
అమ్మ జ్ఞాపకాల కబుర్లు
చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం
మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు
నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్
ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..
నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.
మంగళవారం, నవంబర్ 19, 2013
నమస్తే తెలంగాణ పేపర్ లో నేను
శనివారం, నవంబర్ 02, 2013
నల్లజర్ల రోడ్ గురించి నేను
శనివారం, అక్టోబర్ 05, 2013
అత్తారింటికి దారేది
పవన్ ని కూడా అతని గత చిత్రాలలోలాగా అక్కర్లేని సీన్స్ లో కూడా ఎగురుతూ గెంతుతూ హైపర్ ఎనర్జీతో యాక్ట్ చేయనివ్వకుండా ఎక్కడ తన కోపాన్ని ప్రదర్శించాలో ఎక్కడ తగ్గి ఉండాలో కాలిక్యులేటెడ్ గా చాలా బాలెన్స్డ్ గా నటింపచేశాడు. ఇక క్లైమాక్స్ సీన్స్ లో అయితే తన నటనతో డైలాగ్ డెలివరీతో త్రివిక్రమ్ పదునైన డైలాగ్స్ తో రాసిన ఎమోషనల్ క్లైమాక్స్ ని యథాతథంగా మనముందు పెట్టి చూపించి అందరినీ మెప్పించగలిగాడు.

“లక్ష కోట్లా !! ఎన్ని సున్నాలుంటాయ్ ?” “వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిలైపోద్ది చాలా..”“గాలొస్తుందని మనమే తలుపు తెరుస్తాం.. దాంతో పాటే దుమ్ముకూడా వస్తుంది..”“బుల్లెట్ అరంగుళమే ఉంటుంది కానీ ఆరడుగుల మనిషిని చంపుతుంది.. అదే బుల్లెట్ ఆరడుగులుంటే ఎలా ఉంటుందీ.. నా మనవడు గౌతం నందా అలా ఉంటాడు.”“నీ టెబుల్ మీద యాపిల్ తింటే బలమొస్తుందిరా అదే పక్కనోడి యాపిల్ కొట్టేద్దామంటేనే ఇదిగో ఇలా బలవంతంగా తీసుకు రావాల్సొస్తుంది.”“ఆనందం ఎలా ఉంటుందిరా.. వెతుకు.. డబ్బులో ఉంటదా.. అమ్మాయిలు తిరిగే క్లబ్బులో ఉంటదా లేదంటే వాళ్ళ ఒంటిమీద జారే సబ్బులో ఉంటదా..”“రేయ్.. సింహం పడుకుందికదా అని చెప్పి జూలుతో జడేయకూడదురా.. అలానే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదు రోయ్..”“ఆడపిల్లరా అదీ.. అభిమానముంటుంది..” “కొడుకుని నాన్నా నేను.. కోపముంటుంది”“వద్దనుకుని వదిలేసి ఒడ్డుకెళ్ళి ఏడుద్దామా.. కొంచెం కష్టమైనా సరే మోస్కుని తీస్కెళ్ళి జీవితాంతం నవ్వుదామా?”“ఇదే సార్ హైడ్రాబాడ్.. ఇక్కడ ట్రాఫిక్ చాలా బాడ్.. పెద్దమ్మతల్లి ఫేమస్ గాడ్”“ఇదివరకూ ఉంగరాల జుట్టుండేది.. ఇపుడు ఉంగరాలన్నీ వేళ్ళకొచ్చేసి జుట్టు ప్లెయిన్ అయిపోయింది”“రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జెలా కట్టాలో ప్లాన్ చేశాడు కానీ అడివిలో కూర్చుని బ్రిడ్జిప్లాన్ గీస్కుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు..”“అత్తని తీస్కురావడమెలాగ అని నేనేమైనా పుస్తకం రాశానా.. ఏవనిపిస్తే అది చేస్కుంటూ వెళ్ళిపోడమే..”“డబ్బిస్తే కారిచ్చేస్తారా?" "ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా?”“మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు.. నాలాంటి వెధవల్ని హర్ట్ చేస్తే ఏడిపిస్తారు.. దానిదగ్గర ఖర్చీఫ్ లేని టైం చూస్తాను డెఫినెట్ గా కన్నీళ్ళు పెట్టిస్తాను.”“ఐదుకిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పటల్ ఉంది అక్కడ జాయిన్ చేయచ్చుగా.. రెండుకిలోమీటర్ల లోపు స్మశానం కూడా ఉంది.. కొంచెం లేటైతే అక్కడకెళ్ళాల్సొచ్చేది.. కరెక్ట్ టైంకి తీస్కొచ్చాడు, యూ బెటర్ థాంక్ హిమ్”“చేతులు పట్టుకు థాంక్స్ చెబుతుందనుకున్నాను కాలర్ పట్టుకుని కరిచేస్తందేంటండీ ?" "ఆవిడ ఆగి ఆలోచించే మనిషైతే మనం ఇంతదూరం రావాల్సిన అవసరమేముంది బాలూ.”“అంత పొసెసివ్ అయితే ఆడపిల్లలని కనకూడదండీ ఒకవేళ కన్నా డాన్సులవీ చేయించకూడదు.. వాళ్ళు చూపిస్తేనేమో గ్లామరూ.. మేం చూస్తేనేమో వల్గరూ.. ప్రాణాలు తోడేస్తున్నారనుకోండి”“ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఏ ఐఐటీ ఇంజనీరో అని ఏ శాడిస్ట్ కో ఇచ్చి కట్టబెడతారు.. వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడానికి ఉపయోగిస్తాడు.. అప్పుడు తెలిసొస్తది”“అబ్బో మీ ఐ బ్రోస్ అండీ రివర్స్ లో ఉన్న నైకీ సింబల్ లా ఏం తిప్పారండీ”“ఆల్టర్నేటివ్స్ లేనపుడు పక్కనోళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు రోయ్ కాలిపోద్ది”“జీతాలిచ్చేవాడి మీద జోకులేస్తే ఇలాగే జీవితం తలకిందులైపోద్ది”“నేను కత్తిలాంటోడ్నిరా కూరగాయలూ తరుగుతా మెడకాయలూ నరుకుతా నాకు ఎమోషన్స్ ఉండవు డ్యూటీ తప్ప”“ఏడిస్తే ఎత్తుకున్నాను కదా అని ఎదిరిస్తే తోలు తీసేస్తాను”“తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది.. విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది”“నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా.. కానీ దరిద్రం మాష్టర్ బెడ్రూంలో ముసుగుతన్ని పడుకునుంది”“ఆ కళ్ళు చూడండి.. ఆకళ్లలోకి ఏ మగాడికైనా సరే లప్ అని దూకి ఫుల్లుగా ఈత కొట్టేయాలనిపిస్తుంది”“సగం కట్టేసి వదిలేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఏడంతస్థులమేడని నాకెంత పొగరుండాలి”“ఏయ్ శశి.. రాక్షసి.. గిన్నెకి పట్టిన మసి..”“భయమున్నోడు అరుస్తాడు.. బలమున్నోడు భరిస్తాడు”“అమ్మితే కొనుక్కో అది వ్యాపారం.. లాక్కోవద్దు అది దౌర్జన్యం..”“ఆడికి మనిషిని చంపేంత ధైర్యంలేదు మనిషికోసం చచ్చేంత కమిట్మెంటూ లేదు”“ఒంట్లో పట్టు తగ్గగానే మీ తాతకి పట్టుదల తగ్గిందా”“నాకు మీమీదేం కోపం లేదు.. ఎందుకంటే అందుకు మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకోవాలి.. అది నాకు ఇష్టంలేదు”“ఫ్లడ్ లైట్లేసున్న స్టేడియంలో దాగుడు మూతలాడుతూ దొరికిపోయాం”“ఈ ఆడపిల్లలకి అసలు టేస్ట్ లేదురా టీవీ యాంటెన్నాకి టీషర్టేసినట్లున్నాడు వెళ్ళి ఆడ్ని లవ్ చేస్తుంది”“అది ఎదురైతే దరిద్రం.. తగిల్తే తద్దినం”“నిజం డివిడిలో సినిమాకాదండీ, ఎప్పుడుపడితే అపుడు పాజ్ నొక్కేయడానికి.. థియేటర్లో సినిమా.. ఒక్కసారి మొదలెట్టామంటే శుభంకార్డ్ పడేదాకా తెరదించకూడదు అంతే”“నిజం నిప్పులాంటిది చెప్పేవాడికి కాల్తది కానీ వినేవాడికే వెచ్చగా ఉంటది” (నిజం తెలిసిన విలన్స్ అటాక్ చేశాక) “ఇప్పుడర్ధమైందా.. నిజం చెప్పేవాడికి కాలుద్దీ.. వినేవాడికి మండుద్ది..”“ఆగిపోయే పెళ్ళికి హడావిడెక్కువ అనీ..”“చదరంగంలో రాజు కూడా నీలాగే ముసలాడు ఎటేపైనా ఒక్కడుగు మాత్రమే వేయగలడు అయినా వాడ్నే కింగ్ అని ఎందుకన్నారంటే పక్కనే పవర్ఫుల్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి”“ఇది నా పొగరు.. దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే.. పెట్టుకుంటే సచ్చినట్టే”“పాము పరధ్యానంగా ఉందని పడగమీద అడుగేయకూడదు రోయ్..ఆ..”“ఒక్కడ్ని కొడితే అయినట్లేనా.. నాదగ్గర ఉన్నోళ్ళు ఒక్కొక్కడు కరెంట్ తీగతో ఉయ్యాలూగుతాడొరేయ్..”