సహజత్వానికి ఒరిజినాలిటీకీ కేరాఫ్ అడ్రస్ అనదగ్గ "కేరాఫ్ కంచరపాలెం" లాంటి సినిమా తీసిన దర్శకుడు "వెంకటేష్ మహా" రెండో సినిమా "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య". ఇది "మహేషింటె ప్రతీకారం" అనే మలయాళ సినిమాకి రీమేక్ అని విన్నపుడు ఇంత ఒరిజినాలిటీ ఉన్న దర్శకుడు రీమేక్ ఎందుకు ఎన్నుకున్నాడో అని ఆశ్చర్యపోయాను. ఒరిజినల్ సినిమా చూడలేదు కనుక పోల్చి చెప్పలేను కానీ ఈ సినిమా చూశాక మాత్రం "ఈ కథకు తను తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరనిపించేలా తీశాడు" అనిపించింది
టైటిల్ చూసి ఇదేదో యాంగర్ మానేజ్మెంట్ లాంటి సినిమా అని పొరబడకండి. ఎప్పుడూ ఎవరినీ కనీసం గట్టిగా కోప్పడి కూడా ఎరుగని మహేష్ అనే ఓ అతి మంచివాడి జీవితంలోని కొన్ని పేజీలు ఈ సినిమా. ఇందులో కోపం, ప్రతీకారం ఓ చిన్న భాగం మాత్రమే తన తండ్రితో అనుబంధం, ప్రేమ, కెరీర్, స్నేహం లాంటివి మిగిలిన భాగాలు. వీటినన్నిటిని అత్యంత సహజంగా అరకులోయ నేపథ్యంలో అందంగా తెరకెక్కించాడు దర్శకుడు.
కంటికింపుగా అరకు లోయలోని ప్రకృతి అందాలని చూపిస్తూ, పాత్రలు తప్ప నటులు కనపడనివ్వని కాస్టింగ్ తో, ఆహ్లాదకరమైన వాతావారణంలో సున్నితమైన హాస్యాన్ని (సటిల్ హ్యూమర్) పండిస్తూ, భావోద్వేగాలను చూపిస్తూ, దైనందిన జీవితంలో మనకు ఎదురుపడే మాములు మనుషులతో అత్యంత సహజంగా ఉందీ సినిమా.
సినిమా స్లోగా ఉంది, కాన్ఫ్లిక్ట్ లేదు లాంటి రివ్యూలు చదివి మీరు ఆగిపోయినట్లైతే వాటిని పక్కనపెట్టి మీరు నిరభ్యంతరంగా చూసేయచ్చు. రేసీ స్క్రీన్ ప్లే అని చెప్పను కానీ స్లో అని కూడా నాకనిపించలేదు. పూర్తయ్యాక మాత్రం ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని మిగులుస్తుంది. ముందు ముందు స్పాయిలర్స్ ఉన్నాయి కనుక ఇక ముందుకు చదవకుండా క్లోజ్ చేసేసి ఓటీటీ ప్లాట్ఫాం "నెట్ ఫ్లిక్స్" లో ఉన్న ఈ సినిమా చూసి వచ్చేసి ఆ తర్వాత చదవండి.
కథగా చెప్పుకోడానికి పెద్దగా ఏం లేదు పైన చెప్పినట్లు ఇది మహేష్ ఉగ్రరూపం గురించిన కథ అనేకన్నా తన జీవితంలోని కొన్ని పేజీల కథ అంతే. అరకులో తనకు తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన "కోమలి ఫోటోస్టూడియో" నడుపుతూ ఉండే ఉమామహేశ్వరరావు కోపమంటే ఏంటో ఎరుగని ఒక అతి మంచి మనిషి. తన మిత్రుల మీద కూడా కనీసం గొంతు పెంచి మాట్లాడి ఎరుగడు. అలాంటి అతను తన మిత్రులని కాపాడటానికి ఓ గొడవ ఆపాలని చేసే ప్రయత్నంలొ ఒకడి చేతిలో దెబ్బలు తిని ఘోరమైన అవమానానికి గురౌతాడు. ఆ అవమాన భారంతో ఆవేశంలో ఓ శపథం చేస్తాడు.
ఆ శపథం ఏమిటి ? దాన్ని నెరవేర్చుకున్నాడా లేక తన మంచితనంతో వదిలేశాడా ? ఈ ప్రాసెస్ లో తన ఫోటోగ్రఫీకి ఎలా పదును పెట్టుకున్నాడు? తన ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగిందీ? తనకి వారసత్వంగా ఫోటోగ్రఫీ కళని ఓ చిన్న స్టూడియోని బోలెడంత అనుభవ సారాన్ని ఇచ్చిన తన తండ్రితో అతని అనుబంధం ఎలాంటిది? అనేవి తెలియాలంటే "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" సినిమా చూడాలి.
