అవి నేను మా పాత వీధి బళ్ళోనే కొత్తగా నాలుగో తరగతిలో చేరిన రోజులు. ఆ ఏడాది మా బళ్ళో హనుమంతరావ్ అని ఒకడు చేరాడు. నిజానికి వాడి వయసు ప్రకారం వాడు ఏ ఏడోతరగతిలోనో ఉండాల్సిన వాడు కానీ డిటెన్షన్స్ తో బళ్ళు మారి ఇంకా నాలుగులోనే ఉన్నాడు. మా అందరికంటే పెద్దాడవడంతో వాడికి తెలియని విషయం, చేయని అల్లరి ఉండేది కాదు. నాఖర్మ కొద్దీ వాడు నాకు ఆర్యా-2 లాంటి ఫ్రెండ్. నేనెంత వదిలించుకోవాలని చూసినా తుమ్మబంకలా అంటుకునేవాడు.
వాడిదగ్గర నేర్చుకునే కొత్త కొత్త ఆటలు, ఇంకా స్కూల్ దగ్గరలో ముళ్ళకంపల్లోకి సైతం ధైర్యంగా వెళ్ళి కోసుకొచ్చుకున్న సీమ చింతకాయలు, రేగుపళ్ళు, చింతకాయలు లాంటివాటిలో వాటా తీస్కోడం బానే ఉండేది కానీ వీడితో కలిసి అల్లరి చేస్తూ స్కూల్ పక్కనే ఉన్న మా ఇంట్లో వాళ్ళకి నేనెక్కడ దొరికిపోతానో అని అనుక్షణం భయంతో చచ్చేవాడ్ని. వాడికి ఎక్కడెక్కడి డబ్బులు చాలేవి కాదు అమ్మ ఇంటర్వల్ లో కొనుక్కోమని నాకు ఇచ్చే పదిపైసలు బతిమాలో భయపెట్టో వాడే తీసేస్కునేవాడు.

ఆటల్లో పందెంగా నోట్ బుక్స్ మధ్యలో ఉండే తెల్లకాయితపు ఠావులు పెట్టి నిక్కచ్చిగా అవి వసూలు చేసేవాడు. ఒకోసారి అవి చాలక ఇంటర్వెల్ లో క్లాస్ లో ఎవరూ లేని టైం చూసుకుని పిల్లల నోట్సుల్లో పేపర్లు దొంగతనం చేసేవాడు వాడికి పార్టనర్ ని నేను :-) ఇదే నాకు గుర్తుండి నేను చేసిన మొదటి దొంగతనం. ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో ఒకోసారి నేను రానురా అని చెప్పి తప్పించుకోడానికి నా నోట్స్ లో పేపర్లు కూడా యధేచ్చగా చింపి ఇచ్చేసేవాడ్ని. అయితే నా నోట్సులన్నీ ఒకటొకటిగా సైజ్ తగ్గిపోడం మా ఇంట్లో అమ్మానాన్న ఇద్దరూ గమనించారు.
నన్ను అడిగితే "ఏమీ తగ్గలేదు" అని కాసేపు బుకాయించినా వాళ్ళు పాత కొత్త నోట్సులు కంపేర్ చేసి చూపించేసరికి “నాకు తెలియకుండా ఎవరో కొట్టేస్తున్నారమ్మా...” అని అలవోకగా ఆబద్దమాడేసి ఆ విషయం మర్చిపోయాను. కానీ అలా వదిలేస్తే మా పేరెంట్స్ మా పేరెంట్స్ ఎందుకవుతారు సైలెంట్ గా నామీద నిఘా పెట్టారు. ఒకరోజు మా హనుమంతు గాడు పేపర్లు నొక్కేయడం నేనేమో గుమ్మంలో కాపలా ఉండి ఎవరైనా వస్తున్నారేమో అని చూస్తూ వాడికి హెల్ప్ చేయడం మా వాళ్ళ దృష్టిలో పడింది. ఇంక అంతే ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక అమ్మా నాన్న ఇద్దరి చేతిలో దెబ్బలు పడ్డాయ్. నా లైఫ్ లో నాకు గుర్తున్నంతవరకూ వాళ్ళతో దెబ్బలు తిన్న సంధర్బం అదొక్కటే. అన్నేళ్ళుగా ఎపుడూ చేయిచేస్కోని వాళ్లు ఆపని చేసేసరికి బాగానే బుద్దొచ్చి వెంటనే హెడ్ మాస్టార్ కి కంప్లైంట్ చేస్తానని బెదిరించి హనుమంతుగాడి స్నేహం వదిలించుకున్నా.
