గురువారం, జులై 16, 2015

బాహుబలి - ది బిగినింగ్...

ఆన్ లైన్ మూవీ వెబ్ సైట్స్ లో తక్కువ వచ్చిన రివ్యూ రేటింగ్స్ అండ్ వాటిలో రివ్యూవర్స్ కామెంట్స్ చూసి నిరుత్సాహ పడి సినిమా చూడడం మానేసిన వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. ఈ సినిమా చూడకపోవడం వలన మీరో అద్భుతమైన అనుభవాన్ని మిస్ అవుతున్నారు. చిన్నతనంలో చందమామ లాంటి పుస్తకాలలో చదువుకున్న అందమైన కథలను కనుల ముందు సాక్షత్కరింప జేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు.

నేను కొన్ని హాలీఉడ్ వార్ ఎపిక్ చిత్రాలు ఇదివరకే చూసినా వాటిలో ఏదో తెలియని లోటు కనిపించేది నాకు ఒక విధమైన అసహజత్వం కనిపించేది, ఆ మనుషులు, కాస్ట్యూమ్స్, గెటప్స్, స్వరాలు, భాష ఒకదానితో ఒకటి పొంతన కుదరక అన్నిటికి మించి చిన్నప్పటినుండీ నేను చదువుకుని ఊహించుకున్న సన్నివేశాలకు భిన్నంగా ఉండి పూర్తి సంతృప్తినిచ్చేవి కాదు. ఏదో మిస్ అయిన ఫీల్ ఉండేది. బాహుబలి మొదటి సారి ఆ లోటు తీర్చింది. అంతా మనదైన ఒక అద్భుత లోకాన్ని కనులముందు ఆవిష్కరించింది.  

కామెడీ లేదు కాకరకాయ లేదు భోజనం మధ్యలో లేపేసినట్లుంది అంటూ వ్రాసిన రివ్యూలను పట్టించుకోకుండా ఈ క్రింద నేను రాసే మిగిలిన రివ్యూను కూడా చదవకుండా తక్షణమే వెళ్ళి ఈ సినిమా చూడండి. అద్యంతం మీరు పెట్టిన ప్రతి పైసా వసూల్ అయ్యిందనిపించే ఎంటర్ టైన్మెంట్ పొందుతారనే పూచీ నాది. తనువు రోమాంచితమయ్యే సన్నివేశాలని చూసి ఆహా ఏం తీశాడ్రా మన వాడు అని ఖచ్చితంగా గర్వపడి మరింత మందికి చూపిస్తారు.

సాథారణంగా ఏదైనా ఒక సినిమా హిట్ అయితే దానిలోని పాత్రలను కొనసాగించి మరో కొత్త కథ రాసుకుని దీనికి సీక్వెల్ తీయడమనేది ఒక అలవాటు. గత కొన్ని సంవత్సరాలుగా హాలీఉడ్ లో కొన్ని సినిమాలు ముందే ఇన్ని భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకుని అన్ని ఉప కథలుగా విడగొట్టుకుని తీయడం మరో కొత్త ట్రెండ్ అయింది. కానీ ఈ సినిమా కథ అలా కాదు ఉన్నది ఒకటే కథ అదంతా రెండున్నర గంటల నిడివిలో చెప్పలేక రెండు భాగాలుగా విడగొట్టామని ఇది ఒక సినిమా ఫస్టాఫ్ లా ఉంటుందని మొదటినుండీ చెప్తూనే ఉన్నారు.

అలా ముందుగా చెప్పి ప్రిపేర్ చేసినా కూడా మొదటి భాగం అర్థాంతరంగా ఆగిపోయిందనడం హాస్యాస్పదం. కాకపోతే ఇంత అద్భుతమైన చిత్రం మిగిలిన కథ తెలుసుకోడానికి ఏడాది ఎదురు చూడాల్సి రావడం కష్టం కలిగించే విషయమే. కానీ అది ఇష్టమైన కష్టం దానికి దర్శక నిర్మాతలను ఆక్షేపించడమో అది ఈ సినిమాలో ఒక లోపమనడమో ఎప్పటికీ చేయలేం. అసలు సినిమా అద్యంతం ఆశ్చర్యంతో ఒక అద్భుతాన్ని చూసినట్లు చూడడమే తప్పించి మరో ఆలోచనే రాదు.

నిజానికి రెండు పార్టులు చూసేవరకూ సినిమా గురించీ కథా కథనాల గురించీ విశ్లేషించడమో సమీక్షించడమో సరికాదు కానీ ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాల గురించి ప్రస్తావించడానికి ఈ పోస్ట్ రాస్తున్నాను. కథ ఇప్పటికే చాలా రివ్యూలు చదివి తెలుసుకుని ఉంటారు, ఒక వేళ తెలియకపోతే తెలుసుకోకుండానే సినిమా చూసి మీ అనుభూతి సాంద్రతను మరింత పెంచుకోండి.

