కథానాయకుడు సినిమా గురించి చాలామందికి ఉన్న సందేహాలన్నీ పక్కనపెట్టవచ్చు. కొందరు అంటున్న మహానటితో పోలికలు, తారక్ లేడు, బాలకృష్ణ యంగ్ గేటప్ బాలేదు, ఎలక్షన్లముందు రిలీజవాలని హడావిడిగా చుట్టేశారు లాంటి మాటలన్నీ మర్చిపోవచ్చు. ఆ హడావిడి ఎక్కడో కొన్నివిషయాల్లో కనిపించినప్పటికీ అతి తక్కువ టైమ్ లో క్వాలిటీ ప్రోడక్ట్ ను అందించారు క్రిష్ అండ్ టీం. అయినా ఈ ఇంటర్నెట్ యుగంలో ఒక సినిమా చూసి ఓటు వేసేవాళ్ళు ఎవరుంటారండీ, కనుక ఇవన్నీ వదిలేసి...
కొన్ని దశాబ్దాల పాటు వెండితెరని ఏలిన మకుటం లేని మహారాజు గురించి తెలుసుకోవడానికి ఈ సినిమా చూడండి. ఒక మహోన్నత ఆదర్శమూర్తి జీవితాన్ని చూడడానికి ఈ సినిమా చూడండి. ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపాన్ని చూడడానికీ, ఆయన నిజాయితీని, క్రమశిక్షణను, వృత్తిపట్ల ఆయనకు ఉన్న నిబద్దతను, అనుకున్నది చేయాలనే మొండి పట్టుదలనూ, ఎంత ఎదిగినా మూలాలను మరువని తత్వాన్నీ, సాటివారిని చూసి కరిగిపోయే సున్నితమైన మనస్సునూ చూడడానికి ఈ సినిమా చూడండి.
నాకు చాలా నచ్చిందీ సినిమా మీకూ నచ్చుతుందని నా అభిప్రాయం. నేను చూసిన బాలకృష్ణ సినిమాలలో ది బెస్ట్
NTR - కథానాయకుడు. ఇది బాలయ్య సినిమా అని కూడా అనలేమేమో బహుశా బాలకృష్ణ ఇంత
సటిల్ యాక్షన్ ఇంకే సినిమాలోనూ చేసి ఉండడు. ఆయన సినిమాలకుండే ఏ లక్షణాలు
ఇందులో కనపడలేదు.
సినిమాలో ఎన్టీఆర్ కనపడడం లేదు బాలకృష్ణే కనిపించాడనేది నేను విన్న అతి పెద్ద కంప్లైంట్... ఓ ఫ్రెండ్ అన్నట్లు ప్రజలలో పెద్దగా రిజిష్టర్ అవని నటులు బయోపిక్ లో నటించేప్పుడు వారి మేకప్, ఆహార్యం, హావభావాలను అనుకరించి మెప్పించవచ్చు. కానీ బాలకృష్ణ అలా కాదు ఆల్రెడీ రిజిస్టర్డ్ నటుడు తనకి ఎంత మేకప్ వేసినా ఏం చేసినా అలవాటైన మనకళ్ళకి తనే కనిపిస్తారు.
సినిమా చూసేముందు గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం ఇది పూర్తి కథ కాదు ఒక మనిషి జీవితంలో సగభాగం మాత్రమే. కళాకారుడిగా ఉన్నతమైన స్థానానికి ఎలా ఎదిగారు ఆ తర్వాత ప్రజల కష్టాలను చూసి చలించి పోయి వారికోసం ఏదో చేయాలని ఎలా తపించారన్నంత వరకే చూపించారు ఏం చేశారనేది మహానాయకుడు లో చూపించనున్నారు. ఒక కథగా రెండు సినిమాలను కలిపి చూసినపుడే సంపూర్ణత్వం కనిపించవచ్చు కనుక కథపైనో కంటిన్యుటీపైనో ఇపుడే వ్యాఖ్యానించలేం.
