అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శనివారం, ఏప్రిల్ 17, 2021

భయపడి జాగ్రత్తపడదాం...

అప్పట్లో ఓ సినిమా కోసం "భయపడడం లోనే పడడం ఉంది మనం భయపడద్దు" అని త్రివిక్రమ్ గారు రాశారు కానీ అది ఆ సందర్భానికి మాత్రమే సూటవుతుంది. అలా అంటే జాగ్రత్తపడడంలో కూడా పడడం ఉందని వదిలేయలేం కదా. అందుకే భయపడి జాగ్రత్తపడదాం డూడ్ దాని వలన పోయేదేం లేక పోగా మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సహా ఆరోగ్యంగా ఉంటాం.  

కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది పత్రికల భాషలో చెప్పాలంటే కోరలు చాచి ప్రజలపై విరుచుకు పడుతుంది. పరిస్థితి ఆల్రెడీ మన చేతుల్లోనుండి జారిపోయేలా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ జారిపోయింది. ఇపుడు మనం చేయగలిగిందల్లా జాగ్రత్తపడడమే. 

గత సంవత్సరం ఇదే సమయానికి లాక్ డౌన్ లో ఎంత అప్రమత్తంగా ఉన్నామో ఇపుడూ స్వచ్ఛందంగా అలా జాగ్రత్తలు తీస్కోవాల్సిన సమయం ఇది. నిజానికి అంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఇంటికి తెచ్చుకునే ప్రతీదీ శానిటైజ్ చేస్తూ రూల్స్ పాటిద్దాం. స్వచ్ఛందంగా లాక్ డౌన్ సెల్ఫ్ ఐసోలేషన్ పాటిద్దాం. 

పండగలు పబ్బాలు ప్రతిఏడాదీ వస్తాయి. మల్లెపూలైనా, పనసతొనలైనా, మామిడి పళ్ళైనా, తాటి ముంజలైనా ప్రతీ వేసవి కాలంలోనూ వచ్చేవే మనిషి ప్రాణంకన్నా ఇవేవీ విలువైనవి కావు. ముందు బ్రతికుంటే మళ్ళా మళ్ళా ప్రతి ఏడూ ఎంజాయ్ చేయచ్చు కనుక మిత్రులందరూ జాగ్రత్తగా ఉండండి. 

ఆ వచ్చాక మందులేస్కోవచ్చు అనో మనకేంటీ డబ్బులున్నాయ్ ఇన్సూరెన్స్ లు ఉన్నాయ్ ఎలాగో ట్రీట్మెంట్ తీస్కోవచ్చు అనో నిర్లక్ష్యం చేయద్దు. అందరం అప్రమత్తంగా ఉండి అసలు ఆ అవసరం రానివ్వకుండా జాగ్రత్త పడి మెడికల్ సిస్టం మీద లోడ్ తగ్గిద్దాం. ఇప్పటికే చాలా హాస్పిటల్స్ లో బెడ్స్ కరువై ట్రీట్మెంట్ కరువై ఏం చేయాలో అర్ధం కాని పరిస్తితుల్లో ఉన్నవారి హృదయవిదారక కథలు వింటూనే ఉన్నాం. ముందు జాగ్రత్త ఒకటే దీనిని కట్టడి చేయడం లేదా నివారించగలిగే మార్గం. 

అలాగే "వ్యాక్సీన్ వచ్చింది కదా ఇంకెక్కడి కరోనా" అనే మాటలని ఎవరు చెప్పినా నమ్మకండి. మనకి దొరికింది వ్యాక్సీన్ మాత్రమే అతీంద్రియ శక్తుల మంత్రదండం కాదు. ఇది ఓ తాత్కాలిక ఉపశమనం మాత్రమె అది వేయించుకున్నా కొన్ని సార్లు మనకీ రావచ్చు లేదా వైరస్ వాహకాలుగా వ్యవహరించి మనింట్లోనే మనకి తెలియకుండా మనం మన ఆత్మీయులకి ఇతరులకి అంటిస్తూ ఉండచ్చు. 

కనుక అప్రమత్తంగా ఉంటూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, అనవసరంగా చేసే విహారాలని అరికడుతూ, శానిటైజేషన్ అండ్ శుభ్రతని నూటికి రెండొందల శాతం పాటిస్తూ కరోనా వ్యప్తిని అరికడదాం. దిస్ టూ షల్ పాస్. ఓపిక గా ఎదురు చూద్దాం.

సెకండ్ వేవ్ సిప్టమ్స్ అంటూ కొన్ని లక్షణాలు అదనంగా సర్క్యులేట్ అవుతున్నాయి. వీటి అథెంటిసిటీ గురించి నాకు తెలియదు కానీ అప్రమత్తంగా ఉండడం మంచిదే. ఆ వివరాలు టైంస్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ లో ఇక్కడ క్లిక్ చేసి చూడండి. వీటిలో కొన్ని కళ్ళు పింక్ కలర్ కి మారడం, ఊపిరాడకపోవడం, స్టమక్ అప్సెట్, మానసిక అస్థిరత, గుండె వేగంగా కొట్తుకోవడం లాంటివి ఉన్నాయ్.  

కరోనా గురించి పొయినేడాది నేను పంచుకున్న సమగ్రమైన సమాచారం ఈ పోస్ట్ లో ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి చూడవచ్చు.

గురువారం, ఏప్రిల్ 15, 2021

వకీల్ సాబ్ - డైలాగ్స్...

పవన్ కళ్యాణ్ పవర్ పాక్డ్ పెర్ఫార్మెన్స్ తో బ్లాక్ బస్టర్ గా నడుస్తున్న తన కొత్త సినిమా వకీల్ సాబ్ ఈ పాటికే అందరూ చూసే ఉంటారు. లేకుంటే కనుక చూసేయండి. ఈ సినిమా గురించి నా అభిప్రాయం ఇక్కడ చదవవచ్చు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతి కోసం, మహిళల పట్ల దృక్పధాన్ని సరిదిద్దుకోవడం కోసం ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిన సినిమా వకీల్ సాబ్. 

