బుధవారం, జులై 16, 2008

కాన్వెంట్‌కెళ్దాం..ఛలో..చలో..

అసలు నేను పుట్టటమే ఓ 10 రోజులు ఆలస్యం గా పుట్టానుట. మా డక్టరాంటీ "వీడు లోపల తిష్టేసుకు కూర్చున్నాడు కదిలే లా లేడు.." అని పాపం అమ్మకి ఆపరేషను చేసి నన్ను బయటకి తీసిందిట ఆ కోపం/చిరాకు/ఖంగారు లోనేనేమో ఆవిడ నా కుడి చేతి మణికట్టుకి కొంచెం కింద గాటు పెట్టేసింది. నాతో పాటు పెద్దదవుతూ ఆ మార్క్ ఇప్పుడు కూడా అలానే వుంది.. సో అలా లేట్ అవడం వల్ల బాగా బలహీనం గా వుండటం, తెల్లగా పుట్టాల్సిన వాడ్ని నల్లగా పుట్టడం ఇలాంటివి అన్నీ జరిగాయంటూ ఉంటుంది అమ్మ. నాకు ఒకటిన్నర సంవత్సరం దాటినా కూడా సరిగా నిలబడ లేక పోయే వాడ్నిట. దాంతో మా అబ్బాయి ఇలా ఉంటే లాభం లేదు మా అబ్బాయిని అభినవ ధారా సింగ్ ని చేయాలి అని వ్రతం పూని బలానికి మందులు వాడటం, దొరికిందల్లా తినిపించేయడం మొదలు పెట్టారుట అవన్నీ ఒంటబట్టి ఇప్పుడు గుండులా బాగానే తయారయ్యా అనుకోండీ. కానీ చిన్నప్పుడు నాకు అన్నం తినిపించడం ఒక పెద్ద యజ్ఞంట. మంచి అంచువున్న కంచం లో కొంచెం మెత్త గా వుడికిన అన్నం పప్పూ నెయ్యి వేసి బాగా కలిపి చేతిని అలానే కంచం అంచుకి వేసి గీస్తే గుజ్జు లాగా వస్తుంది, అది నాకు ఇప్పటికీ చాలా ఇష్టం ముద్ద ముద్ద కీ అలా గుజ్జు తీసిమ్మని గొడవ చేసే వాడ్నట. సో అమ్మో లేదంటే పిన్నో నాకు ఎలా అయినా తినిపించాలి అని పాపం చేతులు మంటెత్తే లా అలా గుజ్జు తీసి తినింపించే వారు. నేను తినకుండా అయినా ఉండే వాడ్ని కాని నా అంతట నేను తినే వాడ్ని కాననమాట.సరే ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నా అంటే. మనం తిండి తినడం కోసం అందరినీ ఇలా తిప్పలు పెట్టే టైము లోనే నన్ను బళ్ళో పడేసే టైం వచ్చేసింది. ఆంధ్రా లో కేరళా టీచర్ల ఇంగ్లీష్ కాన్వెంటులు ఇంకా అమ్మగార్ల బళ్ళు అంటే St Anns లాంటివి అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్నాయి మా నర్సరావుపేట్ లో కూడా వాటి హవా అప్పుడే మొదలయ్యింది. మా ఇంట్లో కూడా బాగా ఆలోచించి వీడు గొప్పోడైపోవాలి అని St Anns లో పడేసారు అదేమో మా ఇంటికి చాలా దూరం రిక్షా లో వెళ్ళాలి, అన్నం కేరేజి తీసుకు వెళ్ళాలి, మనకేమో బళ్ళో పడే వయసొచ్చినా ఇంకా అన్నం తినడం వచ్చేది కాదు కదా మరి. కానీ కాన్వెంట్లో ఆయా ఉంటుంది తను తినిపిస్తుంది అని చెప్పి ఎలా అయితేనేం నన్ను కాన్వెంటు లో పడేసారు. మీరు నమ్మరేమో కానీ నాకు ఇప్పటికీ అంతా గుర్తుంది ఇంట్లో అందర్ని వదిలేసి సొంతం గా నా కోసం కొన్న ఓ చిన్న పుస్తకాల బేగ్, ఇంకో చిన్న