గురువారం, డిసెంబర్ 23, 2010

చిన్ననాటి పాటలు

మధ్య ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళినపుడు, వాళ్ళ పాప ఆటల మధ్యలో తన 'చిన్నారుల తెలుగు పాటల పుస్తకం' తెచ్చి నాకు చూపించింది. దాన్లో కొన్ని పాటలు చూసిన మరుక్షణం మనసు అలా బాల్యంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రానని మొరాయిస్తుంటే బలవంతంగా లాక్కొచ్చి ఇహంలో పడేసాను. వెంటనే ఆ మధురానుభూతిని అనుకున్న తక్షణం పొందడానికి వీలుగా ఆ పాటలను ఎక్కడైన పదిల పరచుకోవాలని ఎక్కడో ఎందుకు బ్లాగ్ ఉందికదా అనుకుని అన్ని ఇక్కడ రాసుకుంటున్నాను. అచ్చుతప్పులకు తోడు ఙ్ఞాపకశక్తియొక్క లోపాల వలన కొన్ని పాటలలో తప్పులు ఉండవచ్చు, కొన్ని అసంపూర్తిగా ఉండవచ్చు. నేను మిస్ అయినవి మీకు తెలిసిన మరికొన్ని మంచి పాటలు వ్యాఖ్యల ద్వారా కలపండి.

కొన్ని పాటలు అక్కడక్కడా వెతికి సేకరించాను కానీ అన్నీ దొరకక పూర్తి వివరాలు సేకరించలేకపోయాను కనుక మీరు గమనించిన సవరణలు తెలియచేస్తే టపాలో సరిచేస్తాను. నా చిన్నప్పటి నేస్తాలలో ఒకరిద్దరు అమ్మాయిలు కూడా ఉండటంతో "చెమ్మ చెక్క..", "ఒప్పులకుప్ప", "చిట్టిచిట్టి మిరియాలు", "కాళ్ళాగజ్జ", "తొక్కుడు బిళ్ళ", లాంటి పాటలు ఆటలు కూడా అందరం కలిసి పాడుకుని ఆడుకునే వాళ్ళం అందుకే అన్నీ ఇక్కడ పొందు పరుస్తున్నాను. సరే మరి బడి గుడి ఒకటేనంటూ గురువును దైవంతో సమానంగా పూజించమంటూ చెప్పే ఈ పాటతో బాల్యంలోకి మన ప్రయాణం మొదలెడదామా.
1
బడిలో గంట గుడిలో గంట
రెండూ ఒకటేనంటా..
గుడిలో దేవుడు బడిలో గురువు
ఇద్దరు ఒకటేనంటా..
చదువుల తల్లి ఒడిలో మనమూ
చక్కగ చదువుకుందామూ..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
2
చిట్టి చిలకమ్మా
అమ్మకొట్టిందా
తోట కెళ్ళావా
పండు తెచ్చావా
గూట్లో పెట్టావా
గుటుక్కున మింగావా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
3
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్తతెచ్చిన కొత్త కోక కట్టనన్నది
మామతెచ్చిన మల్లెపూలు ముడవనన్నది
మగనిచేత మొట్టికాయలు తింటానన్నది

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

4
చందమామ రావె జాబిల్లి రావె
కొండెక్కి రావె కోటిపూలు తేవె
బండెక్కి రావె బంతిపూలు తేవె
తేరుమీద రావె తేనెపట్టు తేవె
పల్లకీలో రావె పాలు పెరుగు తేవె
పరుగెత్తి రావె పనసపండు తేవె
అలయకుండ రావె అఱటిపండు తేవె
అన్నిటిని తెచ్చి మా అబ్బాయికివ్వవె

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
5
బుజ్జిమేక బుజ్జిమేక ఏడికెళ్తివి
రాజుగారి దొడ్డిలోన మేతకెళ్తిని
రాజుగారి దొడ్డిలోన ఏమి చూస్తివి
రాణిగారి పూలమొక్కల సొగసు చూస్తిని
పూలమొక్కల సొగసు చూసి ఊరకొంటివా
పూలమొక్కల సొగసు చూసి మేసివేస్తిని
రాజుగారి భటులు వచ్చి ఏమి చేస్తిరి
రాజుగారి భటులు వచ్చి తన్ని పంపిరి.

