బుధవారం, జూన్ 13, 2012

శ్రీశ్రీనివాసం శిరసా నమామి - 2

మొదటి భాగం ఇక్కడ చదవండి. కళ్యాణకట్ట క్యూలో తోసుకుంటూ ఒకళ్ళమీద ఒకళ్ళు నిలబడి ఎలాగో రెండున్నర గంటలు ఎదురు చూశాక కంపార్ట్మెంట్స్ లోకి వదిలాడు. అక్కడ కుర్చీలూ ఒక మంచినీళ్ళ కుళాయి ఉన్నాయి. అక్కడ కూర్చుని ఒక అరగంట ఎదురు చూశాక అక్కడనుండి కిందకి వదిలాడు. అలా వదిలేప్పుడు ఒక బార్ కోడ్ ప్రింట్ చేసున్న స్లిప్ మరియు సగం బ్లేడ్ మనచేతికి ఇస్తారు. ఆ కోడ్ తోపాటు ఒక నంబర్ ఉంటుంది కింద కళ్యాణ కట్ట దగ్గరకు వెళ్ళినపుడు ఆ నంబర్ ఎక్కడ ఉందో వెతుక్కుని దానిదగ్గర ఉన్న క్షురకుని వద్దకు వెళ్ళి లైన్లో నించుంటే అతను గుండుకొడతాడు. ఆ ప్రదేశం అంతా కింద నీళ్లు వెంట్రుకలతో బ్యాగ్ కిందపెట్టుకోడానికి కూడా వీలు లేకుండా ఉంది తరచుగా శుభ్రం చేయడానికి ఒక నలుగురైదుగురు స్టాఫ్ ఉన్నాకూడా వారి పనితీరు అంత ప్రభావవంతంగా అనిపించలేదు. బహుశా విపరీతమైన రద్దీ ఉండటం వలన అయి ఉండచ్చు. ప్రతి క్షురకుని దగ్గర చేతికింద ఒక వేడినీళ్ల బక్కెట్టు, క్యూల మధ్యలో ఒక బకెట్లో మాములు నీళ్ళు ఉన్నాయి. మన వంతు వచ్చే ముందు ఆ నీళ్ళతో మన తల తడుపుకుంటే మనవంతు వచ్చినపుడు నాయీబ్రాహ్మడు వేడినీళ్ళుపయోగించి పని పూర్తిచేస్తాడు.

ఇక్కడ గుండు ఉచితంగా చేస్తారు “ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు, అంతా ఉచితం” అని అంతటా బోర్డులు ఉంటాయి కానీ మీరు ఆ టోకెన్ అతని చేతిలో పెట్టేప్పుడే దానితో పాటు కొంత డబ్బులు కలిపి ఇవ్వండి. నాకు ఈ సూక్ష్మం తెలియక కేవలం టోకెన్ మాత్రమే ఇచ్చాను. ఆయన ఎడాపెడా గుండంతా మంట పుట్టేలా గీకేయడమే కాక అక్కడక్కడ పూర్తిగా చేయకుండా వదిలేస్తే, నేను తడుముకుని చూస్కుని మళ్ళీ చెప్పి చేయించుకోవాల్సి వచ్చింది. అంతా అయ్యాక గట్టుమీద భద్రంగా పెట్టిన బ్యాగ్ తీసుకుని వచ్చేస్తుండగా “ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు తోచినంత ఎంతోకొంత ఇవ్వండి సార్” అని ఆపేశాడు. “అదేంటోయ్ అంతటా ఇవ్వద్దని బోర్డులున్నాయ్ సి.సి. కెమేరాలు కూడా ఉన్నట్లున్నాయ్ కదా?” అని నేను అంటే “అవంతే ఉంటాయ్ సార్ మీరు కిందనుండి ఇచ్చేయండి, మాకు అలవాటే తీస్కుంటాం” అని చెప్పాడు. అతనికి కొంత చదివించుకుని పక్కన ఉన్న స్వామివారి ఫోటోకి భక్తిపూర్వకంగా ఒక నమస్కారం చేసుకుని ఇవతలికి వస్తుండగా ఎవరినో “ఏంది దొరలాగా గుండు చేయించుకుని వెళ్తున్నావ్ పైసల్దీయ్” అని అదిలించడం వినిపించింది.