ప్లాస్టిక్ బుట్టలో బుల్లి తెల్ల కేరియరు, మంచినీళ్ళు తీసుకుని ఒక్కడ్నే రిక్షాలో బడికెళ్ళడం. అక్కడ కి వెళ్ళాక లంచ్ బాక్స్ లన్నీ క్లాస్ బయట ఓ చోట పెట్టి వచ్చి కూర్చుని పాఠం వినే వాళ్ళం. పేరుకు కాన్వెంటే కానీ అప్పుడే మొదలవడం వల్ల నేమో బెంచీలు ఉండేవి కాదు నేల మీదే కూర్చునే వాళ్ళం. లంచ్ టైం లో ఆయా కోసం చూస్తే తను నా బుట్ట కూడా తీసి ఇచ్చేది కాదు. మొదటి రోజు ఇలా కాదు అని ఎక్కడుంది అని వెతికితే గేట్ దగ్గర రిక్షా అతనితో మాట్లాడుతూ కనిపించింది వెళ్ళి నాకు అన్నం తినిపించు అని అడిగితే నువ్వే తినాలి అని చెప్పి పంపేసింది. అలానే ఏడుస్తూ ఏదో తినేసి ఇంటికి వెళ్ళాక అమ్మకి కంప్లైంట్ ఇచ్చేసాను. "ఆ ఆయా నాకు అన్నం పెట్టకుండా రిక్షావాడి తో మాట్లాడుతుంది... నాకు ఈ కాన్వెంటు ఏమి నచ్చ లేదు నేను వెళ్ళను..." అని. మా పక్కింటి ఆంటీ "భడవ వేలెడంత లేడు అప్పుడే ఏం మాటలు నేర్చాడమ్మాయ్ !! " అనడం కూడా గుర్తుంది మరి నేనేం చిన్న వాడ్నా చితక వాడ్నా. ఇక ఆ రోజు మొదలు ప్రతి రోజు ఇంట్లో ఓ చిన్న సైజు ప్రపంచ యుద్దం నడిచేది నన్ను స్కూల్ కి పంపించడానికి. నాకు రోజు రోజుకీ కాన్వెంటు మీద దానికి సంబందించిన వాళ్ళందరి మీద ద్వేషం పెరిగిపోతుండేది. నా కాన్వెంటు ఇలా ఉంటే మా ఇంటి పక్కన గోడని ఆనుకుని ఓ వీధి బడి ఉండేది దాని హెడ్మాస్టర్ గారి పేరు నాగేశ్వర్ రావు గారు కనుక ఆ బడి ని కూడా మేం నాగేస్సర్రావ్ మాస్టారి బడి అనే వాళ్ళం కాని అసలు పేరేంటో మర్చిపోయాను. మా ఇంట్లో కిటికీ లో నుండి చూస్తే ఆ బడిలో దదాపు ప్రతి తరగతి లోనూ పిల్లలు ఏం చేస్తున్నారో చక్క గా కనిపించేది. ఆ బడి లో అయితే మధ్య మధ్య లో మంచి నీళ్ళకోసం అని ఇంటికి రావచ్చు, మధ్యాన్నం బోజనం ఇంట్లోనే చేయచ్చు ఇలా బోలెడు అడ్వాంటేజ్ లు కనపడటం మొదలయ్యాయి. దాంతో కాన్వెంటు కి వెళ్ళను అనే నా గొడవ కూడా ఎక్కువైంది, ప్రతి రోజు నా గోల భరించ లేక నాన్న గారికి విసుగు వచ్చి సరే వీడి తల రాత అలా వుంటే ఏం చేస్తాం ఈ వీధి బడి లోనే చేర్చేద్దాం అని ఆఖరికి ఆ కాన్వెంట్ మానిపించేసి, నాన్న దగ్గర ఇంగ్లీష్ బుద్ది గా నేర్చుకోవాలి అని మాట తీసుకుని (మా నాన్న గారికి మంచి గ్రిప్ ఉంది లెండి ఇంగ్లీష్ మీద) నన్ను మా నాగేస్సర్రావ్ గారి తెలుగు మీడియం బడిలో జాయిన్ చేసేసారు. అదనమాట సంగతి...అసలు నన్ను చదివించడానికి, నాకు చదువు మీద శ్రద్ద కలిగించడానికి నానా తిప్పలు పడ్డారు లెండి మా ఇంట్లో ఆ కబుర్లు మళ్ళీ ఇంకో టపా లో చెప్పుకుందాం... శలవా మరి... --వేణు

