నేను బాగా చిన్నప్పుడు అంటే రెండు మూడు తరగతుల్లో చదివేటప్పుడు పండగంటే శలవలు రావడం ఎంత కామనో ఆ శలవలకి అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళడం కూడా అంతే కామన్. ఊరెళ్ళిన వాళ్ళం తిన్నగా ఉండం కదా.. అప్పట్లో అమ్మమ్మవాళ్ళ ఊరు కారంపుడి ఓ మోస్తరు పల్లెటూరు కిందే లెక్క. నేను ఉంటున్న చదువుకుంటున్న నరసరావు పేట దానితో పోలిస్తే ఓ మోస్తరు పట్నం అనమాట. అదీ కాక ఇంటికి పెద్దమనవడ్ని అప్పటికి ఒకే ఒక మనవడ్ని కావడంతో నన్ను అందరూ అపురూపంగా చూస్కునే వాళ్ళు.
అమ్మ గురించైతే ఇక చెప్పనే అక్కర్లేదు. చెప్పులో స్లిప్పర్సో లేకుండా నన్ను ఇల్లు దాటనిచ్చేది కాదు. కానీ నాకేమో అవసలు వేస్కోవాలన్న స్పృహ కూడా ఉండేది కాదు. ఎక్కడికెళ్ళినా ముందు వెనుకా చూడకుండా పరుగెట్టేయడం కళ్ళు సరిగా కనపడక చూస్కోక ఏ ముళ్ళొ గుచ్చుకుంటే ఏడ్చుకుంటూ ఇంటికి రావడం. దెబ్బ తగిలినందుకు ముందు పాపం ముద్దు చేసినా తర్వాత చెప్పిన మాట విననందుకు అమ్మ చేతిలో తిట్లు తినడం వెరీ కామన్.
అమ్మ చిన్నతనం అంతా నాగార్జునసాగర్ దగ్గరలోని హిల్కాలనీలో గడిచిందని చెప్పేది కానీ ఉద్యోగం మాత్రం ఇక్కడ కారంపూడిలోనే మొదలు పెట్టానని చెప్పేది. తాత గారి ఆఫీస్ లోనే అమ్మ ఉద్యోగం కూడా అవడంతో ఇద్దరు కలిసి వెళ్ళి కలిసి రావడం మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వచ్చినపుడు అప్పటికప్పుడే కట్టెల పొయ్యి మీద టమాటాలూ మిర్చి తో పచ్చడి చేస్కుని తినడం. ఒకోరోజు ఉల్లిపాయలు కాల్చుకుని మజ్జిగన్నంలో తినడం చేసేదని చెప్తూ అప్పుడప్పుడు నాకూ అలా ఉల్లిపాయలు నిప్పుల్లో పెట్టి కాల్చి ఇచ్చేది.
అబ్బా అసలు ఆ రుచి చెప్పనలవి కాదు. ఉల్లిపాయలు, పనస గింజలు, మొక్కజొన్న కండెలు, గెణుసుగడ్డలు / చిలకడదుంపలు ఇలా ఆ నిప్పుల్లో కాల్చుకుని ఎన్ని రకాలు తినేవాళ్ళమో. ఒకోసారి వంకాయని అవే నిప్పుల్లో కాల్చి పచ్చడి చేసేది అమ్మ, ఎంత అద్భుతంగా ఉండేదో మాటల్లో చెప్పలేం వంకాయమీద అండ్ రోటి పచ్చళ్ళ మీద నాకు అప్పటినుండే బోలెడంత ఇష్టం మొదలైందనడంలో ఏం సందేహం లేదు.
