బుధవారం, మార్చి 25, 2015

ఎవడే సుబ్రహ్మణ్యం...

నువ్వెవరు? అనేది చాలా సింపుల్ గా కనిపించే అతి కష్టమైన ప్రశ్న. చాలామందికి అది సమాధానం లేని ప్రశ్న కూడా. ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందనే ఆశ రిషి(విజయ్)ని హిమాలయాల్లోని దూద్ కాశి (ఆకాశ గంగ) ప్రయాణానికి పురిగొల్పుతుంది. ఆపేరు మొదటిసారిగా టెంత్ లో తన బెస్ట్ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం(నాని) తో కలసి విన్నాడు కాబట్టి ఆ ప్రయాణం కూడా తనతోనే చేయాలని నిర్ణయించుకుంటాడు. "డబ్బుదేముంది బాస్ కూటికోసం కోటి విద్యలు, జీతం కన్నా జీవితం విలువైనది ఎప్పుడు ఎంజాయ్ చేశావ్ అని అడిగితే వేళ్ళమీద లెక్కపెట్టుకునే పరిస్థితి నాకొద్దు" అనే ఫిలాసఫీ రిషిది.

అయితే దీనికి పూర్తి వ్యతిరేకంగా "లోకంలో నువ్వెవరో నీ బాంక్ బాలన్స్ తోనే తెలుస్తుంది దాని కోసం నేనేదైనా చేయడానికి రెడీ, సంపాదనే నా జీవితం" అనే ఫిలాసఫీ సుబ్బుది. దూద్ కాశి వెళ్లడం తనకి అస్సలు ఇష్టముండదు అదంతా వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అనుకుంటాడు. సుబ్బు తాను కోరుకున్నట్లే అనతికాలంలో డబ్బు సంపాదించేసి ఒక బిజినెస్ టైకూన్ కూతుర్ని పెళ్ళి చేసుకుని వాళ్ళ కంపెనీకి ఎండీ గా సెటిల్ అవబోయే తరుణంలో... టెంత్ లోనే ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపొయిన రిషి తిరిగి అతని జీవితంలో ప్రవేశిస్తాడు. 

వారిద్దరికి అనుకోని పరిస్థితులలో ఇంచుమించు రిషిలాంటి మనస్తత్వమే ఉన్న ఆనంది(మాళవిక నాయర్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. రిషి దూద్ కాశి ట్రిప్ కు ఆనందిని కూడా తీస్కెళతాను అని చెప్తాడు. ఆనంది ఎవరు, రిషి సుబ్బు మనసు మార్చ గలిగాడా, వీరు ముగ్గురు కలిసి దూద్ కాశి కి ప్రయాణం చేశారా లేదా అసలు వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అనేది తెలుసుకోవాలంటే "ఎవడే సుబ్రహ్మణ్యం" సినిమా చూడాలి.

సినిమా లో చెప్పిన ఫిలాసఫీని రెండు కీలకమైన డైలాగ్స్ లో చెప్పేస్తాడు. "ప్రకృతి మనిషి అవసరానికి సరిపడా ఇస్తుంది అత్యాశకి సరిపడా కాదు" అనేది ఒకటైతే రెండోది "గొంగళి పురుగు తన బరువుకన్నా కొన్ని వేల రెట్లు ఆకుల్ని తిని మొక్కల్ని నాశనం చేస్తుంది కానీ అదే పురుగు శీతాకోక చిలుకగా మారాక మళ్ళీ మొక్కలకు ప్రాణం పోస్తుంది. మనిషి కూడా పురుగులా తినీ తినీ భూమిని నాశనం చేస్తున్నాడే తప్ప తనలో ఒక శీతాకోక చిలుక దాగుందనే విషయాన్ని మర్చిపోతున్నాడు" అనేది.

"ఎవడే సుబ్రహ్మణ్యం" సినిమా కేవలం హిమాలయాల్లోని దూద్ కాశి కి చేసిన ప్రయాణం గురించి మాత్రమే కాదు. ఒక మనిషి తనలో దాగున్న ఆ శీతాకోక చిలుకను కనుగొనడానికి చేసిన ప్రయాణం గురించి, జీవితంలో లెక్కలూ అనాలిసిస్ లూ తప్ప అనుబంధాలు అనుభూతుల గురించి పట్టించుకోని ఒక మనిషి వాటిని కనుగొనే దిశగా చేసిన ప్రయాణం గురించి, డబ్బుకన్నా విలువైన వాటిని తెలుసుకోవడానికి చేసిన ప్రయాణం గురించి, తనని తాను కనుగొనడానికి చేసిన ప్రయాణం గురించి, ప్రేమను కనుగొనడానికి చేసిన ప్రయాణం గురించి.