23 కామెంట్‌లు:

 1. చాలా తీవ్రమైన సమస్య ఎదుర్కున్నారే!బాగుంది.

  రిప్లయితొలగించండి
 2. బాగా వ్రాశారు, చదువుతుంటే నా చిన్నతనం గుర్తుకు వచ్చింది, చిన్నప్పుడు నేను తినాలంటే ఒక చిన్నపాటి యుద్దమే జరిగేది.. ఎందుకంటే నేను ఏ కూరా తినేవాణ్ణి కాదు, మా బంధువులంతా ఇప్పటికీ చెప్పుకొని నవ్వుకుంటారు.

  రిప్లయితొలగించండి
 3. చాలా బాగుంది మీ స్కూలు బాగోతం.
  బొల్లోజు బాబా

  రిప్లయితొలగించండి
 4. వేణూ,
  ప్రకాష్ నగర్ లో సెంటాన్స్ స్కూలుంది. రిక్షాలో వెళ్ళడమే అప్పట్లొ! ఆటోలు లేవు కదా మరి! ఇప్పుడు ఊరినిండా, ఊరి చివరా కూడా కాన్వెంట్ స్కూళ్ళే! రావిపాడు కి దగ్గర్లో సెంట్ మేరీస్ పెట్టారు.బాల్యాన్ని తల్చుకోవడం ఎప్పుడూ ఆనందదాయకమే కదూ!

  రిప్లయితొలగించండి
 5. వేణూ గారు
  నేను కూడా ఆలస్యంగానే పుట్టానంట.. ఒక్క పాలు తాగే విషయంలో తప్పితే మిగిలిన విషయాల్లో ఎలా చెప్తే అలా చేసేవాడినంట...

  మీ టపా నాకు కొన్ని జ్ఞాపకాలని గుర్తు చేసింది.. థాంక్స్..

  రిప్లయితొలగించండి
 6. ఓహో...అదా..సంగతి....
  బాఉన్నాయి మీ కబుర్లు...
  నేను కూడా చిన్నప్పుడు ఆం తిననని మారాం చేసేదాన్ని...ఇంకా..స్కూల్ కెళ్ళడం అంటే నాకు అసలే ఇష్టం ఉండేది కాదు..కాని ఏం చేస్తాం ..విధి చాలా బలీయమైనది..దాని ముందు నేనెంత...పిల్లకాయని...
  వెళ్ళాల్సి వచ్చింది...మొత్తానికి టపా బాఉంది..నా స్కుల్ నాటి రోజులు గుర్తొచ్చాయి...వేణూ గారు....:)

