అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శనివారం, డిసెంబర్ 26, 2020

సోలో బ్రతుకే సో బెటర్...

ఈ పోస్ట్ ని నా స్వరంతో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link

సాధారణంగా సాయిధరమ్ తేజ్ సినిమాల నుండి మనం ఏం ఆశిస్తామో అవన్నీ ఉన్న సినిమా "సోలో బ్రతుకే సో బెటరు". మిస్సవకుండా చూడాల్సినదో పాత్ బ్రేకింగ్ సిన్మానో కాదు కానీ తొమ్మిది నెలలుగా థియేటర్ లో అడుగుపెట్టని ప్రేక్షకులకి, బిగ్ స్క్రీన్ కోసం మొహం వాచిపోయి ఉన్న సగటు సినీ అభిమానికి ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ని అందించి ఇంటికి పంపిస్తుంది. 

ఇక కథ విషయానికి వస్తే మనం కాలేజ్ లో నానా రకాల ఫిలాసఫీలు కనిపెట్టేస్తుంటాం. బేసిగ్గా ఆ వయసలాంటిది వాటిలో కొన్నిటిని అక్కడే తుంగలో తొక్కేస్తే మరికొన్నింటిని కాలేజ్ బయటికి కూడా మోసుకొచ్చేస్తాం. కొన్ని ఐడియాలుగా మన మనసులోనె పుట్టి మరణిస్తె మరికొన్నిటికి మంచి రూపాన్నిచ్చి మరికొందరికి అంటిస్తాం. అలా కాలేజ్ రోజుల్లో విరాట్ (సాయి తేజ్) మనసులో రూపుదిద్దుకున్న ఫిలాసఫీ నే సోలో లైఫే సో బెటరు. 

ఎంతైనా మనాడు హీరో కాబట్టి ఓ సంఘం పెట్టి దీనికి కొన్ని శ్లోకాలు రాసేసి వాటిని ఓ పుస్తకంగా కూడా అచ్చేయించేసి పెళ్ళి ప్రేమ ఎమోషన్స్ లాంటివాటికి దూరంగా బ్రతకాలని మీటింగులు పెట్టి వాజ్ పేయి, (మూర్తన్న)ఆర్.నారాయణమూర్తి, అబ్దుల్ కలాం ల కటౌట్లు పెట్టి ప్రచారం చెసేస్తుంటాడు.  

ఐతే కాలేజొదిలేసి ఉద్యోగం బాట పట్టాక, తనతో ఉన్న బాచిలర్ ఫ్రెండ్స్ ఒకొక్కరు మెల్లగా సంసారులవడం మొదలు పెట్టాక, వయసైపోయి తెల్ల వెంట్రుకలు రావడం మొదలెట్టేక, ఆఖరికి చివరి వరకు తోడుగా ఉంటుందనుకున్న కుక్క కూడా ఓ తోడును వెతుక్కున్నాక, తను ఆరాద్య దైవంగా కొలిచే మూర్తన్న కూడా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెళ్ళి చేస్కోవాలని సలహాలిచ్చేకా తప్పని సరై అప్పుడు మన హీరో గారి కళ్ళకి కమ్మిన సోలో పొరలు ఒక్కొక్కటిగా కరిగిపోవడం మొదలౌతుంది.  

ఆఖరికి ఊరంతటికీ శకునం చెప్పే బల్లి ఇంటెనకాల కుడితి తొట్లో పడినట్లు మన వీరో గారు కూడా వీరోయిన్ తో ప్రేమలో పడతాడు. అక్కడ మన వాడికి ఓ పెద్ద ట్విస్ట్ ఎదురౌతుంది. తెలుగు సినిమాల్లో పండిపోయిన ఆడియన్స్ ఆ ట్విస్టేంటో ఈజీగానే ఊహించగలరు కానీ నేను చెప్పదలచుకోవడం లేదు. 

ఆ ట్విస్టేంటీ? హీరో గారు ఒంటరిగానే మిగిలి పోయారా? లేక హీరోయిన్ తో జంట కట్టారా? ఒకవేళ కడితే మరి కాలేజ్ లో ఈయన స్థాపించిన సంఘం దాన్ని ఫాలో అయిన స్టూడెంట్స్ ఏం చేశారు? అనేది తెలుసుకోవాలంటే సుబ్బు దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయితేజ్(ఇదే పేరు వేస్కున్నారండీ థరమ్ ని ఎత్తేశారు టైటిల్స్ లో బహుశా ఏ న్యూమరాలజిస్టో చెప్పుంటారేమో) నటించిన "సోలో బ్రతుకే సో బెటరు" సినిమా చూడాల్సిందే. 

ఇచ్చిన పబ్లిసిటీ పెట్టిన కౌటౌట్లు చూసి ఇదేదో బ్రహ్మచారి గా ఉండడం వల్ల పొందే లాభాల పై తీసిన సినిమా అని వెళ్ళే సోలో బ్రదర్స్ ని నిరుత్సాహ పరుస్తూ అరగంట కూడా గడవక ముందే వాళ్ళ కళ్ళల్లో కారంగొట్టి మూడొందలరవై డిగ్రీస్ లో యూటర్న్ కొట్టి ఫ్యామిలీ లైఫే సో బెటరూ పెళ్ళి చేసుకోండిరా అబ్బాయిలూ అని చెప్పి పంపించే సినిమా ఇది. ఈ దెబ్బతో సాయితేజ్ అన్న మమ్మల్ని మోసం చేశాడు అని వాళ్ళంతా ఫీలైనా ఆశ్ఛర్యం లేదనమాట :-)

సినిమాలో సంగీతం సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా సినిమాకి తగినట్లే ఉన్నాయ్ నథింగ్ స్పెషల్ అలా అని నథింగ్ బాడ్ అలా అలా వాటి పని అవి చేసుకుంటూ పోయాయి. ముఖ్యంగా సినిమా నిడివి విషయంలొ జాగ్రత్త పడడం సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది. డైలాగ్స్ అక్కడక్కడా బావున్నాయ్ ఎమోషన్స్ పై రాసిన కొన్ని డైలాగ్స్ బావున్నాయ్. కొత్త దర్శకుడు సుబ్బు ఐడియాస్ బానే ఉన్నాయి కానీ ఆచరణలో కాస్త తడాబడ్డాడా అనిపించింది. ఫస్ట్ సినిమా సాధారణంగా అద్భుతంగా రాస్కుంటూ ఉంటారు దర్శకులు అది మిస్సింగ్ అనిపించిందనమాట.

సత్య సుదర్శన్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా గోవింద గౌడ గా కన్నడ యాస తో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ బావుంది. ఉన్నంత కాలం భార్య విలువ తెలుసుకోకుండా సెటైర్లు జోకులు వేస్తూ తిడుతూ టైం పాస్ చేసి తను దూరమయ్యాక తన విలువ తెలుసుకుని కుప్పకూలిపోయే సగటు భర్త గా రావురమేష్ త్రెడ్ బావుంది. 

సాయితేజ్ కి ఇలాంటి రోల్స్ కేక్ వాక్.. అవలీలగా చేస్కుంటూ పోయాడు. సెకండాఫ్ లో తన ఫిలాసఫీనే పచ్చివెలక్కాయలా తన గొంతుకి అడ్డంపడి మింగలేక కక్కలేక తను పడే అవస్థను చూస్తే నవ్వొస్తుంటుంది. ఇతను ఫిట్నెస్ మీద మరికాస్త శ్రద్ద పెట్టాలి. నభానటేష్ తన రోల్ కి బాగా సూట్ అయింది తగినట్లుగా బాగా చేసింది. కమర్షియాలిటీ కోసం కావాలని ఇరికించిన ఫైట్ సీన్స్ ని కథకి వాడుకోవడంలో దర్శకుడు సుబ్బు ఇంటిలిజెన్స్ బావుంది. రాజేంద్రప్రసాద్, నరేష్ గార్ల టాలెంట్ ని పూర్తిగా ఉపయోగించుకోలేదు అనిపించింది ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు. 

ఓవరాల్ గా మిస్సవకూడని గొప్ప సినిమా ఏం కాదు గానీ బొత్తిగా సినిమాలు మిస్సవుతున్నాం అని ఫీలవుతున్న సినిమా పిచ్చోళ్ళని కాస్త రొటీన్ అనిపించినా రెండు గంటల పాటు అలరించే ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సోలో బ్రతుకే సో బెటర్. 

సోమవారం, సెప్టెంబర్ 28, 2020

వెళ్ళిరండి బాలూ...

ఈ పోస్ట్ ని నా స్వరంతో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link

అసలు పాటంటూ లేని ప్రపంచాన్ని ఊహించగలమా.. ఒక వేళ ఊహిస్తే ఎంత ఖాళీగా చైతన్య రహితంగా నిస్తేజంగా అనిపిస్తుందో కదా. బాలు లేని సినిమా పాట కూడా అంతే అసలు ఊహించలేం, బాలూనే పాట పాటే బాలు. ఒకటా రెండా డెబ్బై నాలుగేళ్ళ వయసు, సుమారు యాబై ఏళ్ళ కెరీర్, పదహారు భాషలు, నలబై వేల పాటలు. ఇప్పటికీ తన గొంతులో అదే ఫ్రెష్ నెస్, పాటంటే పాడటమంటే అదే హుషారు. బాగా పాడాలని అదే తపన.
 
కోవిడ్ లాక్ డౌన్ టైమ్ లో కొన్ని పాటలు పాడుతూ వీడియోలు చేసినా, డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతూ చప్పట్లు కొట్టిన వీడియో చేసినా ఎంత హుషారుగా చేశారో ఇపుడు మళ్ళా చూస్తుంటే ఈ మనిషి ఇప్పుడే వెళ్ళవలసిన వాడు కాదనిపిస్తుంది. అయ్యో ఇలాంటి మనిషినా కోవిడ్ కు బలి పెట్టుకుంది అనిపిస్తుంది. కానీ కర్మ సిద్ధాంత కోణంలో ఆలోచిస్తే మృత్యువు ఒక కారణం వెతుక్కుంటుంది అంతే, ఎవరైనా దానికి తల వంచక తప్పదు అనీ అనిపిస్తుంది. 

నా చిన్నప్పుడు ఓ ఐదారు వారపత్రికలు ఒకదానిపై ఒకటి పేర్చినంత సైజ్ లో ఉండే రేడియోని నా గుండెల మీద పెట్టుకుని ట్యూన్ చేసుకుంటూ లెక్కలేనన్ని పాటలు వింటూ ఉండేవాడిని. ఆ పాటలకు ముందో తర్వాతో పాడింది బాలసుబ్రహ్మణ్యం అని చెప్పెవారు కానీ అసలు ఆయన ఎవరో ఎలా ఉంటాడో ఆయన గొంతెలా ఉంటుందో అసలు తెలిసేది కాదు. ఎందుకంటే అప్పట్లో నా దృష్టిలో ఆ పాటలు పాడుతున్నది అంతా ఆయా నటీ నటులే అసలా మిమిక్రీ మ్యాజిక్ అండ్ ఎనర్జీ లేకపోతే అన్ని పాటలు వినగలిగే వాడ్ని కూడా కాదేమో. ఇంతగా పాటలంటే పిచ్చీ ఎక్కి ఉండేది కాదేమో. 

సినిమా పాటలంటే ఏ ఒక్కరి కృషో ఖచ్చితంగా కాదు సినిమాలో తగిన ఓ చక్కని సంధర్బం సృష్టించే దర్శకుడు నుండి సంగీత కారులు సాహిత్య కారులు ఇత్యాది చాలా మంది కృషీ ఉంటుంది కానీ ఆ పాటకు తన గాత్రంతో ప్రాణం పోసి సంగతులతో ఛమకులద్ది ప్రేక్షకుడికి చేర వేసేది మాత్రం బాలూ నే. కొన్ని తరాల పాటు సినిమా పాటలు ఇంతగా ప్రజల జీవితాల్లో కలిసిపోడానికి ముఖ్య కారణం మాత్రం తనే అనడంలో ఏం సందేహం లేదు.  

ఎవరికైనా అభిమాన గాయనీ గాయకులెవరైనా ఉండచ్చు కానీ బాలూనీ ఆ గళాన్ని అభిమానించని సినీ సంగీతాభిమాని అసలు ఉంటాడా. అసలు బాలూనీ పాటనీ వేరు చేసి చూడలేము. బాలూ నే పాట పాటే బాలూ అందుకే రకరకాల కారణాలతో వేరే వేరే గాయకుల పేర్లు చెబుతాం కానీ అసలు సినిమా పాట అనగానే మొదట గుర్తొచ్చేది మాత్రం బాలసుభ్రహ్మణ్యమే.  

మొదట తెలియకపోయినా తరువాత తరువాత టీనేజ్ దాటాక ఆయన గొంతుని ప్రత్యేకంగా గుర్తుపట్ట గలిగే వయసొచ్చాక ఆయన గురించి తెలుసుకునే కొద్దీ ఆయనపై అభిమానం అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఎంతగా అంటే కాలేజ్ రోజులలో నటుడిగా ఆయనని గుణ, ప్రేమికుడు, దొంగ దొంగ లాంటి సినిమాలలో చూసి బరువులో ఆయనతో పోలికలున్న నేను నాకే తెలియకుండా ఆయన భాషను హావభావాలను అనుకరించేంతగా పెరిగిపోయింది. 

కొందరు మిత్రులు ఇది గమనించి హెచ్చరిస్తే అదేం లేదురా అని అంటూనే లోలోపల మురిసిపోయె వాడిని :-) ఈ ఊపులోనే కాలేజ్ యాన్యువల్ డే కి ప్రేమికుడు సినిమాలోని "అందమైన ప్రేమ రాణి" పాటకు నేనూ ఓ ఆప్తమిత్రుడూ (ప్రభుదేవాలా సన్నగా ఉండేవాడు) కలిసి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చాలా అనుకున్నాం కానీ కుదరలేదు.  

ఒక్క పాటలూ నటనేనా తన డబ్బింగ్ తో కమల్ చేసే వైవిధ్యమైన పాత్రలకు ఎంతగా ప్రాణం పోసేవారో తెలియనిదేముంది. ఆ ప్రయత్నంలోనే గులాబీ రేకుల్లాంటి వోకల్ కార్డ్స్ కి ధైర్యం చేసి రెండు సార్లు సర్జరీ చేయించుకున్నారు. "ఈ సర్జరీ తర్వాత మీ స్వరం మారిపోవచ్చు లేదా ఇక పాడలేక పోవచ్చు" అని అన్న డాక్టర్లతో "ఇలా అరకొరగా తప్పులతో పాడడం కంటే అసలు పాడక పోవడమే నయం" అని అన్నారంటే పాట పట్ల తనకున్న అభిమానం కమిట్మెంట్ ఎంత గొప్పవో ఆలోచించచ్చు.  

తన స్వరంతో యాటిట్యూడ్ తో పాటలకు జీవం పోయడం ఒక ఎత్తు అయితే ఆయన వ్యక్తిత్వం మరో ఎత్తు. ఎంత ఉన్నతమైన శిఖరాలని అధిరోహించినా ఆ నిరాడంబరత్వం అందరితో కలిసిపోవడం.  స్నేహాన్ని ఆయన గౌరవించే పద్దతి. (హంబుల్ నెస్) ఒదిగి ఉండే తత్వం మరెవరిలోనూ నేను చూడలేదు. ఆస్థాయిలో ఉంటూ అసలు ఇంత వినయంగా ఉండడం అసాధ్యం అనే ఆలోచనతో అదంతా నటననుకుని ఆయనని అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ అలాంటి వాళ్ళని కూడా సహృదయంతో అర్థం చేసుకుని పల్లెత్తు మాట అనని అనలేని పసివాడు మా బాలు. 

తనని ఇంత వాణ్ణి చేసిన కోదండపాణి గారి పేరుమీద రికార్డింగ్ స్టూడియో నడపడమే కాక. తన ఉన్నతికి తోడ్పడిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుని పదే పదే తలుచుకోవడం ఆయన ఎప్పుడూ మరువరు. గురువులకీ లబ్దప్రతిష్టులకి పాదాభి వందనం, సాష్టంగ నమస్కారం చేయడం పరిపాటే కానీ శబరిమల పైకి ఎక్కించడానికి తనని డోలీలో మోసుకుని వెళ్ళే వాళ్ళ కాళ్ళకి మొక్కిన తరువాతే డోలీలో కూర్చునే సంస్కారం మాత్రం మా బాలుడికే చెల్లు. 

తన పాటలతో రేడియో ద్వారా రికార్డ్ ప్లేయర్లు క్యాసెట్ ప్లేయర్ల ద్వారా ఎప్పుడో ప్రతి ఇంటిలోనూ ఓ ముఖ్యమైన సభ్యుడిగా కలిసిపోయిన బాలూ టీవీ రంగానికి వచ్చాక పాడుతా తీయగా, స్వరాభిషేకం లాంటి ప్రోగ్రామ్స్ తో వినపడే సభ్యుడుగానే కాక నట్టింట్లో మనతో కలిసి తిరిగే  సభ్యుడిగా మారిపోయారు. 

