తెల్లారి ఎన్నికల రోజు పది పదకొండు గంటల సమయంలో వంట పనులన్నీ అయ్యాక పార్టీ కార్యకర్తలు అరేంజ్ చేసిన వాహనాల్లో అమ్మ ఇంకా పక్కింటి ఆంటీలందరూ వెళ్ళి ఓటు వేసి వచ్చేవాళ్ళు. ఇంట్లో ఓటుహక్కులేని పిల్లలమంతా ఆటల్లో మునిగి తేలుతూ అమ్మతో ఏమేమి స్పెషల్స్ వండించుకోవాలో ప్లాన్లు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓటుహక్కు గురించి బొత్తిగా అవగాహనలేని స్కూల్ రోజుల్లో ఓట్లంటే రాజకీయనాయకులకు లబ్ది చేకూర్చేవి మాత్రమే అనీ అందుకే వాళ్ళు అలా కారుల్లో తీస్కెళ్ళి ఓట్లేయిస్తారనీ అనుకునేవాడ్ని.
సెల్ఫోన్ల ఊసే లేక లాండ్ లైన్ ఫోన్లు, టీవీలు కూడా పరిమితంగా ఉండే ఆ రోజుల్లో రేడియోలో వార్తలు, వార్తా పత్రికలు సాయంత్రం ప్రచురించే స్పెషల్ ఎడిషన్ పేపర్లు, ఇంకా ఆనోటా ఈనోటా తెలిసే గాలివార్తలే ప్రముఖమయేవి. చాలా సార్లు ఉదయం ప్రశాంతంగా జరిగే ఎన్నికలు మధ్యాహ్నానికి రకరకాల వార్తలతో గందరగోళమయేవి.
పేపర్ బాలెట్ ఉపయోగించే ఆ రోజుల్లో బాలెట్ బాక్సుల్లో నీళ్ళు, ఇంకూ పోసేవాళ్ళు, పోలింగ్ బూత్ లో చొరబడి వాటిని ఎత్తుకెళ్ళే వాళ్లు, ఓటర్ జాబితాలను చించేసేవాళ్ళూ, రిగ్గింగ్ చేసే వాళ్ళూ, ఎన్నికల ఆఫీసర్స్ ని కిడ్నాప్ చేసే వాళ్ళు, బాంబు దాడులు కత్తిపోట్లు రాళ్ళ దాడులు గొడవలు కొన్ని సార్లు రణరంగాన్ని తలపించేవి.
ఇపుడంతా ఎలక్ట్రానిక్ యుగం, పేపర్ బాలెట్స్ స్థానంలో ఎలెక్ట్రానికి ఓటింగ్ మెషీన్స్ వచ్చాయి. హింస రక్తపాతం చాలావరకూ తగ్గింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడూ చెదురు ముదురు సంఘటనలు జరుగుతున్నా కూడా రెలెటివ్ గా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయనే చెప్పచ్చేమో....
ఇంతకీ ఇపుడిదంతా ఎందుకు గుర్తు చేసుకున్నానంటే ఈరోజు ఎన్నికలు జరిగాయి కాబట్టి నేనూ ఓటేశాను కాబట్టి. ఉదయాన్నే ఏడున్నరకల్లా పోలింగ్ స్టేషన్ కి వెళ్ళి దదాపు గంటన్నర సమయం వెచ్చించి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను.
పొద్దున్న చల్లగా ఉంటుంది క్యూలో ఎదురు చూడడం కూడా సులువు అనుకుని వెళ్తే దదాపు మా వార్డ్ లో అందరూ అదే అనుకున్నట్లున్నారు నేను వెళ్ళే సరికే దదాపు అరవై మందికి పైగా క్యూ ఉంది సరే కదా అని ఎదురు చూడ్డం మొదలెడితే ఎనిమిదయ్యే సరికి మిట్టమధ్యాహ్నంలా సూర్యుడు ప్రతాపం చూపడం మొదలెట్టాడు.
గుంటూర్లో అసలే చెమటలెక్కువేమో ఒక పక్కన గాలి వీస్తూన్నా కూడా ఏమాత్రం ఆరకుండా చెమటలు పడుతూనే ఉన్నాయి. లైఫ్ ఈజ్ జిందగీ రూల్ ప్రకారం మనం నుంచున్న క్యూలోనే జనం ఎక్కువ ఉంటారు అదే మెల్లగా కదులుతూ ఉంటుంది ఎప్పుడూ, ఈ వేళ కూడా అంతే మెల్లగా నడుస్తుంది.
మా వార్డ్ జనాభాకే చైతన్యం ఎక్కువై ఇంత పొద్దున్నే వచ్చేశారు మా పక్క బూత్ మరోటి కూడా రష్ గానే ఉంది వాళ్ల క్యూ కాస్త చెట్ల నీడలో సాగింది. ఇక మా రెండూ తప్ప మిగిలిన బూత్స్ లో ఎక్కడా పది పదిహేనుమందికి మించలేదు. వీటన్నిటికి తోడు క్యూ జంప్ చేద్దామని ప్రయత్నించేవాళ్ళకీ తక్కువ లేదు.
సరే ఎలాగైతేనేం ఓటింగ్ ముగించుకుని ఇంటికి చేరుకుని పనులు చూసుకుని సీనియర్ సిటిజన్ కనుక క్యూలో ఎదురు చూడాల్సిన పని ఉండదులే అని పన్నెండు ప్రాంతంలో కాస్త వాతావరణం కూడా చల్లబడిందిలే అని నాన్నగారిని ఓటు వేయించడానికి తీస్కెళితే మా బూత్ లో స్టాఫ్ అందరూ ఖాళీగా ఈగలు తోలుకుంటూ కూర్చున్నారు.
ఏ సిటిజన్ అయినా డైరెక్ట్ గా వెళ్ళి ఓటేసి వచ్చేయడమే అనమాట. హారినీ నేనూ తమ్ముడూ ఆవేశంగా పొద్దున్న వచ్చామనమాట మేం కూడా ఇప్పుడే వస్తే పోయేది అనుకున్నాను. కనుక మిత్రులారా ఉదయాన్నే వెళ్ళడం కన్నా అవకాశముంటే ఇలా ఏ లంచ్ టైమ్ లోనో వెళ్తే సులువుగా క్యూలు లేకుండా ఓట్ వేసి వచ్చేయచ్చనమాట గుర్తుంచుకోండి.
ఏదైతేనేం ఎపుడూ నేనో చెల్లాయో ఊరిలో ఉండకపోవడమో, నాన్న ఎలెక్షన్ డ్యూటీలకి వెళ్ళడమో జరిగేది కనుక మా ఇంట్లో అందరమూ ఓట్లు వేసే అవకాశం ఉండేది కాదు. నేను పుట్టి బుద్ది ఎరిగాక ఈరోజు మొదటిసారి మా ఇంట్లో అందరమూ ఓటేసి మా తరఫున వందశాతం పోలింగ్ నమోదు చేయగలిగామనమాట.
ఇన్నీ చెప్పి మరి ఓటేశానని చెప్పే ప్రూఫ్ చూపించకపోతే ఎలా... అసలే ఈ కాలంలో ఈ వేలుచూపించడమో స్టైల్ కదా.. ఇదనమాట విషయం.