“కానీ పవర్ ప్లాంట్ తో పేకాడకూడదురోయ్ పేలి పోతారు”“నీ బిడ్డది పెళ్ళే.. కానీ ఆ బిడ్డది చావు.. ఏది పెద్దకష్టం?... నా కొశ్చన్ లో క్లారిటీ ఉంది నీ ఆన్సర్ లో షూరిటీ ఉంటుందా?”“చూడప్పా సిద్దప్పా.. నేనోమాట చెప్తాను పనికొస్తే ఈడ్నే వాడుకో గుర్తుకొస్తే ఏడ్నైనా వాడుకో.. నేను సింహం లాంటోడ్నబ్బా.. అది గడ్డం గీస్కోలేదు నే గీస్కుంటాను అదొక్కటే తేడా.. మిగతా అంతా సేం టు సేం... ఆ... అయినా లాస్ట్ పంచ్ మనదైతే దానికొచ్చే కిక్కే వేరబ్బ”“నా బతుకు దూదికంటే చులకనా నీటికంటే పలచన ఐపాయే”“పలావు మిగిలిపోతే పాలేర్లు తింటారు సార్.. కానీ ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా తినలేరు..”“ఏంట్రా కత్తులు చూపిస్తున్నావ్.. ఇవున్నది పంటలు కోయడానికి పీకలు కోయడానికి కాదు”“హా.. సరిపోయింది.. హీరో విలను కొట్టుకుని కమెడియన్ ని చంపేసినట్టు నామీద పడాతారేంటి వీళ్ళు”“వీళ్ళు మంచోళ్ళు కాబట్టి మజ్జిగిచ్చి మాట్లాడతన్నారు నాన్నా మన్లాంటాళ్ళైతే మనుషుల్ని పెట్టి బయటకి గెంటేసే వాళ్ళు”“మీకు డబ్బిస్తాం అనడం తప్పు.. పోయిన మీ పరువుకి బదులుగా మా ఇంటి మర్యాదని మా రెండో అమ్మాయిని మీ అబ్బాయికిస్తాం”“మంచి విషయాలు కూడా ఎందుకు వదులుకోవాలో నాకిప్పుడు అర్ధమవుతుంది.. రావి చెట్టుకి పూజ చేస్తాం.. దేవుడంటాం.. అదే మనింటి గోడలో మొలిస్తే.. పీకేస్తాం... నీవల్లే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయ్ కానీ రేపా పెద్దాయన నీవల్ల ఏదైనా ఇరిటేట్ అయితే అవే పెళ్ళిళ్ళు ఆగిపోతాయ్. నువు మెడిసిన్ లాంటోడివి సిద్దూ.. కానీ దానికి కూడా ఒక expiry date ఉంటుంది.”“గెంటితే గేట్ కూడా డబల్ స్పీడ్ లో వస్తుంది..”“నా దగ్గరనుండి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి..?”“కొంచెం సంస్కారం..”“అదేంటయ్యా లక్ష్మీ దేవి ఇంటికొస్తుంటే.. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి.. రెడ్ సిగ్నల్ ఏస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి”“ఆకలి తీరింది కదా అని అడుక్కోడం మానేస్తామా స్వామీ”“మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం”“ఈ నెక్లెస్ అమ్మినా సంవత్సరం పాటు రెక్లెస్ గా బతికేయచ్చు”“నీకు ఉర్దూ వచ్చా..?” “వాడు కొట్టేది చూస్తే చైనీసూ చిత్రలేఖనం కూడా వచ్చుండాది”“కార్లో ముందు సీట్ కీ వెనక సీట్ కీ మధ్య దూరం ఎవ్వరూ తగ్గించ లేరు”“మీది ప్రేమ.. అవతల వాళ్ళది వ్యామోహం.. మీరు చేస్తే ఆదర్శం.. వేరే వాళ్ళు చేస్తే ఆవేశం.. మీరరిస్తే మమకారం మా తాత అరిస్తే మటుకు అహంకారం..”“జీవితంలో ప్రతీ సమస్య మనిషికి రెండు దారులిస్తుంది.. ఒకటి ప్రేమతో ఉన్నది, రెండు ద్వేషంతో నిండింది”“కంటికి కనపడని శత్రువుతో బయటకి కనపడని యుద్దం చేసేవాడ్ని”“బాగుండడం అంటే బాగా ఉండడం కాదు.. నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం”“కుదిరితే క్షమించు.. లేదంటే శిక్షించు.. కానీ మేం ఉన్నామని గుర్తించు.. దయచేసి గుర్తించు..”“ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు..”ఇది సినిమా చివర్లో ఎండ్ క్రెడిట్స్ తో వచ్చే నేపధ్య గీతం. దేవదేవం భజే పాట లోని రెండో చరణం.ఆఆఆఅ...కనుల తుది అంచునొక నీటి మెరుపూ..కలలు కలగన్న నిజమైన గెలుపూ..పెదవి తుది అంచునొక తీపి పిలుపూ..సెగల ఏడబాటుకది మేలి మలుపూ..భళ్ళున తెల్లారే తళ తళ తూరుపులావెలుగులు కురిసిందీ ఈ ఆనందం..ఋతువులు గడిదాటే చెరగని చైత్రములానవ్వులు పూసిందీ ఈ ఆనందం..జీవమదె మాధురిగ మమతలుచిలికెను మనసను మధువనం.దేవ దేవం భజే దివ్య ప్రభావందేవ దేవం భజే దివ్య ప్రభావంరావణాసుర వైరి రణపుంగవంరామందేవ దేవం భజే దివ్య ప్రభావం
బుధవారం, ఆగస్టు 28, 2013
మిస్సవకూడని 2 సినిమాలు
ఆదివారం, ఆగస్టు 18, 2013
చీమలు దోమలు ఈగలు - చిట్కాలు
చీమలు : ఇదివరకటి రోజుల్లో ఇంట్లో గచ్చు చేసో నాపరాళ్ళు పరచో ఉంటే ఆ గచ్చుపగిలిన చోటో లేక బండలమధ్యో కొంత ప్లేస్ చేస్కుని చీమలు మనమీద దండయాత్ర చేసేవి అలాంటపుడు వాటి ఆరిజిన్ కనిపెట్టి అక్కడ కాస్త గమేక్సినో ఏదో కొట్టేస్తే వాటి బెడద వదిలేది. కానీ ఇపుడు అపార్ట్మెంట్స్ లోనూ మామూలు ఇళ్ళలోకూడా ఆ సౌకర్యంలేదు, మార్బుల్ ఫ్లోర్ వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నా ఎక్కడ నుండి వస్తాయో తెలీదు. ఒకసారి దాడి మొదలెట్టాక స్వీటూ, హాటు, అన్నం, పప్పు, ఫర్నిచర్, లాప్ టాప్ అని తేడా లేకుండా ఎడతెరిపి లేకుండా ఎక్కాడపడితే అక్కడ తిరిగేస్తాయ్.
నిజానికి నేను మా వంటగది కిటికీలో వీటికోసం చిన్న ప్లేట్లో పంచదార వేసి విడిగా పెడతాను ఎపుడూ, సాధారణంగా బుద్దిగా అది మాత్రం తిని మిగతా చోట్లకి దాడిచేయవు. అక్కడ అదిపెట్టడానికి కారణం అదే అబండెంట్ సోర్స్ ఉన్నపుడు వెతుక్కుని మిగిలిన చోట్లకి రావుకదా అని. కానీ మొన్న వేసవిలో మాత్రం మమ్మల్ని బానే ఇబ్బందిపెట్టాయి ముఖ్యంగా సోఫాలకి కూడా పట్టేసేవి అవి ఎండలో పెట్టి దులిపినా రెండురోజులకి మళ్ళీ సిద్దం. వాటిమీద గమాక్సిన్ లాంటివి కూడా చల్లలేము, సోఫాలో కూర్చుంటే కుట్టి అల్లాడిస్తాయి కనుక వదిలేయనూలేము.
అలాంటి టైంలో ఓ చిట్కా గురించి తెలిసింది, ఇల్లు తుడిచేప్పుడు ఆ నీళ్ళలో ఉప్పుకలిపితే ఫలితం బాగుంటుందని అన్నారు. నేను ఆల్రెడీ ఖరీదైన క్లీనర్స్ కలుపుతాను అనో, మేం అసలు ఇల్లు తుడిచేదే బోరింగ్ లో వచ్చే ఉప్పునీళ్ళతో అనో చెప్పకండి :-) ఇపుడందరూ వాడే అయొడైజ్డ్ టేబుల్ సాల్ట్ కాకుండా ఒకప్పుడు వాడే సాధారణ ఉప్పు కల్లుప్పు తెలిసే ఉంటుంది కదా. షాప్ లో క్రిస్టల్ సాల్ట్ / కల్లుప్పు అని అడిగితే ఇస్తారు. పేరు చూసి ఖంగారుపడకండి అది కల్లునుంచి ఏం తయారుచేయరు సముద్రపు నీటినుండే తయారుచేస్తారు. ఈ ఉప్పు కొంత నీళ్ళలో కలిపి ఒక వారం రోజులు తుడిస్తే చాలా ఆశ్చర్యకరంగా చీమలు అన్నీ మాయం వాటిని చంపామన్న బాధ లేకుండా వాటంతటవే వెళ్ళిపోయాయి.
దోమలు : చీమలు మనకి హాని చేసేది తక్కువే కనుక వాటి పట్ల జాలి చూపించినా దోమల పట్ల మాత్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించకపోతే అనేక జబ్బులకు కారకమవుతాయి. ఇంటిచుట్టూ మురుగు నీటి నిలవలు లేకుండా జాగ్రత్త పడడం ఇంట్లో కూడా దోమలు చేరగలిగేలా చెమ్మతో కూడిన చీకటి ప్రదేశాలు లేకుండా చూసుకోవడం ద్వారా కొంత నివారించవచ్చు. కిటికీకి మెష్ లూ, మంచాలకి దోమ తెరలూ, మార్కెట్లో రకరకాల బ్రాండ్ల మస్కిటో కాయిల్సూ, రిపెల్లెంట్సూ, వెతికి పట్టుకుని ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపే మస్కిటో జాపర్స్ ఇన్ని పరికరాలున్నా అవి అందుబాటులో లేని సమయంలో కానీ కాయిల్స్ రిపెల్లెంట్స్ పడని వాళ్లుగానీ ఈ సింపుల్ హోం రెమెడీ వాడచ్చు.
