రేపు ఉదయం నే ఆఫీసుకి వెళ్ళే సమయానికి అంటే 6-7 మధ్యలో ఉష్ణోగ్రతలు 23F & 17F అంటే -5సెంటీగ్రేడ్ & -8సెంటీగ్రేడ్. అన్నట్లు ఈ రెండు అంకెలేంటో తెలుసా... నాకు మొదట్లో పెద్దగా అర్ధం అయ్యేది కాదు ఏమిటా అని చికాగో వచ్చాక బాగా తెలిసొచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే ఇక్కడ ఉష్ణోగ్రత -5C ఉంటే విండ్చిల్ వల్ల అది -8C ఉన్నట్లుగా అనిపిస్తుంది. చికాగోని ఆనుకుని ఉన్న ఫ్రెష్ వాటర్ లేక్ (Lake Michigan) వల్ల ఈ ప్రాంతం లో గాలులు ఎక్కువ అవి చలికి తోడై మనల్ని మరింత హింసకి గురిచేస్తాయనమాట. ఇక చూస్కోండి ఈ చలి భారీ నుండి తప్పించుకోవాలంటే ఒక్కొక్కరూ ఢాకూ మంగళ్ సింగ్ లాగా కళ్ళు తప్ప ఏమీ కనిపించ కుండా నిండా కప్పేసుకుంటే కానీ తిరగలేం. పోనీ లే అలా బానే ఉంటుంది కదా అనుకుంటే బయట చలిలో ఉన్నంత సేపూ బాగానే ఉంటుంది వెచ్చగా హాయి గా కానీ ఇంటిలోకో ట్రైన్ లోకో వెళ్ళగానే అక్కడ climate controlled కదా దాంతో ఊపిరి ఆడనట్లు చిరాకు గా అనిపిస్తుంది సో ఎక్కిన వెంటనే గెటప్ చేంజ్ మళ్ళీ దిగే ముందు షరా మాములే ఇలా నాకైతే చాలా చిరాకు గా ఉంటుంది. నాకు కస్త చలి వాతావరణం అంటేనే ఇష్టం కానీ ఇక్కడ చలి తట్టుకోడం నాకు కూడా కష్టమే.
ఒకప్పుడు చలికాలం ఉదయం తలుపులు బిడాయించేసి అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ తాగుతూ పేపర్ లో చలిపులి కాలం లో 20 లలో ఉన్న ఉష్ణోగ్రతలని చూసి బాబోయ్ ఈ రోజు చలి చాల ఎక్కువ ఉంది పదిగంటల వరకు బయటకు వెళ్ళకూడదు అని అనుకోడం గుర్తొస్తే ఉసూరుమనిపిస్తుంది. అసలు నేను ఇండియా లో చలికాలం చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. చలికాలం అంటే ముందు గుర్తొచ్చేవి సంక్రాంతి ముగ్గులు. మా పిన్ని ఉదయం పని కి అడ్డం వస్తుంది పైగా ఆలశ్యం అవుతుంది అని ముందు రోజు రాత్రే 9 దాటాక ముగ్గు వేసేది.
ఆ చలి లో పిన్ని తో కలిసి ముగ్గు లో చుక్కలు లెక్క పెట్టడమూ, ముందే గీసి పెట్టుకున్న ముగ్గుల పుస్తకం లో ముగ్గుని పట్టుకుని చూపించడమూ నాకు చాలా ఇష్టమైన పనులు. అసలు హడావిడి సాయంత్రం స్కూల్ నుండి రాగానే మొదలయ్యేది. ఈ రోజు ఏ ముగ్గు అని పిన్ని నోట్స్ లో ప్రాక్టీస్ చేస్తుంటే పక్కన ఉండి చూసేవాడ్ని లేదంటే ఒకో రోజు పుస్తకం లో ఉన్న వాటిలో నుండి నన్ను సెలెక్ట్ చేయమనేది ఈ రోజు ఏ ముగ్గు వేద్దాం సిరీ అని. ఇక ముగ్గు వేసేప్పుడు అమ్మేమో వరండా లోనుండి "ఒరే స్వెట్టర్ వేసుకు వెళ్ళరా బయటకి" అని చెప్తుంటే "అబ్బా బాగానె ఉందిలేమ్మా అంత చలి లేదు" అని అలానే చలి లో కాస్త వణుకుతూ అయినా నిలబడేవాడ్ని కానీ స్వెట్టర్ వేసుకోడం ఇష్టం ఉండేది కాదు.