ఇక ఈ చిత్రం కోసం క్రిష్ అల్లుకున్న కథనం, సన్నివేశాలు, వాటికి తగినట్లుగా అప్పటి రోజులలోకి అవలీలగా తీసుకెళ్ళిన సాహిసురేష్ ఆర్ట్ డైరెక్షన్, జ్ఞానశేఖర్ గారి సినిమాటోగ్రఫీ, సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు, కీరవాణి ఇచ్చిన సంగీతం ఒక చక్కని అనుభూతినిచ్చాయి. మహానాయకుడు చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా కృష్ణుడి గెటప్ లో మొదటి సారి కనిపించే సన్నివేశం, ఎమర్జన్సీ సీన్, పద్మశ్రీ సీన్ (ఇక్కడ సుమంత్) చప్పట్లు కొట్టిస్తే కొన్ని సన్నివేశాలు భావోద్వేగంతో గుండె గొంతులోకి వచ్చినట్లనిపిస్తాయ్
వీటిలోనే కాక మరికొన్ని చిన్న చిన్న సన్నివేశాలో సైతం క్రిష్ దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. ఉదాహరణకు పబ్లిక్ గా భర్తమీద చూపించాలనిపించిన ఆపుకోలేనంత ప్రేమను కొడుకును ముద్దు పెట్టుకోవడం ద్వారా చూపించడం లాంటి సన్నివేశాలు మంచి అనుభూతినిస్తాయ్. సినిమాలో నాకు నచ్చిన మరో విషయం క్రిష్ తెలివిగా చేసిన పని, కొన్ని ముఖ్యమైన అప్పటి సినిమాల సన్నివేశాల్లో సంభాషణల్లో ఎన్టీఆర్ గారి స్వరాన్ని అలాగే ఉంచేయడం. దానికి బాలయ్య బాబు లిప్ సింక్ ఇవ్వడం కూడా సామాన్యమైన విషయం కాదు.
సినిమాలో ముఖ్య పాత్రలకు ఎన్నుకున్న నటులంతా తగిన న్యాయం చేసినప్పటికీ బాలకృష్ణ తో పాటు ముఖ్యంగా చెప్పుకోవలసిందీ నన్ను ఆకట్టుకున్నదీ విద్యాబాలన్, సుమంత్, రాణా, దగ్గుబాటి రాజా, కళ్యాణ్ రామ్. సుమంత్ ఏఎన్నార్ గా ఇంత చక్కగా సరిపోతాడని ఊహించలేదు కొన్ని సన్నివేశాల్లో చాలా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఎవరెవరి పాత్రలు ఎవరు చేశారన్న వివరాల కోసం ఈ వికీ లింక్ చూడండి. ఈ సినిమా ప్రోమో ఇక్కడ చూడవచ్చు, కొన్ని డైలాగ్స్ ప్రోమో ఇక్కడ చూడవచ్చు అలాగే సినిమా మిగిలిన ప్రోమో వీడియోస్ ఈ యూట్యూబ్ ఛానల్ లో చూడగలరు.
తెలుగు జాతి గర్వించ దగిన లెజెండ్ ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకోవడానికి మరొకసారి తలచుకోవడానికి ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా NTR-కథానాయకుడు. చూసి ఆయన వ్యక్తిత్వంలో ఇసుమంతైనా నేర్చుకుని ఆచరించగలిగితే మీ జీవితానికీ ఇప్పటి సమాజానికీ ఎంతో మేలు జరుగుతుందనడంలో ఏం సందేహం లేదు.
ఈ చిత్రంలోని నాకు నచ్చిన కొన్ని సంభాషణలు ఇక్కడ వ్రాస్తున్నాను. దయచేసి సినిమా ఇంకా చూడని వారు ముందు సినిమా చూశాక వీటిని చదువుకో గలరు..
తెలుగు జాతి గర్వించ దగిన లెజెండ్ ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకోవడానికి మరొకసారి తలచుకోవడానికి ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా NTR-కథానాయకుడు. చూసి ఆయన వ్యక్తిత్వంలో ఇసుమంతైనా నేర్చుకుని ఆచరించగలిగితే మీ జీవితానికీ ఇప్పటి సమాజానికీ ఎంతో మేలు జరుగుతుందనడంలో ఏం సందేహం లేదు.
ఈ చిత్రంలోని నాకు నచ్చిన కొన్ని సంభాషణలు ఇక్కడ వ్రాస్తున్నాను. దయచేసి సినిమా ఇంకా చూడని వారు ముందు సినిమా చూశాక వీటిని చదువుకో గలరు..
"జనం కన్నీళ్ళతో నా వాళ్ళ కడుపు నింపుకునే అదృష్టం నాకు వద్దండి."
"ఎవడి డబ్బుతో ఇల్లు గడుస్తుందో వాడే ఆ ఇంటి యజమాని. లంచం తీసుకునే వాడింటికి ఎంతమంది యజమానులో మీరే ఆలోచించుకోండి."
