సోమవారం, మార్చి 02, 2009

అమ్మకు అశృ నివాళి !!

ఇటువంటి టపా ఎప్పుడో ఓ సారి రాయల్సి ఉంటుంది అని తెలుసు కాని, ఇంత త్వరగా రాయాల్సిన అవసరమొస్తుంది అని అనుకో లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా మిత్ర బృందం నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకుంటున్న తరుణం లో ఈ 2009 ఆరంభం లోనే నాకు అత్యంత విషాదాన్ని మిగులుస్తుందనీ నేను అస్సలు ఊహించ లేదు. జనవరి 21 బుధవారం రాత్రి, భోజనం కానిచ్చి మనసు లో "గత మూడు వారాలు గా హాస్పిటల్ లో ఉన్న అమ్మ, గత వారం రోజులు గా ICU నుండి మామూలు రూం కి షిఫ్ట్ అయి నిదానంగా కోలుకుంటుంది, ఇంక ఇవ్వాళో రేపో ఇంటికి పంపించేస్తారు కాబోలు" అని అనుకుంటూ నిద్రకు ఉపక్రమించే సమయం లో తమ్ముడి దగ్గర నుండి కాల్ అందుకున్నాను. critical care unit కి మార్చారు అని చెప్పిన కొన్ని గంటల వ్యవధి లోనే అమ్మ ఇక లేదు అనే చేదు నిజం విని ఏం చేయాలో అర్ధం కాలేదు. తనకెంతో ఇష్టమైన గురువారం జనవరి 22 2009 న ఉదయం అమ్మ మమ్మల్ని ఒంటరిగా ఈ భూమ్మీద వదిలేసి తిరిగి రాని లోకాలకు పయనమయింది.
మరణం, మరణించిన వారికి ఐహిక బాధలనుండి విముక్తిని ప్రసాదించే ఓ వరం ఏమో కాని, వారి ఆత్మీయులకి మాత్రం తీరని శాపం. నిన్నటి వరకూ మన మధ్య తిరిగే మన మనిషి హఠాత్తుగా కేవలం చిత్రాలకు ఙ్ఞాపకాలకూ పరిమితం అయ్యరన్న ఊహే ఆ దేవుడు ఎంత దయలేని వాడు అని అనుకునేలా చేస్తుంది. నేను ఇండియా వెళ్ళే వరకూ రక రకాల ఆలోచనులు నన్ను ఊపిరి తీసుకోనివ్వలేదు. ఈ వార్త తెలిసిన తర్వాత కూడా నేను మాములుగానే ఉన్నానేంటి? ఆకాశం విరిగి మీద పడలేదు, భూమి బద్దలై నన్ను మింగేయలేదు, అవునూ!! ఈ ఆకలి, నిద్ర ఇవి కూడా నన్ను వీడి పోనంటున్నాయేంటీ. అసలు నేను ఇంకా నిద్ర లోనే ఉన్నానేమో ఇదంతా ఓ పీడకలేమో లేచాక అమ్మతో మాట్లాడి ఇలాంటి కల వచ్చింది నువ్వు జాగ్రత్త అమ్మా అని చెప్పాలి అని ఏవేవో ఆలోచనలు.

ఎప్పుడో నా చిన్నతనం లో ఊహ తెలిసీ తెలియని వయసు లో, మరణం అంటే ఏమిటో కూడా తెలియని తనం లో, సంవత్సరం కూడా నిండని నా పెద్ద తమ్ముడు మమ్మల్ని వదిలి వెళ్ళినప్పటి ఙ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. అప్పుడు మేము ఉంటున్న నరసరావు పేట లో సరైన వైద్యం అందక వాడి చిన్ని శరీరాన్ని టాక్సీ లో వేసుకుని గుంటూరు తీసుకు వెళ్ళడం అక్కడి హాస్పిటల్ వాతావరణం డాక్టర్ ఏం చేయలేం అని తేల్చి చెప్పేసాక అమ్మ స్పృహ తప్పి పడిపోవడం. తర్వాత తిరిగి ఇంటికి రావడం అప్పటి వరకూ వాడి ఫోటో లేదని అలానే కుర్చీ లో కూర్చో పెట్టి నాన్న వాడి కళ్ళు తెరిచి పట్టుకుంటే వాడి ఫోటో తీసుకోడం అన్నీ కళ్ళ ముందరే నిన్న మొన్న జరిగినట్లు ఉన్నాయి. మళ్ళీ ఇన్ని నాళ్ళ కి అమ్మకి వీడ్కోలు పలకాల్సి రావడం న మనసంతా భరించ లేని విషాదాన్ని నింపింది.

