
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో నాలుగేళ్ళు ఇంజనీరింగ్ చదివినా అడపా దడపా పేరు వినడమే తప్ప ఎప్పుడూ చూసిన దాఖలేల్లేవు ఈ కంచరపాలెం ని కానీ ఇపుడు దర్శకుడు వెంకటేష్ మహా పుణ్యమా అని అక్కడ అణువణువు పరిచయమున్నట్లే అనిపిస్తుంది. సాధారణంగా సినిమాలో చూసిన మనుషుల్నీ, లొకేషన్స్ ని బయట చూస్తే నేనంతగా పోల్చుకోలేను. అదేంటో తాజ్ మహల్ తో సహా ఏదైనా స్వయంగా కళ్ళతో చూసినపుడు ఒక రకంగా, ఫోటోలలోనూ వీడియోలలోనూ చూసినపుడు ఒక రకంగా కనిపిస్తాయ్ ఆ సహజత్వాన్ని కెమేరాలో కాప్చర్ చేయడం అంత సాధారణమైన విషయం కాదు. అలాంటి ఒక అసాధారణమైన పనిని విజయవంతంగా చేసి చూపించారు కేరాఫ్ కంచరపాలెం సినిమా టీమ్.
కథలనేవి ఆకాశంలోంచి ఊడిపడవు, మన చుట్టూ ఉన్న జీవితాల్లోకి తరచి చూస్తే వాటిలోనే అనేకానేక కథలు కనిపిస్తాయ్.. సాధారణంగా మళయాళంలోను తమిళంలోనూ ఇలా సగటు జీవితాల్లోంచి పుట్టుకొచ్చే కథలను సినిమాలగా చూస్తుంటాం. తెలుగులో అలాంటి సినిమాలు ఆడవు అంటూ మేకర్స్, వాళ్ళకి తీయడం రాదంటూ ప్రేక్షకులు ఒకరి మీదకి ఒకళ్ళు తోసుకుంటూ సగటు మాస్ మసాలా సినిమాల తోనే బతుకీడుస్తుంటాం.. ఐతే గత రెండేళ్ళుగా చిన్న పెద్ద సినిమాలు మాస్ ఎలిమెంట్స్ పైనే కాక కథా కథనాల మీద దృష్టిపెట్టడం ఆ సినిమాలు కూడా మంచి హిట్స్ కావడం తెలుగు సినీ చరిత్రలో శుభపరిణామం.
ఇలాంటి తరుణంలో కథా కథనాలపై పూర్తినమ్మకం ఉంచి, సీజన్డ్ ఆర్టిస్ట్స్ ఎవరిని పెట్తుకోకుండా కేవలం ఒక ఊరిలో ఉన్న కొందరు వ్యక్తులను పాత్రలకు అనుగుణంగా ఎన్నిక చేసుకుని వారికి శిక్షణ ఇచ్చి సజత్వాన్ని ఎక్కడా పోనివ్వకుండా ఒక సినిమా చూస్తున్నట్లుగా కాక ఆ ఊర్లో జనాల మధ్య మనమూ తిరుగుతూ అక్కడ జరిగే కథని గమనిస్తున్న అనుభూతిని ఇస్తూ ఒక సినిమా చిత్రీకరించినందుకు దర్శకుడు వెంకటేష్ మహా అండ్ నిర్మాత ప్రవీణలను మెచ్చుకుని తీరాలి. అలాగే ఇలాంటి మంచి సినిమాను తమ భుజానికెత్తుకుని పబ్లిసిటీతో మరింత మందికి చేరువ చేసిన రాణా, సురేష్ ప్రొడక్షన్ లను కూడా అభినందించి తీరాలి.