దోమలు మనుషులు వదిలే కార్బన్ డై ఆక్సైడ్ వాసనని బట్టి మన ఉనికిని కనిపెడతాయట. సో ఆ ఎబిలిటీని మనం నిర్వీర్యం చేయడం ద్వారా దోమలు మనల్ని కనిపెట్టకుండా చేయచ్చు. ఇదే ఫార్ములా ఉపయోగించుకుని షర్టుకి అంటించుకు తిరిగే ఒక పాచ్ తయారు చేస్తున్నారు ఆ వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చూడచ్చు. అయితే ఇంచుమించు ఇదే పనిని హారతి కర్పూరం (Camphor) కూడా చేస్తుంది. షర్ట్ గుండీల పరిమాణంలో దొరికే కర్పూరం టాబ్లెట్స్ రెండు తీస్కుని వాటిని ఒక చిన్న వెడల్పాటి గిన్నెలో నీళ్ళు పోసి అందులో వేసి బెడ్ దగ్గర పెట్టుకుంటే రాత్రంతా అవి నీటితో పాటు ఆవిరై కర్పూర పరిమళాన్ని గదంతా వ్యాపింప చేస్తూ దోమలను ఇంకా వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న కీటకాలను కూడా దూరంగా తరిమేస్తుంది.
లేదంటే పాత మస్కిటో మాట్ పరికరాలుంటే బొమ్మలో చూపినట్లు రెండు టాబ్లెట్స్ వేసి వేడి చేయడం ద్వారా కూడా ఇదే ఫలితాన్ని పొందచ్చు. ఐతే కర్పూరానికి మండే గుణం ఉంది కనుక ఈ పరికరం వాడేప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. నీటిలో వేయడం సేఫ్ నేను ప్రయత్నించి చూశాను బాగా పని చేస్తుంది. అలమారలలో వేసే మాత్/నాఫ్తలిన్ బాల్స్ వేరు ఈ హారతి కర్పూరం వేరు కన్ఫూజ్ అవకండి నేను చెప్పేది కర్పూరం గురించి. అలాగే యూకలిప్టస్, మెంథాల్, లవంగ వాసనలంటే కూడా దోమలకు పడదంటారు అవికూడా ఉపయోగించ వచ్చట.
ఈగలు : వానాకాలంలో ఇవి కూడా ఎక్కువే వస్తాయి, ఫినాయిల్ లేదా లైసాల్ లాంటి క్లీనింగ్ లిక్విడ్స్ చాలా వరకూ పని చేసినా ఒకోసారి అలా శుభ్రం చేసే వీలు లేని కొండొకచో ఎంత శుభ్రంగా ఉన్నాకూడా ఫర్నిచర్ పైన మనుషుల పైనా వాలుతూ ఈ క్లీనింగ్ సొల్యూషన్ ఎఫెక్ట్ మాకేమాత్రం లేదని విర్రవీగుతుంటాయి. అలాంటి సమయంలో ఒక చిన్న బౌల్ లో పుదీనా ఆకులని నలిపి పెడితే మంచి వాసన రావడమే కాక ఈగలు బయటకు వెళ్ళిపోతాయి. ఒకవేళ వీటికి అలవాటు పడ్డాయనిపిస్తే లవంగాలు పొడిచేసి కొంచెం వార్మ్ వాటర్ లో వేసి ఉంచితే ఆ వాసనకి కూడా ఈగలు పోతాయని అంటారు. ఈ చిట్కాలు ఈగ సినిమాలో విలన్ సుదీప్ కి ఎవరూ చెప్పినట్లు లేరు పాపం :-) ఈమధ్య ఈ సమస్య ఫేస్ చేయలేదు కానీ లాస్ట్ ఇయర్ వేరే ఇంట్లో ఉన్నపుడు ఇవి నేను ప్రయోగించి చూశాను విజయవంతంగా పని చేశాయి.
పై మూడూ నేను ప్రయత్నించి చూసిన చిట్కాలైతే మరో చిన్న చిట్కా ఇంకా ప్రయత్నించనిది ఇది ఎలుకలకి పని చేస్తుందట. ఎలుకని బోన్ లో బంధించాలన్నా మందుపెట్టి చంపాలన్నా అయ్యో పాపం అనుకునే వాళ్ళు ఈ చిట్కా ప్రయత్నించి చూడచ్చు. ఎలుకలకు కూడా స్ట్రాంగ్ స్మెల్ పడదట ఒక చిన్న కాటన్ బాల్ ని పెప్పర్ మింట్ ఆయిల్ లో ముంచి దాన్ని ఎలుకలు ఇంట్లోకి వస్తున్నాయి అన్న అనుమానమున్న చోట ఉంచితే రావట. అలాగే పలావు ఆకులని కిచెన్ లో ఉంచడం ద్వారా కూడా వీటిబాధను తప్పించుకోవచ్చట, బట్టల కప్ బోర్డ్స్ లో వేసే మాత్/ నాఫ్తలిన్ బాల్స్(కలరా ఉండలు) ఉన్నచోటకు కూడా ఎలుకలు రావని అంటారు. అలాగే అవి మీఇంటి బయట గోడల దగ్గర ఎక్కువ తిరుగుతున్నాయనిపిస్తే అవి తిరిగే చోట పుదీనా మొక్కలు పెంచినా కూడా వీటిభారినుండి తప్పించుకోవచ్చు అని విన్నాను. అవండీ ప్రస్తుతానికి నాకు గుర్తొచ్చినవి మీకేవైనా తెలిసినవి ఉంటే కామెంట్స్ లో పంచుకోండి.
ఆదివారం, ఆగస్టు 04, 2013
ఓ ప్రయాణం
ఖాళీగా ఉన్న ఒక సీట్ కాస్త మురికిగా ఉందనిపించి ఒకసారి చేత్తో దులిపాను, బంద్ మహిమ అనుకుంటాను ఒక పెద్ద ధూళి మేఘం ఇంతెత్తున ఎగసింది, ఖర్చీఫ్ తీసి ముక్కుకి అడ్డం పెట్టుకుని మళ్ళీ దులిపాను అదే రేంజ్ లో మళ్ళీ దుమ్మొచ్చింది. నేను ఓపికగా ఎన్ని సార్లు దులిపినా నన్నుసవాల్ చేస్తున్నట్లు అదే రేంజ్ లో దుమ్ము వస్తుండేసరికి వెనక సీట్ లో కూర్చున్న ఒక పెద్దాయన “ఎంత దులిపినా అంతే వస్తుంది దానికన్నా అలాగే కూచుని ఇంటికెళ్ళాక మీ ఫాంట్ శుభ్రంగా దులుపుకోడం బెటర్” అని నవ్వుతూ సలహా ఇచ్చారు, బదులుగా నేనూ ఓ నవ్వు నవ్వి కొంచెం శుభ్రంగా కనిపించిన వెనక సీట్లో కూలబడ్డాను.
డ్రైవర్ ఎక్కాక “బస్ చెంచుపేట వరకే వెళ్ళుద్దండీ బంద్ కదా తెనాలి బస్టాండ్ కి తాళాలేశారుట” అని అనౌన్స్ చేశాడు. “హ్మ్ అక్కడనుండి ఎలా వెళ్ళాలో ఆటోలన్నా తిరుగుతున్నాయో లేదో” అనుకుంటూ కాస్త ఉక్కగా చిరాకుగా ఉండటంతో గాలికోసం కిటికీ సాధ్యమైనంత మేర తెరచి పాటలు పెట్టుకుని వింటూ సీట్ కి చేరగిలబడి పైన లగేజ్ ర్యాక్ కేసి చూస్తూ అలా ఆలోచనలలోకి వెళ్ళిపోయాను. తీరా తెనాలి వెళ్ళాక ప్రశాంతంగానే ఉందని తెలియడంతో నేను ఎప్పుడూ దిగే పాయింట్ దగ్గరే దించేశాడు.

సూపర్ మార్కెట్స్ లో దొరికే పెద్ద పుట్టగొడుగులు వండుకుని ప్లస్ రెస్టారెంట్స్ లో దొరికే కూరలు ప్రయత్నించి అనేకసార్లు భంగపడ్డాక ఇక ఇలా లాభంలేదని వానాకాలం కోసం ఎదురు చూడడానికి అలవాటుపడ్డాను. దారిన మాములుగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళు సైతం ఆగి అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆ గంపల వేపు నడిచి బేరాలాడడం చూసి నవ్వుకుని ముందుకు సాగాను. చిన్నపుడు వర్షం పడిన ప్రతిరోజు “అమ్మా ఈరోజు పుట్టగొడుగులు మొలిచి ఉంటాయంటావా” అంటూ అమ్మని వేధించిన రోజులు గుర్తొచ్చాయి.

వాతావరణం ప్లస్ మనసు కూడా ప్రశాంతంగా ఉండటం వల్లో లేక ఈ మధ్య బయట ఎక్కువ తిరగకపోవడం అదీ పల్లెల మీదుగా ప్రయాణం చేయకపోడం వలనో తెలియదు కానీ ఈ తిరుగు ప్రయాణంలో బస్సు ముందుకు వెళ్ళేకొద్ది కనిపించే ప్రతి చిన్న దృశ్యం కూడా ఒక్కో జ్ఞాపకాన్ని కదిలిస్తూ నన్ను వెనక్కి గతంలోకి ప్రాయాణం చేయించింది. కాలవలలో సమృద్దిగా నీరు నిండి ఉండడం చూసి మనసు నిండిపోయింది. చెట్లమధ్య బస్సు పరుగులు తీస్తుంటే అప్పటివరకూ ఉన్న ఎండకి తోడు పచ్చని చెట్లపై అప్పుడే పడిన వర్షంవల్ల కాబోలు గాలి నాకు ఇష్టమైన కమ్మటి మట్టి వాసనతో పాటు మొక్కల నుండి వచ్చే ఒకరకమైన పసరు వాసనని కూడా మోసుకొస్తుంది ఆ గాలినీ ఆ పరిమళాన్నీ గుండెనిండుగా ఎంత పీల్చినా తనివి తీరలేదు.