ఇక ముందు రోజే ముగ్గు వేసినా పూలూ పెసలు మాత్రం ఉదయాన్నే చల్లే వాళ్ళం. చలికాలం అదో మరువలేని దృశ్యం ఉదయాన్న కురిసే పొగమంచు, దానిని కరిగిస్తూ నులివెచ్చని సూర్యకిరణాలు నేపధ్యం లో పక్షుల కువకువలు ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవు, అలా తెల్లవారు ఝామునుండీ కురిసిన చిరు మంచులో తడిసిన ముద్దబంతి పూలు కారబ్బంతి పూలు ఎంత అందం గా ఉండేవనీ ఓక్కో రేణువూ కలిపి అందం గా అమర్చినట్లు చిన్ని చిన్ని మంచు బిందువులు పూల రెక్కల మీద ఎవరు నన్ను తాకుతారా ఎప్పుడు జారిపోదామా అన్నట్లు ఉండేవి. ఇంకా చిలక ముక్కు పూలైతే ఎర్రని పూవులపై మంచు బిందువులు, ఆ మంచు బింధువుల నుండి చూస్తే పూవుల ఎరుపు మరింత ఎర్రగా స్వచ్చం గా మెరిసి పోతూ ఎంత అందం గా ఉండేవో చెప్పడానికి మాటలు రావు, ఇప్పటికీ అప్పుడప్పుడూ అలా చల్లని మంచులో తడిచిన పూల స్పర్శ నా చేతులకి తగులుతున్న అనుభూతి కి లోనవుతుంటాను. అంత బావుండేది చలి కాలం.
సరే అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే మరికాస్త చలి నేను B.Tech చదువుకునేప్పుడు ఇండస్ట్రియల్ టూర్ లో భాగం గా వెళ్ళిన ఊటీ, సిమ్లా లలో చూసాను. ఊటీ చలి చక్కలిగింతలు పెడితే సిమ్లా చలి బాగానే వణికించిందని చెప్పచ్చు. నేను మొదటి సారి స్నో ని సిమ్లా లోనే చూసాను. రూం లో హీటర్స్ వేసుకుని పడుకోడం తెల్ల వారు ఝామున అప్పుడే కురిసిన స్నో తో ఆడుకోడం ఒక అనుభవం అయితే అంత చలి లో షాల్స్, స్వెట్టర్స్ ని ఆశ్రయించి రోడ్డు పక్కన ఉన్న దుకాణం లో అసలు సిసలైన సిమ్లా చాయ్ ఆస్వాదించడం మరో మరువలేని అనుభూతి. సిమ్లాకి చేరుకోవాలంటే కొండల్లోనుండి వెళ్ళే నేరో గేజి రైలు ప్రయాణం కూడా చాలా బాగుంటుందండోయ్.
ఆ తర్వాత మళ్ళీ అమెరికా వచ్చాక అట్లాంటాలొ ఉన్నంత కాలం వింటర్ ఆనందం గానే ఉండేది ఏదో డిశంబర్ ఆఖరునో జనవరిలోనో ఒకటి రెండు సార్లు స్నో పడేది అంతే కానీ చికాగో వచ్చాక ఇదే జీవితం అయిపోయింది. సమ్మర్ ఉండేది నాలుగు నెలలైనా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం తోనే మిగిలిన సంవత్సరమంతా భారం గా గడుస్తుంది :-(