పాడుతా తీయగా కార్యక్రమంలో పాటలతో పాటు ఆయన చెప్పే సినిమా సంగతులు మనసుకు హత్తుకునేలా ఎంత చక్కగా చెప్తారో తెలిసినదే. అసలు అన్ని విషయాలు గుర్తుపెట్టుకోగల ఆయన జ్ఞాపక శక్తి చూసి అబ్బురమనిపిస్తుంది. ఒకోసారి సమయాభావం వల్ల ప్రోగ్రాం చూడడం కుదరకపోయినా యూట్యూబ్ లో వెతుక్కుని పాటలు స్కిప్ చేసి ఆయన వివరణ మాత్రమే విన్న రోజులు కూడా లేకపోలేదు. అసలు పాడుతా తీయగా లాంటి ఒక కార్యక్రమాన్ని పాతికేళ్ళగా నిరాటంకంగా కొనసాగించగలుగుతున్నారంటే ఈటీవీ అండ్ బాలు గారి క్రమశిక్షణా మరియూ నిబద్దతను తప్పకుండా మెచ్చుకుని తీరాల్సిందే.

ఈ పాటలతో పాటు ఈ పాడుతా తీయగా కార్యక్రమంలో నాకు బాగా నచ్చిన నేను అలవాటు చేసుకున్న విషయం ఆయన ప్రోగ్రాం చివర్లో చెప్పే సూక్తి. "సర్వేజనా సుఖినోభవంతు" ని కొద్దిగా మార్చి "సర్వేజనా సుజనోభవంతు.. సర్వే సుజనా సుఖినోభవంతు.." అనే ఈ మాట మొదటి సారి ఆయన నోట విన్నప్పుడు చాలా నచ్చేసింది. నిజమే కదా అందరూ మంచితనాన్ని అలవరచుకుంటే ఎంత బావుంటుంది అపుడు ఆటోమాటిక్ గా అందరూ సుఖంగా ఉంటారు కదా అని అనిపించింది. అందుకే నేనూ ఇదే అనుకుంటూ ఉంటాను.   

వియ్ మిస్ యూ బాలూ. మిస్ అవడమేంటిలే పాట ఉన్నంత వరకూ ప్రపంచంలో నలుమూలలా తెలుగు వారిళ్ళల్లో నిరంతరం మీరు వినిపిస్తూనే ఉంటారు కానీ నేను ఎక్కువగా మిస్సయ్యేది మాత్రం మీ మాటని. సంగీత ప్రపంచంలో భావితరాల గాయనీ గాయకులకి చక్కగా దిశానిర్దేశం చేయగల దిక్సూచీ నేడు దూరమైంది, ఆ తరాల కోసమే ఈ బాధ, ఇందులో మాత్రం మీరు లేని లోటు భర్తీ చేయడం అంత సులభం కాదు. 

నేను కలవాలనుకున్న అతి కొద్దిమంది ప్రముఖ వ్యక్తుల్లో మీరూ ఒకరు అది మాత్రం తీరని కోరికగానే మిగిల్చి వెళ్ళిపోయారు. ఐనా వెళ్ళిరండి బాలూ.. అవకాశముంటే మళ్ళీరండి.. కోట్లాది అభిమానులం మీ గళం వినడానికీ మీ వ్యక్తిత్వం నుండి పాఠాలు నేర్చుకోవడానికీ ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తూనే ఉంటాం.

సాగర సంగమం సినిమా కోసం విశ్వనాథ్ గారు బాలు గారి గళంలోనే చెప్పించిన ఈ శ్లోకం బాలు గారికి చక్కగా సరిపోతుంది. 

జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః 
నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం
నాస్తి జరామరణజం భయం

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2020

మణియారయిలె అశోకన్ & c u soon...


ఈ 2020 లో కాస్తో కూస్తో లాభ పడిన వాటిలో మలయాళ సినీ పరిశ్రమ ఒకటి అని చెప్పచ్చేమో. తెలుగు సినిమాలు పూర్తిగా ఆగిపోవడంతో ఆన్లైన్ అండ్ ఓటీటీ తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మలయాళ సినిమాల బాట పట్టారు. దానికి తగ్గట్లే హ్యూమన్ ఎమోషన్స్ కి విలువిస్తూ కథకు పెద్ద పీట వేసి తీస్తున్న ఆ సినిమాలు కూడా బావుంటున్నాయి. ఓటీటీలలో అందుబాటులో ఉంటున్న సబ్ టైటిల్స్ భాష తెలియకపోయినా సులువుగా చూసేయడానికి సహాయపడుతున్నాయ్.    

ఈ మలయాళ సినిమాల గురించి సోషల్ మీడియా అంతా కోడై కూస్తున్నా కూడా నా బాషాభిమానం అడపాదడపా ఒకటి రెండు తప్ప నన్ను ఆ సినిమాలని ఎక్కువ చూడనివ్వలేదు. కానీ కొన్ని సినిమాల్లోని కంటెంట్ చివరకు నన్నూ ఆ సినిమాలకి ఎడిక్ట్ చేసేసింది. అలా ఈ మధ్య చూసిన రెండు మంచి సినిమాల గురించే ఇపుడు మీకు చెప్పబోతున్నది. 

ఈ రెండు సినిమాలు రెండూ ఉత్తర దక్షిణ ధృవాలు. "మణియారయిలె ఆశోకన్" పూర్తిగా ఒక చిన్న ఊరిలో పచ్చని వాతావరణంలో అందమైన సినిమాటోగ్రఫీతో స్వచ్చమైన మనుషుల మధ్య భావోద్వేగాలతో చిత్రీకరించుకుని అమ్మ ఒడిని గుర్తు చేస్తే. "c u soon" దుబాయ్ నేపథ్యంలో పూర్తి టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్ బేస్ చేసుకుని కొందరు వ్యక్తుల ఆన్లైన్ జీవితాలని కళ్ళకి కడుతూ రహస్య ప్రేయసిని తలపిస్తుంది.

మణియారయిలె అశోకన్ :
ప్రకృతి పచ్చదనంతో వాతావరణంలోనే ప్రేమ నిండి ఉన్న ఒక చిన్న ఊరిలో గవర్నమెంట్ ఆఫీస్ లో క్లర్క్ గా పని చేస్తుంటాడు అశోకన్. తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళైపోతుంటాయ్ కానీ తన టర్న్ మాత్రం ఎంతకీ రాదు. ఒకటి రెండు అరేంజ్డ్ మారేజెస్ కోసం ప్రయత్నించినా బెడిసి కొడుతుంటాయి. ఇలాంటి టైమ్ లో అతికష్టం మీద ఒక పెళ్ళి సంబంధం కుదురుతుంది. 

పెళ్ళైన మొదటి రాత్రే పెళ్ళి కూతురు "మీకిది రెండో పెళ్ళనీ ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారనీ విన్నాను నిజమేనా" అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి జవాబే ఈ సినిమా, తన పెళ్ళికి ముందు అశోకన్ జీవితంలో ఏం జరిగింది? ఆ పవాదు నిజమేనా? ఇందులో తన మిత్రుడు అర్జున్(దుల్కర్) పాత్రేంటి అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. 

తెలుగు సినిమాల్లో కామెడీగా ఉపయోగించుకున్న ఒక చిన్న పాయింట్ పై చాలా సెన్సిబుల్ గా హ్యూమన్ ఎమోషన్స్ కు విలువ ఇస్తూ ప్లజంట్ స్క్రీన్ ప్లేతో చిత్రీకరించిన సినిమా ఇది. ఇదో పాత్ బ్రేకింగ్ సినిమా అని చెప్పలేం కానీ ఓ మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మానసిక సమస్య గురించి వారి పాయింటాఫ్ వ్యూలో చూపించిన సినిమా అనిపించింది.

సినిమా పూర్తయ్యాక తప్పకుండా చిన్న చిరునవ్వును పూయిస్తుంది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అశోకన్ గా చేసిన జాకబ్ గ్రెగరీ గుర్తుండి పోతాడు, నిజానికి సినిమా పూర్తయ్యేసరికి అశోకన్ అభిమానిగా మారిపోడానికి కారణం ఆ పాత్ర పోషించిన గ్రెగరీనే. అలాగె డుల్కర్ రోల్ తన గెటప్ బావుంది తను ఉన్న రెండు కీలకమైన సీన్స్ చాలా బావున్నాయి. గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన దుల్కర్, అనుసితార, నజీరియా, అనుపమ పరమేశ్వరన్ అదనపు ఆకర్షణగా నిలిచారు.

కథా కథనాలలో వేగం, కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటి వాటి గురించి పట్టించుకోకుండా ప్రశాంతమైన అలలా హాయిగా సాగిపోయే సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఇక్కడ చూడవచ్చు. ప్రోమో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. 

~*~*~*~*~*~*~*~*~*~*~*~

c u soon :
అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ సినిమా ఓ మంచి థ్రిల్లర్. అందుకే కథ గురించి నేనేం చెప్పదలచుకోలేదు. వీలైతే మీరూ కథ తెలుసుకోకుండా సినిమా చూడండి. కథగా చూస్తే ఇది ఒక చిన్న పాయింటే కానీ ఈ సినిమా చిత్రీకరించిన విధానం దానికి రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం  అద్భుతం. 

టేకింగ్ లో హాలిఉడ్ సినిమా సెర్చింగ్ ని పోలిన ఈ సినిమా ఖచ్చితంగా ఇండియన్ సినిమాకి ఓ వైవిధ్యమైన ప్రయత్నం. సోషల్ డిస్టెన్సింగ్ ని సోషల్ నెట్వర్కింగ్ ని భలే ఉపయోగించుకుని తీశారు, సినిమా మొత్తం ఐఫోన్ పై చిత్రీకరించారట. కేవలం ఒక కంప్యూటర్ స్క్రీన్ చాట్ విండోస్ వీడియో కాల్స్ మాత్రమే చూపిస్తూ దదాపు గంటా నలభై నిముషాల పాటు కూర్చోపెట్టడం మామూలు విషయం కాదు. 

ఇంటర్నెట్ లైఫ్, ఛాటింగ్, వీడియో కాలింగ్ యాప్స్, వీడియో కాల్స్ లాంటి వర్చువల్ ప్రపంచంతో బొత్తిగా పరిచయం లేని వారికి ఈ సినిమా అర్థంకాకపోవచ్చు కానీ వాటితో పరిచయం ఉన్నవారికి మాత్రం ఈ సినిమాని దర్శకుడు ప్లాన్ చేసుకున్న విధానం కొన్ని సీన్స్ చూపించిన పద్దతి వాటికి ఆ ఆన్లైన్ టూల్స్ తోనే వాడిన చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ కూడా చాలా ఆకట్టుకుంటాయి. 

ఈ సినిమా దర్శకుడి ఆలోచనని ఆచరణలో పెట్టడంలో నటీ నటుల నటన చాలా ముఖ్యమైంది. ఎందుకంటే చాలా భాగం క్లోజప్స్ అవడంతో వాళ్ళ ఎక్స్ప్రేషన్సే ఎక్కువ కనిపిస్తుంటాయ్. వాళ్ళలో ఏ ఒక్కరు ఏ మాత్రం ఫెయిల్ అయినా సినిమా మీద ఆసక్తి పోతుంది. ఫహాద్ ఫాజిల్ గురించి తెలిసినదే అలాగే కపెల్లా లో లీడ్ రోల్ పోషించిన రోషన్ మాథ్యూ కూడా బాగా చేశాడు. అలాగే ముఖ్యమైన స్త్రీపాత్ర పోషించిన దర్శనా రాజేందర్ కూడా ఆకట్టుకుంటుంది. 

ఈ సినిమాలో చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయం సౌండ్ డిజైన్, అది చాలా బావుంది. ఆన్లైన్ లైఫ్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ సౌండ్ డిజైన్ పై పెట్టిన శ్రద్ధ ప్రత్యేకంగా తెలుస్తుంది. వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా c u soon. ఆ టెక్నిక్ కోసమైనా చూసి తీరవలసిందే. మొదలయ్యాక కాసేపు కేవలం ఓ కంప్యూటర్ తెర మీద జరుగుతున్నవి చూడ్డం కాస్త అసహనానికి గురి చేయవచ్చు కానీ ఒక సారి కథలో లీనమయ్యాక అలవాటు పడిపోతాం. ఈ సినిమా ప్రోమో ఇక్కడ చూడండి. మీకు ఆసక్తి కలిగితే సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఇక్కడ చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది. 
 

గురువారం, ఆగస్టు 20, 2020

బాలుగారి ఆరోగ్యం కోసం...

గత కొన్ని దశాబ్దాలుగా భారతీయులని తన సుమధుర గాత్రంతో ఆలరిస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారు గత కొన్ని రోజులుగా కోవిడ్ తో పోరాడుతున్న విషయం అందరకూ తెలిసిందే. వారు త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. 

ఈ రోజు అనగా గురువారం ఆగస్ట్ 20 వ తారీఖున సాయంత్రం ఆరుగంటలకు (ఇండియా టైమ్) ఐదు నిముషాల పాటు బాలుగారు పాడిన పాటలను వింటూ వారి ఆరోగ్యం కోసం సామూహిక ప్రార్థనలు చేయాలని అభిమానులు సంకల్పించారు. ఇందుకోసం #GetWellSoonSPBSIR అనే హాష్ టాగ్ ఉపయోగిస్తున్నారు. మరిన్ని వివరాలు ఈనాడు పేపర్ లో ఇక్కడ చూడవచ్చు.

అందుకే వారు పాడిన పాటలలో నాకెంతో ఇష్టమైన ఈ పాటను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చిలకమ్మ చెప్పింది..(1977)
సంగీతం :  M.S.విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

కుర్రాడనుకుని కునుకులు తీసే..
హహ వెర్రిదానికీ.. పిలుపూ..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపు 
ఇదే నా మేలుకొలుపూ..ఊ..!!

మల్లెలు విరిసే మధువులు కురిసే
లేత సోయగమున్నది నీకు
మల్లెలు విరిసే మధువులు కురిసే
లేత సోయగమున్నది నీకు
దీపమంటీ రూపముంది..
దీపమంటీ రూపముంది..
కన్నె మనసే చీకటి చేయకు..
కన్నె మనసే చీకటి చేయకు..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపు 
ఇదే నా మేలుకొలుపూ..ఊ..!!

మత్తును విడిచీ.. మంచిని వలచీ..
తీపికానుక రేపును తలచీ..
కళ్ళు తెరిచి.. ఒళ్ళు తెలిసీ..
మేలుకుంటే మేలిక మనకూ..
మేలుకుంటే మేలిక మనకూ..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపూ.. 
ఇదే నా మేలుకొలుపూ..ఊ..

వెన్నెల చిలికే వేణువు పలికే.. వేళ.. 
నీ కిది నా తొలిపలుకు
వెన్నెల చిలికే వేణువు పలికే.. వేళ.. 
నీ కిది నా తొలిపలుకు
మూగదైనా రాగవీణ..
మూగదైనా రాగవీణ..
పల్లవొకటే పాడును చివరకు..
పల్లవొకటే పాడును చివరకు.

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికి పిలుపు 
ఇదే నా మేలుకొలుపు 
 

శుక్రవారం, ఆగస్టు 14, 2020

గుంజన్ సక్సేనా...

"కలలు కనండి సాకారం చేసుకోండి" అనే అబ్దుల్ కలాం గారి కొటేషన్ కు నిలువెత్తు రూపం ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ గుంజన్ సక్సేనా. భారతవాయుసేన తరఫున యుద్దంలో పాల్గొన్న తొలి మహిళా పైలట్ తను. 1999 లో జరిగిన కార్గిల్ యుద్దంలో తన చీతా హెలికాప్టర్ సాయంతో శత్రు స్థావరాలను గుర్తించడం, సైనికులకు ఆహారం, ఆయుధాలను సరఫరా చేయడమే కాక ఎందరో క్షతగాత్రులను యుద్దభూమినుండి సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించారు. తన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం శౌర్య చక్ర బిరుదుతో సత్కరించింది, ప్రజలు మరియూ డిపార్ట్మెంట్ కార్గిల్ గర్ల్ గా పిలుచుకునే ఆ గుంజన్ కథే ఇటీవల నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ "గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్" సినిమా.

1984 లో విమానంలో విండో సీట్ లో కూర్చున్న అన్న తనని మేఘాలు చూడనివ్వకుండా బ్లైండ్స్ వేసేస్తున్నాడని అలిగిన పదేళ్ళ గుంజన్ ని చూసిన ఎయిర్ హోస్టెస్ ముచ్చట పడి కాక్ పిట్ లోకి తీస్కెళుతుంది. అక్కడనుండి కనిపించే అందమైన దృశ్యాన్ని చూసిన గుంజన్ ఆ క్షణమే పైలట్ కావాలని నిర్ణయించుకుంటుంది.

ఆ నిర్ణయాన్ని అన్నతో చెప్తే తను "అమ్మాయిలు పైలట్ అవలేరు ఎయిర్ హోస్టెస్ లు మాత్రమే అవగలరు" అని ఆటపట్టిస్తుంటే చూసిన తండ్రి సక్సేనా(పంకజ్ త్రిపాఠి) "ఎవరు చెప్పారు కాలేరని, అసలు తనని ఎవరు నడుపుతున్నారన్నది విమానమే పట్టించుకోనపుడు నీకేంటి నొప్పి" అని అతన్ని మందలించి, "విమానం నడిపేది ఆడైనా మగైనా పైలట్ అనే అంటారు నువ్వు తప్పకుండా పైలట్ అవుదువుగాని ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు" అని గుంజన్ ని ప్రోత్సహిస్తాడు. 

