మంగళవారం, ఫిబ్రవరి 10, 2015

మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి సినిమాలు

కొన్నిసినిమాలు పెద్దగా హడావిడి లేకుండా నిశ్శబ్దంగా విడుదలవుతాయి కానీ ప్రేక్షకుల మనసులో అలజడులను రేపి శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి అరుదైన సినిమానే “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”. నిజానికి ఈపేరుతో సినిమా మొదలుపెడుతున్నారన్నపుడు అబ్బా మంచి పాటల్లో లైన్స్ ఇలా వాడి పిచ్చి సినిమాలు తీసి చెడగొడతారెందుకో అని అనుకున్నాను. కానీ సినిమా చూశాక ఆ పాట ఎంత ఇష్టమో సినిమా మీద అంతకు పది రెట్లు ఇష్టమ్ పెరిగింది. ప్రతివారం సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి అందులో సగానికి పైగా ప్రేమకథలే ఉంటూంటాయి కాని ఇలాంటి ప్రేమకథలు మాత్రం అరుదుగా వస్తాయి.

అమ్మ(పవిత్ర లోకేష్)నూ పరుగునూ అమితంగా ప్రేమించే రాజారామ్(శర్వానంద్) ఒలింపిక్స్ గెలవాలని కలలు కంటూ ఉంటాడు. లక్ష్య సాధనలో భాగంగా స్టేట్ లెవల్ ఫైనల్స్ లో పాల్గొనే టైమ్ లో నజీరా(నిత్య మీనన్) ని చూస్తాడు. బురఖాలో ఉన్న ఆమె కళ్ళను మాత్రమే చూసినా, నజీరా మంచి మనసును కూడా చూసి ఆమెపై మనసుపడతాడు. నజీరా కూడా ఆతన్ని ఇష్టపడుతుంది. అన్ని ప్రేమ కథల్లో లాగే వారి ప్రేమకూ అడ్డంకులు ఏర్పడతాయి వాటిని అధిగమించి వారు ఎప్పటికైనా ఒకటి కాగలిగారా అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ కమ్మని ప్రేమకథను తెరపై చూడాల్సిందే.

పొద్దున్న చూసుకుని మధ్యాహ్నం కలుసుకుని సాయంత్రం పెళ్ళాడి తెల్లారి విడిపోయే ఆధునిక ఫేస్బుక్ ప్రేమల కాలంలో ఏళ్ళతరబడి గుండెల్లో నిలిచి ఉండే ఒక ప్రేమ కథను అదీ ఇంత ఎఫెక్టివ్ గా కన్విన్సింగ్ గా చెప్పగలగడం ఒక్క క్రాంతిమాధవ్ కే చెల్లింది. కమర్షియల్ సినిమాల్లో ఫైట్లకో స్టెప్పులకో డైలాగులకో విజిల్స్ వినబడడం కామనే కానీ ఈ సినిమాలో ప్రేమికుల మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలలో సైతం ప్రేక్షకులు విజిల్స్ వేసీ చప్పట్లు కొట్టారంటే ఆ ప్రేమజంటతో ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో అలా చేయడంలో ఈ సినిమా టీమ్ ఎంతగా విజయం సాధించిందో అర్ధమవుతుంది.

కనిపించడానికి ఇది ఎంత సాధారణమైన ప్రేమకథలా ఉందో అంతే సాధారణంగా ఈ కథలోని పాత్రలు మన చుట్టూ ఉండే సమాజంలోంచే స్క్రీన్ మీదకి నడిచొచ్చేసినట్లుంటాయి. ఒకప్పుడు వచ్చిన అద్భుతమైన ప్రేమకథలు అవి తీసిన బాలచందర్, మణిరత్నం లాంటి దర్శకులు మదిలో మెదులుతారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి టీమ్ ఎఫర్ట్ కారణం ఇంచుమించు అన్ని డిపార్ట్మెంట్స్ పనితీరు చక్కగా ఉంది కాకపోతే నాలుగు పిల్లర్స్ గా నిలిచినది మాత్రం దర్శకుడు, నటీనటులు, డైలాగ్స్, విజువల్స్.

దర్శకుడు “క్రాంతి మాధవ్” ఒక స్వచ్ఛమైన ప్రేమకథను తీసుకుని సహజమైన పాత్రలతో నెమ్మదైనదే అయినా చక్కని కథనంతో మనసుని తాకే అందమైన సన్నివేశాలను అల్లుకుంటే నటీనటులు ఆ పాత్రలకు ప్రాణం పోసి సజీవంగా మన కళ్లముందుంచారు. ఇటీవల విడుదలై హిట్ సాధించిన “రన్ రాజా రన్” లోని శర్వానంద్ కూ ఈ చిత్రంలోని శర్వానంద్ కూ ఒక్క పోలిక కూడా కనబడదు. మనకి ఇందులో కేవలం రన్నర్ “రాజా రామ్” మాత్రమే కనిపిస్తాడు. అంత వైవిధ్యమైన నటనని ప్రదర్శించాడు. 