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 6
ఛల్ ఛల్ గుర్రం చలాకి గుర్రం
సవారిచేస్తే చక్కని గుర్రం
సాములు చేస్తే సర్కస్ గుర్రం
పౌరుషముంటే పందెపు గుర్రం
ఆగకపోతే అరబ్బీ గుర్రం
చచ్చుది అయితే జట్కా గుర్రం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
7
వానా వాన వల్లప్ప
వాకిలి తిరుగు చెల్లప్ప
చేతులు చాపు చెల్లప్ప
తిరుగు తిరుగు తిమ్మప్ప
తిరుగాలేను నరసప్ప

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 8
చీమ ఎంత చిన్నది 
పనిలో ఎంత మిన్నది
ముందు చూపు ఉన్నది 
పొదుపులోన మిన్నది

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
9
చెమ్మ చెక్క చారడేసి మొగ్గ.. 
అట్లుపోయంగ ఆరగించంగా..
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా
రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా
పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లి చేయంగ

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 10
చింత చెట్టుతొర్ర లోన చిలక ఉన్నది
తాత బోడిబుర్ర మీద పిలక ఉన్నది
చిలక ముక్కు తాత ముక్కు తీరునున్నది
చింత తొర్ర తాత బుర్ర తీరునున్నది
తాతకాళ్ళకున్న జోడు కిర్రుమన్నది
చింతచెట్టు తొర్రలోన చిలుక తుర్రుమన్నది

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
11
కోతీబావకు పెళ్ళంటా 
కొండా కోనా విడిదంటా
కుక్కానక్కల విందంటా 
ఏనుగు వడ్డన చేయునట
ఎలుగు వింతను చూచునటా
కోడీ కోకిల కాకమ్మా 
కోతీ పెళ్ళికి పాటంటా
నెమళ్ళు నాట్యం చేయునటా
ఒంటెలు డోలు వేయునటా
ఊరంతా శుభలేఖలటా
వచ్చే వారికి విందులట
పెళ్ళిపీటలపై కోతీ బావ
పళ్ళికిలించునటా..
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
12
చుక్ చుకు రైలు వస్తుంది
దూరం దూరం జరగండి
ఆగినాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డూ మిఠాయి తినిపిస్తా
కమ్మని పాలు తాగిస్తా
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
13
 బావా బావా పన్నీరు.. 
బావని పట్టుకు తన్నేరు..
వీదీ వీదీ తిప్పేరూ.. 
వీశెడు గంధం పూసేరు..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
14
తారంగం తారంగం 
తాండవ కృష్ణా తారంగం
వేణూ నాథా తారంగం 
వెన్న ముద్దల తారంగం
ఆలా బాలా తారంగం.. 
ఆడుకొ పాపా తారంగం..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
15
ఉడుతా ఉడుతా హూచ్
ఎక్కడికెళ్తావ్ హూచ్
కొమ్మ మీదీ జాంపండు
కోసుకొస్తావా మా బేబీ కిస్తావా..
చేతిలో ఉన్న పల్లీని ఒక చిన్న ముక్క కొరికి ముందు పళ్ళతో చిత్రంగా ఆత్రంగా నములుతూ హైరానా పడిపోతూ హడావిడిగా అన్ని వైపుల తలతిప్పేస్తూ ఓసారి పరికించి మళ్ళీ కాస్త కొరికి హైరానా పడిపోయే ఈ బుజ్జి బుజ్జి ఉడుతలు నాకుచాలా ఇష్టమైన నేస్తాలు :-) చిన్నప్పుడు అంటే నాకు ఊహ తెలియక ముందే ఓ ఏడాది వయసప్పుడు అనమాట నన్నెత్తుకుని అమ్మ ఈ పాట ఎక్కువగా పాడేసిందేమో మరి. నన్ను మా ఇంటి ముందున్న జామ చెట్టు కింద పడుకోపెడితే ఉడుతలు, రామ చిలుకలు దోర మగ్గిన జామపండ్లని రుచి చూసి మరీ నాకోసం నా మంచం మీదికి విసిరి నాతో అప్పటి నుండే దోస్తీ కట్టేసేవట. అవి అంత ప్రేమగా విసురుతుంటే పాపం వెర్రి అమ్మేమో వీటి ప్రేమ పాడుగాను అబ్బాయికి ఎక్కడ దెబ్బతగులుతుందో ఆ పళ్ళు తగిలి అని గాబరా పడేదట.
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
16
ఒప్పుల కుప్ప వయ్యారి భామ
సన్న బ్వియ్యం ఛాయపప్పు
చిన్న మువ్వ సన్న జాజి
కొబ్బరి కోరు బెల్లం ముక్క
గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
17
గుడు గుడు గుంచెం గుండే రాగం
పాముల పట్నం పడగే రాగం
అత్తారింటికి దారేది దారేది దారేది..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
18
ఏనుగమ్మా ఏనుగు..
మా ఊరొచ్చిందేనుగూ..
ఏనుగు మీదా రాముడు..
ఎంతో చక్కని దేముడూ..
ఏనుగు ఏనుగు నల్లనా..
ఏనుగు కొమ్ములు తెల్లనా..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
19
చిట్టిచిట్టి మిరియాలూ.. చెట్టు కింద పోసి..
పుట్ట మన్ను దెచ్చి.. బొమ్మరిల్లు గట్టి..
బొమ్మరింట్లో పిల్ల పుడితే..
బొమ్మ తలకూ నూనె లేదు..
బొమ్మ బిడ్డకీ నెయ్యి లేదు..
అల్ల వారింటికీ చల్లకు వెళితే..
అల్ల వారి కుక్క భౌ భౌ మన్నది
నా కాళ్ళ గజ్జెలు ఘల్ ఘల్ మన్నవి
చంకలోని పిల్ల క్యార్ క్యార్ మన్నది

