గురువారం, జులై 03, 2008

బుడుగు తో కాసేపు...

ఉరేయ్!! బ్లాగు వాడుల్లారా(no offense) ... ఎలా ఉన్నారు, మన పేరు బుడుగు...వీడున్నాడే..ఈ బ్లాగు వాడు..వేణు గాడు...వాడూ.. మొన్నో ఎల్లుండో ఓ రోజు నా దగ్గరికి వచ్చి... "బుడుగు గారు..బుడుగు గారు మరేమో నండి.. నా బ్లాగు చూసే వాళ్ళు అందరికీ మీరు ప్రైవేటు చెప్పడం గురించి చెప్పాలండీ.." అని రిక్వెస్టింగ్ చేసాడు (రిక్వెస్టింగు అంటే ఏంటో తెలీదు కానీ అలా అనాలి అని బాబాయ్ చెప్పాడు, బాబాయ్ దగ్గర ఇలాంటివి బోలెడు ఉన్నాయి లే).

అసలికి ఈ బ్లాగు వాడు అంటే మనకి మా చెడ్డ ఖోపం...మన కుటో (దీన్నే ఫోటో అని కూడా అంటార్లే... అప్పుడూ లావుపాటి పిన్ని గారు ఆవిడ ముగుడూ ఒకే దాన్లో పట్టకపోతే పిన్ని గారిని సగమే తీసారు అని చూపెట్టా గదా అదే) సరే వీడు మన కుటో అయితే పెట్టుకున్నాడు గానీ మన గురించి ఇన్ని రోజులు అయినా టపా వెయ్య లేదు. మనమంటే బొత్తి గా బయ్యంబత్తీ లేకుండా పోయింది. బయ్యంబత్తీ అంటే అంతేలే పెద్దవాళ్ళంటే చిన్న వాళ్ళకి బయ్యంబత్తీ ఉండాలని బామ్మ చెప్పింది. మరి నేనేమన్నా చిన్న వాడ్నా చితక వాడ్నా మనమంటే కూడా ఉండద్దూ వీడికి.

అయ్యినా కూడా పోన్లే పాపం వీడికి ప్రైవేటు చెప్పడం గురించి తెలీదు కదా మనం చెప్పి రష్చించు దాం...ఎంతైనా అడిగాడు కదా అని అనుకున్నా... కానీ వీడికి ఊరికే చేయగూడదు కదా...అలా చేస్తే అలుసైపోతామంట బాబాయ్ చెప్పాడు. అందుకే బాబాయి రెండుజెళ్ళ సీతకి లెట్రు(అంటే ఉత్తరం లా ఉంటుంది లే) ఈమన్నా కూడా మనకి బిస్కత్తులు ఇస్తేనే చేస్తాం కదా. అందుకే వీడిని " సర్లే ఫో చెప్పి నిను రష్చించు తాను కానీ నాకు ఫది..ముఫై పకోడీలు పెట్టుతావా" అని అడిగాను.

వాడు సరేండీ అని ఫకోడీ లు పెట్టాడు...కానీ పెట్టేసి ఊరుకోకుండా "బుడుగు గారు... బుడుగు గారు మరేమో ఫది ఫకోడిల్లో మూడు తినేస్తే ఇంకా ఎన్ని పకోడీలు ఉంటై" అని అడిగాడు. జాటర్ ఢమాల్...మనకి అసలే లెక్కలు అంటే కోపం కదా... మనసాయం కోసం వచ్చి మనల్నే లెక్కలు అడుగుతాడా అని యమ ఖోపం వచ్చీసింది. అలా అయితే నీ ఫకోడీలు వద్దు...నీ బ్లాగు లో ప్రైవేటు గురించి చెప్పి నిన్ను రష్చించను ఫో అనేసాను.

అప్పుడు వీడు మళ్ళీ "తప్పయి పోయింది బుడుగు గారండీ" అని కాళ్ళా వేళ్ళా పడితే (పెద్ద వాళ్ళు అలా పడతార్లే నువ్వు ఇంకా చిన్న వాడివి కదా నీకు తెలీదు) పోనీలే కదా అని "సరే రా భయం పడమాకు... నేను నిన్ను రష్చించుతాను లే ఫో..." అని చెప్పి ఇలా వచ్చేసా అనమాట.

అసలింతకీ ప్రైవేటు చెప్పడం అంటే "తిట్టడం" అని అర్ధం ఒకో సారి "కొట్టడం" అని కూడా వస్తుంది లే... ఎప్పుడైనా అమ్మ మనల్ని కొట్టుతే నాన్నేమో అమ్మకి ప్రైవేటు చెప్తాడు, నేను దెబ్బలాట అనుకున్నా కాని ప్రైవేటు అనాలని బాబాయి చెప్పాడు. ఒక సారి బాబాయి రెండు జెళ్ళ సీతకిమ్మని లెట్రు ఇచ్చుతే దాన్ని సీత వాళ్ళ నాన్న నా దగ్గర నుండి లాక్కుని చదివేసాడు గదా అప్పుడు వాడు కూడా బాబాయి కి "వెధవ కానా..." అని గాట్టి గా ప్రైవేటు చెప్పేసాడు లే...