ఇక ఊళ్ళోనే ఏదో ఒక సెంటర్ లో బోలెడన్ని పనసకాయలు పదులు ఇరవైలలో కాదు వందల కొద్దీ పనసకాయలు ఒకే చోట గుట్టగా పోసి అమ్ముతుండడం చూస్తే భలే అనిపించింది. వైజాగ్ లో చదువుకునే రోజుల్లో కాలేజ్ కి వెళ్ళేప్పుడు గోదారి జిల్లాల్లోనో విశాఖ జిల్లాలోనో దారిమధ్యలో రోడ్ పక్కన గుట్టలుగా పోసి అమ్మేవారు అవి గుర్తొచ్చాయి. అంతెందుకు అప్పట్లో మా డిపార్ట్మెంట్ లో ఒక పనస చెట్టు ఉండేది క్లాస్ బయటకు వస్తే ఎదురుగా కనిపిస్తూ పలకరించేది. ఇదివరకు గుంటూర్లోనే క్వార్టర్స్ లో ఉన్నపుడు మా కాంపౌండ్ లో కూడా పనసచెట్టు ఉండేది, శలవలకి వచ్చినపుడు ఎన్నికాయలు వచ్చాయి వివరాలు కనుక్కుని దానిని మురిపెంగా ఒకసారి చూసుకునే వాడ్ని, అవన్నీ వరుసగా గుర్తొచ్చాయ్.
![]() |
నేను చూసిన గంపలు ఇంకా వెడల్పుగా ఉన్నయ్. |
ఇక అలా కొంచెం ముందుకు వెళితే కొంత దూరం వెళ్ళాక ఒక చోట కట్టెల అడితి కనిపించింది, దీనిని కూడా నేను చూసి చాలా ఏళ్ళవుతుంది, ఈరోజుల్లో పూర్తిగా వీటి వాడకం పోయిందనుకున్నాను కానీ పెద్ద అడితి చూస్తే ఆ ఏరియాలో బాగానే డిమాండ్ ఉన్నట్లనిపించింది. నేను చిన్నపుడు మాది కట్టెలపొయ్యే అప్పట్లో వీధికో అడితీ ఉండేది చిన్నపిల్లలం కనుక మనకి ముట్టుకోడానికి నిషిద్దం కానీ ఆటలాడడానికి ఇంట్లో చూడకుండా వాటిని తీయడం చేతుల్లో ఎక్కడో అక్కడ పేళ్ళు గుచ్చుకుపోతే పడేబాధ తర్వాత తినే తిట్లూ ఇప్పటికీ గుర్తున్నాయ్. ఈ పొయ్యిల్లోకే పిడకలు కూడా వాడేవాళ్ళం.
![]() |
ఇందులోనే ఊదుగొట్టం కూడా గమనించవచ్చు |
ఇక వంటయ్యాక ఉండే నిప్పులలో గెణుసుగెడ్డలు/ చిలకడదుంపలు మొక్కజొన్న పొత్తులు, ఉల్లిపాయలు కాల్చుకుని తింటూంటే ఆహా ఆ రుచి అమోఘం. ఇక రాత్రుళ్ళు ఆ బూడిదలో వెచ్చగా ఉంటుందికదా పిల్లులు వచ్చి చేరి పడుకునేవి. అందుకే తిండిలేక పస్తులుండటాన్ని చెప్పడానికి "రెండ్రోజులుగా పొయిలో పిల్లిలేవలేదు" లాంటి వాడుక సామెతలు పుట్టాయి. అలాంటి పొయ్యిల మీదే ఒకప్పుడు పెద్ద పెద్ద వంటలు కూడా ఎలా చేసేసేవాళ్ళో తలచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. పిడకలంటే గుర్తొచ్చింది కొన్ని ఊర్లలో పాడి సంపదా, చెట్లకీ గోడలకీ కొట్టిన పిడకలు కూడా నా కళ్ళకి ఇంపుగా కనిపించాయండోయ్.
మరికాస్త ముందుకెడితే బుడంపాడు చెరువు దగ్గర అనుకుంటా బస్టాపు పక్కనే కూరగాయల మార్కెట్టు కూడా చిన్నపుడు నరసరావు పేటలో నాన్నతో కలిసి తిరిగిన మార్కెట్టుని గుర్తుచేసింది. పెద్దాయ్యాక సూపర్ బజార్ కి వెళ్ళడమే కానీ కూరగాయల మార్కెట్టుకో రైతుబజార్ కో వెళ్ళడం తక్కువే నేను. ఒక వేళ వెళ్ళినా అక్కడ ఇరుకు సందులు మురికి మధ్యలో కొనడం కొంచెం చిరాకుపెట్టేవి. కానీ ఈ మార్కెట్ వాటికి భిన్నంగా వరుసగా చక్కగా పక్కాగా కట్టిన కొట్లలో నీట్ గా అరలు అరలుగా కూరగాయలను సర్ది శుబ్రత కూడా పాటిస్తూ చూడగానే దిగి కొనుక్కోవాలనిపించేంత అందంగా స్పేషియస్ గా ఉండి భలే నచ్చేసింది.
ఇక వీటితో పాటుగా మబ్బులు పట్టిన ఆకాశంలో చిత్ర విచిత్రమైన వర్ణాలు రూపాలు ఆవిష్కృతమై దారిపొడుగునా ఆకాశంలోకి చూసినపుడల్లా కొత్త కొత్త రూపాలతో అలరిస్తూ నాకు తోడు వచ్చాయి. నిజానికి ప్రయాణంలో నాకు చాలా ఇష్టమైన హాబీ ఇదే, బస్ కిటికీలోనుండి మేఘాలను చూస్తూ వాటికి రకరకాల రూపాలనాపాదించడం. నిన్న నాకు బోర్లా పడుకుని పుస్తకం చదువుకుంటున్న అమ్మాయినుండి డాబాపై ఆరబెట్టిన బియ్యం వడియాల దాకా రకరకాల రూపాలలో కనిపించాయి మేఘాలు. అవండీ నిన్నటి నా బస్సు ప్రయాణం నాతో చేయించిన జ్ఞాపకాలలోకి ప్రయాణం విశేషాలు.
![]() |
నను గాభరాపెట్టే ఇరుకు మార్కెట్ |
గురువారం, ఆగస్టు 01, 2013
దొంగా - పోలీసూ - ఓ కోర్టు.
సమయం తెల్లవారుఝామున సుమారుగా మూడున్నరై ఉంటుంది, అప్పటికి గంటక్రితమే పడుకున్న నేను నాన్నగారి పిలుపుకు ఉలికిపడి నిద్రలేచాను. తను “వెనుకవేపు తలుపేయడం మరచిపోయావా తీసుంది” అని అడిగారు. నేను “లేదండీ గంటక్రితమే మంచినీళ్ళు తాగుతూ కూడా చెక్ చేశాను వేసే ఉండాలే” అనుకుంటూ హాల్ లోకి వచ్చి తలుపు చూస్తే బార్లా తెరచి ఉంది.
ఒకడుగు బయటకి వెళ్లి ఎవరైనా ఉన్నారేమో చూసి వచ్చి తలుపు వేసి ఎందుకో అనుమానం వచ్చి ఇంట్లో సామాన్లు చెక్ చేయడం మొదలెట్టాను. టేబుల్ మీద ఉండాల్సిన లాప్ టాప్ లేదు, టీవి మీద పెట్టిన స్మార్ట్ ఫోన్, కప్ బోర్డ్స్ లో ఉండాల్సిన మరో మూడు సెల్ఫోన్స్ కూడా లేవు, కొన్ని అల్మారాలలో వస్తువులు చిందరవందర చేసి ఉన్నాయ్. దాంతో ఇంట్లో దొంగతనం జరిగిందని అర్ధమైంది.
వెంటనే మిస్సింగ్ ఫోన్స్ కి రింగ్ ఇవ్వడం మొదలెట్టాం. మూడు ఫోన్లు స్విచ్చాఫ్ అని మెసేజ్ వచ్చింది నాలుగో ఫోన్ రింగ్ ఇంటి బయటనుండి వినిపించడం మొదలైంది. దానితోపాటే ప్లాస్టిక్ షీట్ మీద ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. మాకు దొంగ అక్కడే ఉన్నాడేమోనన్న అనుమానం వచ్చింది. వెంటనే పోలీసుల కోసం 100 కి ఫోన్ చేసి విషయం చెప్పి అడ్రస్ ఇచ్చి ఎదురు చూడ్డం మొదలెట్టాం.
అడుగుల చప్పుడు ఆగిపోయింది కానీ ఫోన్ రింగ్ మాత్రం అక్కడనుండే వినిపిస్తుంది. ఐదునిముషాలకి కొంచెం ధైర్యం వచ్చి సేఫ్టీకోసం పక్కనే ఉన్న పచ్చడిబండ తీస్కుని మెల్లగా తలుపు తీసి ఫోన్ రింగ్ వచ్చిన వైపు వెళ్ళాను. అక్కడ కాంపౌండ్ వాల్ మీద ఒక ఫోన్ ఉంది. లైట్ వేసి ఆ చుట్టు పక్కల ఇతర ఫోన్లు కానీ లాప్ టాప్ కానీ దొరుకుతుందేమోనని వెతికాను. ఇంకేవీ లేవు, ఫోన్ ఉన్న ప్రదేశాన్ని చాక్ పీస్ తో మార్క్ చేసి దాన్ని లోపలికి తెచ్చేసాను. పదినిముషాలకి పోలీసులు వచ్చారు.
