నాకున్న సినిమా పిచ్చి వారసత్వంగా వచ్చినదే... నా చిన్నతనంలో అమ్మా నాన్న ఇద్దరూ కూడా విపరీతంగా సినిమాలు చూసేవారట. నేను చిన్నపిల్లవాడ్ని కదా సో ఒకోరోజు తొందరగా నిద్రపోయినా కూడా అలాగే నన్ను రిక్షాలో వేసుకుని సినిమాకి తీస్కెళ్ళే వాళ్ళట. అప్పట్లో ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అవి ట్రాన్సిస్టర్లు లైసెన్సులు రద్దయ్యి మాములుగా ఛలామణి అవుతున్న రోజులు కనుక రేడియో వినడం ఒక హాబీ అంతే తప్ప క్రేజ్ ఉండేది కాదు టీవీలు ఎవరో కోటీశ్వరుల ఇంట్లో వీసీఆర్ తో చూడ్డానికి మాత్రమే ఉండేవి.
నాటకాలు ఇంకా నడుస్తూనే ఉండేవి కానీ సినిమాలంత విరివిగా లభ్యత ఉండేది కాదు సో ఇక సాయంత్రం ముఖ్యమైన ఆటవిడుపు అంటే సినిమాలే అనమాట. నాకు పాటలు వినడం సినిమాలు చూడ్డం అడగకుండానే తీరే కోరికలు కనుక వాటిపై ఇష్టం ఆటోమాటిక్ గా పెరిగిపోయింది అయితే నేను కాస్త హైస్కూల్ కి వచ్చేసరికి అమ్మానాన్నలకి ఆసక్తి తగ్గడంతో సినిమాలకి వెళ్ళడం తగ్గించేశాం. అక్కడే మొదలైంది నా సమస్య.
అపుడు నా క్లాస్మేట్స్ అందరితో డిస్కస్ చేయడానికో లేకా ఏ చిరంజీవి సినిమానో సూపర్ గా ఉందని విని ఇంట్లో పోరి పోరి పర్మిషన్ తెచ్చుకుని ఎపుడైనా సినిమాకి వెళ్దామనుకుని ప్లాన్ చేసుకున్నపుడు ఒకోరోజు అమ్మ ఆఫీస్ నుండి ఆలశ్యంగా వచ్చేది. అప్పట్లో ఇంత విరివిగా ఫోన్లు కూడా ఉండేవి కాదు కనుక ఎదురు చూడ్డం తప్ప ఏం చేయలేకపోయేవాణ్ణి సో సినిమా టైం దాటిపోయేవరకూ వస్తుందేమో ఇపుడు వెళ్తామేమో అని ఎదురు చూసి ఆ తర్వాత ఉక్రోషాన్ని ప్రదర్శించడానికి అమ్మ వచ్చేవరకూ కోపంతో ఎదురు చూసేవాడ్ని. వచ్చాక ఏడ్చి అరిచి గోల గోల చేసేవాడ్ని.

ఒకోసారి అమ్మ సమయానికి వచ్చేది కానీ "ఈ రోజు సినిమాకి వెళ్ళట్లేదు రేపు వెళ్తున్నాం" అని చెప్పేది ఎందుకంటే "అదంతే నేను మనసు మార్చుకున్నాను ఈరోజు నాకు చూడాలని లేదు" అనేది లేదంటే నాన్నకి ఏదో ఒక పని చెప్పి బయటకి పంపి ఇక ఈరోజుకి కుదరదనేది. ఇంకొంచెం పెద్దయ్యాక నన్ను ఒక్కడ్నే సినిమాకి పంపిస్తానని చెప్పి తర్వాత నాన్నని కూడా తోడు తీస్కెళ్ళమనేది లేదంటే పంపిస్తానన్న రోజు కాక మరుసటి రోజో కొన్నాళ్ళు ఆగో వెళ్ళమనేది. ముఖ్యంగా హైస్కూల్ కి వచ్చాక ఇలా జరుగుతుండేది.