"నీకూ నాకూ రెండు ఇష్టాలుంటాయా బావా ?"
"నిజంగా సినిమాల్లోకే ?"
"అవునండీ"
"ఎవిటీ నాగేశ్వర్రావు ఐపోదామనే ?"
"కాదండీ రామారావు అవుదామని."
"అదృష్టం పిలిచినప్పుడే రావాలోయ్, నువ్వు వచ్చినపుడదుండదు."
"నమ్మకం అదృష్టం మీద కాదండీ నా మీద. కష్టపడ్డానికి అవకాశాన్నివ్వండి అదృష్టాన్ని నేను సంపాదించుకుంటాను."
"జనానికి చెప్పాలి, సినిమా చెబితే వింటారు."
"బాధ్యతగా బ్రతకడం ప్రజా ధర్మం, ఆ బాధ్యతని గుర్తుచేయడం కళాకారుల ధర్మం."
"అమ్మా నాన్న మాట వినని వాడు కూడా స్నేహితుడు చెబితే వింటాడు."
"నిన్ను మించి డబ్బు సంపాదించడం సంతోషమే కానీ ఆ డబ్బును మించి ఎదగాలనుకుంటే దెబ్బతింటావు."
"సాయానికి కూడా కాపలా ఉండాలా,"
"మన కష్టానికి కాపలా ఉండాలి, డబ్బుని గౌరవించాలి."
"ఆడవాళ్ళు ఆత్మగౌరవంతో బతకడానికి ఆర్ధిక స్వాతంత్రం అవసరం కానీ అది విచ్చలవిడిగా కాకుండా విచక్షణతో ఉండాలి."
"మన గుండెలాడకపోయినా మన సినిమాలాడుతూనే ఉంటాయి."
"వస్తాడు అడిగేవాడొస్తాడు ఏళ్ళతరబడి అట్టకట్టిన అహంకారాన్ని కడిగేవాడొస్తాడు."
"మంచితనం మనిషిని కూడా దేవుడ్ని చేస్తుంది అది రామకథ."
"చెడ్డతనం గొప్పవాడ్ని కూడా రాక్షసుడ్ని చేస్తుంది అది రావణకథ."
"నాగరికత సినిమా చుట్టూ తిరుగుతుంది."
"ఫలితం ఎప్పటికైనా రానీ, ప్రయత్నం మననుంచే మొదలవ్వాలి."
"వంద వ్యాపకాలు ఉండచ్చు పట్టుదల ప్రణాలిక రెండూ ఉంటే చాలు."
"మనమెంత గొప్పోళ్ళమైనా మార్పుని గౌరవించాలి."
"అవసరాన్ని, అనుభవాన్నీ గౌరవించడం మన బాధ్యత."
కర్ఫ్యూలో బయటకి వెళ్ళద్దని వారిస్తున్న చిన్నాన్నతో హరికృష్ణ :
"ఆఫ్ట్రాల్ కర్ఫ్యూ చిన్నాన్నా వెళ్తోంది ఎన్టీఆర్"
ఏసిపి : రామారావునుద్దేశించి "మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సొస్తుంది."
హరికృష్ణ : "అప్పుడు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మా అభిమానులకు రైళ్లు సరిపోవు మీ జైళ్ళు సరిపోతాయా."
"ఎన్టీఆర్ మేకప్ వేస్తే హీరో.. మేకప్ తీస్తే మోర్ దేన్ ఎ హీరో.."
"బాధకి పుట్టిన మనుషులం, బాధ లేకపోతే బ్రతకలేం."
"ఏ పరిస్థితులలోనైనా మనిషిని ఓదార్చగలిగేది పని మాత్రమే."
"మీవి సినిమా తుపాకులు కాకపోవచ్చు. కానీ ఇది సినిమా గుండె షూటింగ్ కి భయపడదు."
"మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి. మనం పోయాకే అది గెలిచానని చెప్పుకోవాలి."
"నీకేమన్నా అయితే ?"
"నీ పసుపు కుంకాలు ఈ వెండితెరపై పదికాలాలు పదిలంగా ఉంటాయిలే."
"అభిమానంతో పెట్టిన ముద్ద అమ్మ చేతి గోరుముద్దతో సమానం."
"జనం కోసం నిలబడే ఎవడైనా ఏడుకొండలోడే."
"ప్రజల కోసం బతికేవారి నీడ కూడా పూజనీయం అవుతుంది."