అంత మాత్రం చేత నేనేదో బుద్దిమంతుడ్ని అయిపోయాను అనుకుంటున్నారా హహహ :-) బుద్దిసంగతి ఎలా ఉన్నా ఒక విషయం స్పష్టంగా అర్ధమైంది “అల్లరి చేసినా కూడా పెద్దోళ్ళకి దొరికిపోకుండా చేయాలి” అనే విషయం వారం రోజులు తగ్గని వాతల సాక్షిగా బోధపడింది :-) ఐతే అప్పటినుండీ నేను చేసే దొంగతనాలు మా వంటింటికే పరిమితం చేశా. అవికూడా ఆ వయసులోనే ఎంతో ప్లాన్డ్ గా చేసే వాడ్ని.

ఉదాహరణకి కోటా ప్రకారం అమ్మ మనకి ఇచ్చే ఒకటి రెండు లడ్డూలు చాలేవి కాదు, అదనంగా తినాలనిపించేది. అప్పుడు అమ్మని అడిగితే “అన్నం తినకుండా అన్నీ చిరుతిళ్ళే తింటావేం రా” అని తిడుతుంది కదా... అందుకని సైలెంట్ గా వంటగదిలో లడ్డూల డబ్బాలోనుండి నాలుగు లడ్డూలు తీసి వాటిలో నుండి కొంచెం కొంచెం తుంచుకుని ఒక చిన్న లడ్డూ చేసుకుని ఆ నాలుగింటినీ తుంచినట్లు తెలియకుండా నంబర్ తేడా రాకుండా మళ్ళీ బుద్దిగా కొంచెం చిన్న సైజ్ లడ్డూల్లాగా చుట్టేసి డబ్బాలో పెట్టేసేవాడ్ని. అపుడు ఒకవేళ అమ్మ తర్వాత చూసుకున్నా కూడా లెక్క తేడా రాదు కదా సో చిన్న చిన్న లడ్డూలు చేశాను గాబోలు అనుకుని సరిపెట్టేసుకుంటుంది కానీ మనమీద అనుమానం పడదనమాట.
అలాగే కారప్పూస/జంతికలు/చక్రాలు లాంటివి ఉన్నాయనుకోండి అవి ప్లెయిన్ డబ్బాలో అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు ఎన్ని కావాలంటే అన్ని తీస్కోవచ్చు అదే లెవల్ తెలిసేలా అడ్డగీతలున్న డబ్బాలోనో లేక నిండుగా ఉన్నపుడో తీస్కోవాలనుకోండీ అపుడు మనకి నచ్చినన్ని పైపైనుండి తీస్కుని లెవల్ తగ్గినట్లు తేడా తెలియకుండా చక్రాలని చేత్తో కొంచెం పైకి లాగి తేలికగా లెవల్ పైకి కనపడేలా సెట్ చేయాలనమాట. కానీ వీటితో అసలు ఇబ్బంది దొంగతనం చేసేప్పుడుకన్నా జోబులో ఎత్తుగా కనపడో, నోట్లో కర కర మంటూనో దొంగని పట్టించేస్తాయ్. అందుకని ఎత్తుగా కనపడకుండా వాటిని కొంచెం చిన్న ముక్కలుగా నలిపేసి జోబులో పోస్కుని ఒక్కోముక్కని ముందు నోట్లో నానేసి అపుడు చప్పుడు రాకుండా తినాలనమాట.