![]() |
ఇవే టవర్ బోల్ట్స్, మా తలుపు కిటికి ఇంతే ఉంటై. |
పోలీస్ స్టేషన్ లోని క్రైం డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ గారికి విషయమంతా వివరించాక అతనూ మరో కానిస్టేబుల్ కలిసి ఇంటికి వచ్చి వివరాలు నోట్ చేస్కుని వెళ్ళారు. ఉన్న వస్తువులేవీ కూడా వేలి ముద్రలు తీస్కోడానికి అనువుగా లేవని వదిలేశారు. ఆ సాయంత్రం మళ్ళీ స్టేషన్ కు రమ్మని చెప్పారు. ఆ సాయంత్రం నేను తెలుగులో రాసిచ్చిన రిపోర్ట్ తోపాటు దానిని వాళ్ళు ఆంగ్లంలోకి తర్జుమా చేసి కంప్యూటర్ లో టైప్ చేసిన FIR కాపీ ఒకటి ఇచ్చారు. కేస్ లో పురోగతి ఉంటే మేమే కాల్ చేస్తామని చెప్పి నంబర్ నోట్ చేస్కుని పంపించేశారు. ఓవరాల్ గా పోలీసుల రెస్పాన్స్ నాకు చాలా బాగా నచ్చింది.
21st April 2013:
మధ్యాహ్నం ఒంటిగంట దాటింది, భోజనానికి కూర్చోబోతుండగా ఒక అన్నోన్ నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఎవరా అనుకుంటూ మాట్లాడితే “మేము ఫలానా పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నాం, మీ లాప్ టాప్ దొరికింది వచ్చి ఐడెంటిఫై చేయండి” అని చెప్పారు. నేనూ తమ్ముడూ భోజనం కూడా చేయకుండా పరుగున పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. ఒక లాప్ టాప్ ఆరో ఏడో సెల్ఫోన్స్ తీసుకువచ్చి వీటిలో మీ వస్తువులు గుర్తుపట్టండి అని అడిగారు. లాప్ టాప్, ఒక సెల్ఫోన్ మావే అని చెప్పాం. దొంగ దగ్గర ఈ మాత్రమే రికవర్ చేయగలిగామని నోకియా ఫోన్ లాక్ ఓపెన్ చేయలేక ఫ్రస్టేషన్ తో పగలగొట్టాడనీ మరో ఫోన్ పోయిందంటున్నాడనీ చెప్పారు.
"సర్లెండి ఈ మాత్రమైనా వచ్చాయి మా వస్తువులు మేం పట్టుకుపోతాం" అని చెప్పాం. ఆయన మమ్మల్ని పిచ్చివాళ్ళని చూసినట్లు చూసి నవ్వి అదంత వీజీకాదు దానికో ప్రొసీజరుంది అని మొదలెట్టారు. ఇక అక్కడ నుండి మా కష్టాలు మొదలయ్యాయ్ కేస్ బబుల్ గమ్ లా సాగడం మొదలైంది, సామాన్లు పోలీస్ స్టేషన్ లో లాకర్ లో భద్రంగా దాచారు. ఆ పక్కనే మరో సెల్ లో దొంగని కూడా పెట్టి మేపుతున్నారు. నేను మాత్రం పోలీస్ స్టేషన్ కి ఇంటికీ మధ్య చక్కర్లు కొట్టడం మొదలెట్టాను.
లీగల్ సిస్టం ఎంత చిత్రమైందంటే పోలీసులు ఇన్ఫార్మర్స్ ద్వారానో అనుమానితులపై నిఘా వేసో దొంగలను పట్టుకున్నామని చెప్తే కోర్ట్ నమ్మదట. వాళ్ళని సక్రమంగా పట్టుకున్నట్లు కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించాలిట. ముందుగా అలాంటి ఇద్దరు సాక్షులను అరేంజ్ చేయిస్తే రెండు మూడు వారాలలో మీ సామాను మీకు ఇప్పిస్తామని చెప్పారు కానీ అలా చెప్పగలిగిన వాళ్ళు నాకు ఎవరూ తెలియరని చెప్పాను. అయితే బాగా ఆలశ్యమవుతుంది ముద్దాయి కూడా శిక్ష తప్పించుకోవచ్చు అన్నారు. నేను చేయగలిగింది ఏమీలేదని చెప్పడంతో సాధారణంగా ఎప్పటిలాగే వారి పద్దతులలో కేస్ ఫైల్ చేస్తామని చెప్పారు.
కేస్ ఫైల్ చేశాక నేను ఒక లాయర్ ని పెట్టుకుని రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కేస్ ఫైల్ చేయాలట దానికి లాయర్ ప్లస్ కోర్ట్ ఫీజులూ చెల్లించాలి అదీకాక గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి శాలరీ సర్టిఫికెట్ తో వస్తువుల ధరకి హామీ ఇప్పించాలిట. అంటే నేను కేస్ హియరింగ్ కి వచ్చినరోజున వస్తువులని మళ్ళీ కోర్ట్ లో హాజరుపరచాలి అలా కాని పక్షంలో ఆ ఆఫీసర్ కోర్టుకు డబ్బులు కట్టాలన్నమాట. లేదా కేస్ హియరింగ్ కి వచ్చిన రోజున కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి మీ వస్తువులు మీరు తీసుకు వెళ్ళవచ్చు అన్నారు. కేస్ కోర్ట్ లో ఫైల్ చేయడానికి కొన్ని రోజులు ఆలశ్యం అయింది. ఆ తర్వాత ఒక లాయర్ ని మాట్లాడాలని చెప్పి మరికొన్ని రోజులు తాత్సారం చేసి తిప్పుకున్నారు. అంతలో హియరింగ్ దగ్గర పడింది.
26th July 2013
అంతకు నాలుగు రోజుల ముందే ఈరోజు మీ కేస్ హియరింగ్ అని చెప్పడంతో పదిన్నరకు కోర్ట్ ఆవరణకు చేరుకున్నాను. నా జీవితంలో మొట్ట మొదటి సారి అక్కడికి వెళ్ళడం, కోర్ట్ అనగానే సినిమాలలో చూపించినట్లు ఎత్తైన మెట్లు భారీ సెట్టింగ్ ఊహించుకున్న నాకు మాములు భవన సముదాయం కనిపించి నిరాశపరిచింది. సరే ఇక్కడిలాగే ఉంటుందేమో అని కాస్త లోపలికి నడవగానే చెడు వినకు, అనకు, కనకు అంటూ బక్కచిక్కిన మూడు కోతి బొమ్మలు వెల్కం చెప్పాయ్. నాకు కావలసిన కోర్ట్ రూం ఎక్కడుందో వాకబు చేస్తూ మరికొంచెం ముందుకు వెళ్ళగానే న్యాయదేవత ఎదురైంది ఆవిడని తప్పుకుని ముందుకు వెళ్తే నేను వెతుకుతున్న కోర్ట్ హాల్ కనిపించింది అక్కడే ఉన్న మా పోలీస్ స్టేషన్ HC(Head constable) ని పలకరించాను. ఆయన నాతరఫున వస్తువులను రిటర్న్ చేయమంటూ లెటర్ రాసి సంతకం పెట్టించుకుని కోర్ట్ లో సబ్మిట్ చేసి "మీ పేరు పిలుస్తారు ఎదురు చూడండి" అని చెప్పారు.
మాములు పాత యూనివర్సిటీ/గవర్నమెంట్ బిల్డింగ్స్ లాగా పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన భవనం అది. ముందు కొన్ని నీడనిచ్చేచెట్లున్నాయ్ వాటికింద నాలుగైదు సిమెంట్ బల్లలు ఉన్నాయి. వాటిమీద ముద్దాయిలు సంకెళ్ళతో కూర్చుని ఉన్నారు వారిపక్కన వారికి ఎస్కార్ట్ గా వచ్చిన పోలీసులు గన్నులతో ఉన్నారు. సంకెళ్ళనీ గన్నునీ కూడా అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి. వీళ్ళేకాక రకరకాల పనులమీద వచ్చిన ఇతర వ్యక్తులు కూర్చుని ఉన్నారు. కులం జాతి మతం ప్రాంతం అనే బేధాలకి అతీతంగా అందరూ కలిసి కూచుని జడ్జిగారికోసం ఎదురు చూస్తున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పసిపిల్లలని వెంట తీస్కొని వచ్చిన వాళ్లు, యువకులు, పండు ముదుసలులు అందరూ ఉన్నారు.
ఆవేళ కాస్త ఆలశ్యంగా పదకొండుముప్పావుకి వచ్చారు జడ్జిగారు. ఆవిడ వచ్చీ రాగానే అప్పటివరకూ రిలాక్స్ గా ఉన్న వాతావరణం మారిపోయింది. ముందుగా వాయిదాలు ఇచ్చే కేసులను ఒకదాని తర్వాత ఒకటి పిలిచి పెద్దగా చర్చలేకుండానే తరువాతి వాయిదా తారీఖుని ఇచ్చి పంపించి వేస్తున్నారు. అలా ఒక పది హేను కేసులు ఇచ్చి ఉంటారు వాటిలో కొన్ని 2005 అంటే ఎనిమిదేళ్ళక్రితం పెట్టినవి కూడా ఉన్నాయ్. కాసేపటికి నా పేరు పిలిచారు లోపలికి అడుగు పెట్టాను.

