శుక్రవారం, ఏప్రిల్ 17, 2015

సన్నాఫ్ సత్యమూర్తి...

సన్నాఫ్ సత్యమూర్తి - ’విలువలే ఆస్తి’ - ఆ టైటిల్ కీ ఈ ట్యాగ్ లైన్ కీ వందశాతం జస్టిఫికేషన్ ఇచ్చే సినిమా ఇది. ఒక సినిమాలో హీరోయిన్ తనపై అటాక్ చేసిన రౌడీలని చితకబాదిన హీరోతో “నాకు వాళ్ళకంటే నిన్ను చూస్తేనే ఎక్కువ భయమేస్తుంది” అని అంటుంది. అలా ఈ కాలం సినిమాల్లో హీరోలు విలన్ల కన్నా భయానకంగా తయారవుతున్నారు. విలువల సంగతి దేవుడెరుగు కనీసం సగటు మనిషిలా ప్రవర్తించకపోవడమే హీరోయిజం అనిపించుకుంటున్న ఈ రోజుల్లో...

ఒక మంచి అబ్బాయి, మనుషులకు, బంధాలకు విలువనిస్తూ, వదినని తల్లిలా గౌరవిస్తూ, వాళ్ల నాన్న నేర్పిన విలువలను నిలువెల్ల వంట బట్టించుకుని వాటితోనే జీవించడానికి ఇష్టపడే హీరో. అలా అని అతను అల్లరి చేయడా అంటే చేస్తాడు కాని హీరోయిన్లని ’ఏవే’ ’ఒసే’ అంటూ, డబుల్ మీనింగ్ డైలాగుల్తో మాట్లాడుతూ చూసే వాళ్లకి ఒళ్లు కంపరమెత్తేలా కాదు... ఆ చేసే అల్లరిలో కూడా హుందాతనం ఉంటుంది, చూడ ముచ్చటగా ఉంటుంది... అలా అల్లరి చేస్తాడు. నిజానికి ఇలాంటి హీరోలు కొత్తేం కాదు ఒకప్పటి సినిమాల్లో ఇలాగే మంచిగా ఉండేవాళ్ళు. ఇది మళ్ళీ అలాంటి ఓ హీరో విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) కథ.

ఇక హీరోయిన్స్ అంటే దేవలోకం నుండి భూలోకానికి దిగొచ్చిన దేవకాంతలు కాదు సగటు మనుషులే వాళ్లకీ బలహీనతలుంటాయ్, కొందరు సొంత నిర్ణయాలు తీస్కునే తెలివితేటల్లేక తండ్రి ఎవర్ని చూపిస్తే వాళ్లమీదకి ప్రేమను బదిలీ చేసుకోగల సగటు అమ్మాయిల్లాగే ఉంటారు, కొందరికి టైప్ వన్ డయాబెటిస్ లాంటి పుట్టుకతో వచ్చే అనారోగ్యాలూ ఉంటాయ్, మరికొందరికి ఒకడ్ని కట్టుకుని కాఫీలో విషమిచ్చి చంపేసి అన్న దగ్గర సింపతీ కొట్టేసి నచ్చిన వాడ్ని పెళ్లి చేస్కోవచ్చు అనే తింగరి ఆలోచనలొచ్చే లాజిక్కు లేని బుర్రలుంటాయ్... అలాంటి ఓ ముగ్గురమ్మాయిలు పల్లవి(అదాశర్మ), సమీర(సమంత), వల్లి(నిత్యామీనన్) మన హీరో గారి జీవితాన్ని ఎలా ప్రభావితంచేశారో చెప్పే కథ ఇది.

మన హీరో విరాజ్ ఆనంద్ తండ్రి సత్యమూర్తి (ప్రకాష్ రాజ్) మనుషులు, బంధాలు, విలువలు ముఖ్యమని.. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదని నమ్మే వ్యక్తి. అతనికి పూర్తి వ్యతిరేకమైన భావజాలంతో జీవితంలో డబ్బే ముఖ్యమనీ బంధాలు, విలువలు అన్నీ తరువాతేనని నమ్మే వ్యక్తి పేరులోనే పైసా ఉన్న పైడా సాంబశివరావు (రాజేంద్రప్రసాద్). తమిళనాడులోని కొన్ని ఊళ్ళని అనఫిషయల్ గా పరిపాలించే నియంత, మంచినీళ్ళు తాగినంత సులువుగా మర్డర్ చేసేయగల కర్కోటకుడైనా కట్టుకున్న భార్య ముందు ఆవిడ ప్రేమ ముందు తలవంచి ఆవిడ కోసం కొన్ని నియమాలను పాటిస్తూ ఊరి గొడవలను తనలోని రాక్షసుడిని ఆవిడకు తెలియకుండా దాచి ఉంచే వ్యక్తి దేవరాజ్(ఉపేంద్ర). వీరు ముగ్గురికి ఒకరితో ఒకరికి గల బంధమేమిటో వాళ్ళు హీరో లైఫ్ లో పోషించిన పాత్రేమిటో చెప్పే కథ ఇది.