ఇంత ప్లాన్డ్ గా చేసినా ఒకోసారి దొరికిపోతాం. ఒకసారి ఏమైందంటే అప్పుడు నేను ఏడో, ఎనిమిదో చదువుతున్నాను. అమ్మ సగ్గుబియ్యం వడియాలు చేద్దామని మూడు కేజీల సగ్గుబియ్యం తెప్పించి రామనవమికి పానకం చేసుకునే చిన్న స్టీల్ బిందెలో పోసి ఒక అట్టముక్క దానికి మూతగా పెట్టింది. మనకి ఆటల మధ్యలో ఏదో ఒకటి నమలడానికి ఉండాలి టైంకి వంటింట్లో ఏవీ దొరకలేదు సో సగ్గుబియ్యం కూడా తినేవే కదా ట్రైచేసి చూద్దాం అని చూస్తే భలే ఉన్నాయనిపించింది, ఎక్కువసేపు నమలచ్చు పైగా ప్యూర్ స్టార్చ్ కావడంతో ఎనర్జిటిక్ గా కూడా ఉండేవి. ఇక చూస్కోండి పదినిముషాలకోసారి లోపలికి వెళ్ళడం ఆ అట్టముక్కని చేయి మాత్రం పట్టేట్లుగా కొంచెం పైకి లేపి ఓ గుప్పెడు జోబులో పోస్కుని రావడం.
ఇలా ఓ పదిరోజులు పోయాక ఓ ఆదివారం ఉదయం వడియాల కోసం అమ్మ అన్నీ సిద్దం చేస్కుని సగ్గుబియ్యం తీస్కురమ్మంది. నేను కొంచెం టెన్షన్ పడ్డా అయినా “ఆ నేనెన్ని తినుంటా రోజుకి కొన్ని గుప్పెళ్ళేగా మహా ఐతే ఒక అరకేజీ తగ్గుంటాయ్ అమ్మకి తెలీదులే” అనుకుని సైలెంట్ గా బిందె తీస్కొచ్చి ఎదురుగా పెట్టా. మూత తీసిన అమ్మ షాక్... బిత్తరపోయి లోపలికి చేయిపెట్టి బిందెను అటూ ఇటూ తిప్పి ఎంతచూసినా అరకేజీనే ఉన్నాయ్. నేను అరకేజీ తిన్నాననుకుని రెండున్నర కేజీలు తినేసి కేవలం అరకేజీ మిగిల్చానన్న విషయం నాకు అర్ధమైంది. సరుకుల్లో మూడుకేజీలు రాస్తే అరకేజీనే తెచ్చారా అని మొదట సందేహపడ్డారు కానీ మెల్లగా నన్నడిగారు “ఏం జరిగింది నాన్నా?” అంటూ.

ఆబద్దమాడితే ఏం జరుగుతుందో అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి నిజం చెప్పేసి అన్ని తిన్నాననుకోలేదమ్మా అని అమాయకంగా ఫేస్ పెట్టేశాను. ఇక ఆ రోజంతా ఒకటే నవ్వులు, “అన్ని తిని ఎలా అరిగించుకున్నావురా అది కడుపా గ్రైండరేమైనా మింగేశావా?" అని జోకులేసినా ఎక్కడ వాతం చేస్తుందో అని భయపడి వాము, అల్లం మురబ్బా లాంటివి తెప్పించి పెట్టి నాల్రోజులు జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ తర్వాత చాలా రోజులు ఇదే విషయం మీద నాపై జోకులు పడ్డాయనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుకదా. దెబ్బలకన్నా జోకులు చాలా మేలులే అని భరించేశా అనుకోండి.
సరే ఇక అలా అలా పెరిగి పెద్దయ్యాక ఇంజనీరింగ్ లో చేరిన తర్వాత ఎపుడైనా డిన్నర్ కోసం పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్ళినపుడు వాళ్ళు చివర్లో స్వీట్ సోంఫ్ ఇస్తారు కదా అది ఖర్చీఫ్ లోనో వాడే ఇచ్చే పేపర్ నాప్‌కిన్స్ లోనో పొట్లం కట్టేసి తీస్కొచ్చేయడం బాగా అలవాటైంది. డిమ్ లైటింగ్ ఉండేదేమో ఈ కొట్టేసే కార్యక్రమం నిర్విఘ్నంగా పక్కటేబుల్ వాడిక్కూడా తెలియకుండా చేసేసే వాడ్ని, అది కొన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేశా ఎప్పుడూ ఎవరికీ దొరకలా.