పురిటిలోనే తల్లినుండి వేరై విధివశాత్తు విపత్కర పరిస్థితులలో కోయదొరలను చేరుతాడు మన హీరో శివుడు (ప్రభాస్). అనుకోని పరిస్థితుల్లో మాహిష్మతి రాజ్యంలో అడుగుపెట్టిన శివుడిని చూసిన ప్రజలంతా ’బాహుబలి’ ’బాహుబలి’ అని పిలుస్తుంటారు. ఈ బాహుబలి ఎవరు అతని కథేమిటి? అతనికి తనకి ఉన్న సంబంధమేమిటి? మాహిష్మతి సామ్రాజ్యంలో ఏం జరిగింది? అనేది శివుడు తెలుసుకోవడమే మొదటి భాగంలోని కథ. అయితే అది ఇందులో కొంతవరకే చెబుతారు. అసలు అన్నదమ్ముల మధ్య వైరం ఏమిటి, బాహుబలి ఏమయ్యాడనే పూర్తి కథ తెలుసుకోడానికి పార్ట్ టూ(బాహుబలి – ది కంక్లూజన్) కోసం వచ్చే ఏడాది వరకూ ఎదురు చూడాలి.

సినిమాలో మొదట చెప్పుకోవలసింది దర్శకుడు రాజమౌళి విజన్ ని. తన ప్రతీ చిత్రానికీ తను సెట్ చేసుకున్న బౌండరీస్ ని తనే మరికొంచెం జరుపుకుంటూ ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభూతిని అందించాలని తపనపడే ఇతను ఈ చిత్రంలో ఆ బౌండరీని మరింత ఛాలెంజింగ్ లెవల్ లో సెట్ చేసుకుని విజువల్ గా ఒక అద్భుతాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు. అతని విజన్ ని అంతే అద్భుతంగా తెరకెక్కించిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఈ చిత్రం ఒక విజువల్ వండర్ గా వేనోళ్ళ కొనియాడబడుతుందంటే దానివెనుక అతని కృషి అభినందనీయం. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ పర్యవేక్షించిన శ్రీనివాసమోహన్ కూడా అద్భుతమైన వర్క్ చూపించారు. నా దృష్టిలో ఈ చిత్రానికి ఈ ముగ్గురు ముఖ్యమైన పిల్లర్స్ వంటివారైతే నాలుగో పిల్లర్ ప్రధాన పాత్రధారులు. కీరవాణి గారి పాటలకన్నా రీ-రికార్డింగ్ ఆకట్టుకున్నాకూడా నేషనల్ అప్పీల్ కోసం కొంత కాంప్రమైజ్ అయ్యరేమో తెలియదుగానీ 'మగధీర', 'ఈగ' సినిమాలలోలా తన సంగీతంతో ఎలివేట్ చేసి గూస్ బంప్స్ తెప్పించిన సన్నివేశాలు లేవనిపించింది.. 

మరుపురాని పాత్రలలో.. మాహిష్మతి సింహాసనానికి కట్టుబానిసగా ఉంటూ దానిని అధిష్టించిన వారిని రక్షిస్తామని తమ పూర్వీకులు ఇచ్చిన మాటకు కట్టుబడి నమ్మకానికి నిలువెత్తు రూపంగా మసలుతూ. మనసులో భల్లాలదేవుడిని చంపాలన్నంత కోపమున్నా కూడా విధి నిర్వహణ కోసం తన ప్రాణాలడ్డుపెట్టైనా సరే అతడ్ని కాపాడుతూ ఉండే యోధుడు 'కట్టప్ప' పాత్రలో సత్యరాజ్ నటన అత్యద్భుతం.

కన్న కొడుకుపై ఉన్న పేగు బంధానికీ, తనకు దక్కని సింహాసనం తన వారసుడికైనా దక్కాలనే కట్టుకున్న భర్త కోరికకీ తలవంచక ధర్మానికి కట్టుబడి ఉండే వ్యక్తిగా, రాజతంత్రాన్ని ఔపోసన పట్టి శతృవును మట్టికరిపించే క్రౌర్యాన్ని మాతృత్వపు మమకారాన్ని ఒకే సమయంలో చూపించగల రాజమాత 'శివగామి'గా రమ్యకృష్ణ నటన అనితర సాధ్యం. ఆవిడ లేకపోతే మా సినిమా లేదని రాజమౌళి చెప్పిన మాటలో అసత్యం లేదనిపిస్తుంది.
  
భీకరమైన ఆకారం, గంభీరమైన స్వరం, సుస్పష్టమైన వాచకం, వెన్నులో చలిపుట్టించే తీక్షణమైన చూపులు తన సొంతం. ఒకేఒక్క పిడిగుద్దుతో అడవిదున్నను సైతం నేలకూల్చగల బలవంతుడు, తండ్రికున్న పదవీ కాంక్ష తనకీ ఉన్నా మనసులోని మర్మం మరిఒకరికి తెలియనివ్వక మెసలుతూ కౄరత్వానికీ విలనిజానికీ నిలువెత్తు రూపమైన 'భల్లాలదేవుడు'గా రాణా తనని తాను మలుచుకున్న తీరు శ్లాఘనీయం. ఈ సినిమాలో నాకు నచ్చిన పాత్ర ఇదే. ఈ పాత్రలో రాణాని చూసి భళా అనకుండా ఉండలేం. ద్వితీయ భాగంలో ఇతని సన్నివేశాలకోసం ఎదురు చూసేలా చేశాడు.  