నాకు అస్సలు అర్ధమయ్యేది కాదు "ఎందుకు ఇలా చేస్తుంది అమ్మకి నేనంటే ఇష్టంలేదా నామీద కోపమా.. సినిమాకే కదా వెళ్తానంటున్నాను నా క్లాస్మెట్స్ లాగా టూర్స్ కి పిక్నిక్ కి స్లీపోవర్స్ కి వెళ్తాననట్లేదు కదా ఇంత చిన్న కోరిక తీర్చడానికి కూడా ఏవిటి ప్రాబ్లం" అని తెగ ఆలోచించేవాడ్ని ఒకోసారి గయ్యాళి రాకాసి అని తిట్టుకునేవాడ్ని. అలా ఒకసారి తొమ్మిదో తరగతిలోనో పదిలోనో ఇలాంటి విషయం మీదే బాగా గొడవయ్యి "అసలు ఎందుకు ఇంతలా కక్షగట్టినట్లు సాధిస్తున్నావ్ అమ్మా.. నేనంటే నీకు ఎందుకింత కోపం" అని అడిగేశా.
అపుడు అమ్మ చెప్పింది “రేపు జీవితంలో నువ్ పెద్దయ్యాక అన్ని పరిస్థితులు నీ కంట్రోల్ లో ఉండవు అపుడపుడు నువ్వు అనుకున్నది చేయలేకపోవడమో కావలనుకున్నది దక్కకపోవడమో జరగచ్చు అలా కాకుండా చేయగల పరిస్థితులు నీ అదుపులో ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితులని నువ్ ఎదుర్కోవాలంటే ఇప్పటినుండే ఇలాంటి చిన్న చిన్న వాటిలో డిజప్పాయింట్మెంట్ నీకు అలవాటవ్వాలి. సినిమా అనేది ఎంత చిన్న విషయం ఈరోజు కాకపోతే రేపు చూస్తావ్ దానివల్ల జరిగే పెద్ద నష్టం ఏముంది ? దానికే నువ్వింత తల్లకిందులై బాధపడాల్సిన అవసరం ఉందా ? ఆలోచించి చూడు” అని.

అమ్మ మాటలు విన్నాక స్థిమితంగా కూర్చుని ఆలోచించి చూస్తే నిజమే కదా అనిపించింది ఆ తర్వాత ఎలాంటి నిరాశనైనా సమర్దంగా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం అలవర్చుకున్నాను పెద్ద పెద్ద డిజప్పాయింట్మెంట్స్ కి కూడా అంత తీవ్రంగా బాధపడలేదు ఇక చిన్న చిన్న వాటినైతే పట్టించుకోవడం కూడా మానేశాను. అంతేకాక సరదాగా అప్పుడప్పుడు నన్ను నేను టెస్ట్ చేస్కోడానికి ఒకోసారి లాస్ట్ మినిట్ లో నేనే పోస్ట్ పోన్ చేసేసేవాడ్ని.
అమ్మ చేసిన మరో అలవాటు పుస్తకాలు, నా చిన్నపుడు నాకు చదవడం అలవాటవాలని చందమామ, బాలమిత్ర, బుజ్జాయి లాంటివి కనీసం నాలుగైదు పిల్లల పుస్తకాలు ప్రతినెలా తెప్పించి పెట్టేది. ఎలిమెంటరీ స్కూల్లో అంటే ఆరోతరగతిలోపు ఆపుస్తకాలు ఎంత సేపు చదివినా ఊరుకునేది కానీ హైస్కూల్ కి వచ్చాక అవే పట్టుకుని కూర్చుంటానంటే కుదరదని వాటికి కూడా టైమ్ టేబుల్ వేసేది.