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 20
కాళ్ళా గజ్జ కంకాళమ్మా
వేగు చుక్క వెలగ మొగ్గ
మొగ్గ కాదు మోటానీరు
నీరు గాదు నిమ్మల బావి
బావి కాదు బచ్చలి కూర
కూరా కాదు గుమ్మడి పండు
పండు కాదు పాప కాలు
కాలు తీసి కడగా పెట్టు. 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

కాళ్ళాగజ్జ కంకాళమ్మ అంటే గుర్తొచ్చింది, దాగుడు మూతలు ఆడేముందు దొంగని డిసైడ్ చేయడానికి చేతి పంటలు వేసుకునే బదులు, అందరం కింద రౌండుగా కాళ్ళు చాపుకుని కూర్చుని ఇదే పాటని బాగా కుదించి
కాళ్ళా గజ్జ కంకాళమ్మా
వేగు చుక్క వెలగ పండు
కాలు తీసి కడగా పెట్టు.
అని అంటూ చేత్తో కాళ్ళు చూపుతు "కడగాపెట్టు" అన్న పదం ఎవరి కాలి మీదకి వస్తే వాళ్ళు పంటైనట్లు చివరిగా మిగిలిపోయిన వాళ్ళని దొంగగా నిర్ణయించేసే వాళ్ళం. ఈ దాగుడు మూతలు ఆటకి ఉపయోగించే మాటలు కూడా పాటలాగానే ఉంటాయ్ కదా.. కాకపోతే మన అమ్మో లేదా మన టీంలో పెద్దవాళ్ళో పాడేస్తారు :)
వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమీ
xyz, ఆ xyz వెళ్ళి దాక్కో

దాగుడు మూతల దండాకోర్
పిల్లి వచ్చే ఎలుక చోర్
ఎక్కడి దొంగలక్కడే..
గప్ చుప్.. సాంబార్ బుడ్డీ
 ~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇంకా చేతవెన్నముద్ద, ఆదివారంనాడు అఱటి, కాకీ..కాకీ పాటలకోసం అనుగారి ఊహలు ఊసులు బ్లాగ్ ఇక్కడ చూడండి.

29 కామెంట్‌లు:

 1. చాలా బావుందండీ
  ఒక్కసారి అలా బాల్యం లోకి తీసుకెళ్ళి వదిలారు.

  రిప్లయితొలగించండి
 2. వేణూ కొంతసేపు బాల్యంలో అలా అలా ఓలలాడి ఇప్పుడే బయటకు వచ్చి కామెంటు రాస్తున్నా.
  చెమ్మచెక్క కి పంటలేసుకునేటప్పుడు మేమూ కాళ్ళగజ్జ ఆడేవాళ్లం అప్పుడప్పుడూ...అవే మూడు వాక్యాలతో :)

  చిట్టీచిలకమ్మా చెప్పమటే చిటీచిలకమ్మాఆ అని సాగదీసుకుని చెప్పేదాన్నట చిన్నప్పుడు :)

  కానీ నాకు ఇష్టమైన పాట బుర్రుపిట్ట బుర్రుపిట్ట తురుమన్నది....దీన్ని ఒక చిన్న రాగంతో పాడేవాళ్ళం...నాకు బలే నచ్చేది.