ఈ సినిమా విడుదలై విజయవంతంగా నడుస్తూ వారం గడిచింది కనుక స్పాయిలర్స్ అయినా నాకు నచ్చిన కొన్ని సంభాషణలు ఇక్కడ పొందు పరుస్తున్నాను. ఇంకా సినిమా చూడని వారు దయచేసి సినిమా చూసిన తర్వాత చదవగలరు. 

"రాముడు అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా ఆనందంగానే ఉంటాడు. కానీ చూడ్డానికి భక్తుల మనసుకే కష్టంగా ఉంటుంది."

"అడుక్కుంటే అన్నం దొరుకుతుంది కష్టపడితే నీడ దొరుకుతుంది కానీ ఏం చేసినా సామాన్యులకి న్యాయం మాత్రం దొరకడం లేదు."

"కాళ్ళ క్రింద యాక్సిలేటర్ ఉంది కదా అని తొక్కితే రూల్సే కాదు బోన్స్ కూడా బ్రేక్ అవుతాయి."  

"ఆడవాళ్ళు మనకు ఆనందాన్ని మాత్రమే ఇవ్వాలి, హక్కుల గురించి అడిగితే.. ఇలా బోన్ లో నిలబెట్టి వేశ్య అని ముద్ర వేస్తాం. ఇదేం న్యాయం ?"

"ఆడది అంటే వాడి బాత్ రూం గోడమీద బొమ్మ కాదు వాడిని కనిపెంచిన అమ్మ కూడా." 

"చీడ పురుగులు మగవాళ్ళ తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడితే ఎలా." 

"ఓటమి అంటే అవమానం కాదు, మనల్ని మనం తెలుసుకునే గొప్ప అవకాశం." 

"మద్యం తాగడం హానికరం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మగవాళ్ళు తాగితే పడిపోతారు ఆడవాళ్ళు తాగితే పడుకుంటారు అనుకోవద్దు." 

"ఒక మనిషికి ఉన్న అలవాట్లను బట్టి క్యారెక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తాం." 

"మన ఇంట్లో ఉండే గడియారంలో చిన్న ముల్లు కూడా అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది." 

"రాత్రి పూట ఓ అమ్మాయి ఒంటరిగా వెళ్తే బైకులూ, కార్లు ఆటోలు అన్నీ స్లోడౌన్ అవుతాయ్. సైడ్ విండోలు కిందకి దిగుతాయ్, జిరాఫీల్లా తలలు పొడుచుకొస్తాయి.. చూపులు సూదులవుతాయి.." 

"అబ్బాయిలు బయటకొస్తే సరదా.. అమ్మాయిలు బయటకొస్తే మాత్రం తేడా!"

"అమ్మాయిలు మనస్ఫూర్తిగా అబ్బాయితో నవ్వుతూ మాట్లడకూడదు, మాట్లాడేప్పుడు అసలు టచ్ చేయకూడదు, హింట్ ఇచ్చేసింది సిగ్నల్ ఇస్తుంది అని ఫీలైపోతారు. ఇదేం న్యాయం." 

"అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యునికేషన్ ఆడబిడ్డలు నవ్వుతూ మాట్లాడితే కొంపలు కూల్చే క్యారెక్టర్."

"నవ్వడమనే ఒక సహజ ప్రవర్తన కూడా ఒక అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది బరితెగించిన క్యారెక్టర్ అని ముద్ర వేస్తుంది."  

"అమ్మాయి ఒంటరిగా అబ్బాయిలతో ఎక్కడికీ వెళ్ళకూడదు, వెళ్తే దేనికైనా రెడీ అని ఊహించుకుంటారు, తనని ఆ అబ్బాయి ముట్టుకోడానికి, పట్టుకోడానికి బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేసింది అని ఫిక్సయిపోతారు."  

"అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికీ లేదు. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బోయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా ఏ మగాడైనా." 

"ఆశతో ఉన్నోడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది." 

"నిజం ఎప్పుడూ ఒంటరిదే కానీ దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే." 

"నువ్వు గెలుపుకోసం వచ్చావు.. నేను న్యాయం కోసం వచ్చాను. నీది స్వార్ధం నాది ధర్మం." 

"వాళ్ళు సామాన్యులు నీలాంటోడు పెడతా అంటే ఆశపడ్తారు బెదిరిస్తే భయపడతారు. ఆశకీ భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి." 

"కోర్టులో వాదించడమూ తెలుసు. కోటు తీసి కొట్టడమూ తెలుసు." 

"జనం కోసమే ప్రాణం ఇచ్చేవాడు. తనే ప్రాణం అనుకుని వచ్చిన దాన్ని నన్నింక ఎంత బాగా చూసుకుంటాడు."

"బలహీనంగా ఉన్నదాని గురించి బలంగా నిలబడతాడు. తనకి ఏది ఉందో అందరికీ అదే ఉండాలి అనుకుంటాడు." 

"ఆయన ఒక మాటన్నాడంటే దానికో విలువుంటుంది. ఏదన్నా జేసిండంటే అందరికీ ఉపయోగం ఉంటది." 

"ఒకప్పుడు ఊళ్ళకోసం రోడ్లేసేటోళ్ళు ఇపుడు రోడ్లకోసం ఊళ్ళే ఖాళీ చేయిస్తున్నారు." 

"మనిషి బతికేది ఆశతో.. ఆ ఆశే సచ్చినాక మనిషికి చావే సుఖమనిపిస్తుంది." 

"ఆవేశంతో చేస్తే కొందరికే న్యాయం చేయగలం అదే ఆలోచనతో చేస్తే అందరికీ న్యాయం చేయగలం."

