అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

గురువారం, డిసెంబర్ 31, 2009

ఎత్తరుగుల అమెరికా వీధి - ఈనాడు కథ

"ఈనాడు" తెలుగు వార్తాపత్రికల పాఠకులకు చిర పరిచితమైన పేరు. ఈ దినపత్రిక ఆదివారం అనుబంధం ప్రచురించటం మొదలు పెట్టాక, నిజం చెప్పొద్దూ వారపత్రిక ప్లస్ దినపత్రిక కలిపి ఒకే రేటుకు వస్తుంది అనిపించింది. ఒకప్పుడు ఈ ఆదివారం అనుభందం లో నేను తరచుగా చదివేది బాలవినోదిని, కథ, ఇది కథకాదు, పదవినోదిని(cross word puzzle). కానీ రాను రాను నాకు కవర్ పేజి వెనక వేసే తారల విశేషాలు ప్రత్యేకమైన బొమ్మలుకూడా వదలకుండా మొదటి పేజి లోని ’మాయా’లోకం నుండి చివరి పేజీ లోని ’పదవినోదిని’ వరకూ ప్రతి అక్షరం చదవడం అలవాటు అయింది. ఎన్ని చదివినా అప్పటినుండి ఇప్పటివరకు చదవకపోతే మిస్ అయ్యేంతగా అలవాటైనవి మాత్రం కథ, శ్రీధర్ రాజకీయ కార్టూన్స్, బాలు కార్టూన్. వీటిలో ఈ మధ్య కాలంలో వస్తున్న కథలు అన్నీ చాలా వరకు నిరాశ పరుస్తూనే ఉన్నాయి.

అయినా ఎక్కడో ఓ మంచి కథ దొరకకపోతుందా అనే ఆశతో అలా ప్రతివారం చదువుతూనే ఉన్నాను. అలాంటి టైం లో మొన్న ఆదివారం డిశంబర్ 27 సంచికలో ఓ అందమైన కథ నా కంట పడింది. చదువుతుండగా ఆహా అనిపించింది చదివిన వెంటనే ఓహో అనిపించింది. నాకు పన్నెండు ఇళ్ళు వద్దులే బాబు అటువంటిదే ఒక ఇల్లు ఉన్నా చాలు అనిపించింది. నా ఊహలను ఈ రచయిత ఎలా చదివేశాడా అనిపించింది. వెంటనే ఆ హీరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేయాలని అనిపించింది. మనసుండాలే కానీ అటువంటి జీవితం ఎప్పటికైనా ఆచరణ సాధ్యం కాక పోతుందా అనిపించింది.

ఇంకా... పెరటి గుమ్మానికి చేరగిలపడి నేను కూర్చుంటే మొదటి మెట్టుపై తను కూర్చుని మడిచిన నా కాళ్ళపై అలవోకగా వాలి నా మోకాళ్ళ పై తన తల ఆన్చిన నా శ్రీమతితో కలిసి, జాబిలి తో ఆటలాడుకుంటున్న మేఘాలనూ, పెరట్లోని మందారాల వయ్యారాలనూ పరికిస్తూ, నైట్ క్వీన్, సన్నజాజుల పరిమళాలు మట్టివాసనతో కలిసి మైమరపిస్తుంటే ఆస్వాదిస్తూ, తనకి నా స్వరంతో ఈ కథ చదివి వినిపించాలని అనిపించింది. అదిగో అందుకోసమే ఆ అనుభూతి కోసమే భద్రంగా ఈ కథను నా బ్లాగులో పదిల పరచుకుంటున్నాను.

ఇంత మంచి కథను రాసిన వట్టికూటి చక్రవర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కథకు కేవలం  కన్సొలేషన్ బహుమతి తో సరిపెట్టినందుకు ఈనాడు జడ్జిలపై కాస్త కోపం వచ్చినా.. అసలు పోటీ అంటూ పెట్టి మంచి కథలు రాబట్టినందుకు ఈనాడు ఆదివారం బృందాన్ని కూడా అభినందిస్తున్నాను. ఇంతకీ ఈ కథ మీరు చదివారా... ఒకవేళ చదవకపోతే వెంటనే చదివేయండి మరి. పనిలో పనిగా వైవిధ్యభరితమైన కథ అంటూ ఈ కథకు నెమలికన్ను మురళి గారు రాసిన పరిచయాన్ని కూడా ఇక్కడ నొక్కి చదివేయండి. 

మిత్రులు అందరికీ 2010 నూతన సంవత్సర శుభాకాంక్షలు, కాస్త ముందుగా :-). నూతన సంవత్సర వేడుకలను మనసారా ఆస్వాదించండి.


మంగళవారం, డిసెంబర్ 29, 2009

నేనూ.. మౌనం.. సంతోషం..

డిశంబర్ అంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నెల అయిపోయింది నాకు. అసలు ఈ కోర్స్ చేయడం వెనక ఓ పిట్ట కథ ఉంది కానీ దాని వివరాలు మళ్ళీ ఎపుడైనా సమయం కుదిరినపుడు చెప్తాను. బేసిక్ కోర్స్ చేసిన ఆనందం సద్దుమణగక ముందే పార్ట్ 2 కోర్స్ చేద్దాం అని నిర్ణయించుకున్నాను. దానికోసమని మళ్ళీ ఆశ్రమం కి వెళ్ళిన వెంటనే శలవల్లో ఇంటికి వెళ్ళిన అనుభూతి కలిగింది. అక్కడి వైబ్రేషన్స్ మహిమో ఏమిటో తెలియదు కానీ ఆశ్రమం లో ఉన్నంత సేపూ బయటి ఇబ్బందుల గురించి కానీ సమస్యలగురించి కానీ ఆలోచనలు ఏమాత్రం రావు. ఎపుడూ ఒకటే ధ్యాస.. ధ్యానం.. సేవ.. అదో మధురమైన అనుభూతి. అనుకోకుండా నాతో కలిసి పార్ట్ 1 చేసిన ఒకతను నాతోపాటు పార్ట్ 2 చేయాలి అని నిర్ణయించుకున్నాడు ఇద్దరమూ అనుకోకుండా కలిసాము. ఇందులో మౌనవ్రతం ఉంటుంది అని తెలుసు బేసిక్ లో మేమిద్దరం నవ్వులతో కాస్త అల్లరి చేశాం మన వల్ల అయ్యె పని కాదు బాబు ఈ మౌనవ్రతాలు అవీ అదీకాక ఇంచుమించు మూడురోజులు ఉండాలిట సాధ్యమయ్యే పనేనా అదీ మనలాటి కోతులకు అని అనుకుంటూ మొదలుపెట్టాము. మొదటిరోజు అంతా ఏవో ప్రాసెస్ లు చేయించారు.

ఇక్కడ వీళ్ళ ప్రాసెస్ ల గురించి కొంచెం చెప్పుకోవాలి నిత్యజీవితంలో మనకి ఎదురుపడే వాటినుండే కొన్ని ప్రాసెస్ లను సృష్టించారు అవి చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి అనిపించింది. ఉదాహరణకి పెద్దవాళ్ళకి జ్వరమో లేదో తీవ్రమైన అస్వస్థత కలిగినపుడు హ్మ్ హ్మ్ అని శబ్దం చేస్తూ మూలగడం వింటూ ఉంటాం. ఆ మూలుగు వల్ల బోలెడంత నెగటివ్ ఎనర్జీ బయటకి పోయి కాస్త శక్తివచ్చినట్లు ఫీల్ అవుతారు. వయసులో ఉన్నవారు అలా మూలగడానికి జంకడం గమనిస్తాం కానీ దానివలన చాలా ఉపయోగాలు ఉన్నాయ్. ఉదాహరణకి మీరు టెన్షన్ పడుతున్నపుడు అంటే ప్రజంటేషన్ ఇవ్వాల్సి వచ్చినపుడో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందో ఇలా రెండుచేతులు పైకెత్తి వేగంగా ముందుకు జారవిడుస్తూ పెద్దగా శబ్దం చేస్తూ మూలుగు ద్వారా గాలి బయటకి వదిలారనుకోండి అప్పుడు మీలో నెగటివ్ ఎనర్జీ అంతా బయటకి వెళ్ళి తెలియని శక్తి వచ్చిచేరినట్లు ఫీల్ అవడమే కాక టెన్షన్ తగ్గి  మరింత సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. ఇలాటివే కొన్ని ప్రాసెస్ లు మెడిటేషన్ టెక్నిక్స్ తో మొదటి రోజు గడిచింది.

అదే రోజు అంటే గురువారం రాత్రి 9 గంటలనుండి మా మౌనవ్రతం మొదలైంది, అప్పటినుండి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు మా మౌనవ్రతం కొనసాగింది అంటే దదాపు రెండున్నరరోజులు అంటే 63 గంటలు ఎవరితోనూ మాట్లాడకుండా సేవ చేసేప్పుడు ఒకటి రెండు సార్లు తప్పనిసరి పరిస్థితులలో కేవలం సంఙ్ఞల ద్వారా మాత్రమే సంభాషించి గడిపేశాము. మొదట్లో ఎలారా ఉండటం అనుకున్నాము కానీ శుక్రవారం మధ్యాహ్నానికి మాములు గా అనిపించింది ఏమాత్రం ఇబ్బంది కలగలేదు అసలు మాట్లాడాల్సిన అవసరం కానీ ఆలోఛన కానీ కలగలేదు. బహుశా కోర్స్ జరిగినంతసేపు నిశ్శబ్దంగా అయినా టీచర్ తో కమ్యునికేట్ చేయడం ఒక కారణం అయి ఉండవచ్చు లేదా కోర్స్ లో భాగంగా చేసిన మెడిటేషన్స్ కూడా ఒక కారణమై ఉండవచ్చు. మొత్తానికి చాలా కష్టమేమో అనుకున్నాం కానీ అవలీలగా పూర్తిచేసేశాం. ఎప్పటిలాగే ఆశ్రమం దినచర్యని, ఉదయాన్నే ఐదుగంటలకి నిద్రలేవడం, ఆరుగంటలకి యోగా, పగలంతా మెడిటేషన్ మరియూ సేవ తో అలసిపోవడం, సాయంత్రం గురూజీతో సత్సంగ్, కిచెన్ లో సాత్వికాహారం అన్నీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను.

 నేను ఆశ్రమంలో ఉన్న అయిదురోజులూ గురూజీ తో విశాలాక్షిమంటపంలో పాల్గొన్న సత్సంగ్ చిత్రం  

మౌనవ్రతం ఆచరించిన అంత సేపు నాతోనేను ఎక్కువసమయం గడపగలిగాను ప్రతిపనిని అస్వాదిస్తూ చేశాను. మొత్తం మీద పార్ట్ 2 అయ్యాక నాలో నేను గమనించిన స్ఫుటమైన మార్పు ఏమిటంటే ఫ్లెక్సిబిలిటీ. ఇదివరకు నాలుగు అడుగులు వేయడానికి బద్దకించే నేను ఇప్పుడు కిలోమీటర్ పైనే ఉన్న ప్రదేశాలకు కూడా అవలీలగా నడిచి వెళ్ళి రాగలుగుతున్నాను. ఈ ప్రాక్టీస్ ఇలానే కొనసాగిస్తే నాకు మంచి మేలు జరుగుతుందనే భావిస్తున్నాను. కానీ కోర్స్ చివరిరోజు విపరీతమైన జలుబు దగ్గు పట్టుకుంది వారమైనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ప్రస్తుతం నిన్నటినుండే హోమియో చికిత్స మొదలెట్టాను ఏమైనా సత్ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.

అసలు విషయం చెప్పడం మరిచాను. కోర్స్ అంతా ఒక ఎత్తైతే ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గురూజీ శ్రీశ్రీ రవిశంకర్ గారిని ప్రత్యక్షంగా కలుసుకోవడం ఒక మరిచిపోలేని అనుభూతి. చల్లని చూపులతో ఆశీర్వదించి సంతోషంగా ఉన్నావా అనీ, ఏం చేస్తున్నావు అనీ కుశల ప్రశ్నలు వేసి నాతో ముచ్చటించినది ఒక్క నిముషం పాటే అయినా అంతసేపు నేను మైమరచిపోయి ఏదో లోకంలో ఉన్న అనుభూతి కలిగింది. ఆయన నిరంతర మెడిటేషన్ మరియూ సాధన ఫలితం అనుకుంటా ఒక ఉత్తేజితమైన అద్భుత శక్తి వలయం (aura) తన చుట్టూ ఉన్నట్లు  అది మనల్ని మృదువుగా స్పృశించి ముందుకు సాగినట్లు అనిపించింది ఆయన నన్ను ఆశీర్వదించి ముందుకు సాగుతుంటే. అన్నీ బాగున్నాయ్ కానీ కోర్స్ చివరన టీచర్స్ మీరంతా కూడా టీచర్స్ కావాలి మీరు ఒక్కొక్కరూ 108 మందితో పార్ట్ 2 కోర్స్ చేయించాలి అని ప్రచారం చేయడం నాకు నచ్చలేదు. ఇదే విషయాన్ని హుందాగా చెప్పి ఉంటే బాగుండేది. కాకపోతే అది టీచర్స్ ని బట్టి ఉంటుంది అని అందరు టీచర్స్ ఇలా చెప్పరనీ మిగిలిన వారితో మాట్లాడినపుడు తెలిసింది. మొత్తం మీద ఈకోర్స్ ఒక మధురమైన అనుభూతిని ఇస్తుంది వీలైతే బెంగళూరు ఆశ్రమంలో లేదంటే మీ దగ్గరలో వెంటనే చేయడానికి ప్రయత్నించండి. మీకు మీరు, మీ శరీరానికి మనసుకు ఇచ్చుకోగల ఒక అమూల్యమైన బహుమతి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్, తప్పక చేయడానికి ప్రయత్నించండి.

గురువారం, డిసెంబర్ 17, 2009

జీవించడం ఓ కళ - ఆర్ట్ ఆఫ్ లివింగ్ - 2

రెండో రోజు ఉదయం ఆరుగంటలకు నిద్ర లేచి ఏడున్నరకల్లా అల్పాహారం కోసం బయలుదేరాను కాస్త కొండలు గుట్టలుగా ఉన్న ప్రాంతమవడంతో మెట్లు ఎక్కిదిగడం పైగా ఎంతదూరమైనా నడకే కావడంతో కాస్త కష్టంగా ఉందనిపించింది, అసలేమన దైనందిన జీవితంలో పక్కసీట్ కు వెళ్ళాలన్నా కుర్చీలోనే జరుగుతూ వెళ్ళేంత బద్దకిష్టులం కనుక అంతే ఉంటుంది లే అని సర్దిచెప్పి అలానే తిరిగేశాను. కిచెన్ చాలా పెద్దగా ఉంది దాని డాబా పైన బోలెడన్ని సోలార్ ప్యానల్స్ ఆకర్షణీయంగా పేర్చి ఉన్నాయ్ వాటిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కిచెన్ అవసరాలకు ఉపయోగిస్తారుట. కిచెన్ లో కింద కూర్చుని భోజనం కేవలం పెద్దవాళ్ళకోసం కింద కూర్చోలేని వాళ్ళకోసం ఒక పక్కన కాసిని టేబుల్స్ కుర్చీలు సైతం ఏర్పాటు చేసి ఉంచారు. అల్పాహరం గా నాకు అత్యంత ఇష్టమైన ఉప్మా శనగపప్పు, కొబ్బరి వేసి చేసిన కారప్పొడి తాగడానికి చాక్లెట్ ఫ్లేవర్డ్ రాగిమాల్ట్. ఆహా బ్రహ్మాండం అనుకున్నాను. ఆ కిచెన్ లో మెజారిటీ పనులు చేసేది అంత సేవకులని స్టాఫ్ అతి కొద్దిమంది అని సర్వింగ్ కూరలు తరగడం అన్నీ సేవచేయడానికి ఉత్సాహం చూపే వారిచే చేయిస్తారుట. అదీకాక అక్కడ రోజుకు ఐదువేలమందికి వంట చేస్తారుట, ఇక్కడ దగ్గరలోని కొన్ని స్కూల్స్ కి సైతం భోజనం ఇక్కడినుండే వెళ్తుంది అని తెలుసుకుని ఆశ్చ్రర్యపడిఫోయాను. కిచెన్ టైమింగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి అల్పాహారం 7:30 నుండి 8:30 వరకు. మధ్యాహ్న భోజనం 12:30 నుండి 1:30 వరకూ, రాత్రి భోజనం 6:30 నుండి 7:30 వరకూ. శరీరానికి సరైన సమయాలు ఇవైనా నేను పాటించేసంధ్రర్భాలు బహుస్వల్పం ఇక్కడ ఆశ్రమం లో పాటింపచేస్తారు. ఆహారంకూడా చాలా బాగుంది శాఖాహారం శరీరానికి ఆవశ్యకమైన పోషకాలను అందించే మితమైన సాత్విక ఆహారం.


ఇక వంటశాలలో అల్పాహారం స్వీకరించి అక్కడ నుండి వచ్చాక కాస్త రిలాక్స్ అయి కోర్స్ కోసం వెళ్ళాము. మొదట రిజిస్ట్రేషన్ సమయంలో రేపుదయం శంకరహాల్ లో జరుగుతుంది కోర్స్ అని చెప్పారు సరే అని మేమంతా అక్కడికి చేరుకునే సరికి చివరినిముషంలో ఇక్కడ కాదు వేరే చోట అని మళ్ళీ ఇంకోచోటకి మార్చారు. అబ్బే బొత్తిగా పద్దతీ పాడులేకుండా ఏమిటీ ఈ మేనేజ్మెంట్ ఒక ఇంటర్నేషనల్ సెంటర్ ప్రవర్తించవలసిన విధానమేనా ఇది అని అనిపించింది. ఎట్టకేలకు కోర్స్ మొదలైంది ఒకరినొకరు పరిచయంచేసుకోండి హలో హాయ్ అని కాకుండా  సంఘశ్చత్వమ్ అనే మాటతో పరిచయం చేసుకుందాం అన్నారు. ఏమిటి దాని ప్రత్యేకత అంటే కలసి నడుద్దాం అన్న పదానికి సంస్కృత పదమట. సో ఇక్కడమన అందరం ఒకే గ్రూప్ గా కలసికదులుదాం. అంతే కాదు ఈ మూడురోజులు చిన్న పిల్లలు ఎలాటి ఓపెన్ మైండ్ తో ఉత్సాహంతో నేర్చుకుంటారో అలా నేర్చుకుందాం అని మొదలు పెట్టారు. మా గ్రూప్ కు వచ్చిన టీచర్స్ పేర్లు పంకజ్ & వాసంతి. ఇద్దరు కూడా చాలా చక్కగా ఓపికగా వివరించి నేర్పించారు. నిజంగా మా అదృష్టం అటువంటి టీచర్స్ దొరకడం అనిపించింది.