  రిప్లయితొలగించండి
 7. నాకు మా స్కూలు చాలా ఇష్టమే కానీ టైం కు వెళ్ళటం ఇష్టం ఉండేది కాదు. నావల్ల పాపం మా రిక్షా లో పిల్లలంతా లేట్ అయ్యి, లేట్ ఫైన్ కట్టి, మోకాళ్ళ పై కూర్చునే పనిష్మెంట్లూ అనుభవించే వారు. స్కూలు మానే దాన్ని కాదు. రిక్షా వాడు విసిగి పోయి నన్ను వొదిలేసి వెళ్ళి పోతే, బేర్ ! మంటూ వీధి మారు మోగేలా ఏడిచేదాన్ని. స్కూలు లో అన్ని క్లాసు రూముల కన్నా, అయిదో క్లాసు గది ఇష్టం. ఎందుకంటే దానికి రోడ్డు వైపు బాల్కనీ ఉండేది. లంచ్ అక్కడే ! ఆ బాల్కనీ ఎదురుగా స్మశానం ! ఎప్పుడన్నా అక్కడ కొత్త బాడీ వచ్చినప్పుడు ఆ బాల్కనీ లోంచీ చూడటం వింత అనుభవం. ఆ బాల్కనీ కోసమని అయిదో క్లాసు కి ఎప్పుడు వెళ్తానా అని ఎదురు చూసే దాన్ని. అయిదొ క్లాసు తరవాత, ఇంటి దగ్గరే వేరే స్కూల్ లో వేసేరు. అలా స్కూలు, స్మశానం రెండూ మిస్ అయ్యాను. అదో వెర్రి కుతూహలం ! ఆ రోజుల్లోనే, డ్రాకులా సినిమా రెలీస్ కూడా అయింది. ఆ సమాధుల కేసి పాఠం మధ్య లో చూడటం, డ్రాకులా లేస్తాడేమో అని ఆలోచించడం..అన్నీ గుర్తొచ్చాయి.

  రిప్లయితొలగించండి
 8. సుజాత గారు,పైన కాదు బాగా పైన మీరూ సెంటాన్సేనా??

  రిప్లయితొలగించండి
 9. బాగా రాశారు మీ బడి భాగోతం. నా చిన్నప్పుడు మా నాన్న ఊరెళితే నే బడికి సెలవెట్టేసేవాడిని. ఆయన సైకిలెక్కించుకుని తీస్కెళ్తేగానీ బడికెళ్లకూడదని నాకు నేనుగా పెట్టుకున్న రూల్. దాంతో, ఆయన ఊర్లో లేకపోతే నాకు ఆటోమేటిగ్గా కడుపు నొప్పొచ్చేసేది :)

  రిప్లయితొలగించండి
 10. @ప్రతాప్ గారు
  నెనర్లు :-)

  @మహేష్ గారు నెనర్లు
  ఏం చేస్తాం చెప్పండి అన్నీ కష్టాలే నా చిన్నప్పుడు... :-)

  @ప్రపుల్ల గారు నెనర్లు
  నా అంచనా నిజమైతే ఇప్పుడు మీరు అన్ని కూరలు తింటుండి ఉండాలే... నా పని అయితే అంతే అయింది. అప్పుడు ఆడింది ఆట గా సాగించి... హాస్టల్ లో ఉండటం మొదలయ్యాక ఏ గడ్డి పెట్టినా తినే స్టేజ్ కి వచ్చేసా...

  @బాబా గారు
  నెనర్లు :-)

  @సుజాత గారు నెనర్లు
  అవునండీ ప్రకాష్ నగర్ లో సెంటాన్స్ ఉంది ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కాలేజీ అన్నీ వచ్చేసాయ్ అప్పట్లో ఒక చిన్న ఇంట్లో మొదలు పెట్టారు. ఇప్పుడు ఊరు నిండా కాన్వెంట్లే. అవును బాల్యం అద్భుతం I miss those days.

  @దిలీప్ గారు నెనర్లు
  మీకు మళ్ళీ ఓ సారి ఆ జ్ఞాపకాలని గుర్తు చేయగలిగినందుకు సంతోషం.

  @మీనూ నెనర్లు
  గుడ్ మళ్ళీ ఓ సారి ఫ్లాష్‌బాక్ వేసుకున్నావనమాట :-) టార్టాయిసా... ఉల్లిపాయా... బక్కెట్ నీళ్ళా లేదూ కొత్త గా ఇంకోటి కనిపెట్టేశావా...

