అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

బుధవారం, జులై 29, 2015

భారత రత్నానికి నివాళి..

Sand sculptor Sudarshan Patnaik pays tribute to the
People's President through this unique sand art
మరణం అనివార్యమని తెలిసినా ఆత్మీయులనో ఆత్మ బంధువులనో కోల్పోయినపుడు మనసు బాధపడక మానదు. అదీ కలాం గారి లాంటి మహోన్నతమైన మనిషి దూరమైతే మిన్ను విరిగి మీద పడినంతగా చలించి పోవడం సహజమే. కానీ ఈ సమయంలో ఆయన మరణాన్ని చూసి కన్నీరు కార్చవద్దు ఆయన మహోన్నతమైన జీవితాన్ని చూసి గర్వపడదాం.. స్ఫూర్తి పొందుదాం.. దదాపు గత మూడు దశాబ్దాలుగా (బహుశా ఇస్రో/డీఅర్డీఓ గురించి తెలిసిన వారికి అంతకు ముందు నుండే) ఈ దేశంలోని ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా విధ్యార్ధులలో యువతలో ఆ మహానుభావుడు రగిలించిన స్ఫూర్తి వెలకట్టలేనిది. 

ఎన్ని విజయాలు సాధించినా.. ఎన్ని కీర్తి శిఖరాలని అధిరోహించినా.. ఎంతటి ఉన్నతమైన పదవులు స్వయంగా ఆయన్ని వరించినా.. ఆయన మాత్రం తన సింప్లిసిటీని వదలక అందరికి అందుబాటులో ఉంటూ కామన్ మాన్ గా ప్రతి ఒక్కరి అభిమానానికి పాత్రులయ్యారు. ఈ దేశపు ప్రధమ పౌరునిగా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా విద్యార్ధుల కోసం ఉపన్యాసాలు ఇవ్వడానికి ఎంత దూరమైనా ఎన్ని కిలోమీటర్లైనా ఆ విద్యాలయం చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా వందా రెండొందలమంది చదువుకునే చిన్న పబ్లిక్ స్కూల్స్ నుండి ఐ.ఎస్.బి. ఐ.ఐ.ఎమ్ ల వరకూ ఎక్కడికైనా ఎంతటి ప్రయాసకైనా ఓర్చి వెళ్ళేవారు. 

చివరికి వారికి అంత్యంత ఇష్టమైన ఈ వ్యాపకంతోనే ఐ.ఐ.ఎం లొ లివబుల్ ఎర్త్ స్పీచ్ లో భాగంగా నాయకత్వ లక్షణాలని గురించి యువతకు చక్కని స్పీచ్ ఇస్తూ తన చివరి క్షణాలు విద్యార్ధులతో గడపడం చూస్తే. ఆయన లేకపోవడం కొంచెం బాధను కలిగించినా ఇలా తనకిష్టమైన పని చేస్తూ అనాయాస మరణం పొందడం ఎందరికి సాధ్యం చెప్పండి అనిపిస్తుంది. మిసైళ్ళూ రాకెట్లే కాదు మరణం సైతం ఆయనకి సలాం చేసి గులామైందని అనిపించక మానదు. అందుకే నాకు ఆయన మరణం చూసి కన్నీరు రావట్లేదు.. ఆయన లాంటి ఒక ఉత్తమ భారతీయుని జీవితాన్ని చూసి గర్వంగా ఉంది..  

అంతటి మహా మనిషి సైతం సామాన్య మానవుల్లా ఎనభై నాలుగేళ్ళకే మరణించాలా? మరికొంతకాలం జీవించి ఉంటే బాగుండేదని అనిపించినా.. అలాంటి మహోన్నతులకు మరణం ఉండదు.. ఈ దేశపు ప్రతి పౌరుడి గుండెలో వెలుగై శాశ్వతంగా కొలువుంటారు అనే నిజం ధైర్యాన్నిస్తుంది. ఆ నవ్వు ముఖం, వారి స్ఫూర్తినిచ్చే మాటలు అన్నీ ఏదో క్షణంలో గుర్తొస్తూనే ఉంటాయి. కుదిరితే మళ్ళీ మాకోసం ఈ దేశ ప్రజలలో మరిన్ని తరాలలో స్ఫూర్తి నింపడం కోసం కలాం గారు ఈ దేశంలోనే జన్మించాలని మనసారా కోరుకుంటున్నాను.. ఎంత వద్దనుకున్నా కానీ వారి అంతిమ క్షణాలను గురించిన ఈ పోస్ట్ ఛదివినపుడు ఎందుకో తెలియకుండా హృదయంతో పాటు కనులు చెమరించాయి.

గురువారం, జులై 16, 2015

బాహుబలి - ది బిగినింగ్...

ఆన్ లైన్ మూవీ వెబ్ సైట్స్ లో తక్కువ వచ్చిన రివ్యూ రేటింగ్స్ అండ్ వాటిలో రివ్యూవర్స్ కామెంట్స్ చూసి నిరుత్సాహ పడి సినిమా చూడడం మానేసిన వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. ఈ సినిమా చూడకపోవడం వలన మీరో అద్భుతమైన అనుభవాన్ని మిస్ అవుతున్నారు. చిన్నతనంలో చందమామ లాంటి పుస్తకాలలో చదువుకున్న అందమైన కథలను కనుల ముందు సాక్షత్కరింప జేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు.

నేను కొన్ని హాలీఉడ్ వార్ ఎపిక్ చిత్రాలు ఇదివరకే చూసినా వాటిలో ఏదో తెలియని లోటు కనిపించేది నాకు ఒక విధమైన అసహజత్వం కనిపించేది, ఆ మనుషులు, కాస్ట్యూమ్స్, గెటప్స్, స్వరాలు, భాష ఒకదానితో ఒకటి పొంతన కుదరక అన్నిటికి మించి చిన్నప్పటినుండీ నేను చదువుకుని ఊహించుకున్న సన్నివేశాలకు భిన్నంగా ఉండి పూర్తి సంతృప్తినిచ్చేవి కాదు. ఏదో మిస్ అయిన ఫీల్ ఉండేది. బాహుబలి మొదటి సారి ఆ లోటు తీర్చింది. అంతా మనదైన ఒక అద్భుత లోకాన్ని కనులముందు ఆవిష్కరించింది.  

కామెడీ లేదు కాకరకాయ లేదు భోజనం మధ్యలో లేపేసినట్లుంది అంటూ వ్రాసిన రివ్యూలను పట్టించుకోకుండా ఈ క్రింద నేను రాసే మిగిలిన రివ్యూను కూడా చదవకుండా తక్షణమే వెళ్ళి ఈ సినిమా చూడండి. అద్యంతం మీరు పెట్టిన ప్రతి పైసా వసూల్ అయ్యిందనిపించే ఎంటర్ టైన్మెంట్ పొందుతారనే పూచీ నాది. తనువు రోమాంచితమయ్యే సన్నివేశాలని చూసి ఆహా ఏం తీశాడ్రా మన వాడు అని ఖచ్చితంగా గర్వపడి మరింత మందికి చూపిస్తారు.

సాథారణంగా ఏదైనా ఒక సినిమా హిట్ అయితే దానిలోని పాత్రలను కొనసాగించి మరో కొత్త కథ రాసుకుని దీనికి సీక్వెల్ తీయడమనేది ఒక అలవాటు. గత కొన్ని సంవత్సరాలుగా హాలీఉడ్ లో కొన్ని సినిమాలు ముందే ఇన్ని భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకుని అన్ని ఉప కథలుగా విడగొట్టుకుని తీయడం మరో కొత్త ట్రెండ్ అయింది. కానీ ఈ సినిమా కథ అలా కాదు ఉన్నది ఒకటే కథ అదంతా రెండున్నర గంటల నిడివిలో చెప్పలేక రెండు భాగాలుగా విడగొట్టామని ఇది ఒక సినిమా ఫస్టాఫ్ లా ఉంటుందని మొదటినుండీ చెప్తూనే ఉన్నారు.