ఇక కోర్స్ కంటెంట్ విషయానికి వస్తే వార్మప్ అనదగిన అతి కొన్ని యోగాసనాలు నేర్పిస్తారు. ఆ తర్వాత ప్రత్యేకమైన శ్వాసక్రియ పద్దతిని నేర్పిస్తారు. ఆ తర్వాత మూడు అంచెల ప్రణాయామ నేర్పిస్తారు దాని తర్వాత భస్త్రిక నేర్పిస్తారు. ఇవన్నీ శ్వాస ప్రక్రియలే.. యధాలాపంగా శ్వాస పీల్చడం కాకుండా శ్రద్దగా శరీరానికి కావలసినంత ఆక్సిజన్ ను అందించడానికి అలానే శ్వాస ద్వారా టాక్సీన్స్ ను శరీరం నుండి బయటికి పంపడానికి ఈ శ్వాస ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ నేర్పాక గురూజీ కంఠస్వరంతో కూడిన క్యాసెట్ ద్వారా సుదర్శనక్రియ నేర్పిస్తారు. ఈ సుదర్శన క్రియ వలన కలిగే అనుభూతిని ఎదుటి వారి ద్వారా తెలుసుకోవడం కంటే స్వయంగా అనుభవిస్తేమరింత ఆనందానికి గురికావచ్చు. అంతేకాక ఆ అనుభూతికూడా ఒకొకరు ఒక విధంగా వివరించారు నిర్దుష్టంగా ఇది అని ఆశించకుండా.. మెదడును క్లీన్ స్లేట్ గా ఉంచుకుని సహజంగా మీ శరీరం ఏవిధమైన అనుభూతిని మీకందించిందో దానిని ఆస్వాదించడం మంచిపద్దతి.

ఈ కోర్స్ ఏదో ఒక కల్ట్ ని ప్రోత్సహించడమో మతాన్ని ప్రోత్సహించడమో చేయదు. దీని ముఖ్యోద్దేశ్యం నిన్ను నువ్వు తెలుసుకో అని నేర్పించడమే. ఆనందాన్ని వాయిదావేయకుండా ప్రతిక్షణాన్ని తక్షణమే ఆనందంగా గడుపు, నువ్వు ఒక మాఫియా డాన్ అయినా నువు చేసే పనిని శ్రద్దగా ఆనందంగా చేయి. అలానే ఇతరులకు సహాయపడు, వారంలో కొన్ని గంటలు ఏదో ఒకరకమైనసేవ తోగడుపు, ఇలాటి మంచి మాటలు, అలవాట్లు చాలా చెప్తారు. అవకాశమున్న ప్రతిఒక్కరు మీకు దగ్గరలో ఉన్న చోట ఈ కోర్స్ చేయండి. వీలైతే బెంగళూరు  ఆశ్రమానికి వచ్చి ఈ కోర్స్ చేయండి ఖచ్చితంగా ఆశ్రమంలోని జీవనశైలి వైవిధ్యంగా ఉండటమే కాక కోర్స్ మీ శరీరానికి మేలు చేస్తుంది అలానే ఈ అనుభవం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కోర్స్ ఒక ఎత్తైతే సాయంత్రంపూట ఆశ్రమంలో గంటన్నరపాటు జరిగే సత్సంగ్ మరో ప్రత్యేకం, భజనలు పాటలలో అంతమంది యువత పాల్గొనడం మనం మరెక్కడా చూడం, వాటితర్వాత గురూజీ ప్రసంగం ఉంటుంది. ఆయన చాలామంచి విషయాలపై ప్రసంగం ఒకోసారి శిష్యుల ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉంటారు. ఈ సత్సంగ్ జరిగే విశాలాక్షిమంటపంలో నే గమనించిన విశేషమేమిటంటే లోపల హాల్ అంతా దేదీప్యమానంగా వెలుగుతుంటుంది కానీ ఎక్కడాలైట్ కనపడదు, డైరెక్ట్ గా మీ కన్నుల్లోపడి ఇబ్బంది పెట్టదు.

నేను ఈ గురువారం నుండి సోమవారంవరకూ (17th thru 21st) పార్ట్ 2 కోర్స్ చేయడానికి మరలా ఆశ్రమానికి వచ్చాను ప్రస్తుతం ఆశ్రమం నుండే ఈటపా ప్రచురిస్తున్నాను. ఆశ్రమ రిసెప్షన్ లో వెల్కం హోం  అని ఉంటుంది అచ్చంగా అలాగే నేను మా ఇంటికి వచ్చినట్లు ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా ఈ కోర్స్ కూడా నాకు ఆనందాన్ని అందిస్తుంది అని అనుకుంటున్నాను.

ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాలకొరకు ఈ వెబ్సైట్స్ చూడండి.

  http://www.artofliving.org/intl/Portals/0/press/PressKit/TheArtofLiving-AnOverview.pdf

  http://www.artofliving.org/

బెంగళూరు లోని కోర్స్ వివరాల కొరకు ఇక్కడ నొక్కండి

బుధవారం, డిసెంబర్ 16, 2009

జీవించడం ఓ కళ - ఆర్ట్ ఆఫ్ లివింగ్ - 1

బ్రతకడానికి జీవించడానికి మధ్య గల తేడాను చదువరులకు వివరించాల్సిన పనిలేదు అనుకుంటున్నాను. మనలో చాలా మందిమి బ్రతికేస్తుంటాం జీవించేవారు ఏ కొందరో ఉంటారు. నాకు ఇలా జీవించే అవకాశం మొన్న ఓ వారాంతం లో (డిశం 3 నుండి 6 వరకూ) దొరికింది. బెంగళూరు శివార్లలో కనకపుర రోడ్ లో ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం గురించి నేను ఇదివరకు చాలా సార్లు విన్నాను. అహా అంత పెద్ద ఆశ్రమం కట్టించారంటే మహ కోటీశ్వరులై ఉంటారు బాగా డబ్బులు దండుకునే మరో సంస్థ అని అనుకునే వాడ్ని. నిజానికి ఒక పది పదేహేనేళ్ళ క్రితం నాకే కాదు చాలా మందికి రవిశంకర్ అంటే కేవలం ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ గురించి మాత్రమే తెలుసు. కానీ తర్వాత ఆశ్రమంలో అందరూ గురూజీ గా పిలుచుకుని శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులుగా, ప్రముఖ మానవతావాది గా ప్రపంచానికి పరిచయమయ్యారు.

ఏవిటీ వీళ్ళు నాకు జీవించడం నేర్పేది నాకు రాదా.. నే ఇంతకాలం జీవించట్లేదా.. అన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ వెళ్లడం అనవసరం అనే ఒక అభిప్రాయం కూడా ఉండేది నాకు కొన్నేళ్ల క్రితం వరకు. తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని. బేసిక్ కోర్స్ చేసిన వారిలోనూ వచ్చిన మార్పును గమనించిన తర్వాత There may be some thing good అని అనిపించింది. దానికి తోడు ఎవర్ని అడిగినా "అది ఒక అద్భుతమైన అనుభవం మీ అంతట మీరు తెలుసుకోవాల్సిందే కానీ మేము ఏమీ చెప్పలేము" అంటూ కోర్స్ చేయమని చెప్పే వాళ్ళే కానీ అందులో ఏముంటుందో చెప్పే వారు ఎవరూ లేరు. అంతర్జాలం లో వెదికినా దానిలో ఏదో సుదర్శన క్రియ నేర్పుతారు అని మాత్రం ఉంది కానీ మిగిలిన వివరాలు ఏమీ లేవు. ఆఫీసుల్లో పని చేసి చేసి నాకు ఏదైనా మీటింగ్ కు వెళ్ళేముందు పూర్తిగా సిద్దమై వెళ్ళడం అలవాటైంది. అలాటిది ఇక్కడ ఏమి చెప్తారో ఏం చేస్తారో తెలియకుండా ఎలా వెళ్ళడం, ఏముంటుంది అక్కడ? ఇలాటి సవాలక్ష సందేహాలతో గురువారం సాయంత్రం  ఆశ్రమం లో అడుగుపెట్టాను.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో హెల్ప్ డెస్క్ దగ్గర చాలా వేగంగా వివరాలు తెలియ చేశారు. తర్వాత ఫోటో తీసే దగ్గర సైతం వెంటనే పని అయిపోయింది. పేమెంట్ డస్క్ దగ్గర ఒకావిడ తీరిగ్గా ఫోన్లో మాట్లాడుతూ నింపాదిగా పని చేస్తుంది కాస్త చిరాకు కలిగింది. కానీ అప్పటికే చాలా ఆలశ్యమైంది దానికి తోడు అలసిపోయి ఉన్నాను తనకి క్లాస్ పీకే ఓపిక లేదు అని మౌనంగా ఉండిపోయాను. మొత్తానికి అక్కడ పద్దతులగురించి ప్రత్యేకమైన తాళం కోడ్ తోఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుని  రిసెప్షన్ నుండి బయటపడి నా రూమ్ వైపు మెల్లగా నడక ప్రారంభించాను. రాత్రి దగ్గర దగ్గర పదిగంటల సమయం చుట్టూ పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణం వీపున ఒక బ్యాగ్ చేతిలో మరో బ్యాగ్ ఉన్నా కూడా నడకలో ఏమాత్రం అలసట తెలియలేదు చాలా ఆహ్లాదకరంగా ఉంది.

అలా నడుస్తుంటే కుడివైపు పెద్ద కట్టడం అందంగా అలంకరించిన దీపాలతో గోపురం పైనుండి రంగు రంగుల కాంతులు విరజిమ్ముతూ ఠీవీగా నిలబడి చూస్తుంది. దానిని విశాలాక్షిమంటపం అంటారుట హెల్ప్ డెస్క్ లో ఇచ్చిన మ్యాప్లో చూసి మరోసారి నిర్ధారించుకుని రెండు కళ్ళలో తనివి తీరా దానిరూపాన్ని నింపుకుని ముందుకు కదిలాను. ఇదిగో ఈ పక్కన చూపించినది అదే రాత్రి వెలుగులో విశాలాక్షిమంటపం. నాకు కేటాయించిన బ్లాక్ దగ్గరకు రాగానే వ్రుత్తాకారపు ఆ కట్టడం చూసి ఒక్క సారి ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ హాస్టల్స్ గుర్తొచ్చాయి  మనసు కాలేజి రోజులలోనికి వెళ్ళిపోయింది. నా గది ముగ్గురు ఉండవలసినది మంచాలు, రగ్గులు, అటాచ్డ్ బాత్ అన్నీ చాలా సౌకర్యంగా బాగుంది అనిపించింది.

సరే రేపటి కోర్స్ లో ఏముండబోతోందో అనుకుంటూ నిద్రకుపక్రమించాను కానీ కొత్త ప్రదేశం వలన అనుకుంటాను అలసిపోయినా నిద్రమాత్రం పట్టడం లేదు. కిటికీకి ఆనుకుని ఉన్న మంచంమీద వెల్లకిలా పడుకుని రక రకాల భంగిమలలో నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంటే కిటికీకి ఉన్న కర్టన్ తగిలీ తగలనట్లు సుతారంగా చెంప నిమిరింది మూసిన కనురెప్పలు నుండి సైతం ఏదో వెలుగు కనిపించేసరికి మెల్లగా కళ్ళు తెరిచాను ఆ ముందురోజే పౌర్ణమి కాబోలు కిటికీకి పైన నిండుచందమామ చిరునవ్వుల వెన్నెలలు రువ్వుతూ నీకోసం నన్నిలా చూస్తూ నిద్రిస్తావు కదా అని ఇలాటి రూమ్ అలాట్ చేయించి కిటికీ పక్కన మంచం ఖాళీగా ఉంచి నే ఎదురు చూస్తుంటే నన్ను నిర్లక్ష్యం చేస్తూ అలా ఎలా నిద్రిస్తావోయ్ అని అడుగుతున్నట్లు అనిపించింది. మనసంతా గాలిలో తేలిపోతుంటే ఆహా స్వాగత సత్కారం అద్భుతం అనుకుంటూ అలా జాబిలిని వెన్నెలను చూస్తూ మెల్లగా నిదురలోకి జారుకున్నాను.

బేసిక్ కోర్స్ గురించీ, ఆశ్రమం గురించి మరికొన్ని వివరాలు నా తరువాతి టపాలో...

ఆదివారం, నవంబర్ 22, 2009

బండీ రా.. పొగబండీ రా..

శీర్షిక చూసిన వెంటనే వంశీగారి జోకర్ సినిమా లో పాట గుర్తు చేసుకుంటూ.. "వీడెవడండీ బాబు పొగబండి అని శీర్షికపెట్టి వోల్వో బస్సు బొమ్మ పెట్టాడు !! పొగబండి అంటే రైలుబండి అని కూడా తెలియని వీడికి ఒక బ్లాగు.. దానిలో పోస్ట్ లు.. వాటిని మనం చదవడం..హుః" అని మోహన్ బాబు స్టైల్ ల్లో తిట్టేసుకోకండి మరి, చివరి ఫోటో చూస్తే అసలు ఈ టపా ఎందుకు మొదలెట్టానో మీకీపాటికి అర్ధమైపోయుంటుంది. అసలు టపా లోనికి వెళ్ళేముందు ఓ చిన్ని పిట్టకథ చెప్పాలి.

ఇది చాలా రోజుల క్రితం కథ, అప్పటికింకా వోల్వోబస్సులు మన ఆర్టీసీకి రాని రోజుల్లో.. బస్సుల్లో కూడా హైటెక్ హవా నడుస్తున్నరోజుల్లో ఓ శుభముహుర్తాన బెంగళూరు నుండి ఓ ప్రైవేట్ హైటెక్ బస్సు లో గుంటూరు బయల్దేరాను. రాత్రి పదకొండుగంటల ప్రాంతంలో భోజనమయ్యాక వాక్మన్ లో పాటలు వింటూ నిద్రకుపక్రమిస్తుండగా "థడ్‍డ్..డాం.." మంటూ పెద్ద శబ్దం అంతకన్నా పెద్ద కుదుపుతో బస్ ఆగిపోయింది. దదాపు కూర్చున్న ప్రతిఒక్కరికి మొహమో కాళ్ళకో ముందు సీట్ కి తగిలి చిన్న దెబ్బలు తగిలాయి. బస్ ముందు అద్దం పగిలింది కదిలే స్థితిలో ఉందో లేదో తెలీదు. భోజనాల దగ్గర మందుకొట్టి ఎక్కిన డ్రైవర్ క్లీనర్ ఇద్దరూ కూడా ప్రయాణీకులతో పాటు నిద్రకుపక్రమిస్తూ యాక్సిడెంట్ చేయడం కాకుండా వెంటనే బస్ ని, ప్రయాణీకులని గాలికి ఒదిలేసి పరారయ్యారు. వీడు ఎదురుగా గుద్దినది ఒక అర్టీసీ బస్ ని ఆ బస్ స్టాఫ్ మా రూట్ లో వెళ్ళే ఇతర ఆర్టీసీ బస్సులను ఆపి మమ్మల్ని ఎక్కించి పంపించారు. నాదగ్గర ఉన్న అన్ని డబ్బులు ప్రైవేట్ బస్ వాడి టికెట్ కి పెట్టేయడం తో ఈ కొత్త బస్ లో టికెట్ కి పదిరూపాయలు తగ్గితే ఓ అపరిచితుడ్ని అడిగి టికెట్ తీసుకున్నాను అతను మా కొలీగ్ తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడనుకోండి. ఈ సంఘటన నాకు రెండు పాఠాలు నేర్పింది. ఒకటి కేవలం గవర్నమెంట్ బస్సులు మాత్రమే ఎక్కడం. ఇంకోటి ప్రయాణం లో ఎప్పుడూ టికెట్ డబ్బుకి రెట్టింపు డబ్బు దగ్గర ఉంచుకోడం.

సరే ఇక విషయంలోనికి వస్తే ప్రస్తుతం ఓల్వో బస్సులు వచ్చి బస్ ప్రయాణాన్ని కాస్త సులభ తరం చేశాయనే చెప్పచ్చు. మొన్నా మధ్య బెంగళూరు నుండి హైదరాబాద్ కు వోల్వోలో ప్రయాణించాను, అది ఎపియస్ అర్టీసీ వారి బండి. దాని వాలకం చూడగానే కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. సాధారణంగా మిగిలిన బస్ ల మెయింటెనెన్స్ విషయం లో కాస్త అలక్ష్యం చూపించినా ఓ ఆర్నెల్లక్రితంవరకు వోల్వోలు బాగానే మెయింటెయిన్ చేసేవారు ఈ బస్ వాలకమే డబ్బా వాలకంగా కనిపించింది. సరే టిక్కెట్టుకొన్నాక తప్పదు కదా అనుకుని ఎక్కి కూర్చున్నాను మొదటి అసౌకర్యం సీట్ల మధ్య ఎడమ విషయంలో, మరీ సీట్ లు దగ్గర దగ్గరగా అరేంజ్ చేశాడు ఎంతగా అంటే ముందు వాడు ఫుల్ గా రిక్లైన్ అయితే వెనక సీట్లో ఎవరూ కూర్చోలేనంత. బెంగళూరు - గుంటూరు రూట్లో నాకు ఈ అసౌకర్యం ఎపుడూ కలగలేదు. సరే అని కూర్చుంటే రాత్రి రెండు గంటల సమయం లో పెద్ద కుదుపుతో బస్ ఆగిపోయింది. సెల్ఫ్ స్టార్టర్ పని చేయడం లేదు కాసేపు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ సెల్ఫ్ అందుకోవడం లేదు.

అలా బస్ ఆగిపోయి రెండునిముషాలు కూడా అవ్వలేదు అతి దగ్గరలో వెనక నుండి పెద్దగా రైలు కూత !! వెనక్కి తిరిగి చూస్తే.. నాకైతే ఒక్క క్షణం వెన్నుజలదరించింది, ఆ రైలు నా గుండెల్లోనే పరిగెట్టినట్లు అనిపించింది. రైల్వే ట్రాక్ కు మా బస్ కూమధ్య రెండు బస్సులు పట్టే అంత దూరం అంతే.. గేటు దాటిన వెంటనే మా బస్ ఆగిపోయింది కాబట్టి సరిపోయింది అదే ట్రాక్ మీద ఆగితే మా పరిస్థితి ఏంటి. బస్ లో పసిపిల్లలు, మహిళలు, వృద్దులు అన్ని రకాల వాళ్ళు మంచి నిద్ర లో ఉన్నారు అందర్ని లేపి సమయానికి బస్ నుండి దింపడం సాధ్యమయ్యే పనేనా.. బస్ ను ట్రాక్ పైనుండి నెట్టి ఇవతలికి తీసుకురావాలన్నా అంత తక్కువ వ్యవధిలో అయ్యేనా... అసలు ఇలాటి ఎమర్జన్సీ సమయం లో గేట్ పడకపోతే అతి తక్కువ సమయంలో రైలు ను ఆపటానికి సరైన ఎక్విప్ మెంట్ మరియూ భద్రతా వ్యవస్థ ఆగేట్ దగ్గర ఉందా ఇలాటి ప్రశ్నలు చుట్టుముట్టాయి. నాకు తెలిసి ఇది వరకు 5 నిముషాలకు ముందే గేట్ వేసేవాడు ఇపుడు బెటర్ ఎక్విప్మెంట్ ఉండటం వల్ల ఆ వ్యవధి తగ్గించాడా లేక కేవలం ట్రాఫిక్ ఒత్తిడి వలనా అనేది తెలియదు.