ప్రాక్టికాలిటీ మెటీరియలిజం పేరేదైనా తరతరానికి మనిషి ఆలోచనలలో ఎలాంటి మార్పు వస్తుంది, ఎటువంటి వాటికి విలువ ఇస్తున్నాడు వేటికి ఇవ్వట్లేదు, ఎలాంటి ప్రయారిటీస్ ఎంచుకుంటున్నాడు అనే వాటిని వివిధ పాత్రల ప్రవర్తన ద్వారా స్పష్టంగా మన కళ్ళముందు ఉంచుతుందీ చిత్రం. చక్కని సంభాషణలతో సన్నివేశాలతో మన దైనందిన పరుగు ఆపి ఒక్క క్షణం ఆలోచించేలా చేస్తుందీ చిత్రం. దీనికి తోడు హుషారైన పాటలు, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్, సన్నివేశాలకు తగినట్టి నేపధ్య సంగీతం, చక్కని సినిమాటోగ్రఫీ వెరసి ఒక మంచి అనుభూతిని మన సొంతం చేస్తాయి. అల్లు అర్జున్, ఉపేంద్ర ల నటన చూడడం కోసమే ఈ సినిమా చూడవచ్చు.  

త్రివిక్రమ్ రచయితగా దర్శకుడుగా పని చేసిన గత చిత్రాల తాలుకు జ్ఞాపకాలను కాసేపు పక్కన పెట్టేసి అనుభవజ్ఞుడైన దర్శకుడు ప్రతిభ ఉన్న నటులతో కలసి చెప్పే ఓ మంచి కథ విందాం తను ఏం చెప్పాలని ప్రయత్నించాడో ఓ క్షణమైనా ఆగి ఆలోచిద్దాం అనే ఆలోచనతో ఈ సినిమా చూడండి. త్రివిక్రమ్ మిమ్మల్ని నిరాశ పరచకపోగా మీకు తన మీద గౌరవం మరికొంత పెరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పగలను.

ఇందులో ఓ పాటుంటుంది “శీతాకాలం సూర్యుడి లాగా కొంచెం కొంచెం చూస్తావే... వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే” అని... అచ్చం ఈ పాటలో చెప్పినట్లే సినిమాలో త్రివిక్రమ్ పంచ్ డైలాగులు, హాస్యం కూడా కొంచెం కొంచెమే అంటే కథకు ఎంత అవసరమో అంతే ఉంటాయి ఉన్న కాసేపూ హాయినిస్తాయి. సినిమా పూర్తయాక ఒక మంచి సినిమాని చూశామనే ఫీలింగ్ నిస్తాయి. 

పిజ్జాలు బర్గర్ లు బిర్యానీలూ ఎన్ని తిన్నా... పెరట్లో నాన్న మన పక్కన కూర్చుని కబుర్లు చెప్తుంటే అమ్మ వేడి వేడి అన్నంలో అంత ఆవకాయ ఇంత వెన్నపూస కొంత ముద్దపప్పు కలిపి తినిపిస్తుంటే ఆ రుచీ కమ్మదనం వేరే వేటికీ రాదు కదా. అందుకే కమర్షియల్ హంగులు లేవనీ ఎంటర్ టైన్మెంట్ లేదనీ హీరో పాసివ్ అని విలన్ తో ఎదురు పడి ముష్టి యుద్దం చేయలేదని అంటూ వేయి వంకలు వెదికి రాసిన రివ్యూలు చదివి సినిమాకి వెళ్లకుండా ఆగిన వాళ్ళెవరైన ఉంటే ధైర్యంగా వెళ్ళి చూడండి. చేసిన మంచి వృధాపోదు, ఒకరికి మంచి చేస్తే మనకీ మంచే జరుగుతుంది అనే నమ్మకాన్ని బలపరిచే కథను తెలుసుకోండి. ఒక మంచి అనుభూతిని మిస్ కాకండి.  

చిత్రంలో నాకు నచ్చిన కొన్ని సంభాషణలను ఇక్కడ కోట్ చేస్తున్నాను. దయచేసి ఇంకా సినిమా చూడని వారు ఇవి చదవకండి.