తను ఉన్నన్నాళ్ళు ఏదో తెలియని ధైర్యం, ఇపుడు తను మా మధ్య లేదు అనే ఆలోచనే బోలెడంత దిగులును మనసంతా నింపేస్తే ఇక ధైర్యానికి చోటెక్కడ ఉంటుంది. అయినా గత నెల రోజులు గా ఎన్నో అనుభవాలు అమ్మ తోడు లేకపోవడం వలనేమో కానీ మరింత కొత్త గా మరింత బారంగా అనిపించాయి అన్నీనూ.. అసలు తనని సంప్రదించకుండా మా అంతట మేమే నిర్ణయాలు తీసుకోడం ఎంత కష్టమో కదా !! నేను ఇప్పటి వరకూ అలా నా అంతట నేను తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు ఇకపై అన్నీ నేనే అలా తీసుకోవాలంటే ఎంత కష్టం... అంటే మేమేదో అమ్మ మాట జవదాటని వాళ్ళం అని కాదు కానీ తనతో వాదించి మా మాటే నెగ్గించుకుని మాకు నచ్చిన నిర్ణయమే తను తీసుకునేలా చేసినా కానీ గవర్నమెంట్ సీల్ లాగా తన ఆమోద ముద్ర ఉంటే అదో దైర్యం మా ఇంట్లో అందరికీ.. నాన్న తో సహా. ఇకపై అది లేకుండానే ముందుకు నడవాలి, ఎలాగో... ఏంటో...
తను ఏమైపోయినా కానీ, మా ఇంటిల్లిపాది క్షేమం కోసం అనుక్షణం తపన పడే అమ్మ ఇక మా మధ్య లేదు అన్న ఆలోచనే కళ్ళ వెంట కారే కన్నీటికి ఆనకట్ట కట్ట లేకున్నా... ఎవరో చెప్పినట్లు మనిషి కేవలం ఒక్క చోటే ఉండ గలరు ఇప్పుడు తన ఆత్మ అన్ని చోట్లా తానై మా అందరి యోగ క్షేమాలు చూస్తూ మా వెంటే ఉంటుంది అన్న ఊహ బోలెడంత ఊరట నిస్తుంది. అమ్మో అదే నిజమయితే ! ఇంతకు ముందు అంటే ఇక్కడ ఒంటరి గా ఏడ్చినా ఏం చేసినా అమ్మ కి తెలియదు ఇప్పుడిక తను నా పక్కనే ఉంటుంది కదా నేను ఏడవడం చూస్తే తను బాధ పడుతుంది కదా ఇక ఏడవకూడదేమో. అవునూ అసలు ఏడుపు ఎందుకు వస్తుందీ... గుండె లోతుల్లో ఆత్మీయుల ఙ్ఞాపకాలు వెచ్చగా కదిలి మనసుతో కలిసి, కరిగి కన్నీరై కళ్ళ నుండి జాలువారుతాయేమో కదా!! మరి అమ్మ ఙ్ఞాపకాలన్నీ అలా నన్ను వదిలి వెళ్ళి పోతే ఎలా మరి !! అందుకే ఇకపై ఏడవను.

కేవలం సర్వీస్ చేయడానికే పుట్టినట్లు గుంటూరు ఆర్&బి సర్కిల్ ఆఫీస్ సుపరింటెండెంట్ గా రిటైరైన ఆరునెలల లోపే మమ్మల్ని వదిలి వెళ్ళి పోయిన మా అమ్మ "నేలటూరి దయామణి" కి అశృ నివాళి సమర్పించుకోడం తప్ప మేమేం చేయగలం. అమ్మా! అక్షరాలకు అందని ఆప్యాయత, మాటలకందని మమతాను రాగాలకు ప్రతి రూపం నువ్వు, వెల లేని అనురాగం, ఆప్యాయతలు పంచిన ప్రేమ మూర్తిగా, మంచితనానికి, నీతి, నిజాయితీ లకు మారు పేరు గా నిలచి, కొవ్వొత్తి లా నువ్వు కరిగిపోయి మా జీవితాలలో వెలుగు నింపి, తీరిగి రాని లోకాలకు పయనమైన నీ ఆత్మకు శాంతి చేకూరాలని. నువ్వెక్కడ ఉన్నా నీ ఆశీస్సులు, మార్గదర్శకాలు మమ్ము ముందుకు నడిపిస్తాయని ఆశిస్తూ.

నీ ఙ్ఞాపకాలలో, నువు పంచిన ఆత్మీయత లో..
నీ కోసం వెతుకుతూ మేము....