అలా ముందుగా చెప్పి ప్రిపేర్ చేసినా కూడా మొదటి భాగం అర్థాంతరంగా ఆగిపోయిందనడం హాస్యాస్పదం. కాకపోతే ఇంత అద్భుతమైన చిత్రం మిగిలిన కథ తెలుసుకోడానికి ఏడాది ఎదురు చూడాల్సి రావడం కష్టం కలిగించే విషయమే. కానీ అది ఇష్టమైన కష్టం దానికి దర్శక నిర్మాతలను ఆక్షేపించడమో అది ఈ సినిమాలో ఒక లోపమనడమో ఎప్పటికీ చేయలేం. అసలు సినిమా అద్యంతం ఆశ్చర్యంతో ఒక అద్భుతాన్ని చూసినట్లు చూడడమే తప్పించి మరో ఆలోచనే రాదు.

నిజానికి రెండు పార్టులు చూసేవరకూ సినిమా గురించీ కథా కథనాల గురించీ విశ్లేషించడమో సమీక్షించడమో సరికాదు కానీ ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాల గురించి ప్రస్తావించడానికి ఈ పోస్ట్ రాస్తున్నాను. కథ ఇప్పటికే చాలా రివ్యూలు చదివి తెలుసుకుని ఉంటారు, ఒక వేళ తెలియకపోతే తెలుసుకోకుండానే సినిమా చూసి మీ అనుభూతి సాంద్రతను మరింత పెంచుకోండి.

పురిటిలోనే తల్లినుండి వేరై విధివశాత్తు విపత్కర పరిస్థితులలో కోయదొరలను చేరుతాడు మన హీరో శివుడు (ప్రభాస్). అనుకోని పరిస్థితుల్లో మాహిష్మతి రాజ్యంలో అడుగుపెట్టిన శివుడిని చూసిన ప్రజలంతా ’బాహుబలి’ ’బాహుబలి’ అని పిలుస్తుంటారు. ఈ బాహుబలి ఎవరు అతని కథేమిటి? అతనికి తనకి ఉన్న సంబంధమేమిటి? మాహిష్మతి సామ్రాజ్యంలో ఏం జరిగింది? అనేది శివుడు తెలుసుకోవడమే మొదటి భాగంలోని కథ. అయితే అది ఇందులో కొంతవరకే చెబుతారు. అసలు అన్నదమ్ముల మధ్య వైరం ఏమిటి, బాహుబలి ఏమయ్యాడనే పూర్తి కథ తెలుసుకోడానికి పార్ట్ టూ(బాహుబలి – ది కంక్లూజన్) కోసం వచ్చే ఏడాది వరకూ ఎదురు చూడాలి.

సినిమాలో మొదట చెప్పుకోవలసింది దర్శకుడు రాజమౌళి విజన్ ని. తన ప్రతీ చిత్రానికీ తను సెట్ చేసుకున్న బౌండరీస్ ని తనే మరికొంచెం జరుపుకుంటూ ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభూతిని అందించాలని తపనపడే ఇతను ఈ చిత్రంలో ఆ బౌండరీని మరింత ఛాలెంజింగ్ లెవల్ లో సెట్ చేసుకుని విజువల్ గా ఒక అద్భుతాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు. అతని విజన్ ని అంతే అద్భుతంగా తెరకెక్కించిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఈ చిత్రం ఒక విజువల్ వండర్ గా వేనోళ్ళ కొనియాడబడుతుందంటే దానివెనుక అతని కృషి అభినందనీయం. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ పర్యవేక్షించిన శ్రీనివాసమోహన్ కూడా అద్భుతమైన వర్క్ చూపించారు. నా దృష్టిలో ఈ చిత్రానికి ఈ ముగ్గురు ముఖ్యమైన పిల్లర్స్ వంటివారైతే నాలుగో పిల్లర్ ప్రధాన పాత్రధారులు. కీరవాణి గారి పాటలకన్నా రీ-రికార్డింగ్ ఆకట్టుకున్నాకూడా నేషనల్ అప్పీల్ కోసం కొంత కాంప్రమైజ్ అయ్యరేమో తెలియదుగానీ 'మగధీర', 'ఈగ' సినిమాలలోలా తన సంగీతంతో ఎలివేట్ చేసి గూస్ బంప్స్ తెప్పించిన సన్నివేశాలు లేవనిపించింది.. 

మరుపురాని పాత్రలలో.. మాహిష్మతి సింహాసనానికి కట్టుబానిసగా ఉంటూ దానిని అధిష్టించిన వారిని రక్షిస్తామని తమ పూర్వీకులు ఇచ్చిన మాటకు కట్టుబడి నమ్మకానికి నిలువెత్తు రూపంగా మసలుతూ. మనసులో భల్లాలదేవుడిని చంపాలన్నంత కోపమున్నా కూడా విధి నిర్వహణ కోసం తన ప్రాణాలడ్డుపెట్టైనా సరే అతడ్ని కాపాడుతూ ఉండే యోధుడు 'కట్టప్ప' పాత్రలో సత్యరాజ్ నటన అత్యద్భుతం.

కన్న కొడుకుపై ఉన్న పేగు బంధానికీ, తనకు దక్కని సింహాసనం తన వారసుడికైనా దక్కాలనే కట్టుకున్న భర్త కోరికకీ తలవంచక ధర్మానికి కట్టుబడి ఉండే వ్యక్తిగా, రాజతంత్రాన్ని ఔపోసన పట్టి శతృవును మట్టికరిపించే క్రౌర్యాన్ని మాతృత్వపు మమకారాన్ని ఒకే సమయంలో చూపించగల రాజమాత 'శివగామి'గా రమ్యకృష్ణ నటన అనితర సాధ్యం. ఆవిడ లేకపోతే మా సినిమా లేదని రాజమౌళి చెప్పిన మాటలో అసత్యం లేదనిపిస్తుంది.
  
భీకరమైన ఆకారం, గంభీరమైన స్వరం, సుస్పష్టమైన వాచకం, వెన్నులో చలిపుట్టించే తీక్షణమైన చూపులు తన సొంతం. ఒకేఒక్క పిడిగుద్దుతో అడవిదున్నను సైతం నేలకూల్చగల బలవంతుడు, తండ్రికున్న పదవీ కాంక్ష తనకీ ఉన్నా మనసులోని మర్మం మరిఒకరికి తెలియనివ్వక మెసలుతూ కౄరత్వానికీ విలనిజానికీ నిలువెత్తు రూపమైన 'భల్లాలదేవుడు'గా రాణా తనని తాను మలుచుకున్న తీరు శ్లాఘనీయం. ఈ సినిమాలో నాకు నచ్చిన పాత్ర ఇదే. ఈ పాత్రలో రాణాని చూసి భళా అనకుండా ఉండలేం. ద్వితీయ భాగంలో ఇతని సన్నివేశాలకోసం ఎదురు చూసేలా చేశాడు.  