“ఎప్పుడూ నీళ్ళలో ఉండే చేపకి జలుబు అంటుకోనట్లు ఇంత సంపాదించినా ఆయనకి డబ్బుపట్టలేదు”

“మోసపోవడం ఫూల్ అవడం ఇవన్నీ ఒక మనిషి ప్రాణం కన్నా ఎక్కువా?”

“తెలివి తేటలు వాడాల్సింది అవతలి వాళ్లని మోసం చేయడానికో లేదా వాళ్ళు ఎప్పుడు మోసం చేస్తారా అని కనిపెట్టడానికో కాదు... పని చేయడానికి అంతే”

“రావణాసురుడు సీతని పట్టుకున్నాడు రాముడి చేతులో చచ్చాడు, వదిలేసుంటే కనీసం బ్రతికుండేవాడు. కౌరవులు జూదంలో గెలిచారు, కురుక్షేత్రంలో పోయారు, ఓడిపొయి ఉంటే బ్రదర్స్ అంతా కలిసి పార్టీ చేస్కునే వారేమో. అందుకే కొన్ని సార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే కరెక్ట్, గెలవడం కన్నా ఓడిపోవడమే కరెక్ట్.

“హరికథలు ఎంత బాగా చెప్పినా పళ్ళెంలో పదిపైసలే వేస్తారు”

“కోటి రూపాయల లాటరీ తగిలినా కాని ముప్పైలక్షలు టాక్స్ లో పోతుంది అందుకేనేమో అదృష్టం డిస్కౌంట్ తో వస్తుంది అంటారు, దురదృష్టం మాత్రం బోనస్ తో వస్తుంది”

“భార్యని గెలవాలంటే కప్పులు కాదుసార్ మీ మధ్యనున్న ఆ గోడని బద్దలు కొట్టండి”

“ఫ్రెండుని రా.. ప్రాణం ఇవ్వలేకపోవచ్చు.. పార్టనర్ షిప్ ఇస్తాను”

“మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు”

“కొందరుంటారు కోటి రూపాయలు కొట్టే లాటరీ టిక్కెట్ ఇస్తే కలర్ బాలేదని పారేస్తారు”

“కిడ్నాప్ చేసి పెంచుకోవడం అంటున్నాడు రేపు చంపేసి నేల్లో దాచి పెట్టుకోడం అంటే”

“యాక్సిడెంటంటే బైకో కారో రోడ్ మీద పడ్డం కాదు ఒక కుటుంబం మొత్తం రోడ్డుమీద పడిపోడం”

“మనం కావాలనుకునే అమ్మాయ్ వస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ మనల్ని వద్దన్న అమ్మాయి తిరిగి వస్తే మాత్రం ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది”

“తెలిసి చేస్తే మోసం... చేశాక తెలిస్తే తప్పు”

“కత్తి ఎత్తితే కోతే కోయగలవు కత్తి దించి చూడు కొత్త రాత రాయగలవు”

“అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు దరిద్రం వచ్చి లిప్ కిస్ పెట్టేస్తుంది”

“బాగా బతికి పేరుతెచ్చుకునే ఓపిక లేదు... బాగా చంపి ఫేమస్ అయ్యేదా”

“ఎక్కడో జరిగిన యాక్సిడెంట్లని ఎవరో చేసిన తప్పుల్నీ జాతకాలంటూ ఆడాళ్ళ మీద రుద్దటం తప్పు”

“దూసుకెళ్ళే బాణం రేసుకెళ్ళే గుర్రం వెనక్కి తిరగదు”

“కుందేలు పులిబోన్లోకి సైట్ సీయింగ్ కి వచ్చినట్లు నేను ఈయన దగ్గరకొచ్చానేంటి”

“మా నాన్న దృష్టిలో భార్యంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మోయాలనుకునే బరువు, నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం”

“నేను ఒక్కడ్నే
ఉన్నవి రెండే దార్లు చంపడం లేదా చావడం
నేను ముగ్గురికి సమాధానం చెప్పాలి
నాలుగు వారాల క్రితం కాసిన పందెం
అయిదు వేల మంది జనాభా ఉన్న ఒక ఊరు
ఆరు వందలమంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒక నియంత
ఏడు అడుగులు నాతో నడవడానికి సిద్దంగా ఉన్న ఒక అమ్మాయి
నా జీవితాన్ని మార్చేసిన ఎనిమిది వేల గజాల స్థలం
తొమ్మిది నిముషాలు మిగిలిన గడువు
పది మీటర్ల దూరంలో చావు”... ఇదీ నా కథ.
            