రియల్ అండ్ రీల్ గుంజన్ సక్సేనా
అలా మొదలైన తన కలని గుంజన్ ఎలా సాకారం చేస్కుంది, అప్పటివరకూ పూర్తిగా మగవాళ్ళే ఆధిపత్యం వహిస్తున్న ఆ రంగంలో మొదటి సారి కాలు మోపి మహిళల కోసం మార్గం ఎలా సుగమం చేసింది. ఆ ప్రోసెస్ లో ఏఏ అడ్డంకులు ఎదుర్కొంది ఎలాంటి సపోర్ట్ అందుకుంది. రక్షణ/సేఫ్టీ పేరుతో అడుగడుగుకు వెనక్కి లాగుతున్న తన అన్నని ఎలా ఎదుర్కొంది. ఈ విజయం సాధించడానికి కొండంత అండగా తన తండ్రి తనతో ఎలా నిలబడ్డాడు అనేది తెలుసుకోవాలంటే గుంజన్ సక్సేనా సినిమా చూడాలి. 

నేను హిందీ సినిమాలు తక్కువే చూస్తాను. పెద్ద హీరోలు పెద్ద అంచనాలు ఉండి హిట్ అయిన సినిమాలు క్రిటిక్స్ ఆదరణ పొందిన సినిమాలు మాత్రమే చూస్తుంటాను. అక్కడి నటీనటులు కూడా నాకు పెద్దగా తెలియరు. ఐతే ఈ కథ గురించి విన్నపుడు చూడాల్సిన సినిమా అనిపించింది. అలాగే శ్రీదేవి కూతురు "జాన్వి" నటించిందన్న కారణం కూడా ఒకటి తోడైంది. ఐతే తన మొదటి సినిమా నేను చూడలేదు. ఈ సినిమానే నేను చూసిన తన మొదటి సినిమా. నాకైతే తన నటన నచ్చేసింది. 

కెరీర్ తొలిదశలోనే ఇలాంటి పాత్రలు దక్కడం తన అదృష్టం అయితే ధైర్యంగా ఒప్పుకుని మెప్పించడం మాత్రం జాన్వి గొప్పదనమే. తనని అప్పుడే శ్రీదేవితో పోల్చి చూడలేం కానీ పాతికేళ్ళ పైలట్ గా ముగ్ధత్వం అమాయకత్వం బేలతనం ఎలా కళ్ళతోనే ప్రదర్శించిందో తన మొండితనం, పట్టుదల, కార్యదక్షతలను అంతే చక్కగా ప్రదర్శించింది. తను పడిన ప్రతి కష్టాన్ని చూసి ఎంత చలించి పోతామో అందుకున్న ప్రతి విజాయాన్ని చూసి అంతే  ఆనందపడతాం. ఆ అనుభూతిని మనకి అందివ్వడంలో జాన్వీ, పంకజ్ త్రిపాఠిల నటన ఆయా సన్నివేశాలని రాసుకున్న దర్శకుని ప్రతిభ ముఖ్యంగా చెప్పుకోవలసినవి. 

పంకజ్ త్రిపాఠి పాత్ర మనకి గుర్తుండి పోతుంది. తండ్రిగా తను ప్రోత్సహించే పద్దతి ఎక్కడా డ్రమటైజ్ చేయకుండా సహజంగా చాలా బావుంది. ఆ ప్రాసెస్ లో తను చెప్పే మాటలు కూడా చాలా బావున్నాయ్ కోట్స్ గా మిగిలిపోతాయ్. ఆ తండ్రీ కూతుళ్ళ బంధం చూసినపుడు ఖచ్చితంగా మన ఇంటి అమ్మాయిలను మనం ఎంత వరకూ ఎలా ప్రోత్సహిస్తున్నాం అనే విషయం ప్రశ్నించుకుంటాం. అలాగే ప్రతి అమ్మాయి అలాంటి నాన్న కావాలని కోరుకుంటుంది. ఆల్రెడీ ఉండి ఉంటే ధీమాగా మరోసారి హత్తుకుని గువ్వపిట్టలా తన చేతులలో ఒదిగిపోతుంది.      

ఇతర నటీనటుల మరియూ టెక్నీషియన్ల పేర్లు నాకు తెలియవు కనుక చెప్పలేకపోతున్నాను. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి నటీనటులంతా తమ తమ పాత్రలలో మెప్పించారు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అలాగె నేపధ్యసంగీతం అవసరమైన చోట్ల సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ ఎమోషన్స్ కి కనెక్ట్ చేయడానికి తోడ్పడింది. వార్ సన్నివేశాలు అవసరం మేరకు పరిమితంగానే తీసినా, ఉన్నంతవరకూ బాగానే ఆకట్టుకుంటాయి. దర్శకుడు శరణ్ శర్మకు ఇది తొలి చిత్రం అంటే నమ్మలేం.  

ఐతే తొలి మహిళా పైలెట్ అనే పాయింట్ ని పండించడానికి సినిమాటిక్ లిబర్టీస్ తీస్కుని కొన్ని సన్నివేశాలని మరీ ఎక్కువ డ్రమటైజ్ చేశారేమో అనిపిస్తుంది. డిసిప్లిన్ కి మారుపేరైన ఆర్మీ ఆఫీసర్స్ అలా ప్రవర్తిస్తారా ? గుంజన్ అన్నయ్యతో సహా అందర్నీ కావాలనే అలా విలన్స్ ని చేస్తున్నారా అనే చిన్న సందేహం మనకి ఏ మూలో వస్తుంది. కాకపోతె మనిషి సహజంగానే మార్పుకు వ్యతిరేకత చూపిస్తాడు. ఒక రిథమ్ లో సాగుతున్న జీవితంలో మార్పును అంత సులువుగా స్వాగతించలేడు. 

ముఫ్ఫై ఏళ్ళ క్రితం కేవలం మగవాళ్ళు మాత్రమే ఉన్న తమ ఎయిర్ బేస్ లో అసలు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా వాష్ రూమ్ కట్టించాలన్న స్పృహ కూడా లేని పరిస్థితులలో ఓ మహిళా పైలట్ ను తమతో చేర్చుకోవాల్సి రావడం. తర తరాలుగా పాతుకు పోయిన మేల్ డామినేటెడ్ సొసైటీ నియమాలు, పద్దతులు వారినలా ప్రవర్తించేలా చేశాయి అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాము. అన్నయ్య విషయంలో తనకి తానుగా తీస్కున్న పెద్దరికం సేఫ్టీ కన్సర్న్ ఎలాగూ ఉంది.

ఏదేమైనా గుంజన్ సక్సేనా ఒక డిఫరెంట్ మూవీ, అనవసరమైన ప్రేమ సన్నివేశాలు డ్యుయెట్ లు కామెడీ లాంటివి ఇరికించకుండా నిజాయితీగా కథకు మాత్రమే పరిమితమై చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కడా ఫోకస్ తప్పకుండా చెప్తూ తీసిన ఒక మంచి సినిమా. యువతకు స్ఫూర్తినిచ్చే ఆదర్శవంతమైన సినిమా. జాన్వి సద్వినియోగ పరచుకున్న ఒక మంచి అవకాశం. మీరూ మిస్సవకండి వీలుంటే చూడండి. నెట్ఫ్లిక్స్ లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు,తమిళ భాషలలో ఇక్కడ చూడవచ్చు. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు. 

మంగళవారం, ఆగస్టు 04, 2020

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..

సహజత్వానికి ఒరిజినాలిటీకీ కేరాఫ్ అడ్రస్ అనదగ్గ "కేరాఫ్ కంచరపాలెం" లాంటి సినిమా తీసిన దర్శకుడు "వెంకటేష్ మహా" రెండో సినిమా "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య". ఇది "మహేషింటె ప్రతీకారం" అనే మలయాళ సినిమాకి రీమేక్ అని విన్నపుడు ఇంత ఒరిజినాలిటీ ఉన్న దర్శకుడు రీమేక్ ఎందుకు ఎన్నుకున్నాడో అని ఆశ్చర్యపోయాను. ఒరిజినల్ సినిమా చూడలేదు కనుక పోల్చి చెప్పలేను కానీ ఈ సినిమా చూశాక మాత్రం "ఈ కథకు తను తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరనిపించేలా తీశాడు" అనిపించింది 

టైటిల్ చూసి ఇదేదో యాంగర్ మానేజ్మెంట్ లాంటి సినిమా అని పొరబడకండి. ఎప్పుడూ ఎవరినీ కనీసం గట్టిగా కోప్పడి కూడా ఎరుగని మహేష్ అనే ఓ అతి మంచివాడి జీవితంలోని కొన్ని పేజీలు ఈ సినిమా. ఇందులో కోపం, ప్రతీకారం ఓ చిన్న భాగం మాత్రమే తన తండ్రితో అనుబంధం, ప్రేమ, కెరీర్, స్నేహం లాంటివి మిగిలిన భాగాలు. వీటినన్నిటిని అత్యంత సహజంగా అరకులోయ నేపథ్యంలో అందంగా తెరకెక్కించాడు దర్శకుడు.  

కంటికింపుగా అరకు లోయలోని ప్రకృతి అందాలని చూపిస్తూ, పాత్రలు తప్ప నటులు కనపడనివ్వని కాస్టింగ్ తో, ఆహ్లాదకరమైన వాతావారణంలో సున్నితమైన హాస్యాన్ని (సటిల్ హ్యూమర్) పండిస్తూ, భావోద్వేగాలను చూపిస్తూ, దైనందిన జీవితంలో మనకు ఎదురుపడే మాములు మనుషులతో అత్యంత  సహజంగా ఉందీ సినిమా. 

సినిమా స్లోగా ఉంది, కాన్ఫ్లిక్ట్ లేదు లాంటి రివ్యూలు చదివి మీరు ఆగిపోయినట్లైతే వాటిని పక్కనపెట్టి మీరు నిరభ్యంతరంగా చూసేయచ్చు. రేసీ స్క్రీన్ ప్లే అని చెప్పను కానీ స్లో అని కూడా నాకనిపించలేదు. పూర్తయ్యాక మాత్రం ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని మిగులుస్తుంది. ముందు ముందు స్పాయిలర్స్ ఉన్నాయి కనుక ఇక ముందుకు చదవకుండా క్లోజ్ చేసేసి ఓటీటీ ప్లాట్ఫాం "నెట్ ఫ్లిక్స్" లో ఉన్న ఈ సినిమా చూసి వచ్చేసి ఆ తర్వాత చదవండి. 

కథగా చెప్పుకోడానికి పెద్దగా ఏం లేదు పైన చెప్పినట్లు ఇది మహేష్ ఉగ్రరూపం గురించిన కథ అనేకన్నా తన జీవితంలోని కొన్ని పేజీల కథ అంతే. అరకులో తనకు తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన "కోమలి ఫోటోస్టూడియో" నడుపుతూ ఉండే ఉమామహేశ్వరరావు కోపమంటే ఏంటో ఎరుగని ఒక అతి మంచి మనిషి. తన మిత్రుల మీద కూడా కనీసం గొంతు పెంచి మాట్లాడి ఎరుగడు. అలాంటి అతను తన మిత్రులని కాపాడటానికి ఓ గొడవ ఆపాలని చేసే ప్రయత్నంలొ ఒకడి చేతిలో దెబ్బలు తిని ఘోరమైన అవమానానికి గురౌతాడు. ఆ అవమాన భారంతో ఆవేశంలో ఓ శపథం చేస్తాడు. 

ఆ శపథం ఏమిటి ? దాన్ని నెరవేర్చుకున్నాడా లేక తన  మంచితనంతో వదిలేశాడా ? ఈ ప్రాసెస్ లో తన ఫోటోగ్రఫీకి ఎలా పదును పెట్టుకున్నాడు? తన ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగిందీ? తనకి వారసత్వంగా ఫోటోగ్రఫీ కళని ఓ చిన్న స్టూడియోని బోలెడంత అనుభవ సారాన్ని ఇచ్చిన తన తండ్రితో అతని అనుబంధం ఎలాంటిది? అనేవి తెలియాలంటే "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" సినిమా చూడాలి. 

వెంకటేష్ మహా అచ్చతెలుగు నేటివిటీ కోసం అరకు నేపథ్యంగా ఈ కథను తెరకెక్కించినా అక్కడక్కడా మలయాళ వాసనలు తగులుతూనే ఉంటాయి. ఐనా కానీ మొదటి పది నిముషాలు దాటితే సినిమాలో పూర్తిగా లీనమవడంతో ఇక ఆ విషయం మనకు గుర్తుకు రాకుండా చేయడంలో మహా సక్సెస్ అయ్యాడు.

సన్నివేశాలన్నీ చాలా సహజంగా రాసుకున్నాడు ఫైట్స్ కొరియోగ్రఫీ కూడా చాలా సహజంగా పల్లెల్లో ఇద్దరు కొట్టుకుంటే ఎలా కొట్టుకుంటారో అలాగే అనిపిస్తుంది. అలాగే సంభాషణలలో ఉత్తరాంధ్ర యాస కూడా చక్కగా పలికించారు. మనల్ని అరకు మధ్యలో కుర్చీ వేసి కూర్చోబెట్టేయడంలో దర్శకుడు మహా, ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ అప్పు ప్రభాకర్, సంగీత దర్శకుడు బిజిబల్ సఫలీక్రుతులయ్యారు. సంగీత సాహిత్యాలు చక్కగా కుదిరిన పాటలు సన్నివేశాలకు తగినట్లు ఆహ్లాదకరంగా వచ్చి వెళ్తుంటాయి. నేపధ్య సంగీతం కూడా చాలా బావుంది.   

దర్శకుడు సినిమాకి కీలకమైన బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ ఫైట్ సీన్ భలే తెరకెక్కించడమే కాక ఇంకా కొన్ని చిన్న చిన్న సీన్స్ సైతం చాలా బాగా తీశాడు. ఓపెనింగ్ షాట్ లోనె హీరో తన స్లిప్పర్స్ కడుక్కుని భద్రంగా ఓ రాతి మీద పెట్టుకోవడం క్లోజప్ లో చూపించి కథాంశం ఇదీ అని భలే చెప్పాడు. స్కూల్ దగ్గరలో గొడవ పడుతున్న ఇద్దరు వ్యక్తులు "జనగణమణ" పాట విని గొడవాపి నిలబడడం. అదే సమయంలో క్లాస్ లో అందరూ సైలెంట్ గా ఉన్నా ఒక పిల్లాడు మాత్రం బ్యాగ్ సర్దుకోడం, అది టీచర్ గమనించి హెచ్చరించడం.   

ఇంకా బ్రేకప్ సీన్ మొత్తం ఎక్జిక్యూట్ చేసిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఆనందం సాంగ్ కి లీడ్ సీన్ లో ముల్లుగుచ్చుకున్న నొప్పి(బ్రేకప్ పెయిన్) తో ఉన్న మహేష్ లైఫ్ లోకి వచ్చిన జ్యోతి ఆ ముల్లుని(నొప్పిని) తీసేయడం. మహేష్ కవర్ ఫోటోని జ్యోతిలో కాంపిటీషన్ అయితే స్వాతికి పంపడం. మహేష్ స్వాతి వీక్లీ కవర్ ఫోటోలో జ్యోతిని చూస్తూ స్వాతి అన్న పేరుని కనపడకుండా మడవడం ఇలాంటి చిన్న చిన్న సీన్స్ భలే అనిపించాయి. మహేష్ తండ్రి పాత్ర తాలూకూ ఫోటోగ్రఫీకి సంబంధించిన సన్నివేశాలు, సుహాస్ నరేష్ మధ్య వచ్చే మొదటి అండ్ చివరి సన్నివేశాలు చాలా బావున్నాయ్.    

సత్యదేవ్ ఎంత మంచి నటుడో తెలిసిందే అయినా ఈ సినిమాలో మహేష్ గా ఇంకా విజృంభించేశాడు. గుబురుమీసాల చాటునుండి మెత్తగా నవ్వే నవ్వుకే సగంమంది ఫ్లాట్ అయిపోతారు. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ లో వేరియేషన్స్, బాడీ లాంగ్వేజ్ తో చాలా బాగా అకట్టుకున్నాడు. నరేష్ గారు ఈ మధ్య చేస్తున్న ఇలాంటి కారెక్టర్ రోల్స్ లో చాలా హైలైట్ అవుతున్నారు. ఇందులో కూడా బాబ్జీఅన్నగా గుర్తుండి పోతాడు. తన అనుభవ సారంతో కీలకమైన సమయాల్లో మహేష్ కు దిశానిర్దేశం చేసే తండ్రి పాత్రలో రాఘవన్ గారు బాగా చేశారు ఈయన చెప్పిన మాటలన్నీ బావున్నాయ్.  

ఇంతటి ఉద్దండుల మధ్య కూడా చాయ్ బిస్కట్ ఫేం సుహాస్ తన రోల్ తో నటనతో కామిక్ టైమింగ్ తో కట్టిపడేశాడు. సినిమాలో సత్య తర్వాత బాగా నచ్చేసే కారెక్టర్ సుహాస్ దే. తను ఎన్నుకుంటున్న రోల్స్ కూడా బావుంటున్నాయ్ కమెడియన్ గానే కాక మంచి నటుడిగా తెలుగుతెరమీద ఇంకా మంచి పేరు తెచ్చుకుని నిలిచి ఉంటాడనిపించింది. ఇక సినిమా నిడివి గల ఇంటర్వూలతో పాపులర్ ఐన ఐడ్రీమ్ టి.ఎన్.ఆర్. గారు పంచాయితి మెంబర్ నాంచారయ్య గా ఓ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించారు. తన మిగిలిన సినిమాలకన్నా కాస్త కంఫర్టబుల్ గా నటించారనిపించింది. పలాస దర్శకుడు కరుణ కుమార్(కరుణ), ఈ సినిమా దర్శకుడు వెంకటేష్ మహా(టీకొట్టు ఓనర్) రెండు చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. 

