానికి వెళ్ళడం ప్రతి పండగకీ ఉంటుంది. ఒక సంవత్సరం మాత్రం నాన్నగారితో కలిసి కోటప్ప కొండ తిరణాలకి వెళ్ళడం ఒక మరిచి పోలేని అనుభవం. మామూలుగా ఉండే బస్ స్టాండ్ కి కొంచెం దూరం గా ఒక పెద్ద గ్రౌండ్ లో ప్రత్యేకం గా కర్రలతో కట్టిన క్యూలు, జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులూ వాలంటీర్లు ఏర్పాటు చేసి గుడి దగ్గరకి వెళ్ళే బస్సులకోసం ప్రత్యేకంగా ఓ మినీ బస్టాండ్ కట్టేసేవారు ఆ కొద్ది రోజులు. ఇక అక్కడ వాలంటీర్లు పోలీసులు చేసే హడావిడి ఆ ఎఱ్ఱ బస్సులు అవన్నీ ఓ అద్భుతమే అప్పట్లో.  

ఇప్పుడంటే కోడెల శివప్రసాద్ గారి పుణ్యమా అని ఘాట్ రోడ్ ఉంది కానీ అప్పట్లో మెట్ల మార్గమొక్కటే ఉండేది. ఇక రాత్రిపూటే కొండ దిగువకు బస్సులో చేరుకుని నాన్నతో కలిసి ఆపసోపాలు పడుతూ మెల్లగా కొండ ఎక్కడం. మధ్య మధ్యలొ గొల్లభామ గుడి గురించి ఆ స్థలపురాణాల గురించి నాన్న గారి మాటల్లో వినడం భలే ఉండేది. దర్శనమయ్యాక ఎపుడో రెండు మూడింటపుడు మళ్ళీ కొండదిగి కింద ఉన్న హడావిడి అంతా కాసేపు కలియ తిరిగుతూ చూసేసే వాళ్ళం.

మొత్తం మీద రాత్రంతా నిద్రమేలుకుని అక్కడక్కడే తిరిగేసి తెల్ల వారు ఝామున విపరీతమైన నిద్ర మత్తుతో జోగుతూ తిరుగు బస్ లో ప్రయాణం మొదలు పెట్టేవాళ్ళం. తెల్లగా తెల్లారాక పొద్దున్న పూజ అయ్యే వరకూ నిద్ర పోకూడదురా అని అంటూ నాన్నగారు నన్ను నిద్ర పోనివ్వకుండా బస్సు వెళ్తుంటే ఆ చుట్టు పక్కల తగిలే ఊర్లను చూపిస్తూ వాటి గురించి, అక్కడ వాళ్ళ అలవాట్ల గురించి, కొండ గురించి, తిరణాల గురించి, బస్ గురించి, కండక్టరు గురించీ, డ్రైవరు అదే పనిగా ఉపయోగించే గేర్ రాడ్ గురించీ ఒకటేమిటి సమస్తం కబుర్లు చెప్తూ నన్ను ప్రశ్నలు వేస్తూ మెలకువతో ఉంచేవారు.

ఇంటికి వచ్చాక సాయంత్రం కొనాల్సిన బొమ్మల గురించి ప్రాణాలికలు వేసుకుంటూ, అంతక్రితం ఏడాది స్కూల్ లో ఫ్రెండ్స్ దగ్గర చూసినవి, నిన్న రాత్రి కొండ దగ్గిర చూసినవి బోలెడన్ని బొమ్మలు గుర్తు చేసుకుంటూ వాటిలో ఏఏ బొమ్మలు ఖచ్చితంగా కొనాలో మనసులోనే టిక్ పెట్టేసుకుంటూ స్నాన పానాదులు ముగించేసి, "సాయంత్రం బోలెడన్ని మంచి బొమ్మలు ఒక్క కొట్లోనే అదీ మేం రిక్షా దిగిన దగ్గరలోనే దొరికేలా చూడు స్వామి" అని భక్తిగా ఈశ్వరుడికి దండం పెట్టేసుకుని బజ్జుంటే మళ్ళీ మధ్యాహ్నం భోజనానికే అమ్మ నిద్ర లేపేది. 

అలా వేసుకున్న ప్రణాళికలన్నీ గల్లంతవుతూ తీరా అక్కడికి వెళ్ళాక ఆ మోడల్స్ మారిపోవడమో వేరే కొత్త కొత్త బొమ్మలు వచ్చేయడమో జరిగేది. ఇంక అన్ని కొట్ల మధ్య అన్ని బొమ్మల లోంచి ఓ నాలుగైదు బొమ్మలు కొనుక్కోవాలంటే ఏం కొంటాం చెప్పండి. అందుకే నాకు అర్ధం కాక ఒకోసారి ఆ బాధ్యత నాన్నారికే అప్పచెప్పి తను కొనిచ్చిన బొమ్మలే కొనుక్కునే వాడ్ని. ఆ బొమ్మలన్నీ అంతగా గుర్తులేవు కానీ వాటితో పాటు ప్రతీ తిరణాలలోనూ ఓ బుల్లి మౌతార్గాన్, మరో బుల్లి పిల్లంగ్రోవి మాత్రం ఖచ్చితంగా కొనుక్కునే వాడ్ని.

ఇక బొమ్మలు కొన్నాక అమ్మ కోసం గాజులు, బొట్టుబిళ్ళలు, ఇంట్లోకి పసుపు, కుంకుమ లాంటివి తప్పకుండా కొనేవాళ్ళం వాటి సెలక్షన్ అంతా నాన్నదే అనుకోండి. ఆ తర్వాత మన ప్రయారిటీ తిండిమీదుండేది తిరణాలలో దొరికే తిండ్లంటే ఖచ్చితంగా బూందీ, పూసమిఠాయి(కరకజ్జం), పంచదార బెండ్లు, పంచదార చిలకలు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా బెండ్లు తిరణాలలో తప్ప మాములు స్వీట్ షాప్స్ లో ఇంకెక్కడా దొరకవు. ఇవయ్యాక తిరణాళ్ళ షాపింగ్ లో మరిచిపోకుండా ఇంటికి తిరిగి వచ్చేముందు ముఖ్యంగా కొనాల్సింది చెఱకు గెడలు.