  @sujaata గారు
  మీ జ్ఞాపకాన్ని మాతో పంచుకున్నందుకు నెనర్లు...అసలీ స్కూల్ రిక్షాలతో అన్నీ కష్టాలేనండి... మా కాలేజి పక్కన ఓ స్మశానం ఉండేది నాకెందుకో అటు చూస్తే చాలా భయం గా దిగులుగా అనిపించేది అందులో జనం ఉంటే మరీనూ.

  @రాజేంద్ర గారు
  నెనర్లు.

  @అబ్రకదబ్ర గారు
  ఈ రూల్ ఏదో బావుందండి.. కానీ నా లా బడి పక్కనే ఉంటే ఈ కడుపు నొప్పి ప్లాన్ పని చేయదు మరీ ఎక్కువైతే అప్పుడు వద్దువు గాని లే అని పంపించేస్తారు :-(

  రిప్లయితొలగించండి
 11. 'రావిపాడు' అన్నారెవరో పైన. ఆ ఊరంతా మా చుట్టాలే. రావిపాడు ప్రస్తావనొస్తే చాలు, ఇప్పటికీ 'కొత్తిల్లు' అనబడే డెబ్భై ఎనభయ్యేళ్ల కాలం నాటి పా...త ఇంటి గురించి పరవశంగా చెబుతుంది మా అమ్మ. వాళ్ల అమ్మమ్మగారి ఇల్లది. చిన్నప్పుడు మా అమ్మ అక్కడే ఆడుకునేదట. (ఆ ఇంటి ముందే రావిపాడు బస్టాపు ఉందనుకుంటా). చిన్ననాటి జ్ఞాపకాలతో అంత పెద్దామె కూడా చిన్నపిల్లగా మారిపోవటం చూస్తుంటే నాకు అబ్బురంగా అనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 12. చాలా బాగుంది వేణు గారు మీ కాన్వెంట్ కహాని. మీరు స్కూల్ కి వెళ్ళను అని మారాం చేస్తే, ఇంట్లో ఎంత అర్జంట్ పనైనా సరె, నేను వెళ్తాను అని మారాం చేసేదాన్నట. మా అమ్మ ఇప్పటికి అంటూ ఉంటుంది. ఈ స్కూల్ విషయంలో అమ్మని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించానని. చదువు మీద ఇంట్రెస్ట్ అనుకొనేరు. అసలు విషయం అది కాదు లెండి, టీచర్లకి పోటీగా పూలు ఇచ్చేవాళ్ళము, నాకన్నా ముందు ఇంకొకళ్ళు ఇచ్చేస్తారెమో అని అసూయ ఎక్కువైపోయి స్కూల్ మీద ధ్యాస మళ్ళేది. నాకు మీ ఈ టపా ద్వారా నా బాల్యం గుర్తొచ్చేస్తోంది.

  రిప్లయితొలగించండి
 13. వేణూ, ఏ నాగేస్సర్రావు బడి? నాకు తెలిసి SSN College దగ్గరే ఒక నాగేస్వర్రావు బి.కాం పాసవగానే ఒక స్కూలు పెట్టేసాడు తెలుగు మీడియంలో!

  రాజేంద్ర కుమార్ గారు,
  నేను సెంటాన్స్ కాదండి! నేను చదివిన కాలేజీ(SSN college)కి అనుబంధ సంస్థ గా ఒక స్కూలుండెది. సిద్దార్ధ విద్యాలయం అని, అందులో చదివాను నేను ఏడు దాకా! అక్కడినుంచి గర్ల్స్ హై స్కూలు.

  రమణి గారు,
  మీరు కూడానా, స్కూల్లో టీచర్లకు పూలు ,చెట్లన్నీ ఖాళీ చేసి మరీ పట్టుకెళుతండేవాళ్లం మేము కూడా.