  చక్కగా అన్నిటినీ ఒకేచోట పొందుపరిచారు....చాలా చాలా బావుంది.

  చిన్నప్పుడు ఆటల్లో అరటిపండు, పులుసులో ముక్కలు ఉండేవారు కదా...హహహహ అన్నీ మళ్ళీ గుర్తుకి వచ్చాయి....చాలా చాలా thanks!

  రిప్లయితొలగించండి
 3. నాకెప్పటికీ గుర్తుండిపోయే బాల్యపు పాట:
  ఒకటీ ఒకటీ ఒకటీ మనుషులమంతా ఒకటీ
  రెండూ రెండూ రెండూ మంచీ చెడులూ రెండూ
  మూడు మూడు మూడు ఝండా రంగులు మూడు
  నాలుగు నాలుగు నాలుగు వేదాలు మనకూ నాలుగు
  ఐదు ఐదు ఐదు చేతికి వేళ్ళు ఐదు
  ఆరు ఆరు ఆరు ఋతువులు మనకు ఆరు
  ఏడు ఏడు ఏడు వారనికి రోజులు ఏడు
  ఎనిమిది ఎనిమిది ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది
  తొమ్మిది తొమ్మిది తొమ్మిది గ్రహాలు మనకు తొమ్మిది
  పది పది పది పాపలు పాడే పాట ఇది...

  మా అబ్బాయి చేత రోజుకి ఒకసారైనా ఇది వల్లెవేయిస్తుంటా

  రిప్లయితొలగించండి
 4. :) బాగుందండి టపా. కొన్ని పాటలు చదువుతున్నపుడు ఆ పాటకి సంబంధించిన జ్ఞాపకంతో పాటు చిన్న చిరునవ్వు కూడా కలిసి అందమైన అనుభూతి.

  రిప్లయితొలగించండి
 5. బాగుందండీ ఒక్కసారి అల బాల్యం లోకి తీసుకెళ్ళారు. ఇప్పుడెక్కడ వినిపిస్తున్నాయి అన్నీ " రింగా రింగా రొసేస్" లే కదా. నేనూ ఆ మద్య ఇవన్నీ జాలం లోనే అనిమతేడ్ వీడియో లో చూశాను. బాగున్నాయి నా బ్లాగ్ లో పెడదామనుకున్నా కాని సమయం దొరక్క అలానే ఉంది పోయింది. మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు. థాంక్స్

  రిప్లయితొలగించండి
 6. వేణు గారూ.. నాకు మీ టపా ఎంతగా నచ్చిందో చెప్పలేను. మీతో పాటు నన్ను కూడా తీస్కెళ్లిపోయారు బాల్యం లోకి..
  చిన్నప్పుడు ఎంచక్కా వానా వానా వల్లప్పా వాకిట తిరుగూ చెల్లప్పా అని వానలో తడుస్తూ పాడుకునే వాళ్లం. ఇప్పుడేమో
  Rain Rain go away..
  అని పాడుతున్నారు పిల్లలు.. ఏంటో..:(

  రిప్లయితొలగించండి
 7. రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా
  తరువాత
  పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
  పందిట్లో మా బావ పెండ్లి చేయంగ

  రిప్లయితొలగించండి
 8. www.tooniarks.com చూడండి ఒకమారు. పిల్లల కధలు, జాతక tales, పేదరాశి పెద్దమ్మ కధలు, మన చిన్నప్పుడు( అంటే మీ అనే కాదు మా అని కూడా)పాడుకున్న పాటలు అన్నీ వారు CD లు గా తీసుకొచ్చారు. పైన మీరు పాడి వినిపించిన చిట్టిచిట్టి గీతాలు కూడా చాలానే ఉన్నాయి. మా మనవరాళ్ళు నేర్చుకొన్నారు. ఇంకా చాలా మంది కూడా CD లు గా తీసుకొచ్చారు. నాకు గుర్తు లేవు.

  ఒకటి నిజం CD ల ద్వారా కన్నా పెద్దలు పాడి వినిపిస్తే ఇంకా త్వరగా నేర్చుకుంటారు. పిల్లలు పాడుతుంటే సగం టెంషన్స్ తగ్గిపోతాయి. ఈ నాటి తల్లులు కూడా నేర్చుకొని పిల్లలకి నేర్పితే చాలా బాగుంటుంది. మా అమ్మాయి తనకి రానివి నేర్చుకొని తన పిల్లలకి నేర్పింది.
  మళ్ళీ ఒకమారు బాల్యం లోకి తీసుకెళ్లి పోయారు. థాంక్యూ.

