అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శనివారం, సెప్టెంబర్ 11, 2010

పండుగల శుభాకాంక్షలు

మిత్రులందరికీ వినాయక చవితి మరియూ రంజాన్ శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయురారోగ్యఐశ్వర్యాలతో సదాకాపాడుగాక. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో ఊరంతా పండుగ వాతావరణం, ఎక్కడచూసినా కొత్తబట్టల రెపరెపలు బంధుమిత్రుల కోలాహలం చూడటానికి కనులకింపుగా చాలా బాగుంది. ఇదివరకు పండుగ రోజు బయటకి వెళ్తే కొన్ని వీధులు కళకళలాడుతూ కొన్ని వెలవెల బోతూ కనిపించేవి కానీ ఈ రోజు చాలా చోట్ల సందడే. ఈ రెండు పండుగలతోనూ నెలవంక ముడిపడి ఉండటం ఇంకో విశేషం, కాకపోతే ఒకరు నెలవంకని చూడద్దంటే ఇంకొకరు చూశాకే పండుగ చేసుకొమ్మంటారు అది వేరే విషయం అనుకోండి.

పోయినేడు అనుకుంటాను వినాయకచవితి రోజు ఏదో పనిమీద సాయంత్రం ఆఫీస్ కి వెళ్ళి కాస్త ఆలశ్యంగా తిరిగి వస్తూ ఓ ముస్లిం సోదరుని ఆటో ఎక్కాను. అతను నేను రోజూ వెళ్ళే దార్లో కాకుండా కాస్త జనసమ్మర్ధం ఉండే చుట్టూ తిరిగి వెళ్ళే దారిలో తీసుకుని వెళ్తున్నాడు. "ఏంటి సోదరా ఈ రూట్ ఎంచుకున్నావ్?" అని అడిగితే "ఈ రోజు వినాయక చవితి కదా భయ్యా అసలే ఆ రూట్ నిర్మానుష్యంగా ఉంటుంది నేను ఒక్కడ్నే దొరికితే ఇక అంతే" అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను "ఛా ఊరుకోవోయ్ మనం బెంగళూరులో ఉన్నాం ఇక్కడ అలాంటి గొడవలు ఎప్పుడూ చూడలేదు ఉండవేమో కదా" అని అంటే అతను "లేదు సార్ ఈ ఏరియా విలేజే  కదా ఇక్కడ వినాయకచవితి రోజు రాత్రికి ముస్లింల మీద రంజాన్ రోజు రాత్రి హిందువుల మీద దాడి చేస్తారు, మామూలు వాళ్ళకి ఏం ఉండదు కొందరు రౌడీ బ్యాచ్ ఉంటారు వాళ్ళు మందుకొట్టి వచ్చి ఎవడన్నా ఒంటరిగా దొరికితే పండగ చేసుకుంటూ ఉంటారు" అని చెప్పాడు. నేను ఔరా అనుకుని అతను క్షేమంగా ఇల్లు చేరాక ఒక మిస్ కాల్ ఇవ్వమని చెప్పి నా ఇంటికి చేరుకున్నాను. బహుశా ఈ ఏడు రెండు పండగలు ఒకే రోజు రావడం వల్ల ఎవరికి వారు పండుగ చేసుకుని ఎదుటి వాళ్ళు కూడ మంచి జోష్ మీదుంటారులే అని గొడవలు లేకుండా కామ్ గా ఉండవచ్చు అనుకుంటున్నాను.
కానీ ఈ రెండు పండుగలు ఒకే రోజు రావడం వల్ల ఒక చిన్న నష్టం కూడా ఉంది, అదేంటో చెప్తా కానీ వీడు తిండి గోల ఎత్తకుండా ఏ టపా ముగించడు కదా అని నన్ను తిట్టకండేం. నిజానికి ఈ రెండు పండుగలలో కూడా తిండికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా. చిన్నతనంలో ఎప్పుడూ మా ఇంటి ఎదురుగానో లేక దగ్గరలోనో తప్పని సరిగా ఒక ముస్లిం కుటుంబంతో మాకు అనుభందం ఉండేది. నర్సరావుపేటలో ఉన్నపుడు భాషా వాళ్ళు మా ఎదురింట్లోనే ఉండేవాళ్ళు రంజాన్ రోజు వాళ్ళు సేమ్యా పాయసం బిర్యానీ మరికొన్ని వంటకాలు మా ఇంటికి పంపిస్తే వినాయక చవితి రోజు గారెలు పులిహోర, పొంగలి, పూర్ణాలు, ఉండ్రాళ్ళు ఇత్యాది వంటలు వాళ్ళకు పంపించే వాళ్ళం. ఇలా ఒకే రోజు రావడం వల్ల మనకు నాన్వెజ్ బిర్యానీ టేస్ట్ చేసే అవకాశం ఉండదు కదామరి పాయసంతోనే సరిపెట్టుకోవాలి.

ఇంక ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళే అలవాటు ఉన్నవారు అయితే ఈ ఏడు బహుశా ఆ అలవాటు వాయిదా వేసుకోవలసిందే. కావాలంటే లంచ్ ఒకచోట డిన్నర్ ఒకచోట కానిచ్చేయచ్చనుకోండి. నాకు వాళ్ళింటి బిర్యానీ కానీ పాయసం కానీ ప్రత్యేకమైన రుచితో ఉండి చాలా నచ్చేవి. నాకు చిన్నప్పటినుండీ సగ్గుబియ్యంతో చేసే పాయసం చాలా ఇష్టం, గ్లాసులు గ్లాసులు నిర్మొహమాటంగా తాగేస్తాను సేమ్యాఖీర్ అంతగా ఇష్టం ఉండదు. కానీ అదేంటో వాళ్ళు ఇచ్చే ఖీర్ లో సగ్గుబియ్యం లేకపోయినా ఒక ప్రత్యేకమైన రుచితో చాలా బాగుండేది. ఇంకెక్కడ ఎన్ని చోట్ల తాగినా ఆ రుచి ఎక్కడా తగలలేదు. ఇదేమాట భాషా వాళ్ళ అమ్మగారితో అంటే ఈ సేమ్యా ఈద్ కోసం ప్రత్యేకంగా చేతి మిషన్ తో తయారు చేస్తారు అందుకేనేమో బహుశా ఆరుచి అని నవ్వేసేవారు.

మరోసారి మిత్రులందరికీ వినాయక చవితి మరియూ రంజాన్ శుభాకాంక్షలు.

టపా చదివిన ఓ స్నేహితుడు ఇప్పుడే చిన్న అనుమానం లేవనెత్తాడు. అతని సందేహం ’పండగ’ కరెక్టా ’పండుగ’ కరెక్టా అలాగే ’మిత్రులు’ కరెక్టా లేక ’మితృలు’ కరెక్టా. గూగులమ్మని అడిగితే రెండు వాడుకలకు పుట్టెడు ఉదాహరణలు చూపించింది. సో నాకు ఎలా వాడినా కరెక్టేనేమో అనిపించింది మీరేమంటారు ?

ఫోటోలు ఇక్కడ మరియూ ఇక్కడ నుండి సంగ్రహించబడినవి వారికి ధన్యవాదములు. 

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.