ఇక నిత్యామీనన్ మొదటి సగంలో ఎక్కువభాగం బురఖాలో కనిపించి కళ్ళతోనే నటించేసి వేల భావాలను పలికించింది. అలాగే తను ప్రధానంగా నడిచే సెకండాఫ్ అంతా కూడా ఎంతో గ్రేస్ ఫుల్ గా చేసింది. హీరోకి అమ్మగా చేసిన పవిత్ర, కోచ్ గా చేసిన సూర్య, చాలా కాలం తర్వాత కనిపించిన చిన్నా, కథని మలుపు తిప్పే పాత్రలో నాజర్, నిత్య ఫ్రెండ్ జ్యోతిగా చేసిన నటి అందరూ చాలా బాగా నటించారు. ఇక రచయిత “సాయిమాధవ్ బుర్రా” ప్రాసల కోసం పాకులాడకుండా సులభశైలిలో అర్ధవంతమైన ఆలోచింపజేసే చక్కని సంభాషణలు పలికించి ఆ మాటలు సినిమా పూర్తయాక కూడా చాలారోజులు మనలని వెంటాడేలా చేశాడు.
 
ఇక సినిమాటోగ్రాఫర్ “వి.ఎస్.జ్ఞానశేఖర్” ఈ సినిమాని తెరకెక్కించిన తీరు అద్భుతం ప్రతి విజువల్ నూ అందంగా తీర్చి దిద్దాడు. సంగీతాన్ని అందించిన మళయాళీ సంగీత దర్శకుడు “గోపీ సుందర్” పాటల విషయంలో కాస్త తడబడినా నేపధ్య సంగీతాన్ని మాత్రం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసేలా అందించాడు. వెరసి ఈ సినిమా చూస్తున్నపుడు దృశ్యకావ్యమంటే ఇదేనేమో అనిపిస్తుంది. మామూలు సినిమా చూసినట్లుగా కాక, ఒక మంచి పుస్తకం  చదువుతున్నట్లో, సముద్రపు ఒడ్డున కూర్చుని ఒక కమ్మటి కవితను ఆస్వాదిస్తున్నట్లో ఒక అందమైన అనుభూతి మన సొంతమవుతుంది.

ఇదే చిత్రానికి చిరకాలం గుర్తుండిపోయే మరోచరిత్ర, అభినందన, గీతాంజలి లాంటి ప్రేమకథలకు కుదిరినట్లుగా మంచి సంగీత సాహిత్యాలు కూడా తోడై ఉంటే సినిమా మరో మెట్టు ఎదిగి ఉండేది. అలాగే మరీ నెమ్మదైన కథనం, అక్కడక్కడ మేకప్ పరమైన దోషాలూ, సినిమా ప్రారంభంలో సంగీతపాఠాల సన్నివేశాలలో ఉచ్ఛారణ దోషాలు లాంటి లోపాలు పంటికింద రాయిలా అక్కడక్కడా తగిలినా అవి సినిమా అనుభూతిని ఏమాత్రం డిస్ట్రబ్ చేయవు.

హృద్యమైన ప్రేమ కథలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ మిస్ అవకుండా చూడవలసిన సినిమా “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”. ఇంత స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రేమకథలు అరుదుగా వస్తూ ఉంటాయి కనుక మిస్ అవ్వకండి. సాధారణంగా మళయాళంలోనో తమిళ్ లోనో అపుడపుడూ ఇలాంటి ఇంటెన్స్ ప్రేమకథలు వస్తుంటాయి. వాటికి ధీటుగా తెలుగులో వచ్చిన ఈ చక్కని చిత్రాన్ని ప్రోత్సహించడం ఇటువంటి మంచి చిత్రాలు కోరుకునే ప్రతి తెలుగు సినీ అభిమాని బాధ్యత.


ఈ చిత్రంలో నాకు నచ్చిన కొన్ని సంభాషణలు.. (సినిమా చూసి వచ్చాక మాత్రమే వీటిని చదవమని మనవి)
"నువ్వెప్పుడూ గెలవడానికి పరిగెట్టు పక్కనోడ్ని ఓడించడానికి కాదు. ఓడించాలి అనుకునే వాడు వెంటపడుతూ ఉంటాడు వాడెపుడూ వెనకే ఉంటాడు, గెలవాలనుకునే వాడు ముందుంటాడు ఎపుడూ గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు."