సరే బస్ ఆగింది సెల్ఫ్ స్టార్ట్ అవడం లేదు ఇక మార్గాంతరం బస్ తోయడమే అయి ఉంటుంది అనుకుంటూ బస్ దిగి ఏమైందా అని నిలబడి చూస్తున్నాను. అప్పటికే నాలాటి ఎంతూసియాస్ట్స్ కొందరు దిగి ఇంజన్ చుట్టు పక్కల మూగి మాట్లాడుకుంటున్నారు. ఇదే సందు అని సిగరెట్ వెలిగించి హడావిడిగా దమ్ము లాగేస్తున్నారెవరో..

"ఇందాక వాళ్ళ బస్ ఫెయిల్ అయిందని ఎవర్నో చాలామందిని ఎక్కించారు వాళ్ళని దించేయండోయ్ ఎవరో స్ట్రాంగ్ లెగ్ గాడున్నట్లున్నాడు " ఒకాయన జోక్.

"ఛ ఏపీయస్ ఆర్టీసీ వాళ్ళు ఇంత చెత్త బస్సులు నడుపుతున్నారా.. ఇంకోసారి వీళ్ళ బస్ అసలు ఎక్క కూడదు.." ఓ యూత్ అప్పటికప్పుడు తీసేసుకున్న రిజల్యూషన్.

"కుదుపులకి బ్యాటరీ వైర్లేవో లూజ్ అయి ఉంటాయి చూడండి మాష్టారు.." గుండు సూది నుండి అణుబాంబు వరకూ తనకు తెలియని విషయం లేదని ఫీల్ అయ్యే ఓ పెద్దాయన ఉచిత సలహా...

"అబ్బా బంగారం లాంటి నిద్ర పాడు చేశారు.. బయల్దేరిన దగ్గరనుండి డొక్కు సినిమా ’బిల్లా’ పెట్టి. ఇప్పుడేమో ఇలా హు.. అవును మాష్టారూ ఇంతకీ ఇది ఏ ఊరంటారు ??" ఇంకొకాయన భోగట్టా..

"......." చిరునవ్వుతో మౌనంగా వీళ్ళమాటలు వింటూ, మనసులో "ఇవి జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని బ్లాగ్ లో రాసేయాలి.." అనుకుంటూ నేనూ, ఇదీ అక్కడి సన్నివేశం.

సరే చివరికి ఇక వేరే దారి లేదు అని నిర్ణయించుకుని "రండి బాబు బస్ నెట్టండి.. అలా స్టార్ట్ చేయాల్సిందే.. లేకుంటే కదలదు.." అన్న డ్రైవర్ పిలుపందుకుని బస్ వెనక్కి చేరాం. అక్కడ అంతా దుమ్ము డీజిల్ ఎక్సాస్ట్ వలన పట్టిన చమురుమురికి చూడటానికే అసహ్యం గా ఉంది, కానీ మరి తప్పదు కదా అలానే దాని మీద చేతులు వేసి బస్ నెట్టడం మొదలు పెట్టాం. ఓ పది పదిహేనడుగులు నెట్టిన తర్వాత ఒక్కసారిగా ఇంజన్ స్టార్ట్ అయింది.. మరుక్షణం దట్టంగా నల్లని పొగ మేఘం మా అందరిని చుట్టుముట్టింది.. మేమంతా బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల్లా.. నల్లగా తయారయ్యాం.. అవకాశం దొరికిన వెంటనే తప్పించుకున్నం కాని ఆ లోపే ఇదీ మా పరిస్థితి. ఆ తర్వాత కూడా బస్ ఇంజన్ రైజ్ చేసేకొద్దీ దాదాపు ఒక అయిదు నిముషాలపాటు అలా నల్లని పొగ వదులుతూనే ఉంది. (ఈ పక్కన ఫోటో గూగులమ్మ ఇచ్చింది, నేనెక్కిన బస్ ఇంతకు పది రెట్లు ఘోరంగా ఉంది)

వోల్వో వెబ్ సైట్ ని బట్టి చూస్తే వాళ్ళ బస్సులు అన్ని Euro 2/Euro 3 ఎమిషన్ క్లాసుకు చెందినవే అయి ఉంటాయి, వాటికి ఇంత ఘోరమైన నల్లని పొగ రాకూడదు. మరి మన వాళ్ళు కిరోసిన్ కల్తీ అయిన డీజిల్ తోనడుపుతున్నారో లేక బస్ కొనడమే కానీ బొత్తిగా మెయింటెనెన్స్ విషయం పట్టించుకోవడం లేదో అర్ధం కాలేదు. నాకైతే మెయింటెనెన్స్ లోపమే అనిపించింది, అలా అనుకోవడానికి బస్ వాలకం కూడా ఒక కారణం. కనీసం సరిగా బస్ కడిగే విషయం కూడా పట్టించుకోని వాళ్ళు క్రమం తప్పకుండా సర్వీస్ చేయించే అవకాశం నాకైతే కనిపించలేదు. అలా చేయిస్తే ఇలాటి సంధర్భం ఎదురు పడదు అని నా నమ్మకం. దాదాపు యాభై నుండి అరవై లక్షల వరకూ పోసి కొనే బస్సులు ఇలా గాలికి వదిలేస్తే వాటి లైఫ్ స్పాన్ తగ్గిపోవడం ఒక నష్టం. అదేకాక ఇందాక చెప్పినట్లు ఏ రైల్వే ట్రాక్ మధ్య లోనో ఆగిపోయి ఫాటల్ యాక్సిడెంట్ కి కారణం అయితే ఎవరి నిర్లక్ష్యానికి ఎవరు మూల్యం చెల్లించినట్లు ? వీళ్ళు మారేదెన్నడు ??

సోమవారం, నవంబర్ 16, 2009

టీవీ ఛానళ్ళూ - సృజనాత్మక తలలు !

ఏమిటీ చిత్రమైన శిర్షిక అని హాశ్చర్యపడిపోతున్నారా? ఏంలేదండీ creative heads ని ఆంధ్రీకరించాను అంతే. గత ఏడాది బ్లాగులు, వార్తలు, టీవీ కార్యక్రమాలని ఫాలో అయిన వారెవరికీ ’ఈటీవి’ కి పట్టిన చీడ సుమన్ మరియూ క్రియేటివ్‍హెడ్ ప్రభాకర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను (మీ మనోభావాలు ఏమాత్రం దెబ్బతిన్నా ఈ టపా చదవడం ఇంతటితో ఆపేయమని నా సలహా!! ఇహ ముందుకు చదవడం అనవసరం అని నా ఉద్దేశ్యం, ఆపై మీ ఇష్టం). ఆ చానల్ ను ఇంచుమించు నాశనం చేసేయబోయిన ఈ చీడ భారినుండి రామోజీ గారు ఆలశ్యంగానైనా మేలుకుని, కొడుకు అని కూడా చూడకుండా వీళ్ళ ఇద్దరి భారి నుండి జనాన్ని, ఈటీవీ ని ఏకకాలం లో రక్షించేశారు. ఇప్పుడు మాటీవి నీ అదే దారిలో నడిపించనున్నాడా అని అనిపిస్తున్న మరో క్రియేటివ్ హెడ్ ’ఓంకార్’ అని పిలవబడే ఓ వికార్ గురించే ఈ టపా.

"అసలెవరీ ఓంకార్ ఒకప్పుడు 90 లలో టివీ సీరియల్స్ లోనూ కొన్ని సినిమాలలోనూ తన వైవిధ్యమైన గొంతుతో వెటకారపు సంభాషణలతో కనిపించేవాడు అతనేనా?" అని అడుగుతున్నారా.. కానే కాదు. ఇతను మొదట జీతెలుగు చానల్ లో డ్యాన్స్ కాంపిటీషన్ ద్వారా కెరీర్ మొదలు పెట్టాడనుకుంటా ప్రస్తుతం మాటీవీ జీ రెండిటిలోనూ కొన్ని ప్రోగ్రాంస్ చేస్తున్నాడు. ఈ టీవీ అంతరంగాలకు సుమన్ కధ, మాటలు, పాటలు దర్శకత్వం అని పేరేసుకోడంతో మొదలుపెట్టినట్లు ప్రస్తుతం ఇతను కూడా కాన్సెప్ట్, రచన, నిర్మాత, దర్శకత్వం ఇలా నాలుగైదు విభాగాలకు పేరు వేసుకోవడం మొదలు పెట్టాడు. కాకపోతే చిన్న తేడా ఏంటంటే ఇతనివి సీరియల్స్ కాదు కేవలం టాలెంట్ షోస్ కే పరిమితమైనట్లున్నాడు ప్రస్తుతం. ఇతని ఓవర్ యాక్షన్ చూడాలంటే ప్రఖ్యాత మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి గారు ఇతన్ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఈ కింది వీడియో చూడండి. ఇందులో బ్లాక్ డ్రస్ లో ఏంకరింగ్ చేస్తూ కనిపించే వ్యక్తే ఓంకార్.ఇతను మొదట్లో జీటీవీ లో ఆట పేరుతో ఒక డాన్స్ కాంపిటీషన్ ప్రోగ్రాం మొదలు పెట్టారు, పిల్లలతో సైతం చిత్రవేషధారణ కుప్పిగంతులు వేయించేవాడు. తర్వాత ఇంకేదో చిత్రమైన పిల్లల ప్రోగ్రాం ఒకటి చేశాడు అందులో కూడా ఎలిమినేషన్ పేరుతో పిల్లల్ని ఏడిపించి నానా యాగీ చేసేవాడు. ఇక ప్రస్తుతం మాటీవీ లో ఛాలెంజ్ పేరుతో ఓ డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తున్నాడు, ఇంత కాలం ఇలాటి ప్రోగ్రాంలో వీళ్ళ వింత వేషధారణ, డ్యాన్స్ పేరుతో చేసే వికృత చేష్టలు, న్యాయనిర్ణేతల ఓవర్ యాక్షన్ మాత్రమే భరించాల్సి వచ్చేది, ఇపుడు ఛాలెంజ్ పేరుతో డ్యాన్సర్లు వాళ్లల్లో వాళ్ళే మరీ చెత్తకుండీల దగ్గర కుక్కల కన్నా ఘోరంగా కొట్టుకుంటున్నారు. పోలిక కాస్త ఘాటుగా ఉన్నా ఒకటి రెండు ఎపిసోడ్స్ చూసిన నాకు అలానే అనిపించింది. అది చాలదన్నట్లు ఈ కొట్లాటనే ప్రోమోస్ గా చూపిస్తుంటే ఏం చేస్తాం.

ఇతని మరో ప్రోగ్రాం మాటివి లో అదృష్టం, అమెరికా లోని డీల్ నో డీల్ ప్రోగ్రాం కి కాసిని మార్పులు చేసి ప్రసారం చేసే ఈ ప్రోగ్రాం లో ఇతని ఓవర్ యాక్షన్ చూసి తీరాల్సిందే.. మొదట్లో కాస్త సెలబ్రిటీస్ ని పిలిస్తే వాళ్ళు ఇతన్ని ఆడుకుని మొత్తం ప్రోగ్రాం ని హాస్యభరితం చేసారు, దానితో ఇలా లాభం లేదు అని పిల్లలను అతని మిగిలిన ప్రోగ్రాంస్ లో పార్టిసిపెంట్స్ ని పిలిచి వాళ్ళతో ఆడుకోడం మొదలు పెట్టాడు. అలా అని ఇతనిమీద అన్నీ కంప్లైంట్స్ లేవు నాకు, ఉదాహరణకి ఛాలెంజ్ పేరుతో వస్తున్న ప్రోగ్రాంలో పార్టిసిపెంట్స్ అప్పొనెంట్ కోసం పాట సెలెక్ట్ చేసి ఇవ్వడం. ఇద్దరిమధ్య ఒకే పాటకి పోటీ పెట్టడం లాంటి మంచి ఐడియాలు కూడ ఉన్నాయి. చేతిలో అవకాశం విద్య రెండూ ఉన్నపుడు కాస్త తెలివిగా వ్యవహరించి సక్రమంగా ఉపయోగిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశ్యం.

టీవీ అంటే గుర్తొచ్చింది. జూడాలు గురించి విన్నారా... వినే ఉంటారు లెండి ’జూనియర్‍డాక్టర్’ అన్న పదానికి వచ్చిన తిప్పలు ఇవి. నిన్న వార్తలు చూస్తుంటే లైన్ కి మూడు నాలుగు సార్లు జూడాలు అని చదువుతుంటే వినడానికి చాలా అసహనంగా అనిపించింది. కంపోజర్ కన్వీనియన్స్ కోసం అలా జూ.డా లు అని రాసిస్తే దాన్ని యధాతధంగా చదివేస్తున్నాడా లేక టీవీ వాళ్ళు కొత్త పదాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనే విషయం అర్ధంకావడం లేదు. వార్తల్లో ఈమధ్య గమనించిన మరో అంశం వార్తలు వేగంగా చదవడం. ప్రయత్న పూర్వకంగా అలా హడావిడిగా చదివేయడం ప్రత్యక్షంగా తెలుస్తూంటే విసుగొస్తుంది. క్వాలిటీ కన్నా క్వాంటిటీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల వచ్చిన తిప్పలు కావచ్చేమో.

మంగళవారం, అక్టోబర్ 13, 2009

Wake Up SID !!

నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ్ అని తెలిస్తే కానీ చూడను. అలాంటిది కాస్త మంచి టాక్ వచ్చిందని తెలిసి ఈ వారాంతం wake up sid చూడటం తటస్థించింది. నేను చాలా సాధారణ ప్రేక్షకుడిని, సినిమా టెక్నికాలిటీస్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. సినిమా అంటే బోలెడంత ఇష్టం మాత్రం నా సొంతం. స్క్రిప్ట్ తో కట్టి పడేసే సినిమాలు, థియేటర్ బయటకు వచ్చాక కూడా సినిమా గురించి ఆలోచించేలా చేసే థ్రిల్లర్స్ అంటే కూడా ప్రత్యేకమైన ఇష్టం ఉంది. సినిమా లో ఇంటర్వెల్ కార్డ్ పడగానే "హమ్మయ్య ఇంటర్వెల్ వచ్చింది రా బాబు.." అని కాకుండా "అరె అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా..." అనీ, శుభం కార్డ్ పడగానే "అపుడే అయిపోయిందా.." అనీ అనిపిస్తే నా దృష్టి లో ఆ దర్శకుడు విజయం సాధించినట్లే...ఈ విషయం లో wake up Sid దర్శకుడు నూటికి నూరుపాళ్ళు విజయం సాధించాడు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా నిస్సందేహంగా ఓ క్లీన్ ఎంటర్టైనర్. ఈ చిత్రం ప్రొమో లో చెప్పినట్లు గా it is story about a boy who refused to grow up. ప్రతి ఒక్కరి జీవితం లో ఈ సిద్ ఉంటాడు.. లేదంటే కనీసం మీరు దగ్గరగా చూసి ఉంటారు, ఇతను చేసే చేష్టలన్నీ ఎపుడో మనం చేసినట్లు గా అనిపించక మానవు. ఇక సినిమా లో మిగతా పాత్రలన్నీ మెలో డ్రామా జోలికి పోకుండా చాలా సహజంగా ప్రవర్తించాయి. సోదాహరణం గా వివరించాలని ఉంది కానీ చూసినపుడు ఆ ఫీల్ మిస్ అవుతారు అని నేనా పనికి పూనుకోవడం లేదు. సినిమా కాస్త పాత బడ్డాక మళ్ళీ రాయడానికి ప్రయత్నిస్తాను.

ఈ సినిమా లో తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం ఉంది అలాగని అనవసర సెంటిమెంట్ సీన్స్ కానీ భారీ డైలాగులు కానీ లేవు. ఈ సినిమాలో కాలేజీ, స్నేహితులూ ఉన్నారు కానీ హాస్యం పేరు తో ఉపాధ్యాయులను అగౌరవ పరిచే సన్నివేశాలు లేవు. సినిమాలో అంతర్లీనంగా సునిశితమైన హాస్యం ఉంది కానీ హాస్యానికే ప్రత్యేకించి వేరే ట్రాక్ లేదు. ఇది సిద్ ప్రేమ కథ కూడా కానీ ప్రేక్షకుడి బలహీనతలు, ఉద్రేకాలతో ఆడుకునే సన్నివేశాలు లేవు. ఈ సినిమా జీవితానికి ఓ లక్ష్యం ఉండాలి అని చెప్తుంది అలా అని ఇందులో సినిమా కష్టాలు, భారీ సందేశాలు లేవు. సినిమా అంతా చాలా సహజంగా స్మూత్ గా సాగిపోతుంది.

సిద్ గా రణ్బీర్ చక్కగా సరిపోయాడు చైల్డిష్ లుక్ తో అలరించాడు. హీరోయిన్ కొంకణ ని మొదట చూసి ఇంతకంటే గ్లామరస్ మొహాలు కనిపించలేదా ఈ దర్శకుడికి అనిపించింది కానీ కాసేపటికి తనలో ఏదో అట్రాక్షన్ ఉంది అనిపించింది, సినిమా ముందుకు నడిచి తను కేవలం గ్లామర్ కు పరిమితమైన పాత్ర కాదని తెలిసే కొద్దీ తను మనల్ని మరింత ఆకట్టుకుంటుంది (మొహానికి అలవాటు పడటం కూడా ఒక కారణమేమో:-). సిద్ స్నేహితురాలు లక్ష్మి గా చేసిన అమ్మాయి కూడా బాగుంది. సంగీతం విషయానికి వస్తే విన్నపుడు పాటలలో నాకు ’ఇక్‍తార..’ అన్న పాట తప్ప పెద్దగా నచ్చ లేదు ’లైఫ్ ఈజ్ క్రేజీ..’, టైటిల్ సాంగ్ కూడా పర్లేదు కానీ పాటలు అన్నీ శంకర్ ఎహ్‍సాన్ లాయ్ ల శైలి లోనే ఉంటూ వాళ్ళ ఇతర సినిమా పాటల్ని గుర్తు చేస్తాయి, సినిమా మూడ్ కి మాత్రం సంగీతం సరిపోయింది అనిపించింది.

సినిమా అంటే భారీ తారాగణం, గ్రాఫిక్ వర్క్, టెక్నికల్ బ్రిలియన్స్, మంచి సందేశం, ఊహించని మలుపులు, థ్రిల్స్ ఇలా ఏదో పెద్ద ప్రత్యేకత ఉండాలి అని కాక, సినిమా అంటే రెండున్నర గంటలు కదలకుండా కూర్చోపెట్టి ఆకట్టుకునే విధంగా ఆహ్లాదభరితమైన కథ చెప్పడం అని మీరు నమ్మే వారైతే ధైర్యం గా ఈ సినిమా చూడవచ్చు. ఒకటి రెండు చోట్ల వచ్చే కొన్ని అభ్యంతరకరమైన సంభాషణల వలన ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ ఇచ్చి ఉండచ్చు. కానీ సినిమా మంచి ఎంటర్టైనర్, సిద్ అందరికీ నచ్చేస్తాడు. అబ్బాయిలూ మనలో మన మాట, ఈ సినిమా చూశాక మీ ఇష్ట సఖి మీతో సిద్/రణ్‍బీర్ ని "హీ ఈస్ సో క్యూట్... " అంటూ తెగ పొగిడేస్తుంటే కుళ్ళుకోకుండా నిమ్మళంగా ఉండటానికి ఇప్పటి నుండీ సిద్దంగా ఉండండేం:-) పో పోవోయ్ మేం బాపూ గారి పెళ్ళిపుస్తకం చూశాం కుళ్ళుకున్నా కూడా "అసూయ ఘాటైన ప్రేమకి థర్మామీటర్...." అని కవర్ చేయగలం అంటారా సరే మీ ఇష్టం.

