శనివారం, జులై 05, 2008

బుడుగులు..బుడిగీలు..పిడుగులు..

నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఛా! ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు బాబూ అని అంటారా... నిజమే లెండి ఏదో విక్రమార్కుడు సినిమా లో అత్తిలి సత్తిబాబు లాంటి వాళ్ళకి తప్ప మనలో చాలా మందికి పిల్లలు అంటే ఇష్టమే ఉంటుంది. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టమే కానీ పెంపకం లో ఉండే చాకిరి, పెంకి పిల్లలు చేసే అల్లరి ఒకోసారి భరించడం కష్టమేమో అనిపిస్తుంది. కాని ఎన్ని కష్టాలు పడినా వాళ్ళు చూపించే ప్రేమ చూడగానే అన్నీ ఒక్క క్షణం లో మర్చిపోతాం. ఉదాహరణకి మధ్యాహ్నమో లేక ఉదయాన్నో నిద్ర లేచిన వెంటనే సగం మత్తు తో అలా మన దగ్గరికి వచ్చి మెడని కావలించుకుని బుజం మీద పడుకోడమో... లేదూ ఆటల మధ్య లో మనం వాళ్ళకి బాగ నచ్చే పని చేసినప్పుడు గబుక్కున బుగ్గ మీద ఒక ముద్దు పెట్టడమో చేయగానే ఆహా దీని కోసం ఎన్ని కష్టాలైనా పడచ్చు అనిపిస్తుంది.

ఒకో సారి వీళ్ళు చేసే అల్లరి కూడా భలే ముద్దొస్తుంది. ఒక బ్రహ్మచారి గా నాకు ఈ ప్రేమని పొందే అవకాశం దొరికింది ఇప్పటి వరకూ తక్కువే కానీ నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళబ్బాయి ప్రణవ్ ఇలా ప్రేమ ని చూపించడం లో ముందుంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు పండగే... వీడు చాలా షార్ప్ అండ్ తనకి ఉన్న ఇంకో మంచి లక్షణం ఏంటంటే అప్పుడప్పుడూ భలే ఝలక్ లు ఇస్తుంటాడు, ఈ కాలం పిల్లలు అందరూ ఇంతే ఉన్నారేమో లెండి... సరే ఇంతకీ విషయం ఏంటంటె,

ఓ రోజు బయటకి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతున్నారు...
ప్రణవ్ వాళ్ళ అమ్మ వాడికి పెద్ద అక్షరాల తో "చాంపియన్" అని ప్రింట్ చేసి ఉన్న T Shirt వేసి రెడీ చేసింది.అది చూసి వాడి నాన్న "వావ్ ప్రణవ్ ఏంటీ నువ్వు చాంపియన్ వా" అని అడిగాడు
దానికి మా ప్రణవ్ జవాబు...."కాదు నాన్నా నేను ఇండియన్ ని" :-)
వాడి జవాబు కి పక్కన ఉన్న వాళ్ళే అవాక్కయితే పాపం వాళ్ళ నాన్న పరిస్తితి ఆలోచించండి.

వీడికి వైషు అని ఒక చెల్లి ఉంది తనకి 2 యేళ్ళు ఉంటాయ్ తను ఇంకా చాలా స్మార్ట్ జోల్ట్ లు ఇస్తుంది. ఎలాగంటే...వీళ్ళు నలుగురూ కలిసి స్టూడియో లో ఒక ఫోటో దిగారు దాన్లో అందరూ మంచి హార్టీ స్మైల్ తో ఉంటే మా వైషు మాత్రం కొంచెం సీరియస్ గా చూస్తూంటుంది. మొన్న ఒక రోజు అందరూ ఆ ఫోటో చూస్తుంటే...ప్రణవ్ "ఇందులో మనం అందరం నవ్వుతున్నాం వైషు నవ్వట్లేదు" అని కామెంట్ చేసాడు. దానికి వైషు వెంటనే "ఏం కాదు నేను కూడా నవ్వుతున్నాను కదా అమ్మా" అని వాళ్ళ అమ్మ సపోర్ట్ అడిగింది. వాళ్ళ అమ్మ "ఎక్కడ మరి నువ్వు నవ్వడం లేదు కదా" అని పాపం తను కూడా ప్రణవ్ వైపే మాట్లాడింది... దాంతో ప్రణవ్ రెచ్చిపోయి అవును మరి నువ్వు నవ్వడం లేదుకదా...? ఎక్కడ నవ్వుతున్నావ్ ?? కనిపిస్తుందా..అసలు... అని అడిగాడు...
దానికి వెంటనే మా వైషు "లేదన్నా నేను.. లోపల్నుంచి నవ్వుతున్నాను !!..." అని చెప్పింది..:-)
విన్న వాళ్ళెవరికి సౌండ్ లేదని వేరే చెప్పక్కర్లేదనుకుంటా :-) ఇంత చిన్న పిల్లకి ఈ అవిడియాలు ఎక్కడనుండి వస్తాయ్ రా బాబు అనుకున్నాం...వీళ్ళిలా అప్పుడప్పుడూ అవాక్కయ్యేలా చేస్తుంటారనమాట.