"గెలుపుతో స్నేహం చేయండి.. ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఓటమిని ప్రేమించండి.. ఎప్పుడూ మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటుంది."

"కంటికీ మనస్సుకూ కామన్ సెన్స్ ఉండదు.. వాటితో తిరిగితే మనమూ చెడిపోతాం."

"జేబులో రూపాయ్ లేకపోయినా అమ్మాయిని ట్రై చేయొచ్చు... కానీ లక్ష్యాన్ని ట్రై చేయకూడదా..!! లక్ష్యం అమ్మాయికన్నా సెక్సీగా ఉంటుందిరా."

తండ్రి : "ఇండియా ఎలా ఉంది.."
కూతురు : "అలాగే ఉంది.. చూడ్డానికి ఎలా ఉన్నా.. బ్రతకడానికి బాగుంటుంది."

"ప్రేమంటే కలిసుండటం కాదు.. దూరాన్ని కూడా దగ్గరగా ఫీలవడం."

"కన్నీళ్ళు... మనకొస్తే అది కష్టం అవుతుంది.. అవే మనకోసం వొస్తే ప్రేమ అవుతుంది."

"వయసైపోయిందా...?!!! వయసు పెరుగుతూ ఉంటుంది..ఒకసారే అది ఆగిపోతుంది."

"బిడ్డ ఆకలి తీరిందగ్గరనుంచీ అమ్మ ఆకలి మొదలవుతుంది..."

"ఎదురుచూపులని వెతకడం కూడా ప్రేమేనేమో!!"

"చూడాలనుంది.. నీ అందాన్ని కాదు.. నీలో బతుకుతున్న నన్ను.. నాలో ఉన్న నిన్ను.. నేను చూడాలి.."

"బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు... నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవదు."

"ఓటమిని పరిగెత్తించు అది గెలుపు వరకూ తీస్కెళుతుంది."

"అతను గుర్తు పట్టకపోతే చచ్చిపోతాను, గుర్తు పడితే ఇక బ్రతకలేను."
(చాలా సంవత్సరాల తరువాత ప్రేమికుణ్ణి కలవబోతున్న ప్రేయసి)

"ప్రేమలో పెళ్ళి ఉండకపోవచ్చు కానీ పెళ్ళిలో ప్రేమ ఉంటుంది."

తల్లి : (ఉత్తరం చదవమన్న కూతురుతో) "తప్పమ్మా. ఒకళ్ళు రాసింది మరొకరు చదవకూడదు."
కూతురు : "పిల్లలు రాసింది తల్లి చదవాలమ్మా... తప్పులు దిద్దాలిగా."

"బతుకుని లెక్క చేయకపోయినా ఫరవాలేదు. చావును గౌరవించాలి."

"కన్నీళ్ళు మనిషీ కవలపిల్లలు... పుట్టినప్పటి నుండి పోయేవరకూ మనతో ఉండేది కన్నీళ్ళే."

"నాదీ అనేది ఫీలింగ్ సార్ అది కొంటే రాదు.. వస్తే పోదు.."

"ఇన్నాళ్ళాగితేనే ప్రేమవుతుందని రూలేదైనా ఉందా... ప్రేమలో ఎవరూ పద్దతిగా పడరు.."

"ఇప్పుడంటే ఆశల్తో ఆలోచనలతో ప్రేమించుకుంటాం ఓ వయసొచ్చాక ఇవన్నీ ఉండవు అపుడు జ్ఞాపకాలతో ప్రేమించుకోవాలి. ఎన్నుంటే అంత మంచిది కదా..." (“ఈ దాగుడు మూతలెందుకూ నువ్వెవరో సూటిగా చెప్పచ్చు కదా” అన్న ఫ్రెండ్ తో హీరోయిన్)

"వాడి ప్రేమ నీకు పిచ్చిలా ఉంది కదా..."
"అలా లేకపోతే అది ప్రేమ కాదు కదా..."

"ఒకడిలైఫ్ ఇంకొకడికి లైట్ గానే ఉంటుంది కానీ.. ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది."

కూతురు : "ఏ తల్లీ కూతురు లైఫ్ మీద ఇలా స్పై చేయకూడదు.."
తల్లి : "ఏ కూతురు లైఫూ ఇంత స్పైసీగా ఉండకూడదు.. ఐ యామ్ నాట్ స్పైయింగ్ ఐ యామ్ కన్సర్న్డ్."