ఆకాశమే హద్దుగా దేన్నైనా సాధించగలననే నమ్మకం, పట్టుదల తన సొంతం. అతనికి దేవుడి మీద నమ్మకం కన్నా అమ్మమీద ప్రేమే అంతులేనిది. అసాధ్యాలను సుసాధ్యాలను చేయాలని ఉవ్విళ్ళూరే 'శివుడి'గా, రాజంటే రణరంగంలో శత్రువులను గెలవడమే కాదు రాజ్యంలో ప్రజల మనస్సులను కూడా గెలుచుకోవాలని బలంగా నమ్ముతూ అంతులేని పరాక్రమానికి బుద్ధిబలం తోడై మంచితనానికి మరో రూపమైన 'అమరేంద్ర బాహుబలి'గా రెండు పాత్రలలో ప్రభాస్ మెప్పించాడు. గత చిత్రాలతో పోలిస్తే దేహదారుఢ్యాన్ని తను పెంపొందించుకున్న తీరూ, ఇంచుమించు రాణాతో సమానంగా పెరిగినా అతనిలా భారీగా కనిపించకుండా ప్రతి కదలిక కళాత్మకంగా ఆకట్టుకునేలా ప్రదర్శించిన తీరూ అద్భుతం. 

తనని పాతికేళ్ళుగా బంధీగా ఉంచి చిత్రహింసలకు గురిచేస్తున్న భల్లాలదేవుడి పై తన అణువణువులోనూ రగులుతున్న ద్వేషాన్ని అణచిపెట్టి తనని విడిపించడానికి తన కన్నకొడుకొస్తాడని ఆశగా ఎదురు చూసే ’దేవసేన’ పాత్రలో అనుష్క కనిపించినది ఒక్క పదినిముషాలే అయినా ఈ పాత్ర ధరించడం వేరొకరి వల్లకాదు అనిపించింది. దేవసేన విముక్తే తన జీవిత ధ్యేయంగా పోరాడే యోధురాలిగా, స్త్రీ సహజమైన సున్నితత్వాన్ని మిస్ అవుతున్నానా అని బాధపడే యివతి 'అవంతిక' గా తమన్నా మంచి కృషి చేసింది కానీ ప్రేమ శృంగారం పలికినంతగా తన ముఖంలో వీరం రౌద్రం పలకలేదనిపించింది.

ఈ పాత్రల తీరుతెన్నులు రెండవభాగంలో మారిపోయే అవకాశాలు లేకపోలేదు కానీ ఈ చిత్రం వరకూ మాత్రం ఖచ్చితంగా మెప్పించాయి. ఇంకా ఆయుధవ్యాపారి 'అస్లాంఖాన్' గా సుదీప్, ఆహార్యంతోనే జుగుప్స రేకెత్తించే 'కాలకేయ' గా ప్రభాకర్, తండ్రి తాతల మధ్య దుర్బుద్దులని నోటి దురుసునీ వారసత్వంగా పొందిన 'బద్రుడి' గా అడవి శేష్ కూడా ఆకట్టుకున్నారు.

కోయగూడెం నాయకుడి భార్య 'సంగ' గా తన ఒక్క మాటతో భర్తతో సహా గూడెం మొత్తాన్ని కట్టడి చేయగల పవర్ ఫుల్ పాత్రలో నటించిన రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాత్ర కోయగూడేనికి శివగామిలా ఉంటుంది. ముఖ్యమైన నాలుగు స్త్రీ పాత్రలను (శివగామి, సంగ, దేవసేన, అవంతిక) శక్తి స్వరూపాలుగా మలచినందుకు కథకులు విజయేంద్ర ప్రసాద్ గారిని, రాజమౌళి ని అభినందించి తీరాలి.

తెలుగు సినిమా స్థాయిని కొన్ని రెట్లు పెంచే విజువల్ ట్రీట్ గా తీర్చిదిద్దడానికి ఈ చిత్ర యూనిట్ పడిన శ్రమకి, వెచ్చించిన సమయానికి, పెట్టిన పెట్టుబడికి ధీటుగా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్న ఈ చిత్రానికి ఇంకా ప్రత్యేకమైన ప్రమోషన్ అవసరం లేదు కానీ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. భారతీయత నిండిన ఊహాలోకపు విజువల్ ఫీస్ట్ కోసం, ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీ సొంతం చేసుకోడానికి ప్రతి ఒక్కరూ మిస్ అవకుండా చూడవలసిన చిత్రం బాహుబలి.


శుక్రవారం, ఏప్రిల్ 17, 2015

సన్నాఫ్ సత్యమూర్తి...

సన్నాఫ్ సత్యమూర్తి - ’విలువలే ఆస్తి’ - ఆ టైటిల్ కీ ఈ ట్యాగ్ లైన్ కీ వందశాతం జస్టిఫికేషన్ ఇచ్చే సినిమా ఇది. ఒక సినిమాలో హీరోయిన్ తనపై అటాక్ చేసిన రౌడీలని చితకబాదిన హీరోతో “నాకు వాళ్ళకంటే నిన్ను చూస్తేనే ఎక్కువ భయమేస్తుంది” అని అంటుంది. అలా ఈ కాలం సినిమాల్లో హీరోలు విలన్ల కన్నా భయానకంగా తయారవుతున్నారు. విలువల సంగతి దేవుడెరుగు కనీసం సగటు మనిషిలా ప్రవర్తించకపోవడమే హీరోయిజం అనిపించుకుంటున్న ఈ రోజుల్లో...

ఒక మంచి అబ్బాయి, మనుషులకు, బంధాలకు విలువనిస్తూ, వదినని తల్లిలా గౌరవిస్తూ, వాళ్ల నాన్న నేర్పిన విలువలను నిలువెల్ల వంట బట్టించుకుని వాటితోనే జీవించడానికి ఇష్టపడే హీరో. అలా అని అతను అల్లరి చేయడా అంటే చేస్తాడు కాని హీరోయిన్లని ’ఏవే’ ’ఒసే’ అంటూ, డబుల్ మీనింగ్ డైలాగుల్తో మాట్లాడుతూ చూసే వాళ్లకి ఒళ్లు కంపరమెత్తేలా కాదు... ఆ చేసే అల్లరిలో కూడా హుందాతనం ఉంటుంది, చూడ ముచ్చటగా ఉంటుంది... అలా అల్లరి చేస్తాడు. నిజానికి ఇలాంటి హీరోలు కొత్తేం కాదు ఒకప్పటి సినిమాల్లో ఇలాగే మంచిగా ఉండేవాళ్ళు. ఇది మళ్ళీ అలాంటి ఓ హీరో విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) కథ.

ఇక హీరోయిన్స్ అంటే దేవలోకం నుండి భూలోకానికి దిగొచ్చిన దేవకాంతలు కాదు సగటు మనుషులే వాళ్లకీ బలహీనతలుంటాయ్, కొందరు సొంత నిర్ణయాలు తీస్కునే తెలివితేటల్లేక తండ్రి ఎవర్ని చూపిస్తే వాళ్లమీదకి ప్రేమను బదిలీ చేసుకోగల సగటు అమ్మాయిల్లాగే ఉంటారు, కొందరికి టైప్ వన్ డయాబెటిస్ లాంటి పుట్టుకతో వచ్చే అనారోగ్యాలూ ఉంటాయ్, మరికొందరికి ఒకడ్ని కట్టుకుని కాఫీలో విషమిచ్చి చంపేసి అన్న దగ్గర సింపతీ కొట్టేసి నచ్చిన వాడ్ని పెళ్లి చేస్కోవచ్చు అనే తింగరి ఆలోచనలొచ్చే లాజిక్కు లేని బుర్రలుంటాయ్... అలాంటి ఓ ముగ్గురమ్మాయిలు పల్లవి(అదాశర్మ), సమీర(సమంత), వల్లి(నిత్యామీనన్) మన హీరో గారి జీవితాన్ని ఎలా ప్రభావితంచేశారో చెప్పే కథ ఇది.