శుక్రవారం, అక్టోబర్ 09, 2009

ఐస్..పుల్లైస్..పాలైస్..

వేసవి శలవల్లో మండే ఎండలలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం లోనో లేదా మూడు గంటల సమయం లోనో చల్లని ఈ పుల్ల ఐస్ చప్పరిస్తుంటే ఆ ఆనందం మాటలలో చెప్పతరమా చెప్పండి. అసలు ఈ రుచి ఎరుగని జన్మ ఒక జన్మేనా అనిపిస్తుంది నిజంగా. తర్వాత తర్వాత ఐస్క్రీములు వచ్చి వీటి అమ్మకానికి గండి కొట్టాయ్ కానీ నా చిన్నతనం లో ఇవే రారాజులు. వీధిలో కేక వినబడగానే ఏ పని చేస్తున్నా వెంటనే అలర్ట్ అయిపోయే వాడిని. ఒకో రోజు కాస్త పెద్ద వాళ్ళు మాత్రమే తీసుకు రాగలిగే రెండు చక్రాల చిన్న తోపుడు బండి లో తెచ్చేవాడు. ఆ బండి భలే ఉండేది చెక్కతో చేసిన పెద్ద పెట్టె, దాని లోపల థర్మోకోల్ అట్టలూ, పింక్ లేదా ఎర్రని ప్లాస్టిక్ బబుల్ రాప్‍తో బాగా ఇన్సులేట్ చేసి వాటి సాయం తోనే పెట్టెని అరలు గా విభజించి ఆ అరల్లో రక రకాల ఐస్ఫ్రూట్ లు నింపి తెచ్చే వాడు. అంత పెద్ద పెట్టెకూ పైన ఒక వృత్తాకారపు చిన్న మూత మాత్రమే ఉండేది. ఆ మూత తీసి ప్లాస్టిక్ కాగితాలు అలా పక్కకి జరిపి కేవలం రెండు మూడు చేతులు మాత్రమే పట్టే ఖాళీ లో చేయిపెట్టి, వాడు డబ్బా లోకి చూడకుండ్ blindfold ఆడుతూ, మనం అడిగిన రకాన్నిబట్టి చేతిని ఒకో వైపు తిప్పి మనకి కావాల్సిన ఐస్ఫ్రూట్ బయటకి తీసి పట్టుకోగానే ఇక మన ఆనందానికి అవధులు ఉండవు. ఇదంతా ఒక ఎత్తైతే డబ్బా పై రంగు రంగుల ఆకర్షణీయమైన బొమ్మలూ కొన్ని బండ్లకు ఉండే చిన్న సైజ్ గంట ఒకటీ మరో ప్రత్యేకమైన ఆకర్షణ.

ఈ బండి దగ్గర కొనాలంటే మనం రోడ్డు మీదకి వెళ్ళాలి కదా అలా కాకుండా దాదాపు మన అంత వయసే ఉన్న ఓ చిన్న కుర్రాడు లోపల అంతా థర్మాకోల్ అట్టలతో ప్లాస్టిక్ కవర్ తో ఇన్సులేట్ చేసిన బ్రిటానియా బిస్కట్ డబ్బా లో పెట్టి దానికి ఒక తాడు కట్టుకుని భుజాన మోసుకుంటూ అమ్మటానికి తెచ్చే వాడు. వాడైతే చక్కగా మన గుమ్మం ముందుకే వచ్చిఇస్తాడు. ఎఱ్ఱ ఐస్, తెల్లని పాలైస్, ద్రాక్షా ఐస్, కొబ్బరి ఐస్, సేమ్యా ఐస్, ఇలాచీ ఐస్, మ్యాంగో ఐస్ ఇలా ఒకో సమ్మర్ కి ఒకో కొత్త రకం తెచ్చేవాడు. ఎన్ని రకాలు ఉన్నా గోల్డ్ స్పాట్(ఇది అప్పట్లో దొరికే కోలా, ఈ రుచి ఇప్పుడు దొరికే వాటిలో ఎక్కడా నాకు తగల్లేదు, కాస్త ఆరెంజ్ రుచి అనుకోవచ్చు, ఇప్పటి పిల్లలికి తెలియాలి అంటే మిరిండా రుచి అని చెప్పచ్చేమో!) లాంటి రుచితో వచ్చే ఎఱ్ఱ ఐస్ మాత్రం నా ఫేవరెట్, దాని తర్వాత ఇష్టమైనది పాలైస్, ఎప్పుడైనా వేరే ఫ్లేవర్ ప్రయత్నించాలి అంటే గోల్డ్ స్పాట్ ఐస్ మిస్ అవుతానే అని తెగ ఫీల్ అయ్యే వాడ్ని నా బాధ చూడ లేక అమ్మ "సరే రెండూ కొనుక్కో రా.." అని పర్మిషన్ ఇచ్చేది ఒకో సారి :-)

ఎఱ్ఱని గోల్డ్ స్పాట్ ఐస్ సాదా గా ఉండేది, ఇలాటి సాదా ఐస్ ల లోనే తర్వాత తర్వాత ద్రాక్ష, ఆరెంజ్, మామిడి, యాలుకలు ఇలాటి రుచులు తెచ్చేవాడు ఇవన్ని రుచి వేరైనా ఆకారం ఒకే రకంగా దీర్ఘ చతురస్రాకారపు క్యూబ్ ల్లా ఉండేవి పైన బొమ్మ లో చూపినట్లు. వీటికి భిన్నంగా సన్నగా, షడ్బుజాకారం లో సిలిండర్ లా ఉండి తెల్లగా మెరిసి పోయే పాలైస్ రుచి మాత్రం అద్భుతం గా ఉండేది. అప్పట్లో ఇది ఖరీదు ఎక్కువ కూడా, మాములు ఐస్ అర్ధరూపాయి ఉంటే ఇది రూపాయి ఉండేది. కాని రుచి మాత్రం యమా ఉండేది లెండి ఆ ఆకారం కూడా ఇంక మళ్ళీ దేనికి ఉపయోగించలేదు. కొన్నాళ్ళ తర్వాత మాములు బార్ షేప్ లో కూడా పాలైస్ తెచ్చే వాడు. దీనికే ఒక చివర కొబ్బరి కోరు అద్దితే కొబ్బరి ఐస్, సేమ్యాలు అద్దితే సేమ్యా ఐస్, యాలుకల పొడి అద్దితే ఇలాచి ఐస్. ఇలా అద్దడం కాకుండా ఒకోసారి పొడవుగా కోసిన కొబ్బరి ముక్కలు రెండు పెట్టి కూడా చేసే వాడు కొబ్బరి ఐస్, అలాగే ద్రాక్ష రుచి ఉన్న ఐస్ లో చివర రెండు ద్రాక్షాలు వచ్చేలా చేసే వాడు. సేమ్యా ఐస్ లో కూడా చివర అద్దడం కాకుండా ఐస్ అంతా నిండుగా సేమ్యాలు నింపి చేసే వాడు.

నాకు ఈ సేమ్యా ఐస్ ఎలా చేస్తారో ఎప్పటికీ అర్ధమయ్యేది కాదు. నీళ్ళలో సేమ్యా వేయగానే నీళ్ళు ఐస్ లా గడ్డ కట్టే లోపే సేమ్యా అడుగుకి వెళ్ళి పోతుంది కదా ఐస్ అంతా పరుచుకుని ఉండేలా సేమ్యాలతో ఎలా తయారు చేస్తాడా అని తెగ ఆలోచించే వాడ్ని, బహుశా కాస్త గడ్డ కట్టడం మొదలయ్యాక కలుపుతాడేమో లే అని సరిపెట్టేసుకున్నా... తర్వాత కొన్ని రోజులకి ప్యాకెట్ ఐస్ బాగా ఫేమస్ అయింది. ఈ పక్కన చూపించినట్లు పొడవాటి సన్నని ప్లాస్టిక్ ప్యాకెట్ లో రక రకాల రుచులు గల నీరు నింపి ఫ్రీజ్ చేసి తెచ్చే వాడు మనకి ఇచ్చేటప్పుడు దానికి ఒక మూల బ్లేడ్ తో కోసి అందించే వాడు ఎందుకనో మా ఇంట్లో ఈ ఐస్ కొనుక్కోడానికి ఒప్పుకునే వారు కాదు. సో ఇది మనం డబ్బులు దాచుకుని సీక్రెట్ గా బడిదగ్గర ఇంటర్బెల్ లో మత్రమే కొనుక్కోవాలనమాట. కాని ఆ అవకాశం మనకొచ్చింది బహుస్వల్పం మొత్తం మీద దీని రుచి పెద్దగా చూడకుండానే నేను స్కూల్ దాటేశాను. ఆ తర్వాత ఇవన్నీ మోటైపోయి చిన్న చిన్న పేపర్ కప్పుల్లో నాజూకుగా చెక్క స్పూన్ లతో తినే ఐస్క్రీములు ఫేమస్ అయిపోయాయి. క్వాలిటీ ఈ ఐస్క్రీమ్ మార్కెట్టును దీర్ఘకాలం ఏలింది అనుకుంటా ఆ తర్వాత అరుణ్ వచ్చేది. అప్పట్లో వీటిని మార్కెట్ చేయడానికి మాములు కప్ లు కాకుండా వాలీ బాల్ ఆకారం లో చేసిన కప్ లు కూడా వచ్చేవి క్వాలిటీ వాడివి, కానీ ఎందుకో నాకు ఐస్ నచ్చినంతగా ఐస్క్రీమ్ లు నచ్చక పెద్దగా ఫాలో అవలేదు... ఏదేమైనా పుల్లైస్ కి ఉండే రుచి ఈ ఐస్క్రీములకి ఎక్కడిది చెప్పండి.

ఇలా నేను కమ్మటి ఊహలలో ఉండగా హఠాత్తుగా వాస్తవం కరిచింది... ఈ ఐస్క్రీముల పుణ్యమో ఏమో కానీ అలాంటి ఐస్ అమ్మే చిన్న పిల్లలు తర్వాత కాలం లో ఎప్పుడూ కనిపించ లేదు, బహుశా ఇప్పుడు అసలు రావట్లేదేమో మరి. వాడు తెచ్చే ఐస్ రుచి గా ఉన్నా, వాడ్ని చూస్తే జాలేసేది. ఇప్పుడు తలచుకుంటే మరీ పాపం అనిపిస్తుంది. వాడిది మనలాగే వేసవి శలవలను ఆనందంగా ఆడుకుంటూ గడప వలసిన బాల్యం అన్న స్పృహ నాకు అప్పట్లో తక్కువే ఉండేది కానీ. ఐస్ లు నింపిన బరువైన బ్రిటానియా డబ్బాని భుజాన మోస్తూ, నిండు వేసవి మండుటెండ లో దదాపు కరిగిపోయిన తారు రోడ్, అరిగిపోయి చిల్లులు పడ్డ స్లిప్పర్స్ లో నుండి వాడి లేత అరికాళ్ళపై తన ప్రతాపాన్ని చూపిస్తుంటే, పరుగో నడకో అర్దం కాని నడక తో వాడు ఇంటింటికీ తిరిగే వాడు. పాపం భుజాన అన్ని ఐస్ఫ్రూట్ లు ఉన్నా దాహం తీర్చుకోవాలంటే ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఇచ్చే గుక్కెడు మంచినీళ్ళే గతయ్యేవి. ఒకోసారి నాతో పాటు మా వీధిబడి లో చదివే పిల్లలు కూడా ఇలా అమ్మడానికి వచ్చేవారు. వాళ్ళ అవస్థలు తలచుకుంటే ఈ పుల్లైస్ లు ఇపుడు తక్కువగా దొరకడమే మంచిదైందేమో అనిపిస్తుంటుంది.

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

సంస్కారం a.k.a. manners

ఒకో సారి ఓ వ్యక్తి మనకి నచ్చలేదు అంటే అతనికి సంభందించిన ఏ విషయమూ మనకి నచ్చవేమో కదా... దానికి తోడు ఆ వ్యక్తి సకల కళా వల్లభుడైతే ఇక చెప్పాలా... ఈ టపాకి మొదట చుట్టా, బీడీ, సిగరెట్.. అని పెడదాం అనుకున్నాను, ఆగండాగండి, పొగాకు ప్రియులంతా నా పై దండెత్తి రాకండి, ఈ టపా ఉద్దేశ్యం ఫలానా అలవాట్లు మంచివి, ఫలానావి కావు అని చెప్పడానికి కాదు. సదరు అలవాట్లు ఉన్న ఒకరిద్దరు వ్యక్తుల వలన నాకు కలిగిన అసౌకర్యం గురించి చెప్పడానికి మాత్రమే. సాధారణంగా నా ముక్కుకు సెన్సిటివిటీ ఎక్కువ, ఎంత ఎక్కువ అంటే ఒకోసారి నా చెమట వాసన కి నాకే చిరాకు వస్తుంటుంది, అందుకే నేను సాధారణం గా డియోడరెంట్ లో ఇంచుమించు స్నానం చేసినంత పని చేసి ఆఫీసుకు వెళ్తాను. అలాంటిది ఇక సిగరెట్లు, ఖైనీ, గుట్కా లాటి పొగాకు వాసన అయితే ఇక నా అవస్థ మాటల్లో చెప్పలేను. సిటీ బస్సుల్లో ప్రయాణించడం నాకు నచ్చక పోవడానికి ఇదికూడా ఒక కారణం. ఆఫీస్ లో ఇది వరకూ పక్క సీట్ వ్యక్తి దమ్ము కొట్టి వచ్చిన వెంటనే నేను కాఫీ బ్రేక్ తీసుకుని వాడి కి దూరం గా కాసేపు గడిపి వచ్చే వాడిని లేదంటే కాసేపు నా పని చెడి పోయేది. నా అదృష్టం కొద్దీ గత రెండేళ్ళుగా అలాటి వాళ్ళ పక్క క్యూబికల్స్ అలాట్ అవకపోడం వలన బతికి పోయాను.

ఇక సదరు హీరో గారు మా అఫీసులోనే పని చేస్తారు. నేను ఇది వరకు పని చేసిన ఒక ప్రాజెక్ట్ లో పని చేశారట "తెలుగు మాట వినిపిస్తే అదో ఆనందం బాసూ చాలా రోజుల తర్వాత ఇక్కడ నిన్ను చూశా" అని అంటూ పరిచయం చేసుకున్నాడు. ఓహొ తెలుగంటే అభిమానం కాబోలు అని నేనూ ఎదురుపడినపుడు ఒకటి అరా మాట్లాడేవాడ్ని. ఈ మధ్యే కొన్ని కారణాల వలన ఇతను ఉండే పక్క క్యాబిన్ లో కి నేను మారాల్సి వచ్చింది. ఇప్పడిప్పుడే అయ్యవారి లీలలు ఒకటొకటి బయట పడుతున్నాయ్. ఆఫీస్ టైం లో దర్జాగా సిగరెట్ కాల్చి రావడం ఒక ఎత్తైతే అది కాల్చి వచ్చి నా సీట్ దగ్గరలో నిలబడి పెద్ద పెద్ద గా అరుస్తూ ఏదో ఫోన్ మాట్లాడేస్తుంటాడు. ఆ వాసన భరించ లేక ఒకటి రెండు సార్లు చెప్పి చూశాను అయినా ఏ మాత్రం మార్పు లేదు. ఇదిలా ఉంటే ఒకోసారి గుట్కా నో, ఖైనీ నో ఏదో చెత్త నముల్తూ నోటికి ఒక పక్క నుండి ఆ సొల్లు కారుతూ ఉండగా, భయంకరమైన దుర్గంధం వెదజల్లుతూ, ఆ నోటి తుంపర మన మీద పడుతుందేమో అనే ధ్యాసైనా లేకుండా మొహం మీదకి వచ్చి మాట్లాడుతుంటాడు.ఆప్పటికీ నేను అసహ్యం చిరాకు, కోపం ఇత్యాది భావాలనన్నీ కలగలిపిన అతి భయంకరమైన ముఖ కవళికలతో దూరం జరగడానికి ప్రయత్నిస్తూ మాటలు ఎక్కడివి అక్కడ తుంచేయడానికి ప్రయత్నిస్తుంటాను. అయినా అతనికి నా మీద కనికరం కలగదు. అభిమానానికి ముచ్చట పడాలో అలవాట్ల తో అవస్త పెడుతున్నందుకు బాధ పడాలో అర్ధం కాదు ఒకో సారి.

ఇక ఈ మానవుడి మరో అద్వితీయమైన అలవాటు త్రేన్పులు (burping/belching). భోజనం సమయం లో కడుపు నిండిన దానికి గుర్తు గా ఓ చిన్న త్రేన్పు వస్తే, కష్టపడి వండిన వారికి ఓ చిన్న అభినందన / కాంప్లిమెంట్ లాగా అందంగానే ఉంటుంది. కానీ మన వాడు మనిషి సన్నగానే ఉంటాడు కానీ సిగరెట్లు, గుట్కా పొగాకు వంటి వాటితో ఎసిడిటీ తెచ్చుకున్నాడల్లె ఉంది, తెస్తే తెచ్చుకున్నాడు అది అతని ఆరోగ్యం అతనిష్టం కానీ ఆ ఏడుపేదో అతని సీట్ దగ్గర ఏడిస్తే మనకేమీ అభ్యంతరం లేదు. గంటకోసారి హడావిడి గా అతని సీట్ లోనుండి లేచి నా క్యూబికల్ లోకి వచ్చి అతి జుగుప్సాకరం గా అత్యంత దీర్ఘం గా ఇంచు మించు వాంతి చేసుకుంటున్నాడేమో అన్నట్లు అతిభయంకరమైన త్రేన్పు ఒకటి త్రేన్చేసి నాకు మహా చిరాకు తెప్పిస్తాడు. ఆ పనేదో అతని సీట్ లో చేయచ్చు కదా అసలేమిటి ఇతని ఉద్దేశ్యం అని నా కొలీగ్ కూడా నాతో చర్చించినా మేం ఆ విషయం ఏంటో కనిపెట్ట లేకపోయాం.