వెంకటేష్ మహా అచ్చతెలుగు నేటివిటీ కోసం అరకు నేపథ్యంగా ఈ కథను తెరకెక్కించినా అక్కడక్కడా మలయాళ వాసనలు తగులుతూనే ఉంటాయి. ఐనా కానీ మొదటి పది నిముషాలు దాటితే సినిమాలో పూర్తిగా లీనమవడంతో ఇక ఆ విషయం మనకు గుర్తుకు రాకుండా చేయడంలో మహా సక్సెస్ అయ్యాడు.
సన్నివేశాలన్నీ చాలా సహజంగా రాసుకున్నాడు ఫైట్స్ కొరియోగ్రఫీ కూడా చాలా సహజంగా పల్లెల్లో ఇద్దరు కొట్టుకుంటే ఎలా కొట్టుకుంటారో అలాగే అనిపిస్తుంది. అలాగే సంభాషణలలో ఉత్తరాంధ్ర యాస కూడా చక్కగా పలికించారు. మనల్ని అరకు మధ్యలో కుర్చీ వేసి కూర్చోబెట్టేయడంలో దర్శకుడు మహా, ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ అప్పు ప్రభాకర్, సంగీత దర్శకుడు బిజిబల్ సఫలీక్రుతులయ్యారు. సంగీత సాహిత్యాలు చక్కగా కుదిరిన పాటలు సన్నివేశాలకు తగినట్లు ఆహ్లాదకరంగా వచ్చి వెళ్తుంటాయి. నేపధ్య సంగీతం కూడా చాలా బావుంది.
దర్శకుడు సినిమాకి కీలకమైన బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ ఫైట్ సీన్ భలే తెరకెక్కించడమే కాక ఇంకా కొన్ని చిన్న చిన్న సీన్స్ సైతం చాలా బాగా తీశాడు. ఓపెనింగ్ షాట్ లోనె హీరో తన స్లిప్పర్స్ కడుక్కుని భద్రంగా ఓ రాతి మీద పెట్టుకోవడం క్లోజప్ లో చూపించి కథాంశం ఇదీ అని భలే చెప్పాడు. స్కూల్ దగ్గరలో గొడవ పడుతున్న ఇద్దరు వ్యక్తులు "జనగణమణ" పాట విని గొడవాపి నిలబడడం. అదే సమయంలో క్లాస్ లో అందరూ సైలెంట్ గా ఉన్నా ఒక పిల్లాడు మాత్రం బ్యాగ్ సర్దుకోడం, అది టీచర్ గమనించి హెచ్చరించడం.
ఇంకా బ్రేకప్ సీన్ మొత్తం ఎక్జిక్యూట్ చేసిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఆనందం సాంగ్ కి లీడ్ సీన్ లో ముల్లుగుచ్చుకున్న నొప్పి(బ్రేకప్ పెయిన్) తో ఉన్న మహేష్ లైఫ్ లోకి వచ్చిన జ్యోతి ఆ ముల్లుని(నొప్పిని) తీసేయడం. మహేష్ కవర్ ఫోటోని జ్యోతిలో కాంపిటీషన్ అయితే స్వాతికి పంపడం. మహేష్ స్వాతి వీక్లీ కవర్ ఫోటోలో జ్యోతిని చూస్తూ స్వాతి అన్న పేరుని కనపడకుండా మడవడం ఇలాంటి చిన్న చిన్న సీన్స్ భలే అనిపించాయి. మహేష్ తండ్రి పాత్ర తాలూకూ ఫోటోగ్రఫీకి సంబంధించిన సన్నివేశాలు, సుహాస్ నరేష్ మధ్య వచ్చే మొదటి అండ్ చివరి సన్నివేశాలు చాలా బావున్నాయ్.
సత్యదేవ్ ఎంత మంచి నటుడో తెలిసిందే అయినా ఈ సినిమాలో మహేష్ గా ఇంకా విజృంభించేశాడు. గుబురుమీసాల చాటునుండి మెత్తగా నవ్వే నవ్వుకే సగంమంది ఫ్లాట్ అయిపోతారు. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ లో వేరియేషన్స్, బాడీ లాంగ్వేజ్ తో చాలా బాగా అకట్టుకున్నాడు. నరేష్ గారు ఈ మధ్య చేస్తున్న ఇలాంటి కారెక్టర్ రోల్స్ లో చాలా హైలైట్ అవుతున్నారు. ఇందులో కూడా బాబ్జీఅన్నగా గుర్తుండి పోతాడు. తన అనుభవ సారంతో కీలకమైన సమయాల్లో మహేష్ కు దిశానిర్దేశం చేసే తండ్రి పాత్రలో రాఘవన్ గారు బాగా చేశారు ఈయన చెప్పిన మాటలన్నీ బావున్నాయ్.