మన హీరో విరాజ్ ఆనంద్ తండ్రి సత్యమూర్తి (ప్రకాష్ రాజ్) మనుషులు, బంధాలు, విలువలు ముఖ్యమని.. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదని నమ్మే వ్యక్తి. అతనికి పూర్తి వ్యతిరేకమైన భావజాలంతో జీవితంలో డబ్బే ముఖ్యమనీ బంధాలు, విలువలు అన్నీ తరువాతేనని నమ్మే వ్యక్తి పేరులోనే పైసా ఉన్న పైడా సాంబశివరావు (రాజేంద్రప్రసాద్). తమిళనాడులోని కొన్ని ఊళ్ళని అనఫిషయల్ గా పరిపాలించే నియంత, మంచినీళ్ళు తాగినంత సులువుగా మర్డర్ చేసేయగల కర్కోటకుడైనా కట్టుకున్న భార్య ముందు ఆవిడ ప్రేమ ముందు తలవంచి ఆవిడ కోసం కొన్ని నియమాలను పాటిస్తూ ఊరి గొడవలను తనలోని రాక్షసుడిని ఆవిడకు తెలియకుండా దాచి ఉంచే వ్యక్తి దేవరాజ్(ఉపేంద్ర). వీరు ముగ్గురికి ఒకరితో ఒకరికి గల బంధమేమిటో వాళ్ళు హీరో లైఫ్ లో పోషించిన పాత్రేమిటో చెప్పే కథ ఇది.

ప్రాక్టికాలిటీ మెటీరియలిజం పేరేదైనా తరతరానికి మనిషి ఆలోచనలలో ఎలాంటి మార్పు వస్తుంది, ఎటువంటి వాటికి విలువ ఇస్తున్నాడు వేటికి ఇవ్వట్లేదు, ఎలాంటి ప్రయారిటీస్ ఎంచుకుంటున్నాడు అనే వాటిని వివిధ పాత్రల ప్రవర్తన ద్వారా స్పష్టంగా మన కళ్ళముందు ఉంచుతుందీ చిత్రం. చక్కని సంభాషణలతో సన్నివేశాలతో మన దైనందిన పరుగు ఆపి ఒక్క క్షణం ఆలోచించేలా చేస్తుందీ చిత్రం. దీనికి తోడు హుషారైన పాటలు, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్, సన్నివేశాలకు తగినట్టి నేపధ్య సంగీతం, చక్కని సినిమాటోగ్రఫీ వెరసి ఒక మంచి అనుభూతిని మన సొంతం చేస్తాయి. అల్లు అర్జున్, ఉపేంద్ర ల నటన చూడడం కోసమే ఈ సినిమా చూడవచ్చు.  

త్రివిక్రమ్ రచయితగా దర్శకుడుగా పని చేసిన గత చిత్రాల తాలుకు జ్ఞాపకాలను కాసేపు పక్కన పెట్టేసి అనుభవజ్ఞుడైన దర్శకుడు ప్రతిభ ఉన్న నటులతో కలసి చెప్పే ఓ మంచి కథ విందాం తను ఏం చెప్పాలని ప్రయత్నించాడో ఓ క్షణమైనా ఆగి ఆలోచిద్దాం అనే ఆలోచనతో ఈ సినిమా చూడండి. త్రివిక్రమ్ మిమ్మల్ని నిరాశ పరచకపోగా మీకు తన మీద గౌరవం మరికొంత పెరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పగలను.

ఇందులో ఓ పాటుంటుంది “శీతాకాలం సూర్యుడి లాగా కొంచెం కొంచెం చూస్తావే... వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే” అని... అచ్చం ఈ పాటలో చెప్పినట్లే సినిమాలో త్రివిక్రమ్ పంచ్ డైలాగులు, హాస్యం కూడా కొంచెం కొంచెమే అంటే కథకు ఎంత అవసరమో అంతే ఉంటాయి ఉన్న కాసేపూ హాయినిస్తాయి. సినిమా పూర్తయాక ఒక మంచి సినిమాని చూశామనే ఫీలింగ్ నిస్తాయి. 

పిజ్జాలు బర్గర్ లు బిర్యానీలూ ఎన్ని తిన్నా... పెరట్లో నాన్న మన పక్కన కూర్చుని కబుర్లు చెప్తుంటే అమ్మ వేడి వేడి అన్నంలో అంత ఆవకాయ ఇంత వెన్నపూస కొంత ముద్దపప్పు కలిపి తినిపిస్తుంటే ఆ రుచీ కమ్మదనం వేరే వేటికీ రాదు కదా. అందుకే కమర్షియల్ హంగులు లేవనీ ఎంటర్ టైన్మెంట్ లేదనీ హీరో పాసివ్ అని విలన్ తో ఎదురు పడి ముష్టి యుద్దం చేయలేదని అంటూ వేయి వంకలు వెదికి రాసిన రివ్యూలు చదివి సినిమాకి వెళ్లకుండా ఆగిన వాళ్ళెవరైన ఉంటే ధైర్యంగా వెళ్ళి చూడండి. చేసిన మంచి వృధాపోదు, ఒకరికి మంచి చేస్తే మనకీ మంచే జరుగుతుంది అనే నమ్మకాన్ని బలపరిచే కథను తెలుసుకోండి. ఒక మంచి అనుభూతిని మిస్ కాకండి.  

చిత్రంలో నాకు నచ్చిన కొన్ని సంభాషణలను ఇక్కడ కోట్ చేస్తున్నాను. దయచేసి ఇంకా సినిమా చూడని వారు ఇవి చదవకండి.


“ఎప్పుడూ నీళ్ళలో ఉండే చేపకి జలుబు అంటుకోనట్లు ఇంత సంపాదించినా ఆయనకి డబ్బుపట్టలేదు”

“మోసపోవడం ఫూల్ అవడం ఇవన్నీ ఒక మనిషి ప్రాణం కన్నా ఎక్కువా?”

“తెలివి తేటలు వాడాల్సింది అవతలి వాళ్లని మోసం చేయడానికో లేదా వాళ్ళు ఎప్పుడు మోసం చేస్తారా అని కనిపెట్టడానికో కాదు... పని చేయడానికి అంతే”

“రావణాసురుడు సీతని పట్టుకున్నాడు రాముడి చేతులో చచ్చాడు, వదిలేసుంటే కనీసం బ్రతికుండేవాడు. కౌరవులు జూదంలో గెలిచారు, కురుక్షేత్రంలో పోయారు, ఓడిపొయి ఉంటే బ్రదర్స్ అంతా కలిసి పార్టీ చేస్కునే వారేమో. అందుకే కొన్ని సార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే కరెక్ట్, గెలవడం కన్నా ఓడిపోవడమే కరెక్ట్.