  రిప్లయితొలగించండి
 9. inkonni paatalu kosam ee link choodandi.
  http://oohalu-oosulu.blogspot.com/2010/12/blog-post_948.html

  రిప్లయితొలగించండి
 10. చాలా బాగున్నాయి వేణు గారు. ఈ పాటలతో కూడుకున్న నా నూతన సంవత్సర అనుభవాలను జనవరి ఫస్ట్ న రాయబోతున్నాను. మీరు తప్పకుండా చదవాలి:) ఇంకొక విషయం. ఈ పాటలన్ని కూడా మనకి ఆయుర్వేద వైద్య విధానాన్ని తెలియ చేస్తాయి. ఉదాహరణకి ...కాళ్ళా గజ్జి-కంకాళమ్మ...పాటలో తీవ్రమైన చర్మవ్యాధులకు మందులు ఈ పాటలోనే వివరించారు. సరిగ్గా మొత్తం పాట చదవండి. మీకే అర్ధమవుతుంది. అన్ని మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఈ పాటల్లో చెప్తారు.

  రిప్లయితొలగించండి
 11. వేణు నేనుకూడా చిన్ననాటి ఆటలగురించి రాసాను. నిజంగా అవి మధురమైన అనుభూతులు. ఈనాటి పిల్లలకు లేవే అని బాధ కలుగుతుంది..
  http://jyothivalaboju.blogspot.com/2009/10/blog-post_10.html  http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html

  రిప్లయితొలగించండి
 12. ee paatalanni chakkani animations to cd lu gaa vachayi.ye book store lo nynaa doruktaayi...u can try. Iam proud 2 say maa paapa ku 3yrs . oka 20-25 telugu geyalu(ive..miru cheppinave) cheptundi...tanaku 2yrs appati nunde. Parents ku konchem sradha undali gaani mana taram kante baagaa vallaki cherataayi ivanni.any way thanq 4 reminding this to all.

  రిప్లయితొలగించండి
 13. వేణు గారు సూపరండీ...ఎక్కడనించి పట్టుకొచ్చారు? నా చిన్నప్పటి ఆటలన్ని మళ్ళీ గుర్తుకొచ్చాయి....ఇది కాకుండా దొంగని డిసైడ్ చెయడానికి..'ఆకు..కరివెపాకు..' అని అదేదొ ఒకటి పాడేవాళ్ళం గుర్తుందా? అది ఎంత ట్రై చేసినా గుర్తుకురాట్లేదు :( మీకు ఉడతలంతే ఇష్టమా? మా చందుకి కూడ...అదేటో ఎక్క్డ ఉదత కనపడినా దానికి ఫొటోలు తీస్తారు...జూలో కూడ..చెట్ల మీద పరిగెట్టే ఉడతలనే ఎక్కువ ఇంటరెస్ట్ గా చూస్తారు..హ్మ్! మా చందు లాంటి ఉడత ప్రేమికులు ఉన్నారన్నమాట :) మీ చిట్టిపొట్టి చిన్నరి పాటలు నాకు చాలా నచ్చయండీ...అన్ని కాపి+సేవ్ చేసేసుకున్నా! మళ్ళి మిస్ అయిపోతానేమో అని :)

  రిప్లయితొలగించండి
 14. మా చిన్నప్పుడు " చేతిలో వెన్నముద్ద చెంగల్వ పూదండ", " గోడమీద బొమ్మ" " కిటకిట తలుపులు కిటారు తలుపులు" " ఆదివారమునాడు అరటి మొలచినది" " చైనా ఒకదేశం- క్వైనా ఒక మందు, పీటర్ ఒకరాజు- మీటర్ ఒక కొలత" పాడేవాళ్ళమండీ. మీ పోస్టు బాల్యంలోకి తీసుకువెళ్ళిందండి. శ్రీ బులుసు సుబ్రమణ్యం గారన్నట్లుగా " తునీఆర్క్స్" ఆదిత్య" వారు, పుస్తకరూపంలో, సి.డి. ల రూపంలో తెచ్చారు. మేము మా మనవరాలికి తీసుకున్నాము.
  ఇందూ,
  మీరు చెప్పిన కరివేపాకు పాట ఇదేనేమొ!