అప్పట్లో నాకైతే పొయ్యి మీద చేసే వంట కన్నా అది ఎప్పుడు ఐపోతుందా ఆ తర్వాత నిప్పులతో ఏం చేద్దామా అన్న ఆరాటమే ఎక్కువుండేది. ఇంకా మధ్య మధ్యలో అవసరమైనపుడు ఊదుగొట్టంతో ఊదడం గొప్పసరదా. అదే ఊపుతో హడావిడిగా పొయ్యి చుట్టూ తిరుగుతూ ఒకోసారి నిప్పులమీదో పూర్తిగా చల్లారని కట్టెల మీదో కాలేసి కుయ్యో మొర్రో అని నేనేడవడం గాక వంట చేస్తున్న వాళ్ళని కూడా "ఎవరు ఇవి ఇలా వదిలేసింది పూర్తిగా ఆపకుండా" అని అమ్మతో చీవాట్లు తినిపించేవాడ్ని.
గ్యాస్ స్టవ్ లు వాటికి బాగా అలవాటుపడిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఆ పొయ్యిల మీద అన్నన్ని వంటలు ఎలా చేసేవారా అని. రోజు వారి అన్నం పప్పు కూరలే కాకుండా స్పెషల్ డేస్ లో పలావులు ఇతరత్రా కూరలూ పండగ టైమ్ లో రకరకాల పిండి వంటలూ అన్నీ దాని మీదే చేసేవాళ్ళు. పిండి వంటలంటే ముఖ్యంగా సంక్రాంతికి అరిశలు తప్పక ఉండాల్సిందే.
అరిశల పిండి కొట్టడానికి సాయంగా కాలనీలో వాళ్ళని ఎవరో ఒకర్ని పిలవడం రోట్లో రోకటితో ఒకరి తర్వాత ఒకరు లయబద్దంగా పోట్లు వేస్తూ దంచడం చూడడం ఎంత ఆశ్చర్యంగా ఉండేదో ఒక్క సారి కూడా రెండు రోకళ్ళు ఒకదానికొకటి గుద్దుకోకుండా ఎలా దంచుతారా అని బోలెడు ఆశ్చర్యం వేసేది. ఇక పాకం పట్టాక చలిమిడి కోసం వంటగది చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసేవాడ్నో లెక్కలేదు. నాకు ఎంత ఇష్టం అంటే పెద్దయ్యాక కూడా ఇంట్లో ఎప్పుడు అరిశలు చేసినా ఈ చలిమిడి వేణుగాడికోసం అని ప్రత్యేకంగా బాక్స్ నిండా తీసి దాచిపెట్టి పంపేంత.
ఇక పిండివంటలు చేయడం అయ్యాక వాటిని దాచి పెట్టేవారు. అంటే ఇంట్లో కోళ్ళు పిల్లులు వాటి స్వంత ఇంటిలా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూ ఉండేవి అందుకని అందకుండా గోడకి ఒక ఇనప షెల్ఫ్ లాంటిది ఒకటి ఉండేది దానిలో పాలు పెరుగు ఇలాంటి పిండి వంటలు లాంటివి దాచి పెట్టేవారు. సరే వాటికి అందకుండా దాచారు ఓకే కానీ మరి అవి నాకు కూడా అందవే ఎలా మరి.
అలాంటపుడే అమ్మని విపరీతంగా కాకాపట్టేసి ఒకటీ అరా ఎక్కువ తీస్కుంటాం అవి కూడా సరిపోనపుడు వడ్ల బస్తాలమీదనో బియ్యండ్రమ్ము మీదనో ఓ కాలు అల్మారాలో ఓ కాలు పెట్టి రకరకాల జిమ్నాస్టిక్ ఫీట్లు చెస్తూ ఆ ఇనప చిక్కాన్ని అందుకునే ప్రయత్నం చేసే వాడ్ని. కొన్ని సార్లు సక్సెస్ అయినా కొన్ని సార్లు ఇనుప తీగలు గుచ్చుకుని రక్తం రావడమో ఏ కాలో జారి కిందపడడమో జరిగేది.