ఇక ముఖ్యమైన మహిళా పాత్రలు స్వాతి(చందన), జ్యోతి(రూప), మిథిల(కుశాలిని) పోషించిన కొత్త అమ్మాయిలు ముగ్గురూ చాలా బాగా చేశారు. వీరిలో రూప మాత్రం ప్రత్యేకంగా గుర్తుండి పోతుంది. తన రింగుల జుట్టు, కళ గల నవ్వు మొహం, కళ్ళల్లో మెరుపులు ఇట్టే ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ పాత సినిమాల్లో భానుప్రియను గుర్తు చేసింది. ఇక తన పాత్రకున్న యాటిట్యూడ్, లైఫ్ పట్ల తన క్లారిటీ వలన కూడా భలే నచ్చేస్తుంది. దర్శకుడు ఈ పాత్రను ప్రత్యేకమైన శ్రద్దతో తీర్చిదిద్దాడనిపించింది. రూప కూడా అంతే సులువుగా చేసేసింది. ఫ్లాష్ మాబ్ లో డాన్స్ కూడా చాలా ఈజ్ తో చేసింది.   

ఓవరాల్ గా "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" మంచి సినిమా. థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే కంచరపాలెం టైప్ లోనే మంచి హిట్ గా నిలిచి ఉండేది. అరకు అందాల కోసం ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది. ఒకటీ అరా చిన్న చిన్న లోపాలు ఉన్నా ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని పొందాలంటే మీరూ మిస్సవకుండా నెట్ఫ్లిక్స్ లో వెంటనే చూడండి. సినిమా ప్రోమో ఇక్కడ చూడవచ్చు. పాటలు జ్యూక్ బాక్స్ లో ఇక్కడ వినవచ్చు.   

నాకు నచ్చిన కొన్ని సంభాషణలు ఇక్కడ పొందు పరుస్తున్నాను ఫీల్ పోకూడదంటే సినిమా చూసొచ్చాక చదువుకోండి. 

"ఆలోచనలు, జ్ఞాపకాలు ప్రపంచంలో అన్నిటికంటే బరువైనవట, ఏడ్చేస్తే కన్నీరు ఆవిరైపోతుంది, మనసు తేలికవుతుంది."

"జీవితంలో ఏదో తప్పుచేశాననుకుంటూ బతకమాకు అది అన్నింటికంటే ప్రమాదకరం"

"ఇద్దరు మనుషులు కలుస్తారు, రెండు మనసులు విడిపోతాయి. మనిషి శరీరంలో ఎక్కడుందో తెలియని మనసును ఎంతకాలమని నిందిస్తావ్."

"వెళ్ళిపోవాలనుకున్న వారిని వెళ్ళనివ్వకపోతే... ఉన్నా వెలితిగానే ఉంటుంది."

"కళ అనేది పాఠాలు వింటే రాదు పరితపిస్తే వస్తుంది"

"నవరసాలు అంటే మనకు కనపడే ముఖంలో కండరాల కదలిక కాదు మనలో జరగాల్సిన రసాయన ప్రక్రియ"

"ఎమోషన్ అనేది నీలో పుట్టాలి నువ్వు చూసే వస్తువులో కాదు"

"ఆడపిల్లల తండ్రులు అబ్బాయిలందరూ ఎదవలే అని ఎంత గట్టిగా నమ్ముతారో వాళ్ళ పిల్లలక్కూడా విచక్షణ ఉండిద్దని అంత గట్టిగ నమ్మినరోజే ఈ దేశం బాగుపడిద్ది"

"నొప్పి రుచి తెలియని వాడే ఎదుటి వాడి మీద చేయి చేసుకుంటాడు. తెలిసిన వాడు చేయి ఎత్తడానికి కూడా ఆలోచిస్తాడు" 

"శవానికి మాత్రమే నొప్పి కలగదు. ప్రాణముంటే నొప్పి ఉంటుంది"

"అందరికీ తెలియాలంటే చూడక్కర్లేదు వింటే చాలు.. వీళ్ళు చూశారుగా మిగతా వాళ్ళు వింటారు"
 

బుధవారం, మే 20, 2020

కనులు కనులను దోచాయంటే...

ఈ సినిమా టైటిల్ చూసినపుడు అబ్బా ఇది మరో రొటీన్ ప్రేమకథ అయుంటుందిలే అని అనిపించి కనీసం ట్రైలర్ కూడా చూడలేదు నేను. అప్పటికీ డుల్కర్ మంచి మంచి స్క్రిప్ట్స్ ఎన్నుకుంటాడు అనే నమ్మకం ఉన్నా కూడా దూరంగానే ఉన్నాను. అలా రిలీజైనపుడు మిస్సయిన ఈ సినిమా మొన్న ఓటీటీ(ఆహా)లో అనుకోకుండా చూసే అవకాశం దొరికింది. సినిమా గురించి రివ్యూలు చదవకుండా ఏం తెలియకుండా చూడడంతో నన్ను బాగానే థ్రిల్ చేశారు.

ఓ రకంగా చెప్పుకోవాలంటే ఇది కూడా ప్రేమ కథ లాంటిదే కానీ ప్రేమ కథ కాదు. ఆ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూశాక కానీ మనకు పూర్తిగా అర్ధం కాదు. ఈ జెనర్ లో వచ్చే సినిమాల్లో హాలీఉడ్ సినిమాలకీ మన సినిమాలకీ ఓ ప్రధానమైన తేడా ఉంటుంది అది నైతికత. హీరో దొంగ ఐనా కూడా రాబిన్ హుడ్ తరహా మంచి దొంగలా ఉండాల్సిందే తప్ప మామూలుగా రియలిస్టిక్ గా ఉంటే కుదరదు.

ఈ సినిమా ఆవిషయంలో కాస్త వెసులుబాటుతో ఇచ్చిన క్లైమాక్స్ నాకు నచ్చింది. "ఇలాంటి సినిమాలతో సభ్యసమాజానికి ముఖ్యంగా యువతకి ఏం మెసేజ్ ఇద్దామని" అని అనుకునే టైప్ మీరైతే బహుశా ఈ సినిమా మీకు నచ్చకపోవచ్చు. ఓ కథని కాస్త సినిమాటిక్ లిబర్టీస్ తో అక్కడక్కడా థ్రిల్ చేస్తూ ఎంటర్ టైనింగ్ గా చెప్తే చాలు అని అనుకుంటే మీకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇట్సె క్లీన్ ఎంటర్టైనర్.

సినిమాలోని థ్రిల్స్ ఎంజాయ్ చేయాలంటే ఇక ముందుకు చదవకుండా ’ఆహా’ ఓటీటీ ప్లాట్ఫార్మ్ లోనో, టీవీలో ప్రదర్శించినపుడో ఈ సినిమా చూసొచ్చాక చదవండి.

కథ విషయానికి వస్తే ఈజీ గోయింగ్ ఆవారా బ్యాచ్ అయిన అనాథ హీరో గారు(డుల్కర్) ఓ ఫ్రెండ్ తో కలిసి రకరకాల మోసాలతో డబ్బు సంపాదిస్తూ లావిష్ గా బతికేస్తుంటారు. అలాంటి సమయంలో అందం అమాయకత్వం కలబోసిన హీరోయిన్(రీతూ వర్మ) తో ప్రేమలో పడతారు. ఆ ప్రేమ ప్రభావంతో ఈ పనులన్నిటికి స్వస్తి చెప్పి ఎక్కడైనా గౌరవంగా పని చేసుకుంటూ బ్రతకాలని నిర్ణయించుకుంటారు.

ఐతే చేసిన పాపం వెంటాడకుండా ఊరుకోదు కదా ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ (గౌతం మీనన్) వీరి మోసాల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. హీరోగారు పోలీసులకి దొరికి పోయారా, చేసిన తప్పులకు శిక్ష అనుభవించారా, వారి ప్రేమ కథ ఏమైంది అసలు చేసిన మోసాలు ఎటువంటివి అనేది తెలియాలంటే మీరు కనులుకనులను దోచాయంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పూర్తిగా దర్శకుడి సినిమా, ముఖ్యంగా స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నాడు. అక్కడక్కడా కొన్ని మోసాల విషయంలో ఇది ఇంత సులువా అనిపించేలా కాస్త సినిమాటిక్ లిబర్టీస్ తీస్కున్నప్పటికీ చాలా వరకూ థ్రిల్ చేయగలిగాడు. ఈ సినిమా చూశాక ఆన్ లైన్ షాపింగ్ చేసే ముందు ఓ నిముషం ఆలోచించకుండా ఉండలేం. ఇంకా ఇందులో టచ్ చేసిన ఇతర మోసాలు కూడా కొత్తగా ఉన్నాయి.

కాస్టింగ్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది ముఖ్యంగా హీరోయిన్ గా రీతూ వర్మని తీస్కోడం చాలా ప్లస్ అయింది. డుల్కర్ ఆల్రెడీ ప్రూవెన్ నటుడు ఈ పాత్ర తను మరింత అలవోకగా చేసేశాడు. మిగిలిన నటీనటులంతా కూడా పాత్రల్లో ఒదిగిపోయారు. పాటలు ప్రత్యేకంగా గుర్తుండక పోయినా నేపథ్య సంగీతం సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ చక్కగా అమరింది. సినిమాటోగ్రఫీ తో సహా మిగతా టెక్నికల్ టీమ్ అంతా కూడా మంచి ఔట్ పుట్ ఇచ్చారు.

ఈ తరహా దోపిడీ దొంగల సినిమాలు ఇష్టపడే వాళ్ళు మాత్రమే కాకుండా వైవిధ్యభరితమైన ఎంటర్టైనింగ్ సినిమాలు నచ్చే వాళ్ళు మిస్ అవకుండా చూడదగిన సినిమా కనులు కనులను దోచాయంటే.

శనివారం, మార్చి 21, 2020

భయం మంచిదే...

అవును ఒక్కోసారి భయం కూడా మంచిదే, ప్రస్తుత పరిస్థితులలో భయం అవసరం కూడా. అపోహలతో హేతుబద్ధత లేని ప్రచారాలను చూసి పానిక్/భయాందోళనలకు గురికావలసిన పని లేదు. ప్రళయం వచ్చేస్తుంది ఏదో జరిగిపోతుందని గాభరా పడాల్సిన పనిలేదు. అలాగని పూర్తిగా మనకేం కాదులే అనే నిర్లక్ష్య ధోరణీ మంచిది కాదు. మన సహేతుకమైన భయాన్ని జాగ్రత్తగా మార్చుకుందాం, కర్తవ్యాన్ని శ్రద్దగా నిర్వహిద్దాం. కరోనా (కోవిడ్ 19) కి మందు లేకపోవచ్చు కానీ సమిష్టిగా అందరూ తగు జాగ్రత్తలు తీస్కుని దాన్ని వ్యాపించకుండా కట్టడి చేయగలం.

గత కొన్ని రోజులుగా నేను వింటున్న కొన్ని నిర్లక్ష్యపు సమాధానాలు :

"అబ్బే మనది వేడి ప్రదేశం సార్ మనకేం కాదు.."
వేడి /చలి /హ్యుమిడిటీ లాంటి వాటికీ కరోనా వైరస్ కి ఏ విధమైన సంబంధం లేదు. అయినా దుబాయ్ తో సహా ఈ వైరస్ ఇప్పటికే విస్తరించిన నూటనలభై దేశాల్లో లేని ఎండలు కానీ ఉష్ణోగ్రతలు కానీ కాదు మనవి. మన దేశంలో కన్నా అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది ఐనా అక్కడ రోజు రోజుకీ ఎలా వ్యాపిస్తుందో చూస్తూనే ఉన్నాం.

"ఎవడో ఎక్కడో నాన్వెజ్ తిని తెచ్చుకున్న రోగం ఇది, నేను శాఖాహారిని నాకేం కాదు"
ఈ వైరస్ మొదట మనుషుల్లోకి వచ్చినది ఎలా అయినా వ్యాపించేది మాత్రం తినే తిండి ద్వారా కాదు, మన అజాగ్రత్తల వల్ల. శాఖాహార మాంసాహరాలతో సంబంధం లేకుండా మనం తినే ఆహారం ఉపరితలంపైన ఈ వైరస్ ఉంటే అది మనకీ అంటుకుంటుంది. ఈ వైరస్ ఉమ్మి ద్వారా వ్యాపిస్తుంది, దానితో కాంటాక్ట్/టచ్ అనేది అత్యంత కీలకం. ఉమ్మిగానే కాదు తుమ్ము లేదా దగ్గు వచ్చినపుడు వచ్చే తుంపరల మేఘంలో ఉండి అది నేల, డస్క్, గోడ, టేబుల్, సోఫా లాంటి వాటిపై సెటిల్ అయి కొన్ని గంటలపాటు యాక్టివ్ గా ఉండి అక్కడ ముట్టుకున్న అందరికి సోకుతుంది. సమూహాల్లో తిరగవద్దు అనేది, శుభ్రత పాటించమని అడిగేది ఇందుకే.

"ఆ ఎయిడ్స్, సార్స్, ఎబోలా, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఇలా ఎన్ని చూళ్ళేదు అవన్ని ఎక్కడెక్కడో వస్తాయ్ కానీ మనకేం కాదు"
తిన కూడనిది తిని మానవాళికి ఈ వైరస్ అంటించిన వారిది ఎంత తప్పో. తీస్కోవలసిన జాగ్రత్తలు తీస్కోకుండా నిర్లక్ష్య ధోరణితో ఈ వైరస్ వ్యాప్తికి కారణమయ్యే మీలాంటి వారిదీ అంతే తప్పు. మీకు ఇమ్యూనిటీ/రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉండచ్చు సాధారణ ట్రీట్మెంట్ తో మీరు కోలుకోవచ్చు. కానీ మీ నిర్లక్ష్యంతో మరో పదిమందికి అంటించడం వారిలో ఇంత ఇమ్యూనిటీ లేని వారి మరణానికి కారణం అవడం క్షమించరాని నేరం.

అందుకే ఎలాంటి అపోహలకు తావు లేకుండా ప్రభుత్వ సూచనలను తూ.చ. తప్పకుండా పాటిద్దాం, సమిష్టి కృషితో ఈ వైరస్ వ్యాప్తిని అరికడదాం. ఇటలీలా, చైనాలా పరిస్థితి చేయి దాటక ముందే, సైన్యమో, పోలీసులో మనలని బలవంతంగా నిర్భంధించాల్సిన పరిస్థితి రాకముందే మేలుకుందాం. 

సాధ్యమైనంత వరకూ ఇంటిపట్టునే ఉండండి. ప్రభుత్వం ఇస్తున్న శలవులని వినోద యాత్రలకు విహరాలకు తీర్థయాత్రలకూ వాడకండి. అత్యవసరమైతే తప్ప బయట తిరగకండి. సమూహాలలోకి అసలే వెళ్ళ వద్దు. ప్రయాణాలను వాయిదా వేస్కోండి. షాపింగ్ మాల్స్ /థియేటర్లు /గుడి/చర్చ్/మసీదు/ వాకింగ్ పార్కులు వీటి దరిదాపులకు కూడా వెళ్ళకండి. మీకు దొరికిన ఈ అనుకోని విశ్రాంతిని పూర్తిగా ఇంట్లోనే కుటుంబంతో క్వాలిటీ టైమ్ గడపడానికి కేటాయించండి. అలాగని బంధుమిత్రులతో గెట్ టుగెదర్ లు కూడా ప్లాన్ చేయకండి.

చేతులను మోచేతుల వరకూ శుభ్రపరచుకోండి. కేవలం పంపుకింద చేతులు పెట్టి వదిలేయకుండా సోప్ తో అరచేతులు, వాటి పైనా, వేళ్ళు, బొటన వేళ్ళు, వేళ్ళ మధ్యలో, గోర్లకింద (గోర్లు పెరగనివ్వక పోవడం మంచిది) మొత్తం ఇరవై సెకన్ల పాటు (హ్యాపీ బర్త్ డే పాట పూర్తిగా పాడేంత సేపు) సబ్బుతో రుద్దుకోండి. తుమ్ము లేదా దగ్గు వచ్చినపుడు కర్చీఫ్, టిష్యూ పేపర్ నో లేదా మోచేతిని అడ్డుగా పెట్టుకుని తుమ్మండి. కేవలం అరచేతులు అడ్డుపెట్టుకోవడం సరిపోదు. ఆ తర్వాత ఆ టిష్యూని జాగ్రత్తగా మూత వున్న డస్ట్ బిన్ లో పారేయండి. ముఖాన్ని, ముఖ్యంగా నోరు, ముక్కు, కళ్ళని చేతితో తాకకండి. కౌగిలింతలు, కరచాలనం / షేక్ హ్యాండ్ బదులు నమస్కారం తో సరిపెట్టండి కొన్ని రోజులు.