నన్ను ఆ కుర్చీలో కూర్చోమన్నారు. నా పక్కనే పిపి(పబ్లిక్ ప్రాసిక్యూటర్) నుంచున్నారు ఆయనకి కాస్త అవతల డిఫెన్స్ లాయర్ ఉన్నారు. ఈ టేబుల్ తర్వాత వీళ్ళ వెనుక కాస్త ఖాళీ వదిలి పొడవాటి టేబుల్స్ రెండువైపులా వేసి ఉన్నాయ్ వాటిముందు న్యాయవాదులు కూర్చుని ఉన్నారు. ఆ టేబుల్స్ తర్వాత హాలుకు రెండో చివర మరో గుమ్మం ఉంది దాని దగ్గరగా ఖాళీ స్థలం ఉంది అక్కడ ఎస్కార్ట్ గా వచ్చిన పోలీస్ తో కలిసి ముద్దాయి నిలబడ్డాడు.
కోర్టు బంట్రోతు వచ్చి నాతో ప్రమాణం చేయించింది, భగవద్గీత ఏవీ లేదు కానీ చేతులు కట్టుకుని సేం డైలాగ్ “దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్దం చెప్పను” అని చెప్పాను. ఆ తర్వాత పిపి గారు ముందుగా నా పర్సనల్ వివరాలు ఆ తర్వాత జరిగిన అఫెన్స్ గురించి ఏవేవి పోయాయి ఏవి దొరికాయి ఇతరత్రా వివరాలు అడుగుతూంటే నేను చెప్పిన వాటిని తన దగ్గర ఉన్న రిపోర్ట్ తో టాలీ చేస్కుంటూ జడ్జిగారు ఆమోదం తెలపడం మొదలెట్టారు. నేను అంతా పూర్తిచేసి వస్తువులు ఐడెంటిఫై చేశాక డిఫెన్స్ లాయర్ ని ఏవైనా అభ్యంతరాలున్నాయా అని అడిగారు తను లేవని చెప్పాక అతని వస్తువులు అతనికి ఇచ్చేయమంటూ జడ్జిగారు ఆర్డర్ పాస్ చేశారు.
నేను చెప్పిన వివరాలను కోర్ట్ క్లర్క్ అక్కడికక్కడే ఒక పేపర్ మీద రాసి ఇస్తే దాని మీద ప్లస్ ఆరోజు నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినట్లుగా ఒక రిజిస్టర్ లోనూ నేను సంతకం చేయాల్సి ఉంటుంది బయట వెయిట్ చేయమన్నారు. నాతో ప్రమాణం చేయించిన బంట్రోతు వచ్చి సంతకాలు పెట్టించుకుని “డబ్బులు ఇవ్వు” అని డైరెక్ట్ గా అడిగింది. ఒక్క క్షణం స్టన్ అయిన నేను “అదేంటమ్మా పదడుగుల దూరంలో గుమ్మం అవతల న్యాయమూర్తిని పెట్టుకుని ఇలా అడగడానికి భయమేయట్లేదా?” అని అడిగాను. ఇక్కడ ఇదంతా కామనే సార్ కాఫీకైనా ఒక ఇరవై రూపాయలివ్వండి అంటూ దబాయించి మరీ తీస్కుంది.
ఈ ప్రొసీజర్ అంతా అయిన ఒక గంటకి న్యాయవాదుల సంతకాలతో కోర్ట్ ఆర్డర్ విడుదలయ్యాక దాన్ని తీస్కుని అదే ఆవరణలో ఉన్న క్లరికల్ ఆఫీస్ కి వెళ్ళి వస్తువులు హాండోవర్ చేస్కున్నట్లు ఒక పర్సనల్ బాండ్ మీద రెవెన్యూ స్టాంపులపై సంతకాలు చేసాక నా వస్తువులు నా చేతికి వచ్చాయి. రికవర్ చేయని రెండు సెల్ఫోన్స్ పై ఆశలు వదిలేసుకోవడమే తప్ప ఇక చేయగలిగింది ఏం లేదని చెప్పారు. ఐతే లాప్ టాప్ చెక్కుచెదరకుండా ఎలా ఉన్నది అలానే చేతికి రావడం మాత్రం బోలెడంత సంతోషాన్నిచ్చింది.

సోమవారం, జులై 29, 2013
భాగ్ మిల్కా భాగ్
అయితే నేనీరోజు వరకూ వాయిదా వేసినట్లు సినిమా నిడివి గురించి భయపడి చూడకుండా ఎవరైనా మిగిలిపోయి ఒక మంచి సినిమాను మిస్ అవుతారేమోనని ఈ పోస్ట్ రాస్తున్నాను. మూడు గంటల తొమ్మిది నిముషాల ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులకు ఖచ్చితంగా సాగదీసినట్లు అనిపించవచ్చు. సినిమాలో ఒక అరగంట సులువుగా ట్రిమ్ చేయగల సన్నివేశాలున్నట్లు నాకు కూడా అనిపించింది.
కానీ మనం బయోపిక్ చూస్తున్నాం అనే విషయం గుర్తుంచుకోండి, జీవితంలో జరిగే అన్ని సంఘటనలు ఆసక్తికరంగా ఉండవు కానీ జరుగుతాయి. ఓ అరగంట పాటు బోర్ భరించడానికి సిద్దమైతే రెండున్నరగంటల అద్భుతాన్ని వీక్షించే అవకాశం మీదవుతుంది.
సినిమాలో ఫరాన్ అక్తర్ ఎక్కడా నాకు కనిపించలేదు కేవలం మిల్కాసింగ్ మాత్రమే కనిపించాడు. ఈ సినిమా కోసం తనని తాను మలచుకున్న తీరు తన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది, తన కోసం ఈ సినిమా చూసేయచ్చు. చిన్నప్పటి మిల్కాగా చేసిన మాస్టర్ జప్ తేజ్ సింగ్ కూడా గుర్తుండి పోతాడు. మిల్కా సింగ్ ని చిన్నప్పటి నుండి అమ్మలా చూసుకునే అక్కగా దివ్యాదత్తా చాలా బాగా చేసింది. సోనం కపూర్ ఈజ్ క్యూట్.
ఈ సినిమాలో మనసుని తాకే సన్నివేశాలున్నాయ్, సున్నితమైన ప్రేమ ఉంది, చక్కని హాస్యం ఉంది. అద్భుతమైన నేపధ్య సంగీతం ఉంది, అది సినిమాటోగ్రఫీతో కలిసి ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందంటే సినిమా చూస్తూ అథ్లెట్స్ తో పాటు మనమూ పరిగెడతాం, మిల్కా ఎమోషన్స్ ని మన ఎమోషన్స్ గా ఓన్ చేసుకుంటాం. సినిమా అంతా చిన్న చిన్న ఫ్లాష్బాక్ ఎపిసోడ్స్ తో ప్రసూన్ జోషీ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.
ఒక మనిషి తన పరిమితులను ఎంతవరకూ స్ట్రెచ్ చేయగలడు, తనతో తాను యుద్దంచేసి అన్నిరకాల భయాలను బలహీనతలను జయించి తనని తాను విజేతగా ఎలా నిలుపుకున్నాడు అనేది తెలుసుకోడానికి ఈ సినిమా చూడండి. ఇది ఓ రచయిత ఊహల్లోంచి పుట్టిన పాత్రకాదు నిజజీవితంలోనుండి పుట్టిన పాత్ర.
ఈ సినిమా గురించి సమీక్షలు విశ్లేషణలు చదివింది చాలు, జూలై పన్నెండో తారీఖున విడుదలైన ఈ సినిమా మీరు ఇంకా చూసి ఉండకపోతే వెంటనే ఈ క్రింది ట్రైలర్ చూడండి అది ఏమాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేసినా వెంటనే మీరీ సినిమా చూడండి నిరుత్సాహ పరచదు, ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతిని మిగులుస్తుంది.
ఈ సినిమా Rottentomatoes రేటింగ్ : 83% ఫ్రెష్
ఈ సినిమా IMDB రేటింగ్ :
ఆదివారం, జులై 28, 2013
ఈ బాలుడూ మహా చోరుడు సుమీ!!
వాడిదగ్గర నేర్చుకునే కొత్త కొత్త ఆటలు, ఇంకా స్కూల్ దగ్గరలో ముళ్ళకంపల్లోకి సైతం ధైర్యంగా వెళ్ళి కోసుకొచ్చుకున్న సీమ చింతకాయలు, రేగుపళ్ళు, చింతకాయలు లాంటివాటిలో వాటా తీస్కోడం బానే ఉండేది కానీ వీడితో కలిసి అల్లరి చేస్తూ స్కూల్ పక్కనే ఉన్న మా ఇంట్లో వాళ్ళకి నేనెక్కడ దొరికిపోతానో అని అనుక్షణం భయంతో చచ్చేవాడ్ని. వాడికి ఎక్కడెక్కడి డబ్బులు చాలేవి కాదు అమ్మ ఇంటర్వల్ లో కొనుక్కోమని నాకు ఇచ్చే పదిపైసలు బతిమాలో భయపెట్టో వాడే తీసేస్కునేవాడు.
నన్ను అడిగితే "ఏమీ తగ్గలేదు" అని కాసేపు బుకాయించినా వాళ్ళు పాత కొత్త నోట్సులు కంపేర్ చేసి చూపించేసరికి “నాకు తెలియకుండా ఎవరో కొట్టేస్తున్నారమ్మా...” అని అలవోకగా ఆబద్దమాడేసి ఆ విషయం మర్చిపోయాను. కానీ అలా వదిలేస్తే మా పేరెంట్స్ మా పేరెంట్స్ ఎందుకవుతారు సైలెంట్ గా నామీద నిఘా పెట్టారు. ఒకరోజు మా హనుమంతు గాడు పేపర్లు నొక్కేయడం నేనేమో గుమ్మంలో కాపలా ఉండి ఎవరైనా వస్తున్నారేమో అని చూస్తూ వాడికి హెల్ప్ చేయడం మా వాళ్ళ దృష్టిలో పడింది. ఇంక అంతే ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక అమ్మా నాన్న ఇద్దరి చేతిలో దెబ్బలు పడ్డాయ్. నా లైఫ్ లో నాకు గుర్తున్నంతవరకూ వాళ్ళతో దెబ్బలు తిన్న సంధర్బం అదొక్కటే. అన్నేళ్ళుగా ఎపుడూ చేయిచేస్కోని వాళ్లు ఆపని చేసేసరికి బాగానే బుద్దొచ్చి వెంటనే హెడ్ మాస్టార్ కి కంప్లైంట్ చేస్తానని బెదిరించి హనుమంతుగాడి స్నేహం వదిలించుకున్నా.