అపుడు దెబ్బ నాకు తగిలితే కన్నీళ్ళు అమ్మ కళ్ళలో చూసేవాడ్ని నాకన్నా ఎక్కువ తనే విలవిలలాడిపోయేది. అల్లరి చేసినందుకు కోప్పడినా కూడా దగ్గరకు తీస్కుని బోల్డంత ప్రేమగా ఓదార్చేసే సరికే సగం నొప్పి పోయేది. అందుకే ఇప్పట్లా ఇన్నేసి రకాల మందులు ఆయింట్మెంట్లు ఏవీ అవసరం లేకుండా ఏ పసుపో కాఫీ పొడో పెడితే కూడా తగ్గిపోయేది. అన్నట్లు ఇలా వేళ్ళకి తగిలిన గాయానికి పెట్టిన కాఫీ పొడి చప్పరించే నా కాఫీ ప్రేమ డెవలప్ అయిందని నా డౌటానుమానం. అదేంటో చేదుగా ఉన్నా భలే ఉండేది లెండి ఆ కాఫీపొడి రుచి.
అన్నట్లు ఇందాక కోళ్ళ గురించి తలుచుకున్నా కదా అసలు అమ్మమ్మా వాళ్ళ ఇల్లంటే కోళ్ళ గురించి కబుర్లు చెప్పకుండా ముగియదు. ఎప్పుడూ కనీసం రెండు మూడు కోళ్ళు ఇల్లంతా సందడి సందడి చేస్తూ తిరుగుతూ ఉండేవి, ఒకోసారి అరడజనుకి తక్కువ కాకుండా పిల్లలను పెడితే ఇక వాటితో మా అల్లరికి హద్దే ఉండేది కాదు. వాటి వెంట పరుగులెట్టడం అవి ఎపుడైనా తిరిగి నా వెంట పడితే బేర్ మంటూ అమ్మ ఒళ్ళోకి పరిగెట్టడం.
ఇంకా కోళ్ళని గంప కింద కప్పెట్టి ఆ గంపకున్న కంతల్లోంచి అవి ఏం చేస్తున్నాయో చూడ్డం. గుడ్లు జాగ్రత్తగా కాపాడడం. కోడికూతకన్నా ముందే లేచి ఎప్పుడు కూస్తాయా ఎలా కూస్తాయా అని ఎదురు చూడండం ఇక అవి పిల్లలని పొదిగినపుడు వాటిని చేత్తొ పట్టుకుని చిన్నచిన్న కోడి పిల్లల వెచ్చని స్పర్శా వాటిలోపల అవయవాల కదలికతో సహా తెలుస్తుంటే భలే అపురూపంగా ఫీల్ అయ్యెవాడ్ని.
సంక్రాంతికి అమ్మమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు తాతగారి కబుర్లు చాలా ప్రత్యేకం చందమామ బాలమిత్ర లాంటి పుస్తకాలు అక్షరాలు కూడాబలుక్కుంటూ చదివేవారు తను. అలా చదివిన కథలు ఇంకా రామాయణ మహాభారతాల నుండి చిన్న చిన్న పిట్ట కథలు బోలెడు చెప్పేవారు. ఇంకా తను మిలటరీలో పని చేసినప్పటి కబుర్లు, వయసులో ఉన్నపుడు ఊర్లో గొడవలు, వాటికోసం చుట్టిన బాంబులు గురించిన కబుర్లు కూడా బోలెడు చెప్పేవారు.
రేడియో తప్ప టీవీ కూడా లేని ఆ రోజుల్లో తాతగారి కబుర్లే మాకు సెవెంటీ ఎమ్మెమ్ డాల్బీ డిజిటల్ సినిమా స్క్రీన్. మేమలా విజువలైజ్ చేసుకునేలా కళ్ళకు కట్టినట్లు చెప్పేవారు ఆయన ఆ కబుర్లన్నీ. ఆరుబయట నులక మంచం మీద తాత గారి పక్కన పడుకుని ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతూ పక్కనే కూర్చున్న అమ్మ కొంగుతో ఆటలాడుకుంటూ ఆ కథలు కబుర్లు వినడం అమ్మ ఇచ్చిన ఓ మధురమైన జ్ఞాపకం.