అసలంతెందుకు మీ బ్లాగు లో ఎవడో పేరు తెలీని వాడు, వాడి నోటికొచ్చినట్లు అవాకులూ చవాకులు పేలితే మీరు కూడా వాడికి గట్టిగా ప్రైవేటు చెప్తారు కదా అదనమాట ప్రైవేటు చెప్పడం అంటే...అర్ధం అయ్యిందా... ఇంకా కాకపోతే ఈ కింద ఇచ్చిన లంకె లో ఇలాంటియ్యే నేను చెప్పే బోలెడు కబుర్లు ఉన్నాయి అవన్నీ చదివేయండి... ఒక వేళ మీకు నా గురించి అస్సలు తెలీక పొయ్యినా కూడా చదివేయండి ఎందుకంటే...చదివాక నేను నచ్చని తెలుగు వాడులు ఎవరూ ఉండరు...

బాపూ రమణ ల బుడుగు అల్లరి పిడుగు

సరే మరి ఇంక నేను రైలు ఎక్కి సీగాన పసూనాంబ వాళ్ళ ఊరు వెళ్ళాలి... వేళ్ళి మళ్ళీ వస్తాను. ఈ సారైనా నిజం డ్రైవరు నన్ను రైలు తోలనిస్తాడో లేదో వాడికి ఫదీ ముఫ్ఫై బీడీ లు ఇస్తాను అని చెప్పుతాలే...

*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

అవండీ నాకు అత్యంత ఇష్టమైన మా బుడుగు గారు చెప్పిన కబుర్లూ... ఈ రోజు ఉదయం ట్రైన్ లో సరదాగా డ్రాఫ్టు చేసి పెట్టుకుందాం అని పెన్నూ పేపరూ తీసుకు మొదలెట్టాను...ఆగితేనా... అరగంట లో ఇన్ని కబుర్లు చెప్పేసాడు... సరే మరి మీరు ఇంకా రమణ గారి "బుడుగు" చదవక పోతే చదివేయండేం... మళ్ళీ మరో టపా లో కలుద్దాం....

--మీ వేణు.

20 కామెంట్‌లు:

 1. బుడుగుతో కాసేపని ఏదో లింక్ ఇచ్చారు. నేనేమో మొత్తంగా పని మానేసి ఆ బుడుగుతోనే వుండిపోయేట్టు వున్నాను. ఎంత పని చేసారండి...? Thanks for sharing budugu kaburlu and also the link.

  రిప్లయితొలగించండి
 2. @శ్రీవిద్య గారు
  నెనర్లు, హ హ that's the magic around బుడుగు ఇన్ని రోజులైనా సరే ఒక్క పేజీ చదివేసి ఆపేయలేం అంత బావుంటయ్ తను చెప్పె కబుర్లు....

  రిప్లయితొలగించండి
 3. good show at imitation.
  One nitpick - I don't think budugu refers to himself as "manam". Could be wrong.

  రిప్లయితొలగించండి
 4. Super post!!


  బుడుగును కళ్ళముందు నిలబెట్టారు.. ఓ బుడుగు బొమ్మకూడా ఉంటే బాగుణ్ణు అనిపించింది. చాలా బాగ రాసారు.

  రిప్లయితొలగించండి
 5. @కొత్తపాళీ గారు
  నెనర్లు, good catch అండీ నిజమే ఒకటి రెండు చోట్ల తప్ప ఇంత ఎక్కువ గా వాడరు మనం అని, అది పూర్తిగా నా పైత్యమే... అదేంటో తెలీదు కాని నాకు అలా అలవాటు అయిపోయిందండీ. ఇంతకు ముందు పోస్ట్ లలో కూడా గమనించి ఉంటారు. బుడుగు తరపున వకాల్తా పుచ్చుకున్నపుడు గమనించి ఉండాల్సింది :-) కానీ తెలీకుండా వచ్చేసింది.

  @పూర్ణిమ
  నెనర్లు, అసలు ఈ టపా వ్రాయడానికి కారణమే నా profile display picture అండీ... మీరన్నట్లు టపా లో కూడా పెట్టి ఉండాల్సింది.

  రిప్లయితొలగించండి
 6. Oh, no problem. My elder brother and I were such fans that we used to carry on entire conversations in Budugu speak :-)
  I still have both volumes at home, though it's been a while since I read them.
  మా అన్నయ్య ఐతే తను కాలేజిలో ఉండగా కూడా నా మీద కోపం వస్తే "నడ్డిమీఛ్ఛంపేస్తాను" అనే వాడు.

  రిప్లయితొలగించండి
 7. హ హ cool అండీ అందుకే అలా ఠపీ మని catch చెసేసారు.