"మీరు జనం కోసం చాలా కోల్పోయారు. కానీ మీరు దూరమై జనాలు జీవితాల్నే కోల్పోతున్నారు, మీ మౌనం సమాన్యులకు శాపం కాకూడదు."   

"ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నాలో ఆవేశం తగ్గదు ఆశయం మారదు. నల్లకోటు వేస్కున్నానంటే వేస్కోటనికి పిటీషన్లు తీస్కోటానికి బెయిళ్ళు ఉండవు."

శనివారం, ఏప్రిల్ 10, 2021

వకీల్ సాబ్...

ఈ పోస్ట్ ని నా స్వరంలో ఈ యూట్యూబ్ వీడియోగా ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link

పింక్ మంచి సినిమా అనేది నో డౌట్. టు ది పాయింట్ ఎక్కడా డీవియేట్ అవకుండా అమితాబ్ చక్కని "సపోర్టింగ్" రోల్ తో తాను చెప్పాలనుకున్న సందేశాన్ని సూటిగా ప్రేక్షకుల మనసుల్లో నాటుతారు. ఐతే పింక్ పూర్తిగా మల్టీప్లెక్స్ సినిమా. క్రిటికల్ అప్లాజ్ వచ్చినా, హిట్టయినా ఆ సినిమా ఎంతమంది తెలుగు ప్రేక్షకులు చూశారూ అనేది నాకు సందేహమే. 

ఒక వేళ చూసినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎలీట్/మల్టీప్లెక్స్ క్రౌడ్ మాత్రమే చూసుంటారు. అలాంటి కథకు కొంత మాస్ అప్పీల్ యాడ్ చేసి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నటుడితో తీస్తే మరింతమంది యువతకి ఈ సందేశం చేరువయ్యే అవకాశం ఉంది. అలాంటి ఓ చక్కని షుగర్ కోటెడ్ పిల్ నిన్న విడుదలైన వకీల్ సాబ్. ఈ పిల్ ప్రస్తుత యువతకి చాలా అవసరం. 

దిల్ రాజు లాంటి నిర్మాత దగ్గర రచయితలకు, దర్శకులకూ కొదవ లేదు. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఓ కొత్త కథ రాసుకుని చేసినా ఇదే రెంజ్ లోనో ఇంతకు మించో కలెక్షన్స్ వస్తాయి నో డౌట్. కానీ ఈ కథ చెప్పాలి అదీ పవర్ స్టార్ లాంటి యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో ద్వారా చెప్తే ఈ మెసేజ్ ఎక్కువ మందికి బలంగా రీచ్ అవుతుంది అని నమ్మి సినిమా తీయడం మెచ్చుకోవలసిన విషయం. 

ముఖ్యంగా యువతలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ ద్వారా "ఎవరైనా సరే ఓ అమ్మాయి నన్ను తాకొద్దు అంటే తాకవద్దు అని అంతే.. అందులో ఏవిధమైన డిస్కషన్స్ కి తావులేదు.." అని స్పష్టంగా చెప్పించడం చాలా బాగుంది. అలాగే ఒకవేళ అవాంఛనీయమైన సంఘటన జరిగినా పారిపోవద్దు, దాక్కోవద్దు, పోరాడు, ఎదురు తిరుగు అని అమ్మాయిలకి చెప్పడం ఇంకా బావుంది. తనని ఫాలో అయ్యే యువత ఈ విషయం అర్ధం చేసుకుని ఆచరణలో పెడితే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో మహిళల భద్రత మరింత పెరుగుతుంది. 

ఇక ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకోసం చేసిన మార్పులు చాలా బాలెన్స్డ్ గా చక్కగా చేశారనిపించింది నాకు. ఐటమ్ సాంగ్స్, వెకిలి కామెడీ, తాగుబోతు సిట్టింగులు లాంటి ఎలిమెంట్స్ జోలికి పోలేదు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరమీద చూసుకోబోతున్న తమ హీరోని ఖచ్చితంగా కాస్త ఎక్కువ సేపు చూడాలని కోరుకుంటారు తన ఫాన్స్. దానికి తగినట్లే ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా పవన్ కి కొన్ని సీన్స్ ని కలిపారు తప్ప అసలు కథను ఏమాత్రం చెడగొట్టలేదు. ఆ కలిపిన సీన్స్ ఏ పర్పస్ తో కలిపారో దాన్ని నూటికి నూరుపాళ్ళు నెరవేర్చాయి. సినిమాలో ప్రతి పావుగంటకీ ఓ సారి వచ్చే ఇలాంటి సీన్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించి ఎంటర్టైన్ చేస్తాయి. 

పింక్ చూడని వాళ్ళకోసం కథ టూకీగా చెప్పాలంటే. ఇంటికి దూరంగా ఓ అపార్ట్మెంట్ లో ఉంటూ పని చేస్కుంటున్న ముగ్గురు అమ్మాయిలు ఓ రాత్రి క్యాబ్ లో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా అది చెడిపోతుంది.  కార్ డ్రైవర్ తో ఎక్కువ సేపు అక్కడ ఉండడం సేఫ్ కాదని వేరే క్యాబ్స్ ఏమీ దొరకకపోవడంతో దారిలో వెళ్తున్న ఓ కారుని లిఫ్ట్ కోసం ఆపుతారు. అందులో వీళ్ళకి పరిచయమున్న ఓ ఫ్రెండ్ కూడా ఉండడంతో ఆ కార్ లో వారితో పాటు వెళ్తారు. ఆ కారులో ఓ ఎం.పి. కొడుకు విశ్వ కూడా ఉంటాడు. కట్ చేస్తే విశ్వ తల పగిలి హాస్పటల్ లో చేరతాడు. తర్వాత అతను పల్లవి పై అటెంప్ట్ టు మర్డర్ కేస్ పెడతాడు. 

