ఇటువంటి టపా ఎప్పుడో ఓ సారి రాయల్సి ఉంటుంది అని తెలుసు కాని, ఇంత త్వరగా రాయాల్సిన అవసరమొస్తుంది అని అనుకో లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా మిత్ర బృందం నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకుంటున్న తరుణం లో ఈ 2009 ఆరంభం లోనే నాకు అత్యంత విషాదాన్ని మిగులుస్తుందనీ నేను అస్సలు ఊహించ లేదు. జనవరి 21 బుధవారం రాత్రి, భోజనం కానిచ్చి మనసు లో "గత మూడు వారాలు గా హాస్పిటల్ లో ఉన్న అమ్మ, గత వారం రోజులు గా ICU నుండి మామూలు రూం కి షిఫ్ట్ అయి నిదానంగా కోలుకుంటుంది, ఇంక ఇవ్వాళో రేపో ఇంటికి పంపించేస్తారు కాబోలు" అని అనుకుంటూ నిద్రకు ఉపక్రమించే సమయం లో తమ్ముడి దగ్గర నుండి కాల్ అందుకున్నాను. critical care unit కి మార్చారు అని చెప్పిన కొన్ని గంటల వ్యవధి లోనే అమ్మ ఇక లేదు అనే చేదు నిజం విని ఏం చేయాలో అర్ధం కాలేదు. తనకెంతో ఇష్టమైన గురువారం జనవరి 22 2009 న ఉదయం అమ్మ మమ్మల్ని ఒంటరిగా ఈ భూమ్మీద వదిలేసి తిరిగి రాని లోకాలకు పయనమయింది.

మరణం, మరణించిన వారికి ఐహిక బాధలనుండి విముక్తిని ప్రసాదించే ఓ వరం ఏమో కాని, వారి ఆత్మీయులకి మాత్రం తీరని శాపం. నిన్నటి వరకూ మన మధ్య తిరిగే మన మనిషి హఠాత్తుగా కేవలం చిత్రాలకు ఙ్ఞాపకాలకూ పరిమితం అయ్యరన్న ఊహే ఆ దేవుడు ఎంత దయలేని వాడు అని అనుకునేలా చేస్తుంది. నేను ఇండియా వెళ్ళే వరకూ రక రకాల ఆలోచనులు నన్ను ఊపిరి తీసుకోనివ్వలేదు. ఈ వార్త తెలిసిన తర్వాత కూడా నేను మాములుగానే ఉన్నానేంటి? ఆకాశం విరిగి మీద పడలేదు, భూమి బద్దలై నన్ను మింగేయలేదు, అవునూ!! ఈ ఆకలి, నిద్ర ఇవి కూడా నన్ను వీడి పోనంటున్నాయేంటీ. అసలు నేను ఇంకా నిద్ర లోనే ఉన్నానేమో ఇదంతా ఓ పీడకలేమో లేచాక అమ్మతో మాట్లాడి ఇలాంటి కల వచ్చింది నువ్వు జాగ్రత్త అమ్మా అని చెప్పాలి అని ఏవేవో ఆలోచనలు.
ఎప్పుడో నా చిన్నతనం లో ఊహ తెలిసీ తెలియని వయసు లో, మరణం అంటే ఏమిటో కూడా తెలియని తనం లో, సంవత్సరం కూడా నిండని నా పెద్ద తమ్ముడు మమ్మల్ని వదిలి వెళ్ళినప్పటి ఙ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. అప్పుడు మేము ఉంటున్న నరసరావు పేట లో సరైన వైద్యం అందక వాడి చిన్ని శరీరాన్ని టాక్సీ లో వేసుకుని గుంటూరు తీసుకు వెళ్ళడం అక్కడి హాస్పిటల్ వాతావరణం డాక్టర్ ఏం చేయలేం అని తేల్చి చెప్పేసాక అమ్మ స్పృహ తప్పి పడిపోవడం. తర్వాత తిరిగి ఇంటికి రావడం అప్పటి వరకూ వాడి ఫోటో లేదని అలానే కుర్చీ లో కూర్చో పెట్టి నాన్న వాడి కళ్ళు తెరిచి పట్టుకుంటే వాడి ఫోటో తీసుకోడం అన్నీ కళ్ళ ముందరే నిన్న మొన్న జరిగినట్లు ఉన్నాయి. మళ్ళీ ఇన్ని నాళ్ళ కి అమ్మకి వీడ్కోలు పలకాల్సి రావడం న మనసంతా భరించ లేని విషాదాన్ని నింపింది.