"నాన్నకి దూరంగా ప్రేమించిన వాడితో ఉండచ్చు కానీ దూరం చేస్కొని ఉండకూడదు."

"అమ్మనీ ప్రేమనీ మించినది ఏవుంటుంది ?"

"ప్రేమనే వదులుకున్న నాకు ప్రాణమొక లెక్కా.. ఆఫ్ట్రాల్.. ప్రేమకు పుట్టిన ప్రాణం ప్రేమకన్నా చాలా చిన్నది."

"ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు కానీ అదే ప్రేమ చచ్చిపోడానికి ఒక జీవితం చాలదు."

20 కామెంట్‌లు:

  1. ఒకేలా చూసినట్టున్నామండీ ఇద్దరం!! :))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చూసినవాళ్ళందరికీ ఒకేలాంటి అనుభూతి కలుగుతున్నట్టుందండీ. :))

      తొలగించండి
    2. ఆవును మురళి గారు :-) శిశిర గారన్నట్లు చాలా మంది మనలాగే అనుభూతి చెందినట్లున్నారు. ఇంత మంచి సినిమాకి హిట్ టాక్ రావడం నాకు సంతోషంగా ఉంది. పెద్దరిలీజ్ ను తట్టుకుని సెకండ్ వీక్ రన్ అవుతుంది మా ఊర్లో.

      తొలగించండి
  2. నేను మీ రివ్యూ క్షుణ్ణంగా చదివేంత సాహసం చెయ్యలేకపోయాను. పైపైన మాత్రమే స్పృశించాను -ఎందుకంటే ఈ చాలా చక్కని చిత్రాన్ని నేనూ చూడాలనుకుంటున్నాను కనుక :). సినిమా చూసేకా మళ్ళీ మీ పోస్ట్ చదివేస్తా. నా అభిమాన నటి నిత్య పుట్టినరోజూ నా పుట్టిన రోజూ ఒకటే అని ఈమధ్య తెలిసి సంతోషం వేసింది (సంవత్సరం కాదు లెండి).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ థాంక్స్ శరత్ గారు :-) అనుభూతి ప్రధానమైన చిత్రం కనుక నేనూ జాగ్రత్తపడి సాధ్యమైనంత వరకు స్పాయిలర్స్ లేకుండానే రాయడానికి ప్రయత్నించానండీ. మీరూ చూసేసి ఎలా ఉందో మీ అభిప్రాయం పంచుకోండి. ఓహో నిత్య పుట్టినరోజు మీ పుట్టినరోజు ఒకటేనా గుడ్ :-)

      తొలగించండి
    2. నిన్న మా కుటుంబం, మరి కొన్ని కుటుంబాలతో కలిసి ఈ సినిమాకి వెళ్ళాం. చాలాబాగా నచ్చింది. మొదటి నుండీ చివరి వరకు కన్నీళ్ళు తుడుచుకుంటూనే వున్నా - కర్చీఫ్ పూర్తిగా తడిచిపోయింది. (అంతగా ఏడ్చెయ్యడానికి ఒక మెడికల్ కారణం కూడా వుండి వుండవచ్చు - వివరణ నా బ్లాగు పోస్టులో). మా ఆవిడతో సహా ఆడవాళ్ళు అందరూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఈ సినిమా చూసారు!? సినిమా ఎలా వుందంటే ఫర్వాలేదన్నారు!? ప్చ్. వాళ్ళ మీద జాలి కలిగింది. పన్నెండేళ్ళ మా అమ్మాయికి మాత్రం ఈ చిత్రం బాగా నచ్చింది.

      తొలగించండి
    3. సినిమా చూసొచ్చి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు శరత్ గారు. సినిమా మీకు నచ్చినందుకు సంతోషం.

