అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శుక్రవారం, ఆగస్టు 22, 2014

ఊహలు గుసగుసలాడే...

ప్రేమ !... రెండక్షరాల పదం... ఒక చిన్న ఫీలింగ్ / ఎమోషన్... సినిమాలు మొదలయినప్పటినుండీ... ఆమాటకొస్తే కథలు చెప్పడం మొదలైన దగ్గర నుండి కూడా ఇప్పటికి కొన్ని వేల సార్లు కథా వస్తువుగా ఉపయోగపడింది ఈ ప్రేమ, ఇక ముందు కూడా ఉపయోగపడుతుంది.

ప్రేమ కథలు ఎన్ని సార్లు విన్నా చూసినా బోర్ కొట్టవని కొత్తగానే ఉంటాయని పదే పదే హిట్ అయ్యే ఎన్నో ప్రేమకథలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. అలాంటి ఒక ప్రేమకథకి ఆకట్టుకునే కథనం, చక్కని సంభాషణలు, సున్నితమైన హాస్యం కూడా తోడైతే... ఆ సినిమా చూడడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

అలాంటి ఓ మంచి సినిమానే "ఊహలు గుసగుసలాడే" సినిమా... ఈ సినిమా ఈ ఆదివారం (24 ఆగస్ట్ 2014) సాయంత్రం 6 గంటలకు మాటీవీ లో టెలికాస్ట్ అవుతుంది. అవకాశమున్న ప్రతిఒక్కరూ తప్పక చూడండి... డోంట్ మిస్ ఇట్... ఒక వేళ మిస్ అయినా 25 ఆగస్ట్ 2014 నుండి డివిడి లభ్యమవనుంది సొంతం చేస్కోండి.

 

చెడిపోవడానికి అన్ని అవకాశాలున్నా కూడా బుద్దిమంతుడిగా మిగిలిపోయిన ఒక రిచ్ మంచబ్బాయి ఆనంద్ గా "అష్టాచెమ్మా" సినిమాతో పరిచయమైన "శ్రీనివాస్ అవసరాల" దర్శకుడిగా అవతారమెత్తి తెరకెక్కించిన తొలి చిత్రం ఇది. నటుడిగా ఆ సినిమాతో ఎంత ఆకట్టుకున్నాడో దర్శకుడిగా, రచయితగా అడుగడుగునా తన మార్క్ చూపిస్తూ ఈ సినిమాతో కూడా అంతే ఆకట్టుకున్నాడు. ఎక్కడా వెకిలి హాస్యానికి చోటివ్వకుండా క్లీన్ కామెడీతో ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మన సొంతం చేశాడు. 

ఈ సినిమాకి కళ్యాణ్ కోడూరి సంగీతం కూడా ఒక పెద్ద ఎసెట్ అయింది. సంగీతం అంటే వాయిద్యాల హోరుగా సాహిత్యాన్ని మింగేసేదిగా నిర్వచనాన్ని మార్చేస్తున్న ఈరోజుల్లో... సిరివెన్నెల, అనంత శ్రీరాం రాసిన పాటల్లోని అందమైన సాహిత్యాన్ని చక్కగా కాంప్లిమెంట్ చేస్తూ ప్రతి పదమూ స్పష్టంగా వినిపించేలా దానికి సపోర్టింగ్ గా నేపధ్యంలో పరిమితమైన వాయిద్యాలతో చాలా హాయైన అనుభూతిని ఇచ్చింది. కావాలంటే ఒకసారి ఈ క్రింది పాట విని చూడండి మీరే ఒప్పుకుంటారు. అలాగే నేపధ్య సంగీతం సైతం ప్రతి సీన్ లోనూ సంభాషణలను మింగేయకుండా సన్నివేశాలను ఎలివేట్ చేస్తుంది. సినిమాకు మరో ఎసెట్ వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ... వైజాగ్ బీచ్ అయినా, టీవీ స్టూడియో అయినా, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయినా, సినిమా థియేటర్ అయినా, ఏదైనా కూడా చూడచక్కని ఫ్రేమ్స్ లో కళ్ళకి ఏమాత్రం శ్రమనివ్వని కలర్ కాంబినేషన్స్ లో సన్నివేశానికి తగిన మూడ్ కియేట్ చేస్తూ హాయిగా అనిపిస్తుంది. సినిమాలోని ముఖ్యమైన మూడు పాత్రల్లోనూ నాగశౌర్య, రాశిఖన్నా, శ్రీని అవసరాల ఒదిగిపోయారు. సపోర్టింగ్ రోల్స్ చేసిన ఇతర నటీనటులంతా కూడా ఆకట్టుకున్నారు. 

కథ కన్నా కథనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చిన ఈ సినిమా ఒక మహోన్నతమైన తెలుగుసినిమా అని చెప్పను కానీ ఆకట్టుకునే కథనంతో చక్కని పాటలతో సున్నితమైన హాస్యంతో ఒక మంచి సినిమాని చూసిన అనుభూతిని అందిస్తుంది. కామెడీ అంటే బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఎదుటి వ్యక్తిని బకరాని చేయడం లేదా తన్నడం మాత్రమే అనుకోకుండా సన్నివేశాలనుండి సంభాషణలనుండి కూడా హాస్యాన్ని సృష్టించవచ్చని ప్రూవ్ చేసిన ఒకప్పటి జంధ్యాల సినిమాలను గుర్తు చేసే సినిమా ఈ "ఊహలు గుసగుసలాడే". ఈ పోస్ట్ లో ఎంబెడ్ చేసిన ట్రైలర్స్ చూడండి నచ్చితే ఈ సినిమా మిస్ అవకండి. 


శుక్రవారం, ఆగస్టు 15, 2014

మార్పు మనతోనే మొదలవ్వాలి...

 
"మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం కూడా దేశభక్తే... మార్పు మనతోనే మొదలవ్వాలి.." అని తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఒక చక్కని లఘు చిత్రాన్ని కానుకగా అందించారు హీరో అల్లూ అర్జున్. ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ నీ, అల్లూ అర్జున్ నీ మరియూ ఈ చిత్రానికి పని చేసిన టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇటువంటి సందేశాత్మకమైన లఘుచిత్రాన్ని నిర్మించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్రానికి సంబందించిన ప్రెస్ మీట్ ఇక్కడ చూడవచ్చు. ఈ లఘు చిత్రాన్ని క్రింది ఎంబెడ్ వీడియోలో లేదా ఇక్కడ చూడవచ్చు.

మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.  

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.