అతను సీట్ వదిలి వెళ్ళాలి అంటే నా క్యూబికల్ మీదుగానే వెళ్ళాలి అదో పనిష్మంట్ నాకు. పదినిముషాలకోసారి అటుగా వెళ్తూ సెల్ఫోన్ లో అరుస్తూ మాట్లాడుతూ నా కుర్చీ వెనకాల నిలబడి నా సిస్టం లోకి తొంగి చూస్తుంటాడు. ఎపుడైనా వ్యక్తిగత ఈమెయిల్స్ చేస్తున్నపుడు సైతం ఇతను ఏమాత్రం సంస్కారం లేకుండా అలా తొంగి చూస్తుంటే లాగి పెట్టి ఒకటి కొట్టాలని అనిపిస్తుంది. మొత్తం మీద ఎవరికైనా basic manners మీద ట్రైనింగ్ ఇవ్వాలి అంటే మా వాడ్ని ఒకరోజు గమనించమని చెప్పి, "అదిగో అతని లా ఉండకు చాలు.. ఇంకెలా ఉన్నా నీకు మ్యానర్స్ వచ్చేసినట్లే ఫో.." అని చెప్పచ్చు. కనుక ఈ టపా చదివిన వారిలో ఎవరికైనా లేదా మీఆత్మీయులకైనా ఈ పైన చెప్పిన అలవాట్లు ఉంటే.. వారు ఈ ప్రపంచం లో తాము తప్ప మరో జీవి లేడన్నట్లు గా బొత్తిగా ఇతరుల ఇబ్బందులను గమనించకుండా నడుచుకుంటుంటే కనుక.. కాస్త మారండి/మారమని చెప్పండి ప్లీజ్!! మీ స్వేచ్చ ఇతరులకు ఇబ్బంది కలిగించ కూడదు కదా. (మన బ్లాగ్ లోకం లో ఇటువంటి వారు లేరనే అనుకుంటున్నాను).

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2009

ఇది నిజమేనా ??

కోట్లాది అభిమానుల గుండెల్లో గత ఇరవై నాలుగు గంటలు గా పదే పదే మొలకెత్తు తున్న ప్రశ్న ఇది. చెరగని చిరునవ్వుకీ, నిండైన తెలుగు తనానికీ, ఎదురు లేని ఆత్మ విశ్వాసానికీ, తిరుగులేని మొండిధైర్యానికీ కలిపి రూపం ఇచ్చినట్లుగా ఉండే మన YSR (డాక్టర్ ఎడుగూరి సంధింటి రాజశేఖరరెడ్డి) గారు ఇక లేరు అనీ ఇకపై కేవలం వీడియో లు ఫోటోల లోనే కనపడతారనీ.. ప్రజల గుండెల్లో ఏర్పరచుకున్న చెరగని స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు అని తెలిసిన ప్రతి ఒక్కరూ అయ్యో అనుకోక మానరు. కనపడుట లేదు అని ప్రకటించిన దాదాపు ఇరవై నాలుగు గంటల తర్వాత chopper was found burnt అని వార్తలు వచ్చినా... "ఏమో ఒక వేళ ముందే దూకేసి ఉండచ్చేమో.." అనే అత్యాశ తో ఓ వైపు, "లేదు అంతా అయిపోయింది ఇక అధికారిక ప్రకటనే మిగులుందేమో.." అనే అనుమానం ఒక వైపు మెలిపెడుతుండగా ఎదురు చూసిన అభిమానులను నిరాశ పరుస్తూ పిడుగు లాటి వార్త బయల్పడింది. పగవాడికి కూడా వద్దు ఇలాటి మరణం అనుకునే విధం గా ఆయన పొందిన హఠాన్మరణం తీవ్రం గా కలచి వేసింది, i hate helicopters అనుకునేలా చేసింది.

నాకు రాజకీయ పరిఙ్ఞానం చాలా తక్కువ. ఎవరో బాగా పేరు పొందిన నాయకుల గురించి తప్ప తెలియదు. ఇప్పటి వరకూ నా జీవితం లో కరచాలనం చేసిన రాజకీయనాయకులు ఇద్దరే ఇద్దరు ప్రత్యక్షంగా చూసిన వారు కూడా అంతే. ఒకరు నేను ఇంటర్మీడియేట్ చదివే కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ కి వచ్చిన ఇప్పటి బీజేపీ నేత వెంకయ్య నాయుడు గారు. ఇంకొకరు నేను ఇంజనీరింగ్ చదివే సమయం లో వైజాగ్ తాజ్ హోటల్ కి మరి కొందరు విధ్యార్ది నాయకులతో కలిసి వెళ్ళి కలిసిన అప్పటి యువజన నాయకుడు వైయస్సార్. ఆయనని నమ్మిన వారిని ఖచ్చితంగా ఆదుకుంటారు, సాయం చేసిన వారిని పేరు పేరునా గుర్తు పెట్టుకుంటారు. చాలా మంచి నాయకుడు. ఖచ్చితంగా కాబోయే ముఖ్య మంత్రి అని తోటి విధ్యార్దులు అందరూ అంటున్నా ఆ అభిమానులు అన్న తర్వాత ఆమాత్రం పొగడరా అని అనుకుంటూనే వెళ్ళాను. ఆయన రాత్రి పదీ పదకొండు గంటల మధ్య అయినా ఏమాత్రం విసుగు కనపడనివ్వకుండా చెరగని చిరునవ్వుతో పలకరించి ఆప్యాయంగా మాట్లాడిన వైనం నన్ను సంభ్రమానికి గురిచేసింది నాయకుడు ఇలానె ఉంటాడేమో అనిపించింది. ఆ తర్వాత కొన్నేళ్ళకి ముఖ్య ప్రతిపక్ష నేతగా ఎదిగి కాంగ్రెస్ పని అయిపోయింది రా అని అన్న వాళ్ళు ఆశ్చర్య పడేలా ఒక్క చేత్తో పార్టీ నీ గెలిపించి తిరుగు లేని నాయకుడై నిలిచాడు.

ఎందరు ఏమన్నా మూర్తీభవించిన తెలుగుతనం లా తీరైన పంచకట్టు తో చెరగని చిరునవ్వు తో హుందాగా నడచి వచ్చే ఆ నాయకుడు ఇక పై కనపడరు అంటే జీర్ణించు కోడం కష్టంగానే ఉంది. ప్రతిపక్షం చిందులు తొక్కుతుంటే చెదరని ఓ చిన్న చిరునవ్వుతో వారి ని అదుపులో పెట్టి, తను చెప్పాల్సింది చెప్పేసి, చేయాల్సింది చేసేసే నాయకుడ్ని మళ్ళీ ఎప్పుడు చూస్తామో . ఏదేమైనా "చిందు కన్నీటి ధారా ప్రేమనే తెలుపులే !" అన్నట్లు శోక సంద్రమైన రాష్ట్రం ఆయన గెలుచుకున్న ప్రేమ ని స్పష్టంగా తెలియచేస్తుంది. తననుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించే తత్వమే "చెప్పకుండా వెళ్తున్నా.." అని చెప్పి మరీ వెళ్ళిపోయేలా చేసిందని బాధ పడడం తప్ప ఎవరైనా ఏమి చేయగలం. ఆ మహా మనిషి కీ ఆయనతో పాటు ఈ దుర్ఘటనలో మరణించిన వారందరి ఆత్మలకూ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్షణం నాయకుడు సినిమా లోని ఈ లైన్లు గుర్తుకొస్తున్నాయ్.

ఓ చుక్క రాలింది !!
ఓ జ్యోతి ఆరింది !!
కన్నీరు మిగిలిందీ !!
కధ ముగిసిందీ !!

ఈ ఫోటోలను ప్రచురించి Hindu వారికీ అవి నా కళ్ళబడేలా చేసిన త్రివిక్రం గారికీ ధన్యవాదాలు.

శనివారం, ఆగస్టు 15, 2009

ఈటీవీ --> ఝుమ్మంది నాదం2

మొన్న సోమవారం రాత్రి 9:20 కి హడావిడిగా ఆఫీసులో అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి ఇంటికి పరిగెట్టుకు వచ్చాను. కారణం ముందు రోజు చూసిన ఈటీవి ఝుమ్మంది నాదం వాణిజ్య ప్రకటన. ఆ ప్రోగ్రాం సోమవారం రాత్రి 9:30 కి ప్రసారమవుతుంది. మొన్న సోమవారం బాలమురళీ కృష్ణ గారి తో ప్రోగ్రాం. ఈ సోమ వారం తరువాయుభాగం కూడా ప్రసారమౌవుతుంది. కానీ ఈ రోజు నా స్కెడ్యూల్ ప్రకారం వీలవుతుందో లేదో అని గాబరాగా ఉంది. కానీ ఏంచేస్తాం లైఫ్ ఈజ్ జిందగీ.. అనుకున్నామనీ జరగవు అన్నీ.. అనుకోలేదనీ ఆగవు కొన్నీ.. అని పాడేసుకోడం అంతే.. అసలు సుమన్ వదిలేసాక మళ్ళీ ఈటీవి కి మంచి రోజులు వచ్చాయి. నేను తిరిగి ఆ చానల్ చూడటం మొదలు పెట్టాను. ఈ ప్రోగ్రాం గాయని సునీత ఆధ్వర్యం లో సాగుతుంది. మాములుగానే బాగుంటుంది ఇక మొన్న బాలమురళి గారంటే చెప్పనే అఖ్కర్లేదు కదా.
పండుటాకు లా ఆ మహానుభావుడు కళ్ళెదురుగా అక్కడ కూర్చుని మాటే పాట లా మాట్లాడుతూ మధ్య మధ్య లో కొన్ని పాటలు పాడుతూ ఉంటే నాకు ఒళ్ళంతా కళ్ళు చెవులూ ఉంటే ఇంకా ఎంత బాగా ఆస్వాదించవచ్చో కదా అనిపించింది. నేను ఒక ఇరవైనిముషాలు ప్రోగ్రాం మిస్ అయ్యాను కానీ విన్నా ఆ కాస్తా చాలు అని అనిపించే లాటి పాటలు పాడారు ఆయన. నర్తనశాల నుండి "సలలిత రాగ సుధా రస.." పాట కి సునీత కూడా గొంతు కలిపి, తన అదృష్టానికి పొంగి పోయింది. తత్వాలు పాడుతూ ఆయన మాదేవ శంభో... అన్న చోట భో అంటూ దీర్ఘం తీసినపుడు సాక్షాత్తూ శంఖం నుండి వచ్చే ఓంకార నాదాన్ని పలికించి అబ్బుర పరచారు. ఈ వయసు లో కూడా ఆయన గాత్ర ధాటి ఏమాత్రం తగ్గలేదు. నా అదృష్టమో లేక తను కూడా సమయం తక్కువ కనుక ఆ థిల్లాన ఎంచుకున్నారో కానీ నా బ్లాగ్ లో లిరిక్స్ ఇచ్చిన బృందావని తిల్లానా ని ఆ కార్యక్రమం లో పాడారు, నాకు చాలా సంతోషం వేసింది.

ఇక మధ్య మధ్య లో చిన్న చిన్న చతురోక్తుల తో ఆసక్తికరంగా సాగింది. మీరు సినిమాల లో ఎక్కువ ఎందుకు చేయలేదు అంటే .. "ఏం చేయమంటావమ్మా ఒక సారి నారద పాత్ర చేశా కదా అని అన్ని అవే వస్తున్నాయ్, హీరోయిన్ లేకుండా నేను ఎందుకు చేయాలి? నేను చేయను.. హీరోయిన్ ఉన్న పాత్ర తీసుకురండి తప్పకుండా చేస్తాను అన్నాను అంతే నన్ను పిలవడం మానేశారు...ఇప్పుడైనా సరే అదే చెప్తున్నాను హీరోయిన్ ఉన్న పాత్ర చూపించండి ఎందుకు చేయనూ.. ఏం చేయలేనా.. " అంటూ హాస్యమాడటం ఆయనకే చెల్లింది. మొత్తం మీద కార్యక్రమం అంతా వొళ్ళంతా చెవులు చేసుకుని విని అనందించాను. మీకు కుదిరితే ఈ రోజు రాత్రి ప్రోగ్రాం మిస్ అవకండి, నేను కూడా సాధ్యమైనంత వరకూ మిస్ అవకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను.

ఈ కార్యక్రమం నాకు ఇంతగా నచ్చడం వెనుక యాంకర్ గా సునీత పాత్ర కూడా లేకపోలేదు. గాయనీ మణుల్లో అత్యంత అందమైన, అందం కంటే కూడా మంచి కంఠస్వరం, చక్కని చీర కట్టు తో ఆకట్టుకునే సునీత గారి ప్రోగ్రాం చూస్తూ నన్ను నేను మరచిపోతుంటాను.. తన నవ్వు కూడా ఇంత లా నోరంతా తెరచి మనస్పూర్తిగా నవ్వు తూ ఎంత స్వచ్చంగా ఉంటుందో. అన్నట్లు ఎప్పటి నుండో ప్రారంభించాలి అనుకుంటున్న నా పాటల బ్లాగ్ కు మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక రూపం ఇచ్చాను. ఒక సారి అక్కడకు కూడా విచ్చేసి మీ ఆశీస్సులు అందించండి. బ్లాగ్ పేరు సరిగమల గలగలలు. ఇక్కడ క్లిక్ చేస్తే చూడవచ్చు.

మంగళవారం, ఆగస్టు 11, 2009

వర్షాన్ని విందామా !!

అబ్బే! వర్షం సినిమా పాటలు కాదండీ బాబు, మామూలు వర్షం గురించే నే చెప్తున్నది. మొన్న శనివారం మధ్యాహ్నాం సుష్టుగా భోంచేసి వారం రోజుల కరువంతా తీరేలా నిద్ర పోయానా.. సాయంత్రం లేచే సరికి జోరుగా వర్షం... నే లేచే సరికి వర్షమో లేక వర్షమే నన్ను నిద్ర లేపిందో మరి సరిగా తెలియలేదు. కానీ అంత వర్షం చూసే సరికి లోపల కుదురుగా కూర్చోలేకపోయాను. బయట రోడ్ మీదకి వెళ్ళి తనివి తీరా తడిచి తదాత్మ్యం చెందాలనీ.. అక్కడక్కడా నీళ్ళు నిలిచిన చిన్ని చిన్ని గుంటల్లో ఎగిరి దూకి ఆ నీళ్ళని పక్కలకి చిందించి మళ్ళీ అవి తూచ్ తూచ్ అని హడావిడిగా గుంటల్లోకి వెళ్ళిపోడాన్ని ఆనందంగా చూడాలనీ.. గోడలపై నిలచిన కాసిని నీళ్ళ పై పడే వర్షపు చినుకు లు సృష్టించే అలల అలజడి ని కనులారా చూడాలనీ.. అప్పటి వరకూ ఎక్కడ దాక్కుంటాయో కానీ వర్షం పడగానే బెక బెక ల సరిగమలు వినిపించడానికి వేంచేసే కప్పగారి గాత్ర కచేరీలు వినాలనీ మనసు వెర్రి మొర్రి ఆలోచనలు చేయడం మొదలు పెట్టింది.

తప్పునాన్న ఇప్పుడో పెద్దరికం ఒకటి ఏడ్చింది కదా ఇవన్నీ చేస్తే చుట్టూ ఉన్న జనాలు వింతగా చూసే అవకాశం ఉంది కనుక నువ్వు సైలెంట్ అయిపో అని బుద్ది చెప్పి కూర్చో పెట్టేశాను అనుకోండి కాకపోతే పోర్టికోలో ఏదో పని ఉన్నట్లు అక్కడ అవి ఇవీ సర్ధుతూ కాస్త వర్షం లో తడిచా :-) అప్పటి వరకూ తలుపులు బిగించి నిద్ర పోవడం వల్ల వేడిగా ఉన్న ఒంటి పై చల్లని వాన చినుకు పడగానే ... జిల్లు మని ఎంత హాయి గా ఉందో.. ఈ ఆనందం ఇంకెక్కడా దొరకదేమో ఈ వర్షం లో తప్ప అనిపించింది (షవర్ తిప్పుకున్నా దొరుకుతుంది బాస్ అని అంటే నేనేం చెప్పలేను:). అలా కాసేపు బయటే నిలబడి గోడ పై బడి విచ్చిన్నమౌతున్న వాన చినుకులనీ, ఉధృతమైన వాన చినుకుల తాకిడికి కిందకి వాలిపోయి అంత లోనే మేమేమీ తక్కువ తినలేదు అంటూ తిరిగి పైకి రావడానికి ప్రయత్నించే చెట్ల ఆకులనీ సున్నితమైన పూవులనీ చూస్తూ.. ఆకులపై పడుతూ అల్లరి గా వాన చేసే చప్పుడుని చెవులప్పగించి వింటూ, చల్లటి గాలినీ, అప్పుడప్పుడూ తనువును తడిమి పలకరించిన వాన తుంపరనీ మనస్పూర్తిగా అస్వాదిస్తూ కాసేపు బయటే గడిపి మెల్లగా తిరిగి లోపలికి వచ్చాను.లోపలికి వచ్చి ఫ్యాన్, టీవీ లాటి శబ్ధ కాలుష్య కారకాలన్నిటినీ ఆపేసి కిటికీ లు తలుపులు పూర్తిగా తెరచి బయట కురుస్తున్న వర్షాన్ని వింటూ ఆ సాయంత్రాన్ని ఆనందంగా గడిపాను. ఈసారి మీరూ ప్రయత్నించి చూడండి వర్షాన్ని వినడం ఎంత బాగుంటుందో... వాన ఉధృతిని పట్టి ఒకో రకమైన శబ్దం వస్తుంది. మొక్కలపై కురిసే చిరుజల్లులు ఒకలా వినిపిస్తే, కొబ్బరాకులపై కురిసే వాన మరొకలా వినిపిస్తుంది. మెత్తటి మట్టిపై నిశ్శబ్ధం గా కురిసే వాన అద్భుతమైన అద్వితీయమైన కమ్మటివాసనని అందిస్తే, రాళ్ళపై కురిసే వాన చేసే హడావిడి చప్పుళ్ళుకి అంతే లేదు, ఇక వడగళ్ళ వాన చేసే శబ్దం గురించైతే ఇంక చెప్పనే అక్కరలేదు. మీరెపుడైనా నది దగ్గర కానీ కాలవ దగ్గర కానీ ఉన్నపుడు వర్షపడటం చూశారా.. నీళ్ళపై పడే వాన పలికించే టప టప ల సంగీతం ఒక ఎత్తైతే అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న నీటిపై చినుకులు సృష్టించే వేల కొద్దీ అలలు ఒకదాని తో ఒకటి పోటీ పడుతూ, ఒకదానిలో ఒకటి కలిసి పోతూ కలిగించే అలజడి చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. ఇక సముద్రం పై వాన పడటం ఎపుడైనా విన్నారా / చూశారా... నేను వైజాగ్ యూనివర్సిటీ లో ఉన్నరోజులలో నాకు ఈ ఆనందం దక్కింది. అనంతమైన నీటి పై జోరు గా పడుతున్న వాన చినుకులు సృష్టించే హోరు ఇంతా అంతా కాదు, హడావిడిగా ఉండే బీచ్ నుండి కాస్త ప్రశాంతమైన చోటికి వెళ్ళి శ్రద్దగా వింటే ఒక చిత్రమైన హోరు తో కలిసిన లయబద్దమైన సంగీతాన్ని వింటున్నట్లే అనిపిస్తుంది.

