మంగళవారం, జనవరి 22, 2019

అమ్మ ప్రేమ...

అంటే మరేమో అప్పట్లోనే మనకున్న బద్దకంతో "ఆ తొందరేముంది మెల్లగా పుడదాంలే, ఐనా ఇక్కడే హాయిగా ఉందమ్మా" అని డ్యూ డేట్ దాటినా కూడా ఎంచక్కా వెచ్చగా అమ్మ బొజ్జలో బజ్జునుంటే ఓ పదిరోజులు ఓపికగా ఎదురు చూసిన మా డాక్టరాంటీ "ఇక నే కలుగజేస్కోకపోతే కుదరదమ్మా" అనేసి నన్ను భూమ్మీదకి తెచ్చేశారని ఇదివరకే చెప్పాను కదా. నా ఆ బద్దకానికి మూల్యంగా నేను రంగు తగ్గిపోవడంతో సహా మరికొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చేవట నా చిన్నప్పుడు. అలాంటి వాటిలో ముఖ్యమైనది బలం లేకపోవడమట.

అసలు ఆహారంపై శ్రద్ద లేకపోవడం. ఏం పెట్టినా తినకపోవడం, ఎన్ని తంటాలు పడి ఎంత తినిపించినా బొత్తిగా బలం రాకపోవడం ఊసకాళ్ళు బలహీనమైన అవతారంతో అమ్మ వాళ్ళని భయపెట్టేవాడినట.నాతో పాటు పుట్టిన పిల్లలు నడిచేస్తూ పరిగెడుతూ అల్లరి చేస్తుంటే నేను ఊరికూరికే ఎక్కడపడితే అక్కడ కూలబడిపోవడంతో ఇలా ఐతే పిల్లాడేమైపోతాడు అని అమ్మకి బోలెడంత బెంగొచ్చేసి అర్జంట్ గా ఓ పిల్లల డాక్టర్ గారి దగ్గర చూపించేసిందట.

అప్పుడు ఆయనేమో "ఇలా కాదమ్మాయ్ మీ వాడికి తిండి పుష్టి కలగడానికి మాంచి మందిచ్చేస్తాను, ఆ టానిక్ గానీ తాపావంటే ఇక కొండలని పిండి చేసుకుని తినేస్తాడు, బోలెడంత బలం వచ్చేస్తుంది" అని చెప్పి ఓ టానిక్ ఇచ్చారుట అది క్రమం తప్పకుండా కొన్నాళ్ళు వాడాక ఇహ అప్పుడు మొదలైంది మన తిండి ప్రస్థానం మళ్ళీ వెనక్కి తిరిగి చూడనే లేదు.

అప్పటిదాకా నా చేత అన్నం తినిపించడం అంటే ఓ చిన్న సైజ్ యజ్ఞం చేయడమేనట. అమ్మో పిన్నో నన్ను ఎత్తుకుని నానా రకాల మాయలు చేసి కథలు చెప్పి, ఆటలు ఆడించి, పాటలు పాడి, చందమామను చూపిస్తూ ప్రపంచంలో ఉన్న ఇతరత్రా ఫీట్స్ అన్నీ చేసేవారట. ఇన్ని చేసినా కూడా మెత్తగా ఉడికిన అన్నంలో పప్పు నెయ్యి వేసి బాగా కలిపి కంచం అంచుకి రాసి గుజ్జు తీసి గోరుముద్దగా అందిస్తే (ఇది ఇప్పటికీ ఇష్టమే అనుకోండి) అది మాత్రమే తినే వాడినట. కానీ ఆ టానిక్ వాడిన తర్వాత నా ధోరణి మొత్తం మారిపోయిందని చెప్పేది అమ్మ.

సో ప్రేమ కొద్దీ పాపం బిడ్డ ఏమైపోతాడో అని కష్టపడి తిండి మీద ఇష్టం పెంచిన అమ్మ దాన్ని చక్కగా అలాగే పెంచి పోషిస్తూ వచ్చేది. నేను ఒకటి నుండి నాలుగో తరగతి వరకు మా ఇంటిపక్క బడిలో అంటే మా కిటికీలో నుండి చూస్తే తరగతి గదిలో నేనేం చేస్తున్నానో కనిపించేంత పక్కనే చదివినా కానీ నాకు ఇంటర్వల్ లో కొనుక్కోడానికి పదిపైసలో పావలానో ఇచ్చేది. ఆ పైన అదే బడిని కొంచెం దూరంగా మార్చాక అది పెరిగి నేను తరగతులు పెరిగే కొద్దీ డబ్బులూ పెరుగుతూ వచ్చాయ్.