  " ఆకుపాకు కరివేపాకు"
  ఢామ్ ఢీమ్ ఢిస్కు
  కోకిలకు ఢమా ఢిమా ఢిస్కు.

  రిప్లయితొలగించండి
 15. @భమిడిపాటి సూర్యలక్ష్మి:అది కాదనుకుంటా అండీ...'ఆకు పాకు కరివేపాకు..పిల్లా..పీచు..' ఇలా కొంచెం వెరైటీగ ఉంటుంది...:) కొంచమైనా ఆ పాట గుర్తుచేసారు.ధన్యవాదాలు :)

  రిప్లయితొలగించండి
 16. లత గారు నెనర్లు.

  సౌమ్య నెనర్లు హ హ చిన్నపిల్లలు రాగాలు తీస్తూ పాడుతుంటే భలే ఉంటుందండీ. మిమ్మల్ని అలా బాల్యం లోకి తీసుకు వెళ్ళగలిగినందుకు సంతోషంగా ఉంది.

  నైమిష్ గారు నెనర్లు, పాట చాలా బాగుందండి ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  శిశిర గారు నెనర్లు. బాల్యం అంటేనే అంతే కదండి.

  భాను గారు నెనర్లు, అవునా మీరు కూడా ఒక టపా రాసేయండి మరి.

  అపర్ణ గారు నెనర్లు, మార్పు సహజం కదండి పెద్దలు కాస్త శ్రద్దవహిస్తే నేటి పిల్లలకు కూడా ఈ పాటలు వచ్చేస్తాయి.

  అనుగారు నెనర్లు, సవరణకు మీ బ్లాగ్ లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు టపాలో సరిచేశాను.

  రిప్లయితొలగించండి
 17. సుబ్రహ్మణ్యం గారు నెనర్లు, మీరు చెప్పిన వెబ్సైట్ చూడలేదు గానీ కొన్ని యుట్యూబ్ లోనూ మరో చోట చూశానండి కానీ ఎక్కడా ట్యూన్ సరిగా ఉన్నట్లు అనిపించలేదు. చిన్నప్పుడు మామ్మలు తాతయ్యల దగ్గర నేర్చుకుని నేస్తాలతో కలిసి రాగయుక్తంగా గారాలు పోతూ పాడిన స్మృతులకు అవి సాటిరావు. మీరన్నట్లు పెద్దల ద్వారా నేర్చుకుంటేనే బాగుంటుంది.

  జయ గారు నెనర్లు, తప్పకుండానండి మీ టపా కోసం ఎదురు చూస్తుంటాను. నిజమేనండీ కాళ్లగజ్జి పాటను మరీసారి చదివితే మీరు చెప్పినట్లు మెడిసినల్ ప్లాంట్స్ గమనించగలిగాను.

  జ్యోతిగారు నెనర్లు, మీ టపా లంకె ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈనాటి పిల్లలకి అసలు ఆడుకోవడానికే టైం ఉండట్లేదండీ ఇక ఈ పాటల గురించి ఏం చెప్తాం.

  సుభాషిణి గారు నెనర్లు, ఆ సిడి లు నేను కొన్ని చూశాను యానిమేషన్ బాగుంటుంది కానీ ట్యూన్ ఎందుకో కృతకంగా అనిపించిందండి. మీ పాప గురించిన వివరాలు తెలుసుకోవడం సంతోషం గా ఉంది. నిజమే తల్లిదండ్రులు కాస్త శ్రద్దవహిస్తే ఈతరం పిల్లలకు కూడా ఇలాంటి మధురానుభూతులు అందివ్వవచ్చు.

  రిప్లయితొలగించండి
 18. ఇందు గారు నెనర్లు, నెట్ లో వెతికి, పిల్లల పుస్తకంలో నుండి సేకరించి, ఇంకా గుర్తున్నవి కొన్ని ఇలా అన్నీ కలిపి ఒక చోట చేర్చాను. మీరడిగిన ఆక్ పాక్ కరివేపాక్ పాట గుర్తులేదు కానీ బద్రిలో సీన్ గుర్తొచ్చి నవ్వుకున్నానండీ అందులో వాడతాడు ఆపాట లో కొంత. ఎక్కడైనా దొరికితే చెప్తాను.
  హ హ అవునా చందుగారికి హాయ్ చెప్పండి :-) నాకు హడావిడిగా అల్లరి చేసే ఉడుతలంటే చాలా చాలా ఇష్టమండీ... ఒక ఐదేళ్లక్రితమైతే నాకో ఉడుత ఫ్రెండ్ కూడా ఉండేది... రోజూ క్రమంతప్పకుండా, వీకెండ్ అయితే బోలెడంత సేపు నా రూమ్ ముందున్న ఖాళీస్థలంలోనూ ఇంకా పిట్టగోడ ఎక్కి ఎన్ని ఆటలు ఆడుకునేదో, తలుచుకున్నప్పుడల్లా వచ్చేసేది దాన్ని అలాచూస్తూ గడిపేవాడ్ని దానికోసం రోజూ పల్లీలు పెట్టేవాడిని. ఇంటిపక్కన ఉన్న ఒకేఒక చెట్టుకొట్టేశాక అదికనపడక రెండురోజులు తిండికూడా సహించలేదు.