18 కామెంట్‌లు:

  1. చాల చాల భాగుంది మీ వివరణ..ఈ లాంటి సినిమాలు మళ్ళి మళ్ళి రావాలి మన విలువలు మనం కాపాడుకోవాలి.

    రిప్లయితొలగించండి
  2. Too Good.. Your analysis and movie is too good.. Thanks a lot...please post this in FB..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ అజ్ఞాత గారు... నేను ఫేస్బుక్ ఎక్కువ ఉపయోగించనండీ..

      తొలగించండి
  3. osy osey nanu vadilesi ellipokey ane paata raayinchukundi trivikrame kada-- abba dheeni pikkalu choodaraa antoo khalejaa lo anushka gurinchi mahesh tho cheppinchinchindi trivikrame kadaa-ivenaaa viluvalu

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారు, మీరు చెప్పినవి చేసినది త్రివిక్రమే అంతే కాదు ఇక మీదట కూడా అలాంటి సినిమాలు ఆయన తీయచ్చు. నేను ఈ పోస్ట్ లో త్రివిక్రమ్ దేవుడు ఆయనలా విలువలను పాటించండి అని చెప్పట్లేదండీ... సన్నాఫ్ సత్యమూర్తి ఇలా ఉన్నాడని మాత్రమే చెప్పాను. ఇలా ఆలోచించి సినిమా తీయగలిగినందుకు త్రివిక్రమ్ ని మెచ్చుకున్నాను అంతే.

      తొలగించండి
  4. I watched the movie yesterday and I totally agree with you. I was wondering about the bad reviews. Nice movie.

    Srinitya

    రిప్లయితొలగించండి
  5. వందమందిని వొంటి చేత్తో చంపేసే ఫేక్షన్ మూవీలు వరుసగా వస్తున్నా ఓపిగ్గా ఇష్టం గా హిట్ చేసేస్తున్నారు..మరి ఒక వేళ అత్తారింటికి దారేది టైప్ లో త్రివిక్రం ఇంకో మూవీ ట్రై చేస్తే ప్రోబ్లం యేమిటి..మంచి మూవీస్ రాలేదనే మనం అటువంటి ప్రయత్నం చేసినప్పుడు అభినందించాలి..ఒక మంచి ప్రయత్నాన్ని మనసారా అభినందించి నందుకు హేట్సాఫ్ వేణూజీ..

    రిప్లయితొలగించండి
  6. మంచి చేస్తే మంచే తిరిగివస్తుంది అన్నది కరెక్టే కానీ ‘‘మా నాన్న గొప్పవాడు అనిపిచుంకునేందుకు ఎవడే రాయి వేసినా వాడిని శాటిస్ఫై చేస్తాను’’, ‘‘99మంది మంచివాడు అంటే చాలదు 100మందీ అనాలి, ఆ వందో వాడు పైడా సాంబశివరావు లాంటివాడే కావాలి’’ టైప్ యాటిట్యూడ్ సరికాదు. నిజాయితీగా మంచి చేస్తే వందమందీ మంచిని మంచే అంటారని నమ్మకం లేదు. రాముడు, కృష్ణుడు, మార్క్స్, గాంధీ ఒక్కడైనా ఉన్నాడా అందరితో మంచి అనిపించుకున్నవాడు. అలా ప్రయత్నించి గొప్పవాడైనవాడెవడైనా కనిపించాడా మనకి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ పవన్ సంతోష్ గారు... నిజమేనండీ అలా వందశాతం మంచి అనిపించుకోగలిగినవారు ఎవరూ ఉండి ఉండకపోవచ్చు, నిజానికి మంచి చేయాలనుకునే వ్యక్తి ఇతరుల మెప్పు కోసం చేయడు తనకోసం తాను చేస్కుంటాడు.

      కాకపోతే ఈ హీరోకి తన తండ్రి మీద ఉన్న ప్రేమ అలాంటిది అందుకే పైడా లాగా లెక్కలు మాట్లాడే వ్యక్తి కూడా తన తండ్రిని మోసగాడు అనడం ఒప్పుకోలేకపోయాడు అతని అభిప్రాయం మార్చడానికి కనీసం తన పరిధిలో తన ప్రయత్నం చేయాలనుకున్నాడు.

      తొలగించండి
  7. GREAT REVIEW ANDI... NENU KOODA NAA FRIENDS KI KOODA ADHE CHEPPANU

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.