మా స్కూల్ లో దొరికే వాటికన్నా ఇంటి దగ్గర కొండయ్య కొట్టు అని ఒకటి ఉండేది. అందులో పదిపైసల బిళ్ళ సైజ్/షేప్ లో ట్రాన్సపరెంట్ రేపర్ లో చుట్టి  న్యూట్రిన్ వాళ్ళ కొబ్బరి చాక్లెట్ ఒకటి వచ్చేది అది నా ఫేవరెట్. అలాగే పప్పుండలు, కొబ్బరుండలు, కొబ్బరి బిళ్ళలు, చాక్లెట్లు, బిస్కట్లు, చిన్న చిన్న చిరుతిళ్ళు చాలా దొరికేవి అందుకే ఆ కొట్టుకి నేను రెగ్యులర్ కస్టమర్ ని అనమాట.

ఇవే కాక కొన్నాళ్ళు గుంటూరు నుండి నర్సరావుపేట మధ్య అమ్మ సీజన్ తిరిగేప్పుడైతే స్టేషన్ లో మెలోడీ చాక్లెట్స్ కొని తీస్కురావాల్సిందే. అవి లేకుండా వస్తే నా ఏడుపు మొహం చూడలేక నాకోసం కొంచెం ముందుగానే స్టేషన్ కి వచ్చి రైలు అందుకోవడం కన్నా ఈ చాక్లెట్స్ కొనడం మీద ఎక్కువ శ్రద్ద చూపించేదిట అమ్మ. ఆ స్టేషన్ లోనే కొన్ని వెరైటీ బిస్కట్లు, ఎపుడైనా ప్రత్యేకమైన చాక్లెట్లు, ఇంకా చందమామ, బాలమిత్ర, బుజ్జాయి లాంటి పుస్తకాలు కూడా తెచ్చేది.  

కొంచెం హైస్కూలుకొచ్చాక పాకెట్ మనీ పెరగడంతో ఈ చిరుతిళ్ళకి తోడుగా పాకెట్ ఐస్ లు, ఐస్క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, మా నర్సరావుపేట ఈశ్వర్ కూల్ డ్రింక్స్ లో దొరికే స్పెషల్ గ్రేప్ జ్యూస్ ఇలాంటివన్నీ అలవాటయ్యాయ్. ఇవన్నీ ఒక ఎత్తు ఐతే హాస్టల్ లో చేరాక ఇంటికొచ్చినప్పుడల్లా బోల్డన్ని పిండి వంటలు తయారు చేసే వాళ్ళు. నేను రేపో ఎల్లుండో బయల్దేరుతాననగా ముందు రోజు హాల్లో టీవీ ముందు గ్యాస్ స్టవ్ అరేంజ్ చేస్కుని ఇక అదే పనిగా రాత్రి పది పదకొండు వరకూ చక్కలు, చక్రాలు, అరిశలు, గవ్వలు, కొబ్బరి లౌజు, కజ్జికాయలు, గోధుమ బిళ్ళలు, సున్నుండలు ఇలా ఏవో రకరకాల పిండి వంటలు చేసేది ఓపికగా. అన్నీ ఒకేసారి కాదులెండి అలా కుళ్ళుకోకండి :-)
 
నా బట్టలు ఇతర అవసరమైన సామాన్ల బరువుకి రెట్టింపు బరువుండే వీటిని ప్రతిసారి తీస్కెళ్ళడం నాకు బద్దకం పైగా అసలే బొద్దుగా ఉండేవాడ్నేమో అన్ని తీస్కెళ్తే స్నేహితులు వెక్కిరిస్తారేమో అని బిడియం ఒక వైపు లాగేస్తుండేది. సో పాపం అమ్మ అంత కష్టపడి చేస్తే నేను వాటిలో సగానికి సగం తగ్గించి తీస్కెళ్ళడానికి అమ్మతో ఒక మినీ యుద్దం చేయాల్సి వచ్చేది. ఎన్ని చెప్పినా ఓపికగా ఎదురు సమాధానం చెప్పి సర్దేయడానికే చూసేది. నేను కొంచెం పెద్దయ్యాక ఇక ఎదురు చెప్పలేక.. అమ్మా నీతో గొడవపడి ఊరు వెళ్తే నాకు అక్కడ అస్సలు బావుండడం లేదు సో ఇలాంటి చిన్న విషయాలకి మనం పోట్లాడుకోవద్దు ప్లీజ్ అని ఐస్ పెట్టేవాడ్ని దాంతో పాపం తర్వాత్తర్వాత ఎక్కువ వాదించడం మానేసింది.