అంత మాత్రం చేత నేనేదో బుద్దిమంతుడ్ని అయిపోయాను అనుకుంటున్నారా హహహ :-) బుద్దిసంగతి ఎలా ఉన్నా ఒక విషయం స్పష్టంగా అర్ధమైంది “అల్లరి చేసినా కూడా పెద్దోళ్ళకి దొరికిపోకుండా చేయాలి” అనే విషయం వారం రోజులు తగ్గని వాతల సాక్షిగా బోధపడింది :-) ఐతే అప్పటినుండీ నేను చేసే దొంగతనాలు మా వంటింటికే పరిమితం చేశా. అవికూడా ఆ వయసులోనే ఎంతో ప్లాన్డ్ గా చేసే వాడ్ని.
అలాగే కారప్పూస/జంతికలు/చక్రాలు లాంటివి ఉన్నాయనుకోండి అవి ప్లెయిన్ డబ్బాలో అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు ఎన్ని కావాలంటే అన్ని తీస్కోవచ్చు అదే లెవల్ తెలిసేలా అడ్డగీతలున్న డబ్బాలోనో లేక నిండుగా ఉన్నపుడో తీస్కోవాలనుకోండీ అపుడు మనకి నచ్చినన్ని పైపైనుండి తీస్కుని లెవల్ తగ్గినట్లు తేడా తెలియకుండా చక్రాలని చేత్తో కొంచెం పైకి లాగి తేలికగా లెవల్ పైకి కనపడేలా సెట్ చేయాలనమాట. కానీ వీటితో అసలు ఇబ్బంది దొంగతనం చేసేప్పుడుకన్నా జోబులో ఎత్తుగా కనపడో, నోట్లో కర కర మంటూనో దొంగని పట్టించేస్తాయ్. అందుకని ఎత్తుగా కనపడకుండా వాటిని కొంచెం చిన్న ముక్కలుగా నలిపేసి జోబులో పోస్కుని ఒక్కోముక్కని ముందు నోట్లో నానేసి అపుడు చప్పుడు రాకుండా తినాలనమాట.
ఇలా ఓ పదిరోజులు పోయాక ఓ ఆదివారం ఉదయం వడియాల కోసం అమ్మ అన్నీ సిద్దం చేస్కుని సగ్గుబియ్యం తీస్కురమ్మంది. నేను కొంచెం టెన్షన్ పడ్డా అయినా “ఆ నేనెన్ని తినుంటా రోజుకి కొన్ని గుప్పెళ్ళేగా మహా ఐతే ఒక అరకేజీ తగ్గుంటాయ్ అమ్మకి తెలీదులే” అనుకుని సైలెంట్ గా బిందె తీస్కొచ్చి ఎదురుగా పెట్టా. మూత తీసిన అమ్మ షాక్... బిత్తరపోయి లోపలికి చేయిపెట్టి బిందెను అటూ ఇటూ తిప్పి ఎంతచూసినా అరకేజీనే ఉన్నాయ్. నేను అరకేజీ తిన్నాననుకుని రెండున్నర కేజీలు తినేసి కేవలం అరకేజీ మిగిల్చానన్న విషయం నాకు అర్ధమైంది. సరుకుల్లో మూడుకేజీలు రాస్తే అరకేజీనే తెచ్చారా అని మొదట సందేహపడ్డారు కానీ మెల్లగా నన్నడిగారు “ఏం జరిగింది నాన్నా?” అంటూ.
సరే ఇక అలా అలా పెరిగి పెద్దయ్యాక ఇంజనీరింగ్ లో చేరిన తర్వాత ఎపుడైనా డిన్నర్ కోసం పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్ళినపుడు వాళ్ళు చివర్లో స్వీట్ సోంఫ్ ఇస్తారు కదా అది ఖర్చీఫ్ లోనో వాడే ఇచ్చే పేపర్ నాప్‌కిన్స్ లోనో పొట్లం కట్టేసి తీస్కొచ్చేయడం బాగా అలవాటైంది. డిమ్ లైటింగ్ ఉండేదేమో ఈ కొట్టేసే కార్యక్రమం నిర్విఘ్నంగా పక్కటేబుల్ వాడిక్కూడా తెలియకుండా చేసేసే వాడ్ని, అది కొన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేశా ఎప్పుడూ ఎవరికీ దొరకలా.
అలాంటి టైంలో ఒక సారి ఇల్లుమారుతున్నపుడు ఇలా కలెక్ట్ చేసినవి అన్నీ ఓ పది వస్తువులు వరకూ కప్ బోర్డ్ లో ఒకే చోట కనిపించేసరికి అప్పుడు సడన్‌గా షాక్ కొట్టింది. “అరే నాన్న సావనీర్స్ అనేవి నువ్వు తెచ్చుకునేవి కాదురా వాళ్ళు ఇచ్చేవి, ఇది పూర్తిగా దొంగతనమే” అని ఎరుక వచ్చేసరికి ఒక్కసారిగా చాలా ఎంబరాసింగ్‌గా ఫీల్ అయ్యాను. ఒకవేళ దొరికి ఉంటే నా పరువుతో పాటు నేను పని చేస్తున్న కంపెనీ పరువు కూడా ఏమయ్యేదో తలచుకుంటేనే ఒళ్ళు జలదరించింది. ఇలా లాభంలేదని వాటినన్నిటిని అక్కడే డస్ట్ బిన్ లో పడేసి అప్పటినుండీ ఇలాంటి టెండెన్సీ పట్ల కాస్త ఎరుకతో అప్రమత్తంగా ఉండటం ప్రారంభించాను. ఆ తర్వాతెపుడూ మళ్ళీ రిపీట్ అవలేదు. ఆఖరికి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సర్వీస్ మొదలెట్టిన కొత్తలో ఫ్లైట్లో కాంప్లిమెంటరీ హెడ్ ఫోన్స్ ఇచ్చినా కూడా అవి కాంప్లిమెంటరీనే కదా అని ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేస్కున్నాక కానీ ఇంటికి తెచ్చుకోలేదు.
శుక్రవారం, జులై 26, 2013
హాస్టల్ – 11 (ఇంటిదొంగను ఈశ్వరుడైనా...)
ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత మీరు వినే ఉంటారు కదా... ఆ ఈశ్వరుడు పట్టలేడేమోకానీ మా AO గారు తలుచుకుంటే మాత్రం పట్టేస్తారు. AO అంటే మా ఇంటర్మీడియెట్ కాలేజ్ Administrative Officer. నిజానికి ప్రిన్సిపల్ అనే పిలవాలి కాకపోతే ఆయనే మా కాలేజ్+రెసిడెన్షియల్ హాస్టల్+పక్కన ఉన్న చిన్న హైస్కూల్ అడ్మినిస్ట్రేషన్ పనులు అన్నీ కూడా చూసుకుంటుంటారు కనుక AO అని ఫిక్స్ చేశారు.
ఆయనపేరు ప్రభాకర్, చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు, నిండైన రూపం, కళ్ళద్దాలుపెట్టుకుని, గుబురుమీసాలతో అప్పుడప్పుడు కొన్నిరోజులు నిండుగా గడ్డంపెంచి, ఎక్కువ రోజులు క్లీన్ షేవ్‌తో, ఎప్పుడూ మడతనలగని ఇస్త్రీబట్టలతో లైట్‌కలర్ షర్ట్‌ని డార్క్‌కలర్ ట్రౌజర్‌లోకి నీట్‌గా టక్ చేసి చూపులకి కొంచెం పొట్ట పెంచిన మళయాళ హీరో మమ్ముట్టీలా కనిపిస్తారు.
చూడటానికి హీరోలాగా కనిపిస్తారు కానీ మాపాలిట పెద్ద విలన్, ఛండశాసనుడు. అసలు నేను అక్కడ చదివిన రెండేళ్ళలో ఆయన నవ్వుతుండగా ఓ పదిసార్లకన్నా ఎక్కువ చూసి ఉండను. నేనేమిటీ ఎవ్వరూ చూసి ఉండరు ఇక ఆయన చేతిలో దెబ్బలు తినని స్టూడెంట్ అంటూ ఎవరూ ఉండేవారు కాదు, ఏదోరకంగా అందరమూ ఆయన కోపాన్ని చవిచూసినవాళ్ళమే. పైకి ఆయన్ని అందరమూ తిట్టుకున్నా చాలామందికి సీక్రెట్ గా ఆయనంటే ఒక హీరోవర్షిప్ ఉండేదని నా అనుమానం.
సరే ఇక మన కథానాయకుడు అదేనండీ మా తీఫ్ తిరుమలై దగ్గరకి వస్తే మావాడు ఓ మోస్తరు పొడవు, బక్కపలచని పర్సనాలిటీ, తెల్లటి తెలుపు చటుక్కున చూస్తే బాలీఉడ్ బడ్డింగ్ హీరోలా ఉంటాడు దానికి తోడు పరమ అమాయకమైన ఫేస్. కానీ మావాడు శివలో నాగార్జునలా ఒక గ్యాంగ్ ని వేస్కుని తిరుగుతుండేవాడు. ఆయన గ్యాంగ్ అన్నీ మంచి పనులు చేస్తే మా వాడి గ్యాంగ్ రాత్రుళ్ళు హాస్టల్ గోడదూకి వెళ్ళి పరోఠాలు, బిర్యానీ తెచ్చి అమ్మడం, మధ్యలో తగిలిన చెరుకు తోటలో చెరుకు గడలు కొట్టుకొచ్చి ఇవ్వడం, ఇంకా ఇలాంటి కృష్ణలీలలు కొన్ని చేసేవాడు.
