అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

బుధవారం, జూన్ 19, 2013

ఓ నాలుగు సినిమాలు


ప్రేమకథాచిత్రమ్.. 

గిరి-నెల్లూరిగిరి-సప్తగిరి అంటూ పోస్టర్స్ లో కనిపించకుండా సినిమాలో మాత్రమే కనిపించిన సప్తగిరి ఒక చింపిరి విగ్గుతోనూ చిత్రవిచిత్రమైన డ్రస్సులతోనూ నెల్లూరి యాసతోనూ కడుపుబ్బ నవ్వించి మార్కులు కొట్టేసాడు. ఇతను ఇదివరకు పరుగులో కాస్త సీరియస్ పాత్రతో పరిచయమైనా తర్వాత కందిరీగ సినిమాలో చేసిన క్లిప్పింగ్ ఇక్కడ చూడండి అందులో కూడా గిరిగా బాగానవ్వించాడు. మారుతి గతచిత్రాలతో పోలిస్తే ఇందులో బూతుల మోతాదు బాగానే తగ్గించాడు ఐతే ఇది కూడా యూత్ లవ్ స్టోరీ పెద్దలకి మరియూ ఫామిలీ కథలను ఇష్టపడే వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. మొదటి సగం కొంచెం బోర్ కొట్టినా  సరదాగానే సాగుతుంది హార్రర్ తో కామెడీని మిక్స్ చేసి చేసిన ప్రయత్నం అభినందించదగినది. పెద్దకనుల హీరోఇన్ నందిత సినిమాకు బిగ్ ఎస్సెట్ అలాగే జెబి అందించిన నేపధ్య సంగీతం కూడా మూడ్ కి తగినట్లుంది. కళాఖండాలనదగిన సినిమాలని మాత్రమే చూడాలనే పట్టింపు లేకపోతే రెండుగంటల టైంపాస్ కోసం చూడదగిన సినిమా ప్రేమకథాచిత్రమ్.  మాన్ ఆఫ్ స్టీల్ (సూపర్ మాన్)

నేను సూపర్ మాన్ సినిమాలకి పెద్ద అభిమానినేమీ కాదు, చిన్నపుడెపుడో ఎన్టీఆర్ గారి సూపర్మాన్ సినిమాకి తీస్కెళితే అందులో నాకు నచ్చిన విషయం “శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ” అన్నపాటని చెప్పేవాడ్నట. కాకపోతే బాట్మన్ రూపు రేఖలని మార్చేసిన నోలన్ ప్రొడ్యూసర్ కావడం, రసెల్ క్రో ఉండటం, హెన్రీకావెల్ కూడా చూడ్డానికి బాగున్నాడనిపించడంతో సూపర్మాన్ అంటే పాంటేస్కుని డ్రాయరేస్కుంటాడనే డెఫినిషిన్ ని మార్చేసిన మాన్ ఆఫ్ స్టీల్ సినిమా కోసం థియేటర్ వరకూ వెళ్ళాను. సినిమాకి కాస్తకొత్తరీతిలో రూపురేఖలద్దడానికి చేసిన ప్రయత్నం కొంచెం పర్లేదనిపించినా రెండున్నరగంటల నిడివి బోర్ కొట్టించింది. త్రీడీ ఫార్మాట్ లో ఈ సినిమా చూడడం శుద్దదండగ మొత్తం ఒక పావుగంటకూడా ఎఫెక్ట్స్ లేవు. నేను చాలా సేపు గ్లాసెస్ తీసేసే చూశాను. ఇక సూపర్మాన్ చేసే ఫీట్స్ అన్నీ మన హీరోలు ఎడంచేత్తో అవలీలగా ఎన్నో వందల సార్లు చేసినవే కనుక పెద్దగా అప్పీలింగ్ గా అనిపించవు. పైగా హీరో విలన్లు ఇద్దరూ ఆ డౌన్టౌన్ బిల్డింగుల పైనబడి వాటిని కూల్చేస్తూ కొట్టుకుంటుంటే ఆ చిత్రీకరణ వెనుక రహస్యం (సిజి) తెలిసిన నాకు పెద్ద ఆసక్తిగా అనిపించలేదు. మొత్తంమీద పిల్లలు ఉంటే కాస్తా అక్కడక్కడ ఎంజాయ్ చేయచ్చేమో కానీ వీడియోగేంస్ కి పరిచయమైన పిల్లలు సైతం ఎంజాయ్ చేయలేకపోవచ్చు ఈ సూపర్మాన్ ని. 