ఇన్కం టాక్స్ గురించి : "ప్రభుత్వం అంటే అమ్మలాంటిది. ప్రయోజకుడైన ప్రతి బిడ్డ సంపాదనలో అమ్మకి భాగం ఉంటుంది."
"నన్ను దేవుడ్ని చేసిన మనుషులకోసం నేను మళ్ళీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను."
భోగి శుభాకాంక్షలు వేణూజి..బాగా రాశారండి..ఇంకా మూవీ చూడలేదు..చూశాక తప్పక అభిప్రాయాన్ని పంచుకుంటాను..
రిప్లయితొలగించండిథ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.
తొలగించండిఇంకో డైలాగ్.
రిప్లయితొలగించండిసినిమాల్లోకి వెళ్తున్నావా?? నాగేస్రావ్ అయిపోదామనే???
కాదండి...రామారావు అవుదామని.
సూపర్ రివ్యూ.
థాంక్స్ రాజ్.. మంచి డైలాగ్ మిస్ చేశాను.. ఈ డైలాగ్ అవగానే ఘనకీర్తిసాంధ్ర అని పాట మొదలవడం సూపర్ అసలు..
తొలగించండిబయోపిక్ అంటే ఇంతేనా ? ఒక్క లోపం , బలహీనత కూడా లేదు. దేవుడు లాంటి మనిషి, ఇంకా లాంటి ఏంటి దేవుడే అంటారేమో మీరు.
రిప్లయితొలగించండిబాల్యం ? ఎం ఎస్ రెడ్డి గారి ఆత్మ కథ ? అఫ్ కోర్స్ , అందులో ఆయన మిగతా జనాల్ని తిట్టి, తనని పొగుడుకున్నాడు . కానీ ఆయన చెప్పిన విషయాలు ? ఎనీ హౌ , ఈ జనరేషన్ కి తెలియదు కాబట్టి లైట్ తీసుకుంటారు , ముందు జనరేషన్ కి అన్ని తెలుసు కాబట్టి , వాళ్ళు లైట్ గ తీసుకున్నారు .
కానీ యువకుడి పాత్ర ని జూనియర్ కి ఇఛ్చి , తను కొంచెం వయసు వఛ్చిన పాత్రను తీసుకుంటే బాగుండేది బాలకృష్ణ .
:Venkat
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ వెంకట్ గారు.. ఒక మనిషిలో తొంభైశాతం గొప్ప గుణాలు పదిశాతం లోపాలు ఉన్నపుడు ముందు తరాలకి వేటిని అందివ్వడం అవసరం అనేది ఆలోచిస్తే నాకు లోపాలు చూపించకుండా బయోపిక్ లు తీయడంపై అభ్యంతరం లేదండీ. ఎన్టీఆర్ గారనే కాదు ఎవరి బయోపిక్ ఐనా నాది ఇదే అభిప్రాయం. ఇక పాత్రల విషయంలో మీరన్నది కరెక్ట్ నేనూ ఏకీభవిస్తాను.
తొలగించండిమీరన్నది కరెక్టే గానీ వేణూ గారు, ఇక్కడ విషయమల్లా రామారావు గారి విషయంలో రెండో కోణానికి సంబంధించినంత వరకు వెలికి వచ్చినవి పది శాతం, రానివి తొంభై శాతం. ఆ కారణం గానే ఆయన ఆరాధ్యుడిగా, సుగుణాభిరాముడిగా చెలామణి అవ్వగలిగాడు. మీరన్నట్లుగానే అనుకున్నా పోనీ ఆ పది శాతం లోనన్నా కొన్నైనా చూపెట్టారా అంటే అదీ లేదు. అయినా ఇవన్నీ పక్కన పెడదాం. సినిమాకెళ్లిన వాళ్ళు సినిమాలో వినోదం, అనుభూతులు కోరుకుంటారు, అది ఎన్టీఆర్ సినిమా అయినా లేక సునీల్ సినిమా అయినా. అవి లేనప్పుడు rgv ఆఫీసర్ సినిమా ప్రక్కనే. ఇది నా అభిప్రాయం.
తొలగించండిహ్మ్.. వెలికిరాని నిజాలనేవి ఎంతవరకు నిజాలో అనే సందేహమ్ ఎప్పుడూ ఉండేదే కదండీ.. సో అవి పక్కనపెడితే అందరికి తెలిసినవి పదిశాతమే ఉన్నప్పుడు వాటిని చూపించాల్సిన అవసరమే లేదనేది నా ఉద్దేశ్యం.