      తొలగించండి
  3. బావుంది వేణూ గారూ.. అన్ని పాయింట్స్ కవర్ చేసారు.
    "Trust the one who can see sorrow behind your smile,
    love behind your anger and reason behind your silence" అని ఒక కొటేషన్ ఉందండీ. ఏ బంధానికైనా కావాల్సినది అలాంటి నమ్మకమే. ఇద్దరు ప్రేమికుల మధ్యన నాలుగు డ్యూయెట్లు, రెండు మూడు ఇంటిమేట్ దృశ్యాలూ చూపెట్టి అదే గాఢమైన ప్రేమ అని నమ్మిస్తున్న ఈతరం సినిమాల మధ్యన ఇద్దరు ప్రేమికుల మధ్యన ముఖ్యంగా ఉండాల్సింది ఇలాంటి నమ్మకం అని ప్రేక్షకులు ఫీలయ్యేలా చూపెట్టగలిగిన దర్శకుడికీ, ఈ విజయానికి తన అద్భుతమైన సంభాషణల సహకారాన్ని అందించిన సాయి మాధవ్ గారికీ హేట్సాఫ్!
    "అందరూ నాకు అభినందనలు చెప్పడానికి నా చేతుల వంక చూస్తూంటే, ఆ అమ్మాయి ఒక్కతే నా పాదాలకైన గాయాన్ని చూసిందమ్మా" అంటాడు చూడండి.. ఆ సీన్ నాకు బాగా నచ్చింది. ఆ ఒక్క సన్నివేశంతో ఆ అమ్మాయి అతనికి నచ్చడానికి గల బలమైన కారణాన్ని చూపారు పై కొటేషన్ లో లాగ..!
    నిత్యా గురించి చెప్పేదేముంది.. అలా మొదలైంది అంటూ మనసు దోచేసిందా పిల్ల :) శర్వానంద్ బాడీలాంగ్వేజ్ చాలా బాగా సరిపోయింది పాత్రకి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగా చెప్పారు తృష్ణ గారూ.

      తొలగించండి
    2. థాంక్స్ తృష్ణ గారు... కోట్ బాగుందండీ.. సినిమాలో చాలా చక్కని సన్నివేశాన్ని గుర్తు చేశారండీ.. ఇలాంటి సున్నితమైన అంశాలు/సన్నివేశాలు చాలా ఉన్నాయి కదండీ సినిమాలో. అంత ఓపికగా పెద్ద కామెంట్ రాసినందుకు స్పెషల్ థాంక్స్ :-)

      తొలగించండి
  4. బావుందండీ సమీక్ష.

    తెలుగులో వచ్చిన ఈ చక్కని చిత్రాన్ని ప్రోత్సహించడం ఇటువంటి మంచి చిత్రాలు కోరుకునే ప్రతి తెలుగు సినీ అభిమాని బాధ్యత.<<<<

    నిజం.

    రిప్లయితొలగించండి
  5. వేణు గారు ,చాలా బాగారాసారు . అంతలా ఆ డైలాగ్స్ ఎలా గుర్తుంటాయండి .. గ్రేట్ మీరు ..సినిమా ఇప్పుడే చూడాలి అనిపించేలా రాసారు మీరు . మరి మా ఊరు రాదే. ఎందుకంటే మా ఉళ్లో దియేటర్ లేదుగా :) ఎప్పుడో టివి లో వచ్చాక చూడాలి . అయినా ఇటువంటి సినిమాలు దియేటర్ లో బిగ్ స్క్రీన్ పై అలా కంటిన్యుస్ గా యాడ్స్ గోల లేకుండా చుస్తే బావుంటుంది కదా ..
    RADHIKA (nani)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ రాధిక గారూ.. అవునండీ ఒక మంచి పొయెటిక్ ఫీల్ ఉన్న సినిమా కనుక థియేటర్ లో ఏకబిగిని చూడడమే బాగుంటుంది. మీ ఊరిలో లేకపోయినా మీ దగ్గరలో ఉన్న థియేటర్ లో కాస్త ఆలశ్యంగా విడుదలైనా కూడా మిస్ అవకండి, మంచి సినిమా.

      తొలగించండి
  6. నిన్న లవర్స్ డే రోజున ఈ ప్రేమ కవిత చూసొచ్చినదగ్గర్నుండీ మీ పోస్టు ఓపెన్ చేయడం, డైలాగులని మళ్ళీ మళ్ళీ చదువుకోవడం... ఇదో పనైపోయింది వేణూ గారు... థాంక్స్ ఫర్ పోస్టింగ్ థెమ్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ఈ ప్రేమ కవిత"
      కదా.. ఒక్క ముక్కలో ఎంత బాగా చెప్పావో.. నీక్కూడా నచ్చేసిందనమాట అయితే.
      థాంక్స్ నాగార్జునా :-)

      తొలగించండి
  7. మీ రివ్యూ అయితే నేను పూర్తిగా చదవలేదు, అందరూ బావుందనే అంటున్నారు. ఈ వారాంతం వర్కూ ఇక్కడ సినిమా ఉంటే తప్పకుండా చూస్తాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ మేధ గారు.. మల్టిప్లెక్సుల్లో ఒకటి రెండు షోస్ అయినా వేసే ఆవకాశం ఉందండీ.. ఆల్ ద బెస్ట్.. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుని వెళ్లకండి :-)

      తొలగించండి
  8. రిప్లయిలు
    1. ఎందుకలా ధనుంజయ్ గారు :-) ఎనీవేస్ థాంక్స్ ఫర్ ద కామెంట్.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.