“హరికథలు ఎంత బాగా చెప్పినా పళ్ళెంలో పదిపైసలే వేస్తారు”

“కోటి రూపాయల లాటరీ తగిలినా కాని ముప్పైలక్షలు టాక్స్ లో పోతుంది అందుకేనేమో అదృష్టం డిస్కౌంట్ తో వస్తుంది అంటారు, దురదృష్టం మాత్రం బోనస్ తో వస్తుంది”

“భార్యని గెలవాలంటే కప్పులు కాదుసార్ మీ మధ్యనున్న ఆ గోడని బద్దలు కొట్టండి”

“ఫ్రెండుని రా.. ప్రాణం ఇవ్వలేకపోవచ్చు.. పార్టనర్ షిప్ ఇస్తాను”

“మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు”

“కొందరుంటారు కోటి రూపాయలు కొట్టే లాటరీ టిక్కెట్ ఇస్తే కలర్ బాలేదని పారేస్తారు”

“కిడ్నాప్ చేసి పెంచుకోవడం అంటున్నాడు రేపు చంపేసి నేల్లో దాచి పెట్టుకోడం అంటే”

“యాక్సిడెంటంటే బైకో కారో రోడ్ మీద పడ్డం కాదు ఒక కుటుంబం మొత్తం రోడ్డుమీద పడిపోడం”

“మనం కావాలనుకునే అమ్మాయ్ వస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ మనల్ని వద్దన్న అమ్మాయి తిరిగి వస్తే మాత్రం ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది”

“తెలిసి చేస్తే మోసం... చేశాక తెలిస్తే తప్పు”

“కత్తి ఎత్తితే కోతే కోయగలవు కత్తి దించి చూడు కొత్త రాత రాయగలవు”

“అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు దరిద్రం వచ్చి లిప్ కిస్ పెట్టేస్తుంది”

“బాగా బతికి పేరుతెచ్చుకునే ఓపిక లేదు... బాగా చంపి ఫేమస్ అయ్యేదా”

“ఎక్కడో జరిగిన యాక్సిడెంట్లని ఎవరో చేసిన తప్పుల్నీ జాతకాలంటూ ఆడాళ్ళ మీద రుద్దటం తప్పు”

“దూసుకెళ్ళే బాణం రేసుకెళ్ళే గుర్రం వెనక్కి తిరగదు”

“కుందేలు పులిబోన్లోకి సైట్ సీయింగ్ కి వచ్చినట్లు నేను ఈయన దగ్గరకొచ్చానేంటి”

“మా నాన్న దృష్టిలో భార్యంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మోయాలనుకునే బరువు, నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం”

“నేను ఒక్కడ్నే
ఉన్నవి రెండే దార్లు చంపడం లేదా చావడం
నేను ముగ్గురికి సమాధానం చెప్పాలి
నాలుగు వారాల క్రితం కాసిన పందెం
అయిదు వేల మంది జనాభా ఉన్న ఒక ఊరు
ఆరు వందలమంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒక నియంత
ఏడు అడుగులు నాతో నడవడానికి సిద్దంగా ఉన్న ఒక అమ్మాయి
నా జీవితాన్ని మార్చేసిన ఎనిమిది వేల గజాల స్థలం
తొమ్మిది నిముషాలు మిగిలిన గడువు
పది మీటర్ల దూరంలో చావు”... ఇదీ నా కథ.
            

బుధవారం, మార్చి 25, 2015

ఎవడే సుబ్రహ్మణ్యం...

నువ్వెవరు? అనేది చాలా సింపుల్ గా కనిపించే అతి కష్టమైన ప్రశ్న. చాలామందికి అది సమాధానం లేని ప్రశ్న కూడా. ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందనే ఆశ రిషి(విజయ్)ని హిమాలయాల్లోని దూద్ కాశి (ఆకాశ గంగ) ప్రయాణానికి పురిగొల్పుతుంది. ఆపేరు మొదటిసారిగా టెంత్ లో తన బెస్ట్ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం(నాని) తో కలసి విన్నాడు కాబట్టి ఆ ప్రయాణం కూడా తనతోనే చేయాలని నిర్ణయించుకుంటాడు. "డబ్బుదేముంది బాస్ కూటికోసం కోటి విద్యలు, జీతం కన్నా జీవితం విలువైనది ఎప్పుడు ఎంజాయ్ చేశావ్ అని అడిగితే వేళ్ళమీద లెక్కపెట్టుకునే పరిస్థితి నాకొద్దు" అనే ఫిలాసఫీ రిషిది.

అయితే దీనికి పూర్తి వ్యతిరేకంగా "లోకంలో నువ్వెవరో నీ బాంక్ బాలన్స్ తోనే తెలుస్తుంది దాని కోసం నేనేదైనా చేయడానికి రెడీ, సంపాదనే నా జీవితం" అనే ఫిలాసఫీ సుబ్బుది. దూద్ కాశి వెళ్లడం తనకి అస్సలు ఇష్టముండదు అదంతా వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అనుకుంటాడు. సుబ్బు తాను కోరుకున్నట్లే అనతికాలంలో డబ్బు సంపాదించేసి ఒక బిజినెస్ టైకూన్ కూతుర్ని పెళ్ళి చేసుకుని వాళ్ళ కంపెనీకి ఎండీ గా సెటిల్ అవబోయే తరుణంలో... టెంత్ లోనే ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపొయిన రిషి తిరిగి అతని జీవితంలో ప్రవేశిస్తాడు. 

వారిద్దరికి అనుకోని పరిస్థితులలో ఇంచుమించు రిషిలాంటి మనస్తత్వమే ఉన్న ఆనంది(మాళవిక నాయర్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. రిషి దూద్ కాశి ట్రిప్ కు ఆనందిని కూడా తీస్కెళతాను అని చెప్తాడు. ఆనంది ఎవరు, రిషి సుబ్బు మనసు మార్చ గలిగాడా, వీరు ముగ్గురు కలిసి దూద్ కాశి కి ప్రయాణం చేశారా లేదా అసలు వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అనేది తెలుసుకోవాలంటే "ఎవడే సుబ్రహ్మణ్యం" సినిమా చూడాలి.

సినిమా లో చెప్పిన ఫిలాసఫీని రెండు కీలకమైన డైలాగ్స్ లో చెప్పేస్తాడు. "ప్రకృతి మనిషి అవసరానికి సరిపడా ఇస్తుంది అత్యాశకి సరిపడా కాదు" అనేది ఒకటైతే రెండోది "గొంగళి పురుగు తన బరువుకన్నా కొన్ని వేల రెట్లు ఆకుల్ని తిని మొక్కల్ని నాశనం చేస్తుంది కానీ అదే పురుగు శీతాకోక చిలుకగా మారాక మళ్ళీ మొక్కలకు ప్రాణం పోస్తుంది. మనిషి కూడా పురుగులా తినీ తినీ భూమిని నాశనం చేస్తున్నాడే తప్ప తనలో ఒక శీతాకోక చిలుక దాగుందనే విషయాన్ని మర్చిపోతున్నాడు" అనేది.

"ఎవడే సుబ్రహ్మణ్యం" సినిమా కేవలం హిమాలయాల్లోని దూద్ కాశి కి చేసిన ప్రయాణం గురించి మాత్రమే కాదు. ఒక మనిషి తనలో దాగున్న ఆ శీతాకోక చిలుకను కనుగొనడానికి చేసిన ప్రయాణం గురించి, జీవితంలో లెక్కలూ అనాలిసిస్ లూ తప్ప అనుబంధాలు అనుభూతుల గురించి పట్టించుకోని ఒక మనిషి వాటిని కనుగొనే దిశగా చేసిన ప్రయాణం గురించి, డబ్బుకన్నా విలువైన వాటిని తెలుసుకోవడానికి చేసిన ప్రయాణం గురించి, తనని తాను కనుగొనడానికి చేసిన ప్రయాణం గురించి, ప్రేమను కనుగొనడానికి చేసిన ప్రయాణం గురించి.