తొలగించండిఇపుడు జీవించి లేని ఓ మనిషిని కొత్తగా జడ్జ్ చేయడానికన్నా తన జీవితాన్ని ఆదర్శంగా తీస్కుని భావితరాలు ఎదగడానికి ఉపయోగపడేలా బయోపిక్ లు ఉంటే చాలన్నది నా అభిప్రాయం.
ఎనీవేస్ కమర్షియల్ గా మీరన్న రిజల్టే వచ్చిందనుకుంటాను. కాకపోతే నాకు మాత్రం అంత తీసిపారేయాల్సిన సినిమా కాదనిపించింది.
వేణూజి..మూవీ చూశామండీ..యే మూవీ లో నైనా డైలాగ్స్ సీన్ ని యెలివేట్ చేయాలి కానీ మాటలు మాత్రమే వినిపిస్తే అది రైటర్ ప్రతిభని సూచిస్తుంది కానీ మూవీ కి తోడ్పడదనిపిస్తుంది నాకు..అందుకే త్రివిక్రం గారి మాటలు చాలా ఇష్టమనిపిస్తాయి..మాల లో దారం లా అల్లుకుపొతాయి..భారతీయుడు క్లైమాక్స్ లో మనీషా కోయిరాలా అంటుంది పెద్ద కమల్ హసన్ తో..బుద్ధికి తెలుస్తోంది..కానీ మనసుకి తెలీటం లా అని..అలా..ఈ మూవీ మనసుకి రామారావ్ గారి గొప్పతనాన్ని తెలియ చేస్తున్నా..దృశ్యం వల్ల హాస్యాస్పదంగా ఉందనిపించింది మరి..కీరవాణిగారు మాత్రం ఆయనకి రామారావు గారి పై ఉన్న అభిమానాన్ని స్వర స్వరంలోనూ అమృతధారగా కురిపించారు..
రిప్లయితొలగించండిముందుగా సినిమా చూసొచ్చి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు శాంతి గారు. మీరన్నది అక్షర సత్యం కీరవాణి సంగీతం అద్భుతం. నేను విజువల్ కి కాంప్రమైజ్ అయిపోయానండీ అంతకన్నా ఆశించలేదు. కానీ బాలకృష్ణ గారు నిర్మాతగా వ్యవహరించి పాత్రలకి తగిన నటీనటులని ఎంచుకుని సమయం తీసుకుని మరింత శ్రద్దగా నిర్మించి ఉంటే ఎన్టీఆర్ గారి బయోపిక్ ఎపిక్ గా నిలిచి ఉండేది.
తొలగించండి"నేను విజువల్ కి కాంప్రమైజ్ అయిపోయానండీ అంతకన్నా ఆశించలేదు"..
రిప్లయితొలగించండిఓ..ఔనా..ఇంట్రెస్టింగ్..
వేణూ గారూ మీ రివ్యూ చాలాబావుంది. ఈ సినిమాకోసం సాయిమాధవ్ గారు వ్రాసిన మంచి మంచి డైలాగ్స్ అన్నీ గుర్తుపెట్టుకుని ఇక్కడ ప్రచురించినందుకు ధన్యవాదములు. నాకు తెలిసి ఈ సినిమాకి హీరో క్రిష్ గానీ, బాలయ్యబాబు గానీ, కీరవాణి గానీ కాదు..నిస్సందేహంగా సాయిమాధవ్ గారే. సినిమా అంటే ఒక గుండె చెమ్మ నుంచి మరో గుండె చెమ్మ వైపు కి చేసే ప్రయాణం అని నా ప్రగాఢ అభిప్రాయం. ఇందులో అటువంటి సన్నివేశాలు (మాటలపరంగా) చాలా ఉన్నాయి. ఆయన కోసం తప్పనిసరిగా ఈ సినిమా చూడాలి.