పవిత్ర

జనార్ధనమహర్షి మంచి ఆదర్శంతో ఉన్నతమైన భావాలతో సినిమా తీస్తాడు కానీ సినిమాలో ఎక్కడో ఏదో లోపం ఉంటుంది అది బయటకి ఇది అని స్పష్టంగా కనపడదు కానీ ఆ వెలితిమాత్రం అలాగే ఉంటుంది. పవిత్రకూడా అలాంటి సినిమానే. సినిమాలో తాను చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, డైలాగులు కొన్ని బాగున్నాయ్. సినిమా లాజిక్ కి అందదు సినిమాటిక్ లిబర్టీస్ బాగా తీసుకున్నారు అటు పూర్తిగా ఆర్ట్ ఫిల్మ్ లాగా కాక ఇటు కమర్షియల్ ఫిల్మ్ లాగా కాక అక్కడక్కడ మితిమీరిన ఎక్స్పోజింగ్ తో కన్ఫూజింగ్ గా ఉంది. సాయికుమార్ నటన గురించి చెప్పక్కర్లేదు ఇలాంటి పాత్రలు అవలీలగా చేసేస్తాడు. రోజాకి ఒక మంచి పాత్రదొరికింది తను బాగా చేసింది శ్రేయకూడా బాగానే చేసింది కానీ కొన్ని చోట్ల అసహజంగా వేశ్యపాత్రకనుక ఇలాగే ఉండాలన్నట్లు మరీ తెచ్చిపెట్టుకున్న నటనలాగా అనిపించింది. ఇటువంటి ఆఫ్ బీట్ సినిమాలిష్టపడేవారు ఒకసారి చూసి వదిలేయదగిన సినిమా చూడకపోయినా మిస్ అయ్యేదేం లేదు.


సమ్ థింగ్ సమ్ థింగ్

సుందర్ సి. దర్శకత్వంలో వచ్చిన టిపికల్ కామెడీ మూవీ ఇది. ఆమధ్యవచ్చిన నేనే అంబాని, ఒకే ఒకే లాంటి డబ్బింగ్ సినిమాల తరహాలోనే సరదాగా సాగిపోయే ఫామిలీ కామెడీ డ్రామా. పోస్టర్ లో కనిపించినట్లే సినిమా అంతటిని బ్రహ్మానందం ముందుండి నడిపించాడు. రెండుగంటల టైంపాస్ కోసం హాప్పీగా చూసేయచ్చు, మధ్యలో పాటలు మాత్రం స్పీడ్ బ్రేకర్స్ ఆ టైంలో హాయిగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో అప్డేట్స్ చూస్కుంటూ గడిపేసి సినిమా ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. సిద్దార్ధ్ కొంచెం వయసుమీదపడినట్లు కనిపించాడు, కాస్ట్యూంస్ లో తమిళ వాసనలు కనిపిస్తాయీ, అలాగే అక్కడక్కడ కామెడీలోకూడా కనిపిస్తాయి. అయితే సినిమా అంతా ఒక అమ్మాయిని ఎలా ప్రేమలో పడేయాలనే ప్రయత్నాలతో సాగే సినిమా కనుక పిల్లలతో కలిసి చూడడం కాస్త అసౌకర్యంగా అనిపించచ్చు. నేను మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేశానీ సినిమాని.

సో అవీ గత రెండు వారాలలో విడుదలైన సినిమాల కబుర్లు. ఓ కుర్రాళ్ళ సినిమా, ఓ పిల్లల సినిమా ఓ పెద్దల సినిమా ఓ ఫామిలీ సినిమా అని కేటగరైజ్ చేయచ్చేమో. ఇక ఈ వారం విడుదలకు సిద్దంగా ఉన్న తొలి తెలుగు కామెడీ త్రీడీ చిత్రం “యాక్షన్ త్రీడీ” కోసం ఎదురు చూస్తున్నాను అది విడుదలయ్యాక ఆ కబుర్లతో మళ్ళీ కలుస్తా.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.