  సూర్యలక్ష్మి గారు నెనర్లు, మంచి పాటలు గుర్తుచేశారండీ.. టూనీఆర్క్స్ వారి వెబ్ త్వరలో చూస్తాను.

  రిప్లయితొలగించండి
 19. good post.
  టూనీ ఆర్క్స్(www.tooniarks.com) వాళ్లు మొట్టమొదట "చిన్నారి చిట్టి గీతాలు" అని ఒక సీడీ వేసారండీ. మా పాప కోసం కొన్నాను. దాంట్లో సగానికి పైగా మీరు రాసిన పద్యాలు పాటలు ఉన్నాయి. తరువాత రెండు,మూడు భాగాలు కూడా వచ్చాయి. దాంతో నేను "టూనీ ఆర్క్స్" ఫ్యాన్ అయిపోయి వాళ్ళు చేసిన ప్రతి సీడీ కొనేయటం మొదలెట్టా. అమెరికా తీసుకెళ్టే వీళ్ల సీడీలు హాట్ కేక్స్లా అమ్ముడుపోయాయిట. కానీ లేటెస్ట్ సీడీల్లో కథలు మాత్రం మరీ పేలవంగా ఉండి నిరుత్సాహపరిచాయి. నిజానికి వీళ్ళ క్వాలిటీ మరే పిల్లల సీడీలు చేసేవాళ్ళకీ లేదు. అది నిలబెట్టుకోవటమ్ లేదు ఎందుకనో. బహుశా ఏది చేసినా జనాలు కొనేస్తారన్న ఒవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఉండాలి.

  రిప్లయితొలగించండి
 20. ఇంకొక చిన్నపిల్లల పాట మీరు మిస్ అయ్యారు.
  గుడుగుడుగుంచం
  గుండారాగం
  పాముల పట్నం
  పటికీబెల్లం...అని ఇలా ఉంటుంది, తరువాత గుర్తు లేదు.

  అలాగే ఇందు చెప్తున్న ఆకుపాకు కరివేపాకు...అన్నా పాట కూడా పాడుకునేవాళ్ళం...ఇప్పుడు గుర్తు రావట్లేదు.

  సూర్యలక్ష్మిగారు చెప్పినట్టు గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ...కితకిటతలుపు కిటారు తలుపులు....ఓహ్ ఎంత అందమైనది బాల్యం!

  రిప్లయితొలగించండి
 21. వేణు గారు .. చిన్న పిల్లల పాటల పోస్ట్ భలే.. భలే .. చాలా బాగుంది ..... చాలా మంచిపోస్ట్ నాకయితే పిచ్చి పిచ్చి గా నచ్చింది ... ఒక్కసారి ఆ పాటలన్ని మా చేత చదివించి చిన్నపటీ విషయాలు గుర్తు చేసారు

  ఇంకొక పాటుంది ..మీకు తెలుసో లేదో ఆ పాట ...అది కూడ చాలా బాగుంటుంది ... అది నేను ఇక్కడ మెన్సన్ చెయ్యను .... నా బ్లాగ్ లో రాస్తా

  రిప్లయితొలగించండి
 22. బడాయి పిల్లీ,
  లడాయి కెళ్ళీ,
  ఎకలుకను చంపీ,
  ఏనుగె అందీ,

  పులినే తానని
  మురిసిన పిల్లీ,
  కుక్కను చూసీ,
  ఒహఠే పరుగూ!

