అబ్బే! వర్షం సినిమా పాటలు కాదండీ బాబు, మామూలు వర్షం గురించే నే చెప్తున్నది. మొన్న శనివారం మధ్యాహ్నాం సుష్టుగా భోంచేసి వారం రోజుల కరువంతా తీరేలా నిద్ర పోయానా.. సాయంత్రం లేచే సరికి జోరుగా వర్షం... నే లేచే సరికి వర్షమో లేక వర్షమే నన్ను నిద్ర లేపిందో మరి సరిగా తెలియలేదు. కానీ అంత వర్షం చూసే సరికి లోపల కుదురుగా కూర్చోలేకపోయాను. బయట రోడ్ మీదకి వెళ్ళి తనివి తీరా తడిచి తదాత్మ్యం చెందాలనీ.. అక్కడక్కడా నీళ్ళు నిలిచిన చిన్ని చిన్ని గుంటల్లో ఎగిరి దూకి ఆ నీళ్ళని పక్కలకి చిందించి మళ్ళీ అవి తూచ్ తూచ్ అని హడావిడిగా గుంటల్లోకి వెళ్ళిపోడాన్ని ఆనందంగా చూడాలనీ.. గోడలపై నిలచిన కాసిని నీళ్ళ పై పడే వర్షపు చినుకు లు సృష్టించే అలల అలజడి ని కనులారా చూడాలనీ.. అప్పటి వరకూ ఎక్కడ దాక్కుంటాయో కానీ వర్షం పడగానే బెక బెక ల సరిగమలు వినిపించడానికి వేంచేసే కప్పగారి గాత్ర కచేరీలు వినాలనీ మనసు వెర్రి మొర్రి ఆలోచనలు చేయడం మొదలు పెట్టింది.
తప్పునాన్న ఇప్పుడో పెద్దరికం ఒకటి ఏడ్చింది కదా ఇవన్నీ చేస్తే చుట్టూ ఉన్న జనాలు వింతగా చూసే అవకాశం ఉంది కనుక నువ్వు సైలెంట్ అయిపో అని బుద్ది చెప్పి కూర్చో పెట్టేశాను అనుకోండి కాకపోతే పోర్టికోలో ఏదో పని ఉన్నట్లు అక్కడ అవి ఇవీ సర్ధుతూ కాస్త వర్షం లో తడిచా :-) అప్పటి వరకూ తలుపులు బిగించి నిద్ర పోవడం వల్ల వేడిగా ఉన్న ఒంటి పై చల్లని వాన చినుకు పడగానే ... జిల్లు మని ఎంత హాయి గా ఉందో.. ఈ ఆనందం ఇంకెక్కడా దొరకదేమో ఈ వర్షం లో తప్ప అనిపించింది (షవర్ తిప్పుకున్నా దొరుకుతుంది బాస్ అని అంటే నేనేం చెప్పలేను:). అలా కాసేపు బయటే నిలబడి గోడ పై బడి విచ్చిన్నమౌతున్న వాన చినుకులనీ, ఉధృతమైన వాన చినుకుల తాకిడికి కిందకి వాలిపోయి అంత లోనే మేమేమీ తక్కువ తినలేదు అంటూ తిరిగి పైకి రావడానికి ప్రయత్నించే చెట్ల ఆకులనీ సున్నితమైన పూవులనీ చూస్తూ.. ఆకులపై పడుతూ అల్లరి గా వాన చేసే చప్పుడుని చెవులప్పగించి వింటూ, చల్లటి గాలినీ, అప్పుడప్పుడూ తనువును తడిమి పలకరించిన వాన తుంపరనీ మనస్పూర్తిగా అస్వాదిస్తూ కాసేపు బయటే గడిపి మెల్లగా తిరిగి లోపలికి వచ్చాను.
లోపలికి వచ్చి ఫ్యాన్, టీవీ లాటి శబ్ధ కాలుష్య కారకాలన్నిటినీ ఆపేసి కిటికీ లు తలుపులు పూర్తిగా తెరచి బయట కురుస్తున్న వర్షాన్ని వింటూ ఆ సాయంత్రాన్ని ఆనందంగా గడిపాను. ఈసారి మీరూ ప్రయత్నించి చూడండి వర్షాన్ని వినడం ఎంత బాగుంటుందో... వాన ఉధృతిని పట్టి ఒకో రకమైన శబ్దం వస్తుంది. మొక్కలపై కురిసే చిరుజల్లులు ఒకలా వినిపిస్తే, కొబ్బరాకులపై కురిసే వాన మరొకలా వినిపిస్తుంది. మెత్తటి మట్టిపై నిశ్శబ్ధం గా కురిసే వాన అద్భుతమైన అద్వితీయమైన కమ్మటివాసనని అందిస్తే, రాళ్ళపై కురిసే వాన చేసే హడావిడి చప్పుళ్ళుకి అంతే లేదు, ఇక వడగళ్ళ వాన చేసే శబ్దం గురించైతే ఇంక చెప్పనే అక్కరలేదు. మీరెపుడైనా నది దగ్గర కానీ కాలవ దగ్గర కానీ ఉన్నపుడు వర్షపడటం చూశారా.. నీళ్ళపై పడే వాన పలికించే టప టప ల సంగీతం ఒక ఎత్తైతే అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న నీటిపై చినుకులు సృష్టించే వేల కొద్దీ అలలు ఒకదాని తో ఒకటి పోటీ పడుతూ, ఒకదానిలో ఒకటి కలిసి పోతూ కలిగించే అలజడి చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. ఇక సముద్రం పై వాన పడటం ఎపుడైనా విన్నారా / చూశారా... నేను వైజాగ్ యూనివర్సిటీ లో ఉన్నరోజులలో నాకు ఈ ఆనందం దక్కింది. అనంతమైన నీటి పై జోరు గా పడుతున్న వాన చినుకులు సృష్టించే హోరు ఇంతా అంతా కాదు, హడావిడిగా ఉండే బీచ్ నుండి కాస్త ప్రశాంతమైన చోటికి వెళ్ళి శ్రద్దగా వింటే ఒక చిత్రమైన హోరు తో కలిసిన లయబద్దమైన సంగీతాన్ని వింటున్నట్లే అనిపిస్తుంది.
సరే మొన్న ఒక్క సారిగా ఇంత వర్షాన్ని వినీ, ఆస్వాదించి, ఆనందించీ.. ఆహా వర్షాన్ని వినడం చాలా బాగుంది కదా.. ఓ టపా రాసేద్దాం వీలైతే ఈ సారి వర్షాన్ని రికార్డ్ కూడా చేసేద్దాం అని తీర్మానించుకున్నాను. అంతలో అసలు ఈ వీడియోలు యూట్యూబ్ లో ఇప్పటికే ఉండి ఉంటాయేమో అని వెతికితే వేలకొద్ది దొరికాయి. వాటిలో మొదట కన్పించి ఉరుముల అలజడి లేకుండా కేవలం వర్షాన్ని మాత్రమే రికార్డ్ చేసిన ఈ వీడియో నాకు బాగా నచ్చింది ప్రజంటేషన్ కూడా మంచి చిత్రాల తో తయారు చేశారు. సో అది మీ అందరి కోసం ఇక్కడ ఇస్తున్నాను. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ కురిసిన వర్షపాతాన్ని గమనిస్తే... మన భావి తరాల వారు ఇక వర్షాన్ని ఇలాటి వీడీయోల లోనే చూసుకోవలసిన పరిస్తితి వస్తుందేమో !!