పబ్లిక్ ప్రదేశాలనే కాదు మీ అపార్ట్మెంట్ లోని గేట్లు, లిఫ్ట్, మెట్లు, వాటికి అనుకోడానికి ఉండే బార్స్, మీ ఇంటి డోర్ నాబ్స్ అన్నిటిని సాధ్యమైనంత వరకు ముట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. తప్పనిసరి పరిస్థితులలో టిష్యూ ఉపయోగించండి. జ్వరం, జలుబు, దగ్గు, ఊపిరి తీస్కోవడానికి ఇబ్బంది లాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మాస్క్ ధరించి మీ దగ్గరలోని హాస్పటల్ ను సంప్రదించండి. ఈ లక్షణాలు లేని వాళ్లు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.

ఇంటికి వచ్చే హెల్పర్స్ / పనిమనుషులకు తగిన జాగ్రత్తలు చెప్పండి. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఇంట్లో దేన్నైనా తాకనివ్వండి. వంటమనిషి ఉంటే మాస్క్ వేసుకుని వంట చేయించడం శ్రేయస్కరం. మొహామాటాలకన్నా ప్రాణం మిన్న అందుకే ఇలాంటి నియమాలను వారికి చెప్పడానికి ఇబ్బంది పడకండి. మన ఇంటికి వచ్చేప్పుడే కాదు ఇక్కడి నుండి వారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా చేతులు కడుక్కోకుండా వాళ్ళ ఇంట్లో దేన్ని ముట్టుకోవద్దని చెప్పండి. సమయం వెచ్చించి అయినా వారికి అర్ధమయ్యేలా చెప్పడం మన బాధ్యత.

మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూస్కోండి. ఇమ్యూనిటీ/రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి లిమ్ సీ లాంటి సి.విటమిన్ టాబ్లెట్స్ వేస్కోండి. అల్లం, సొంఠి, నిమ్మకాయ, వెల్లుల్లి, తెల్ల మిరియాలు, పసుపు గుమ్మడి లాంటి ఇమ్యూనిటీ పెంచే సహజమైన ఆహార పదార్ధాలు తినండి. ఐతే ఇవి కేవలం మీ రోగనిరోధక శక్తి పుంజుకోడానికే తప్ప వైరస్ ని నివారించలేవని గుర్తించండి.

గొంతులో స్వల్పంగా నస లాంటిది ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే తక్షణమే వేడినీళ్ళలో కొంచెం ఉప్పుకలిపి దానితో కానీ లేదా వినెగర్ కలిపిన నీటితో కానీ గార్గిల్ చేయండి. ఈ వైరస్ ముందు గొంతులో డార్మెంట్ గా ఉండి రెండురోజుల తర్వాత మిగిలిన లక్షణాలు బయట పెడుతుందని ఒక ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకూ కరెక్టో తెలియదు కానీ ఈ ఒక్క ఇబ్బంది తప్ప ఇతర లక్షణాలేవీ లేనప్పుడు పాటించడం వలన నష్టం లేదనుకుంటున్నాను.   

షాపింగ్ కి సాధ్యమైనంత వరకూ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఈ వాలెట్స్, పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే లాంటి వాటిని ఉపయోగించండి. డబ్బులు ఒకరి చేతి నుండి ఒకరికి మార్చడాన్ని వీలైనంతగా తగ్గించండి.

మన ఇంటి మెయిన్ గేట్లు, డోర్ నాబ్స్, ఇంటికి రోజూ తీసుకు వచ్చే పాలు, పేపర్, కూరలు, ఇంకా చెత్త తీస్కుని వెళ్ళే వాళ్ళు హాండిల్ చేసే వేస్ట్ బాస్కెట్/చెత్త బుట్ట, వీటన్నిటిని స్టెరిలైజ్ చేసిన తర్వాతే వాడండి.

స్టెరిలైజేషన్ కి ఆల్కహాల్ బేస్డ్ శానిటైజింగ్ లిక్విడ్స్ దొరికితె సరే లేకపోతే నాకు ఓ నేస్తం చెప్పిన ఈ పద్దతి ఫాలో అవండి. సోప్ సొల్యూషన్ని లేక వెనిగర్ మరియూ నీళ్ళని సమపాళ్ళలో కలిపి కోలిన్ లాంటి స్ప్రే బాటిల్స్ లో పోసుకుని పైన చెప్పిన వాటిపై స్ప్రే చేయవచ్చు ఈ మిశ్రమానికి నిమ్మరసం ఉప్పు కూడా కలపవచ్చు. ఇదే కాక డెట్టాల్ లాంటి లిక్విడ్ ని నీటిలో డైల్యూట్ చేసి దాన్ని కూడా స్ప్రే బాటిల్స్ లో నింపి దాన్ని కూడా వాడుకోవచ్చు.

అవసరానికి మించి స్టాక్ చేసుకునే అలవాటుని మానండి. గుర్తుంచుకోండి మీరీ వైరస్ భారిన పడకుండా ఉండాలంటే వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే మీరొక్కరే జాగ్రత్తలు తీస్కుంటే చాలదు మీ తోటి వారు సైతం తగిన జాగ్రత్తలు తీస్కోవాలి. అందుకే మాస్క్ లు శానిటైజర్స్ లాంటి వాటిని అవసరానికి మించి స్టాక్ పెట్టుకోకుండా అందరికీ అందేలా జాగ్రత్తలు తీస్కుందాం.   

ఈ అనుకోని ఉపద్రవం ఇంకా మహమ్మారి కాకముందే ప్రతి ఒక్కరం మన సామాజిక బాధ్యతను అర్ధం చేసుకుని వ్యక్తిగత శుభ్రతని పాటిస్తూ సంఘటితంగా పోరాడి వ్యాపించకుండా అరికడదాం.

మొన్న గురువారం ప్రధాని మోడీ గారు చెప్పినది వినే ఉంటారు కదా. జనతా కర్ఫ్యూ మంచి ఆలోచన, ముందు ముందు ఒక్క రోజు కన్నా ఇంకా ఎక్కువ పాటించాల్సిన అవసరం రావచ్చు. ముందుగా ఈ ఒక్క రోజు పాటిస్తే వైరస్ వ్యాప్తిని కొంత వరకు నెమ్మదింపచేయచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ ఆదివారం మార్చి 22 న ఉదయం ఏడు నుండి రాత్రి తొమ్మిది వరకు జనతా కర్ఫ్యూలో పాల్గొనండి. వీలైతే ఆదివారం రాత్రి పూట కూడా బయట తిరగకుండా ఉంటే మంచిది. అలాగే ఈ ఆపస్సమయంలో ప్రాణాలకు సైతం తెగించి సహాయం అందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీస్, రవాణా, మున్సిపల్, పారిశుధ్య కార్మికులు మరియూ ఇతర అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. విదేశాలనుండి వచ్చిన వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ట్రేస్ చేసి పట్టుకుంటున్న ఇంటెలిజెన్స్ టీమ్స్ సేవలు కూడా అమోఘం. ఈ ఆదివారం అంతా జనతా కర్ఫ్యూని పాటించి సాయంత్రం ఐదుగంటలకు మన ఇంటి గుమ్మం నుండో కిటికీ నుండో చప్పట్లు కొడుతూ వీరందరి సేవలను అభినందిద్దాం. నేను జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నాను మీరూ పాల్గొనండి.  

వైరస్ గురించి సమగ్రమైన సమాచరం యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. ఇదే కాక అసలు చేతులను సబ్బుతో ఎందుకు ఇరవై సెకన్లు కడగాలి అనేది అర్ధమవడానికి ఈ వీడియో  కూడా చూడండి. 


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

రాంబాబు తోట గారు ఫేస్బుక్ లో ఈ వైరస్ గురించి మరింత సమగ్రమైన సమాచారాన్ని తెలుగులో అందించారు అది ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. వారి ఫేస్బుక్ పోస్ట్ లింక్ ఇక్కడ చూడవచ్చు. వారికి రిప్లై ఫేస్బుక్ లోనే ఇవ్వగలరు.

కరోనా వైరస్ ౼ ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.H.O) మార్గదర్శక సూత్రాలు 

కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. సరైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం ఆందోళన పడనవసరం లేదు. తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా.  ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.H.O) సూచించిన గైడ్ లైన్స్ పాటిస్తే కరోనా బారిన పడకుండా మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవచ్చు.  కరోనా వైరస్ గాలిలో  ప్రయాణించలేదు.  COVID-19 వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వచ్చే తుంపర ద్వారా బయటకు వెదజల్లబడుతుంది. ఆ తుంపర గాలిలో ఎంత సేపు నిలిచి ఉంటే, అంతసేపు ఉంటుంది. అలా బయటకు వచ్చిన డ్రాప్లెట్స్ కుర్చీ, టేబుల్, తలుపులు, డోర్ నాబ్స్, బస్సు, ట్రెయిన్ లో ఉండే స్టీల్ రాడ్స్ మొదలైనటువంటి ఉపరితలాల(surfaces)కి అంటుకొని ఉంటుంది. వాటిని మనం తాకి అదే చేతితో నోరు, ముక్కు, కంటిని తాకితే, మన శరీరంలోకి చేరుతుంది. ఇతరుల్ని తాకితే, వారికి అంటుకుంటుంది.

కరోనా ఏ మార్గం ద్వారా ఒకరి నుండి ఒకరికి వెళుతుందో గుర్తు పెట్టుకొని, W.H.O సూచించిన క్రింది జాగ్రత్తలు పాటించాలి.
 
1. మీ చేతులను తరచుగా కడగాలి
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ లో ఉన్న surfaces ని తాకడం వల్ల వైరస్ అంటుకుంటుంది కాబట్టి,  చేతులను ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్ తో రుద్దుకోవాలి. లేదా సబ్బు మరియు నీటితో కడగాలి. అలా చేస్తే మీ చేతుల్లో ఉండే వైరస్లు చనిపోతాయి.
 
2. సామాజిక దూరాన్ని పాటించండి.
దగ్గు లేదా తుమ్ము ఉన్నవారికీ మీకూ మధ్య కనీసం ఒక మీటర్ (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోండి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వారి ముక్కు లేదా నోటి నుండి వచ్చే తుంపర(ద్రవ బిందువులు)లో వైరస్ ఉండవచ్చు. వారికి దగ్గరగా ఉండటం వల్ల ఆ బిందువులలో పాటు కరోనా వైరస్ ని పీల్చుకోవడం వల్ల COVID-19 రావొచ్చు.

3. కళ్ళు, ముక్కు మరియు నోరు తాకడం మానుకోవాలి. పూర్తి స్పృహలో ఉండి, ముఖాన్ని తాకే అలవాటును మార్చుకోండి. ఎందుకంటే, మనం బయటకు వెళ్ళినప్పుడు కుర్చీలు, టేబుల్స్, బస్సులో, ట్రెయిన్ లో సపోర్టు కోసం వాడే స్టీల్ రాడ్స్ వంటి ఉపరితలాలను చేతులతో తాకుతాము. అలా వైరస్లు చేతులకు అంటుకొని, మీ కళ్ళు, ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్థాయి.
 
4. మీరు మరియు మీ చుట్టుపక్కల ప్రజలు శ్వాసకోశ పరిశుభ్రతను పాటించేలా చూసుకోండి. దగ్గు లేదా తుమ్ము ఉన్నప్పుడు మీ వంచిన మోచేయి లేదా టిష్యూ పేపర్ తో నోరు మరియు ముక్కును కప్పాలి. అలా వాడిన టిష్యూ పేపర్ ని వెంటనే పారవేయాలి. ఇలా కాకుండా నేరుగా చేతులు అడ్డు పెట్టుకోవడం వల్ల, ఆ వైరస్ మీ చేతులకు అంటుకొని, ఇతర ఉపరితలాలకు వ్యాప్తి చెందుతుంది.
 
5. మీకు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, వైద్య సహాయం తీసుకోండి. స్థానిక ఆరోగ్య అధికారుల సూచనలను అనుసరించండి. వారి వద్ద తాజా సమాచారం ఉంటుంది. ముందుగానే కాల్ చేస్తే, మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత మిమ్మల్ని త్వరగా సరైన ఆరోగ్య సదుపాయాన్ని కల్పిస్తారు.
 
6. COVID-19 వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో లేదా ఇటీవల(గత 14 రోజులు) సందర్శించి ఉంటే, ముందుగా  స్థానిక ఆరోగ్య అధికారికి ఫోన్  చేసి సమాచారం అందించండి. వారు అవసరమైన పరీక్షలు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతారు.

CORONA HELPLINE NUMBERS
A.P - 08662410978
T.S - 104
Central help line number  +91-11-23978046

మాస్క్ ఎప్పుడు, ఎలా ధరించాలి?
మీ ఆరోగ్యం  బాగుగా ఉండి, COVID-19 సంక్రమించినట్టు అనుమానం ఉన్న వ్యక్తికి సపర్యలు చేస్తూ ఉంటే  మాస్క్ ధరించాలి. లేదా మీకు దగ్గు లేదా తుమ్ము ఉంటే  ధరించాలి. లేదా  మూడు అడుగుల సామాజిక దూరాన్ని పాటించడం కుదరని బస్సు, ట్రెయిన్ లో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలి. ఇవేమీ లేనప్పుడు, ఇంటిలో ఉండగా మాస్క్ అవసరం లేదు.
 
ఆల్కహాల్ ఆధారిత  సానిటైజర్ లేదా సబ్బు మరియు నీటితో  చేతిని శుభ్రపరచుకున్నాకే  మాస్క్ ని తాకాలి.  లేకుంటే, చేతికి ఉన్న వైరస్ మాస్క్ కి అంటుకొని వైరస్ శరారంలోకి ప్రవేశించవచ్చు.   మాస్క్ తో నోరు మరియు ముక్కును  పూర్తిగా కప్పండి. మరియు మీ ముఖం మరియు ముసుగు మధ్య ఖాళీ లేకుండా చూసుకోవాలి. మాస్క్ వేసుకున్నాక  దాన్ని తాకడం మానుకోండి.  ఒక వేళ తాకితే  ఆల్కహాల్ ఆధారిత  సానిటైజర్  లేదా సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి.  మాస్క్ తడిగా  ఉంటే  అది పడేసి కొత్తది వేసుకోండి. సింగిల్-యూజ్ మాస్క్‌లను తిరిగి ఉపయోగించవద్దు. మాస్క్ తొలగించడానికి తాళ్లను పట్టుకొని మాత్రమే తొలగించాలి. (ముసుగు ముందు భాగంలో తాకవద్దు) మూత ఉన్న చెత్త డబ్బాలో వెంటనే పడేసి, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ లేదా సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రం చేయండి.

కరోనా గురించి ఉన్న కొన్ని అపోహలు. 

1. కరోనా వైరస్ వేడిగా ఉండే మన దేశంలో వ్యాపించదు అనేది కేవలం అపోహ.  ఇప్పటివరకు లభించిన ఆధారాల నుండి, COVID-19 వైరస్ వేడి మరియు తేమతో కూడిన వాతావరణంతో సహా అన్ని ప్రాంతాలలో వ్యాపిస్తుంది.

2. వేడి స్నానం చేయడం వల్ల కొత్త కరోనావైరస్ వ్యాధి రాదు అనేది కూడా అపోహ మాత్రమే. ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయడం ప్రమాదకరం.

3. హ్యాండ్ డ్రైయర్స్ తో చేతుల్ని పొడిగా చేసుకోవడం వల్ల వైరస్ పోతుంది అనేది కూడా అపోహ. సబ్బు, నీటితో చేయి కడుక్కోవడం తప్పని సరి.

4.  థర్మల్ స్కానర్లు  కరోనా వైరస్ ని గుర్తిస్తాయా?  జ్వరం వచ్చిన వ్యక్తులను మాత్రమే థర్మల్ స్కానర్లు గుర్తిస్తాయి. వ్యాధి బారిన పడి, జ్వరం రాని వారిని గుర్తించలేవు.  వ్యాధి బారిన పడినవారు అనారోగ్యానికి గురై జ్వరం రావడానికి 2 నుండి 10 రోజుల మధ్య సమయం పడుతుంది.

5. శరీరమంతా ఆల్కహాల్ లేదా బ్లీచింగ్ పౌడర్/క్లోరిన్ చల్లడం వల్ల  కరోనావైరస్ను చంపగలమా?
శరీరమంతా ఆల్కహాల్ లేదా క్లోరిన్ చల్లినా, శరీరంలోపలి  వైరస్లను చంపలేము. అటువంటి పదార్థాలను చల్లడం బట్టలు లేదా శ్లేష్మ పొరలకు (అంటే కళ్ళు, నోరు) హానికరం. ఉపరితలాలను క్రిమిసంహారక చేయడానికి ఆల్కహాల్ మరియు క్లోరిన్ రెండూ ఉపయోగపడతాయి. అయితే అవి తగిన సిఫారసుల క్రింద ఉపయోగించాల్సిన అవసరం ఉంది.

6. న్యుమోనియా కోసం వేసుకున్న టీకాలు కొత్త కరోనావైరస్ నుండి రక్షిస్తాయనేది అపోహ. కరోనాకి స్వంత టీకాని తయారు చేయడం అవసరం. పరిశోధకులు 2019-nCoV కి వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి తయారవ్వలేదు.

7. క్రొత్త కరోనావైరస్ సంక్రమణను నివారించడానికి ఉప్పు కలిపిన నీళ్లతో ముక్కును క్రమం తప్పకుండా కడగడం సహాయపడుతుందా? జలుబుతో ముక్కును క్రమం తప్పకుండా కడగడం వల్ల జలుబు నుండి ప్రజలు త్వరగా కోలుకోగలరని కొన్ని పరిమిత ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడానికి అది సరిపోదు.