వీళ్ళిద్దరూ ఇలా ఉంటే న్యూజెర్సీ లో ఉన్న ఇంకో ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ప్రచేత్ అని పుట్టి 3 నెలలు అవుతుందనుకుంటాను సాయంత్రాలు అలా బయట తిప్పక పోతే అరిచి గొడవ చేస్తూ ఉంటాడుట బయటకి తీసుకు వస్తే అప్పుడు సైలెంట్ గా అవీ ఇవీ చూస్తూ ఉంటాడుట. ఇంకా అప్పుడే సొంతం గా బోర్లా పడటమే కాకుండా పాకడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్ప్తే నేను హాశ్చర్య పడిపోయేసాను. అంతే కాదు "ఎదగడానికెందుకు రా" పాట కూడా గుర్తొచ్చింది :-) ఈ పాట లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఇప్పటి తరానికి కూడా సరిపోతుందేమో కదా... ఈ మధ్య పాట పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది ఇది పోస్ట్ చేద్దాం అని చూస్తే ఇది ఆర్కుట్ తెలుగు సాంగ్ లిరిక్స్ కమ్యూనిటి లో ఇప్పటికే ఉంది. అక్కడ పోస్ట్ చేసిన Venu గారికి థాంక్స్ చెప్తూ... ఇక్కడ ఆ పాట....

<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Andala+Ramudu.html?e">Listen to Andala Ramudu Audio Songs at MusicMazaa.com</a></p>

చిత్రం: అందాలరాముడు (1973)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: రామకృష్ణ

ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా..ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారూ
జో జో..జో జో ! జో జో..జో జో !!

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా||2||
జో జో..జో జో.. జో జో..జో జో !

ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలీ
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలీ
చదవకుంటె పరీక్షలో కాపీలు కొట్టాలి
పట్టుపడితె..ఫెయిల్ ఐతే బిక్కమొగం వెయ్యాలి

కాలేజి సీట్లు అగచాట్లురా..అవి కొనడానికి ఉండాలి నోట్లురా
చదువు పూర్తైతే మొదలవ్వును పాట్లురా..అందుకే..

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో !

ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలీ
అడ్డమైనవాళ్ళకీ గుడ్మార్ణింగ్ కొట్టాలీ
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి
ఇంటర్వూ అంటూ క్యూ అంటూ పొద్దంతా నిలవాలి

పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా..మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా
ఎండమావీ నీకెపుడూ దోస్తురా..అందుకే..

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో !

B.A ను చదివి చిన్న బంట్రోతు పనికెళితే..
M.A.లు అచట ముందు సిద్దము..నీవు చేయలేవు వాళ్ళతో యుద్ధము
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో..
పదినెల్ల దాక జీతమివ్వరూ..నువ్వు బతికావో చచ్చేవో చూడరు

ఈ సంఘం లో ఎదగడమే దండగా..మంచికాలమొకటి వస్తుంది నిండుగా
అపుడు ఎదగడమే బాలలకు పండగ !...అందాకా..

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో..టాటా..టాటా.. టాటా..టాటా !

5 కామెంట్‌లు:

 1. మీ టపా చదివాకా మా ఇంటికి tution కి వచ్చే చిచ్చర పిడుగు చెప్పిన గొప్ప విషయం ఒకటి గుర్తొచ్చిందండి. వాడి పుస్తకం లోhydrogen, oxygen కలిస్తే water వస్తుందని వుంది. వాడు అది చూసి ఏదో ఆలోచించేసినట్తు పెన్సిల్ తో తల పక్కన రెండు సార్లు కొట్టుకొని "అవి రెండు మన ముక్కు లో కలిస్తే మనకి రొంపొస్తుంది" అన్నాడు....విన్న వారి హాస్చర్యం ఏమని చెప్పేది… :-)

  రిప్లయితొలగించండి
 2. బాగున్నాయి.. చిన్న పిల్లల విశేషాలు. మా ఇంటి చుట్టు పక్క పిల్లలు కూడా ఇదే రేంజ్ లో ఎంటర్టేన్ చేస్తారు. పాట మాత్రం సూపర్!! ఇలా వెతికి పట్టుకోండి మంచి పాటలని. అవునూ.. మీరెటూ రాసిన పాట పెడుతున్నారు కదా?? అక్కడే ఒక మ్యూజిక్ ఫైల్ పెట్టేస్తే.. వింటూ చదువుతాము కదా???;-)

  ఇబ్బందులు ఏమీ లేకపోతే నా సూచనను పరిశీలించగలరు.

  Template suits you the best!!

  రిప్లయితొలగించండి
 3. @Some 1 spl
  వ్యాఖ్యకు నెనర్లు, రొంప గురించి భలే చెప్పాడండీ :-) ఎవరో కాని మంచి మేధావి అలా immediate గా apply చేయగలగడం అందరికీ రాదు.
  @పూర్ణిమా
  నెనర్లు, అవును చిన్న పిల్లలతో భలే సరదా బొత్తిగా టైం తెలీదు. Music File పెడితే Audio Piracy అవుతుందండీ... మన చేతికి మట్టి అంటకుండా online link వెతికి అది పోస్ట్ చేస్తాలెండి. మంచి సలహా ఇచ్చారు. కానీ నాకు నచ్చిన 99% పాటలు అన్నీ చిమట మ్యూజిక్ అనే చోట ఉంటాయ్. Thanks about the template.

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.