పల్లవి వాళ్ళుంటున్న ఇంటికి దగ్గరలో ఓ తాగుబోతు లాయర్ సత్యదేవ్(పవన్) ఉంటాడు. కోర్ట్ లో జడ్జ్ ఎదురుగానే ఒకరిపై దాడి చేసి బార్ కౌన్సిల్ తో నాలుగేళ్ళ పాటు సస్పెండ్ కాబడిన ఈ లాయర్ సస్పెన్షన్ ముగిసినా నేనే కోర్టుని సస్పెండ్ చేశానని చెప్తూ తిరిగి కోర్ట్ మెట్లెక్కకుండా మత్తులో మునిగి తేలుతుంటాడు. ఓపెన్ అండ్ షట్ కేస్ లాగ ఉన్న ఈ కేస్ నుండి పల్లవి అండ్ కో ని వకీల్ సాబ్ గా పిలవబడే ఈ లాయర్ సత్యదేవ్(పవన్) ఎలా కాపాడాడు, అసలు ఆ రిసార్ట్ లో ఆ రాత్రి ఏం జరిగింది అనేదే మిగిలిన కథ.    

తమ తప్పులేకుండా ఊహించని విధంగా ఆపదలో చిక్కుకున్న ముగ్గురు అమ్మాయిలుగా నివేథా, అంజలి, అనన్య ముగ్గురూ బాగా చేశారు మొదటి ఇద్దరికి కాస్తె ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడంతో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా కనపడింది. చాన్నాళ్ళ తర్వాత శరత్ బాబు గారిని చూడ్డం బావుంది. అలాగే జడ్జ్ గా చేసిన సినిమాటోగ్రాఫర్ మీర్ కూడా గుర్తుండి పోతారు. ప్రాసిక్యూటర్ గా ప్రకాష్ రాజ్ పవన్ కు సమ ఉజ్జీగా నిలిచారు. పవన్ తన యూజువల్ మానరిజమ్స్ ని పక్కన పెట్టి ఒక లాయర్ గా చాలా హుందాగా నటించాడు. తన పెర్ఫార్మెన్స్ పవర్ ఫుల్ గా కూడా చాలా బావుందీ సినిమాలో. తన పద్దతికి భిన్నంగా ఓ లాయర్ గా డిగ్నిఫైడ్ గా నటించాడు అక్కడే వకీల్ సాబ్ ఎక్కువ మార్కులు కొట్టేశాడు.  

సినిమా మొదటి సగం కాస్త నెమ్మదిగా నడిచినట్లు అనిపించినా రెండో సగం మాత్రం అద్యంతం గ్రిప్పింగ్ గా నడిచింది. కోర్ట్ రూం డ్రామాలు ఇంత ఎంగేజింగ్ గా నడపడం కష్టమైన పనే దాన్ని సులువుగా చేసేశారు దర్శకులు వేణూశ్రీరాం. ఐతే కోర్ట్ లో ఇంత ఆవేశాన్ని చూపించడం వాస్తవ దూరమనిపిస్తుంది కానీ పవర్ ఫుల్ సీన్స్ కోసం ఆ మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీస్కోడం ఓకే అనిపిస్తుంది. ఇక తిరు తో కలిసి వేణుశ్రీరాం రాసుకున్న సంభాషణలు చాలా  బావున్నాయి కొన్ని హృదయాన్ని తాకి గుర్తుండి పోతాయి. ఒకటీ అరా పవన్ పొలిటికల్ మైలేజ్ కి ఉపయోగపడేలాంటి మాటలున్నా అవి ఎదుటివారిపై విమర్శలు కాకుండా తనని ఎలివేట్ చేసేవే రాసుకోవడం బావుంది. ఆ కొన్ని కూడా సినిమా కథలో కలిసిపోతూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ కు మాత్రమే అర్ధమయేలా ఉన్నాయ్. 

టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా చెప్పుకోవలసింది థమన్ నేపధ్య సంగీతం గురించి. సినిమాకి టెక్నీషియన్ గా కన్నా ఓ పవన్ అభిమానిగానే పనిచేశాడనిపించింది. ఫైట్స్ ని కూడా తన మ్యూజిక్ తో ఎలివేట్ చేయగలిగాడు, ఇక కోర్ట్ సీన్స్ గురించైతే చెప్పక్కర్లేదు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బావుంది కోర్ట్ రూం లో ఆసక్తికరంగా తీయడం ఛాలెంజ్ అనే చెప్పాలి, దాన్ని విజయవంతంగా సాధించారు. నిర్మాణ విలువలు బావున్నాయ్. 
   
ఓవరాల్ గా వకీల్ సాబ్ పవన్ ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ మూవీ అనిపిస్తుంది, తమ హీరోని ఎలా ఐతే చూడాలని అనుకుంటారో అలా కనులపండగగా చూస్కోవచ్చు వెండి తెరపై. పింక్ సినిమా చూడని సగటు ప్రేక్షకులకి మంచి కథ ఉన్న సినిమా చూశామనిపిస్తుంది. ఇక పింక్ సినిమా వీరాభిమానులకి మాత్రం అమితాబ్ పాత్రని మార్చేశారని కోపం రావచ్చు. 

ఏదేమైనా తెలుగులో ఓ స్టార్ హీరో ఇలా కథాబలం ప్లస్ మంచి సందేశం ఉన్న సినిమా చేయడం అభినందించ వలసిన విషయం అండ్ ప్రతి ఒక్కరూ కూడా చూసి ప్రోత్సహించవలసిన విషయం. ఈ కాలం యువతకి ముఖ్యంగా ప్రతి అబ్బాయికీ చూపించాల్సిన సిన్మా ఇది,  మహిళల పట్ల అబ్బాయిల దృక్పధాన్ని మార్చే సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాలో నాకు నచ్చిన సంభాషణలు మరో పోస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.