మాములుగా ఇంటిదగ్గర క్రాఫ్ చేయించుకున్నపుడు పర్స్ అంతా ముట్టుకోవడమెందుకు అని సరిపడా చిల్లర మాత్రమే తీస్కెళ్ళే నేను తప్పనిసరై ఇది పుణ్యకార్యమనే ధీమాతో అంతా స్వామిదే బాధ్యత అని అలాగే ఉతికిన బట్టలు స్వామివారి ముడుపుతొ సహా ఉన్న ట్రావెల్ బ్యాగు తగిలించుకుని బయల్దేరాను. కళ్యాణకట్టలో స్నానానికి బాత్రూములున్నాయ్ కానీ ఆ రోజు నీళ్ళు రావట్లేదని చెప్పారు. మెల్లగా పుష్కరిణి వైపు అడుగులేయడం మొదలెట్టాను. అంత పొద్దున్నేకూడా ఎక్కడ చూసినా భక్తులతో తిరుమల అంతా కళకళలాడుతుంది. దారిలో ఎక్కడంటే అక్కడ మంచినీళ్ళకోసం ఏర్పాటు చేసిన పంపులు బాగున్నాయ్. గుడి పరిసరాలే కాకుండా మాడవీధుల్లోను కొబ్బరికాయలు కొట్టేదగ్గర మెట్లమీద అంతా ఎంతమంది భక్తులు ఉన్నాకూడా పరిశుభ్రతకు ఏవిధమైన లోటులేకుండా చూడడం బాగా నచ్చింది.

వరాహ స్వామి గుడి వెనక పుష్కరిణి పక్కన మహిళలకి మగవారికి ఎవరికి వారికే ప్రత్యేకంగా కట్టిన స్నానపు గదులు చాలా శుభ్రంగా సౌకర్యంగా ఉన్నాయ్. విశాలమైన ఆవరణ, గ్రానైట్ రాళ్ళతో ఫినిషింగ్ ఇచ్చిన గోడలు అంతే చక్కని మెయింటెనెన్స్, ఒక్కో బాత్రూములోనూ బక్కెట్టు మగ్గు, తలుపుకు బట్టలు తగిలించుకోడానికి హ్యాంగర్స్, సబ్బు షాంపూ ఇతరత్రాలు పెట్టుకోవడానికి చిన్న అర, బాత్రూముల మధ్య కొంచెం ఎత్తులో నీళ్ళుపడకుండా బ్యాగులు పెట్టుకోడానికి ఒక గట్టు అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయ్. వీటన్నిటికి తోడు పుష్కరిణి నుండి పంప్ చేస్తున్న నీరు పుష్కరిణిలో స్నానమాచరించిన తృప్తిని కూడా మిగిల్చింది.

అక్కడ స్నానం ముగించి తిరిగి గుడి ముందుకు వచ్చి స్వామివారికి ఒక టెంకాయ కొట్టి అప్పటికే సర్వ దర్శనం ఒక రోజు పడుతుందని టాక్ స్ప్రెడ్ అవడంతో ప్రత్యేక దర్శనం(300)క్యూ వెతుక్కుంటూ బయల్దేరాను. మంగళ బుధవారాల్లో ఈ లైన్లోకూడా దర్శనం ఆరుగంటల పైనే పడుతుందట మిగిలిన రోజుల్లో మూడు నాలుగు గంటల్లో ముగుస్తుందని తెలిసింది ఆరోజు గురువారం. టిక్కెట్లు క్యూలోనే ఇస్తారు కానీ క్యూలైన్స్ లో ప్రవేశించేముందే సెల్ ఫోన్స్, లగేజ్, చెప్పులను క్లోక్ రూంలో సరండర్ చేయాలి. కళ్యాణకట్టనుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 దగ్గరకు వెళ్ళే దారిలో మొదట నడిచి వచ్చినవారికి ఇచ్చే లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. మరికొంచెం ముందుకు వెళ్తే అదనంగా మరో రెండు కౌంటర్లు లగేజ్ సెల్ ఫోన్స్ చెప్పులు డిపాజిట్ చేసుకునేందుకు ఉన్నాయ్. తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా ఈ కౌంటర్లలో అంత రద్దీలేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది ఒకరిద్దరిని మించి క్యూ పెరగకుండా సిబ్బంది జాగ్రత్తగా చూస్తున్నారు. అలాగే రోజంతా ఒకటే పని చేస్తూ వందలమంది భక్తులను డీల్ చేసినా అక్కడి సిబ్బంది విసుక్కోకుండా ప్రతి ఒక్కరికి ఓపికగా సమాధానాలు చెప్పడం బాగా నచ్చింది.  