తెలుగు సినిమా కి అలవాటు లేని ఒక కొత్త జొనర్ లో సమకాలీన సమస్యను తీస్కుని వైవిధ్యంగా ప్రజెంట్ చేసిన ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ని అభినందించి తీరవలసిందే. హాస్యంతో కలిపి చెప్పడంతో ఎమోషన్ కాస్త డైల్యూట్ అయినట్లు అనిపించినా అదే లేకపోతే మరో ప్రీచింగ్ సినిమాగా మిగిలుండేది అనిపిస్తుంది. ఈ సినిమా కోసం సముద్ర మట్టానికి ఐదువేల ఐదొందల మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లొకేషన్స్ కు చిత్ర యూనిట్ అంతా స్వయంగా ట్రెక్కింగ్ చేస్కుంటూ వెళ్ళి చిత్రీకరించడం అభినందించ దగిన విషయం. ఇంగ్లీష్ సినిమాలు డాక్యుమెంటరీలు చూసేవారికి అంత అనిపించక పోవచ్చు కానీ సగటు తెలుగు ప్రేక్షకులను హిమాలయాల లొకేషన్స్ విజువల్స్ తప్పక ఆకట్టుకొంటాయి.

తన ఫ్లాప్ చిత్రాలలో కూడా నటుడిగా మంచి మార్కులు కొట్టేసే నానీ ఇలాంటి సబ్జెక్ట్ దొరికితే చెలరేగిపోతాడనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేరియేషన్స్ చూపడంలోనూ కీలక సన్నివేశాలలోనూ తన నటన ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ బబ్లీ రోల్ తో మరికొంత సేపు కనిపిస్తే బాగుండు అనిపిస్తాడు. పొడవుతప్ప మిగిలిన విషయాల్లో నిత్యా మీనన్ తో కాస్త పోలికలు కలిసిన హీరోయిన్ మాళవిక నాయర్ తన నటనతో మెప్పిస్తుంది. కృష్ణం రాజు గారు చేసిన పాత్ర నాకు చాలా నచ్చింది. ఆయన రెబెల్, బిల్లా లాంటివి కాక ఇటువంటి హుందా అయిన పాత్రలు ఎన్నుకుంటే బాగుంటుందనిపించింది. 

రాధన్ నేపధ్య సంగీతం పాటలూ కూడా సినిమా మూడ్ కు తగినట్లున్నాయి, రాకేష్, నవీన్ ల సినిమాటోగ్రఫీ బాగుంది. వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం "ఎవడే సుబ్రహ్మణ్యం". ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ముందు ముందు తెలుగులో ప్రతిభ ఉండి సెన్సిబుల్ చిత్రాలను నిర్మించే దర్శకుల జాబితాలో చేరతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

మంగళవారం, ఫిబ్రవరి 10, 2015

మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి సినిమాలు

కొన్నిసినిమాలు పెద్దగా హడావిడి లేకుండా నిశ్శబ్దంగా విడుదలవుతాయి కానీ ప్రేక్షకుల మనసులో అలజడులను రేపి శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి అరుదైన సినిమానే “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”. నిజానికి ఈపేరుతో సినిమా మొదలుపెడుతున్నారన్నపుడు అబ్బా మంచి పాటల్లో లైన్స్ ఇలా వాడి పిచ్చి సినిమాలు తీసి చెడగొడతారెందుకో అని అనుకున్నాను. కానీ సినిమా చూశాక ఆ పాట ఎంత ఇష్టమో సినిమా మీద అంతకు పది రెట్లు ఇష్టమ్ పెరిగింది. ప్రతివారం సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి అందులో సగానికి పైగా ప్రేమకథలే ఉంటూంటాయి కాని ఇలాంటి ప్రేమకథలు మాత్రం అరుదుగా వస్తాయి.

అమ్మ(పవిత్ర లోకేష్)నూ పరుగునూ అమితంగా ప్రేమించే రాజారామ్(శర్వానంద్) ఒలింపిక్స్ గెలవాలని కలలు కంటూ ఉంటాడు. లక్ష్య సాధనలో భాగంగా స్టేట్ లెవల్ ఫైనల్స్ లో పాల్గొనే టైమ్ లో నజీరా(నిత్య మీనన్) ని చూస్తాడు. బురఖాలో ఉన్న ఆమె కళ్ళను మాత్రమే చూసినా, నజీరా మంచి మనసును కూడా చూసి ఆమెపై మనసుపడతాడు. నజీరా కూడా ఆతన్ని ఇష్టపడుతుంది. అన్ని ప్రేమ కథల్లో లాగే వారి ప్రేమకూ అడ్డంకులు ఏర్పడతాయి వాటిని అధిగమించి వారు ఎప్పటికైనా ఒకటి కాగలిగారా అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ కమ్మని ప్రేమకథను తెరపై చూడాల్సిందే.

పొద్దున్న చూసుకుని మధ్యాహ్నం కలుసుకుని సాయంత్రం పెళ్ళాడి తెల్లారి విడిపోయే ఆధునిక ఫేస్బుక్ ప్రేమల కాలంలో ఏళ్ళతరబడి గుండెల్లో నిలిచి ఉండే ఒక ప్రేమ కథను అదీ ఇంత ఎఫెక్టివ్ గా కన్విన్సింగ్ గా చెప్పగలగడం ఒక్క క్రాంతిమాధవ్ కే చెల్లింది. కమర్షియల్ సినిమాల్లో ఫైట్లకో స్టెప్పులకో డైలాగులకో విజిల్స్ వినబడడం కామనే కానీ ఈ సినిమాలో ప్రేమికుల మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలలో సైతం ప్రేక్షకులు విజిల్స్ వేసీ చప్పట్లు కొట్టారంటే ఆ ప్రేమజంటతో ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో అలా చేయడంలో ఈ సినిమా టీమ్ ఎంతగా విజయం సాధించిందో అర్ధమవుతుంది.

కనిపించడానికి ఇది ఎంత సాధారణమైన ప్రేమకథలా ఉందో అంతే సాధారణంగా ఈ కథలోని పాత్రలు మన చుట్టూ ఉండే సమాజంలోంచే స్క్రీన్ మీదకి నడిచొచ్చేసినట్లుంటాయి. ఒకప్పుడు వచ్చిన అద్భుతమైన ప్రేమకథలు అవి తీసిన బాలచందర్, మణిరత్నం లాంటి దర్శకులు మదిలో మెదులుతారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి టీమ్ ఎఫర్ట్ కారణం ఇంచుమించు అన్ని డిపార్ట్మెంట్స్ పనితీరు చక్కగా ఉంది కాకపోతే నాలుగు పిల్లర్స్ గా నిలిచినది మాత్రం దర్శకుడు, నటీనటులు, డైలాగ్స్, విజువల్స్.

దర్శకుడు “క్రాంతి మాధవ్” ఒక స్వచ్ఛమైన ప్రేమకథను తీసుకుని సహజమైన పాత్రలతో నెమ్మదైనదే అయినా చక్కని కథనంతో మనసుని తాకే అందమైన సన్నివేశాలను అల్లుకుంటే నటీనటులు ఆ పాత్రలకు ప్రాణం పోసి సజీవంగా మన కళ్లముందుంచారు. ఇటీవల విడుదలై హిట్ సాధించిన “రన్ రాజా రన్” లోని శర్వానంద్ కూ ఈ చిత్రంలోని శర్వానంద్ కూ ఒక్క పోలిక కూడా కనబడదు. మనకి ఇందులో కేవలం రన్నర్ “రాజా రామ్” మాత్రమే కనిపిస్తాడు. అంత వైవిధ్యమైన నటనని ప్రదర్శించాడు. 