8. వెల్లుల్లి తినడం కొత్త కరోనావైరస్ సంక్రమణను నివారించగలదా?
వెల్లుల్లి ఆరోగ్యకరమైన ఆహారం, ఇది కొన్ని యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అయినప్పటికీ వెల్లుల్లి తినడం ప్రజలను కొత్త కరోనావైరస్ నుండి రక్షించిందని ప్రస్తుత వ్యాప్తి నుండి ఎటువంటి ఆధారాలు లేవు.

9. కొత్త కరోనావైరస్ వృద్ధులను ప్రభావితం చేస్తుందా, లేదా యువకులు కూడా బారిన పడుతున్నారా?
అన్ని వయసుల వారికి కొత్త కరోనావైరస్ (2019-nCoV) సోకుతుంది. వృద్ధులు, మరియు ముందుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు (ఉబ్బసం, మధుమేహం, గుండె జబ్బులు వంటివి), వ్యాధి నిరోధకాశక్తి తక్కువ ఉన్నవారు ఈ వైరస్‌తో తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

10. కొత్త కరోనావైరస్ను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా ఉన్నాయా?
లేదు, యాంటీబయాటిక్స్ వైరస్లకు వ్యతిరేకంగా పనిచేయవు. కేవలం బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తాయి. అయినప్పటికీ, మీరు 2019-nCoV కోసం ఆసుపత్రిలో ఉంటే, మీరు యాంటీబయాటిక్స్ పొందవచ్చు ఎందుకంటే బాక్టీరియల్ కో-ఇన్ఫెక్షన్ సాధ్యమే.

11. కొత్త కరోనావైరస్ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఏదైనా నిర్దిష్ట మందులు ఉన్నాయా?
ఈ రోజు వరకు, కొత్త కరోనావైరస్ (2019-nCoV) ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి నిర్దిష్టమైన మందు సిఫారసు చేయబడలేదు. అయినప్పటికీ, వైరస్ సోకిన వారు లక్షణాల నుండి ఉపశమనం పొందటానికి మరియు చికిత్స చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  మరియు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు, సహాయక వైద్యాన్ని పొందాలి.
 
అన్నింటికంటే ముఖ్యంగా వదంతులను, వాట్సాప్ మెస్సేజులనూ నమ్మకండి. W.H.O సూచనలు పాటించండి. చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవడం, ముక్కు నోరు, కంటిని తాకకుండా ఉండటం, మూడు అడుగుల సామాజిక దూరానికి కట్టుబడి ఉండటం, తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ అడ్డుపెట్టుకొని దాన్ని డస్ట్ బిన్ లో పడేయడం చేస్తూ ఉంటే, కరోనాపై మనమంతా విజయం సాధించవచ్చు.
 
Note బై రాంబాబు గారు : పాంప్లెట్ ప్రింట్ చేయించడం కోసం, పూర్తిగా W.H.O  వెబ్సైట్ నుండి తీసుకున్న అధికారిక సమాచారంతో తయారు చేసిన రైటప్. ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. షేర్/కాపీ పేస్ట్/whatsapp చేసుకోవచ్చు. పాంప్లెట్స్ ప్రింట్ వేసుకోవచ్చు.

Link : https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/advice-for-public


శుక్రవారం, మార్చి 06, 2020

మన ఊరి రామాయణం...

దుబాయ్ లో పని చేసొచ్చి ఇండియా లో స్థిరపడిన భుజంగయ్య (ప్రకాష్ రాజ్) కి డబ్బూ అధికారం తెచ్చిపెట్టిన గౌరవం పలుకుబడీ చూసుకుని మురిసి పోతూ ఉంటాడు. ఊరంతా అంత గౌరవం ఇస్తున్న తనకి తన ఇంట్లో ఏమాత్రం విలువ ఇవ్వడం లేదనీ తన కూతురు, భార్య, అత్త గారు తన మాట వినడం లేదనే కోపంతో అస్తమానం అరుస్తూ వారి మీద అజమాయిషీ చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఆటో నడుపుకుంటూ ఎప్పటికైనా ఇతని సాయంతో దుబాయ్ వెళ్ళాలని కలలుగనే శివ(సత్యదేవ్) ఇతనికి నమ్మిన బంటు. 

గరుడ(పృథ్వీ) ఓ సినిమా డైరెక్టర్ ఇదే ఊరిలో షూటింగ్ జరుపుకుంటున్న హీరోకి కథ చెప్పడానికి వచ్చి దారిలో తన స్క్రిప్ట్ ను శివ ఆటోలో మర్చిపోతాడు. అదే రోజు రాత్రి ఇంట్లోవాళ్ళతో గొడవపడి వచ్చి తన కొట్లో ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేసిన భుజంగయ్య మరింత మందుకోసం వెళ్తుండగా ఓ వేశ్య(ప్రియమణి) కనిపిస్తుంది. ఆ బలహీన క్షణంలో ఎప్పుడూ ఇటువంటి తప్పు చేయని అతను ఆమెతో ఆ రాత్రి గడపాలనుకుంటాడు.

వాళ్ళిద్దరిని డైరెక్టర్ స్క్రిప్ట్ తో సహా కొట్లో పెట్టి బయట నుండి తాళం వేసి వెళ్ళిన శివ అనుకోని పరిస్థితులలో గరుడతో కలిసి ఓ చోట చిక్కుకు పోతాడు. తెల్లారితే చుట్టూ ఉన్న కొట్లు తెరిచి జనంతో సందడిగా ఉండే ఆ ఏరియా నుండి భుజంగయ్య పరువు పోకుండా బయటపడ గలిగాడా లేదా ? తను ఎంతగానో అభిమానించే తన గురువుని ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలోకి నెట్టిన శివ గరుడ సాయంతో ఏం చేశాడు ? గరుడకి తన స్క్రిప్ట్ దొరికిందా ? ఇలాంటి సంఘటన తర్వాత భుజంగయ్య ప్రవర్తనలోనూ ఆలోచనల్లోనూ ఏమైనా మార్పొచ్చిందా ? అనేవి తెలుసుకోవాలంటే ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో 2016 లో విడుదలైన "మన ఊరి రామాయణం" అనే సినిమా చూడాలి.

విడుదలైనపుడు అక్కడక్కడ సినిమా గురించి మంచి మాటలు వినీ ప్రమోషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించి చూద్దామనుకుని కూడా వీలు పడక చూడలేక పోయాను. నిన్న యాథాలాపంగా ప్రైమ్ లో టైటిల్స్ చూస్తూ అనుకోకుండా చూసిన ఈ సినిమా నాకో పెద్ద ప్లజెంట్ సర్ ప్రైజ్, ఇంత బావుంటుందని అస్సలు ఊహించలేదు, చాలా చాలా నచ్చేసింది. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా పాటలు ఫైట్లు లేకుండా కథమీద మాత్రమే ఫోకస్ చేసిన సినిమా ఇది. పేజీల కొద్దీ డైలాగులు చెప్పకుండానే సున్నితమైన మానవ సంబంధాల గురించీ విలువల గురించీ వీపుపై ఛెళ్ళుమనిపించి ఆలోచింపజేసే సినిమా.

కొన్ని సినిమాలు కథ తెలుసుకోడానికి, కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం మరికొన్ని సినిమాలు విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నట్లే కొన్ని సినిమాలు నటీనటుల నటన కోసం సినిమా టేకింగ్ కోసం చూడాల్సినవి ఉంటాయి. మన ఊరి రామాయణం సరిగ్గా అలాంటి సినిమానే. రెండు గంటలకు పావుగంట తక్కువే ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ అనే మాట గుర్తు కూడా రానీయదు. ఉన్నది అతి తక్కువ పాత్రలూ పరిమితమైన లొకేషన్స్ అయినప్పటికీ నటీనటులు సన్నివేశాలు కట్టిపడేస్తాయి.

చిత్రీకరణ సన్నివేశాలు ఎమోషన్స్ ఎంత సహజంగా ఉన్నాయంటే ప్రతి పాత్రా నిజజీవితంలో మనకు పరిచయమైనదే అనిపిస్తుంటుంది ఇలాంటి వాళ్ళని మనం ఎక్కడో చూశాం అని అనిపించక మానదు. అసలు మనం ఒక సినిమా చూస్తున్నామన్న విషయాన్ని మర్చిపోయి ఆ ఊరు మధ్యలో ఉండి వాళ్ళతో పాటు శివ ఆటో ఎక్కి తిరిగేస్తున్నట్లుగా ఫీలవుతాం. భుజంగయ్య లోటు పాట్లు తెలిసినప్పటికీ పాపం అతను త్వరగా బయటపడితే బావుండు అని అనిపిస్తుందంటే దానికి ముఖ్య కారణం రాసుకున్న సన్నివేశాలు వాటిని రక్తికట్టించిన నటులు దానికి తోడైన ఇళయరాజా నేపధ్య సంగీతం.

ప్రకాష్ రాజ్ ఎంత విలక్షణమైన నటుడో అందరికీ తెలిసిందే కానీ ఈ సినిమాలో పూర్తిగా భుజంగయ్యగా మారిపోయాడు. పెద్దమనిషిగా దర్పం, అహం, కోపం, ఓ బలహీన క్షణంలో తప్పువైపు మొగ్గుచూపినా ఆ తర్వాత తను పడే సంఘర్షణ, పరువు గురించి పడే తపన, స్నేహితుల అభిప్రాయాలు వింటున్నపుడు నిస్సహాయత, అహం దిగిపోయాక కుటుంబంపై కూతురిపై ప్రేమ అన్నీ తన హావభావాలతోనే మనకర్థమయేలా చేయడమే కాక తన ఎమోషన్స్ తో కనెక్ట్ అయి తన వైపు నుండి ఆలోచించేంతగా ప్రేక్షకులని ప్రభావితం చేశాడు.

ఇక జాతీయ అవార్డ్ గ్రహీత ప్రియమణిని తెలుగు సినిమా గ్లామర్ కు పరిమితం చేసింది కానీ తన ప్రతిభ ఈ పాత్ర పోషణలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది. వేశ్య పాత్ర అయినప్పటికీ ఎక్కడా అసభ్యతకి తావులేకుండా హుందాగా పోషించిన తీరు అనితరసాధ్యం అనిపిస్తుంది. అంత పెద్దమనిషిని రా అంటున్నా అతని మంచితనం గుర్తించిన తీరు చివరికి అతని ఇబ్బందిని గ్రహించి చివరికి మారి అతన్నీ మార్చిన తీరు హావభావాల్లోనే కాక బాడీలాంగ్వేజ్ లో కూడా చూపించి కట్టి పడేస్తుంది. భుజంగయ్య పరువు గురించి ఆలోచించకుండా అలవాటుగా ఫోన్ లో పెద్దగా మాట్లాడుతున్న ఆమెని చూసి మనకే "అమ్మాయ్ కాస్త చిన్నగ మాట్లాడు" అని చెప్దామా అనిపిస్తుందంటే మనకి ఆ విషయాన్ని అంతగా రిజిష్టర్ చేసిన ఈ ఇద్దరి నటనే కారణం.

అలాగే సత్యదేవ్ ఇప్పుడంటే ఎస్టాబ్లిష్డ్ నటుడుగా పేరు తెచ్చేసుకున్నాడు కానీ తన కెరీర్ మొదట్లోదనుకుంటాను ఈ సినిమా. తను కూడా ఆటో డ్రైవర్ గా భుజంగయ్య నమ్మిన బంటుగా ఒదిగిపోయాడీ సినిమాలో. తన గురు సమానంగా అభిమానించే భుజంగయ్య తన వల్ల ఇబ్బందిలో పడ్డాడని ఎలాగైనా కాపాడాలని అతను చేసే ప్రయత్నాలు చూస్తే తన తరఫున మనం కూడా దేవుడ్ని వేడుకుంటాం. సినిమా దర్శకుడు గరుడ గా చేసిన తర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా తనకి అలవాటైన లౌడ్ నెస్ ని పక్కన పెట్టి సటిల్ గా చేశాడు. ఎదుటి వారి పరిస్థితిని పట్టించుకోకుండా తన ధోరణిలో తను పిచ్చి జోకులేసే పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో రఘుబాబు కూడా ఆకట్టుకుంటాడు. ప్రకాష్ రాజ్ కూతురుగా చేసిన అమ్మాయి కూడా మెప్పిస్తుంది.

టెక్నికల్ డిపార్మెంట్ లో ముందుగా చెప్పుకోవలసింది ఇళయరాజా గారి నేపథ్య సంగీతం. సినిమాలో ఎక్కడా ప్రత్యేకంగా తెలియకుండా అంతర్లీనంగా కలిసిపోయి సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ ఎమోషన్స్ ని మనకి కనెక్ట్ చేయడానికి దోహద పడింది ఈ సంగీతమే. అలాగే థీం సాంగ్ గా చివర్లో వచ్చే పాట కూడా గుర్తుండి పోతుంది. ఆ తరువాత స్థానం ఛాయగ్రహణం అందించిన ముఖేశ్ గారిది మనల్ని థియేటర్ల నుండీ సోఫాసెట్ ల నుండీ అలా అలవోకగా తీస్కెళ్ళి ఈ ఊరి మధ్యలో నిలబెట్టేశాడంటే ఆ గొప్పతనం ఇతనిదే. సినిమా ఏదైనా నిజమైన ఊర్లో చిత్రీకరించారో స్టూడియో సెట్స్ లోనా అన్నది తెలియదు కానీ సెట్స్ అయితే మాత్రం ఆర్ట్ డైరెక్టర్ శశిధర్ అడవి నీ మెచ్చుకుని తీరాలి.

మొత్తం మీద చూసినంత సేపూ ఉత్కంఠతో నటులతో పాటు ప్రయాణించి ముగిసాక ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతిని మిగిల్చే సినిమా "మన ఊరి రామాయణం". 2016 లో విడుదలైనపుడు మిస్సయిన వాళ్ళు ఈ సినిమా ఈ వారమే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది తప్పక చూడండి. రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చేమో కానీ వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళూ మిస్సవకుండా చూడవలసిన సినిమా ఇది. ఈ సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.

ఈ సినిమా లో ఉన్న ఒకే ఒక్క పాట భాస్కరభట్ల గారు చాలా చక్కగా రాశారు. థీమ్ సాంగ్ అనవచ్చు ఇది కూడా ఎండ్ క్రెడిట్స్ లో వస్తుంది. ఆ సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. మేకింగ్ వీడియో లో ఈ పాట ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మన ఊరి రామాయణం (2016)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : ఇళయరాజా, నిహాల్ 

ఏవేవో ఏవేవొ
చూస్తూనే ఉంటాం
మనలోని లోపం తప్పా

ఏమేమొ ఏమేమొ
మాటాడుతుంటాం
పనికొచ్చే విషయం తప్పా...
భలే చెప్పావ్

చెవులారా వినుకోండి
మనసారా చెబుతా
మన ఊరి రామాయణం ఆఆఆఆఆ..
ఇది మనలోని రామాయణం ఆఆఆఆఆ..
మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం

పైకేమో శ్రీరామచంద్రుడులా ఉంటాం
ఎనలేని దయ చూపుతాం
అవకాశం దొరికిందో అవతారం మార్చి
రావణుడై చెలరేగుతాం
సహనంలో శాంతంలో కరుణించడంలో
కనిపిస్తాం సీతమ్మలా
సాదింపులు వేదింపులు బెదిరింపుల్లోన
సరిపోతాం శూర్పణఖలా
లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం
ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోసం
ఉసురే కసిరే వరకూ తెగదీ జంఝాటం

మన ఊరిరామాయణం ఆఆ...ఆఅ
ఇది మనలోని రామాయణం ఆఆఆ...

మన శక్తిని మనకెవ్వరొ చెప్పేంతదాకా
కూర్చుంటాం హనుమంతుడిలా
మసిపూసే మంధరల మాటలకే బాగా
ఊ కొడతాం కైకేయిలా
ఆ కుంభకర్ణుడిలా నిదురోతు ఉంటాం
మన చుట్టూ ఏమైనా కాని
మధమెక్కిన మైకంలో తెగవాలిపోతాం
వావీవరసలు అన్నీ మాని
మెరపెట్టిన తిరిగొచ్చున పరిగెట్టిన కాలం
పగపట్టద పనిపట్టద పడగెత్తిన లోకం
మనలో చెడుపై మనమే చేద్దాం పోరాటం

మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం

ఏమేమొ ఏమేమొ
మాటాడుతుంటాం
పనికొచ్చే విషయం తప్ప
చెవులారా వినుకోండి
మనసారా చెబుతా

మన ఊరి రామాయణం ఆఆ...
ఇది మనలోని రామాయణం ఓఓఓ...
మన ఊరి రామాయణం ఆఆ..
ఇది మనలోని రామాయణం ఓఓఓ..

బుధవారం, మార్చి 04, 2020

హిట్ - ది ఫస్ట్ కేస్...