ఇక ప్రత్యేక దర్శనం క్యూలో ఎంటర్ అయ్యాక క్యూలో పైన ఫాన్లు, దాదాపు ప్రతి యాభై అడుగులకు ఒక మంచినీటి కుళాయి, అక్కడక్కడా పెద్దవాళ్ళు కూర్చోడానికి ఏర్పాటు చేసిన కుర్చీలు, క్యూ బయటనుండి టి.టి.డి వారు సరఫరా చేసిన పాలు, క్యూ గ్రిల్స్ కు వేళ్ళాడదీసిన వట్టివేళ్ళ తడికలు చాలా ఆకట్టుకున్నాయి. కానీ ఇక్కడ కూడా భక్తులలో క్రమశిక్షణ లోపించింది. రెండుమూడు వరుసలలో నిలబడి తోసుకోవడమే కాక క్యూలో నిలబడి ఇబ్బంది పడుతున్న ఒక పెద్దావిడని కుర్చీలో కూర్చోపెట్టడానికి అప్పటికే అందులో సెటిల్ అయిన ఒక అతనికి పక్కనున్నవాళ్ళం గట్టిగా చెప్పి లేపాల్సి వచ్చిందంటే మీరే అర్ధం చేసుకోవచ్చు.

ఈ క్యూలైన్స్ లో దదాపు మూడుగంటలకు పైగా ఎదురు చూశాక మెటల్ డిటెక్టర్ ద్వారా టిక్కెట్ కౌంటర్స్ వద్దకూ, ఆపై క్యూ కాంప్లెక్స్ లోకి వదిలారు. ఈ కాంప్లెక్స్ లు చాలా శుభ్రంగా మంచినీరు, టాయిలెట్స్ ఇతరత్రా సౌకర్యాలతో కూర్చోడానికి బల్లలతో పెద్ద పెద్ద ఫాన్స్ తో ఒక కాఫీ వెండింగ్ మెషీన్ తో చాలా సౌకర్యవంతంగా ఉన్నాయ్. అక్కడ అందరు సెటిల్ అయాక ఒక్కొక్కరు పులిహోర పొట్లాలు జంతికలు ఇతరత్రా తినుబండారాలు తెరవడం మొదలెట్టారు. అప్పటి వరకూ దర్శనమెప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్న నాకు సిక్స్ ట్రాక్ స్ట్రీరియో ఫోనిక్ ఎఫెక్ట్స్ తో కరకర నమిలే శబ్దాలు, పులిహోరల ఘుమఘుమలు ఇవి చాలవన్నట్లు టి.టి.డి వారు ఉచితంగా సరఫరా చేసిన బిసిబేళబాత్ పులియోగరే సువాసనలు నా కళ్ళు ముక్కు చెవుల ద్వారా ముప్పేట దాడిచేయడంతో అప్పటికి ఇరవైనాలుగ్గంటలుగా పొద్దున్న ఒక టీ, మంచినీళ్ళు తప్ప ఏమీ తినలేదన్న విషయం గుర్తువచ్చింది. అంతలోనే మరికొన్ని గంటలు ఓపికపడితే దర్శనం అయ్యాక తినచ్చులే అని అనిపించడమే తడవు ఆటోమాటిక్ గా ధ్యాస స్వామివారివైపు మరలింది.

ఆ కాంప్లెక్స్ లో ఎదురు చూసిన మూడుగంటలూ ఫోన్ కూడా చేతిలో లేకపోవడంతో స్వామి సన్నిధిలో ఇతర ఆలోచనలు అన్నీ వదిలేసి ఎప్పుడు ఆయన దర్శనమౌతుందా అని ఎదురు చూస్తూ కూర్చోవడం ఆహ్హా నాకు చాలా నచ్చింది. ఇదికూడా అదృష్టమే కదా ఇందుకే ఈ సదవకాశాన్ని నాకు కల్పించేందుకే ఎపుడూ దర్శనం ఆలశ్యమౌతుంటుందేమో అని అనిపించింది. ఆ కాంప్లెక్స్ నుండి వదిలేశాక ఇక ఎక్కడా ఆగకుండా స్వామి దర్శనమేనని తెలుసుకుని ఆనందంతో ఎదురు చూస్తుండగా క్యూ కాంప్లెక్స్ తలుపులు తీయడమాలశ్యం ఆ ప్రదేశమంతా గోవిందా గోవిందా అంటూ గోవిందనామాలతో ప్రతిద్వనించింది. మెల్లగ క్యూకదలనారంభించింది, క్యూ మధ్యలో ఇరుకుదారుల్లో వెంటిలేషన్ సరిగా లేని చోట ఏసీ బ్లోయర్స్ ఏర్పాటు చేయడం బాగుందనిపించింది. మళ్ళీ మరోసారి మెటల్ డిటెక్టర్ గుండా తనిఖీ చేయించుకుని గుడి ముందుకు వెళ్ళాను. ముఖద్వారం వద్ద కింద ఏర్పాటు చేసిన పారేనీటిలో పాదాలు తడుపుకుని పరమ పవిత్రమైన గుడి ఆవరణలోకి అడుగుపెట్టాను.