ఇక నిత్యామీనన్ మొదటి సగంలో ఎక్కువభాగం బురఖాలో కనిపించి కళ్ళతోనే నటించేసి వేల భావాలను పలికించింది. అలాగే తను ప్రధానంగా నడిచే సెకండాఫ్ అంతా కూడా ఎంతో గ్రేస్ ఫుల్ గా చేసింది. హీరోకి అమ్మగా చేసిన పవిత్ర, కోచ్ గా చేసిన సూర్య, చాలా కాలం తర్వాత కనిపించిన చిన్నా, కథని మలుపు తిప్పే పాత్రలో నాజర్, నిత్య ఫ్రెండ్ జ్యోతిగా చేసిన నటి అందరూ చాలా బాగా నటించారు. ఇక రచయిత “సాయిమాధవ్ బుర్రా” ప్రాసల కోసం పాకులాడకుండా సులభశైలిలో అర్ధవంతమైన ఆలోచింపజేసే చక్కని సంభాషణలు పలికించి ఆ మాటలు సినిమా పూర్తయాక కూడా చాలారోజులు మనలని వెంటాడేలా చేశాడు.
 
ఇక సినిమాటోగ్రాఫర్ “వి.ఎస్.జ్ఞానశేఖర్” ఈ సినిమాని తెరకెక్కించిన తీరు అద్భుతం ప్రతి విజువల్ నూ అందంగా తీర్చి దిద్దాడు. సంగీతాన్ని అందించిన మళయాళీ సంగీత దర్శకుడు “గోపీ సుందర్” పాటల విషయంలో కాస్త తడబడినా నేపధ్య సంగీతాన్ని మాత్రం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసేలా అందించాడు. వెరసి ఈ సినిమా చూస్తున్నపుడు దృశ్యకావ్యమంటే ఇదేనేమో అనిపిస్తుంది. మామూలు సినిమా చూసినట్లుగా కాక, ఒక మంచి పుస్తకం  చదువుతున్నట్లో, సముద్రపు ఒడ్డున కూర్చుని ఒక కమ్మటి కవితను ఆస్వాదిస్తున్నట్లో ఒక అందమైన అనుభూతి మన సొంతమవుతుంది.

ఇదే చిత్రానికి చిరకాలం గుర్తుండిపోయే మరోచరిత్ర, అభినందన, గీతాంజలి లాంటి ప్రేమకథలకు కుదిరినట్లుగా మంచి సంగీత సాహిత్యాలు కూడా తోడై ఉంటే సినిమా మరో మెట్టు ఎదిగి ఉండేది. అలాగే మరీ నెమ్మదైన కథనం, అక్కడక్కడ మేకప్ పరమైన దోషాలూ, సినిమా ప్రారంభంలో సంగీతపాఠాల సన్నివేశాలలో ఉచ్ఛారణ దోషాలు లాంటి లోపాలు పంటికింద రాయిలా అక్కడక్కడా తగిలినా అవి సినిమా అనుభూతిని ఏమాత్రం డిస్ట్రబ్ చేయవు.

హృద్యమైన ప్రేమ కథలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ మిస్ అవకుండా చూడవలసిన సినిమా “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”. ఇంత స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రేమకథలు అరుదుగా వస్తూ ఉంటాయి కనుక మిస్ అవ్వకండి. సాధారణంగా మళయాళంలోనో తమిళ్ లోనో అపుడపుడూ ఇలాంటి ఇంటెన్స్ ప్రేమకథలు వస్తుంటాయి. వాటికి ధీటుగా తెలుగులో వచ్చిన ఈ చక్కని చిత్రాన్ని ప్రోత్సహించడం ఇటువంటి మంచి చిత్రాలు కోరుకునే ప్రతి తెలుగు సినీ అభిమాని బాధ్యత.


ఈ చిత్రంలో నాకు నచ్చిన కొన్ని సంభాషణలు.. (సినిమా చూసి వచ్చాక మాత్రమే వీటిని చదవమని మనవి)
"నువ్వెప్పుడూ గెలవడానికి పరిగెట్టు పక్కనోడ్ని ఓడించడానికి కాదు. ఓడించాలి అనుకునే వాడు వెంటపడుతూ ఉంటాడు వాడెపుడూ వెనకే ఉంటాడు, గెలవాలనుకునే వాడు ముందుంటాడు ఎపుడూ గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు."

"గెలుపుతో స్నేహం చేయండి.. ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఓటమిని ప్రేమించండి.. ఎప్పుడూ మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటుంది."

"కంటికీ మనస్సుకూ కామన్ సెన్స్ ఉండదు.. వాటితో తిరిగితే మనమూ చెడిపోతాం."

"జేబులో రూపాయ్ లేకపోయినా అమ్మాయిని ట్రై చేయొచ్చు... కానీ లక్ష్యాన్ని ట్రై చేయకూడదా..!! లక్ష్యం అమ్మాయికన్నా సెక్సీగా ఉంటుందిరా."

తండ్రి : "ఇండియా ఎలా ఉంది.."
కూతురు : "అలాగే ఉంది.. చూడ్డానికి ఎలా ఉన్నా.. బ్రతకడానికి బాగుంటుంది."

"ప్రేమంటే కలిసుండటం కాదు.. దూరాన్ని కూడా దగ్గరగా ఫీలవడం."

"కన్నీళ్ళు... మనకొస్తే అది కష్టం అవుతుంది.. అవే మనకోసం వొస్తే ప్రేమ అవుతుంది."

"వయసైపోయిందా...?!!! వయసు పెరుగుతూ ఉంటుంది..ఒకసారే అది ఆగిపోతుంది."

"బిడ్డ ఆకలి తీరిందగ్గరనుంచీ అమ్మ ఆకలి మొదలవుతుంది..."

"ఎదురుచూపులని వెతకడం కూడా ప్రేమేనేమో!!"

"చూడాలనుంది.. నీ అందాన్ని కాదు.. నీలో బతుకుతున్న నన్ను.. నాలో ఉన్న నిన్ను.. నేను చూడాలి.."

"బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు... నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవదు."

"ఓటమిని పరిగెత్తించు అది గెలుపు వరకూ తీస్కెళుతుంది."

"అతను గుర్తు పట్టకపోతే చచ్చిపోతాను, గుర్తు పడితే ఇక బ్రతకలేను."
(చాలా సంవత్సరాల తరువాత ప్రేమికుణ్ణి కలవబోతున్న ప్రేయసి)

"ప్రేమలో పెళ్ళి ఉండకపోవచ్చు కానీ పెళ్ళిలో ప్రేమ ఉంటుంది."

తల్లి : (ఉత్తరం చదవమన్న కూతురుతో) "తప్పమ్మా. ఒకళ్ళు రాసింది మరొకరు చదవకూడదు."
కూతురు : "పిల్లలు రాసింది తల్లి చదవాలమ్మా... తప్పులు దిద్దాలిగా."

"బతుకుని లెక్క చేయకపోయినా ఫరవాలేదు. చావును గౌరవించాలి."

"కన్నీళ్ళు మనిషీ కవలపిల్లలు... పుట్టినప్పటి నుండి పోయేవరకూ మనతో ఉండేది కన్నీళ్ళే."

"నాదీ అనేది ఫీలింగ్ సార్ అది కొంటే రాదు.. వస్తే పోదు.."

"ఇన్నాళ్ళాగితేనే ప్రేమవుతుందని రూలేదైనా ఉందా... ప్రేమలో ఎవరూ పద్దతిగా పడరు.."