స్క్రిప్ట్ సెలెక్షన్ లో నానీది మంచి అభిరుచి అనేది అందరికీ తెలిసినదే అలాంటి నటుడు తనే సొంతంగా నిర్మిద్దామనుకున్నపుడు ఇంకెంత వైవిధ్యమైన స్క్రిప్ట్ ఎన్నుకుంటాడో తను నిర్మించిన మొదటి సినిమా ’ఆ!’ తోనే నిరూపించేశాడు. ఇపుడు తీసిన రెండవ సినిమా ’హిట్’ కూడా అలాగే రొటీన్ ఫార్ములా సినిమాలంటే మొహం మొత్తేసిన వాళ్ళని ఆకట్టుకునే స్క్రిప్ట్. దానికి సరిగ్గా సరిపోయే హీరో విశ్వక్ సేన్ కూడా తోడవడంతో సినిమా పేరులో ఉన్న హిట్ సినిమా ఫలితంలో కూడా కనిపించింది.

హిట్ (Homicide Intervention Team) లో పని చేస్తున్న ఇంటెలిజెంట్ అండ్ ఎఫీషియంట్ ఆఫీసర్ విక్కీ(విశ్వక్ సేన్) తనని వెంటాడుతున్న కొన్ని జ్ఞాపకాల వల్ల పానిక్ అటాక్ కు గురవుతుంటాడు. దాని వలన బీపి పెరిగిపోయి లైఫ్ రిస్క్ ఉందని తను చేస్తున్న జాబ్ లో అలాంటి అవకాశాలు ఎక్కువున్నందున జాబ్ మానేయమని లేకపోతే కనీసం కొన్ని రోజులు శలవన్నా తీస్కోమని తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ సలహా ఇస్తుంది. ఇది తెలిసిన తన ప్రియురాలు నేహ(రుహాని శర్మ) వత్తిడి చేయడంతో ఆర్నెలలు శలవు తీస్కుంటాడు.

శలవులో సిటీకి దూరంగా ఉన్న విక్కీకి ఒక రోజు నేహ మిస్సింగ్ అని తెలుస్తుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న నేహ మిస్సయ్యే సమయానికి ’ప్రీతి’ అనే అమ్మాయి మిస్సింగ్ కేస్ మీద పనిచేస్తూ ఉందని తెలుస్తుంది. ఆ కేస్ సాల్వ్ చేయగలిగితే నేహ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలియచ్చని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు.

ఇన్వెస్టిగేషన్ లో లోతుకు వెళ్ళే కొద్దీ ప్రీతితో సంబంధమున్న ప్రతి ఒక్కరు అనుమానితులలాగానే కనిపిస్తుంటారు. విక్కీ అనుకున్నట్లు ఈ రెండు మిస్సింగ్ కేస్ లలో ముద్దాయి ఒకరేనా అసలు ఈ రెండు కేస్ లను తను ఎలా సాల్వ్ చేశాడు, ప్రీతి అండ్ నేహా ఏమయ్యారు అనేది తెలియాలంటే మీరు ’హిట్’ సినిమా చూడాలి. 

ఇన్వెస్టిగేషన్ ని ప్రతీ స్టెప్పూ సహజంగా చాలా డీటేయిల్డ్ గా ఆసక్తికరంగా చూపించారీ సినిమాలో ఐతే అందులో భాగంగా మరీ కుళ్ళిన శవాన్ని కూడా అంత క్లోజప్ లో చూపించడం ఒకటి రెండు సీన్లలోనే ఐనా కాస్త కడుపులో తిప్పేస్తుంది. చాలా సినిమాల్లో చూపించే పోలికలని బట్టి బొమ్మని గీసే పోలీస్ ఆర్టిస్ట్ సీన్ ఇందులో చాలా రియలిస్టిక్ గా అనిపించింది నాకు. చెప్పాలనుకున్న కథపై ఫోకస్ తప్ప ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళకుండా తీయడం బావుంది.

టెక్నికల్ డిపార్ట్మెంట్ లో నేపధ్య సంగీతం ముందుంటుంది. సినిమా మూడ్ కి తగినట్లు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. దర్శకుడు శైలేష్ కొలను రాసుకున్న స్క్రిప్ట్ బావుంది కానీ కొన్ని చోట్ల నాలాంటి తెలివి మీరిన సగటు తెలుగు ప్రేక్షకుడికి ఇతను ట్విస్టులకోసం ఇంకా ఆడియన్స్ ని డైవర్ట్ చేయడానికి ప్రయాస పడుతున్నాడు అని అర్ధమయ్యేలా ఉంది. 

అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మనం ఒక క్లైమాక్స్ ను ఊహించేలా సినిమాను డ్రైవ్ చేస్తూ అస్సలు ఊహించని క్లైమాక్స్ తో ఎండ్ చేయడం కొందరిని ఆకట్టుకోవచ్చు. మరికొందరికి ఇన్వెస్టిగేషన్ లో ఇస్తున్న బిల్డప్ చూసి చివరికి సస్పెన్స్ రివీల్ చేసినపుడు ఓస్ ఇంతేనా అని అనిపించవచ్చు. దానికి ముందే ప్రిపేర్ అయి వెళ్తే ఈ సినిమా మీకు ఇంకా బాగా నచ్చుతుంది.

నటీనటులలో విశ్వక్ శేన్ ఈ పాత్రలో ఒదిగి పోయాడు. తన ఆటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకి బాగా సూట్ అయ్యాయి. హీరోయిన్ రుహానీ శర్మకి రోల్ తక్కువే కానీ తనలో ఏదో తెలియని ఛార్మ్ ఉంటుంది. "ఆ ఏముందీ అమ్మాయిలో" అనుకునేంతలో చిన్న చిరునవ్వు నవ్వి "ఏదో ఉందీ అమ్మాయిలో" అనిపించేసుకుంటుంది. కనిపించిన కాసేపు ప్లీజింగ్ గా ఉంది. హరితేజకి ఈ రోల్ డిఫరెంట్, తను కూడా బాగా చేసింది. భానుచందర్ గారిని చాలా రోజుల తర్వాత చూడ్డం బావుంది. ఇంకా విక్కీతో పోటీపడే మరో ఆఫీసర్ అండ్ విక్కీ అసిస్టెంట్ గా చేసిన మరో నటుడు ఇద్దరు కూడా గుర్తుండి పోతారు.

ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ గురించి ఎక్కువ చెప్తే థ్రిల్ మిస్సవుతారు కాబట్తి ఎక్కువ రాయలేకపోతున్నాను. ఈ జెనర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒక సారి తప్పక చూడాల్సిన సినిమా హిట్. ఈ సినిమా టీజర్ ఇక్కడ  థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ మరియూ స్నీక్ పీక్ ఇక్కడ చూడవచ్చు.

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

భీష్మ...

త్రివిక్రం గారి ప్రియ శిష్యుడు వెంకీ కుడుముల ఇంటిల్లి పాది హాయిగా నవ్వుకుంటూ చూసొచ్చేలా తీసిన సినిమా భీష్మ. సినిమాలో అక్కడక్కడ మనం త్రివిక్రమ్ సినిమా చూస్తున్నామా లేక వెంకీ కుడుముల సినిమా చూస్తున్నామా అనిపిస్తుంటుంది. చిత్రమైన విషయమేంటంటే ఇదే దర్శకుని మొదటి సినిమా ’ఛలో’ చూసినపుడు ఇలాంటి ఆలోచన రాలేదు. అది చాలా రిఫ్రెషింగ్ గా కొత్తగా ఉంటుంది కానీ ఈ సినిమాలో మాత్రం గురువు గారి ప్రభావం బాగా కనిపించింది.బహుశా ఎన్నుకున్న స్క్రిప్ట్ వల్లేమో.

ఏదైనా కానీ అలవైకుంఠపురం లానే ఈ సినిమా కూడా అద్యంతం హాస్యంలో ముంచి తేలుస్తుంది. దానితో పాటు ఎరువులు పెస్టిసైడ్స్ లాంటి కెమికల్స్ ఉపయోగించకుండా చేసే ఆర్గానిక్ ఫార్మింగ్ / సహజ సిద్దమైన సేద్యం గురించి కూడా ప్రజల మనసుల్లో నాటుకునేలా చెప్తుంది. 

కథ విషయానికి వస్తే సేంద్రియ వ్యవసాయాన్ని (ఆర్గానిక్ ఫార్మింగ్) ప్రోత్సహిస్తూ రైతులకి ప్రజలకి మధ్య ఒక బిజినెస్ మాన్ గా కాక విలువలను నమ్మిన వారధిగా వ్యవహరిస్తూ ఉంటారు భీష్మ ఆర్గానిక్స్ వ్యవస్థాపకులు భీష్మ(అనంత నాగ్). వారసులు లేని తన తదనంతరం సి.ఇ.ఓ గా ఎవర్ని నియమించేదీ తన కంపెనీ యాభయ్యవ వార్షికోత్సవం రోజు ప్రకటిస్తానని చెప్తారు. మరోపక్క ఫీల్డ్ సైన్స్ ఎం.డీ. రాఘవన్ (జిష్షూ సేన్ గుప్తా) తక్కువ సమయంలో అధిక ఉత్పత్తి సాధించే ఒక ఇన్స్టంట్ కెమికల్ కిట్ తయారు చేసి వ్యాపారాభివృద్ధి కోసం భీష్మా ఆర్గానిక్స్ కంపెనీని భూస్థాపితం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.

ఇదిలా ఉంటే మహాభారతంలో అన్ని పాత్రలున్నా ఆజన్మ బ్రహ్మచారి భీష్మ అనే పేరు పెట్టడం వల్లే తనకి ఏ అమ్మాయి ఓకే చెప్పడం లేదని తను కూడా సింగిల్ ఫరెవర్ గా మిగిలి పోవాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటాడు భీష్మ (నితిన్). అలాంటి టైమ్ లో తనకి భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తున్న చైత్ర (రష్మిక) పరిచయమౌతుంది. తన పేరు మీద ఓ కంపెనీ ఉందా అని ఆశ్చర్య పడిపోయిన భీష్మ చైత్రని ఇంప్రెస్ చేయడానికి ఆమెకి ఇష్టమైన ఆర్గానిక్ ఫార్మింగ్ గురించిన పుస్తకాలు చదువుతాడు.

ఆ కాస్త నాలెడ్జ్ తో అతను ఓ ప్రెస్మీట్ లో మాట్లాడిన నాలుగు మాటలు డిగ్రీ డ్రాపౌట్ అయిన అతనిని ఆ కంపెనీ సి.ఇ.ఓ కుర్చీలో కూర్చోబెడతాయి. అతనిని నమ్మి ఆ అవకాశం ఇచ్చిన సీనియర్ భీష్మ నెలరోజుల్లో తన నమ్మకం సరైనదేనని నిరూపిస్తే అసలు తను ఎందుకు అతన్ని సెలెక్ట్ చేశాడో చెప్తానని చెప్తాడు. మన యంగ్ భీష్మ ఫీల్డ్ సైన్స్ రాఘవన్ ప్రయత్నాలని ఎలా తిప్పికొట్టాడు, తనని తాను నిరూపించుకుని కంపెనీని చైత్ర ప్రేమనీ ఎలా గెలుచుకున్నాడో తెలియాలంటే మీరు భీష్మ సినిమా చూడాలి.

నితిన్ కి ఇలాంటి రోల్స్ బాగా సూట్ అవుతాయ్ చాలా ఈజ్ తో చేసేస్తాడు. ఈ సినిమాలో మరింత కాన్ఫిడెంట్ గా కంఫర్టబుల్ గా కనిపించాడు. రష్మిక క్యూట్ గా అందంగా కనిపించడమే కాక సీ.ఈ.ఓ కి రైట్ హాండ్ గా కాన్ఫిడెంట్ గర్ల్ రోల్ లో ఆకట్టుకుంటుంది. అనంతనాగ్ గారిని చూడడం బావుంది. వెన్నెలకిషోర్ రోల్ బాగా నవ్విస్తుంది అలానే తను రఘుబాబు కాంబినేషన్ లో సీన్స్ కూడా నవ్విస్తాయి. సంపత్ రోల్ కూడా బావుంది తను నితిన్ కాంబినేషన్ సీన్స్ కూడా నవ్విస్తాయ్ చాటింగ్ సీన్ బాగా నవ్విస్తుంది. అలానె కార్పొరేట్ విలన్ పాత్రలో జిష్షూసేన్ గుప్తా ఆకట్టుకున్నాడు. అజయ్ రోల్ గుడ్ సర్ప్రైజ్ అండ్ ఎంటర్ టైనింగ్.

టెక్నికల్ డిపార్ట్మెంట్ లో సంగీతం కాస్త వీక్ గా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ బావున్నాయ్. ఫైట్స్ కొన్ని త్రివిక్రమ్ సినిమాలని తలపించాయి. డైలాగ్స్ విషయానికి వస్తే గుర్తుండి పోయే డైలాగ్స్ కోట్స్ గా మిగిలిపోయే డైలాగ్స్ తక్కువే కానీ చూసినంత సేపు సిట్యుయేషన్ కి తగ్గట్టు గిలిగింతలు పెడుతూ నవ్విస్తూ ఉంటాయ్.

"నలుగురు ఫ్రెండ్స్ కలిసి రోడ్ మీద దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రనా బాధ్యత లేదనుకుంటే ఎలా" లాంటి డైలాగ్ ఇంకా స్కూల్ బెల్ ని ఉదాహరణగా చూపిస్తూ ఒపీనియన్స్ సిట్యుయేషన్ ని బట్టి మారతాయని చెప్పే డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి.

"నా లవ్వు కూడా విజయ్ మాల్య లాంటిదేరా కళ్ళముందు కనిపిస్తుంది కానీ క్యాచ్ చేయలేం." లాంటి కాంటెపరరీ కామెడీ డైలాగ్స్, "మోర్నింగ్ టూ ఎగ్స్ ఈవెనింగ్ టూ పెగ్స్ నైట్ టూ లెగ్స్ అదేనయ్యా ప్రోటీన్స్ కోసం చికెన్ లెగ్స్" లాంటి నాటీ డైలాగ్స్ విన్నప్పుడు కొన్ని రొటీన్ సీన్స్ ని కామికల్ వే లో కన్సీవ్ చేయడం చూస్తే దర్శకుడి వెంకీ సెన్సాఫ్ హ్యూమర్ ని మెచ్చుకోకుండా ఉండలేం. 

మొత్తంమీద పెట్టిన టిక్కెట్ డబ్బులకు న్యాయం చేస్తూ ఇంటిల్లిపాదీ హాయిగా కలిసి కూర్చుని ఎంజాయ్ చేయగల క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ భీష్మ. ఇలాంటి లైటర్ వీన్ సినిమాలని ఇష్టపడేవాళ్ళు మిస్సవకుండా చూసేయండి. ఈ సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.

శుక్రవారం, ఫిబ్రవరి 21, 2020

కోటప్పకొండ తిరణాల జ్ఞాపకాలు...


శివరాత్రి అనగానే అందరికీ ఆ పరమశివుడు, ఉపవాస జాగారాలు గుర్తు రావడం సహజమే కానీ మా నర్సరావుపేట వాళ్ళకి మాత్రం శివరాత్రి అనగానే ముందు కోటప్ప కొండ తిరణాళ్ళే గుర్తొస్తుంది. దక్షయజ్ఞం తర్వాత పన్నెండేళ్ళ బాలుడిగా దక్షిణామూర్తి అవతారంలో త్రికూటాచలమైన మా కోటప్ప కొండపై వెలిశారట ఆ పరమశివుడు.

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా.. కన్నెపిల్ల కనిపిస్తే నాకోసం పడిఛస్తే నూటొక్క టెంకాయ కొడతానని మొక్కుకున్నా అని దాసరి గారు పాట రాసేశారు కానీ మా కోటయ్య బ్రహ్మచారి దేవుడు. అందుకే ఈ కొండమీద కానీ గుడిలో కానీ పెళ్ళిళ్ళు చేయరట. ఇక్కడి గుడి ముందు ద్వజస్తంభం కూడా ఉండదు. ఇంకా గుళ్ళలో ప్రసాదాలంటే లడ్డూలే గుర్తొస్తాయి కదా మా కోటప్పకొండ ప్రత్యేక ప్రసాదం నేతి అరిశలు. సాధారణంగా సంక్రాంతి రోజుల్లో తప్ప మిగిలిన టైంలో అంతగా వండుకోని ఈ నేతి అరిశలని గుళ్ళో ప్రసాదంగా భక్తులకు పంచి పెట్టడం నాకు తెలిసి ఇంకెక్కడా లేదు మా కోటప్పకొండలో తప్ప. 

కాకులు దూరని కారడవిని గురించి కథల్లో విని ఉంటారు కదా మా కోటప్ప కొండ కాకులు వాలని కొండ. గొల్లభామ శాపం వలన ఆ చుట్టుపక్కలెక్కడా ఒక్క కాకికూడా కనిపించదు. అలాగే తిరునాళ్ళ అయ్యాక కొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రద్దీ వలన పేరుకున్న చెత్త అంతా కొట్టుకు పోయి కొండ శుభ్రపడడం కూడా ఓ వింతట. ఇలాంటి వింతలూ వాటి వెనుక స్థలపురాణం, ఇంకా బోలెడు విశేషాలు, ఫోటోలతో సహా మా నరసరావుపేట్రియాట్స్ బ్లాగ్ లో ఒకప్పుడు సుజాత గారు రాసిన టపాలో ఇక్కడ చదవి మీరూ తిరణాళకి వెళ్ళొచ్చిన అనుభూతి చెందచ్చు. అలాగే మా కోటప్పకొండ గురించి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన డాక్యుమెంటరీ వీడియో ఇక్కడ చూడవచ్చు.