నా ప్రయత్నంగా అడుగు తీసి అడుగేసుకుంటూ నడచి వెళ్ళడం నాకు అక్కడివరకే గుర్తుంది. ఇక అక్కడినుండి ఎలా నడిచానో నాకేమీ గుర్తులేదు అంతా ఆ స్వామి ఇతర భక్తులు కలిసి నడిపించినదే. నా పిచ్చిగానీ ఆ దేవదేవుని దయలేకుంటే అక్కడివరకూ మాత్రం రాగలనా ? నేవేసే ప్రతి అడుగూ ఆ స్వామి కనుసన్నలలో వేసేదే అని నాకూ తెలుసుననుకోండి కాకపోతే ముఖద్వారం దాటాక చాలా చిత్రంగా ఇహలోకపు స్పృహ పూర్తిగా కోల్పోయాను. ఎవరు తగులుతున్నారో ఎవరు లేదో ఎవరు కాళ్ళుతొక్కుతున్నారో ఎవరు ముందుకు తోస్తున్నారో ఎవరు వెనకకు నెడుతున్నారో ఇవేమీ తెలియని ఒక అలౌకికమైన స్థితిలోకి చేరుకున్నాను. పెదవులు నిర్విరామంగా గోవింద నామాన్ని పలుగుతుంటే చూపులు బంగారు వాకిలి పై నిలిచాయి. సకలదేవతలు, మహర్షులు, యోగి పుంగవులు, అన్నమయ్య వెంగమాంబ వంటి మహాభక్తులు, రాజులు చక్రవర్తులు సమస్త ప్రాణికోటీ ఆ స్వామి దర్శనానికి వేచిచూసిన అదే వాకిలి గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి నేను ఎంత అదృష్టవంతుడినో కదా.. ఎంత పుణ్యం చేస్కుంటే ఈ మహద్భాగ్యం నాకు దక్కుతుందోకదా.. అని ఆలోచిస్తూ ఎప్పుడు ఆ మహద్వారం గుండా నా స్వామి దర్శనమౌతుందా అని తల ఎత్తి చూస్తూ ’గోవిందా.. గోవిందా..’ అని తన్మయత్వంగా పిలుస్తూ నడుస్తుంటే... క్యూ మలుపు తిరిగింది...

ఆహ్హ... అడుగో నా స్వామి... వజ్రకిరీటపు ధగధగలూ, తొడిగిన బంగారు ఆభరణాల తళుకులూ ఆ దివ్యమంగళ మూర్తి చిరునవ్వు వెలుగుల ముందు వెలతెలా పోతున్నాయ్ కదా... అవిగో నాస్వామి దుష్టశిక్షణకు శిష్టరక్షణకూ ఉపయోగించే శంఖు చక్రాలవిగో... అదిగో ఆ విశాలమైన హృదయముపైనే కదా లక్ష్మీదేవి విశ్రమించేది, అవునూ ఏదీ నా స్వామి వరద హస్తమేదీ? కౌస్తుభ మేదీ... అయ్యో ఇదేమి చిత్రం? ఎనిమిదడుగుల నిలువెత్తు స్వామి నిండువిగ్రహాన్ని దర్శించుకోనివ్వకుండా మొహం మాత్రమే కనిపించేలా లైట్లు పెట్టారా ? స్వామి పూర్తిగా నిండైన రూపంతో దర్శనమివ్వరా ? అయ్యో ఇదెక్కడి చోద్యమయ్యా ఇన్నినాళ్ళ తర్వాత నిన్ను చూద్దామని వస్తే దర్శనభాగ్యాన్ని కలిగించకపోతే ఎలా స్వామీ అని ఆలోచిస్తూ రెప్పలార్పి మళ్ళీ చూద్దునుకదా నా స్వామి నిండైన రూపంతో వరద హస్తంతో పద్మ పాదాలతో సహా దరిశనమిచ్చాడు. ఆ రూపాన్ని కనులనిండుగా నింపుకునేలోపు లిప్తలో మాయమయ్యాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా పులకింతకు గురైంది ఏదో తెలియని శక్తి ఆవహించినట్లై ఒక దివ్యమైన అనుభూతికి లోనయ్యాను.