37 కామెంట్‌లు:

 1. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆభగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నా

  రిప్లయితొలగించండి
 2. "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు
  ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు"

  I know exactly what you are feeling, my friend!

  రిప్లయితొలగించండి
 3. కొత్తపాళీ గారీ మాటే, నా మాటేనూ...
  "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు
  ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు"

  అమ్మగారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ..

  రిప్లయితొలగించండి
 4. అమ్మగారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను..

  రిప్లయితొలగించండి
 5. సన్నిహితులూ ,స్నేహితులూ తాత్కాలికంగా దూరమైతేనే తట్టుకోలేం . అమ్మ శాశ్వతంగా దూరం ఐతే ఆ బాధ వర్ణనాతీతం .అయినా మీ జ్ఞాపకాలు పదిలంగా ఉన్నంత వరకూ ......ఆవిడ మీలో జీవించే ఉంటారు .అమ్మగారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 6. "మరణం, మరణించిన వారికి ఐహిక బాధలనుండి విముక్తిని ప్రసాదించే ఓ వరం ఏమో కాని, వారి ఆత్మీయులకి మాత్రం తీరని శాపం. నిన్నటి వరకూ మన మధ్య తిరిగే మన మనిషి హఠాత్తుగా కేవలం చిత్రాలకు ఙ్ఞాపకాలకూ పరిమితం అయ్యరన్న ఊహే ఆ దేవుడు ఎంత దయలేని వాడు అని అనుకునేలా చేస్తుంది
  ఈ వార్త తెలిసిన తర్వాత కూడా నేను మాములుగానే ఉన్నానేంటి? ఆకాశం విరిగి మీద పడలేదు, భూమి బద్దలై నన్ను మింగేయలేదు, అవునూ!! ఈ ఆకలి, నిద్ర ఇవి కూడా నన్ను వీడి పోనంటున్నాయేంటీ. అసలు నేను ఇంకా నిద్ర లోనే ఉన్నానేమో ఇదంతా ఓ పీడకలేమో "

  వేణూ,
  ప్రియమిత్రుడు మరి లేడన్న వార్త తెలిసి తీవ్రమైన దుఃఖ తరంగాల్లో కొట్టుకుపోతున్న నాకు మీ టపా మరింత దుఃఖాన్ని కలిగించింది. మీ బాధను పంచుకుంటున్నాను!

  మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 7. "ఈ వార్త తెలిసిన తర్వాత కూడా నేను మాములుగానే ఉన్నానేంటి? ఆకాశం విరిగి మీద పడలేదు, భూమి బద్దలై నన్ను మింగేయలేదు"--అమ్మ మీలోనే ఉన్నారు, మీతోనే వుంటారు.
  Very touching post. I can feel your emotions.

  రిప్లయితొలగించండి
 8. మీ అమ్మగారు భౌతికంగానే మీతో లేరు.కాని మానసికంగా ఆవిడ ఎప్పుడూ మీతోనే ఉంటారు. మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 9. అమ్మ లేదు. ఇక రాదు. అది పచ్చి నిజం. తప్పదు. "..ఇకపై లేకుండానే ముందుకు నడవాలి, ఎలాగో... ఏంటో...". నడుస్తారు. నడవాలి, మిగతా వారికోసం. తప్పదు.

  రిప్లయితొలగించండి
 10. కష్ట సమయాల్లో అక్కునచేర్చే
  అమృతతత్వ అస్థిత్వ రూపం, అమ్మ
  వీడిపోయినా, వెన్నంటే ఉంటుంది !!

  మీ అమ్మగారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను..

  రిప్లయితొలగించండి
 11. మీ అమ్మ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్ధిస్తూ ...

  మీరు కూడా ఆ బాధ నుంచి కోలుకొని , మనసుని కుదుట పరచుకొని ముందుకు నడవాలని మనసారా కోరుకుంటున్నాను..

  రిప్లయితొలగించండి
 12. శ్రీకాంత్ గారు,చాలా బాధకు గురిచేసారు నన్ను.అసలే తీవ్రమైన ఆరోగ్యసమస్యలతో సతమతమవుతూ ఇవ్వాళే అలా బ్లాగ్గడపలో అడుగుపెట్టా.ఇంతలోనే ఈ దుర్వార్త.మీ తల్లిదండ్రులతో మీఅనుబంధం మీగతటపాలు చదివి కుళ్ళుకున్నవాళ్ళలో నేను మొదటివాడిని.మీనాన్నగారి గురించి అంతగా రాసి,అమ్మగారి గురించి దాదాపుగా ఏమీరాయందీ ఇప్పుడిలా మనవాళ్ళందరినీ బాధకు గురిచెయ్యటానికా??
  మీనాన్నగారి ఎలా ఉన్నారు?ఈ వయసులో ఆయనకెంత దుఃఖం వచ్చింది
  దయామణిమ్మగారు ఎల్లప్పుడూ మీఅందరితోనూ ఉంటారని,మిమ్మలను వదిలివెళ్ళరనీ నా నమ్మకం.వారి దివ్యస్మృతికి నా నివాళులు