సరే మొన్న ఒక్క సారిగా ఇంత వర్షాన్ని వినీ, ఆస్వాదించి, ఆనందించీ.. ఆహా వర్షాన్ని వినడం చాలా బాగుంది కదా.. ఓ టపా రాసేద్దాం వీలైతే ఈ సారి వర్షాన్ని రికార్డ్ కూడా చేసేద్దాం అని తీర్మానించుకున్నాను. అంతలో అసలు ఈ వీడియోలు యూట్యూబ్ లో ఇప్పటికే ఉండి ఉంటాయేమో అని వెతికితే వేలకొద్ది దొరికాయి. వాటిలో మొదట కన్పించి ఉరుముల అలజడి లేకుండా కేవలం వర్షాన్ని మాత్రమే రికార్డ్ చేసిన ఈ వీడియో నాకు బాగా నచ్చింది ప్రజంటేషన్ కూడా మంచి చిత్రాల తో తయారు చేశారు. సో అది మీ అందరి కోసం ఇక్కడ ఇస్తున్నాను. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ కురిసిన వర్షపాతాన్ని గమనిస్తే... మన భావి తరాల వారు ఇక వర్షాన్ని ఇలాటి వీడీయోల లోనే చూసుకోవలసిన పరిస్తితి వస్తుందేమో !!

శనివారం, ఆగస్టు 01, 2009

సిగలో.. అవి విరులో -- మేఘసందేశం

గత రెండు మూడు వారాలు గా ఈ పాట నన్ను వెంటాడుతుంది, ఎంతగా అంటే ఎక్కడో అడుగున పడిపోయిన నా కలక్షన్ లో వెతికి వెతికి వెలికి తీసి తరచుగా మళ్ళీ వినేంతగా. కారణం ఏమిటో తెలియదు కానీ ఈ ఆల్బం ఎందుకో సంవత్సరానికి ఒక్క సారైనా ఇలా బాగా గుర్తొస్తుంది. అప్పుడు ఒక నెల రెండు నెలలు వినేశాక కాస్త మంచి పాటలు ఏమన్నా వస్తే మళ్ళీ అడుగున పడి పోతుంది. కానీ అక్కడే అలా ఉండి పోదు మళ్ళీ హఠాత్తుగా ఓ రోజు ఙ్ఞాపకమొచ్చి మళ్ళీ తనివి తీరా వినే వరకూ అలా వెంటాడూతూనే ఉంటుంది. మంచి సంగీతం గొప్ప తనం అదేనేమో మరి !! ఈ సినిమా గురించి కానీ సంగీతం గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్పగలిగినది ఏమీ లేదు. నాకు బాగా నచ్చే సినిమాల మొదటి జాబితా లో ఉంటుంది. కధ, సంగీతం, నటీనటుల నటన వేటికవే సాటి. ఈ సినిమా గురించి తెలియని వారుంటే తెలుసు కోడానికి నవతరంగం లో ఈ వ్యాసం చదవండి. ఈ ఆల్బం లో పాటలు అన్నీ ఒక దానిని మించి ఒకటి ఉంటాయి. సరే మరి నన్ను వెంటాడుతున్న ఈ పాట ని మీరూ ఓ సారి ఇక్కడ చిమట మ్యూజిక్ లో విని ఆనందించండి. మొన్నేమో కళ్యాణం, ఇప్పుడేమో సిగలు, విరులు, అగరు పొగలు అసలూ... "సంగతేంటి గురూ !!" అని అడగకండేం :-)


చిత్రం: మేఘసందేశం
గానం: కె. జె. ఏసుదాస్
సాహిత్యం :దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : రమేష్ నాయుడు.

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు..
ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు..
మదిలోనా గదిలోనా... మదిలోనా గదిలోనా...
మత్తిలిన కొత్త కోరికలూ...నిలువనీవు నా తలపులు..
మరీ మరీ ప్రియా..ప్రియా...
నిలువనీవు నా తలపులూ.. నీ కనుల ఆ పిలుపులూ..

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

జరిగి ఇటు ఒరిగీ... పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగీ... పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అర విడినా.. చిగురాకు పెదవుల మరిగీ..
చిరునవ్వుల అర విడినా.. చిగురాకు పెదవుల మరిగీ..
మరలి రాలేవు నా చూపులూ.. మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులూ.. మధువుకై మెదలు తుమ్మెదలూ...

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

బుధవారం, జులై 29, 2009

కలవరమాయేమదిలో !!

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే
పలికే.. స్వరాలే ఎదకే.. వరాలై
పదాలు పాడు వేళలో కలవరమాయే.. మదిలో...

కలవరమాయేమదిలో!! ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రం అని ఖచ్చితంగా చెప్పను కానీ, మంచి తెలుగు చిత్రాలు రావాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూసి ప్రోత్సహించ వలసిన చిత్రం. హీరో గా కమల్ కామరాజు అందం :-) అక్కడక్కడా స్క్రీన్ ప్లే లోపాలూ పంటి కింద రాళ్ళ లా తగుల్తూ ఉన్నా... ఆకట్టుకునే స్వాతి నటన, ఆహ్లాదకరమైన మంచి సంగీతం, చక్కని కథాంశం, ఆలోచింప చేసే కొన్ని సంభాషణలు, పాటలలో వనమాలి గారి అర్ధవంతమైన సాహిత్యం తో ఓ ప్రత్యేకమైన చిత్రం గా నిలబడుతుంది. ఈ చిత్ర నిర్మాత దర్శకుడు చేసిన ఈ మంచి ప్రయత్నానికి ప్రోత్సాహం అందించ వలసిన అవసరం ఎంతైనా ఉంది, ఆ ప్రోత్సాహం మరికొందరి నిర్మాతల/దర్శకుల ఆలోచనా ధోరణి ని ప్రభావితం చేయగలిగితే అంత కన్నా తెలుగు చలన చిత్ర అభిమానులకి కావలసినదేముంది.


స్వాతి కలర్స్ ప్రోగ్రాం చేసేప్పుడు ఒకోసారి ఈ అమ్మాయెవరో బాగా మాట్లడుతుంది అనుకున్నా ఒకోసారి మరీ ఇంత ఒవర్ యాక్షన్ అవసరమా అనుకునే వాడ్ని. మెల్లగా సినిమాలలో ప్రవేసించింది చూస్తున్నాం కానీ నన్ను అమితంగా ఆకట్టుకున్న పాత్ర మాత్రం ఆడవారి మాటలకి అర్ధాలే వేరు లే చిత్రం లో, ఆ సినిమా లో నాకు నచ్చిన అంశం కేవలం స్వాతి పాత్రే. చాలా బాగా చేసింది అనిపించుకుంది. ఇక అష్టాచెమ్మా చిత్రం లో అక్కడక్కడా బాగానే ఉందనిపించినా శ్రీనివాస్ డామినేట్ చేయడం, చాలా చోట్ల అతి గా అనిపించడం వల్ల పెద్దగా నచ్చ లేదు. ఇక ఈ సినిమా లో కొన్ని చోట్ల వెటకారం గా ఆహా!! అనిపించినా సినిమా మొత్తం మీద చాలా సార్లు ముచ్చట పడిపోయి సోక్యూట్ అనీ, మరి కొన్ని సార్లు వహ్వా!! అనీ అనిపించుకునే నటన ని ప్రదర్శించింది. మరి ఆ పాత్రని అలా మలిచారేమో ఆ ఎఫెక్టే ప్రతిఫలించిందేమో తెలియదు. హీరోతో పీకల్లోతు ప్రేమ లో మునిగి పోయిన సన్నివేశాల్లో ఎంత బబ్లీగా ఆకట్టుకుంటుందో.. తన లక్ష్య సాధన కోసం తపించి పట్టుదలగా ప్రయత్నించడం లోనూ, మరి కొన్ని బరువైన సెంటిమెంటి సన్నివేశాలలోనూ అంతగానే ఆకట్టుకుంది.

ఇక సంగీత ప్రధానమైన కథాంశం తో వెలువడిన ఈ చిత్రం లో శరత్ వాసుదేవన్ సంగీతం చక్కగా ఉంది. అన్నీ క్లాసికల్ సాంగ్స్ లేదా కీర్తనలు అందించాలి అని అలోచించకుండా సమ పాళ్ళ లో మామూలు పాటలు, "కరివరదుని", "గురుర్బ్రహ్మ", "పల్లవించని.." లాటి పాటలూ ఉంచి ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు. సింగిల్ కార్డ్ గీతరచయిత గా వనమాలి గారు మంచి సాహిత్యాన్ని అందిస్తే... దాని కి సరైన ప్రాధాన్యతను ఇస్తూ వాయిద్యాల హోరు సాహిత్యాన్ని మింగేయకుండా జాగ్రత్త పడుతూ.. మంచి ఆర్కెస్టైజేషన్ తో వినసొంపైన బాణీలు కూర్చారు వాసుదేవన్. ఇక చిత్ర గారి గానం గురించి ప్రత్యేకించి నేచెప్పేది ఏముంది.

కమల్ కామరాజు ని భరించగలిగితే సినిమా చూడటానికి ఇక మీరు ఏమీ ఆలోచించ వలసిన అవసరం లేదు. అతను అందం తో కండల ప్రదర్శనతో విసిగించినా... స్వాతి కి క్లాస్ పీకే సన్నివేశాల్లో అతని ప్రాముఖ్యత అపారం. ముఖ్యం గా లక్ష్యం గురించి చెప్తూ చెప్పిన డ్యాష్ ఫిలాసఫీ (వివేకానందుడి ఫోటో చూపిస్తే ఆయన గురించి చెప్తారేమో అనుకున్నా..కానీ చిన్న సరెప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు), ఇంకా అమ్మ గురించి చెప్తూ.. ఒకోసారి సింపతీ మన విచక్షణ ని ఎంతగా ప్రభావితం చేస్తుందో, ఓ అంశాన్ని లేదా సమస్యని ఇతరుల దృఃక్కోణం నుండి పరిశీలించడం ఎంత అవసరమో ఆలోచించేలా చెప్పే సంభాషణలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. నాకు అవకాశం దొరికిన వెంటనే ఈ చిత్రాన్ని మళ్ళీ థియేటర్ లో చూస్తాను, మీరూ చూడండి.

ఈ సినిమా లోని కొన్ని పాటల పల్లవులు మీకోసం. కేవలం సాహిత్యపు రుచి చూడటానికే అనమాట. "ఓ నేనే ఓ నువ్వని.." పాట మంచి మెలొడీ తో ఆకట్టుకుంటే.. "నీలో అణువంత.." అల్లరిగా ఆకట్టుకుంటుంది.. టైటిల్ సాంగ్ "కలవరమాయే మదిలో..." మన మదిని కలవరపరిస్తే.. "తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న.." పాట హుషారుగా సాగిపోతుంది. ఇక ఈ టపా చివరలో ఇచ్చిన, చిత్రం క్లైమాక్స్ లో వచ్చే "పల్లవించనీ.. నా ప్రథమ కీర్తనం.." సాహిత్యం సినిమా అంతా చూశాక చాలా అర్ధవంతంగా అనిపించి మనసంతా ఆర్ధ్రతతో నింపేస్తుంది.

తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న థిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటున
నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా?
దరి చేరే స్వరము నాకో వరము
ప్రతి రోజూ పదము పాడే సమయాన
నన్నే నీలో కన్నా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

నీలో అణువంత ప్రేమున్నా.. అనుమానం రేగేనా..నాతో తగువే తగునా...
చాల్లే తమ తీరు చూస్తున్నా.. మితి మీరి పోయేనా..అంతా ఒకటే నటనా..
నా ప్రేమ సంతకాల సాక్ష్యాలే చూపనా..
ఏం మాయ చేసినా నీమాటే చెల్లునా..
నాపై..కోపాలేనా..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఓ నేనే.. ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమనీ..నీ గూటికే రానీ..
నేనంటూ ఇక లేననీ.. నీ వేంటే ఉన్నాననీ..చాటనీ..
చేశానే నీ స్నేహాన్నీ... పోల్చానే నా లోకాన్నీ..నీవాణ్ణీ..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

మాతృదేవోభవ! పితృదేవోభవ!
ఆచార్యదేవోభవ!

పల్లవించనీ నా ప్రథమ కీర్తనం
ఒక మాతృప్రేమకే ఓంకారముగా
ప్రణమిల్లి పాడనీ నా హృదయ స్పందనం
ఒక తండ్రి కలలకే సాకారముగా
జన్మను పంచిన జననీ జనకుల
ఆలనలే ఆలాపనగా
అనురాగములే ఆలంబనగా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

శనివారం, జులై 25, 2009

సీతాకళ్యాణం - వాగ్దానం(1961) సాహిత్యం

ఘంటసాల మాష్టారి గాత్ర మాధుర్యమో, శ్రీ రామ కథ లోని మహత్తో, పెండ్యాల వారి సంగీత మహిమో లేదా అసలు హరికధా ప్రక్రియ గొప్పతనమే అంతో నాకు సరిగా తెలియదు కానీ, ఈపాట ఎన్ని సార్లు విన్నా ఒళ్ళు పులకరిస్తూనే ఉంటుంది. రేలంగి, నాగేశ్వరరావు, కృష్ణకుమారి లపై చిత్రీకరించిన ఈ పాట లో విశేషమేమిటంటే.. చిత్రీకరణ లో ఎక్కడా శ్రీరామ కళ్యాణాన్ని చూపించరు కానీ కనులు మూసుకుని పాట వింటుంటే మాత్రం కళ్యాణ ఘట్టం అంతా కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇది రాసినది శ్రీశ్రీ గారు అని మొదటి సారి తెలిసినపుడు చాలా ఆశ్చర్య పోయాను. ఇక పాట విషయానికి వస్తే రేలంగి గారి బాణి లో చిన్న చిన్న చెణుకు లు విసురుతూ నవ్విస్తూ హుషారు గా సాగే కధ లో మనం మైమరచి పోతాం. "రఘూ రాముడూ... రమణీయ..." అని మొదలు పెట్టగనే తెలియకుండానే తన్మయంగా తల ఊపేస్తాం.. "ఎంత సొగసు కాడే.." అంటే అవును కదా అని అనిపించక మానదు... అసలు సొగసు అన్న మాట పలకడం లోనే ఘంటసాల గారు ఆ దివ్య సుందర మూర్తిని సాక్షాత్కరింప చేస్తారు.
మీరెపుడైనా జలపాతాన్ని దూరం నుండి కాకుండా దాని పై నుండి చూశారా... ప్రవాహం అంతా చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఏదో చిన్న పిల్ల కాలువ లా ప్రవహిస్తూ కనిపిస్తుంది... కాని ఒక్క సారి అంచుకు వెళ్ళి చూడగానే పైనుండి పోటెత్తుతూ ఉదృతంగా హుషారు గా ముందుకు దూకుతూ మనకి కనువిందు చేస్తుంది. ఇంత వర్ణించడమెందుకు చాలా సినిమా లలో జలపాతాల లో ప్రమాదం సీన్ల లో ఇది మీరు గమనించే ఉంటారు. అలానే అప్పటి వరకు నెమ్మదిగా వ్యాఖ్యానంతో సాగే కథ ఒక్క సారిగా "ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెఱుపు వలె నిల్చీ.." అని అంటూ ఆ జలపాతపు దూకుడునంతా తన స్వరం లో చూపించేస్తారు ఘంటసాల గారు. ఇక చివరికి వచ్చే సరికి హెచ్చు స్వరం లో ఒక్క సారి గా "ఫెళ్ళు మనె విల్లు... " అనగానే సీతమ్మవారి సంగతేమో కానీ కధ వింటున్న వారెవ్వరికైనా గుండె ఝల్లు మనక మానదు అంటే అతిశయోక్తి కాదేమో.

పొయిన ఏప్రిల్ లో శ్రీరామ నవమి రోజు ఈ పాట చాలా గుర్తు చేసుకున్నాను అదే రోజు మధురవాణి గారు తన బ్లాగు లో ఈ పాట లింక్ ఇచ్చారు.. దానికి వెంటనే సాహిత్యం ఇద్దామనుకున్నాను కాని ఇన్ని రోజులకి కుదిరింది. మధురవాణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ అప్ లోడ్ చేయడానికి బద్దకించి, వారి ఈస్నిప్స్ యకౌంట్ నుండే ఎంబెడ్ చేయబడిన పాట ని, ఈ హరికథా సాహిత్యాన్ని ఇక్కడ మీకోసం ఇస్తున్నాను. విని, చదివి ఆనందించండి తప్పులేమన్నా ఉంటే వ్యాఖ్య ద్వారా తెలియచేయండి.చిత్రం : వాగ్దానం
సంగీతం : పెండ్యాల
గానం : ఘంటసాల
సాహిత్యం : శ్రీశ్రీ

శ్రీ నగజా తనయం సహృదయం
శ్రీ నగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం
శ్రీ నగజా తనయం...ఊ..ఊ...

శ్రీ రామ భక్తులారా ఇదీ సీతాకళ్యాణ సత్కథ
నలభై రోజులనుంచీ చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను
అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది
నాయనా కాస్త పాలూ మిరియాలూ ఏమైనా...
చిత్తం.. సిద్దం...

భక్తులారా... సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచీ విచ్చేసిన వీరాధి వీరుల్లో..
అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి ఆహ్హ !! అతడెవరయ్యా అంటే...

రఘూరాముడు రమణీయ వినీల ఘన శ్యాముడు..
రమణీయ... వినీల.. ఘన శ్యాముడు..
వాడు నెలరేడు సరిజోడు మొనగాడు..
వాని కనులు మగమీలనేలు రా..
వాని నగవు రతనాల జాలు రా..
వాని కనులు మగమీలనేలు రా..
వాని నగవు రతనాల జాలు రా..
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు మరో మరుడు మనోహరుడు..రఘూరాముడు

సనిదనిసగ రిగరి రిగరి సగరి రిగరి సగగరి సనిదని
సగగరి సని రిసనిస రిసనిస నిదపమగరి రఘురాముడు...
ఔనౌను...
సనిస సనిస సగరిరిగరి సరిసనిస..పదనిస..
సనిగనినిస సనిరిసనిదని నిదసనిదపమ గ మ స
నినినినిని..పస పస పస పస...
సఫ సఫ సఫ తద్దీం తరికిటతక...
రఘూరాముడూ రమణీయ వినీల ఘన శ్యాముడు..
శభాష్..శభాష్...

ఆప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండీ సీతాదేవి ఓరకంట చూచినదై
చెంగట నున్న చెలికత్తె తో.. ఎంత సొగసుగాడే..ఎంత సొగసుగాడే మనసింత లోనే దోచినాడే... ఎంత సొగసుగాడే...
మోము కలువ రేడే ఏ..ఏ.. ఏ... మోము కలువ రేడే నా నోము ఫలము వీడే...
శ్యామలాభిరాముని చూడగ నామది వివశమాయె నేడే... ఎంత సొగసుగాడే..
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై ఉండగా..
అక్కడ స్వయం వర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి
అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగు పుత్రి సీతా...
వినయాదిక సద్గుణ వ్రాత.. ముఖ విజిత లలిత జలజాత...
ముక్కంటి వింటి నెక్కిడ జాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైచి పెండ్లాడు...ఊ..ఊ...

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడివారక్కడ చల్ల బడి పోయారట...
మహా వీరుడైన రావణాసురుడు కూడా..హా ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము
దీనిని స్పృశించుట యే మహా పాపము అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట తదనంతరంబున...

ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెఱుపు వలె నిల్చీ..
తన గురువగు విశ్వామితృని ఆశీర్వాదము తలదాల్చి...
సదమల మద గజ గమనము తోడ స్వయంవర వేదిక చెంత..
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత...