ఈ సినిమాలోని కథని, దర్శకుడు చర్చించిన పాయింట్స్ నీ మరింత విపులంగా వివరిస్తూ బిబిసి తెలుగు కోసం సౌమ్య ఆలమూరు రాసిన రివ్యూ నాకు బాగా నచ్చింది మీరూ ఇక్కడ చదవవచ్చు. కొన్ని స్పాయిలర్స్ ఉండచ్చు ప్రిపేర్ అయి చదవండి. 

శుక్రవారం, జనవరి 22, 2021

అమ్మా అమ్మమ్మగారిల్లు...

ఈ పోస్ట్ ని నా స్వరంలో ఈ యూట్యూబ్ వీడియోగా ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link

అమ్మమ్మగారిల్లు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కారెంపూడి. మా తాత గారు ఉండేది అందులోని NSP ఇరిగేషన్ కాలనీ లో అది ఊరికి కొంచెం దూరం లో చివరగా కాలవకి కొంచెం దగ్గర గా ఉండేది. కారెంపూడి వరకూ ఉండే బస్సు లు కొన్ని ప్రత్యేకం గా కాలనీ వరకు వెళ్ళేవి, కొన్ని మాత్రం బస్టాండ్ లోనే ఆపేసే వారు. కాలనీకి వెళ్ళే బస్సు లో ప్రయాణం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఊరు సందులు దాటిన తర్వాత రోడ్డుకి రెండు వైపులా పచ్చని చెట్లతో నల్లని తారు రోడ్డు ఆహ్వానం పలుకుతుంది.

నాకు ఆ రోడ్డు చాలా ఇష్టం కనుచూపు మేరా నల్లని పొడవైన రోడ్డు దానికి రెండు వైపులా అన్ని కాలాలలో పచ్చదనం నిండి ఉండే చెట్లు కొన్ని సార్లు పువ్వులు బాగా పూచె కాలం లో ఐతే చెట్టునుండి రాలి కింద పడిన ఎర్రని పువ్వులతో నల్లని రోడ్డు కి రెండు వైపులా ఎర్రని తివాచీ పరిచినట్లు చాలా అందం గా ఉండేది. ఆ చెట్ల పువ్వులలోపలి కాడలతో మేము పిల్లలం అందరం కోడి పందాలు ఆడేవాళ్ళం. వాటిలో గెలిస్తే ఎంత సంబరంగా ఉండేదో బహుశా ఇప్పుడు నిజం కోడి పందాలు గెలిచినా అంత ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం కాదేమో :-)

అలా బస్ అంత అందమైన రోడ్ లో ఒక ఐదు నిముషాలు ప్రయాణించాక మా కాలనీ వస్తుంది. రోడ్ మీద ఒక పక్క చిన్న కాఫీ హోటలు దాని పక్కన ఒక కిళ్ళీ బంకు ఉంటే మరో పక్కన కాలనీ లోపలకి వెళ్ళే దారి ఉండేది. రోడ్ ని ఆనుకుని దారి మొదటిలో అటు ఇటు కూర్చోడానికి అరుగు లు లాగా కట్టి ఉండేవి. కారెంపుడి వరకే వచ్చే బస్సులు ఇక్కడ నుండి కాలనీ లోపలకి వెళ్ళే రోడ్ లొ అలా లోపలకి చివర దాకా వెళ్ళి కాలనీ హాస్పిటల్ దగ్గర ఒక రౌండ్ యూ టర్న్ కొట్టి మళ్ళీ వెనక్కి ఊర్లోకి వెళ్ళేవి.

అమ్మమ్మ గారి ఇంటి బయట నుంచుంటే ఇలా యూ టర్న్ కోసం వచ్చిన బస్ కనిపించేది, అప్పట్లో నాకు బస్సే పెద్ద వింతైతే ఇలా ఇంటి ముందుకి రావడం మరొక పెద్ద వింత :-) అంతే కాకుండా ఎవరైనా ఊరికి బయల్దేరే సమయం లో పిల్లల్లో ఒకళ్ళని ఇంటి బయట కాపలా పెట్టి బస్ రాగానే చెప్పమనే వాళ్ళు. అంటే అలా టర్న్ తీసుకుని వెళ్ళీ కాఫీ టిఫిన్ కోసం ఆపే వాళ్ళనమాట, దాంతో మేము తీరికగా వెళ్ళడానికి కొంచెం టైముండేది. 

నాకు మా కాలనీ అంటే చాలా ఇష్టం అన్ని ఇళ్ళు ఇంచుమించు ఒకేలా ఉండేవి, ఒకటే ప్లాన్, ప్రతీ ఇంటి ముందూ బోలెడు ఖాళీ స్థలం దాని తర్వాత చిన్న రోడ్ అది దాట గానే గడ్డి వాము దడి. దాదాపు ప్రతి ఇంట్లో పాడి పశువులు ఉండేవి. ఉదయాన్నే తెల తెల వారుతుండగా లేచి, నిలబెట్టిన మంచం పట్టె మీద తల ఆన్చి నించుని, నిద్ర కళ్ళతో, మత్తుగా అలా ఉండి, లయబద్దం గా వినపడుతున్న పాలు పితికే శబ్దాన్ని, పచ్చి పాల మీద నుండి వచ్చే ఒక రకమైన కమ్మటి వాసనని ఆస్వాదిస్తూ ఉంటే ఎంత బావుండేదో... వర్ణించడానికి మాటలు రావడం లేదు.

ఒకో రోజు ఆఫీసరు గారింట్లో పాలు పోసి రావడానికి నేను కూడా వెళ్ళే వాడ్ని. ఇంకా పూర్తి గా నిద్ర లేవని వీధులలో చుట్టూ పచ్చని చెట్ల మధ్య అమ్మ చేయి పట్టుకుని, మా స్కూల్ కబుర్లు చెప్తూ నడుస్తూ ఉంటే మాకు నేపధ్యం లో పక్షుల కువకువలు, గుడిలో నుండి బాలు గారి గొంతుతో వినిపించే శివస్తుతి వింటుంటే అలసట తెలిసేదే కాదు. ఎంత మధురం గా ఉండేవో ఆ రోజులు. ఉదయం అంటే అలా ఉండాలి అనిపించేలా ఉండేవి. 

అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన విషయం వంటలు. అమ్మమ్మ గారికి ఇద్దరు కొడుకులు ఏడుగురు అమ్మాయిలు. అందరిలోకెల్లా అమ్మ పెద్ద కూతురు నేను పెద్దమనవడిని అనమాట. అందుకే చిన్నతనంలో నాకు ప్రత్యేక హోదా దక్కేది. అంత మంది నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా ఆట పాటలతో ఏదడిగితే అదిచ్చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి తిప్పేస్తూ తెగ ముద్దు చేస్తుంటే యువరాజులా ఫీలయ్యేవాడ్ననమాట. 
 
అలా ఇంత మంది ఉన్నారు కనుక ఏం పిండివంటా చేయాలన్నా కాస్త భారీగానే చేయాల్సి వచ్చేది. ఇదీగాక పిండివంటలు అనగానె ఇరుగు పొరుగు చేతి సాయానికి వచ్చేవారు వాళ్ళకు కూడా కలిపి ఏ రేంజ్ లో ఉండేవో మీరే ఊహించుకోండి. ఏం చేసినా దదాపు ఓ రోజంతా పట్టే పెద్ద ప్రహసనమే ఆయ్యేది అందులో మన ప్రివిలేజెస్ మనకెప్పుడూ ఉండేవీ. అరిశల పాకం నుండీ పచ్చి జంతికల పిండి వరకూ దేన్నీ వదిలే వాడ్ని కాదు అన్నింటా ప్రధమ నైవేద్యం మీ వేణుగాడికేనమ్మా అంటూండే వాళ్ళు అందరూ అమ్మతో. 

అమ్మ వీపు మీద మెత్తగా వాలి కబుర్లు చెప్తూ అదేంటి ఇదేంటి అని పిచ్చి ప్రశ్నలు అడుగుతూ, "అబ్బా ఇవన్నీ నీకెందుకురా పైగా పొయ్యి దగ్గర వేడికి ఎందుకు? వెళ్ళి ఆడుకోవచ్చు కదా" అంటూ అమ్మ ముద్దుగా తిట్టే తిట్లు తింటూ, అప్పుడప్పుడు తగిలే వెచ్చని సెగకి కొంచెం బెదురుతూ, అమ్మ కొంగుతో మొహం తుడుచుకుంటూ మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెం అమ్మ పెట్టేవి తింటుంటే వచ్చే తృప్తి ఆనందం ఇప్పుడు ఎన్ని ఏసీ గదుల్లో ఎంత ఖరీదైనవి తిన్నా దొరకదు గాక దొరకదు.    
 
అప్పుడు నేను మూడో నాలుగో తరగతి చదువుతున్నాను అనుకుంటా సరిగా గుర్తు లేదు ఎలక్షన్స్ వల్లో మరో కారణానికో అమ్మా నాన్నా ఇద్దరికీ శలవలు దొరక్క సంక్రాంతికి అమ్మమ్మగారి ఊరెళ్ళడం కుదరలేదు నర్సరావుపేటలోనె ఉన్నాం. సరే ఎక్కడున్నా మన ఎంజాయ్మెంట్ కి ఏ లోటూ రానివ్వం కనుక ఓ సాయంత్రం అమ్మని పోరుపెట్టి చిల్లర సంపాదించి కొండయ్యకొట్టులో కొబ్బరిబిళ్ళ కొనుక్కుని చప్పరిస్తూ ఇంటిలోకి అడుగుపెట్టా. 

వీధి గుమ్మంలో నుండే కాస్త పెద్ద పెద్దగా అమ్మ గొంతు వినపడుతూ ఉంది హాల్లో గుమ్మం దగ్గరకు వెళ్ళేసరికి తను ఏదో విషయమై పక్కింటి ఆంటీతో గొడవ పడుతున్నారు. ఎపుడైనా అమ్మ చిరుకోపంతో ముద్దుగా నన్ను విసుక్కోడం చూశా కానీ అంత కోపంలో చూడడం అదే మొదలు దాంతో హడలెత్తిపోయాను. ఆ ఖంగారులో ఉండగానే ఆవిడ కాస్త అమ్మ మీదకి వెళ్ళబోయారు. 

ఇక అంతే నేను ఒక్క ఉదుటున పెద్దగా అరుచుకుంటూ సాయానికి చుట్టు పక్కలవాళ్ళని పిలుస్తూ పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఆవిడ మీదకెళ్ళిపోయాను. సత్తువ కొద్దీ పెద్దగా అరిచి కేకలు పెట్టేసరికి వాళ్ళిద్దరూ బెదరి పోయి వాళ్ళ గొడవ మర్చిపోయి సైలెంట్ గా ఇద్దరూ కలిసి నన్ను ఊరుకోబెట్టడం లో బిజీ అయిపోయారు. 

ఆ తర్వాత అమ్మ ఆ విషయం తల్చుకొని తల్చుకొని ఎన్ని సార్లు మురిసిపోయేదో లెక్కలేదు. నా పరువు తీసైనా సరే నన్ను కాపాడేస్తాడమ్మా నా కన్న కొడుకు అని తెగ మురిసిపోయేది. ఆ ఒక్క సారి తప్ప పెద్ద పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మిస్సయిందే లేదు. ఆఖరికి వాళ్ళు మేం ఉండే నర్సరావుపేటకి వచ్చినా కూడా పండగరోజు పొద్దున్నే పూజ చేసేసుకుని అమ్మమ్మ వాళ్ళింటికి పరిగెట్టడమే. 