ఆకాశమే హద్దుగా దేన్నైనా సాధించగలననే నమ్మకం, పట్టుదల తన సొంతం. అతనికి దేవుడి మీద నమ్మకం కన్నా అమ్మమీద ప్రేమే అంతులేనిది. అసాధ్యాలను సుసాధ్యాలను చేయాలని ఉవ్విళ్ళూరే 'శివుడి'గా, రాజంటే రణరంగంలో శత్రువులను గెలవడమే కాదు రాజ్యంలో ప్రజల మనస్సులను కూడా గెలుచుకోవాలని బలంగా నమ్ముతూ అంతులేని పరాక్రమానికి బుద్ధిబలం తోడై మంచితనానికి మరో రూపమైన 'అమరేంద్ర బాహుబలి'గా రెండు పాత్రలలో ప్రభాస్ మెప్పించాడు. గత చిత్రాలతో పోలిస్తే దేహదారుఢ్యాన్ని తను పెంపొందించుకున్న తీరూ, ఇంచుమించు రాణాతో సమానంగా పెరిగినా అతనిలా భారీగా కనిపించకుండా ప్రతి కదలిక కళాత్మకంగా ఆకట్టుకునేలా ప్రదర్శించిన తీరూ అద్భుతం. 

తనని పాతికేళ్ళుగా బంధీగా ఉంచి చిత్రహింసలకు గురిచేస్తున్న భల్లాలదేవుడి పై తన అణువణువులోనూ రగులుతున్న ద్వేషాన్ని అణచిపెట్టి తనని విడిపించడానికి తన కన్నకొడుకొస్తాడని ఆశగా ఎదురు చూసే ’దేవసేన’ పాత్రలో అనుష్క కనిపించినది ఒక్క పదినిముషాలే అయినా ఈ పాత్ర ధరించడం వేరొకరి వల్లకాదు అనిపించింది. దేవసేన విముక్తే తన జీవిత ధ్యేయంగా పోరాడే యోధురాలిగా, స్త్రీ సహజమైన సున్నితత్వాన్ని మిస్ అవుతున్నానా అని బాధపడే యివతి 'అవంతిక' గా తమన్నా మంచి కృషి చేసింది కానీ ప్రేమ శృంగారం పలికినంతగా తన ముఖంలో వీరం రౌద్రం పలకలేదనిపించింది.

ఈ పాత్రల తీరుతెన్నులు రెండవభాగంలో మారిపోయే అవకాశాలు లేకపోలేదు కానీ ఈ చిత్రం వరకూ మాత్రం ఖచ్చితంగా మెప్పించాయి. ఇంకా ఆయుధవ్యాపారి 'అస్లాంఖాన్' గా సుదీప్, ఆహార్యంతోనే జుగుప్స రేకెత్తించే 'కాలకేయ' గా ప్రభాకర్, తండ్రి తాతల మధ్య దుర్బుద్దులని నోటి దురుసునీ వారసత్వంగా పొందిన 'బద్రుడి' గా అడవి శేష్ కూడా ఆకట్టుకున్నారు.

కోయగూడెం నాయకుడి భార్య 'సంగ' గా తన ఒక్క మాటతో భర్తతో సహా గూడెం మొత్తాన్ని కట్టడి చేయగల పవర్ ఫుల్ పాత్రలో నటించిన రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాత్ర కోయగూడేనికి శివగామిలా ఉంటుంది. ముఖ్యమైన నాలుగు స్త్రీ పాత్రలను (శివగామి, సంగ, దేవసేన, అవంతిక) శక్తి స్వరూపాలుగా మలచినందుకు కథకులు విజయేంద్ర ప్రసాద్ గారిని, రాజమౌళి ని అభినందించి తీరాలి.

తెలుగు సినిమా స్థాయిని కొన్ని రెట్లు పెంచే విజువల్ ట్రీట్ గా తీర్చిదిద్దడానికి ఈ చిత్ర యూనిట్ పడిన శ్రమకి, వెచ్చించిన సమయానికి, పెట్టిన పెట్టుబడికి ధీటుగా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్న ఈ చిత్రానికి ఇంకా ప్రత్యేకమైన ప్రమోషన్ అవసరం లేదు కానీ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. భారతీయత నిండిన ఊహాలోకపు విజువల్ ఫీస్ట్ కోసం, ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీ సొంతం చేసుకోడానికి ప్రతి ఒక్కరూ మిస్ అవకుండా చూడవలసిన చిత్రం బాహుబలి.


56 కామెంట్‌లు:

  1. అర్ధరహిత సినిమాలని, హీరోలు పలికే పంచ్ డైలాగుల్ని భగవధ్గీతకన్నా ఎక్కువగా ప్రేమించే మన వాళ్ళు, ఆముదాలవలస నించి అమెరికా దాక తల తిప్పి చూసేలా చేసిన ఈ మూవీని విమర్శించడం విడ్డూరం.. సౌతిండియా అంటే తమిళనాడు మాత్రమే కాదని ఈ చిత్రంతో నిరూపించారు రాజమౌళి.. ఆయన మనసుని తన కెమేరాలో బంధించి మనకందించిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కి హాట్సాఫ్.. తన ప్రతి కదలికని ఓ రోమన్ స్కెచ్ లా తీర్చిదిద్దుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మీవంటి వారు చేసే ఈ ప్రయత్నం వల కొందరైనా తమ విమర్శలు మాని దీనినర్ధం చేసుకుంటే బాగుంటుంది. అభినందనలు వేణూజీ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ శాంతిగారు. అవునండీ రాజమౌళి గారిని సెంథిల్ వర్క్ ని తప్పకుండా మెచ్చుకుని తీరాల్సిందే. సినిమాలో విషయమున్నపుడు ఎటువంటి నెగటివ్ రివ్యూలు వచ్చినా ఏం చేయలేవని ఈ సినిమా కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి.