తను ఉన్నన్నాళ్ళు ఏదో తెలియని ధైర్యం, ఇపుడు తను మా మధ్య లేదు అనే ఆలోచనే బోలెడంత దిగులును మనసంతా నింపేస్తే ఇక ధైర్యానికి చోటెక్కడ ఉంటుంది. అయినా గత నెల రోజులు గా ఎన్నో అనుభవాలు అమ్మ తోడు లేకపోవడం వలనేమో కానీ మరింత కొత్త గా మరింత బారంగా అనిపించాయి అన్నీనూ.. అసలు తనని సంప్రదించకుండా మా అంతట మేమే నిర్ణయాలు తీసుకోడం ఎంత కష్టమో కదా !! నేను ఇప్పటి వరకూ అలా నా అంతట నేను తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు ఇకపై అన్నీ నేనే అలా తీసుకోవాలంటే ఎంత కష్టం... అంటే మేమేదో అమ్మ మాట జవదాటని వాళ్ళం అని కాదు కానీ తనతో వాదించి మా మాటే నెగ్గించుకుని మాకు నచ్చిన నిర్ణయమే తను తీసుకునేలా చేసినా కానీ గవర్నమెంట్ సీల్ లాగా తన ఆమోద ముద్ర ఉంటే అదో దైర్యం మా ఇంట్లో అందరికీ.. నాన్న తో సహా. ఇకపై అది లేకుండానే ముందుకు నడవాలి, ఎలాగో... ఏంటో...

తను ఏమైపోయినా కానీ, మా ఇంటిల్లిపాది క్షేమం కోసం అనుక్షణం తపన పడే అమ్మ ఇక మా మధ్య లేదు అన్న ఆలోచనే కళ్ళ వెంట కారే కన్నీటికి ఆనకట్ట కట్ట లేకున్నా... ఎవరో చెప్పినట్లు మనిషి కేవలం ఒక్క చోటే ఉండ గలరు ఇప్పుడు తన ఆత్మ అన్ని చోట్లా తానై మా అందరి యోగ క్షేమాలు చూస్తూ మా వెంటే ఉంటుంది అన్న ఊహ బోలెడంత ఊరట నిస్తుంది. అమ్మో అదే నిజమయితే ! ఇంతకు ముందు అంటే ఇక్కడ ఒంటరి గా ఏడ్చినా ఏం చేసినా అమ్మ కి తెలియదు ఇప్పుడిక తను నా పక్కనే ఉంటుంది కదా నేను ఏడవడం చూస్తే తను బాధ పడుతుంది కదా ఇక ఏడవకూడదేమో. అవునూ అసలు ఏడుపు ఎందుకు వస్తుందీ... గుండె లోతుల్లో ఆత్మీయుల ఙ్ఞాపకాలు వెచ్చగా కదిలి మనసుతో కలిసి, కరిగి కన్నీరై కళ్ళ నుండి జాలువారుతాయేమో కదా!! మరి అమ్మ ఙ్ఞాపకాలన్నీ అలా నన్ను వదిలి వెళ్ళి పోతే ఎలా మరి !! అందుకే ఇకపై ఏడవను.
కేవలం సర్వీస్ చేయడానికే పుట్టినట్లు గుంటూరు ఆర్&బి సర్కిల్ ఆఫీస్ సుపరింటెండెంట్ గా రిటైరైన ఆరునెలల లోపే మమ్మల్ని వదిలి వెళ్ళి పోయిన మా అమ్మ "నేలటూరి దయామణి" కి అశృ నివాళి సమర్పించుకోడం తప్ప మేమేం చేయగలం. అమ్మా! అక్షరాలకు అందని ఆప్యాయత, మాటలకందని మమతాను రాగాలకు ప్రతి రూపం నువ్వు, వెల లేని అనురాగం, ఆప్యాయతలు పంచిన ప్రేమ మూర్తిగా, మంచితనానికి, నీతి, నిజాయితీ లకు మారు పేరు గా నిలచి, కొవ్వొత్తి లా నువ్వు కరిగిపోయి మా జీవితాలలో వెలుగు నింపి, తీరిగి రాని లోకాలకు పయనమైన నీ ఆత్మకు శాంతి చేకూరాలని. నువ్వెక్కడ ఉన్నా నీ ఆశీస్సులు, మార్గదర్శకాలు మమ్ము ముందుకు నడిపిస్తాయని ఆశిస్తూ.
నీ ఙ్ఞాపకాలలో, నువు పంచిన ఆత్మీయత లో..
నీ కోసం వెతుకుతూ మేము....