అమ్మమ్మా వాళ్ళు నర్సరావుపేటకి వచ్చాక ఓ ఏడాది విపరీతమైన గాలివానతో తుఫాను వచ్చింది. అప్పట్లో ఇప్పటిలా పాలపాకెట్స్ కానీ బయట షాప్స్ లో కానీ పాలు దొరికేవి కాదు పాడి ఉన్న వాళ్ళ దగ్గర పోయించుకోవాల్సిందే. పైగా ఆ తుఫానులో అమ్మమ్మవాళ్ళింట్లొ కూడా ఎవరూ మా ఇంటికి పాలు తీస్కురాలేకపోయారు దాంతో ఇంట్లో పాలు లేవని రెండేళ్ళ క్రితమే పుట్టిన చిన్ని తమ్ముడికి పాలు దొరకలేదని నేను ఘోప్ప సాహసం చేసేసి అమ్మ ఎంత వద్దంటున్నా వినకుండా తుఫానులో గొడుగేసుకుని అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళడం నాకు బాగా గుర్తు. 

అప్పుడు అక్కడ అందరూ ఎంత కంగారు పడ్డారో ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. వెళ్ళేప్పుడు బావుంది కానీ వచ్చేప్పుడు గాలికి గొడుగు వెనక్కి మడుచుకుని కొంత మేర చిరిగిపోవడం కూడా గుర్తు. అంత వరకూ ఒక్కడ్నే వీధి చివరి కొట్టుకు తప్ప ఎక్కడకూ వెళ్ళే అలవాటు లేకపోయినా ఒక్కడ్నే అలా వర్షంలో అంతదూరం వెళ్ళడం సాహసమే అని అందరూ మెచ్చుకున్నారు కూడా. కానీ అసలు నేను వెళ్ళడానికి కారణం మాత్రం నాకిష్టమైన వర్షంలో తడవడం కోసమే అనేది నాకు ఒక్కడికే తెలిసిన రహస్యం :-) 

ఇన్ని జ్ఞాపకాలతో నిండి ఉన్న అమ్మమ్మగారిల్లు ఈ ఏడాది మాయమైంది. సరిగ్గా పుష్కర కాలం క్రితం దేవుడి దగ్గిరకి వెళ్ళిపోయిన అమ్మ దగ్గరికే అమ్మమ్మ కూడా మొన్న సంక్రాంతి నాడు వెళ్ళిపోవడంతో ఇప్పుడిక అమ్మమ్మ గారి ఇల్లు అని చెప్పుకోడానికి ఏమీ ఉండదు. ఆ ఇంట్లో మావయ్యో పిన్ని వాళ్ళో ఎవరో ఒకరు ఉన్నా అమ్మమ్మ ఉన్నప్పటంత ఆనందం  ఐతే దొరకదు. ఎనభై ఐదేళ్ళ పైబడిన అమ్మమ్మ ఎవరో చెప్పినట్లే సంక్రాంతికి నాలుగు రోజుల ముందే మా అందరిని చూడాలని ఉందని పిలిపించుకుని చూసి పలకరించి. ఉత్తరాయణం వరకూ వేచి చూసి సంక్రాంతి రోజు రాత్రి పయనమవడం మాలో విషాదంతో పాటు ఆశ్చార్యాన్ని కూడా నింపింది. ఆవిడకి సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.    

మంగళవారం, జనవరి 19, 2021

కంబాలపల్లి కథలు - మెయిల్

ఈ పోస్ట్ ని నా స్వరంలో ఈ యూట్యూబ్ వీడియోగా ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link

ఆహా లో స్ట్రీమ్ అవుతున్న కంబాలపల్లి కథలు వెబ్ సీరీస్ లోని మొదటి అంకం 1:56 నిముషాల నిడివి గల "మెయిల్" బావుంది. అక్కడక్కడా కథా సౌలభ్యం కోసం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నప్పటికీ సాధ్యమైనంత సహజమైన వాతావరణంలో సహజ సంభాషణలతో దర్శకుడు ఉదయ్ గుర్రాల చక్కగా తీశాడీ సినిమాని. 

ఒకప్పుడు గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలంటే ఆర్ట్ ఫిల్మ్స్ మాత్రమే ఉండేవి. అభిరుచి ఉన్న ఏ కొద్దిమందో మాత్రమే ఆదరించినా స్లో నెరేషన్ కీ, అవసరంలేని డీటేయిలింగ్ కీ పెట్టింది పేరైన ఇవి కమర్షియల్ సినిమాల్లో జోకులు వేస్కోడానికి మాత్రమే ఎక్కువ ఉపయోగపడేవి. ఐతే ఇప్పుడు న్యూ ఏజ్ ఆర్ట్ ఫిల్మ్స్ పంథా కాస్త మారింది. గ్రామీణ నేపథ్యంతో కూడా చక్కని ఆకట్టుకునే కథా కథనాలు రాసుకుని కమర్షియల్ సినిమాలకు ధీటుగా తెరకెక్కిస్తున్నారు ప్రేక్షకులు కూడా అలానే ఆదరిస్తున్నారు. అలా ఒకప్పటి మాల్గుడిడేస్ ను గుర్తు చేసేవే ఈ కంబాలపల్లి కథలు. 

2005 లో అప్పుడప్పుడే గ్రామాలకు సైతం కంప్యూటర్స్ విస్తరిస్తున్న సమయంలో జరిగిన కథ ఇది. తన ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ చూసుకోడానికి ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళిన రవి(హర్షిత్) మొదటి సారి కంప్యూటర్ ని చూసి ప్రేమలో పడిపోతాడు. డిగ్రీ కంప్యూటర్స్ లో చేయాలని సొంతంగా ఓ కంప్యూటర్ కొనుక్కోవాలని అనుకున్నా తన ఆర్ధిక పరిస్థితి సహకరించక బి.కామ్. లో చేరతాడు. అక్కడ తన క్లాస్మేట్ రోజా(గౌరీప్రియ) తో ప్రేమలో పడతాడు. 