      తొలగించండి
  2. హమ్మయ్య... ఇంతకాలం తర్వాత బాహుబలి గురించి మంచి రివ్యూ చదివి ఊపిరి పీల్చుకున్నా వేణుగారు. ఆ సినిమా నిర్మాణంతో నాకే సంబంధం లేదనుకోండి, కానీ అంత అద్భుతమైన దృస్యకావ్యాన్ని తీయటానికి ఎన్ని వందలమంది కష్టం మరెన్ని గంటల శ్రమ ఉన్నాయో తల్చుకుంటేనే వొళ్ళు జలదరిస్తుంది. కథేమీ కొత్తది కాదు కానీ చిన్నప్పుడు చదువుకున్న చందమమ కహ్త కళ్ళ ముందు సాక్షాత్కరించబడుతుంటే పొందిన థ్రిల్ మాత్రం ఆహా.... అనిపించింది. A very straight forward and genuine review, great work there!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ లక్ష్మి గారు. అవునండీ ఒక విజన్ కి దృశ్యరూపమివ్వడానికి టీం మొత్తం పడిన శ్రమ వెలకట్టలేనిది.

      తొలగించండి
  3. చాలా బాగా రాశారు. నిజంగా తెలుగు వాళ్ళు గర్వించదగ్గ సినిమా.

    రిప్లయితొలగించండి
  4. Venu Gaaru,
    I did not had chance to watch the movie yet. And was contemplating whether to or not to hesitating about unnatural drishyakavyams.
    Glad I read your review(only 1st paragraph) now I will watch and comeback to read the rest of the review.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ సురభి గారు, ఊహాలోకాలలో కాస్త అసహజత్వం ఉండడం కామనే కదండీ కాకపోతే అవేవీ మన అనుభూతికి అడ్డుపడవు. చక్కగా ఎంజాయ్ చేయవచ్చు సినిమాని.

      తొలగించండి
  5. ఇన్ని రోజులకు బాహుబలి గురించి ఎవరు రాయని విదంగా చాల బాగ రాశారండి. ఇంతకు విమర్శించిన వాల్లు అర్థం, పర్థం లేకుండా వచ్చే సీన్లు అతుకుల బొంతలా ఉన్న కథను గురించే ఆలోచించారు తప్ప మీలా ఎవరు ఆలోచించ లేదు. అదేమిటో ప్రజలు కూడ సినిమా చూసేంత వరకు తహ,తహ లాడారు చూసిన తరువాత పెదవి విరిచిన వాల్లు చాల మంది ఉన్నారు. ఈ రివ్యూల పుణ్యామా అని సినిమా బాగుందో లేదో తేల్చుకోలే అజ్ఞానంతో ఉన్నాను. ఎవరి పిచ్చి వారికి ఆనందం ఏం చేస్తాం

    సంగెం శ్రీనివాస్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ శ్రీనివాస్ గారు... కథ గురించి కారెక్టరైజేషన్ గురించీ అపుడే ఒక అభిప్రాయానికి రాకూడదనిపించిందండీ రెండో భాగం విడుదలయ్యాక పూర్తి అవగాహన వస్తుంది. నాకర్ధమైనంత వరకూ ఎక్కువమంది ఇంతకు ముందు వచ్చిన రాజమౌళి సినిమాలతో పోల్చి చూసుకోవడం వల్ల ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ మిస్ అయిందని ఫీల్ అయినట్లున్నారు సెకండ్ పార్ట్ వారికి ఆ కొరత తీరుస్తుందని అనుకుంటున్నాను.

      తొలగించండి
  6. నా పక్కనున్న ఒక ఫారినర్ కి , తాత, తండ్రి , కొడుకు ఒక్కడే అని చెప్పడానికి చచ్చాను .
    హిరో ని elevate చేయోచ్చు , మరీ తర తరాల నుండి ఒకే మొహాన్ని చూపించడం కొంచెం ఎబ్బెట్టు గా ఉంటుంది ..
    హీరోయిన్ ఏమో తల్లి గాను, హిరో మాత్రం అటు భర్త గాను , ఇటు కొడుకు గాను , కొంచెం ఎబ్బెట్టు గా లేదు ??? .. సినిమా మాత్రం సూపర్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ అజ్ఞాత గారు, నిజమేనండీ కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ ఇండియన్ స్క్రీన్ కి ఇది కొత్త కాదు ఎనభైల్లో వచ్చిన సినిమాలన్నిటిలో డ్యుయల్ రోల్స్ ఇలాగే ఉండేవి.

      తొలగించండి
  7. సినిమాకు తగ్గట్టుగా వుంది వేణుగారు మీ రివ్యూ. అద్భుతం ఇక వేరే మాట లేదు.

    రిప్లయితొలగించండి
  8. నా మనసులోని మాటలే రాశారు.

    రిప్లయితొలగించండి
  9. Very nice...review...Very nice baahubali movie...Mi review goppa? Baahubali movie Goppa? ani adigithe..Rendu...goppe..ani cheptanu..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ శ్రీను గారు... అంతలేదండీ.. ఖచ్చితంగా మూవీనే గొప్ప.. సినిమాతో పోలిస్తే నేను రాసినది నథింగ్.