ఫెళ్ళు మనె విల్లు గంటలు ఘల్లు మనే...
ఘుభిల్లుమనె గుండె నృపులకు..
ఝల్లు మనియె జానకీ దేహమూ...
ఒక నిమేషమ్మునందె.. నయము జయము ను
భయము విస్మయము గదురా... ఆఆ ఆఆ
శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి
భక్తులందరు చాలా నిద్రావస్త లో ఉన్నట్టుగా ఉంది మరొక్కసారి..
జై శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి
భక్తులారా ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివ ధనుర్బంగము కావించినాడు...
అంతట..
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే..
పృథుగుణ మణి సంఘాతన్ భాగ్యో పేతన్ సీతన్..
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే..
శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి

మంగళవారం, జులై 21, 2009

ఆటో చాహియే క్యా !! -- రెండు

బెంగళూరు ఆటోల క్రమబద్దీకరణ కోసం ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు ప్రవేశ పెట్టిన మరో అంశం డ్రైవర్ లైసెన్స్ ప్రదర్శన. ప్రతి ఆటోలోనూ ఇక్కడ ఫోటోలో చూపించినట్లు డ్రైవర్ పేరు, పోలీస్ స్టేషన్ పరిధి, లైసెన్సు నంబరు అన్నీ కలిపి సాధారణంగా డ్రైవర్ సీటు వెనకాల ప్రయాణీకుల కు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. విధిగా ప్రతి ఆటోలోనూ ప్రదర్శితమయ్యే ఈ వివరాలు ఆటో వాలాలని కాస్తైనా కంట్రోల్ లో ఉంచుతాయి అనుకుంటున్నాను. అంటే క్షణం క్షణం లో శ్రీదేవి ని దబాయించినట్లు ఆ లిఖ్ లో.. నంబర్ లిఖ్ లో.. కంప్లైంట్ కరో.. అని లెక్క లేకుండా మాటాడే వాడు తగిల్తే మనం ఏమీ చేయలేమనుకోండి అది వేరే విషయం..

ఇక ఇక్కడి ఆటోలో నాకు అత్యంత కోపం తెప్పించే అంశం కుడి వైపు మలుపు తిరగాలి అని తెలిసినా కూడా మూడు లైన ల రోడ్ లో ఎడమ వైపు చివరి లైన్ లో ప్రయాణిస్తూ, హఠాత్తుగా సిగ్నల్ దగ్గరకు వచ్చే సరికి సర్రు మని ఈ చివరి నుండి ఆ చివరికి అడ్డగోలు గా నడిపి ఇతర చోదకులను ఖంగారు పెట్టి ప్రమాదాలకూ ట్రాఫిక్ జామ్ లకూ కారకులవుతారు. మొన్న ఒక రోజు ఇటువంటి సంధర్బం లోనే నేను ఒక కిలో మీటర్ ముందు నుండి డ్రైవర్ తో "బాబు వచ్చే సిగ్నల్ దగ్గర కుడి వైపు తిరగాలి..లైన్ మారు రైట్ లైన్ లోకి వెళ్ళు.." అని చెప్తూనే ఉన్నాను. అయినా అతను నా మాట లెక్క చేయకుండా సరిగా సిగ్నల్ నాలుగు అడుగుల లో ఉందనగా వాడి స్టైల్ లో అడ్డం గా తిప్పేసాడు. నాకు బాగా కోపం వచ్చి తిట్టేసాను. "ఏమోయ్ ఇందాకటి నుండీ చెప్తున్నాను అసలు బుర్రా బుద్దీ ఉన్నాయిటోయ్..." అని క్లాస్ మొదలు పెట్టేసరికి ఓ క్షణం తత్తర పడి లేదు సార్ అని చెప్పినా, మరు నిముషం లో అతను "లేదు సార్ ఇలాంటి పెద్ద రోడ్ లో మాలాటి చిన్న బళ్ళు నిదానంగా వెళ్ళే బళ్ళు ఎడమ వైపునే వెళ్ళాలి కుడివైపు నుండి వేగాంగా వెళ్ళే బండ్లు వెళ్తాయి !! అందుకని నేను చేసిందే కరెక్ట్..." అంటూ లాజిక్ తీసి వాదించడం మొదలు పెట్టాడు. నేను "సరే లేవోయ్ అన్నీ తెలిసినపుడు ఆఖరి నిముషం లో తత్తర పెట్టక ముందే లైన్ మారాలి తెలీదా అని గట్టిగా అరిచేసి వదిలేశా అనుకోండి అంతకన్నా ఏం చేస్తాం, ఎంత చెప్పినా వాడి చెవికెక్కుతుందా.

సరే ఇన్ని కష్టాలు పడుతూ ఆటోల లో ఎందుకు తిరగడం అంటారా... నాకెందుకో ఆటో లో ప్రయాణం చాలా నచ్చుతుంది... ట్ర్.ర్.ర్.ర్ మనే కర్ణ కఠోరమైన శబ్ధ కాలుష్యాన్ని భరించగల ఓపిక ఉండాలే కానీ... ఆటో ప్రయాణాన్ని చాలా బాగా ఆస్వాదించవచ్చు. వేగం పరం గా అయితేనేమీ, వాహన ఎత్తు పరంగా అయితే నేమీ, ఓపెన్ నెస్ పరంగా అయితేనేమీ, ఆటోలో వెళ్తుంటే నాకు ఇంచు మించు నడుస్తూ ఆయా వీధుల లో తిరుగుతున్న అనుభూతే కలుగుతుంది. కార్ కానీ బస్ కానీ మరే వాహనమైనా ఈ అనుభూతి దొరకదు, బైక్ దీనికి ఎక్సెప్షన్ అనుకోండి మరి మనకి అది వచ్చి చావదు కదా :-) అదీకాక హెబ్బాల్ ఓ కుగ్రామం లా ఉంటుందేమో ఇక్కడ ఒకో సారి రోడ్డు పక్కన గాడిదలు, గుర్రాలు, కొండొకచో ఒంటెలు కూడా కనపడి పలకరిస్తూ అలరిస్తూ ఉంటాయి. ఇక ఔటర్ రింగ్ రోడ్డు లో ప్రత్యేకించి నే ప్రయాణం చేసే హెన్నూరు, నాగవర సిగ్నల్స్ మధ్య రోడ్డుకు అటు ఇటు పచ్చని చెట్ల తో బోలెడు ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్ లో క్షణం లో అయిపోయే ఈ స్ట్రెచ్ ని ఆటో లో చాలా చక్కగా ఎంజాయ్ చెయ్యచ్చు.
ఈ ఉల్లిపాయ సమోసాలనీ వాటిని కట్టి పడేసిన దారాన్నీ గమనించారా.. ఇటువంటి వరుసలు 5-6 వరకు ఒకదానిపై ఒకటి పేర్చి కేవలం దారం తో, అవి పడి పోకుండా ఓ కోట కట్టి సిగ్నల్ దగ్గర అమ్ముతూ ఉంటారు. అద్భుతమైన ఫీట్ కదూ !! అసలు పావ్ బాజీ లూ, పానీ పూరీలు, ఛాట్ మసాలాలు ఎన్ని వచ్చినా ఈ ఉల్లిపాయ సమోసా కి సాటి రావేమో అని అనిపిస్తుంది నాకైతే, కాదనే వారెవరైనా ఉన్నారా ??

ఇక ఆటో ప్రయాణం లో మరో పదనిస సిగ్నల్స్ దగ్గర కనిపించే రక రకాల వ్యక్తులు. సింటెక్స్ వాటర్ ట్యాంక్ షేప్ లో ఉండే కిడ్డీ బ్యాంక్ లు, కర్చీఫ్ లు, జామ కాయలు, కార్ క్లీనింగ్ కి వాడే క్లాత్ లు, వార్తా పత్రికలు, చిన్న చిన్న బొమ్మలు, బాల్స్ ఇత్యాదులు అమ్మే వాళ్ళు వీళ్ళ లో ఒక వర్గం. వీళ్లలో కొందరు రియల్ క్రియేటివ్ బిజినెస్ పీపుల్ ఉంటారు, అసలు వీళ్ళ దగ్గర బోల్డు బిజినెస్ టాక్టిక్స్ నేర్చుకోవచ్చు నేమో అనిపిస్తుంది. కొందరు పిల్లలు ఇలా అమ్ముతూ ఈ పని లోనే రిక్రియేషన్ కూడా కవర్ చేస్తారు. ఒక పిల్లాడు ఆగి ఉన్న కార్ సైడ్ అద్దం లో క్రాఫ్ సరిచేసుకుంటే మరొకడు మూసి ఉన్న విండో గ్లాస్ లో మొహం చూసుకుంటూ రక రకాల హావభావాలు ప్రదర్శిస్తూ కార్ లోపలి వాళ్ళని కూడా ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. కారుల్లో వాడు అద్దాలు ఎత్తేసి వీళ్ళ దగ్గర నుండి తప్పించుకున్నా ఆటో లో ఉంటే వీరి భారిన పడక తప్పదు. మొన్నొక రోజు ఇలానే ఆటో ఆగి ఉంటే ఒకమ్మయ్ వచ్చింది నన్ను చూడగానే తెలుగు వాడ్ని అని ఎలా తెల్సుకుందో లేదా అందరితో తెలుగు లోనే మాటాడుతుందో తెలీదు కానీ "అన్నా పిల్లలకి బంతి కొను అన్నా... పిల్లలకి, ఆడుకోడానికి రంగురంగులుగా, మెత్తగా బాగుంటుంది అన్నా..కొనన్నా అని మొదలు పెట్టింది. నిజం చెప్పొద్దూ పిల్లలు, బంతి సంగతి ఎలా ఉన్నా అంకుల్ అనకుండా అన్నా అన్నందుకైనా కొనచ్చేమో అని ఓ క్షణం అనిపించింది :-) సరే ఏదైనా ఇప్పుడు నీ బొమ్మలు కొనడానికి అర్జెంట్ గా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనడం సాధ్యం కాదు లే ఫో అని చెప్పి పంపించేశా..

ఇక ఆటో ప్రయాణం లో విసిగించే మరో బ్యాచ్ హిజ్డాలు, ఒకప్పుడు బెంగళూరు నుండి గుంటూరు కు ప్రశాంతి లో ప్రయాణం చేయాలంటే నాకు చాలా టెన్షన్, ఎందుకంటే ఆ ట్రైన్ మధ్యాహ్నం బయలు దేరుతుంది బెంగళూరు నుండి, అందులో వీళ్ళు అడుక్కోడానికి వచ్చి ఐదో, పదో ఇస్తే తప్ప కదిలే వారు కాదు నానా యాగీ చేశేవారు. ఎప్పుడైనా నిజంగా చిల్లర లేకపోయినా వీళ్ళ భారిన పడక తప్పేది కాదు. వీళ్లకి భయ పడి అప్పట్లో ప్రయాణానికి సిద్దమయ్యేప్పుడు ముందుగా చిల్లర సిద్దంగా పెట్టుకునే వాడ్ని. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లో బనసవాడి, హెబ్బాళ్ మధ్య లో సిగ్నల్స్ దగ్గర వీళ్ళు వచ్చి డబ్బులు అడుగుతుంటారు. కాకపోతే వీళ్ళు ఎక్కువగా సతాయించరు అడిగి ఇస్తే తీసుకు వెళ్తారు లేదంటే లేదు అంతే.. ఒక సిగ్నల్ దగ్గర ఒకళ్ళకంటే ఇవ్వచ్చు కానీ ప్రతి సిగ్నల్ లోనూ అంటే మనకైనా విసుగొస్తుంది.

సరే ఇప్పటికే చాలా పెద్ద టపా అయినట్లుంది. చివరగా మొన్న పన్నెండో తారీఖు ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచిక లో ప్రచురించిన చిన్న వ్యాసం గురించి ప్రస్తావించి ముగిస్తాను. ఆటోలకీ అద్భుతమైన ఫాన్స్ ఉన్నారు అని ఈ వ్యాసం నిరూపిస్తుంది. విదేశీయులతో అటోలో భారత యాత్ర చేస్తూ సేవా కార్యక్రమాలని కూడా చేస్తున్న అరవింద్ గారి గురించి తెలుసుకోవాలంటే, పైనున్న బొమ్మ పై క్లిక్ చేసి వ్యాసం చదవండి.

*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
ఈ టపా ప్రచురించిన కొన్ని గంటలలో ఇపుడే ఈ ముంబయి ఆటోవాలా గురించి చదివి ఆశ్చర్య పోయాను. ఇతని ఆటోలో ఫస్ట్ ఎయిడ్, టీవీ, పత్రికలు, ఫ్యాన్ లాటి సౌకర్యాలు కల్పించడం ఒక ఎత్తైతే, ఇతని ఆటోలో వికలాంగులకు ఇరవై ఐదు శాతం తగ్గింపు, అంధులకు యాభై రూపాయలవరకూ ఉచిత ప్రయాణ సౌకర్యం లాంటి వివరాలు విని నాకు నోట మాట రాలేదు. ఈ రియల్ హీరో గురించి పూర్తిగా చదవాలంటే ఈ లింక్ చూడండి. ఈ అసక్తికరమైన ఈ మెయిల్ ను నాకు ఫార్వార్డ్ చేసిన నేస్తానికి బ్లాగ్ ముఖంగా ధన్యవాదాలు.
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

శనివారం, జులై 11, 2009

ఆటో చాహియే క్యా !! -- ఒకటి

వీడెవడండీ బాబు హిందీ శీర్షిక, అదీ తెలుగు స్క్రిప్ట్ లో పెట్టాడు అని ఆశ్చర్య పోతున్నారా.. చెప్తా చెప్తా అసలు ఎంత తెలుగు వాళ్ళమైనా హిందీ మన జాతీయ భాష అన్న విషయం మర్చిపోతే ఎలా? ఈ విషయం లో ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఆటో డ్రైవర్ ల దేశభక్తి ని మాత్రం మెచ్చుకోవాల్సిందే... ఊరేదైనా కానివ్వండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏదైనా సరే వీళ్ళంతా మాట్లాడే ఏకైక భాష హిందీ. ప్రాంతీయ భాష మాట్లాడని వాళ్ళుంటారేమో కానీ ఆటో డ్రైవర్ల లో హిందీ మాట్లాడవాళ్ళని నేను ఇంత వరకూ చూడలేదు. మన జాతీయ భాష ని ఇంతగా గౌరవించి ప్రాచుర్యాన్ని పెంపొందిస్తున్న వీళ్ళ దేశభక్తిని గుర్తించక పోతే ఎలా చెప్పండి. సరే ఇక విషయానికి వస్తే నేను అమెరికా లో ఉన్నపుడు అన్నిటికన్నా ఎక్కువగా మిస్ అయింది ఆటోలని :-) నిజం అండీ బాబు అక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవాలి, డ్రైవింగా, టాక్సీనా, బస్సా, ట్రైనా ఇలా వీటిలో ఏదోఒకటి అని ప్లాన్ చేసుకోవాలి. అంతే కానీ బెంగళూరు లో లా ఆలోచన వచ్చిందే తడవు రోడ్ పైకి వచ్చి "ఆటో" అని చేయెత్తి ఆపి ఎక్కి కూర్చుని ఇంకో ఆలోచన లేకుండా గమ్యం చేరుకునే అవకాశం అక్కడ ఉండదు. అంటే ఇక్కడ ఇంకో ఆలోచన లేకుండా అని రాసే ముందు నేను కొంచెం ఆలోచించిన మాట వాస్తవమే :-)
ఓ సగటు బెంగళూరు ఆటో

ఆటోలలో పలురకాలు లేవేమో కానీ ఆటోవాలాలో చాలా రకాలు ఉంటారు... కొందరు సాధ్యమైనంత మేరా రౌడీ లుక్ కోసం ప్రయత్నిస్తే అతి కొందరు సాధారణ లుక్ తో సరిపెట్టుకుంటారు మరి కొందరు మాత్రం నీట్ గా డ్రెస్ చేసుకుని వాచీ గట్రాల తో డీసెంట్ గా ఉంటారు. ఇలాంటి డీసెంట్ బ్యాచ్ సాదారణంగా చదువుకున్న బ్యాచ్ అయి ఉంటుంది ఎక్కడో అరుదుగా తగిలే వీళ్లని చూడటం తోనే మనకి విషయం అర్ధం అవుతుంది వీళ్ల మీటర్లు సరిగా పని చేస్తాయి, మీటర్ ఎంత చూపిస్తే అంతే చార్జీ వసూలు చేస్తారు ఎక్కువ ఆడగరు, వీళ్ళు కష్టపడే బ్యాచ్ అనమాట. నాకు ఆమధ్య ఇలాంటి వ్యక్తే తగిలాడు. నేను వచ్చీ రాని కన్నడ లో కష్ట పడుతుంటే అతను స్పష్టమైన ఆంగ్లం మాట్లాడటం మొదలు పెట్టాడు, తర్వాత సంగతేంటి గురూ అని అడిగితే తన సమాధానం "ఇంట్లో అమ్మా నాన్న చదువుకోరా అని పంపిస్తే గాలికి తిరిగాను అప్పుడు తెలియలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాను కాని నేను తప్పుడు పనులు చేయడం లేదు కష్టపడుతున్నాను ఉన్నంత లో హ్యాపీ సార్..." అని. అతని నిజాయితీ కి ముచ్చటేసింది ఓ క్షణం ఆవకాయ్ బిర్యాని లో హీరో గుర్తొచ్చాడు.

ఇంకో బ్యాచ్ ఉంటుంది వీళ్ళు అస్సలు వొళ్ళు వంచరు, బద్దకం బ్యాచ్, సాధారణంగా ఆటో స్టాండ్ లలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ తగుల్తారు, బాగ పొట్టలు పెంచి ఆటోలలో అడ్డంగా పడి నిద్ర పోడమో లేదా నలుగుర్ని కలేసి పేకాడటం, కబుర్లు చెప్పడం లాటివి చేస్తుంటారు. లోకల్ గా జరిగే గణేశ ఉత్సవాలలోనో మరో చోట తాగి తందనాలాడటం వీధుల్లో కొట్లాటల్లోనో వీళ్ళకి ఆసక్తి తప్ప కష్టపడదాం ఆటో తోలదాం సంపాదిద్దాం అనే అలోచన ఉండదు. వీళ్ళని మీరు బాడుగ అడగగానే వచ్చే మొదటి సమాధానం రాను... లేదా కనీసం పదింతలు రేటు చెప్తారు దానికి ఇష్టమైతే ఎక్కు లేదంటే నీ ఖర్మ అన్నట్లుంటుంది వీళ్ళ వ్యవహారం. ఇలాంటి వాళ్ళని చూసే నా నేస్తం వీళ్ళ తో ఇగో ప్రాబ్లం బాసు నా వల్ల కాదు కావాలంటే నడిచెళ్తా కాని అటో ఎక్కను అంటాడు. నాకూ ఒకోసారి చాలా చిరాకొస్తుంది వీళ్ళని చూసి కానీ మనకి కాస్త సహనం పాళ్ళు ఎక్కువ కనుక నెట్టుకొచ్చేస్తుంటాం.