  రిప్లయితొలగించండి
 13. అమ్మ అనే మాటే అందరికి ఆత్మీయతను పంచే అమృత గుళిక. అలాంటిది అమ్మను శాశ్వతముగా కోల్పోవడం అంటే అది ఎంతటి ఆవేదనను కలిగిస్తుందో అర్ధం చేసుకోగలను. శ్రీకాంత్ గారు మీకు నా సంతాపం.

  రిప్లయితొలగించండి
 14. I am very sorry to hear this Venu.

  My deepest condolences to you and your family.

  మీ బ్లాగ్ అప్పుడప్పుడూ చూస్తూ ఏంటీ మధ్య అప్డేట్స్ లేవు అనుకున్నా కాని, దీని వెనక ఇంత విషాదముందని తెలియదు. మీకంటే కూడా, మీ నాన్నగారిని తలచుకుంటే చాలా బాధేస్తుంది. జీవితాంతం కష్ఠసుఖాల్లో తోడుగా ఉన్న మనిషి ఇక లేరు అంటే తనకి ఎంత లోటు, ఎంత బాధ అసలు. ఈ బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇంక మీకైతే మీ చిన్ని వేలు పట్టుకుని నడిపించి, జీవితం లో మంచీ చెడూ అన్నీ విడమరచి చెప్పి, ప్రతి క్షణం మీ బాగుకోసం పరితపించే అమ్మ ఇకలేదంటే నిజంగా అది తట్టుకోలేని బాధే. మీ బాధని, ఏ మాటలూ, ఏ మనుషులూ తగ్గించలేనిది. అయినప్పటికీ, ధైర్యం తెచ్చుకుని మీ నాన్నగారికి ధైర్యాన్ని ఇవ్వండి.

  రిప్లయితొలగించండి
 15. వ్యాఖ్యాలు రాసి, అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా ధన్యవాదాలు.

  బాధ పెట్టినందుకు క్షమించండి రాజేంద్ర గారు, మీ ఆరోగ్యం త్వరగా కుదుట పడి, మీరు తిరిగి పూర్వపు ఉత్సాహంతో మరిన్ని టపాలు ప్రచురించాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 16. శ్రీకాంత్ గారు, మీ అమ్మగారు భౌతికంగానే మీతో లేరు, కాని మానసికంగా ఆవిడ ఎప్పుడూ మీతోనే ఉంటారు. మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 17. శ్రీకాంత్ గారు ఇన్నాళ్ళు కూడలి లో సరిగా కనిపించకపోతే పని ఒత్తిడేమో అనుకున్నా.. ఇలా ఉహించనైన ఉహించలేదు ..అందరం ఏదో ఒకరోజు పోవలసినోళ్ళమే ,కాకపోతే కాస్త వెనుకా ముందు అని అందరికీ తెలుసూ కాని ఇంతటి ఆత్మీయతను సొంత చేసుకున్న మనసు మాట వినదు కదా ,ఇంత చేదు నిజం మెల్లిగా దిగమింగి మీ నాన్న గారి కి దైర్యాన్ని ఇవ్వండి.. :( మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ ...

  రిప్లయితొలగించండి
 18. i'm sorry venu గారు,మేము ఎంత సానుభూతి చూపించిన....మీ జీవితం లో వెలితిని మేం నింపలేము......మొన్ని మధ్యే మా అమ్మమ్మ గారు చనిపోయారు....వయసు పైబడి చనిపోయిన...ఆమె లేకపోవడం మాకు తీరని లోటె...కానీ మీ బాధ ముందు న భాద చాల చిన్నదిగా అనిపిస్తుంది,
  ఆయినా దేవుడు మంచివాళ్ళను తొందరగా తిసుకువేల్తాడంట..........భౌతికం గా మాత్రమే అమ్మ మీ దగ్గర లేరు..ఆమె జ్ఞాపకాలు మాత్రం మిమ్మల్ని విడిచి పోలేవు కదా....ధర్యం గా వుండండి........