      తొలగించండి
  10. ఒక సినిమా కి ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని రోజులు కష్టపడ్డా ఆ సినిమా కధ కోసం తప్ప ఇంకోటి కాదు. ఆఅ కధ మీద సరిగా వర్కౌట్ చేయకుండా ఎంత హంగామా చెసినా లాభం లేదు.ఇద్దరు యువ
    రాజులు అన్ని విద్యల్లో సమానం అయ్యారట...ఎవర్ని రాజుని చెయాలో డిసైడ్ చేయడం కష్టం అయిందట..అంతలో ఎవడో కాలకేయుడు వస్తాడంట...వాడ్ని ఎవదు చంపితే వాడే రాజు అంట...చాలా సీన్లు కృతకంగా ఉన్నాయి.. ఆ కొండలను ఎక్కాల్సిన అవసరం హీరో గారికి ఎందుకొచ్చిందో... కెమేరా తో జనాల్ని మోసం చెయ్యాలి కాబట్టి కొండలు ఎక్కటాలు... యుద్ధం షూట్ చేయాలనుకున్నాడు కాబట్టి యువరాజులు సమానం అయిపోడం... కాలకేయుడితో యుద్ధం....రెండు పార్ట్ లు తీసి బాగ పైసలు గుంజే త్రిసూల వ్యూహం... అంతకు మించి ఇంకేం లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇలా చూస్తే ఇక మనం ఏ సినిమానీ ఆస్వాదించలేమండీ.. ఒక ఫాంటసీ స్టోరీని ఈ విధంగా డిసెక్ట్ చేయకూడదు.. అయినా మీరు చందమామ కథలేమీ చదవలేదనుకుంటా.. ;-) సోషల్ మూవీస్ లోనే లాజిక్ లేని సీన్లు కోకొల్లలు కదండీ..

      తొలగించండి
    2. గురువుల వద్ద సమాన విద్యను అభ్యసించిన వారు సమన రీతిలో ఉత్తీర్ణులు అయ్యారు, కనీ ఒకరిది నైపుణ్యత లో వేగం తో కట్టిపడేయగల నేర్పు, మరొకరిది బండలను బద్దలు కొట్టే బలం....రాజ్యం అన్నాకా దాడులు సహజం..చంపినవారికి రాజ్యం అన్న ప్రతిపాదన మాత్రమే వస్తుంది, కనీ అది అధికార పీఠం పై ఉన్న రాజమాత అంగీకరించినట్టు చూపరు.
      ఇంక కొండలు అంటారా, అదొక కుతూహలం, ఒక్కసారి పర్వతారోహనలు చేసేవారిని ఇదే ప్రశ్న అడిగి చూడండి... సులభసాధ్యం కానిదానిని ఎలాగైనా చవి చూడాలనే ఆత్రం అవగతమయ్యేలా వారు చాలా బాగా వర్నిణ్చి వివరిస్తారు...

      @ నీహారికగారు: నేనూ పాటాలు వినప్పుడు మీలాగే అనుకున్నానండీ. కీరవాణి గారి పాత పాటాలను తలచుకుని తలచుకుని తెగ బాధ పడిపోయాను కాని థియేటర్ లో వినప్పుడు తేడా ఉందండీ పైగా మాములు దానికి dobly atoms surround sound ఉన్న దానికి చాలా వ్యత్యాసం ఉంది...మరి photoshop గురించి తెలిసున్న మీరు అంత precise perfect animated grphicsని మరింత మెచ్చుకోవాలి కదండీ, మీకోసమే అనుష్క ని రెండో భాగం లో అందంగా చూపిస్తున్నారు ...ఎండకు ఎండి, వానకు తడిచీ 20 యేళ్ళు ఉన్నా దేహం అలా కాక మరెలా ఉంటుందండీ ...

      ఇక రెండు భాగాలు అని వాపోయేవారందరికీ గురించి చెప్పాలి, 7 భాగాల్లో కధ, ఒక్కో పుస్తకం విడుదలకి మధ్యన, 1-2 యేళ్ళ నడిమి..ఐనా ఎంత ఓపికగా వేచివున్నాము అభిమానులము... రెండు భాగాలకే మధ్యలో ఆపేసారంటే యెలా....ఇంక రోజుకో అరనిమిషం కధను నడిపించే ధారావహికలను మటుకు తెగ ఓర్పుతో చుసేస్తారే...ఎదైనా ఊరెలితే పక్కింటి పిన్ని గారినో వెనకింటి వదినగారినో వెంఠనే అడిగి కధ తెలుసుకోవలసిందే......లేకపోతే నిప్పు తొక్కిన కోతిలా గెంతుతుంటుంది మనసు కనీ ఒక అద్భుతలోకాన్ని ఆవిష్కరించడానికి 3 గం|| సరిపోక రెండు భాగాలు అంటే మనకి ఎక్కాదు....

      ఏదో వ్యాఖ్య అనుకుంటే చిన్న టపా తేలింది....

      వేణుశ్రీకాంత్ గారు, ...చినప్పుడు తెలుగు పర్యాయపదాలు పరీక్షకని చదువుతూ, పొగుడు = కీర్తించు, శ్లాఘించు. అని చదివినట్టు గుర్తు, ఆ పదం మరలా తటస్థించడం ఇదేనండి...