సరే వీళ్ళ సంగతి ఇలా ఉంటే ఈక మీటర్ల గురించి అడగనే అక్కర్లేదు. అప్పుడెప్పుడో కొన్నేళ్ళ క్రితం "బెంగళూరు లో డిజిటల్ మీటర్ లు ప్రవేశ పెడుతున్నారుట, దూరం, చార్జీ, వెయిటింగ్ అని అన్నీ ప్రత్యేకంగ తెలుస్తాయిట ఇహ మోసాలు గట్రా ఉండవు కామోసు.." అని అనుకున్నాం కానీ వాటిలోనే ఇంకా అత్యాధునాతన పద్దతి లో మోసాలు చేయడానికి అవకాశముంది అనే విషయాన్ని మరిచాను. అప్పటికీ ఇంజినీరింగ్ లో మా చేత మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రాం చేయించి మరీ నేర్పించారు అప్పుడు కూడా మేము ఇలాంటి యల్ఈడే లే వాడాం లెండి అందుకే ఈ డిజిటల్ మీటర్ లు చూడగానే నాకు అదే గుర్తొస్తుంది. మొన్నొక రోజు ఆటో ఎక్కితే నలభై కావాల్సిన దూరానికి అరవై అయింది.. సంగతేంటి గురూ అని అంటే ఏంటి సార్ అలా మాట్లాడతారు డిజిటల్ మీటర్ అని బుకాయించబోయాడు నేను కాస్త గట్టిగా అడిగి పద చెక్ చేయిద్దాం అనే సరికి సరే రోజు ఎంతవుతుందో అంతే ఇవ్వండి సార్ అని పట్టుకు పోయాడు. మాములు మీటర్ల లో అయితే ఇంతవరకూ ఏ రెండు మీటర్లు ఒకే రీడిం చూపించిన పాపాన పోలేదు. ఈ విషయం లో చెన్నై చానా నయం ఎందుకంటే అక్కడ మోసం చేయడానికి అసలు మీటర్లే ఉండవు మరి !! వాడెంతడిగితే అంత ఇవ్వాల్సిందే !!

దీనిని అరికట్టడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నగరం లో అక్కడక్కడా ప్రీపెయిడ్ ఆటోస్టాండ్ లని పెట్టారు. ఇక్కడ పోలీసులే దూరాన్ని బట్టి ముందే రేటు వసూలు చేస్తారు ప్రీ పెయిడ్ టాక్సీ లాగ కాని తక్కువ దూరమైతే వాడి సణుగుడు భరించాల్సిందే... బెంగళూర్ లో ఆటోలకి పెట్రోల్ డీజిల్ వాడకం చాలా తక్కువే, ఎక్కువ భాగం CNG ఆటోలే ఈ ఆటోలని ప్రవేశ పెట్టిన కొత్త లో ఈ గ్యాస్ కొన్ని బంకుల లో మాత్రమే దొరకడం వలన వాటిలో విపరీతమైన్ రద్దీ ఉండేది, ఒకోసారి ట్రాఫిక్ జాం అయి ఆ ఏరియాలని తప్పించుకుని వెళ్ళాల్సిన అవసరం కూడా వచ్చేది.

సరే టపా పొడవు పెరుగుతున్నట్లుంది మరికొన్ని విషయాలు రేపు చెప్తాను అంత వరకూ శలవ్...

మంగళవారం, జూన్ 30, 2009

అలక పానుపు ఎక్కనేల-శ్రీవారి శోభనం

ఈ సినిమా నాకు పూర్తిగా చూసినట్లు గుర్తు లేదు ఎపుడో ఒక సారి టీవీ లో ఈ పాట వేస్తుంటేనో లేక సినిమా వేస్తుంటే పాట మాత్రమే చూసానో కూడా సరిగా గుర్తు లేదు కాని అప్పట్లో రేడియో లో క్రమం తప్పకుండా నేను వినే కొన్ని పాటలలో ఇదీ ఒకటి. మొదట్లో అంటే మరీ చిన్న తనం లో బామ్మ గారి కామెంట్స్ విని నవ్వుకోడానికి వినే వాడ్ని, కాస్త పెద్దయ్యాక భామ గారి పాట్లు అవగతమై పాట పూర్తి గా అర్ధమయింది :-) ఇక జానకమ్మ గారి గాత్రం గురించి నేనేం చెప్పినా తక్కువే... ఆ దోర నవ్వు దాచకే అని అంటూ ఆవిడ నవ్వే నవ్వు మనకే తెలియకుండా మన పెదవులపై చిరుమందహాసాన్ని నాట్యం చేయిస్తుంది. అంతెందుకు ఆవిడ శీతాకాలం అంటూ గొంతు వణికించడం వింటే ఎంత మండు వేసవి లో ఉన్నా మనకీ చలి వేసి వణుకు పుట్టేస్తుందంటే అతిశయోక్తి కాదేమో... పాటంతా వేటూరి గారు ఎంత అందం గా రాశారో బామ్మ గారి చివరి మూడుపంక్తులు "నులకపానుపు నల్లి బాధ.." అంటూ అంతే కొంటె గా రాశారు. సరే మరి మీరూ ఓ సారి మళ్ళీ విని తరించేయండి.చిత్రం : శ్రీవారి శోభనం (1985)
సాహిత్యం :వేటూరి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : జానకి, ఆనితా రెడ్డి

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా...
బామ్మ: నాకలకేమిటే నీ మొహం ఊరుకో...
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా...
శీతాకాలం సాయంకాలం...మ్...
శీతాకాలం సాయంకాలం...మ్...
అటు అలిగిపోయే వేళా చలికొరికి చంపే వేళా...ఆఆ....
బామ్మ: అందుకే లోపలికి పోతానే తల్లి నన్నొదులు....

||అలకపానుపు||

రామ రామ శబరి బామ్మ నిద్దరేపోదూ..!!
బామ్మ: హూ నువ్విట్టా ఇంతగొంతేసుకుని పాడితే నిద్దరెట్టాపడుతుందే...
రాతిరంతా చందమామ నిదరపోనీదు...ఊ..ఊ...
కంటి కబురా పంప లేనూ...ఊ...
ఇంటి గడపా దాటలేనూ..ఊ..
ఆ దోర నవ్వు దాచకే.. నా నేరమింకా ఎంచకే...
ఆ దోర నవ్వు దాచకే.. ఈ నవ్వు నవ్వి చంపకే...

||అలకపానుపు||

రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు...
రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ...
బామ్మ: ఆ రాతే రాసుంటే ఇంట్లో నే వెచ్చగా నిద్రబోయేదాన్ని కదా !!
రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు...
రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ...
నచ్చినా మహరాజు నీవూ...
నచ్చితే మహరాణి నేనూ...
ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా...

బామ్మ:
నులకపానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా... అల్లరాపమ్మా...
శీతాకాలం సాయంకాలం శీతాకాలం సాయంకాలం...ఊ..||2||
నను చంపకే తల్లీ... జో కొట్టకే గిల్లీ...

||అలకపానుపు||

శుక్రవారం, జూన్ 26, 2009

పాప్ సంగీత సామ్రాట్‍కు కన్నీటి వీడ్కోలు !!

మరణం ఎంత చిత్రమైనది, ఎంత దయలేనిది ! తన పర, పేదా గొప్ప బేధాలు లేకుండా ఎంతటి వారినైనా ఎప్పుడైనా ఎక్కడైనా తన కబంద హస్తాలతో కబళించి వేసి, నీ శక్తి అల్పము పరిమితమూనూ రా ఓ వెర్రి మానవుడా అని పరిహసిస్తుంది. యాభైవసంతాల ప్రపంచ పాప్ సంగీత సంచలనం మైఖేల్ జాక్సన్ ఇంత అర్ధంతరంగా, అదీ ప్రపంచ వ్యాప్తంగా అతని అభిమానులు లండన్ లో జరగనున్న అతని comeback షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం లో తిరిగిరాని లోకాలకు పయనమవ్వడం అత్యంత విషాద భరితం. మొదట మార్చి లో ప్రకటించిన తేదీల ప్రకారం అయితే అతని మొదటి లండన్ షో జులై ఎనిమిదిన జరగాల్సి ఉంది.


సంగీతానికి నేను చిన్నతనం నుండే అలవాటు పడినా, మైఖేల్ పాటని నాకు మొదట పరిచయం చేసింది మా హరిగాడు. వాడు నా ఇంటర్మీడియేట్ మరియూ బీటెక్ క్లాస్ మేట్ అప్పటి రోజుల్లోనే మా వాడు వాళ్ళ తాడేపల్లి గూడెం లో సత్యన్నారణ షాప్ లో అప్పుడప్పుడే కొత్తగా రిలీజ్ అవుతున్న సీడీ ల నుండి రికార్డ్ చేయించుకుని వచ్చిన BAD ఆల్బం నుండి మొదటి సారి "Man in the mirror" పాట వినిపించాడు తరువాత స్మూత్ క్రిమినల్ ఆ తర్వాత అంబా..అంబా అని టైటిల్ సాంగ్ (అంటే జాగ్రత్తగా విన్న తర్వాత అది i am bad అని అర్ధమైంది లెండి) అప్పట్లో ఆ అమెరికన్ యాస లో పాట ఎక్కువగా అర్ధమయ్యేది కాదు కానీ మ్యూజిక్ మాత్రం నన్ను అత్యంతగా ఆకట్టుకుంది. అదే సమయం లో అంటే ఇంటర్ చదివేప్పుడు ఒక సారి శలవల్లో ఇంటికి వచ్చినపుడు పెద్ద మామయ్య గారి ఇంటిలో చూసిన BAD క్యాసెట్ ఆల్బం కవర్ మీదున్న మైఖేల్ బొమ్మని, తళ తళలాడే క్యాసెట్ ఇన్లే కార్డ్ ని ఎంత అపురూపంగా ఎన్ని సార్లు తడిమి తడిమి చూసుంటానో లెక్క లేదు. ఆ తర్వాత ఆంగ్లం లో పాటలు విన్నది చాలా తక్కువ కానీ మైఖేల్ పాటలు మాత్రం తప్పకుండా వింటూ ఉండే వాడ్ని ఎవరన్నా నీకు ఎలాంటి పాటలు ఇష్టం అంటే క్లాసిక్, ఫిల్మీ ప్లస్ మైఖేల్ అని ప్రత్యేకంగా చెప్పే వాడ్ని అంత ఇష్టం ఇతని పాటలు.


ఇతని వీడియోల లో ఏది ఇక్కడ పెడదాం అని ఆలోచించినపుడు ఏది ఎన్నుకున్నా మరో దానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను అనిపించింది అందుకే నేను మొదటి సారి విన్న "Man in the mirror" from Bad
ఇక్కడ ఇస్తున్నాను.
సగటు అమెరికన్ జీవిత వయోః పరిమితి తో పోల్చి లెక్క వేసినప్పుడు యాబైవసంతాలు పెద్ద వయసు కాదు. అతని ఆరోగ్యం పై వచ్చిన పుకార్లు స్కిన్ క్యాన్సర్, డ్రగ్స్ వాడకం లాటివి కృంగ తీసినా... డ్యాన్సింగ్ ఐడల్, అంత సన్నగా, చలాకీగా, చురుకుగా, స్టేజ్ పై ఒక అలలా, మెరుపులా కదిలే మైఖేల్ జాక్సన్ హార్ట్ అటాక్ తో చనిపోయాడన్న విషయం ఇంకా నేను నమ్మ లేక పోతున్నాను. అంత చురుకైన వాడికి కార్డియాక్ అరెస్ట్ ఏ కారణం వలన వచ్చి ఉంటుందో ఊహించడానికి చాలా కష్టం గా ఉంది. అటాప్సీ ఫలితాలు వెలువడితే కానీ పూర్తి వివరాలు తెలియవేమో.. కానీ కొలెస్ట్రాల్ కారణమైతే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.. మందీ మార్బలానికీ, డబ్బు కీ కొరత లేని మైఖేల్ జాక్సన్, ప్రపంచ వ్యాప్తం గా కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న అతను కూడా ఇంత అర్ధంతరం గా మృత్యువు కోరలకి బలికావడం విధి రాత కాక మరేమిటీ.. అందుకే మృత్యువు చిత్రమైనది !!

ఆదివారం, జూన్ 21, 2009

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె...

సంగీతాభిమానులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ (June 21st) శుభాకాంక్షలు...

ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం అని ఉదయాన్నే తన విషెస్ తో తెలియచేసిన నేస్తానికీ, ఇంకా ఈ పాట తో విషెస్ చెప్పిన మరో నేస్తానికి థ్యాంక్స్ తెలుపుకుంటూ మీ కోసం ఈ పాట.

ఇక్కడ వినండి

చిత్రం : అమ్మచెప్పింది
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : ప్రణవి

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతం తో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం...

||మాటల్తో||

కాగితాలలో నిదురపోయే కమ్మనీ మాటే..
కాస్త లెమ్మనీ ఇళయరాజా ట్యూన్ కడుతుంటే..
పాటల్లె ఎగిరి రాదా.. నీ గుండె గూడైపోదా..
సంగీతం తో చేస్తే స్నేహం
హృదయం లయలే గీతం...

||మాటల్తో||

గోరుముద్దలో కలిపి పెట్టే గారమొక పాట
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాటా
ఊయలని ఊపును పాటే
దేవుడిని నేర్పును పాటే..
సంగీతం తో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం...

||మాటల్తో||

శుక్రవారం, జూన్ 19, 2009

పల్లెటూరి పిల్లగాడా...పశులగాసే మొనగాడ..

ఒకో సారి హఠాత్తుగా, కారణం తెలియకుండా ఎప్పుడో విన్న పాట, చాలా రోజులుగా అసలు వినని పాట ఒకసారిగా గుర్తొచ్చి అలా ఒకటి రెండు రోజులు వెంటాడుతూ ఉంటుంది. మన మూడ్ కాని ఉన్న పరిసరాలు కానీ పట్టించుకోకుండా పదే పదే అదే హమ్ చేసేస్తాం. నన్ను గత రెండు రోజులుగా అలా వెంటాడుతున్న పాట "మాభూమి" చిత్రం లోని "పల్లెటూరీ పిల్లగాడ.." పాట. నిజానికి ఈ సినిమా గురించి గానీ పాట గురించి గానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాల కార్మిక వ్యవస్తనంతటినీ కాకున్నా పల్లెల్లో సాధారణంగా కనిపించే పిల్లల గురించి వాళ్ళ శ్రమని కూడా ఎలా దోచుకుంటారో తెలియచేస్తూ హృద్యంగా రాసిన సాహిత్యం ఒక ఎత్తైతే. ఈ పాట పాడిన సంధ్య గారి గాత్రం మరో ఎత్తు. పదునుగా ప్రశ్నిస్తున్నట్లు ఉంటూనే "ఓ..పాల బుగ్గలా జీతగాడ.." అనే చోట... ఓ అని అనడం లో తన స్వరం లో విషాదం తో గుండెలు పిండేస్తారు ఆవిడ.

ఈ చిత్రం గురించి పరిచయం కోసం ఇక్కడ తెలుగుసినిమా లో ఇంకా ఈ చిత్ర రూపకర్తల్లో ఒకరైన నర్సింగరావు గారి గురించి ఇక్కడ మన నవతరంగం లో చూడగలరు. ఈ సినిమాను నేను మొదటి సారి 90 లలో ఎపుడో దూరదర్శన్ లో వేసినపుడు చూసాను అంతకు ముందు పాట విన్నాను కానీ అపుడే మొదటి సారి చూడటం, చూసినపుడు ఏదో నలభైల లో వచ్చిన సినిమా కావచ్చు అని అనుకున్నాను కానీ అన్నగారు చిలకొట్టుడు కొడుతూ ఊపేస్తున్న సమయం లో అంటే 1980 లో విడుదలై ఇంత హిట్ అయింది అని తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయాను.

అన్నట్లు, బాల కార్మికులంటే నన్నెప్పటి నుండో తొలుస్తున్న ఓ ప్రశ్న గుర్తొచ్చింది ఇది కేవలం ఇళ్ళలోనో హోటళ్ళలోనో కూలి పని చేసే వారికే వర్తిస్తుందా ? వాణిజ్య ప్రకటనల లోనూ, చలన చిత్రాల లోనూ పని చేసే పసి పిల్లలకు వర్తించదా ఈ బాలకార్మిక చట్టం!! ఆ మాట కొస్తే బండెడు పుస్తకాలను మోసుకు వెళ్ళే మా సంగతేంటి అంటారేమో కాన్వెంట్ పిల్లలు.

ఈ పాట వీడియో ఇక్కడ చూడచ్చు...
వీడియో లో కొన్ని చరణాలు లేవు పూర్తి పాట ఆడియో ఇక్కడ వినండి

Palletoori Pillaga...


చిత్రం : మాభూమి (1980)
సంగీతం : వింజమూరి సీత, గౌతం ఘోష్
సాహిత్యం : సుద్దాల హనుమంతు
గానం : సంధ్య

పల్లెటూరీ పిల్లగాడా!! పశులగాసే మొనగాడ !!
పల్లెటూరీ పిల్లగాడా !! పశులగాసే మొనగాడ !!

పాలు మరచీ ఎన్నాల్లయ్యిందో .. ఓ..పాలబుగ్గలా జీతగాడా..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..

చాలి చాలని చింపులంగీ చల్లగాలికి సగము ఖాళీ..
చాలి చాలని చింపులంగీ చల్లగాలికి సగము ఖాళీ..
గోనె చింపూ కొప్పెర పెట్టావా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
దాని చిల్లులెన్నో లెక్కాబెట్టేవా..

తాటి గెగ్గలా కాలి జోడూ తప్పటడుగుల నడక తీరు
తాటి గెగ్గలా కాలి జోడూ తప్పటడుగుల నడక తీరు
బాట తో పని లేకుంటయ్యిందా...

ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
చేతికర్రే తోడైపోయిందా..

గుంపు తరలే వంపు లోకి కూరుచున్నవు గుండు మీద..
గుంపు తరలే వంపు లోకి కూరుచున్నవు గుండు మీద..
దొడ్డికే నీవు దొరవై పోయావా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
దొంగ గొడ్లనడ్డగించేవా...

కాలువై కన్నీరు గారా... కల్ల పై రెండు చేతులాడ..
కాలువై కన్నీరు గారా... కల్ల పై రెండు చేతులాడ..
వెక్కి వెక్కి ఏడ్చెదవదియేలా
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
ఎవ్వరేమన్నారో చెప్పేవా..


మాయదారి ఆవుదూడలు మాటి మాటికి ఎనుగుదుమికి
మాయదారి ఆవుదూడలు మాటి మాటికి ఎనుగుదుమికి
పంట చేను పాడు చేసాయా
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
పాలికాపూ నిన్నే గొట్టాడా..

నీకు జీతము నెలకు కుంచము.. తాలు వడిపిలి కల్తి గాసము
నీకు జీతము నెలకు కుంచము.. తాలు వడిపిలి కల్తి గాసము
కొలువగ శేరు తక్కువ వచ్చాయా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
తల్చుకుంటే దుఖం వచ్చిందా..

పల్లెటూరీ పిల్లగాడా !! పశులగాసే మొనగాడ !!
పల్లెటూరీ పిల్లగాడా !! పశులగాసే మొనగాడ !!
పాలు మరచీ ఎన్నాల్లయ్యిందో ..
ఓ..పాలబుగ్గలా జీతగాడా..

కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.