మొత్తానికి అలా హాస్టల్ చదువులు అవీ ముగించుకుని ఉద్యోగంలో చేరాక ఓ శుభముహూర్తాన అమెరికా వెళ్ళాల్సిన పనిబడింది. ఇక అంతే అమ్మకి నేను దూరంగా ఉంటానన్న బెంగతో పాటు అక్కడ అసలేం తిండి దొరుకుతుందో ఏం తింటానో అన్న దిగులు ఎక్కువైపోయింది. దాంతో అక్కడా ఇక్కడా సేకరించిన సమాచారం ప్రకారం అక్కడేం దొరకవని తెలుసుకుని పప్పులు ఉప్పులు బియ్యం నిల్వ పచ్చళ్ళు సమస్తం ప్యాక్ చేసేయడానికి సిద్దపడింది. మళ్ళీ కథ మొదలు... ఈ సారి సూట్కేస్ బరువుకి లిమిట్స్ ఉంటాయ్ తూకం వేసి కొంత మాత్రమే తీస్కెళ్ళాలి ఇలాంటివన్నీ చెప్పి వీలైనంత తక్కువ తీస్కెళ్ళడానికి ఒప్పించాను.

అప్పటికీ వంట చేసేప్పుడు కూరల్లో వేస్కోడానికి ఒక పొడి, ఇక గన్ పౌడర్ గా పేరొందిన శనగపప్పు కారం తో పాటు కొన్ని పచ్చళ్ళు, పొడులు సిద్ధం చేసింది పిండివంటలు ఎలాగూ సిద్దం. ఐతే సున్నుండలు ఉండ చుడితే ఎక్కువ రోజులు ఉండవేమో పొడిగా ఐతే బాగా నిల్వ ఉంటాయ్ అని నెయ్యి విడిగా సున్నుండల పొడి పిండి విడిగా ప్యాక్ చేసి ఇచ్చింది. నాకోసమని ప్రత్యేకంగా ఓ సీలింగ్ మెషిన్ కొని ఒకటికి రెండు కవర్లలో వేసి పాక్ చేసి సీల్ చేసి వాటిని మరో కవర్ లో వేసి దానికి విడిగా సీల్ వేసి ఇలా ఎన్నో జాగ్రత్తలు తీస్కుని ప్యాక్ చేసేది. ఐనా కానీ మా ప్యాకింగ్ కెపాసిటీని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఎయిర్ పోర్ట్ స్టాఫ్ మా పెద్ద పెద్ద సూట్కేస్ లతో ఫుట్ బాల్, వాలీ బాల్, షాట్ పుట్, జావలిన్ త్రో లాంటి గేమ్స్ అన్నీ ఆడేసేవారు. అలాంటి ఓ బలహీన క్షణంలో సూట్కేస్ లోపలున్న ఈ సున్నుండల పొడి ప్యాకెట్ పగలనే పగిలింది.

ఇంకేముంది చక్కగా నేతిలో వేయించిన మినుములు పంచదార కలిపి మెత్తగా పట్టిన పొడి దెబ్బకి పుస్తకాలు, బట్టలు, పేపర్స్ ఒకటనేమిటి సూట్కేస్ లోపల ఉన్న సామాగ్రి సూట్కేస్ తో సహా మొత్తం అంతా ఇదే సువాసన, అదేకాక వేటిని పట్టుకున్నా పంచదార పొడి కాబట్టి చేతికి అంటుకుపోతూ ఉండేది. బట్టలు మొత్తం వేస్కోకుండానే ఒకటికి రెండు సార్లు ఉతుక్కుని మొత్తం అంతా శుభ్రం చేస్కునే సరికి నా తలప్రాణం తోకకొచ్చింది. అయినా ఎంత శుభ్రం చేసినా సూట్కేసులు, పర్సులు లాంటివి నీళ్ళలో కడగ కూడదనే నియమం ఉండడంతో ఆ సూట్కెస్ లో ఇన్నేళ్ళైనా ఇప్పటికీ ఏదో మూల ముట్టుకుంటే ఇంకా ఆ పంచదార పొడి రూపంలో అమ్మప్రేమ చేతికి కమ్మగా అంటుకుంటున్నట్లుగా అనిపిస్తుంటుంది.

6 కామెంట్‌లు:

  1. నాటినించీ..నేటిదాకా ఓసారి టైం మెషిన్ లో చుట్టి వచ్చినట్టున్నారే..బావున్నాయండీ మీ ఙాపకాలు..అమ్మతో ఉన్న క్షణాలు యెప్పుడూ మధురంగానే ఉంటాయండి..మనసులో మనతోనే ఉంటాయి..

    రిప్లయితొలగించండి
  2. ఇంకా ఆ పంచదార పొడి రూపంలో అమ్మప్రేమ చేతికి కమ్మగా అంటుకుంటున్నట్లుగా అనిపిస్తుంటుంది.

    chaaala bagundi andi

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగున్నాయ్ మీ జ్ణాపకాలు
    అమ్మ ప్రేమెప్పటికి మధురమే

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.