  దీన్ని మిస్సైనట్టున్నారు? దీనికి ట్యూను కట్టి చిన్నప్పుడు స్కూల్లో పాడే వాడిని. ఆ ట్యూను దగ్గర దగ్గరగా సింహాద్రిలోని చిరాకు అనుకో, పరాకు అనుకో కి దగ్గరగా ఉండేది. కీరవాణి నన్ను కాపీ కొట్టాడంటే ఫూల్ని చూసినట్టు చూస్తారు జనం. మరి అప్పుడది విన్న మా లక్ష్మీ టీచరే అంది. నీ పాటను కాపీ కొట్టారురా అబ్బీ, అని.

  శ, ష, సః ఒహఠే అన్నది ఒకటే అన్నదానికి నా యాస.

  లక్ష్మీ టీచరు అంది అన్నాను. అగౌరవ పర్చటం కాదు. ఆ చనువు, ఆప్యాయతా మా మధ్య ఉన్నాయి. వేరేలా పిలిస్తే ఆవిడ ఒప్పుకోదు.

  రిప్లయితొలగించండి
 23. నేనెప్పుడు నా బాల్యంలోనే ఉంటాను బ్రదర్, అంటే ఆ ఙ్ఞాపకాలలోనే ఉంటానని కాదు. అప్పటి ఫ్రెష్నెస్ ని ఎప్పుడు మిస్ కాను అని. ఆ చైల్డ్ లైక్ క్యూరియాసిటీ నాలో పోనివ్వను. అప్పుడు ప్రతి క్షణమూ క్రొత్తగానే కనిపిస్తుంది :-)

  రిప్లయితొలగించండి
 24. తృష్ణ గారు నెనర్లు, టూనీ ఆర్క్స్ వాళ్ళ వర్క్స్ బాగున్నాయండీ నేను కూడా ఇప్పుడే చూశాను.

  సౌమ్య హ హ దానితర్వాత అత్తారింటికి దారేది అనుకుంటా యా కొన్ని మర్చిపోయాను కొన్ని వదిలేశాను.

  శివరంజని గారు నెనర్లు తప్పకుండానండి మరి త్వరగా మీ బ్లాగ్ లో రాసేయండి నేను ఎదురుచూస్తుంటాను. అబ్బ నా పోస్ట్ మీచేతో కొత్త టపా రాయిస్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో :-)

  గీతాచార్య అదృష్టవంతులు బాబు ఆ ఫ్రెష్నెస్ పోకుండా చూసుకోగలుగుతున్నందుకు. నాలో పోయింది ఇహ రాదు :-)
  హ హ మీ బడాయి పిల్లి బాగుంది.. నేనెపుడూ వినలేదండి అది. టీచర్లను అలానే అంటాంలే అది అగౌరవమేం కాదు. అన్నట్లు మీ ట్యూన్ కాపీ కొట్టింది కీరవాణి కాదు కాటన్ ఐ జో అని 80’s అమెరికన్ కంట్రీ మ్యూజిక్ లో ఎపుడో మీ ట్యూన్ ని కాపీ కొట్టేశారు. పాపం కీరవాణికి అదితెలియక వాళ్ళదగ్గరనుండి తెచ్చుకున్నాడు. ఇక్కడ వినండి http://www.youtube.com/watch?v=XDdlHmzIdn8 నాకాలేజ్ రోజుల్లో ఇది నా ఫేవరెట్ First 21 seconds దగ్గర వచ్చే మ్యూజిక్ బిట్ నాకు చాలా ఇష్టం.

  రిప్లయితొలగించండి
 25. చాలా బాగున్నాయండీ, పాటలూ, జ్ఞాపకాలూను..

  రిప్లయితొలగించండి
 26. ఇవన్నీ చదువుతుంటే నేను కూడా ఒకసారి అలా పాత రోజుల్లోకి వెళ్లాను. ఇందులో నేను నేర్చుకున్నవి, మీరు మేర్చుకున్నవి వేరు వేరుగా ఉన్నాయి :( ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికెళతావోచ్? బండీ లేదు బస్సూ లేదు ప్రయాణమెట్లాగా? కొమ్మలు తెచ్చి, రెమ్మలు తెచ్చి చక్రాల్ కడతాను... ఇలా ఉండేదండీ!

  రిప్లయితొలగించండి
 27. ధన్యవాదాలు రసజ్ఞ గారు. ఆ పాటకు డిఫరెంట్ వర్షన్ తెలుసుకోవడం బాగుందండీ... ప్రాంతాలను బట్టి పాటలు ఒకోసారి కొద్దిగా మారడం గమనించాను నేను.

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.