అసలు చెఱకు తో నా ప్రణయం ఈనాటిది కాదు మొదటి సారి కోటప్ప కొండ తిరునాళ్ళలోనే మొదలైంది. ఆరోజు నుండీ ఈ రోజు వరకు ఆ ప్రేమ దిన దిన ప్రవర్ధమానమౌతున్నదే కానీ కొంచెం కూడా తగ్గలేదు. కోటప్పకొండ తిరణాళ్ళకు అప్పట్లో ఎక్కడ నుండి తెప్పించే వారో కానీ చెఱకు గెడలు భలే రుచిగా ఉండేవి. సాక్షాత్తు ఉయ్యూరు చక్కెర ఫాక్టరీకి వెళ్ళి తిన్నా కూడా ఆ రుచి మాత్రం నాకు ఇంకెక్కడా దొరకలేదు. 

నిలువెత్తు పెరిగి నిలువెల్లా నల్లగా నిగనిగలాడుతూ, ఆభరణాలు వేసుకున్నట్లు కణుపుల దగ్గర మాత్రం నలుపు తెలుపుల్లో మెరిసిపోతూ చూడటానికే అధ్బుతంగా ఉండేవి. ఇక వాటిలో ఒక మాంచి గడలు ఒక రెండు మూడు నాన్న ఎన్నుకుని వాడికి చెప్పగానే వాడు పదునైన కొడవలితో వాటిని ముక్కలు కొడుతుంటే చూడాలీ. కళ్ళప్పగించి చూస్తున్న నన్ను నాన్నారు "కొడవలి జారుతుందమ్మా" అని ఓ మూడు అడుగులు దూరంగా నించో బెట్టేవారు. అయినా అంతదూరం రసం చిమ్మి ఎగిరి వచ్చి మీద పడేది దానికి తోడు కమ్మని వాసన కూడా చుట్టు ముట్టి తన్మయంలో ముంచేసేది. ఇక ఆ ముక్కలని పొడవాటి ఆకుతో కట్టకట్టించుకుని ఎప్పుడెపుడు ఇంటికి చేరతామా అని ఎదురు చూసే వాడ్ని.

ఇంటికి వచ్చాక కొన్న బొమ్మలని అన్నిటిని అమ్మకి ఎలా ఆడుకోవాలో డిమాన్స్ట్రేట్ చేసి చూపించేసి ఆ తర్వాత చెఱకు పిప్పి వేయడానికి ఓ న్యూస్ పేపర్ పరుచుకుని దాని ఎదురుగా మఠం వేసుకుని కూర్చుని ఓ చెరుకు గెడ ముక్క చేతికందుకునే వాడ్ని. ఆ చెఱకు ముక్క ఒక చివర కచక్ మని కొరికి సర్ర్‍ర్‍ర్ర్ మంటూ చప్పుడొచ్చేలా ఒకేసారి 3-4 కణుపులు మీదుగా ఊడొచ్చేలా చెక్కును లాగేసి. ఆ క్రమంలో దానికి ఎక్కడైనా ఎక్కువ కండ పట్టిందేమో చూసుకుని ఒక వేళ పడితే దాన్ని కూడా నమిలేసి, రసం పీల్చేసే వాడిని. 

అలా చెఱకు అంతా ఒలిచాక ఓ చివర ఒక లావుపాటి ముక్కను కొరికి దవడ పళ్ళ మధ్యలో పెట్టి గాట్టిగా ఒక సారి నొక్కగానే... నా సామిరంగా... పళ్లమధ్య నుండి చెఱకురసం దాని కమ్మదనం స్లో మోషన్ లో ఒక్కో చినుకులా రాలి, నదులుగా మారి, వరదలై పొంగి, ప్రవాహమై నాలుకపై టేస్ట్ బడ్స్ ని నిలువెల్లా ముంచెత్తుతుంటే... ఆహా... ఆ ఆనందం అనుభవించాలే కానీ మాటలలో చెప్పతరమా... చిన్నతనంలో నాణ్యమైన చెఱుకు ముక్కల రుచి చూసిన వాళ్ళకే అర్ధమవుతుంది ఆ అలౌకిక ఆనందం. అలా తిరణాళ్ళ సంబరానికి తీయని చెఱకుతో శుభం పలికేసి తెల్లారో మరి రెండ్రోజులకో మొదలయ్యే స్కూల్లో మనం ఈ విశేషాలన్నీ ఎలా చెప్పాలా దానికి ఒక్కో ఫ్రెండూ ఎలా రియాక్ట్ అవుతాడా అని ఊహించుకుంటూ నిద్రలోకి జారుకోవడమే.

పంచదార బెండ్లు ఇలాగే ఉండేవి.
అన్నట్లు ఇప్పటిలా టీవీలూ, యూట్యూబ్ లు, ఓటీటీ ప్లాట్ ఫాం లు, వందల కొద్ది ఛానెల్స్, మొబైల్స్ ఇవేవీలేని అప్పటి రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సినిమాలే కదా. అందుకే శివరాత్రి రోజు రాత్రి పూట చాలా థియేటర్స్ లో ఒకే టిక్కెట్ పై రెండు సినిమాలు ప్రదర్శించే వాళ్ళు కాకపోతే అవి సెకండ్ షోస్ తర్వాత మొదలయ్యే మిడ్ నైట్ షోస్ కనుక నాకు ఎప్పుడూ పర్మిషన్ దొరికేది కాదు చూడడానికి. తీరా నాకు చూడగల స్వతంత్రం వచ్చేసరికి ఆ సంప్రదాయానికి స్వస్తి పలికేశారు. 


బుధవారం, ఫిబ్రవరి 19, 2020

కార్తీ ఖైదీ...

సాథారణంగా ఒక్క రోజులోనో ఒక్క పూటలోనో నడిచే సంఘటనలతో తీసిన సినిమాలు కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మీద పాటల మీద  ఆధారపడుతూ ఉంటాయి. అలాంటి అవకాశం కూడా లేకుండా కేవలం రెండు చోట్ల ఒక రాత్రిపూట జరిగే సంఘటనల ఆధారంగా రెండున్నరగంటల పాటు కూర్చోపెట్ట గలగడం అంటే మాములు విషయం కాదు. ఆ ఫీట్ ని సునాయసంగా సాధించింది ’ఖైదీ’ టీమ్.

బిజోయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. అతను ఓ రాత్రి చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న ఒక అతి పెద్ద డ్రగ్ ముఠా తాలూకు డ్రగ్స్ ని పట్టుకుంటాడు. దాదాపు తొమ్మిదివందల కిలోల బరువున్న ఆ కొకెయిన్ ధర తొమ్మిది వందల కోట్లు. తెల్లవారే వరకూ హయ్యర్ అఫీషియల్స్ కి సమాచారం అందించి కోర్ట్ కి సబ్మిట్ చేయలేరు కనుక కమిషనర్ ఆఫీస్ లో భద్ర పరుస్తాడు.

బిజోయ్ తో సహా ఆ ఆపరేషన్ లో ముఖ్య పాత్ర వహించిన ఐదుగురు పోలీసాఫీసర్లు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఐజీ ఇస్తున్న విందుకు హాజరవుతారు. అక్కడ డ్రగ్స్ ముఠాకు హెల్ప్ చేస్తున్న ఓ పోలీస్ ఆల్కహాల్ లో మత్తుమందు కలిపి అందరు స్పృహ తప్పి పడిపోయేలా చేస్తాడు. ఆ ప్రమాదకరమైన మత్తుమందు వల్ల సకాలంలో సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆ ఆఫీసర్స్ అందరూ చనిపోయే ప్రమాదం ఉంది.

డ్రగ్స్ ముఠాలో ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా బిజోయ్ కీ ఈ ఐదుగురు పోలీసులని చంపడానికి ఒక గ్యాంగ్, కమిషనర్ ఆఫీస్ లో ఉన్న కొకెయిన్ దోచుకెళ్ళడానికి ఒక గ్యాంగ్ బయల్దేరారని తెలుస్తుంది. సహాయం కోసం కమీషనర్ ఆఫీస్ ని అలర్ట్ చేయడానికి ప్రయత్నించిన అతనికి తాగి గొడవ చేస్తున్న కేస్ లో స్టేషన్ కి తీస్కొచ్చిన నలుగురు స్టూడెంట్స్ వాళ్ళకోసం వచ్చిన ఒక అమ్మాయి. బదిలీ పై వచ్చి ఇంకా ఛార్జ్ తీస్కోని ఒక కానిస్టేబుల్ నెపోలియన్ మాత్రమే ఆ కమీషనర్ ఆఫీస్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇపుడు అక్కడున్న తొమ్మిదివందల కేజీల కొకెయిన్ ని, జైలు లో ఉన్న ఖైదీలని ఈ ఐదుగురే కాపాడాలి.

అడవిలో గెస్ట్ హౌస్ కి కేటరింగ్ సామానుతో వచ్చిన లారీలో పోలీసాఫీసర్స్ ని ఎక్కించి వాళ్ళని ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పటల్ కి చేర్చడానికి తప్పనిసరి పరిస్థితులలో అక్కడే ఉన్న ఓ ఖైదీ (కార్తీ) సహాయం కోరుతాడు బిజోయ్. అతని పేరు ఢిల్లీ, ఓ హత్య కేసులో పదేళ్ళగా జైలు శిక్ష అనుభవించి ఆ రోజే రిలీజై అనాథాశ్రమంలో పెరుగుతున్న తన కూతురు అమృతను మొదటిసారి చూడడానికి వెళ్తూ ఉంటే, దారిలో అతని గడ్డం వాలకం చూసి అనుమానించిన ఓ పోలీసాఫీసర్ మళ్ళీ అరెస్ట్ చేసి ఎంక్వైరీకి  తీస్కెళుతూ ఆ పార్టీ జరుగుతున్న దగ్గర ఆగుతాడు.

పదేళ్ళగా అనాథాశ్రమంలో పెరుగుతున్న అమృతకి తనను చూడడం కోసం పొద్దున్నే ఎవరో వస్తున్నారని తెలుస్తుంది కానీ ఎవరో తెలీదు. కమీషనర్ ఆఫీస్ లో ఉన్న ఐదుగురూ డ్రగ్స్ ని కాపాడగలిగారా,  ఢిల్లీ ఆ పోలీసాఫీసర్స్ కి సహాయం చేశాడా, చేస్తే ఎంతవరకూ సాయం చేయగలిగాడు. నరరూప రాక్షసుల్లాంటి డ్రగ్స్ ముఠా చేతిలో పోలీసులు, స్టూడెంట్స్ హతం కాకుండా తప్పించుకో గలిగారా, అమృత తన తండ్రిని కలుసుకుందా లేదా అనేవి తెలియాలంటే మీరు ఖైదీ సినిమా చూడాలి.      

సినిమా మొత్తం ఒక్క రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా అల్లిన కథ. చిత్రీకరణ మొత్తం రాత్రే జరుగుతుంది. ఇలాంటి చిత్రానికి స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ కీలకంగా నిలుస్తాయి. సినిమా చాలా వరకూ చీకట్లో షూట్ చేసినా ఎక్కడా మనకి ఆసక్తి సడలకుండా కట్టిపడేశాడు. సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్  స్ట్రీట్ లైట్స్ ని హెడ్ లైట్స్ ని మంటలని వాడుకున్న తీరు, లైటింగ్ స్కీమ్ చాలా బావుంది తన వర్క్ ఆకట్టుకుంటుంది.

ఇలాంటి థీమ్ ఎన్నుకున్నందుకు దాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా హీరోయిన్, పాటలు, కామెడీలాంటివి కూడా యాడ్ చేయకుండా కథను మాత్రమే నమ్మి దాన్ని తెరకెక్కించినందుకు  దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని అభినందించి తీరాలి. అలాగే శామ్ సి.ఎస్. నేపథ్య సంగీతం కూడా చాలా సన్నివేశాలని ఎలివేట్ చేస్తుంది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అడవిలో కొన్ని స్టంట్స్ రస్టిక్ గా తీసిన తీరు బావుంది.