కథ విషయానికి వస్తే పెద్ద ప్రత్యేకమైనదేమీ కాదు, సుందరం, జోసఫ్, గడ్డం, రాజు అనే నలుగురు వారి వారి వయసుకు తగ్గట్లుగా సునీత, భార్గవి, సలీమా, రాధ అనే అమ్మాయిల ప్రేమలో ఎలా పడ్డారు, ఆ ప్రేమ కథలెలా కంచికి చేరాయి అనేది కథ. ఇలాంటి కథలు ఇదివరకే కొన్ని తెలుగు సినిమాలలో వచ్చినా కూడా ఈ సినిమా కథనం, అత్యంత సహజంగా చిత్రీకరించిన వైనం ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ ఎనిమిది పాత్రలూ కూడా ఊహాలోకం నుండి పుట్టుకొచ్చినవి కావు మన మధ్యనుండే తెరమీదకి నడిచివెళ్ళినట్లు ఫీలవుతాం. ఈ పాత్రలే కాదు సినిమాలో ఉన్న ప్రతి పాత్రా సగటు మధ్య తరగతి జీవికి నిత్య జీవితంలో కనిపించే పాత్రలే.. నేపధ్య సంగీతం పాటలు కూడా చాలా సహజంగా అమిరాయి ఈ చిత్రానికి.
ప్రాధాన పాత్రలు ఎలాగూ ఆకట్టుకుంటాయ్ కనుక వాటిని పక్కన పెడితే సినిమాలో సుందరం తండ్రి బొమ్మల రామ్మూర్తి గా చేసిన కిషోర్ గారి పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగే జోసఫ్ గురువు అమ్మోరు గా చేసిన అతని యాస భాష తీరు వైజాగ్ తో పరిచయమున్న ప్రతి ఒక్కరు ఇతను మాకు తెలుసు అని ఫీలయ్యేలా ఉంటుంది. సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరు అత్యంత సహజంగా కనిపించేలా ప్రవర్తించేలా చేయడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది.
అలాగే భార్గవి ధైర్యం, రాధ సమానత్వం, సలీమా ఇండివిడ్యువాలిటీ, రాధ కూతురు ఇరవై ఏళ్ళ అదితి పాత్ర కనబరిచిన మెచ్యూరిటీ, బొమ్మల రామ్మూర్తి ఒక కాంట్రాక్ట్ విషయమై తన భార్యని ఒక మాట అడిగి చెప్తానని చెప్పడం ఆవిడ ఇచ్చే చక్కని సలహాలు చూసినపుడు దర్శకుడు స్త్రీ పాత్రలకు ఇచ్చిన ప్రాముఖ్యత వాటిని తీర్చిదిద్దిన తీరును అభినందించకుండా ఉండలేం.
వీధంట వెళ్తూ ఉంటే మన ప్రమేయం లేకుండా వీధికుళాయిల దగ్గరో మరో చోటో మన చెవినపడే బూతుల్లాంటివి ఈ సినిమాలోనూ ఒకటి రెండు సన్నివేశాల్లో వినిపిస్తాయి. సహజత్వం కోసమో లేక కామెడీ కోసమో వాటిని ఇరికించినట్లున్నారు కానీ అవి సినిమాకి అనవసరం అనిపించాయి. ఇలాంటి వాటివల్ల సున్నితత్వం ఇంకా మిగిలే ఉన్న కుటుంబాలలో అందరితో కలిసి చూడడం కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు.
ఏదైనా తెలుగులో సహజత్వానికి దగ్గరగా ఉండే వైవిధ్యమైన మంచి సినిమాలు రావడం లేదంటూ కంప్లైంట్ చేసే ప్రతి ఒక్కరు చూసి తీరవలసిన సినిమా "కేరాఫ్ కంచరపాలెం". డోంట్ మిస్ ఇట్. ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే మరింత మంది క్రియేటర్స్ కి మరిన్ని మంచి ఐడియాలు వచ్చి మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయ్.
ఈ సినిమా ప్రోమో
ఇక్కడ చూడవచ్చు. పాటలు
ఇక్కడ వినవచ్చు. రాణా ఈ సినిమా నటీనటులతో చేసిన చిరు పరిచయం
ఇక్కడ చూడవచ్చు. అలాగే టి.ఎన్నార్. ఈ సినిమా లోకెషన్స్ చూపిస్తూ నటీనటులతో చేసిన ఇంటర్వ్యూ
ఇక్కడ చూడవచ్చు.