ఇక నన్ను క్లాస్ బుక్స్ చదివించడానికి తనుకూడా నాతోపాటు ఏవో ఒక వీక్లీనో నవలో పట్టుకుని కూర్చునేది. కానీ అవి చదవడానికి నాకు అనుమతి ఉండేది కాదు. అలాంటి సమయంలో మల్లాదిగారు రాసిన "నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త" నవల చదివిన అమ్మ ఆ కాన్సెప్ట్ గురించి నాకు చెప్పింది. నాకు చాలా ఆసక్తిగా అనిపించింది కానీ చదవడానికి దదాపు ఆరునెలలు వెయిట్ చేశాక సమ్మర్ హాలిడేస్ లో చదవనిచ్చింది అప్పటి వరకూ ఆ పుస్తకాన్ని దాచి ఉంచింది. అదే నా మొదటి నవల అదో అపురూపమైన అనుభూతి. ఇంటర్మీడియెట్ అయ్యేవరకూ కూడా ఇలా తను చదివి సెలెక్ట్ చేసిన కొన్ని నవలలు మాత్రమే చదవడానికి అనుమతి ఉండేది నాకు.

ఇలా చాలా విషయాలలో మమ్మల్ని అమ్మ గారం చేస్తూనే కొన్ని విషయాలలో అంతే స్ట్రిక్ట్ గా కట్టడి చేస్తూ జాగ్రత్తగా పెంచిందనిపిస్తుంటుంది. కానీ అప్పుడంత కఠినంగా ఉన్నా అమ్మమీద ఎంత కోపమొచ్చినా అలకొచ్చినా కొంచెం సేపటిలోనే మొత్తం కరిగిపోయేది... ఎలా తెప్పించేదో అలాగే ఏదో ఒక మాయ చేసేసి ఆ కోపాన్ని అలకని కూడా తగ్గించేసేది. కానీ ఐదేళ్ళక్రితం సరిగ్గా ఇదే రోజు జనవరి 22 న మమ్మల్ని
శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయి తెప్పించిన దిగులుని మాత్రం ఎంతగా అలిగినా ఇంతవరకూ తగ్గించలేకపోయింది. ఐదేళ్ళైనా అపుడపుడు తలచుకున్నపుడు ఇంత పెద్దవాడ్నికూడా ఈ సినిమాలో ఈషాన్ అంత అయిపోయి "भीड़ में, यूँ ना छोड़ो मुझे... क्या इतना बुरा हूँ मैं माँ... क्या इतना बुरा मेरी माँ" అని అడగాలనిపిస్తుంటుంది.
मैं कभी बतलाता नहीं
पर अंधेरे से डरता हूँ मैं माँ
यूँ तो मैं, दिखलाता नहीं
तेरी परवाह करता हूँ मैं माँ
तुझे सब है पता, है ना माँ
तुझे सब है पता, मेरी माँ
भीड़ में, यूँ ना छोड़ो मुझे
घर लौट के भी आ ना पाऊँ माँ
भेज ना इतना दूर मुझको तू
याद भी तुझको आ ना पाऊँ माँ
क्या इतना बुरा हूँ मैं माँ
क्या इतना बुरा मेरी माँ
जब भी कभी पापा मुझे
जो ज़ोर से झूला झुलाते हैं माँ
मेरी नज़र ढूँढे तुझे
सोचूं यही तू आ के थामेगी माँ
उनसे मैं ये कहता नहीं
पर मैं सहम जाता हूँ माँ
चेहरे पे आने देता नहीं
दिल ही दिल में घबराता हूँ माँ
तुझे सब है पता है ना माँ
तुझे सब है पता मेरी माँ
मैं कभी बतलता नहीं...
Movie/Album: तारे ज़मीन पर (2007)
Music By: शंकर एहसान लॉय
Lyrics By: प्रसून जोशी
Performed By: शंकर महादेवन
లిరిక్స్ ఇంగ్లీష్ స్క్రిప్ట్ లోనూ అనువాదాన్ని పై వీడియోలో సబ్ టైటిలో లేదా
ఈ లింక్ పై నొక్కి చూడవచ్చు.