అహా అక్కడున్నది రాతి విగ్రహం కాదు కోరిన వరాలిచ్చి పాపాలను ప్రక్షాళనగావించి మోక్షాన్నిప్రసాదించే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కదా. అందుకే అభిషేక సమయాన ఆ స్వామికి చెమటపడుతుంది, పుష్పాలంకరణ చేసే అర్చకులకు కఱకురాతి స్పర్శ కాక మృదువైన మనుషశరీర స్పర్శ అనుభూతిలోకొస్తుంది. ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా గోవిందా అని అనుకుంటూ ఇవతలకి వచ్చేశాను. శ్రీవారి పోటు వద్ద వకుళమాతను దర్శించుకుని ఆ పక్కన తీర్ధప్రసాదాలారగించి పరకామణిని మరోమారు ఆశ్చర్యంగా పరికించి చూసి విమాన వేంకటేశ్వరుని దర్శించుకుని భక్తితో మొక్కి, ఆ పక్కన ఉన్న హుండీలో శక్తికొద్ది సమర్పించుకుని ఆనందనిలయ ప్రాంగణం నుండి బయటికి వచ్చి అక్కడ ఇచ్చిన చిన్నలడ్డు ప్రసాదాన్ని స్వీకరించాను. శ్రీవారి దర్శనమై బయటికి రాగానే పక్కన రెండు స్టీలు హుండీలు పెట్టారు కానీ గుడి చుట్టి ప్రదక్షిణ చేసి విమాన వెంకటేశ్వరుని దర్శించుకున్నాక ఎప్పటినుండో ఉంటున్న ఖజానాకు సంబంధించిన హుండీ ఉంటుంది. సాధారణంగా స్వామికి సమర్పించుకునే మొక్కులు ఈ హుండీలోనే వేస్తారు.     

అలా స్వామి దివ్యదర్శనాన్ని ముగించుకుని మనసులో ఆ రూపాన్ని మళ్ళి మళ్ళీ గుర్తు చేసుకుంటూ లడ్డూ ప్రసాదాల కౌంటర్ వైపు నడిచాను మిగిలిన వివరాలు మూడో టపాలో.

16 కామెంట్‌లు:

  1. సూపర్ వేణూ,నీతో పాటు మాక్కూడా దర్శనం చేయించేస్తున్నావు కదా

    రిప్లయితొలగించండి
  2. కళ్యాణకట్టలో ఎలా ఉండాలో ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందండీ. ముందుగా డబ్బులు చేతిలో పెట్టేసీ, రెండు మాటలు మెల్లిగా, ఫ్రెండ్లీ గా మాట్లాడితే మన పని సజావుగా అవ్వుద్ది. లేకుంటే రక్త చరిత్రే ;)

    సకలదేవతలు, మహర్షులు, యోగి పుంగవులు, అన్నమయ్య వెంగమాంబ వంటి మహాభక్తులు, రాజులు చక్రవర్తులు సమస్త ప్రాణికోటీ ఆ స్వామి దర్శనానికి వేచిచూసిన అదే వాకిలి గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి నేను ఎంత అదృష్టవంతుడినో కదా..

    కదా...

    నేను రాయాలనుకున్నది పప్పుసార్ రాసెయ్యటం నాకు ఆశ్చర్యమనిపించింది. యెస్... తిరుపతి వెళ్ళి దర్శించ్కున్నట్టే అనిపించిందండీ.. చివరాఖరున అన్నమయ్య క్లైమాక్స్ చూసిన ఫీల్ వచ్చిందీ..

    గోవిందాఆఆఆఅ... గోఓఓఓఓఓఓఓఓఓఓఓఓ విందా...!