"ఇప్పుడంటే ఆశల్తో ఆలోచనలతో ప్రేమించుకుంటాం ఓ వయసొచ్చాక ఇవన్నీ ఉండవు అపుడు జ్ఞాపకాలతో ప్రేమించుకోవాలి. ఎన్నుంటే అంత మంచిది కదా..." (“ఈ దాగుడు మూతలెందుకూ నువ్వెవరో సూటిగా చెప్పచ్చు కదా” అన్న ఫ్రెండ్ తో హీరోయిన్)

"వాడి ప్రేమ నీకు పిచ్చిలా ఉంది కదా..."
"అలా లేకపోతే అది ప్రేమ కాదు కదా..."

"ఒకడిలైఫ్ ఇంకొకడికి లైట్ గానే ఉంటుంది కానీ.. ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది."

కూతురు : "ఏ తల్లీ కూతురు లైఫ్ మీద ఇలా స్పై చేయకూడదు.."
తల్లి : "ఏ కూతురు లైఫూ ఇంత స్పైసీగా ఉండకూడదు.. ఐ యామ్ నాట్ స్పైయింగ్ ఐ యామ్ కన్సర్న్డ్."

"నాన్నకి దూరంగా ప్రేమించిన వాడితో ఉండచ్చు కానీ దూరం చేస్కొని ఉండకూడదు."

"అమ్మనీ ప్రేమనీ మించినది ఏవుంటుంది ?"

"ప్రేమనే వదులుకున్న నాకు ప్రాణమొక లెక్కా.. ఆఫ్ట్రాల్.. ప్రేమకు పుట్టిన ప్రాణం ప్రేమకన్నా చాలా చిన్నది."

"ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు కానీ అదే ప్రేమ చచ్చిపోడానికి ఒక జీవితం చాలదు."

శుక్రవారం, ఫిబ్రవరి 06, 2015

మా టీవీలో ఓనమాలు on 7th Feb 8PM

మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, వాటిని ప్రోత్సహించడం అటువంటి చిత్రాలని అభిమానించే వారు తప్పక చేయవలసిన పని. ఇంచుమించు రెండేళ్ళ క్రితం "క్రాంతిమాధవ్" దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని చిత్రం "ఓనమాలు". ఈ చిత్రానికి ఖదీర్ బాబు రాసిన పదునైన సంభాషణలు ఆకట్టుకుంటూనే ఆలోచింప చేస్తాయి. ఇంత చక్కని సినిమాను మాటీవీ వారు ఈ శనివారం ఫిబ్రవరి 7 న రాత్రి 8 గంటలకు మొదటిసారి ప్రసారం చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలైనపుడు చూడడం కుదరని వారు ఈ సదవకాశాన్ని వదులుకోకుండా తప్పక చూడండి. ఈ చిత్రం పై అప్పట్లో నేను రాసిన రివ్యూ ఇక్కడ చదవచ్చు.  



ఈ చిత్ర దర్శకుడు "క్రాంతిమాధవ్" "శర్వానంద్", "నిత్యామీనన్" జంటగా తీసిన కొత్త చిత్రం "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" ఈరోజే (ఫిబ్రవరి ఆరున) విడుదలై "మళ్ళీ మళ్ళీ రావిలాంటి చిత్రాలు" అంటూ విమర్శకుల అభినందనలు పొందడం సంతోషించ దగిన విషయం.

గురువారం, జనవరి 22, 2015

అమ్మా అమ్మా..

కాలం ఎంతటి బాధనైనా మరిపిస్తుందని అందరూ అంటూ ఉంటారు కానీ అది కొంతమేరకే నిజం. అంతకంతకూ పెరిగే మధ్యాహ్నపు నీడలా కాలం గడిచే కొద్దీ బాధ కూడా పెరుగుతుంది... అమ్మ మాకు దూరమై నేటికి ఆరేళ్ళు గడిచినా ఆ దిగులు మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు సరికదా తను దూరమైనప్పటి కన్నా తను వదిలి వెళ్ళిన శూన్యం ప్రశ్నిస్తూ తను లేని లోటు అనుక్షణం గుర్తొస్తూ ఉండేకొద్దీ ఆ బాధ మరింత పెరుగుతూనే ఉంది తప్ప తరగడంలేదు. తన అడుగు జాడల్లో నడవాలని ప్రయత్నిస్తూ తను అపురూపంగా నిర్మించిన పొదరింటిని పదిలంగా కాపాడుకుంటూ తన జ్ఞాపకాల ఊతంతో ఎలాగో కాలం గడుపుతున్నాను. 

ఇటీవల విడుదలైన రఘువరన్ బి.టెక్ చిత్రంకోసం రామజోగయ్య శాస్త్రి గారు రాసిన ఈ పాట నాకు చాలా నచ్చింది. ఒకరకంగా నా బాధకే అక్షర రూపమిచ్చారనిపించింది. ముఖ్యంగా రెండవ చరణంలో తను దూరమైనందుకు బాధ పడుతున్న బిడ్డను అమ్మ ఎలా ఊరడిస్తుందో రాసిన వాక్యాలు చక్కగా ఉన్నాయి. అవి జానకమ్మ గారు పాడడం మరింత బాగుంది. అమ్మకు నివాళిగా ఈ రోజు ఈ పాట ఇక్కడ పంచుకోవాలనిపించింది. ఎంబెడ్ చేసినది ఒక నిముషం పాటు సాగే వీడియో ట్రైలర్ మాత్రమే పూర్తి పాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ లేదా మ్యూజిక్ సైట్ లో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 

అమ్మకు నివాళిగా తన గురించి ఈ బ్లాగులో ఇదివరకు వ్రాసిన పోస్టులు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రఘువరన్ బి.టెక్ (2014)
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : దీపు, జానకి

అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా..
మాటే లేకుండా నువ్వే మాయం
కన్నీరవుతోంది ఎదలో గాయం
అయ్యో వెళ్లిపోయావే
నన్నొదిలేసి ఎటుపోయావే
అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట
నేపాడే జోలకు నువు
కన్నెత్తి చూశావో అంతేచాలంటా.. 

అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా..

చెరిగింది దీపం కరిగింది రూపం
అమ్మా నాపై ఏమంత కోపం
కొండంత శోకం నేనున్న లోకం
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం.
నాకే ఎందుకు శాపం
జన్మల గతమే చేసిన పాపం
పగలే దిగులైనా నడిరేయి ముసిరింది
కలవరపెడుతోందీ పెను చీకటీ
ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది
బ్రతికీ సుఖమేమిటీ..

ఓ అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా..

విడలేక నిన్ను విడిపోయి ఉన్నా
కలిసే లేనా నీ శ్వాస లోనా
మరణాన్ని మరచి జీవించి ఉన్నా
ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోనా
నిజమై నే లేకున్నా
కన్నా నిన్నే కలగంటున్నా
కాలం కలకాలం ఒకలాగే నడిచేనా
కలతను రానీకు కన్నంచునా
కసిరే శిశిరాన్నే వెలివేసి త్వరలోనా
చిగురై నిను చేరనా... 

అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా..
అడుగై నీతోనే నడిచొస్తున్నా
అద్దంలో నువ్వై కనిపిస్తున్నా 
అయ్యో వెళ్లిపోయావే
నీలో ప్రాణం నా చిరునవ్వే 
అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట
వెన్నంటీ చిరుగాలై జన్మంతా
జోలాలీ వినిపిస్తూ ఉంటా...




ఈ పెయింటింగ్ చిత్రించిన వారు Mitra Shadfar ఇక్కడ నుండి సేకరించబడినది, వారికి ధన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.