  రిప్లయితొలగించండి
 8. వీడు పకోడీలు ఇచ్చి లెక్కలు చేసి పెట్టమంటాడు...ఇగో ఈ పెద్దవాళ్ళేం ఎప్పుడూ ఏమిటీ సరిగ్గా చెయ్యరు..దీన్నే లోపం అంటారు ఇలా అని మనం అంటే మళ్ళీ కోపం. అయినా నేను మంచివాణ్ణి కాబట్టి పొన్లే గదా అని వీడికి ప్రేవేటు గురించి చెప్పాను..ఎవరికి తెలుస్తుంది చెప్పకపోతే...? మహా మహా మా బామ్మకే తెలీదు .....

  రిప్లయితొలగించండి
 9. స్కూల్ పుస్తకాల్లో మొదటిసారి చూసా బుడుగుని. అస్తమానం నిజం చెప్పొద్దు అని గీతోపదేశం చేస్తాడు. వాళ్లమ్మను ఏం పిల్లా అంటాడు. తరువాత మినపట్లు చేసుకుంటే నాన్నను కలవడానికి చుట్టాలొస్తారు అప్పుడు చుడాలి బుడుగుని, బుడుగు తిట్టే తిట్లని.....

  ఏమిచ్చి బాపు-రమణల రుణం తీర్చుకోగలమో !!

  రిప్లయితొలగించండి
 10. నాగార్జున గారు నెనర్లు,
  ఊహు సందేహం లేదు, ఏమిచ్చినా బుడుగు సృష్టికర్తల ఋణం తీర్చుకోలేం...

  రిప్లయితొలగించండి
 11. వేణు గారు, చాలా బాగా రాసారు. బుడుగు మీద అభిమానం మీ profile pic చూస్తేనే తెలుస్తుంది. ఈ టపా చదివితే బుడుగు మాటలు మీ మనసులో ఎంత బాగా నాటుకుపోయాయో కూడా తెలుస్తోంది :)

  రిప్లయితొలగించండి
 12. సాయిప్రవీణ్ గారు నెనర్లు, నేను చాలా ఎక్కువసార్లు చదివిన పుస్తకం ఇదేనండి.. ఏమీ తోచనప్పుడల్లా అప్పుడో పేజీ అప్పుడో పేజీ తిరగేస్తుంటా...

  రిప్లయితొలగించండి
 13. వేనూ అప్పుడేప్పుడో సగం చదివాను ఈ పుస్తకం .. చాలా చాలా బాగుంటుంది మళ్ళీ లింకు ఇచ్చిననదుకు బోలెడు బోలెడు తేంకూలు

  రిప్లయితొలగించండి
 14. వేణుశ్రీకాంత్ గారు, మీ బుడుగు చాల బావున్నాడు. రమణ తాతగారు భౌతికంగా లేకపోయినా అయన అభినవ మనవడిగా బుడుగును చిటికెనవేలు పట్టుకొని మీరు నడిపించగలరు అని నా విశ్వాసం. ప్రయత్నించండి....

  రిప్లయితొలగించండి
 15. శ్రీ గారు సాక్షాత్తు రమణ గారి పుట్టినరోజునాడు నా ఈ పాత టపాను పైకి తీసుకువచ్చిన మీ వ్యాఖ్య చూసి అరక్షణం ఆనందపడ్డాను కానీ.. పిచ్చిరాతలు రాసుకునే నేనెక్కడా ముళ్ళపూడి వారెక్కడా.. ఆ మహానుభావుడి కాలి గోటికి కూడా నేను సరితూగను.. వారి పుస్తకాలు చదువుకుంటూ మురిసిముక్కలైపోవడమే కానీ వారి బుడుగును వేలుపట్టుకుని నడిపించడం నాలాంటి సామాన్యుల తరమా..

  రిప్లయితొలగించండి
 16. బుడుగు ఎన్ని మాట్లు చదివినా మళ్ళీ మొదటినించి చివర దాకా చదివితే కానీ విడిచిపెట్టలేము. ఎన్ని మాట్లు చదివినా నవ్వకుండా ఉండలేము. ముళ్ళపూడి వారు తెలుగు వాళ్ళకి ఇచ్చిన గొప్ప కానుక బుడుగు, వరం అని అంటేనే బాగుంటుందేమో.

  టపా బాగా వ్రాసారు. ఇంకొన్ని ప్రయత్నించండి Pl.

  రిప్లయితొలగించండి
 17. నేనూ కొంచెమే చదివాను బుడుగు పుస్తకం.. అదీ నెట్లోనే! ఇంకా మొత్తం చదవాలి.. మీరు దగ్గరుండి మాకు చెప్పించిన బుడుగు కబుర్లు చాలా బాగున్నాయి.. :)

  రిప్లయితొలగించండి
 18. గురూజీ నెనర్లు, >>ఎన్ని మాట్లు చదివినా నవ్వకుండా ఉండలేము.<< అవును సార్ చాలా కరెక్ట్ గా చెప్పారు.. నిస్సందేహంగా తెలుగు వాళ్ళ పాలిట వరమే...
  నెనర్లు మధురా... నాదేమి లేదు అంతా నాచేత కనీసం నెలకోసారన్నా తిరగేయించుకునే బుడుగు గొప్పతనమే...

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.