    రిప్లయితొలగించండి
  3. ఎంత చక్కగా రాసారో వేణు గారు . మీతో పాటు దేవుణ్ణి చూస్తున్న అనుభూతి కలిగింది .
    ఈ జంతికలు , చిప్స్ గోల సినిమా హాల్లో నే చిరాకు పుడుతుంది నాకు , ఇహ దేవుడి దగ్గర ఐతే పిచ్చ పుడుతుంది ఆ కాసేపటిలో కొంపలు అంటుకుంటాయా తినకపోతే అనిపిస్తుంది , కానీ ఏమి చేయలేము కదా :)))

    రిప్లయితొలగించండి
  4. నాకు సిక్స్ ట్రాక్ స్ట్రీరియో ఫోనిక్ ఎఫెక్ట్స్ తో కరకర నమిలే శబ్దాలు, పులిహోరల ఘుమఘుమలు >>>>>>>>> ఈ లైన్ దగ్గర కొచ్చేసరికి గట్టిగా నవ్వేసా ..........

    నాకు ఈ పోస్ట్ చదివేసరికి దగ్గర దగర గంట పట్టింది ... ఆ స్వామీ గురించి వర్ణించావు చూడు అక్కడ నా కాన్సంట్రేషన్ తప్పి స్వామి దగ్గరికి పోయింది .. అంత బాగా చెప్పావు అన్నయ్య ..సో ఆ పేరా దగ్గరే ఎక్కువ టైం పట్టింది :)

    రిప్లయితొలగించండి
  5. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు వెళ్లాను తిరుపతి అప్పటికి నాకు వేంకటేశ్వరుడు అంటే అంత ఇష్టమేమి కాదు ...జస్ట్ వెళ్లాను ఇంటిలో అందరితో కలిసి గుంపు లో గోవిందలా ....కాని ఆ స్వామి మహత్యం మామూలు ది కాదు గా అలా దేవుని వంక చూడగానే .. ఏమి జరిగిందో తెలియదు కాని బాబోయ్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు పుల్ భక్తురాలిగా మారిపోయాను ......... . ఎలా చెప్పాలో తెలియట్లేదు కాని చాలా చాలా చాలా చాలా అంతే ..................... అస్సలు నేను తిరుపతికి వెళ్లి ఉండకపోతే నేను ఆ స్వామి గొప్పతనం ఎప్పటికి తెలుసుకోలేక పోయేదాన్నేమో ...

    రిప్లయితొలగించండి
  6. వేణు గారు భక్తి పారవ్స్యమో తెలియదో మీరు రాసిన విధానమో తెలియదు
    లైవ్ దర్శనం కామెంటరీ తో సహా చూసి ఆ అనుభూతిని కలిగించి మమ్మల్ని ధన్యులని చేసిన మీకు నా హృదయ పూర్వక ఆభినందనలు

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగా రాశారు వేణు. ప్రత్యక్ష దర్శనం చేసిన అనుభూతి.

    రిప్లయితొలగించండి
  8. ఘుమ ఘుమ లాడే పులిహోర, బిసీబేళేబాత్, కరకరలాడే మురుకులు మిమ్ములను ఆకర్షించిన భగవద్ప్రసాదాన్ని తృణీకరించడం న్యాయం కాదు. కడుపు నెమ్మదిస్తే దేవుడిమీద మరింత దృష్టి లగ్నం చేయొచ్చు. 'కర్మ ఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలు చేయుట మానరాదు' అన్న గీతా సూక్తిని నేనిలా అర్థంచేసుకున్నా. :) మీరేమంటారు? ;) 'అడ' అనే నల్లటి గట్టి పదార్థం ఒకప్పుడు దొరికేది, బాగుంటుంది. పోటు దగ్గర మరింత కవర్ చేసి వుండాల్సింది. 'పోటు' అనే హింసాత్మక పదంతో ఆ ప్రాంతాన్ని ఎందుకు పిలుస్తారో నాకర్థం కాలేదు. గోవిందా...

    ఏ చక్కని తిరుపతి గుండు చూసినా, దాని వెనుకా అంతర్లీనంగా ఓ అవినీతి కథ వుంటుందంటారు, అంతేనా! :( గోవిందా...

    మీ వ్యాసం బాగుంది, అలా తిరుమల మలయమారుతాలు సుతిమెత్తగా స్పృశిస్తున్నట్టు సాగుతోంది, బాగా రాస్తున్నారు. గోవిందా...