కార్తీ తప్పించి ఇందులో ఇతర నటీనటులు ఎవ్వరూ నాకు తెలియరు కానీ సినిమా మొదలైన కొంత సేపటికే పాత్రలతో ఐడెంటిఫై చేసేసి కథను ఫాలో ఐపోతాము. కానిస్టేబుల్ నెపోలియన్ గా చేసిన నటుడు గుర్తుండిపోతాడు. ఇక కార్తీ ఢిల్లీ పాత్రలో ఒదిగిపోయాడు, పోలీసుల చేతిలో నానా చిత్రహింసలు అనుభవించి వాళ్ళనే కాపాడాలా వద్దా అసలు బిజోయ్ ని నమ్మచ్చా లేదా అనే మీమాంసలో ఉండే ఖైదీగా, కూతుర్ని మొదటిసారి చూడాలనీ తనకేమైనా పర్లేదు ఆ అమ్మాయి భవిష్యత్ బావుండాలనీ తపించే నాన్నగా, ఇచ్చిన మాట మీద నిలబడి ఒప్పుకున్న పని మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయాలని పోరాడే యోధుడిగా అన్ని షేడ్స్ ని అద్భుతంగా అభినయించాడు. తన గతం చెప్పే సన్నివేశంలో క్లోజప్ లో పలికించిన హావభావాలూ ఆ సన్నివేశం అలా గుర్తుండిపోతాయి. 

యాక్షన్ సన్నివేశాలు కొంచెం ఎక్కువున్నా కథకవసరం కనుక ఎక్కడా విసుగు అనిపించకుండా ఇన్వాల్వ్ అయి చూస్తాము. అవి కూడా మరీ కత్తివిడిచి సాము చేయలేదు రియలిస్టిక్ గా తీశాడు. కాకపోతే గాట్లింగ్ గన్స్ సైతం స్మగుల్ చేసేంత పెద్ద డ్రగ్ మాఫియా కనీసం పిస్టల్ కూడా వాడకుండా కత్తులతో దాడులు చేయడం కాస్త ఆశ్చర్యమనిపిస్తుంది. ఐతే రిస్క్ తక్కువని చిత్తూరు లాంటి ఊరును ఎన్నుకుని ఆపరేట్ చేస్తున్నారు కనుక అంతగా అవసరపడవని వాడటం లేదని సరిపెట్టుకోవచ్చు. 
  
సరికొత్త పూర్తి తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం ’ఆహా’ లో మొన్న పదిహేనో తారీఖున విడుదలైన "ఖైదీ" సినిమా వైవిధ్యమైన సినిమాలు యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు మిస్సవకుండా చూడవలసిన సినిమా. టీవీలో వచ్చినపుడైనా మిస్సవకండి. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.

బుధవారం, ఫిబ్రవరి 12, 2020

జాను...

రామ్ (శర్వానంద్) ఒక ట్రావెల్ ఫోటోగ్రాఫర్. ప్రకృతితో మమేకమై తిరుగుతూ తనలోని ఒంటరితనాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూంటాడు. అనుకోకుండా ఒక రోజు తను చిన్నపుడు చదువుకున్న వైజాగ్ కి చేరుకుంటాడు. అక్కడ తాను తిరిగిన ప్రదేశాలు అన్నీ చూస్తూ తాను టెంత్ వరకూ చదివిన స్కూల్ కీ వెళ్తాడు. అక్కడ నుండి అలా కనెక్ట్ అయిన క్లాస్మేట్స్ ఒక రీ యూనియన్ ప్లాన్ చేస్తారు. ఆ రీయూనియన్ కి వెళ్ళి దాదాపు పదిహేనేళ్ళ తర్వాత కలిసిన అందరితో జ్ఞాపకాలు కలబోసుకుంటున్న రామ్ కి జాను(సమంతా) కూడా అక్కడకి వస్తుందని తెలుస్తుంది.

చిన్నప్పటినుండీ కలిసి చదువుకున్న జాను అన్నా తను పాడే పాటలన్నా రామ్ కి ప్రత్యేకమైన ఇష్టం. తనని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు. తనకీ రామ్ అంటే అంతే ఇష్టం. జాను కి ఏం కావాలన్నా రామ్ నే అడుగుతుంది. తన నోటి వెంట మాట రావడం ఆలశ్యం ఆ మాట పూర్తయే లోపే రామ్ ఆ పని చేసి పెట్టేసెవాడు.

తనకి జాను మీదున్న ఫీలింగ్ ప్రేమో ఏంటో కూడా సరిగా తెలియదు కానీ జాను అంటే రామ్ కి ఓ అద్భుతం, అపురూపం, అపూర్వం. తనని చూసినా తను తాకినా అతని గుండె వెయ్యి రెట్లు వేగంగా కొట్టుకుంటుంది, తనమీదే ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నా కానీ ఎదురు పడితే మాత్రం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు మాట్లాడడానికి నోరు కూడా పెగలదు.

ఇష్టాన్ని అపుడపుడు ప్రదర్శించడమే తప్ప తమ ప్రేమ గురించి ఒకరికొకరు చెప్పుకోకుండానే స్కూల్ శలవలకు విడిపోయిన ఆ ఇద్దరూ అనుకోని పరిస్థితులలో తిరిగి కలుసుకోలేరు. దదాపు పదిహేడేళ్ళ తర్వాత రామ్ కి రీయూనియన్ ద్వారా మళ్ళీ జాను ని కలిసే అవకాశం వస్తుంది. జానూ అప్పుడేం చేస్తుంది, ఎలా ఉంది, రామ్ అపుడైనా తన ప్రేమ గురించి చెప్పగలిగాడా. ఆ రాత్రి ఎలా గడిచింది చివరికి ఏమైంది. అసలు ఎందుకు విడిపోయారు ఇలాంటి విషయాలు తెలియాలంటే మీరు "జాను" సినిమా చూడాలి.
 
ఈ సినిమాలో చూపించినది స్వచ్చమైన ప్రేమ, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్. అందుకే జాను మన మనసుల్లో శాశ్వతమైన ముద్ర వేసుకుని నిలిచి పోతుంది. ఎన్నేళ్ళైనా ప్రేమ ప్రస్తావన రాగానే గుర్తొచ్చే సినిమాగా మిగిలి పోతుంది. అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తామో అంతగా గౌరవమూ ఇవ్వాలి అని నేర్పించే సినిమా. రామ్ జాను ని చూస్కునే పద్దతి చూస్తే ఇలాంటి వాళ్ళు ఇలాంటి మెచ్యూర్డ్ ప్రేమలు ఉంటాయా అని ఆశ్చర్యపరిచే ప్రేమ.