      - అను

      తొలగించండి
    3. @Anonymous,
      సీరియళ్ళా??? నేనా ? రాజమౌళి కాదు కదా ఆయన నాన్న తీసినా నేను చూడను.రామాయణం,భారతం రెండు సీరియళ్ళు మాత్రం చరిత్ర తెలుసుకోవడం గురించి చూసాను.బాహుబలి బాగుంది అని అనేదాకా ఊరుకోరా ఏమిటీ ? నేను తప్పు చేస్తే ఒప్పుకుంటా కానీ నాకు నచ్చని దాన్ని టక్కున చెప్పేస్తా ? నాకే కనుక అధికారం ఉంటే సాగతీత తెలుగు సీరియళ్ళు ban చేసి పడేస్తా..ఆడవిలన్లు ఉన్న సీరియళ్ళు తీస్తే 7 సంవత్సరాలు, న్యాయం పక్షాన మాట్లాడకుండా ఏకపక్షంగా ఉండే బ్రతుకు జట్కా బండికి యావజ్జీవితఖైదే !




      తొలగించండి
    4. అను గారూ అంత ఓపికగా టైప్ చేసి వివరమైన రిప్లై ఇచ్చినందుకు చాలా థాంక్సండీ.. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తాను.. సో ట్రూ.. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని కామెంట్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది నాకు.

      తొలగించండి
    5. వేణు గారూ,

      సోషల్ మీడియాలో ఎవరేమనుకుంటే ఏమిటండీ ? కలెక్షన్స్ పరంగా చూస్తే సగటు తెలుగు ప్రేక్షకుడు కూడా మెచ్చినట్లే అనుకోవచ్చు.. అని అన్నారు కదా ?

      తొలగించండి
    6. @నీహారిక గారు,
      అదీ కరక్టేలెండి... అందుకే ఆశ్చర్యంగా ఉందీ అన్నాను.

      తొలగించండి
  11. meeku ardham kaledu sir.

    manaku balakrishna, jr. ntr valla laga thoda gottadalu, simhalu, pululu, pagila koddi dialogues undali. appude mana telugu vallu mechhutaru sir.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ అశోక్ గారూ.. కలెక్షన్స్ పరంగా చూస్తే సగటు తెలుగు ప్రేక్షకుడు కూడా మెచ్చినట్లే అనుకోవచ్చు..

      తొలగించండి
  12. ఒక సినిమాలో పాటలు లేకపోయినా కూడా ఉత్కంఠగా చూడగలం.ఈ సినిమాలో పాటలు అసలు బాగులేవు,నేపధ్య సంగీతం బ్యాక్ గౌండ్ మూజిక్ ఏదీ బాగులేదు.అన్నీ గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంటే ఎంజాయ్ చేయలేకపోయాను. కామెడీ ని మిస్ అవ్వవచ్చు,పాటలనూ,సంగీతాన్నీ మిస్సవడం అదీ అంత ఖర్చుపెట్టుకుని మరీ....పోస్టర్స్,రివ్యూస్ ఎలా మోసం చేస్తాయో తెలుసుకోవాలంటే ఫేస్బుక్ లోనూ,బ్లాగుల్లోనూ ప్రొఫైల్ ఫోటో ని చూసి ప్రేమలో పడ్డట్లే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ... నేపధ్య సంగీతం బ్యాక్ గౌండ్ మూజిక్ ఏదీ బాగులేదు.....
      అదేమిటండీ! 'నేపధ్య సంగీతం' అన్నా 'బ్యాక్ గౌండ్ మూజిక్' అన్నా ఒకటే కధా!

      .......పోస్టర్స్,రివ్యూస్ ఎలా మోసం చేస్తాయో......
      పోష్టర్స్, చిన్న చిన్న టీజర్స్ అన్నీ కూడా ఆకట్టుకునే బిట్లను ప్రదర్శించటం మాత్రమే కదా. మొత్తంలో అందమైనవి ఆవి అన్నప్పుడు మిగతావి ఆస్థాయిలో ఉన్నా ఖచ్చితంగా అంత గొప్పగా ఉండకపోవచ్చును. ఈ సరంజామా అంతా సినిమాకి జనాన్ని రప్పించటానికే. ఇక రివ్యూలంటారా, అవి సినిమా తీసినవారి అభిరుచిని రివ్యూ వ్రాసే వారి అభిరుచి ఎలా అర్థం చేసుకుందన్న దానిపైన అధారపడి ఉంటుంది. అందుకే రివ్యూలు బాగున్న సినిమాలు ఆడకపోవచ్చు - వెర్సా. ఒక అంచనా వేసుకొని చూడటమే. ఒక్కోసారి నిరుత్సాహం కలిగే మాట అందరికీ అనుభవమే. కాని సినిమా ప్రచారం కోసం తీసే పోష్టర్స్ మోసం క్రిందికి వస్తాయనటం కష్టం. రివ్యూయర్లు వాళ్ళ అభిప్రాయం మాత్రం చెబుతున్నారు కాబట్టి వాళ్ళని మోసగాళ్ళనీ అనలేమేమో.

      తొలగించండి
    2. నిజమే,రివ్యూయర్లని మోసగాళ్ళనేస్తే ఈ బ్లాగరుకి కూడా తగుల్తుంది ఆ మాట!

      తొలగించండి
    3. నీహారిక గారూ, ఈ సినిమా ప్రత్యేకతే ఒక ఊహాలోకాన్ని గ్రాఫిక్స్ ఏవో రియల్ షాట్స్ ఏవో తెలియనంతగా విజువల్ ఎఫెక్ట్స్ తో సృష్టించడం.. నాకైతే అసలు గ్రాఫిక్సే కదా అన్న ఫీల్ ఎక్కడా రాలేదు..