అయితే అసలు క్లెప్టోమానియా అని అనుమానించేంత సంఘటన నాకు ఉద్యోగం వచ్చిన కొన్నేళ్ళకి జరిగింది. అప్పట్లో వృత్తిరీత్యా తరచూ ఇండియాలోనూ అమెరికాలోనూ రకరకాల ఊర్లు తిరుగుతూండేవాడ్ని కంపెనీ డబ్బులే కాబట్టి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో బస చేసే వాడ్ని. ఆ హోటల్స్ లో వాళ్ళు ఇచ్చే హాండ్ టవల్స్, ఒకటీ అరా చిన్న చిన్న డెకరేటివ్ ఆర్టికల్స్, రూం సర్వీస్ కి తెచ్చిన కట్లెరీలో ఆసక్తికరమైనవి ఉంటే అవి ఇలాంటి వాటిలో ఏదో ఒకటి సైలెంట్ గా బాగులో సర్దేసే వాడ్ని, అదికూడా అస్సలు అనుమానం రాకుండా పొరపాటున సర్దినట్లు సర్దేవాడ్ని. ఇది తరచుగా ప్రతి ట్రిప్ లో చేయకపోయినా అప్పుడప్పుడూ హోటల్ కి ఒక ఐటం చొప్పున సావనీర్ లాగా కలెక్ట్ చేసేవాడ్ని. అయితే ఇదంతా పూర్తి స్పృహలో కాకుండా ఏదో యధాలాపంగా జరిగిపోతుండేది కానీ అదృష్టవశాత్తు ఎపుడూ దొరికిపోలేదు.
అలాంటి టైంలో ఒక సారి ఇల్లుమారుతున్నపుడు ఇలా కలెక్ట్ చేసినవి అన్నీ ఓ పది వస్తువులు వరకూ కప్ బోర్డ్ లో ఒకే చోట కనిపించేసరికి అప్పుడు సడన్‌గా షాక్ కొట్టింది. “అరే నాన్న సావనీర్స్ అనేవి నువ్వు తెచ్చుకునేవి కాదురా వాళ్ళు ఇచ్చేవి, ఇది పూర్తిగా దొంగతనమే” అని ఎరుక వచ్చేసరికి ఒక్కసారిగా చాలా ఎంబరాసింగ్‌గా ఫీల్ అయ్యాను. ఒకవేళ దొరికి ఉంటే నా పరువుతో పాటు నేను పని చేస్తున్న కంపెనీ పరువు కూడా ఏమయ్యేదో తలచుకుంటేనే ఒళ్ళు జలదరించింది. ఇలా లాభంలేదని వాటినన్నిటిని అక్కడే డస్ట్ బిన్ లో పడేసి అప్పటినుండీ ఇలాంటి టెండెన్సీ పట్ల కాస్త ఎరుకతో అప్రమత్తంగా ఉండటం ప్రారంభించాను. ఆ తర్వాతెపుడూ మళ్ళీ రిపీట్ అవలేదు. ఆఖరికి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సర్వీస్ మొదలెట్టిన కొత్తలో ఫ్లైట్లో కాంప్లిమెంటరీ హెడ్ ఫోన్స్ ఇచ్చినా కూడా అవి కాంప్లిమెంటరీనే కదా అని ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేస్కున్నాక కానీ ఇంటికి తెచ్చుకోలేదు.

అవండీ నాలోని తీఫ్ తిరుమలై కబుర్లు. నిన్న నా క్లాస్మేట్స్ చేసిన దొంగతనం గురించీ, ఈరోజు నేను చేసిన సరదా దొంగతనాల గురించీ విన్నారు కదా ఇక ఓ సీరియస్ దొంగతనం (నేను చేసింది కాదులెండి) గురించి వచ్చేనెల్లో తెలుసుకుందాం. నెలా అని అలా ఆవలించకండి... మరి మూడ్రోజుల్లో నెలమారిపోతుంది :-)