సినిమా ప్రారంభంలో దర్శకుడు ఒక స్లైడ్ వేస్తాడు "మార్పులు ప్రశ్న.. మార్పులే సమాధానం" అని. ఈ కథలోలా పరిస్థితుల ప్రభావంతో జరిగిన మార్పులు ప్రశ్నగా ఎదురైనపుడు దానికి సమాధానంగా వాస్తవాన్ని అంగీకరించి ఆ మార్పులకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకుంటూ మనమూ మారుతూ జీవించాలనీ అక్కడే ఆగిపోకూడదని నేర్పించే కథ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవ్ ఆన్ అని నేర్పించే ప్రేమ కథ. నిజానికి ఇన్నేళ్ళ తర్వాత జాను వచ్చింది రామ్ కి ఈ విషయం చెప్పడానికేనేమో అని అనిపించక మానదు.
   
నిజమే కొన్ని క్లాసిక్స్ ని ముట్టుకోకూడదు, రీమేక్ చేయడానికి ట్రై చేయకూడదు. అలాగే కొన్ని క్లాసిక్ కథలని చెప్పకుండా వదిలేయకూడదు, ఎంత ఎక్కువమందికి చెప్పగలిగితే అంతమందికి చెప్పి తీరాలి. జానూ అలాంటి క్లాసిక్ కథ కథానాలున్న సినిమానే. ఫాస్ట్ ట్రాక్ ప్రేమలు ఎక్కువైన ఈ తరానికి ఇలాంటి ప్రేమ కూడా ఒకటుంటుంది అసలు ప్రేమంటే ఇలాగే ఉండాలి అని చూపించాలి.

బహుశా అందుకేనేమో ఎందరు వద్దన్నా నిర్మాతగా తన ఇరవై ఏళ్ళ ప్రస్థానంలో ఎప్పుడూ రీమేక్ జోలికి వెళ్ళని దిల్ రాజు గారు ఈ సినిమాని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. లాభనష్టాల లెక్కలు ఎలా ఉన్నా నిర్మాతకు "ఇంత మంచి సినిమాని నేను నిర్మించాను" అని గర్వంతో కూడిన ఆనందాన్ని మాత్రం తప్పకుండా మిగిల్చే సినిమా జాను.

ఈ సినిమా నిర్మాణంలో సగం విజయం ఒరిజినల్ వర్షన్ తీసిన దర్శకుడిని, సంగీత దర్శకుడిని ఈ సినిమాకి కూడా పని చేయడానికి ఒప్పించడం. 96 సినిమా అంత అందంగా రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారణం వీళ్ళిద్దరే.

ఇక విజయ్ సేతుపతి, త్రిషలను రీప్లేస్ చేయడం దదాపు అసాధ్యమైనా కానీ రామ్, జాను పాత్రలకు న్యాయం చేయగల శర్వానంద్ అండ్ సమంతాలను ఎన్నుకోవడం మిగిలిన సక్సెస్. అనౌన్స్ చేసినపుడు అంత నమ్మకం లేకపోయినా సినిమా చూశాక వీళ్ళిద్దరూ కూడా ఆ పాత్రలకు ప్రాణం పోశారనిపించింది.

ఒరిజినల్ వర్షన్ లో పాటలు నేపథ్య సంగీతం చేసిన మ్యాజిక్ అచ్చుగుద్దినట్లుగా ఇందులోనూ అలానే రిపీట్ అయింది. ఈ సినిమాలోని సన్నివేశాలు మన మనసు లోతుల్లో ముద్రపడిపోవడానికి సంగీతం వహించిన ముఖ్య పాత్ర మరిచిపోలేనిది. ముఖ్యంగా జాను రామ్ ఎదపై చేతితో తాకినపుడు బట్టర్ ఫ్లైస్ ఇన్ స్టమక్ ఎఫెక్ట్ ని చూపించేలా వచ్చే ఆ నేపథ్య సంగీతం మరిచి పోలేనిది. 
 
అలానే జాను ఎంట్రీ సీన్ లో బీజీఎమ్ ఇప్పటికే చాలా మంది సెల్ఫోన్స్ రింగ్ టోన్ గా స్థిరపడిపోయింది ఆ ట్యూన్ గుండెల్ని మెలిపెట్టేస్తుంది. ఇంకా జాను పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్న సీన్ లోనూ సన్నగా మొదలైన మంగళ వాద్యాలు హోరులా మారడం. మరికొన్ని సీన్స్ లో నేపధ్యమంతా మెల్లగా మాయమవుతూ నిశ్శబ్దమవడం. ఇలా ఒకటేమిటి చాలా సీన్స్ లోని ఎమోషన్ ని సంగీతం మరింత ఎలివేట్ చేసి మన గుండెలోతుల్లోకి చేర్చింది. ఇక కథనంలో భాగంగా అక్కడక్కడా వచ్చే ఇళయరాజా పాటల బోనస్ ఎలాగూ ఉండనే ఉంది. 

సగటు మాస్ సినిమాలు మాత్రమే ఎంజాయ్ చేసేవారికి జాను నచ్చకపోవచ్చు. మూడు ఫైట్లు ఆరు పాటలు కాసిని కామెడీ సన్నివేశాలతో చుట్టేసిన సినిమా కాదు ఇది. కౌగిలింతలు ముద్దులే కాదు కనీసం హీరో హీరోయిన్ని ముట్టుకునే సన్నివేశాలు కూడా లేని ప్రేమ కథ జాను. ఒక్క ఫైట్, ఒక్క డాన్స్ మూవ్ మెంట్, ఇరికించిన కామెడీ ట్రాక్స్ లేని జాను ఒక ప్యూర్ ఎమోషనల్ రైడ్. మెల్లగా ఒక్కో సీన్ నూ ఆస్వాదిస్తూ, ఆ అనుభూతిని ప్రేమను అనుభవిస్తూ, వారి పెయిన్ ని అర్ధం చేసుకుంటూ నిదానంగా తీరికగా చూడవలసిన సినిమా. అలాగే సినిమా చూసినంత సేపూ మన స్కూల్ డేస్, అప్పట్లో మనం చూసిన ప్రేమ కథలు జ్ఞాపకాలు మనని చుట్టుముట్టేస్తాయి. 