      ఇక రివ్యూలతో మోసం చేయడం వల్ల అవి రాసే వాళ్ళకి ఒరిగేదేం ఉండదని నా అభిప్రాయమండీ. ఏ రివ్యూ అయినా వారి అభిప్రాయాన్ని చెప్పడం కోసమే రాస్తారు.. అలా రాసిన దాన్ని చదివి ప్రోమోస్ లాంటివి చూసి మనకీ నచ్చుతుందనిపిస్తేనే సినిమా చూస్తాం కదా.. అలా ఒకటి రెండు సార్లు చూశాక ఆయా సినిమాలు నచ్చక పోతే వాళ్ళు రాసే రివ్యూలు చదివడం మానేయడమేనండీ.. నేనలా చదవడం మానేసిన రివ్యూస్ చాలా ఉన్నాయి.

      తొలగించండి
    4. @వేణు గారు,

      ఆంధ్రా వాళ్ళు దొంగలు,దోపిడీదారులని కేసీఆర్ గారు అన్నట్లు రివ్యూ రాసేవారందరూ మోసం చేస్తున్నారనడం కరెక్ట్ కాదని నేను అంగీకరిస్తున్నాను.రేరాజ్ గారని ఒక బ్లాగర్ ఉండేవారు,ఆయన ఈ సినిమాకి రివ్యూ రాస్తే చదవాలని ఉంది. ఫోటోషాప్ మీద ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానం వల్ల గ్రాఫిక్స్ అని అర్ధమయ్యాయి.నా అభిమాన హీరోయిన్ అనుష్కని అలా చూడవలసి రావడం నచ్చలేదు.

      మిమ్మల్ని అనాలని అనలేదు, సినిమా మీద, సినిమా బడ్జెట్ మీద, దాని ప్రమోషన్, ధియేటర్ల యాజమాన్య దోపిడీ మీద, అనుకోకుండా ఒక సినిమాకని వెళ్ళి ఈ సినిమా తప్పక చూడవలసిరావడం, మోడీ ఎన్నికల ప్రచార ఖర్చు గుర్తుకువచ్చి, వీటన్నిటిమీద ఉన్న కోపం కమెంట్ రూపంలో వచ్చేసింది.జరిగింది పొరపాటే,అంగీకరిస్తున్నాను, క్షమించండి !

      తొలగించండి
    5. అయ్యో క్షమాపణలంత పెద్ద మాటలెందుకండీ... సినిమాలో మీకు నచ్చని పాయింట్స్ చెప్పారు కదా.. థియేటర్ల దోపిడీ.. బ్లాక్ టికెట్స్.. లాంటి వాటి విషయంలో మీ కోపాన్ని అర్ధం చేస్కోగలను..

      తొలగించండి
  13. @ Syamaliyam garu,

    నిజమేనేమో,మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. మనుషుల గురించి,రచనలగురించీ మన అభిప్రాయం తప్పేమో అని మనమే పునరాలోచించుకోవలసి వస్తుంది.

    రిప్లయితొలగించండి
  14. మళ్ళీ మళ్ళీ రాని రోజు, బాహుబలి ఈ రెండు సినిమాలూ ఈ బ్లాగర్ రివ్యూ తరువాతనే చూసాను.ఏ రివ్యూ వ్రాసినా వ్యక్తిగత అభిమానాన్ని ప్రక్కకి పెట్టి వ్రాస్తే రచయతకీ, ప్రొడ్యూసర్ కీ మంచిది.డబ్బుతోటి వ్యవహారం కదా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఈ కామెంట్ కి కూడా నా సమాధానం మొదటి రిప్లైలోనే ఇచ్చాననుకుంటున్నాను..

      తొలగించండి
  15. నృత్యం అన్నా కొరియోగ్రఫీ అన్నా ఒకటేనా ? తెలియపర్చగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ సందేహం సాంకేతికంగా కూడా కరెక్టే!సినిమ అవాళ్ళు కూడా వాడుతుంటారు.నృత్యం అంతే మామూలుగా పాట్లకి చేసే స్టెప్పులూ మూవ్మెంట్లూ అని చెప్తారు.కొరియోగ్రఫీ అనేది కొన్న్ని పాతలకి ఒక థీం ఉంతుంది - ఆ ధీం చక్కగా ఎస్టాబ్లిష్ చెయ్యటానికి వాడే టెక్నిక్ పేరు కొరియోగ్రఫీ కావచ్చు!
      ఉదాహరనకి రహస్యంలో వాడుకున్న బుర్రకధకి అచ్చం నిజంగా బుర్రకధకులు యెలాంతి మూవ్మెంట్సు ఇస్తారో మామూలు డ్యాన్సర్లకి తెలియకపోవచ్చు!

      తొలగించండి
  16. Venu garu..Nijangane..mi review atbutham..Rajamouli...di Drushya kavyam..ki..Mi review...Ardham echchindi...super...mi nundi marinni sameeksalu asistunnam

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ శ్రీను గారు.. తప్పకుండానండీ.. మంచి సినిమాల గురించి మీతో పంచుకోవాలని ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది.