    రిప్లయితొలగించండి
  9. ఎంత బాగా వివరించారు వేణూ! అసలు ముఖద్వారం నించి మమ్మల్నీ మీతో పాటు నడిపించి ప్రత్యక్ష దర్శనం చేయించారు!!

    మీకు ఏదో మూవీ బ్యానర్ వాళ్ళ పాట గుర్తుందా? బాలు పాడాడు.. 'మమ్ము బ్రోచినవాడు.. మమ్ము కాచినవాడు.. మంగళాకారుడు.. ఆ శ్రీనివాసుడు ' నాకైతే పొస్ట్ మొత్తం ఆ పాటే మనసులో తిరిగింది!
    :-)

    రిప్లయితొలగించండి
  10. చాల బాగా వ్రాసారు.. అభినందనలు...

    రిప్లయితొలగించండి
  11. హహహహ చెల్లాయ్ థ్యాంక్స్ :)
    పప్పుగారు నెనర్లు.

    రాజ్ నెనర్లు, హహహహ అక్కడే దెబ్బకొట్టింది బాబు ఇకపై నేను కూడా ఎక్స్పర్ట్ నే :) హ్మ్ అన్నమయ్య క్లైమాక్స్ అంతలేదులే కానీ అంతా ఆ శ్రీనివాసుని మహత్యం.

    శ్రావ్య నెనర్లు, వామ్మో సినిమాహాళ్ళసంగతి గుర్తుచేయకండి. ఒకసారైతే ఓ మల్టిప్లెక్స్ లో నా పక్కసీట్లోనే ఒక పాలిథిన్ కవర్ లో పాప్ కార్న్ పేపర్ హోల్డర్ పెట్టుకుని తనేదో సీక్రెట్ గా తింటున్నట్లు ఆ కవర్ ఓపెన్ చేసి కొంచెం తీస్కుని కవర్ మూసి అవినమలడం మొదలుపెట్టేది ఈ ప్రాసెస్ లో ఆ పాలిథిన్ కవర్ భీభత్సమైన సౌండ్ చేసేది. ఒక పదినిముషాలు చూసి నేను భరించలేక చెప్పేశాను. మీరు ఆ కవర్ లోనుండి బయటకి తీసి హోల్డర్ ని మాత్రమే పట్టుకుని తినండి కనీసం నాకు సగం గోలతగ్గుద్ది అని.

    రవితేజ గారు థ్యాంక్స్.

    థ్యాంక్స్ చెల్లాయ్ (శివరంజని) ఆ స్వామి సన్నిధిలోని మహత్యమే అంత ఎవరమైనా అలా అయిపోవాల్సిందే.

    హరేకృష్ణ నెనర్లు, అది నీ భక్తి పారవశ్యమే.

    ధన్యవాదాలు నారాయణస్వామి గారు.

    SNKR గారు ధన్యవాదాలు, “కడుపు నెమ్మదిస్తే మరింత దృష్టి లగ్నం చేయచ్చు” ఇది కూడా కరెక్టేనండి నేను ఇంట్లో విపరీత ఉపవాసాలు చేసేవారికి ఇదే చెప్తుంటాను మరీ ఎండగట్టేయకండి అని కాకపోతే ఆరోజెందుకో అలా అనిపించింది. పోటు కి హింసాత్మకమైనదేకాక వేరే అర్ధాలేమైనా ఉన్నాయేమోనండీ, లేదంటే పోటుపడకుండా వంట సాధ్యమవదుకనుక అలా పెట్టారేమో. రద్దీ ఎక్కువ ఉండటంతో వకుళమాత దర్శనానికే తప్ప పోటు నిశితంగా చూడ్డానికి కుదరలేదు.

    ధ్యాంక్స్ నిషీ, హహహ భలే చెప్పావ్ :) దిల్ రాజు బ్యానర్ అది శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్.

    కాసురెరా గారు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. మీ తిరుపతి ప్రయాణమంతా మమ్మల్ని కూడా చేయి పట్టుకుని నడిపించుకుని తీస్కెళ్లినట్లు అనిపించింది :) చాలా చాలా బాగుంది టపా.. మనసంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది.

    రిప్లయితొలగించండి
  13. తిరుపతి వెళ్ళి చాలా సంవత్సరాలయింది...దగ్గరుండి దర్శనం చేయించారు. వెళ్ళి వచ్చిన అనుభూతి కలిగింది వేణుగారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.