కథా కథనాలు తీసిన సన్నివేశాలు కూడా దానికి అనుగుణంగా నెమ్మదిగా ఒక కవిత చదువుతున్నట్లు ఉంటాయి. చిన్నప్పటి రామ్ బిడియం, జాను చొరవ, పెద్దయ్యాక కూడా అవి అలాగే కంటిన్యూ అవడం, రామ్ రాత్రి గడిచే కొద్దీ మెల్లగా మాటల్లో ఓపెనప్ అవడం. జాను రామ్ ని ఫ్యామిలీ మాన్ గా ఎలా చూడాలనుకుంటుందో చెప్పే సన్నివేశాలు, హెయిర్ కట్ సీన్, మెట్రోలో మైండ్ ది గాప్ షాట్, రాత్రంతా కలిసి తిరిగినా ఇద్దరి మధ్యా ఉన్న గౌరవ ప్రదమైన దూరాన్ని చూపే సన్నివేశాలు, మంగళ సూత్రాలను రామ్ కళ్ళకద్దుకునే సన్నివేశం, అన్నీ బావుండి ఉంటే ఎలా ఉండేదో అని ఊహించుకుంటూ జాను చెప్పే సన్నివేశం. వీళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేస్తే ఏమౌతుందో అంటూ మిత్రులు పడే టెన్షన్, జాను కూతురు ఫోటో చూడడానికి రామ్ పడే తపన అన్నీ కూడా క్యూట్ గా అందంగా ఉంటాయి.

అలాగే ఎస్ జానకి పాడిన పాటలు మాత్రమే పాడే జాను తన కోసం దళపతి సినిమాలో స్వర్ణలత పాడిన ’యమునా తటిలో’ పాట పాడితే వినాలని రామ్ ఆశపడడం, ఆసక్తిగా ఎదురు చూడడం. ఆ థ్రెడ్ ని అలానే సినిమా అంతటా కొనసాగించి దాన్ని ముగించిన తీరు ముచ్చటగా అనిపిస్తుంది. ఇలాంటి ముచ్చట గొలిపే చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి సినిమా అంతటా.    
 
నటీనటులలో శర్వానంద్ అండ్ సమంతా రామ్ అండ్ జానులుగా తమ పాత్రలకు ప్రాణం పోశారు. తమిళ్ లో ఉన్న మాజిక్ ఇక్కడ కూడా రిపీట్ చేయగలిగారు. ఇక అందులో యంగ్ జాను గా చేసిన గౌరీ ఇక్కడ కూడా చేసింది తన నటనా బావుంది. యంగ్ రామ్ గా చేసిన కుర్రాడు కూడా ఆకట్టుకుంటాడు. ఫెండ్స్ గా ఫిదా ఫేమ్ శరణ్య ప్రభాకరన్, వెన్నెలకిషోర్, తాగుబోతు రమేష్ అంతా చక్కగా సరిపోయారు.

తమిళ్ వర్షన్ కి తెలుగుకి ముఖ్యమైన తేడా టైమ్. తమిళ్ లో నైంటీ సిక్స్ బ్యాచ్ గా చూపిస్తే తెలుగులో బహుశా నటీనటుల వయసు వల్లో లేక గ్లామర్ దృష్టిలో పెట్టుకునో కానీ 2004 బ్యాచ్ గా చూపించారు. దానితో కథకు సంబంధించిన ముఖ్యమైన నేపధ్యం తాలూకు సెటప్ కొంత దెబ్బతిన్నట్లైంది. ఇంత స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వం, పసిపిల్లలాంటి మనస్తత్వం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అదీ వైజాగ్ లో ఉన్నాయంటే నమ్మబుద్ది కాదు. కాకపోతే ఒకసారి ఎమోషన్ కి కనెక్ట్ అయిన తరువాత సినిమాలోని కథా కథనాలు ఈ లోపాన్ని మర్చిపోయేలా చేస్తాయి.   

మొత్తం మీద ’జాను’ ’96’ కి ఒక ఫెయిత్ ఫుల్ రీమేక్, యథాతథంగా తెరకెక్కించారు. తమిళ్ అర్ధమై 96 చూసిన వాళ్ళకి జాను కొత్తగా ఆఫర్ చేసేదేం ఉండదు కనుక కేవలం నటీ నటులకోసం చూడాలనుకుంటే చూడవచ్చు. సబ్ టైటిల్స్ పై ఫోకస్ చేసి చూసిన వాళ్ళు కూడా ఒక సారి ఆ స్ట్రెయిట్ అనుభూతి కోసం మళ్ళీ చూడవచ్చు. ఇక  ఒరిజినల్ వర్షన్ చూడని వాళ్ళు మాత్రం ఒక సారి తప్పక చూసి తీరవలసిన చిత్రం జాను. స్వచ్ఛమైన ప్రేమని మనసారా అనుభూతి చెందాలంటే మిస్ అవకూడని సినిమా జాను. ఈ సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు. మరికొన్ని ప్రోమోస్ ఇక్కడ చూడవచ్చు.

సోమవారం, ఫిబ్రవరి 03, 2020

అల వైకుంఠపురములో...

సంక్రాంతి తెలుగు వాళ్ళందరికీ ఎంత ఇష్టమైన పెద్ద పండగో సినీ ప్రియులకి అంతకంత ఇష్టమైన పండగ. ఎందుకంటే ఈ సీజన్ లో కనీసం రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలై అభిమానులని అలరిస్తూ సినిమాకి దాని చుట్టూ ఆధారపడే వాళ్ళందరికి నాలుగు డబ్బులు సంపాదించి పెట్టే పండగ కనుక.

ఐతే ఈ పండగను అడ్డం పెట్టుకుని టిక్కెట్ రేట్లు అడ్డగోలుగా పెంచేసి "ఐనా కలెక్షన్స్ వస్తున్నాయంటే డబ్బులు పెడుతున్నారు సో పండగరోజులే కాదు వీకెండ్ కూడా టిక్కెట్ రేట్లు పెంచుతాం" అనే నిర్మాతలని చూస్తే మాత్రం అలాగే మీరు పెంచుకోండి పైరసీని కూడా పెంచి పోషించుతారు ప్రేక్షకులు అని అనాలనిపిస్తుంది.