  రిప్లయితొలగించండి
 14. సుజాత గారు,ఇక్కడ నా ఉద్దేశ్యం మీరు ఏ స్కూలు అని కాదండి.మీరు కూడా సెంటాన్స్ అని రాస్తున్నారే అని!!సెయింట్ యాన్స్.సెయింట్ మేరీస్ ఇలా పలకాలని చదివా ఎక్కడో

  రిప్లయితొలగించండి
 15. రాజేంద్ర గారు,
  రాయడం సెయింట్ ఆన్స్, సెయింట్ మేరీస్ అని రాసినా పలికేటపుడు మొత్తం కలిపేసి సెంటాన్స్ అని పలకడం మామూలేకదా అని అలా రాశానండి, నిజానికి రాసి ఉండకూడదు. పొరపాటే!ఇప్పుడు పైకెళ్ళి మీ వ్యాఖ్య చదివితే మీ భావం అర్థమైంది.

  రిప్లయితొలగించండి
 16. @అబ్రకదబ్ర గారు
  చిన్ననాటి జ్ఞాపకాలంటే అంతే కదండీ మరి.

  @రమణి గారు నెనర్లు
  భలే గుర్తు చేసారు, మా ఇంట్లో గులాబి, చిలక ముక్కు, కనకాంబరాలు, ముద్దబంతి, కారబ్బంతి మొక్కలు పెంచేవాళ్ళం మా పిన్ని తో కలిసి నేను పాదులు చేసి ఎంత అపురూపం గా చూసుకునే వాళ్ళమో... ఆ ఇల్లు వదిలి వచ్చాక మళ్ళీ కుదర్లేదు. ఎండా కాలం సాయంత్రాలు కనకాంబరాలకి నీళ్ళుపోస్తే టప్ టప్ అని చప్పుడు చేస్తూ గింజలు పగుల్తాయ్ అది చూడటం ఎంత సరదానో నాకు. నేను పువ్వులు ఇవ్వ లేదు కానీ చిలకముక్కు పూలని వుండేవి ఒక అడుగు కన్నా పెరిగేవి కావు మొక్కలు పూలు ఎర్రగా భలే అందం గా ఉండేవి కానీ తల్లో పెట్టుకోరు అనుకుంట చూడటానికి బావుండేవి మా శాయమ్మ టీచరు గారికి బాగా నచ్చాయని వాళ్ళ ఇంట్లో నాటు కోడానికి గింజలు ఇచ్చినట్లు గుర్తు.

  @సుజాత గారు
  లేదండీ మా బడి స్టేషను దగ్గరలో రైల్వే క్వార్టర్స్ పక్కనే ఉండేది దూది ప్రెస్ ఎదురు రోడ్ లో కొంచెం దూరం వెళ్తే వస్తుంది. నేను నాలుగులోనో అయిదు లోనో ఉన్నపుడు అక్కడ నుండి మార్చేసారు, రామిరెడ్డి పేట లో లోపలకి ఉండేది.

  @రాజేంద్ర గారు
  నిజమేనండీ పలకడం అలా పలకాలి కానీ వాడుకలో ఆ అలవాటు చాలా తక్కువ. అన్నీ కలిపేసే పలికేస్తాం... అయినా పుస్తకాలలోనో కధ లలోనో అంటే అనుకోవచ్చు కానీ విషయం అర్ధం అయినంత వరకు కామెంట్స్ లో కుచ్ భీ చల్తా (ఏదైనా ఓకే)...

  రిప్లయితొలగించండి
 17. అవునండి అన్ని తింటున్నాను... కాకాపొతే హాస్టల్ లో ఎప్పుడూ లేను లేండి.

  రిప్లయితొలగించండి
 18. ఎం డిసైడ్ చేసినావన్నా? మనదీ నరసరావుపేటే. బ్లాగు బాగుంది. చివరకి మీరు ఎక్కడ చదివారు స్కూలు చదువు? మీరు ఎక్కడ ఉండేవారు?