ఇంతటి ఉద్దండుల మధ్య కూడా చాయ్ బిస్కట్ ఫేం సుహాస్ తన రోల్ తో నటనతో కామిక్ టైమింగ్ తో కట్టిపడేశాడు. సినిమాలో సత్య తర్వాత బాగా నచ్చేసే కారెక్టర్ సుహాస్ దే. తను ఎన్నుకుంటున్న రోల్స్ కూడా బావుంటున్నాయ్ కమెడియన్ గానే కాక మంచి నటుడిగా తెలుగుతెరమీద ఇంకా మంచి పేరు తెచ్చుకుని నిలిచి ఉంటాడనిపించింది. ఇక సినిమా నిడివి గల ఇంటర్వూలతో పాపులర్ ఐన ఐడ్రీమ్ టి.ఎన్.ఆర్. గారు పంచాయితి మెంబర్ నాంచారయ్య గా ఓ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించారు. తన మిగిలిన సినిమాలకన్నా కాస్త కంఫర్టబుల్ గా నటించారనిపించింది. పలాస దర్శకుడు కరుణ కుమార్(కరుణ), ఈ సినిమా దర్శకుడు వెంకటేష్ మహా(టీకొట్టు ఓనర్) రెండు చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు.
ఇక ముఖ్యమైన మహిళా పాత్రలు స్వాతి(చందన), జ్యోతి(రూప), మిథిల(కుశాలిని) పోషించిన కొత్త అమ్మాయిలు ముగ్గురూ చాలా బాగా చేశారు. వీరిలో రూప మాత్రం ప్రత్యేకంగా గుర్తుండి పోతుంది. తన రింగుల జుట్టు, కళ గల నవ్వు మొహం, కళ్ళల్లో మెరుపులు ఇట్టే ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ పాత సినిమాల్లో భానుప్రియను గుర్తు చేసింది. ఇక తన పాత్రకున్న యాటిట్యూడ్, లైఫ్ పట్ల తన క్లారిటీ వలన కూడా భలే నచ్చేస్తుంది. దర్శకుడు ఈ పాత్రను ప్రత్యేకమైన శ్రద్దతో తీర్చిదిద్దాడనిపించింది. రూప కూడా అంతే సులువుగా చేసేసింది. ఫ్లాష్ మాబ్ లో డాన్స్ కూడా చాలా ఈజ్ తో చేసింది.
ఓవరాల్ గా "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" మంచి సినిమా. థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే కంచరపాలెం టైప్ లోనే మంచి హిట్ గా నిలిచి ఉండేది. అరకు అందాల కోసం ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది. ఒకటీ అరా చిన్న చిన్న లోపాలు ఉన్నా ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని పొందాలంటే మీరూ మిస్సవకుండా నెట్ఫ్లిక్స్ లో వెంటనే చూడండి. సినిమా ప్రోమో
ఇక్కడ చూడవచ్చు. పాటలు జ్యూక్ బాక్స్ లో
ఇక్కడ వినవచ్చు.
నాకు నచ్చిన కొన్ని సంభాషణలు ఇక్కడ పొందు పరుస్తున్నాను ఫీల్ పోకూడదంటే సినిమా చూసొచ్చాక చదువుకోండి.
"ఆలోచనలు, జ్ఞాపకాలు ప్రపంచంలో అన్నిటికంటే బరువైనవట, ఏడ్చేస్తే కన్నీరు ఆవిరైపోతుంది, మనసు తేలికవుతుంది."
"జీవితంలో ఏదో తప్పుచేశాననుకుంటూ బతకమాకు అది అన్నింటికంటే ప్రమాదకరం"
"ఇద్దరు మనుషులు కలుస్తారు, రెండు మనసులు విడిపోతాయి. మనిషి శరీరంలో ఎక్కడుందో తెలియని మనసును ఎంతకాలమని నిందిస్తావ్."
"వెళ్ళిపోవాలనుకున్న వారిని వెళ్ళనివ్వకపోతే... ఉన్నా వెలితిగానే ఉంటుంది."
"కళ అనేది పాఠాలు వింటే రాదు పరితపిస్తే వస్తుంది"
"నవరసాలు అంటే మనకు కనపడే ముఖంలో కండరాల కదలిక కాదు మనలో జరగాల్సిన రసాయన ప్రక్రియ"
"ఎమోషన్ అనేది నీలో పుట్టాలి నువ్వు చూసే వస్తువులో కాదు"
"ఆడపిల్లల తండ్రులు అబ్బాయిలందరూ ఎదవలే అని ఎంత గట్టిగా నమ్ముతారో వాళ్ళ పిల్లలక్కూడా విచక్షణ ఉండిద్దని అంత గట్టిగ నమ్మినరోజే ఈ దేశం బాగుపడిద్ది"
"నొప్పి రుచి తెలియని వాడే ఎదుటి వాడి మీద చేయి చేసుకుంటాడు. తెలిసిన వాడు చేయి ఎత్తడానికి కూడా ఆలోచిస్తాడు"
"శవానికి మాత్రమే నొప్పి కలగదు. ప్రాణముంటే నొప్పి ఉంటుంది"
"అందరికీ తెలియాలంటే చూడక్కర్లేదు వింటే చాలు.. వీళ్ళు చూశారుగా మిగతా వాళ్ళు వింటారు"