  రిప్లయితొలగించండి
 19. వేణుగారు ఒక్కసారి నాకు మెయిల్ చెయ్యగలరా??
  devarapalli.
  rajendra kumar
  @
  gmail.com

  రిప్లయితొలగించండి
 20. వేణూ గారు, దాదాపు 6సం. క్రితం మా అమ్మ గారు, అంతకు మునుపు మా నానమ్మ, చెల్లీ నన్ను బౌతికంగా వదిలిపోయారు, కానీ మానసికంగా చేరువైపోయారు. పిచ్చి, వెఱ్ఱి అని కొందరన్నా కాని నేను నిత్యం మనసులోనో, కలలోనో, యోచనలోనో వారిని చర్చకో, సంభాషణకో ఆహ్వానిస్తూనేవుంటాను. మీ అమ్మ గారు ఎటూ వెళ్ళరు, మీతోనే మీలోనే సజీవంగా వుంటారు. లేదా ఈ గొంగళి పురుగు జీవితం నుండి రంగు రంగుల సీతాకోకచిలుకలా మనకు తెలియని లోకాల్లో విహరిస్తూవుంటారు. ఆ భావన మీకు తృప్తినిస్తుందని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 21. ఉషా,
  మీది పిచ్చి, వెర్రి కానే కాదు. ఆత్మీయులైన వారు మనల్ని భౌతికంగా వీడిపోయినా మనతోనే, మనలోనే ఉంటారు. అందువల్ల వారితో మాట్లాడినట్లూ, వారితో గడిపినట్లు ఊహించుకోవడం సాంత్వన కలిగిస్తుంది. దాని వల్ల ఎవరికీ నష్టం కూడా లేదు.

  రిప్లయితొలగించండి
 22. I am very very very sorry to hear this Venu Srikanth garu.

  My deepest condolences to you and your family.

  subbu

  రిప్లయితొలగించండి
 23. నిజమే అమ్మని మరుస్తాం, ఆత్మీయుల్ని ఏమారుస్తాం ఈ బ్రతుకు బండి లాగడానికి. ఇంకా ఎన్నో చేస్తాం, పాడు దేముడు ముందుగానే నుదిటి వ్రాత ఇలా రాసివుంచాడు. ఇక్కడా మరొకరికి అంటగట్టాలనే మన ప్రయాస.
  చాలా చాలా గుండె కోతగావుంది. నాకు తెలియని ఎక్కడికో ఇంక రామని నను వదిలివెళ్ళినవారంతా నా కంటి నీటి తీర్థం పుచ్చుకోను తిరిగి వచ్చారులా వుంది. చదివే భాగ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 24. ఉష గారు నెనర్లు, మీది పిచ్చి కానే కాదండీ. అత్మీయులు మనని వీడి పోరని గాడంగా నమ్ముతాం కనుకనే వారిని చర్చకు ఆహ్వానిస్తాం.

  సుబ్బు థ్యాంక్యూ.

  రిప్లయితొలగించండి
 25. శ్రీకాంత్ గారు, మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 26. వేణు -
  గరుడ పురాణం లో ఉలా చెప్తారు
  ఎవరికైనా -
  తండ్రి చనిపోతే మూడులోకాలు అంధకారం అవుతాయట. నాకు ఇది అక్షరాలా నిజం అనిపించింది.
  తల్లి చనిపోతే - నోటిదగ్గరి ముద్ద మాయమై పోటుందట.
  భార్య చనిపోతే - గుడ్డ లేని గొడుగు పట్టుకున్నవానిలా అవుతుందట జీవితం.

  ఐతే, పుట్టుక పోవుట ఇవి సృష్టి సహజం. మనం పోయినవారి స్మృతులతో రేపటికోసం జీవిస్తూండటమే. నీలోని ప్రతీ రక్తపు బొట్టులోను మీ అమ్మ ఉంది, అంటె నీలోనే ఉంది...
  నామాటల్లోని సత్యాన్ని గ్రహిస్తావు కదూ -

  మీ అమ్మ గారి ఆత్మ శాంతి పొందాలని ఆ భగవంతుణ్ని ప్రార్ధిస్తూ -
  చివరిగా - మీకు అమ్మైనా మీ నాన్నగారికి అర్ధభాగం, మీనాన్నగారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నీది. ఆయన్ని ఊరడించి, ఆయనలో ఆత్మస్థైర్యాన్ని తిరిగి నింపాల్సిన బాధ్యతకూడా నీదే. నీ దుఖాన్ని దిగమింగుకుని, మీ నాన్నగారిని తిరిగినిలబెట్టే ప్రయత్నం మొదలుపెట్టావని నేను భావిస్తున్నా.

  రిప్లయితొలగించండి
 27. మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను...

  రిప్లయితొలగించండి
 28. "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు
  ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు"

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.