తెలుగు సినిమా కి అలవాటు లేని ఒక కొత్త జొనర్ లో సమకాలీన సమస్యను తీస్కుని వైవిధ్యంగా ప్రజెంట్ చేసిన ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ని అభినందించి తీరవలసిందే. హాస్యంతో కలిపి చెప్పడంతో ఎమోషన్ కాస్త డైల్యూట్ అయినట్లు అనిపించినా అదే లేకపోతే మరో ప్రీచింగ్ సినిమాగా మిగిలుండేది అనిపిస్తుంది. ఈ సినిమా కోసం సముద్ర మట్టానికి ఐదువేల ఐదొందల మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లొకేషన్స్ కు చిత్ర యూనిట్ అంతా స్వయంగా ట్రెక్కింగ్ చేస్కుంటూ వెళ్ళి చిత్రీకరించడం అభినందించ దగిన విషయం. ఇంగ్లీష్ సినిమాలు డాక్యుమెంటరీలు చూసేవారికి అంత అనిపించక పోవచ్చు కానీ సగటు తెలుగు ప్రేక్షకులను హిమాలయాల లొకేషన్స్ విజువల్స్ తప్పక ఆకట్టుకొంటాయి.

తన ఫ్లాప్ చిత్రాలలో కూడా నటుడిగా మంచి మార్కులు కొట్టేసే నానీ ఇలాంటి సబ్జెక్ట్ దొరికితే చెలరేగిపోతాడనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేరియేషన్స్ చూపడంలోనూ కీలక సన్నివేశాలలోనూ తన నటన ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ బబ్లీ రోల్ తో మరికొంత సేపు కనిపిస్తే బాగుండు అనిపిస్తాడు. పొడవుతప్ప మిగిలిన విషయాల్లో నిత్యా మీనన్ తో కాస్త పోలికలు కలిసిన హీరోయిన్ మాళవిక నాయర్ తన నటనతో మెప్పిస్తుంది. కృష్ణం రాజు గారు చేసిన పాత్ర నాకు చాలా నచ్చింది. ఆయన రెబెల్, బిల్లా లాంటివి కాక ఇటువంటి హుందా అయిన పాత్రలు ఎన్నుకుంటే బాగుంటుందనిపించింది. 

రాధన్ నేపధ్య సంగీతం పాటలూ కూడా సినిమా మూడ్ కు తగినట్లున్నాయి, రాకేష్, నవీన్ ల సినిమాటోగ్రఫీ బాగుంది. వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం "ఎవడే సుబ్రహ్మణ్యం". ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ముందు ముందు తెలుగులో ప్రతిభ ఉండి సెన్సిబుల్ చిత్రాలను నిర్మించే దర్శకుల జాబితాలో చేరతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

8 కామెంట్‌లు:

 1. "దూద్ కాశీ" లానే నా చిరకాల వాంఛ 'మానస సరోవరం' చూడటం..సో ఈ మూవీ చాలా ఫేసినేటింగ్ గా అనిపిస్తోంది..మీ ఆర్టికల్ చదువుతుంటే, వెంటనే ఈ మూవీ చూడలనిపిస్తోంది వేణూజీ..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ శాంతి గారు.. మూవీతో పాటుగా మీరు కోరుకున్న మానస సరోవరాన్ని చూసే అవకాశం కూడా మీకు త్వరలోనే దొరకాలని కోరుకుంటున్నానండీ :-)

   తొలగించండి
 2. నిన్న మీ పోస్ట్ లో కమెంట్ రాద్దామని కామెంట్ బాక్స్ ఓపెన్ చేసాను నెట్ కనక్షన్ పోయింది.. తర్వాత మర్చిపోయాను :(
  బావుండి కదండీ సినిమా.. నాక్కూడా ఆ అమ్మాయి కాస్త నిత్యా లాగ, కాస్త శోభన లాగ(కళ్ళు) కూడా అనిపించిందండీ.
  తెలుగులో ఇలా కాస్త డిఫరెంట్ మూవీస్ ఇంకా వస్తే బావుంటుంది!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ తృష్ణ గారు... అవునండీ శోభన పోలికలు కూడా కనిపించాయి నిజమే.

   తొలగించండి
 3. మీ టపా చదవడంవల్ల ఒక మంచి సినిమా చూడగలిగాను. ధన్యవాదాలు.
  సినిమా గురించి నా అభిప్రాయం కూడ మీరు వ్రాసినట్టే ఉంది.
  "మిథునం" తరువాత నేను చూసిన మంచి తెలుగు సినిమా ఇది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ బోనగిరి గారు, సినిమా చూసొచ్చి అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.. మీ వ్యాఖ్య నన్ను మరిన్ని మంచి సినిమాల గురించి రాయాలనిపించేలా ప్రోత్సాహకరంగా ఉంది.

   తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.