ఈ సంక్రాంతికి గుంటూరులో రెండు పెద్ద సినిమాలకీ రెండు వారాల పాటు 100రూ ఉండే సింగిల్ స్క్రీన్ టిక్కెట్స్ ని 200 కి అలాగే 138రూ ఉండే మల్టీప్లెక్స్ టిక్కెట్స్ ని 250 కి పెంచేశారు. రిలీజైన వీకెండ్ వరకూ పెంచడం ఓకేనేమో కానీ రెండువారాల పాటు ఈ విధమైన దోపిడీ మాత్రం ఆమోదయోగ్యం కాదు. నేనీ సినిమా ఎంత టాక్ వచ్చినా మొదటి రెండు వారాలపాటూ చూడక పోవడానికి కారణం ఈ పెంచిన టిక్కెట్ రేట్లను ఎంకరేజ్ చేయడం ఇష్టం లేకే.  

సరే ఇక ఆ విషయం పక్కన పెట్టేస్తే "అల వైకుంఠ పురములో" ఉన్నది కొత్త కథేం కాదు తెలుగు సినిమాలలో ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న కథే కానీ కథనం మాత్రం కొత్తది. సంక్రాంతి సీజన్ లో కొత్త కథాంశాలు వైవిధ్యమైన సినిమాలకన్నా కూడా రొటీన్ అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా ఆహ్లాదకరంగా ఇంటిల్లిపాదినీ రంజింప చేయగల లైటర్ వీన్ సినిమాలే బాగా ఆకట్టుకుంటాయి. అలవైకుంఠపురములో సరిగ్గా అలాంటి సినిమానే.
 
హీరోయిన్ ఇంట్రడక్షన్ లోనూ తన మొదటి రెండు మూడు అప్పియరెన్సెస్ లోనూ హీరో గారు కళ్ళతోనే ఆవిడ కాళ్ళ సూప్ జుర్రేస్తున్న టైమ్ లో కాస్త ఇబ్బంది పడతాం తప్ప మిగిలిన సినిమా అంతా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మీరింకా ఏవైనా సందేహాలతో సినిమా చూసుండక పోతే చూసేసి వచ్చి మిగిలిన సమీక్ష చదవండి.

కథ టూకీగా చెప్పుకోవాలంటే తనతోపాటే కంపెనీలో జాయినై బాస్ కూతుర్ని పెళ్ళాడి తనకే బాస్ స్థానంలో వచ్చిన రామచంద్ర(జయరామ్) అంటే విపరీతమైన జెలసీ వాల్మీకి(మురళీ శర్మ)కి. వీళ్ళిద్దరి భార్యలూ (టబు, రోహిణి) ఒకే సమయంలో ఒకే హాస్పటల్లో పురుడు పోసుకుంటారు. తన కొడుకు రాజాలా పెరగాలని పురిట్లోనే పిల్లలని మార్చేస్తాడు అసూయకి నిలువెత్తు ప్రతిరూపమైన వాల్మీకి. అలా మారిన పిల్లలు ఎలా పెరిగారు వారి భవిష్యత్తేమైంది, పిల్లల స్థానాన్ని మార్చగలిగిన వాల్మీకి వారి స్థాయిని కూడా నిర్దేశించ గలిగాడా అనేది మిగిలిన కథ. 

పైన చెప్పినట్లు కథ కొత్తది లేకపోయినా ట్రీట్మెంట్ కొత్తగా రాసుకుని సరైన నటీనటులని ఎన్నుకుని సన్నివేశాలను బ్రీజీగా అల్లుకుని అప్పటి కథలను కూడా ఎంత కొత్తగా చెప్పచ్చో ఈ సినిమాతో త్రివిక్రమ్ నిరూపించాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా సరైన నటీనటులతో వారి చక్కని నటనతో అద్యంతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది ఈ సినిమా.  

నటనలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాల్మీకి గా నటించిన మురళీ శర్మ గారి గురించి. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో తగిన గుర్తింపు తెచ్చుకున్న ఇతను ఈ సినిమాతో మరొక మెట్టు పైకెదిగిపోయాడు. వాల్మీకి తప్ప ఎక్కడా మనకి మురళీ శర్మ కనిపించరు. ఇక అల్లు అర్జున్ తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో కట్టి పడేస్తాడు. మాములుగా డాన్స్ బాగా చేస్తాడని అందరికి తెలిసిన విషయమే కానీ రెడ్ కోట్ తో అందరి హీరోల డాన్సులని ఇమిటేట్ చేస్తూ చేసిన డాన్స్ మెడ్లీ ఐతె సినీ పరిభాషలో చెప్పాలంటే ఇరగదీసేశాడంతే. అలాగే నిజం తెలిసేప్పుడు ఆ తర్వాత ఫ్లై ఓవర్ పై వాల్మీకి తో సన్నివేశాల్లో కూడా అద్భుతంగా చేశాడు. 

అమృతం ఫేమ్ హర్ష వర్థన్ లోని కామెడీ యాంగిల్ నే కాక క్యారెక్టర్ నటుడ్ని పరిచయం చేసే రోల్ చేశారు. అలాగే జయరామ్ రోల్ కూడా చాలా బావుంది టబుతో ఎమోషనల్ సీన్ లో ఇద్దరి నటన ఆకట్టుకుంటుంది ఆ సీన్ సూపర్. సచిన్ ఖేడేకర్ నటన కూడా బావుంది. సుశాంత్ సినిమా అంతా నవ్వుతూ గాల్లోకి చూస్తూ గడిపేసినా ఉన్న ఒక్క ముఖ్యమైన సీన్ తో మార్కులు కొట్టేశాడు. సునీల్, నవదీప్, రాహుల్ పాత్రలు కేవలం ఫ్రెండ్షిప్ కొద్దీ చేసినట్లున్నాయి. సముద్ర ఖని అప్పల్నాయుడుగా చిత్రమైన మానరిజంతో  అక్కడక్కడ మెప్పించాడు. మిగిలిన నటీనటులంతా వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు.  

హీరోయిన్ గా చేసిన పూజా హెగ్డే ని గ్లామర్ కి మాత్రమే పరిమితం చేయకుండా యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గానూ టబూని ఆత్మవిశ్వాసం తో కూడిన బలమైన వ్యక్తిత్వంగల ఇల్లాలు గానూ మంచి పాత్రలలో మలిచాడు త్రివిక్రమ్. వారి నటన అందుకు తగినట్టుగానే ఆకట్టుకుంటుంది. రోహిణి గారు సగటు మధ్య తరగతి అమ్మగా చక్కగా సరిపోయారు. నర్సుగా కథ కు కీలకమైన రోల్ లో ఈశ్వరి గారు మెప్పిస్తారు. 

సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పుకోవలసింది థమన్ గురించి. ఈ సినిమాకి అందించిన అన్ని పాటలు సూపర్ హిట్స్ అనే చెప్పుకోవచ్చు. ఏపాటకాపాట వైవిధ్యంగా ఉండి ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే సిత్తరాల సిరపడు పాట అద్భుతం. దానికి రామ్ లక్ష్మణ్ ల యాక్షన్ కొరియోగ్రఫీ దానిని అలవోకగా అభినయించిన అల్లు అర్జున్ వెరసి కొన్ని సంవత్సరాల పాటు నిలిచి పోయే పాట.

ఈ ఒక్కటనే కాదు మొదట్లో వచ్చే చున్నీ ఫైట్ కానీ స్టార్ హోటల్ లోని ఫైట్ కానీ, పోర్ట్ ఫైట్ కానీ ఈ సినిమా లో ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉన్నాయి. స్టైలిష్ స్టార్ అని బన్నీని ఎందుకంటారో వీటిలో తన పెర్ఫార్మెన్స్ తో మరోసారి ఢంకా బజాయించి చూపెట్టేశాడు. ఇక కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ లో నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు అవి బావుండడం సహజమైపోయింది అలానే సినిమాటోగ్రఫీ కూడా.
 
సినిమా అంటే వైవిధ్యమైన కథ సహజత్వం ఏదో ఒక కొత్తదనం ఉండాలని కోరుకునే వారికి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు కానీ ఇంటిల్లిపాది హాయిగా కూర్చుని ఆస్వాదించగలిగే కమర్షియల్ ఎంటర్టైనర్స్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది మిస్సవకండి. అలా అని అస్సలు కొత్తదనం లేదని కాదు కథనం కొన్ని సన్నివేశాలు కొత్తగా కూడా ఉండి మెప్పిస్తాయి.
 
సినిమాలో నాకు నచ్చిన కొన్ని సంభాషణలని ఇక్కడ పొందు పరుస్తున్నాను. సినిమా ఇంకా చూడని వాళ్ళు ఫీల్ మిస్సవకూడదనుకుంటే చూశాక చదువుకోవడం మంచిది.
"మేడమ్ సార్.. మేడమ్ అంతే" (ఎవరినైనా మెచ్చుకోడానికి ఈ డైలాగ్ ని ఇదివరకు ఎందరో వాడుండచ్చు కానీ బన్నీ చెప్తుంటే చూడాలి అంతే. కామెడీ షోస్ లోనూ చిన్న సినిమాల్లోనూ మళ్ళీ మళ్ళీ వినిపించే డైలాగ్ అవుతుంది)

"ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే.. అదే గుళ్ళో వెలిగితే ఊరంతటికీ వెలుతురు.."

"మనది మిడిల్ క్లాస్, లక్షపనులు కోటి వర్రీస్ ఉంటాయ్, తలొంచుకుని వెళ్ళిపోవాలి అంతే."

"అబద్దాలు చెప్తుంటే తలనొప్పొచ్చేస్తుండేది సార్.. నిజం చెప్పాక అవతలోళ్ళకి రాటం మొదలుపెట్టింది.. నాకు చాలా సుఖంగా ఉంది"

"నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది, చెప్పక పోతే ఎప్పుడూ భయమేస్తుంది"

"బరువు పైనుంటే కిందకి చూళ్ళేవు.. ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్.. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్"

"వంటోడికీ.. వెయిటర్ కీ నో చెప్పడం ఈజీ.. కానీ పవర్ ఫుల్ వాడికి నో చెప్పడం చాలా కష్టం.. సో ఎంత పెద్దోడికి నో చెప్తే అంత గొప్పోడివి అవుతావ్."

"దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది, ఒకటి నేలకి రెండు ఆడవాళ్ళకి అలాంటోళ్ళతో మనకి గొడవేంటి జస్ట్ సరెండర్ అయిపోవాలంతే"

"మనమొక ఆఫర్ ఇచ్చాక అవతలవాళ్ళు ’అయ్యా మాకొద్దు’ అన్నారంటే దానర్థం ఒద్దని. అందులోనూ అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ ఒద్దు అంటే మాత్రం దానర్థం అస్సలొద్దని."

"సేప బుర్రముక్క కలకత్తాల్లకిష్టమూ.. తోక ముక్క గోదారోళ్ళకిష్టమూ.. కానీ సేపకి మాత్రం బ్రతకడం ఇష్టం.. మరప్పుడది వలకి ఆవలుండాల వల్లోకొచ్చినాదనుకో ఇక ఒడ్డుకే.."

"గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్.. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే"

"సంపాదించమనే పెళ్ళాం అందరికీ ఉంటుంది కానీ ఆపమనే పెళ్ళాం ఎవరికి ఉంటుంది"

"భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో తలుపులు వేస్కున్నారంటే వాళ్ళేం మాట్లాడుకున్నదీ నలుగురికీ తెలియకూడదని అదే వాళ్ళు పెళ్ళైన పాతికేళ్ళ తర్వాత కూడా తలుపులు వేస్కున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదని నలుగురికి తెలియకూడదని"

"దేవుడికి కూడా దక్షిణ కావాలి.. రాజుకి కూడా రక్షణ కావాలి"

"ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కానీ నిజం చెప్తేనే కదా ఆ ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది."

"కష్టం అయినా నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్ గా ఉంటుంది"

"యుద్ధం వచ్చినపుడే దేశంలో ప్రజలు కులం, మతం, ప్రాంతం అనే తేడాల్లేకుండా కలిసిపోతారు. అలాగే కష్టం వచ్చినపుడే కుటుంబంలో వాళ్ళు స్వార్థం, ద్వేషం, పగ పక్కన పెట్టి ఒకటవుతారు."

"ఎప్పుడూ పిల్లలు బావుండాలని అమ్మానాన్నలు అనుకోవడమేనా.. అమ్మా నాన్నా బావుండాలని పిల్లలు అనుకోరా."

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.