త్రికోటేశ్వరుడని కూడా పిలుచుకునే మా కోటయ్యంటే మాకు అమితమైన భక్తి. ఆ భక్తి తో పాటు తిరనాళ్ళంటే కూడా బోల్డంత అనురక్తి. ఐతే నేను కొండమీదకి వెళ్ళి స్వామిని దర్శించుకున్నది నాకు గుర్తుండీ రెండు మూడు సార్లకన్నా ఎక్కువ లేదు. మేం నర్సరావుపేటలో ఉన్న నా చిన్నతనంలో పండగంటే నా  ఎదురు చూపులూ, నా పండగ అంతా ఊర్లో జరిగే హడావిడి గురించే ఉండేది. 

శివరాత్రి వెళ్ళాక శివశివా అనుకుంటూ చలి కూడా పారిపోతుందని మా అమ్మ చెప్పేది. కానీ ఒక్కోసారి పండగ పది రోజులుందనగానే చలి పారిపోయేది. ఇక అప్పుడపుడే మొదలయ్యే ఎండాకాలం ఉక్కపోతలో ఈత లేదా తాటాకు తో చేసిన విసనకర్రలతోనో మడతేసిన న్యూస్ పేపర్లతోనో విసురుకుంటూ అబ్బా ఈ సారి తిరనాళ్ళలో ఓ కొత్త విసనకర్ర కొనాల్రా ఇది బాగా పాతపడిపోయింది అని గుర్తు చేస్కుంటున్నామంటే తిరనాళ్ళ హడావిడి మొదలై పోయినట్లే.

విసనకర్రలకి తిరనాళ్ళకి ఏంటీ సంబంధం అంటారా. ఒకటి తిరనాళ్ళ టైమ్ లో పండగరోజు ఆ రాత్రి కోటప్ప కొండ దగ్గర ఉండే విశాలమైన మైదానంలో పెట్టని కొట్టూ దొరకని వస్తువూ ఉండేది కాదు. పండగ మర్నాడు వాటిలో చాలా కొట్లు తీస్కొచ్చి నర్సరావుపేటలో పెట్టేవారు. మార్కెట్ ఏరియా, చిత్రాలయ దగ్గర మొదలుపెట్టి కోటప్పకొండ రోడ్ లో చాలా దూరం రోడ్డు పక్కన ఈ తాత్కాలిక షాపులు వెలిసేవి. పండగకి రెండు మూడు నెలల ముందునుండే మాకు ఏం కావాలని అడిగినా "తిరణాలలో కొనుక్కుందాంలేరా" అనేసి వాయిదా వేసేసేది అమ్మ.

ఇక అసలు విసనకర్రలు ఎందుకు గుర్తొచ్చాయంటే శివరాత్రికి రెండు రోజుల ముందు నుండే ప్రభలు కొండ దగ్గరకి బయల్దేరేవి అవి ఊరుదాటేప్పుడు తిరిగి వచ్చేటప్పుడూ వాటికోసమని ఆ దారి కవర్ అయ్యే ఏరియాల్లో అన్నిట్లోనూ పగలంతా కరెంట్ తీసేసేవారు. దాంతో శివరాత్రి అంటే తిరణాల సంబరాలతో పాటు నాకు కరెంట్ కష్టాలు కూడా గుర్తొచ్చేవనమాట. ఇపుడు బహుశా ఊరు చుట్టూ రహదారి మార్గం హైటెన్షన్ వైర్లని తప్పించుకువెళ్ళే మార్గం ఏర్పాటు చేస్కుని ఉండి ఉంటారేమో కానీ ఓ ముప్పై ఏళ్ళ క్రితం మాత్రం ఇంతే ఉండేది.  

మా కోటప్పకొండ తిరణాళ్ళలో ముఖ్యమైన అట్రాక్షన్ ప్రభలు. టూ డైమెన్షనల్ గుడి గోపురాన్ని గుర్తు చేస్తూ డెబై ఎనభై అడుగుల ఎత్తులో ఆకాశాన్నంటుతున్నట్లుగా దీర్ఘ చతురస్రాకారంలో ఒక వెడల్పాటి వెదురు పట్టా. దాని పైన త్రికోణపు శిఖరం ఉండి రకరకాల అలంకరణలతో తీర్చి దిద్దేదానినే ప్రభ అని అంటారు. దానికి పైనుండీ నిలువెల్లా తాళ్ళు కట్టి నేలమీదనుండే ముందుకు వెనక్కు లాగడానికి వీలుగా అరేంజ్మెంట్ చేసిన దానిని సైజ్ బట్టి ఎడ్లబండి మీదో ట్రాక్టర్ మీదో నిలబెట్టి కొండకి తరలిస్తారు. వీటిలో అరచేతిలో ఇమిడి పోయే పిల్లల ప్రభలనుండి వంద అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బల్బులతో అలంకరణలతో మెరిసిపోయే భారీ ప్రభల వరకూ ఉంటాయి.

నా చిన్నతనంలో వీటిని చూడ్డానికి మా నాన్న గారి చేయి పట్టుకుని చిత్రాలయ దగ్గరకి వెళ్ళడం ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడ ఆ జనం హడావిడిలో వందలమంది ఉన్నా క్రమశిక్షణతో ఏ తొక్కిసలాట లేకుండా ప్రభలను జాగ్రత్తగా తీస్కెళ్ళేవాళ్ళు. గులామ్ లు చల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ డాన్సులు వేసుకుంటూ వీటిని తీస్కెళ్ళే జనాన్ని ఆ కోలాహలాన్ని చూడ్డానికి నాకు రెండు కళ్ళూ సరిపోయేవి కాదు. ఇక కొండదగ్గరైతే చుట్టూ విశాలమైన మైదానంలో ఇసకేస్తే రాలనట్లుగా ఎటు చూసినా జనం, వాళ్ళమధ్యలో అక్కడక్కడా నుంచుని పైకి ఠీవిగా చూసే వందల కొద్ది ప్రభలను ఒకే చోట చూడడం ఓ అద్భుతం అంతే.

ఇలా ముందు రోజు సాయంత్రం ప్రభలను చూడ్డానికి వెళ్ళడం ప్రతి పండగకీ ఉంటుంది. ఒక సంవత్సరం మాత్రం నాన్నగారితో కలిసి కోటప్ప కొండ తిరణాలకి వెళ్ళడం ఒక మరిచి పోలేని అనుభవం. మామూలుగా ఉండే బస్ స్టాండ్ కి కొంచెం దూరం గా ఒక పెద్ద గ్రౌండ్ లో ప్రత్యేకం గా కర్రలతో కట్టిన క్యూలు, జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులూ వాలంటీర్లు ఏర్పాటు చేసి గుడి దగ్గరకి వెళ్ళే బస్సులకోసం ప్రత్యేకంగా ఓ మినీ బస్టాండ్ కట్టేసేవారు ఆ కొద్ది రోజులు. ఇక అక్కడ వాలంటీర్లు పోలీసులు చేసే హడావిడి ఆ ఎఱ్ఱ బస్సులు అవన్నీ ఓ అద్భుతమే అప్పట్లో.  

ఇప్పుడంటే కోడెల శివప్రసాద్ గారి పుణ్యమా అని ఘాట్ రోడ్ ఉంది కానీ అప్పట్లో మెట్ల మార్గమొక్కటే ఉండేది. ఇక రాత్రిపూటే కొండ దిగువకు బస్సులో చేరుకుని నాన్నతో కలిసి ఆపసోపాలు పడుతూ మెల్లగా కొండ ఎక్కడం. మధ్య మధ్యలొ గొల్లభామ గుడి గురించి ఆ స్థలపురాణాల గురించి నాన్న గారి మాటల్లో వినడం భలే ఉండేది. దర్శనమయ్యాక ఎపుడో రెండు మూడింటపుడు మళ్ళీ కొండదిగి కింద ఉన్న హడావిడి అంతా కాసేపు కలియ తిరిగుతూ చూసేసే వాళ్ళం.

మొత్తం మీద రాత్రంతా నిద్రమేలుకుని అక్కడక్కడే తిరిగేసి తెల్ల వారు ఝామున విపరీతమైన నిద్ర మత్తుతో జోగుతూ తిరుగు బస్ లో ప్రయాణం మొదలు పెట్టేవాళ్ళం. తెల్లగా తెల్లారాక పొద్దున్న పూజ అయ్యే వరకూ నిద్ర పోకూడదురా అని అంటూ నాన్నగారు నన్ను నిద్ర పోనివ్వకుండా బస్సు వెళ్తుంటే ఆ చుట్టు పక్కల తగిలే ఊర్లను చూపిస్తూ వాటి గురించి, అక్కడ వాళ్ళ అలవాట్ల గురించి, కొండ గురించి, తిరణాల గురించి, బస్ గురించి, కండక్టరు గురించీ, డ్రైవరు అదే పనిగా ఉపయోగించే గేర్ రాడ్ గురించీ ఒకటేమిటి సమస్తం కబుర్లు చెప్తూ నన్ను ప్రశ్నలు వేస్తూ మెలకువతో ఉంచేవారు.

ఇంటికి వచ్చాక సాయంత్రం కొనాల్సిన బొమ్మల గురించి ప్రాణాలికలు వేసుకుంటూ, అంతక్రితం ఏడాది స్కూల్ లో ఫ్రెండ్స్ దగ్గర చూసినవి, నిన్న రాత్రి కొండ దగ్గిర చూసినవి బోలెడన్ని బొమ్మలు గుర్తు చేసుకుంటూ వాటిలో ఏఏ బొమ్మలు ఖచ్చితంగా కొనాలో మనసులోనే టిక్ పెట్టేసుకుంటూ స్నాన పానాదులు ముగించేసి, "సాయంత్రం బోలెడన్ని మంచి బొమ్మలు ఒక్క కొట్లోనే అదీ మేం రిక్షా దిగిన దగ్గరలోనే దొరికేలా చూడు స్వామి" అని భక్తిగా ఈశ్వరుడికి దండం పెట్టేసుకుని బజ్జుంటే మళ్ళీ మధ్యాహ్నం భోజనానికే అమ్మ నిద్ర లేపేది. 

అలా వేసుకున్న ప్రణాళికలన్నీ గల్లంతవుతూ తీరా అక్కడికి వెళ్ళాక ఆ మోడల్స్ మారిపోవడమో వేరే కొత్త కొత్త బొమ్మలు వచ్చేయడమో జరిగేది. ఇంక అన్ని కొట్ల మధ్య అన్ని బొమ్మల లోంచి ఓ నాలుగైదు బొమ్మలు కొనుక్కోవాలంటే ఏం కొంటాం చెప్పండి. అందుకే నాకు అర్ధం కాక ఒకోసారి ఆ బాధ్యత నాన్నారికే అప్పచెప్పి తను కొనిచ్చిన బొమ్మలే కొనుక్కునే వాడ్ని. ఆ బొమ్మలన్నీ అంతగా గుర్తులేవు కానీ వాటితో పాటు ప్రతీ తిరణాలలోనూ ఓ బుల్లి మౌతార్గాన్, మరో బుల్లి పిల్లంగ్రోవి మాత్రం ఖచ్చితంగా కొనుక్కునే వాడ్ని.

ఇక బొమ్మలు కొన్నాక అమ్మ కోసం గాజులు, బొట్టుబిళ్ళలు, ఇంట్లోకి పసుపు, కుంకుమ లాంటివి తప్పకుండా కొనేవాళ్ళం వాటి సెలక్షన్ అంతా నాన్నదే అనుకోండి. ఆ తర్వాత మన ప్రయారిటీ తిండిమీదుండేది తిరణాలలో దొరికే తిండ్లంటే ఖచ్చితంగా బూందీ, పూసమిఠాయి(కరకజ్జం), పంచదార బెండ్లు, పంచదార చిలకలు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా బెండ్లు తిరణాలలో తప్ప మాములు స్వీట్ షాప్స్ లో ఇంకెక్కడా దొరకవు. ఇవయ్యాక తిరణాళ్ళ షాపింగ్ లో మరిచిపోకుండా ఇంటికి తిరిగి వచ్చేముందు ముఖ్యంగా కొనాల్సింది చెఱకు గెడలు.

అసలు చెఱకు తో నా ప్రణయం ఈనాటిది కాదు మొదటి సారి కోటప్ప కొండ తిరునాళ్ళలోనే మొదలైంది. ఆరోజు నుండీ ఈ రోజు వరకు ఆ ప్రేమ దిన దిన ప్రవర్ధమానమౌతున్నదే కానీ కొంచెం కూడా తగ్గలేదు. కోటప్పకొండ తిరణాళ్ళకు అప్పట్లో ఎక్కడ నుండి తెప్పించే వారో కానీ చెఱకు గెడలు భలే రుచిగా ఉండేవి. సాక్షాత్తు ఉయ్యూరు చక్కెర ఫాక్టరీకి వెళ్ళి తిన్నా కూడా ఆ రుచి మాత్రం నాకు ఇంకెక్కడా దొరకలేదు. 

నిలువెత్తు పెరిగి నిలువెల్లా నల్లగా నిగనిగలాడుతూ, ఆభరణాలు వేసుకున్నట్లు కణుపుల దగ్గర మాత్రం నలుపు తెలుపుల్లో మెరిసిపోతూ చూడటానికే అధ్బుతంగా ఉండేవి. ఇక వాటిలో ఒక మాంచి గడలు ఒక రెండు మూడు నాన్న ఎన్నుకుని వాడికి చెప్పగానే వాడు పదునైన కొడవలితో వాటిని ముక్కలు కొడుతుంటే చూడాలీ. కళ్ళప్పగించి చూస్తున్న నన్ను నాన్నారు "కొడవలి జారుతుందమ్మా" అని ఓ మూడు అడుగులు దూరంగా నించో బెట్టేవారు. అయినా అంతదూరం రసం చిమ్మి ఎగిరి వచ్చి మీద పడేది దానికి తోడు కమ్మని వాసన కూడా చుట్టు ముట్టి తన్మయంలో ముంచేసేది. ఇక ఆ ముక్కలని పొడవాటి ఆకుతో కట్టకట్టించుకుని ఎప్పుడెపుడు ఇంటికి చేరతామా అని ఎదురు చూసే వాడ్ని.

ఇంటికి వచ్చాక కొన్న బొమ్మలని అన్నిటిని అమ్మకి ఎలా ఆడుకోవాలో డిమాన్స్ట్రేట్ చేసి చూపించేసి ఆ తర్వాత చెఱకు పిప్పి వేయడానికి ఓ న్యూస్ పేపర్ పరుచుకుని దాని ఎదురుగా మఠం వేసుకుని కూర్చుని ఓ చెరుకు గెడ ముక్క చేతికందుకునే వాడ్ని. ఆ చెఱకు ముక్క ఒక చివర కచక్ మని కొరికి సర్ర్‍ర్‍ర్ర్ మంటూ చప్పుడొచ్చేలా ఒకేసారి 3-4 కణుపులు మీదుగా ఊడొచ్చేలా చెక్కును లాగేసి. ఆ క్రమంలో దానికి ఎక్కడైనా ఎక్కువ కండ పట్టిందేమో చూసుకుని ఒక వేళ పడితే దాన్ని కూడా నమిలేసి, రసం పీల్చేసే వాడిని. 

అలా చెఱకు అంతా ఒలిచాక ఓ చివర ఒక లావుపాటి ముక్కను కొరికి దవడ పళ్ళ మధ్యలో పెట్టి గాట్టిగా ఒక సారి నొక్కగానే... నా సామిరంగా... పళ్లమధ్య నుండి చెఱకురసం దాని కమ్మదనం స్లో మోషన్ లో ఒక్కో చినుకులా రాలి, నదులుగా మారి, వరదలై పొంగి, ప్రవాహమై నాలుకపై టేస్ట్ బడ్స్ ని నిలువెల్లా ముంచెత్తుతుంటే... ఆహా... ఆ ఆనందం అనుభవించాలే కానీ మాటలలో చెప్పతరమా... చిన్నతనంలో నాణ్యమైన చెఱుకు ముక్కల రుచి చూసిన వాళ్ళకే అర్ధమవుతుంది ఆ అలౌకిక ఆనందం. అలా తిరణాళ్ళ సంబరానికి తీయని చెఱకుతో శుభం పలికేసి తెల్లారో మరి రెండ్రోజులకో మొదలయ్యే స్కూల్లో మనం ఈ విశేషాలన్నీ ఎలా చెప్పాలా దానికి ఒక్కో ఫ్రెండూ ఎలా రియాక్ట్ అవుతాడా అని ఊహించుకుంటూ నిద్రలోకి జారుకోవడమే.

పంచదార బెండ్లు ఇలాగే ఉండేవి.
అన్నట్లు ఇప్పటిలా టీవీలూ, యూట్యూబ్ లు, ఓటీటీ ప్లాట్ ఫాం లు, వందల కొద్ది ఛానెల్స్, మొబైల్స్ ఇవేవీలేని అప్పటి రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సినిమాలే కదా. అందుకే శివరాత్రి రోజు రాత్రి పూట చాలా థియేటర్స్ లో ఒకే టిక్కెట్ పై రెండు సినిమాలు ప్రదర్శించే వాళ్ళు కాకపోతే అవి సెకండ్ షోస్ తర్వాత మొదలయ్యే మిడ్ నైట్ షోస్ కనుక నాకు ఎప్పుడూ పర్మిషన్ దొరికేది కాదు చూడడానికి. తీరా నాకు చూడగల స్వతంత్రం వచ్చేసరికి ఆ సంప్రదాయానికి స్వస్తి పలికేశారు. 


నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.