రిప్లయితొలగించండికానీ ఈ సినిమాలో ఆర్ద్రత లేదు. సన్నివేశాల కల్పన కుదురుగా లేదు...వెరసి ఈ సినిమా మొత్తానికి రాజుగారి మృతాంగములా తయారయ్యింది. బాలయ్యబాబు ఎన్ని సినిమాలు చేసినా ఒకే రకమయిన డైలాగ్ డెలివరీ. ఆయన డైలాగ్ డెలివరీనే ఈ సినిమాకి పెద్ద బలహీనత. ఆహార్యంలో తీసుకున్న జాగ్రత్తలు వాక్యావళిలో తీసుకుంటే ఎంతో బావుండేది. కనీసం బాలు గారిలాంటి వారి చేత డబ్బింగ్ చెప్పించినా బావుండేది. వారైనా ఆ విశ్వవిఖ్యాత నటుని కంఠంలో మొదటినుంచీ వచ్చిన మార్పులు ఎన్నదగిన రీతిలో ప్రదర్శించగలిగే వాళ్ళు.
ఇక రామారావు గారు చిద్విలాసునిలా మొదటినుంచీ ప్రవర్తించడం విస్తుగొలిపేలా ఉంది. ఆయనకి ముందే అన్నీ తెలిసిపోవడం ఏమిటో అసలు అర్ధమేకాదు. ఆయన ఒక్కసారికూడా ఏ విషయంలోనూ కష్టపడ్డట్టు కనీసం దాఖలాగా కూడా చూపించలేదు. భవిష్యత్తు కరతలామలకం అన్న ధోరణి లోనే చివరివరకూ ఈ చిత్రం సాగుతుంది. ఆయన సినిమాల్లోకి వచ్చేముందు లబ్దప్రతిష్టులయిన ఎంతోమంది నటులున్నారు. వారి బలాలు..వాటిని అధిగమించడానికి ఈయన అనుసరించిన మార్గాలు ఇవన్నీ చూయించి ఇంకా పకడ్బందీగా స్క్రీన్ ప్లే లో చెప్పొచ్చు. ఈ సినిమాలో ఒక్కడు కూడా చనువుగా ఈయన్ని "ఒరేయ్" అనిపిలవడు. అందుకేనేమో ఆయనకి నిజమయిన స్నేహితుడు ఒక్కడు కూడా లేకుండాపోయాడు అన్న అభిప్రాయం కలుగుతుంది.
ఏ సినిమా అయినా ప్రధానపాత్రలు రక్తమాంసాలున్నట్టుగా ప్రవర్తించాలి. కావాలని కష్టాలవెంపు ప్రయాణించాలి. ప్రతి కష్టంనుంచి నవ్యంగా అలోచించి రాజాలా బయటపడాలి. అప్పుడే ఆ పాత్రల గొప్పదనం ఇనుమడిస్తుంది. ఇందులో అలా వెదకడం కుదరదు.
వందలమంది ప్రాణస్నేహిత సావిత్రిగారిని డబ్బు పిచ్చపట్టిన నాయకిగా చూయించడం ఎవరూ జీర్ణించుకోలేని పంటికిందరాయి.
ఇక చివరిగా ఒక్కముక్క. విష్ణువు గానీ (రాముని అవతారం మినహాయింపు), బ్రహ్మగానీ ప్రధానపాత్రలుగా చేసే సినిమాలు ఆడవు. శంకరుడే హీరో. కష్టాల్లో ఇరుక్కోవాలి...ప్రయత్నించి ఎదుర్కొని సవ్యంగా బయటపడాలి...అది ఏ సినిమా అయినా .
ఆలశ్యంగా జవాబిస్తున్నందుకు సారీ భవానీ ప్రసాద్ గారు.. ఆల్రెడీ ఇచ్చేశాననుకుని మిస్సయ్యాను. రివ్యూ నచ్చిందన్నందుకు ధన్యావాదాలండీ..
తొలగించండిమీరు చెప్పినది ముమ్మాటికీ సత్యం సాయిమాధవ్ గారే ఈ సినిమాకి అసలైన హీరో...
అలాగే నేను సినిమా గురించి మాట్లాడలేకపోయిన కొన్ని అంశాలను మీ కామెంట్ లో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.. మీ విశ్లేషణతో చాలా వరకూ ఏకీభవిస్తాను..
చివరలో చెప్పిన లైన్ అక్షర సత్యం.. కష్టాల్లో ఇరుక్కుని ఎదురు నిలిచిన హీరో కథలే ఎక్కువ ఆదరణ పొందుతాయి.
సినిమా చూసి ఇంత వివరంగా మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.
నేను ఈ సినిమా చూడలేదు
రిప్లయితొలగించండిమీరన్నట్టూ చూసాకే ఇది చదువుతా..😋
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ లత గారు.. అలాగే మీరు చూసొచ్చాక చదివి మీ అభిప్రాయాన్ని పంచుకోండి..
తొలగించండి