  రిప్లయితొలగించండి
 19. @గీతాచార్య గారు నెనర్లు,
  ఆహా బ్లాగ్ లోకం అంతా పల్నాటి జనం తో నిండిపోయినట్లుంది గదండీ... నాకు అన్నీ గుర్తున్నాయ్ కానీ నేను 6 వరకు చదివిన స్కూల్ పేరు గుర్తు రావడం లేదండీ. నాగేశ్వర్రావ్ మాష్టారి బడి అనడమే గుర్తు. 9 10 మాత్రం గాలికోటయ్య (SKRBR) లో చదివాను. మధ్య లో ఓ రెండేళ్ళు పిడుగు రాళ్ళలో జడ్పీ... మేము ప్రకాష్ నగర్ స్వామీ కాన్వెంట్ దగ్గర ఉండేవాళ్ళం.

  రిప్లయితొలగించండి
 20. టాంక్స్. మాది రామి రెడ్డి పేట. బాగుంది. మన పేటోళ్లంతా బ్లాగుల్లో విజయ విహారం చేయాలి. మీకు మురళీ మాస్టారు తెలుసా?

  రిప్లయితొలగించండి
 21. వేణు గారు, మీరు చదివింది శ్రీ దివ్వెల కాశీ రత్నం స్కూల్ అండి. నేను అక్కడే చదువుకున్నను (86-93). నాగేశ్వర రావు గారు హెడ్ మాస్టారు. మీకు ఒకటో తరగతికి చెవిటి టీచర్ (పేరు మర్చిపోయాను, క్షమించగలరు) గుర్తున్నారా, ఇంకా నాగ శిరోమణి టీచర్ (3rd class), సాయమ్మ టీచర్ (5th class) మరియు హిందీ మాస్తరు. మీ అగ్ని పూల పోస్ట్ మరియు బజా రయ్య పోస్ట్ చూడగానే స్కూల్ కళ్ళ ముందు కదిలింది అండి. మా ఇల్లు జోజి రెడ్డి హాస్పిటల్ వెనుక బజార్లో వుంది. మీ కామెంట్స్ ఇంతకూ ముందు చూసాను కాని గత రెండు రోజులుగా మీ బ్లాగ్ చదవడం మెదలెట్టాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సరళ గారు థాంక్స్ ఎ లాట్ అండీ స్కూల్ పేరు గుర్తు చేసినందుకు... కరెక్టేనండీ అదే స్కూల్. మీరు చెప్పిన ఒకటో తరగతి టీచర్ గారు, నాగశిరోమణి గారు గుర్తు లేరండీ. సాయమ్మ టీచర్ గారి గురించీ హిందీ మాష్టారు వీరయ్య గారి గురించీ ఈ పోస్ట్ లో రాశాను చదివే ఉంటారు. http://venusrikanth.blogspot.in/2008/07/blog-post_11.html
   నేను ఆ స్కూల్ లో ఐదో తరగతి వరకే చదువుకున్నానండీ తర్వాత నాన్నగారికి ట్రాన్సఫర్ అవడంతో పిడుగురాళ్ళ వెళ్ళిపోయాం. అది కూడా మీరు అక్కడ జాయిన్ అవడానికి రెండేళ్ళు ముందే :-) 86 లోనే మళ్ళీ నరసరావుపేట వచ్చి జోజిరెడ్డి గారి హాస్పిటల్ వెనక లైన్ లోనే ఉన్నాం ఒక రెండేళ్ళు. మన స్కూల్ నుండి వచ్చేప్పుడు ఆ వీధి మొదట్లోనే కబీర్ దాస్ గారు అని ఉండేవారు వారింట్లో ఉండేవాళ్ళం.
   ఎప్పటిదో పోస్ట్ చదివి ఓపికగా కామెంట్ వ్రాసినందుకు మీకు చాలా చాలా థాంక్స్ :-) మీవల్ల నేను మళ్ళీ ఆ పోస్టులు కొన్ని చదువుకుని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాను.

   తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.