అలాంటి సమయంలో ఆ ఊర్లో ఫోటో స్టూడియో నడుపుకుంటున్న హైబత్(ప్రియదర్శి) ఆ రంగంలో తనకి పోటీ ఎక్కువైందని. స్టూడియో స్థానంలో ఓ చిన్న కంప్యూటర్ తీస్కొచ్చి గేమింగ్ సెంటర్ విత్ ఇంటర్నెట్ అండ్ ప్రింటౌట్ ఫేసిలిటీ ఏర్పాటు చేస్తాడు. ఇది చూసిన రవి అప్పటివరకు తను వెంటబడుతున్న రోజాని కూడా పట్టించుకోకుండా వదిలేసి కంప్యూటర్ నేర్చుకుంటానంటూ హైబత్ వెంటబడడం మొదలు పెడతాడు. 

తనకు కాంపిటీషన్ గా ఊర్లో మరో నెట్ సెంటర్ మొదలు పెట్టనంటేనే నేర్పుతా అంటూ మరికొన్ని షరతులతో హైబత్ రవికి నేర్పడానికి ఒప్పుకుంటాడు. ఫస్ట్ స్టెప్ గా ఒక ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసిస్తాడు రవికి. ఇక దానికి ఎప్పుడు మెయిల్ వస్తుందా అని రోజు చెక్ చేసుకుంటూ ఉంటాడు రవి. ఓ రోజు ఆ ఈమెయిల్ ఐడికి లాటరిలో రెండు కోట్లు గెలిచినట్లుగా మెయిల్ వస్తుంది. ఆ ఈ-మెయిల్ రవి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది అనేదే మిగిలిన కథ.

ఈ సినిమా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింభించింది. అందమైన ప్రకృతి అమాయకత్వం స్వచ్చత నిండిన మనుషులు అడుగడుగున కనిపిస్తు సహజమైన సంభాషణలు పలుకుతూ ఆకట్టుకుంటారు. అచ్చంగా ఊరిలో తిరుగుతూ ఒకడి కథ మనం చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అన్ని సంధర్బాల్లో మనకి తోడుండే ఓ స్నేహితుడిని ఎలా చూపించారో అలాగే గర్ల్ బెస్టీ తో ఉండే అందమైన స్నేహాన్ని కూడా అంతే చక్కగా చూపించారు.  

ఇందులోని హాస్యం అంతా కూడా సునిశితమైన హాస్యం సటిల్ హ్యూమర్ అంటారు చూడండి అలాంటిది. అంతా పాత్రల అమాయకత్వం తెలివి తక్కువ తనంలోనుంచే పుడుతుంది. ఏ పాత్రా కావాలని ప్రయత్నించి నవ్వించడం కానీ గట్టిగా నవ్వడమో విరగబడడమో హాస్యం కోసం తిట్టడమో కొట్టడమో లాంటివి ఏవీ కనిపించవు. నటులంతా సహజంగా ప్రవర్తిస్తూనే కావలసినంత నవ్వు పుట్టించారు. ఇక కంప్యూటర్ రూం లోకి చెప్పులు విప్పి వెళ్ళడం లాంటి సన్నివేశాలు చూసినపుడు ప్రతి ఒక్కరికీ సిటీస్ లో సైతం ఈ పద్దతి పాటించడం గుర్తు రాక మానదు. కంప్యూటర్ చుట్టుపక్కల రాసుకున్న సన్నివేశాలన్నీ నాస్టాల్జిక్ అనిపిస్తాయి. 

ప్రియదర్శి ఆల్రెడీ ప్రూవెన్ నటుడు తనకి ఇలాంటి పాత్రలు కేక్ వాక్ లాంటివి. హీరోగా హర్షిత్ చాలా చక్కగా సరిపోయాడు తన పాత్రకి. అలాగే అందం అమాయకత్వం ముగ్ధత్వం కాస్త గడుసుదనం నిండిన హీరోయిన్ పాత్రలో గౌరీ ప్రియ కూడా మెప్పించేసింది. స్నేహితుడు సుబ్బుగా చేసిన మణి, శివన్న గా చేసిన రవీందర్ బొమ్మకంటి ఆఖరికి కంప్యూటర్ కి వైరస్ వస్తే రిపేర్ చేయడానికి వచ్చిన మెకానిక్(ఒకే సీన్) కూడా గుర్తుండి పోతాడు. 

స్వప్నా మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పుకోవాల్సిన పనేలేదు చక్కగా ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, నేపధ్య సంగీతం కూడా సినిమా మూడ్ కి తగినట్లుగా సరిపోయాయి. ఇక దర్శకుడు రాసుకున్న కథనం కాస్త నిడివి ఎక్కువ ఐనట్లు అనిపించింది, ఒక పదిహేను నిముషాలు తగ్గించి ఉంటే బావుండేది. ఐతే మొదట్లో కాస్త నిదానంగా అనిపించినా రవి సమస్యకి మనని కూడా కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు. అది జరిగాక లెంత్ విషయం మర్చిపోతాం ఇక ఊహించని ఆసక్తికరమైన క్లైమాక్స్ తో హాయిగా నవ్వుకుంటూ మంచి సినిమాని చూశాం అనుకునేలా చేశాడు.      

కాస్త నిడివి ఎక్కువయినట్లు అనిపించినా కానీ వైవిధ్యమైన గ్రామీణ నేపథ్యంతో ఉన్న కథలను ఇష్టపడే వారు మిస్సవకుండా చూడవలసిన సినిమా ’మెయిల్’. ఈ సినిమా టీజర్ ఇక్కడ, ట్రైలర్ ఇక్కడ, చెప్పులేసుకుని లోపలకి రావడం వల్ల కంప్యూటర్ కి వైరస్ వచ్చిందంటూ హడావిడి చేసే ఓ సరదా సన్నివేశం ఇక్కడ చూడవచ్చు. ఆసక్తిగా అనిపిస్తే కనుక ఆహా లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని మిస్ అవకండి. 

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.