మా క్యాంపస్ మొత్తానికి ఒక చిన్న క్యాంటీన్ కమ్ ప్రొవిజినల్ స్టోర్ ఒకటి ఉండేది పక్కన ఫోటోలో చూపించినంత పోష్ సెటప్ కాకపోయినా అప్పట్లో మా రేంజ్ కి అది పోష్ సెటప్ తోనే ఉండేది ఒక వైపు కౌంటర్ అందులోనే ఒక వైపు కుర్చీలు టేబుల్స్ వేసి ఉండేవి కౌంటర్ లో బేకరీ ఐటంస్ తో పాటు స్టూడెంట్స్ కి అవసరమయ్యే చిన్న చిన్న వస్తువులు సబ్బులు, షాంపూలూ, పేస్టులు, బ్రష్షులు, బుక్స్, పెన్సిల్స్ ఇతరత్రా అన్నీ స్టాక్ మెయింటెయిన్ చేసేవాళ్ళు. ఆ ఓనర్స్ రాత్రి ఎనిమిది గంటలకు క్యాంటీన్ మూసేసి పక్కన ఉండే పల్లెకి వెళ్ళిపోయేవాళ్ళు.
క్యాంటీన్ మెయిన్ గేట్ కి దగ్గరలో ఉండడంతో అక్కడి సెక్యూరిటీనే క్యాంటీన్ కు సైతం సెక్యూరిటీ అనమాట. ఐతే వాళ్ళు గేట్ దగ్గర కూర్చుంటారు కదా బయటనుండి వచ్చే వాళ్ళని ఆపగలరు కానీ క్యాంటీన్ వెనక వైపు హాస్టల్ నుండి ఈజీ యాక్సెసిబుల్ గా ఉండేది కనుక హాస్టల్ నుండి ఎవరైనా ఎంటర్ అయితే ఏం చేయలేరు. మా తీఫ్ తిరుమలై ఈ విషయం గమనించాడు ఆలశ్యం చేయకుండా ఒక రోజు ప్లాన్ గీసేశాడు. విజయవంతంగా అమలు పరిచాడు. ఎంత విజయవంతంగా అంటే చోరీ జరిగినట్లు వాళ్ళకే తెలియనంతగా మానేజ్ చేశారా గ్యాంగ్.
ఎలా ఎంటరయ్యే వాళ్ళో తెలీదు కానీ దొంగతనం జరిగిన ఆనవాలేవీ మిగిల్చే వారు కాదు, వెళ్ళినవాళ్ళు కూడా స్వల్పంగా తీస్కొచ్చేవాళ్ళట అంటే కేవలం ఒక వారం పదిరోజులకు సరిపడా స్టఫ్ మాత్రమే తెచ్చేవాళ్ళు. ఎంత జాగ్రత్తగా అంటే ఓనర్స్ సరుకులో తేడా వచ్చినా లెక్కల్లో ఏదో తేడా జరిగిందని అనుకునే వాళ్ళే కానీ దొంగతనం అనుకునే వాళ్ళుకాదు. అలా అవసరమైనపుడల్లా స్టోర్ రూంకి వెళ్ళి తెచ్చుకుంటున్నట్లు తెచ్చుకోవడం మొదలెట్టారు ఇలా కొన్ని రోజులు జరిగాక ఓసారి ఎక్కువ తేవడం జరిగిందో లేక రిపిటీషన్ వల్లనో ఓనర్ వాళ్ళకి అనుమానం వచ్చి మా A.O. గారికి కంప్లైంట్ చేశారు.
మా చండశాసనుడు గారికి ఒక అలవాటుంది పిల్లలు అక్రమమైన పనులేమన్నా చేస్తున్నారేమో అని చెప్పకుండా ఉన్నట్లుండి హాస్టల్ లో రూంస్ మొత్తం మెరుపు తనిఖీలు చేయిస్తుంటారు. వాటిల్లో మా వాళ్ళు తెచ్చే దొంగ సరుకు ఎపుడూ బయటపడేది కాదు. సరే తక్కువ తెస్తున్నారు కదా అందుకే దొరకట్లేదేమోలే అనుకునే వాళ్ళం మేము. ఆరోజు కూడా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి రూముల్లో గోలగోలగా టైంపాస్ చేస్తున్నాం ఉన్నట్టుండి “రేయ్..” అంటూ సింహఘర్జన వినిపించింది. అరక్షణంలో అందరం కలుగులో నుండి బయటపడ్డ చిట్టెలుకల్లా రూముల్లోనుండి కారిడార్ లోకి వచ్చేశాం.
పొడవాటి కారిడార్ చివర నుంచుని ఉన్న మా ఛండశాసనుడు “అందరూ ఒక్క నిముషంలో మీ ట్రంకులు తాళాలు తీసి అక్కడే పెట్టి బయటకి వెళ్ళి నుంచోండి, ఒక్కొక్క రూం వాళ్ళని పిలుస్తాను” అని చెప్పారు. సాథారణంగా ఇలాంటి తనిఖీలు వార్డెన్స్ మీద, కొందరు ముఖ్యులైన స్టూడెంట్స్ మీదా వదిలేసి సూపర్వైజ్ చేసే ఆయన ఈ రోజు స్వయంగా రంగంలోకి దిగి ఒకో రూంలో తను కూడా నుంచుని అన్నీ తీయించి చూస్తున్నారు. మాకెవరికీ క్యాంటీన్ ఓనర్ కంప్లైంట్ చేసిన విషయం తెలీదు. నింపాదిగా నుంచుని వేడుక చూస్తున్నాము.
మా తీ.తి గాడి రూం తనిఖీ మొదలైంది, అప్పటికే ఆ రూం వాళ్ళమీద అనుమానముందేమో మరింత జాగ్రత్తగా ఎక్కువ సమయం తీస్కుని వెతికారు కానీ ఏవీ దొరకలేదు పక్కరూం అయిన మమ్మల్ని ఆల్రెడీ పిలవడంతో మేం వెళ్ళి రూం బయట నుంచుని ఎదురు చూస్తున్నాము. A.O. గారు బయటకు వస్తూ యథాలాపంగా తల ఎత్తి గుమ్మం పైకి చూసి ఒక్క నిముషం ఆగి వార్డెన్ గారిని పైన ఉన్న ఎలెక్ట్రిక్ స్విచ్ బోర్డ్ ఓపెన్ చేయమన్నారు.
ఇప్పుడంటే ఎలెక్ట్రిక్ వైరింగ్ అంతా కన్సీల్డ్ గా గోడల్లోంచే లాగేస్తున్నారు కానీ పాత బిల్డింగులకి బయటనుండే ఇచ్చే వారు ఆ వైర్లన్నీ ఒక స్విచ్ బోర్డ్ లోనికి వెళ్ళేవి అది ఒక పెద్ద సూట్ కేస్ తరహాలో తెరచి మూయగల గొళ్ళెం ఉన్న చెక్కబాక్స్ దాని పైన అన్ని రకాల స్విచ్ లు ప్లగ్ పాయింట్స్ బిగించి ఉండేవి. ఆ బోర్డ్ తెరిచినపుడు లోపల వైర్లు ఉన్నాకానీ బోలెడంత ఖాళీ కూడా ఉండేది పైనున్న బొమ్మలో చూపించినట్లు. సో వార్డెన్ మా తీ.తి గాడి రూంలోని ఆ స్విచ్ బోర్డ్ తెరవగానే పైనుండి చాక్లెట్లు, బిస్కట్లు, సబ్బులు, బ్రష్షులు, పేస్టులు వర్షంలా కురవడం మొదలైంది. సో ఇన్ని రోజులు ఆ బోర్డ్ లో దాచడం వల్ల ఎవరికీ దొరకలేదన్న విషయం ఛండశాసనుడితో పాటు మాక్కూడా అర్ధమైంది.
ఇక తనిఖీలు ఆపేసి ఆయన రెగ్యులర్ ఫార్ములా ఉపయోగించారు. “ఎవరు చేశారో చెప్తారా లేక రూంలో ఉన్న అరడజను మందికీ కోటింగ్ ఇచ్చి సస్పెండ్ చేయమంటారా” అని అడిగేసరికి దొంగల గ్యాంగ్ బయటపడింది. ఇక వాళ్ళని అక్కడికక్కడే ఉతికారు చూడండీ.. నా సామిరంగా.. ఒక్కొక్కళ్ళ ఒళ్ళు వాతలు తేలి రంగుమారిపోయింది ఆ తర్వాత పదిరోజులు సస్పెండ్ కూడా చేశారు. ఇంతా చేసి వాళ్ళంతా కూటికి లేక చేస్తున్నారా అంటే కాదు అందరూ లక్షాధికారుల పిల్లలే డబ్బుకు కొదవలేదు కేవలం థ్రిల్ అండ్ సరదా. ఇంకా చెప్పాలంటే క్లెప్టోమానియా ఏమో అని నాకు ఒక డౌట్. అదేంటో మీకు తెలియకపోతే వికీలో ఇక్కడ చూడండి.
ఈ గ్యాంగ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యానేమో తెలీదు కానీ ఈ క్లెప్టోమానియా పురుగు తర్వాత రోజుల్లో ఒకసమయంలో నన్నుకూడా కుట్టింది... సో నాలో ఉన్న ఆ తీఫ్ తిరుమలై గురించి త్వరలో...
నేను ???

- వేణూశ్రీకాంత్
- అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.