      తొలగించండి
  17. ఐనా..నృత్యం-కొరియోగ్రఫీ.. బేక్ గ్రౌండ్ మ్యూజిక్-నేపధ్య సంగీతం..అంటే ఒకటే అని కూడా తెలీకుండా ))))-: 

    రిప్లయితొలగించండి

  18. బాలసుబ్రహ్మణ్యంగారు నేపధ్య సంగీతాన్ని అందించినవారు అని చెపుతుంటారు.పాటలకు సంగీతాన్ని ఇవ్వడం,ఎమోషన్స్ కీ యుద్ధాలకీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇవ్వడం వేరని నేను భావిస్తున్నాను.నృత్యం అంటే భంగిమలు,కొరియోగ్రఫీ అంటే కాస్ట్యూంస్,పళ్ళూ,కూరగాయలూ,బిందెలూ వగైరాలతో చేసే విన్యాసాలని అనుకున్నాను.గొప్ప గొప్ప వాళ్ళని విమర్శించాలంటే గొప్పోళ్ళై ఉండాలని తెలియదు.చాకలోడికి కూడా చందమామ కధ అర్ధమవ్వాలని మాత్రం తెలుసు.

    ఇంతకీ కలం పేరున్న వారూ, అజ్ఞాత లూ ఒకరేనా ?


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి తెలుగు అనువాదం నేపధ్య సంగీతం కదండీ శ్యామలీయం గారు అదే రిఫర్ చేసినట్లున్నారు రెండూ ఒకటే కదా అంటూ. ఇక కొరియోగ్రఫీకి వివరణ ఈ వికీ లింక్ లో ఉంది చూడండి.
      https://en.wikipedia.org/wiki/Choreography

      కలం పేరంటూ ఉంటే వారు అజ్ఞాతగా ఎందుకొస్తారు చెప్పండి.. వేరు వేరై ఉంటారు.

      తొలగించండి
  19. ఇప్పుడు చూసిన మొదటిభాగంలో రాజమాత చాలా హుందాగా కనబడటమూ తీసుకున్న నిర్ణయలన్నీ న్యాయంగా ఉండటం వల్ల పాజిటివ్ ఇమేజి ఉంది.కానీ మొదటి సన్నివేశంలో "చేసిన పాపానికి ప్రతిఫలంగా" శిశువుని రక్షించడం,చివరిలో బాహుబలిని చాటుదెబ్బ తీసినది కట్టప్ప అవడం వల్ల నాకు ఆ హత్యకి పురమాయించింది రాజమాత శివగామియే కావచ్చునని అనిపిస్తున్నది.ఆయుధాల పంపకంలో మీ పెదానాన్న గారు మోసం చేస్తున్నారు అని హెచ్చరించేటంతగా అభిమానించే మనిషి తనంతట తనుగా యెందుకు చంపుతాడు?అతను సింహాసనానికి బంధితుడైన దీక్షాపరుడు,భల్లాళుని మాట గాని బిజ్జలుని మాట గానీ అతను వినడు. అప్పుడు సాంకేతిక కారణాల వల్ల సింహాసనం మీద కూర్చోకపోయినా సర్వాధికారాలూ రాజమాతవే గనుక చంపమనే మాట ఆమె నుంచే వచ్చి ఉండవచ్చు,కాదా?

    యెటూ మొత్తం సినిమా ముందే తీసి ఉంచారు గనక యేమి జరిగి ఉండొచ్చు అనే వూహ - రెండో భాగం రిలీజయ్యాక నేను ముందే వూహించాను అంటే నన్ను అంతెలుసు గాడి కింద లెక్కేస్తారేమో,యెందుకయినా మంచిది ముందే ఇక్కడో మాట వేసి ఉంచుదాం అనై చిన్న సరదా,అంతే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ గెస్సింగ్ బాగుంది హరిబాబు గారు థాంక్స్ ఫర్ షేరింగ్ ఇట్ హియర్ :-) పార్ట్ టూ గురించి ఎన్ని రకాల ఊహాగానాలు నడుస్తున్నాయో లెక్కే లేదులెండి ప్రస్తుతం :-)

      తొలగించండి
  20. హరిబాబు గారూ, ఓ తెలుగు సినిమాలో హీరోయిన్ ఏదో నవల చదువుకుంటుంటే హీరో వస్తాడు. ఆమె చదువుతున్న పుస్తకం ఏమిటా అని చూసి - ఓ ఇదా, బాగుంటుంది. చివర్లో హీరోయిన్ చనిపోతుంది - అంటాడు. అలా ఉంది మీ "సరదా" :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు చెప్పిన సన్నివేశం "మల్లీశ్వరి" సినిమాలోది నరసింహారావు గారు. మంచి సీన్ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు :-)

      తొలగించండి
  21. వేణు గారు,

    నేను చెప్పదలచుకున్నది దాదాపుగా ఈ బ్లాగర్ చెప్పారు.ఒకసారి చదవండి.
    http://aloori.blogspot.in/2015/07/bahubali-review.html

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ నీహారిక గారూ, చదివానండీ.. ఆయన అన్నీ చెప్పేసి ఈలోపాలు ఐదుశాతం మాత్రమే ఇవి మిగిలిన తొంభై ఐదుశాతాన్ని ఆస్వాదించడానికి అడ్డుపడలేదు అని చెప్పారు కదా.. దట్స్ ట్రూ.. ఈ సినిమాలోనూ చిన్న చిన్న లోపాలున్నా అవి సినిమాని ఎంజాయ్ చేయడానికి అడ్డురావనేది సత్యం.

      తొలగించండి
  22. venu garu, waiting for your review on bahubali 2. what happened? why didnt you write?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాస్త బిజీగా ఉండడం వల్ల కుదరలేదు అజ్ఞాత గారు.. రాయాలి.. థాంక్స్ ఫర్ ఆస్కింగ్..

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.