సోమవారం, మార్చి 30, 2009

బ్లాక్ ఐస్ !!

శీర్షిక చూడగానే "నల్లా నాల్లాని కళ్ళా.. పిల్లా...నీ మొగుడయ్యే వాడెల్లా.. ఉండాలొ కాస్త చెప్పమ్మా.." అని పాడేసుకుంటున్నారా.. ఆగండాగండి నేనేమీ నీలి కళ్ళ నీలిమ గురించి చెప్పబోవట్లేదు.. అంత లేదండీ.. ఇది ఆ ఐస్ గురించి కాదు ఇంకో ఐస్ గురించి. ఏంటబ్బా!! అని తెగ ఆలోచించేయకండి మరి, నెనెలాగు చెప్పేస్తున్నాను కదా ఆలకించండి. అసలు ఈ ఆంగ్ల భాష లో ఉన్నంత తికమక మరే భాషలోనూ లేదు. అంటే అక్కడికి నేనేదో పివి నరసింహ రావు గారి లా ఓ పాతిక భాషలు ఔపోసన పట్టేసానని కాదు కానీ, ఉదాహరణకి ఈ ఐస్ నే తీసుకోండి eyes ని ice ని ఒకేలా పలికి చస్తే తేడా ఎలా తెలిసేది. బహుశా పదం కని పెట్టినవాడి తప్పేం లెదేమో లెండి, బహువచనం కోసం అన్నిటికీ యస్ చేర్చేయడం లోనే తేడా అంతా వచ్చి ఉంటుంది. సో నే చెప్ప బోయేది ఈ ice గురించి అనమాట. ఓహో అలాగా !! అని అర్జంట్ గా కళ్ళముందు టార్టాయిస్ కాయిల్ తిప్పేసుకుంటూ నో, సీలింగ్ కి తిరుగుతున్న ఫేన్ కేసి చూస్తూనో అలా ఓ సారి చిన్నతనానికి వెళ్ళి పాలైస్, ద్రాక్షా ఐస్, కొబ్బరి ఐస్, సేమ్యా ఐస్ ఇలాంటి రక రకాల ఐస్ లన్నీ గుర్తు చేసుకుంటున్నారా :-) మరే నాకు కూడా మొదట అవే గుర్తుకొచ్చాయ్ కానీ అది కూడా కాదు. వాటి గురించి సవివరంగా మరో టపా లో చెప్పుకుందాం.

ఇక విషయానికి వస్తే, ఈ దేశం లోకి వచ్చాక మొదటి సారి ఈ బ్లాక్ ఐస్ అన్న పదం విన్నప్పుడు " ఓరి వీళ్ళ అసాధ్యం కూలా, ఐస్ కి కూడా వర్ణ బేధమా, ఔరా!!" అని బోల్డు కుంచెం ఆశ్చర్య పడిపోయేసాను. తర్వాత ఆరా తీయగా తెలిసింది ఏమిటంటే ఈ అమెరికా లో ఎడ తెరిపి లేకుండా మంచు కురిసి బయట ఉన్న అతి శీతల ఉష్ణోగ్రత వలన ఆ మంచు రోడ్డు పైనే ఐస్ లా గడ్డ కట్టి బాగా నునుపు తేలి, నీటికి సహజంగా ఉన్న పారదర్శకత వలన నల్లని రోడ్ మీద పలచగా పేరుకోని నల్లని ఐస్ అనే భ్రమ కలిగించడమే కాక దీని పారదర్శకత వలన ఇలా ఐస్ పేరుకున్నట్లు తెలియక వేగంగా దాని మీద నుండి కారు నడిపి నప్పుడు స్లిప్ అయ్యి అనేక యాక్సిడెంట్ లకి కారకమవుతుంది. ఇదిగో ఇలాంటి ఒక అతి చిన్న ఐస్ లేయర్ కొన్ని వారాల క్రితం నన్ను కింద పడేసింది. ఆ విషయం మీతో పంచుకుందామనే ఈ ప్రయత్నం.

"వసంతం వచ్చింది వేసవి ఎండలు మండి పోతున్నాయ్ ఇప్పుడు నీ గోల ఏంటి !!" అని విసుక్కోకండి మరి అసలు మజా ఇప్పుడే ఉంది, వింటర్ లో సాధారణంగా బయట వాతావరణం గమనించి జాగ్రత్తగా నడచుకొంటాం కాస్త స్ప్రింగ్ వాతావరణాన్ని గమనించగానే మనకు తెలియకుండానే ఇంకేముంది అని కాస్త రిలాక్స్ అవుతాం అప్పుడే వస్తాయ్ ఇలాంటి చిక్కులు. చికాగో, మిచిగన్, విస్కాన్సిన్ లాటి కొన్ని చోట్ల "House pasting no festival" అన్నట్లు స్ప్రింగ్ రాగానే సరిపోదు, మే మాసం వరకూ కూడా అడపా దడపా మంచు పలకరించి పోతూనే ఉంటుంది. అందుకే చికాగో లో రెండే కాలాలు అని అంటారు ఒకటి వింటర్ మరొకటి construction season ఎనిమిది నెలలు వింటర్ కి కేటాయించగా మిగిలిన నాలుగు నెలల్లో ఇళ్ళు కట్టుకునే పనుల్లో పడతారనమాట. అంతెందుకు స్ప్రింగ్ వచ్చింది అని ఎగిరి గంతులేసి ఒక వారం కూడా గడవలేదు రాత్రి ఇక్కడ ధారాళంగా స్నో పడింది.

సో కొన్ని వారాల క్రితం ఇలాంటి ఒక మంచి సన్నీ డే ఉదయం ఆఫీసుకు బయల్దేరి "చా! వెదవ జీవితం, ఏంటో చిన్నపుడు అమ్మ వాళ్ళ తో గొడవపడో మాయ చేసో కాన్వెంట్ చదువునీ, గంపెడు పుస్తకాల స్కూల్ బ్యాగ్ బరువునీ తప్పించుకొన్నా కానీ ఇంత వయసొచ్చాక ఉద్యోగం చేస్తున్న టైం లో ల్యాప్ టాప్ బ్యాగ్ పేరు తో జీవితాంతం ఓ స్కూలు బ్యాగ్ ని మోయాల్సి వస్తుందని అనుకోలేదు" అని వీపున వేళ్ళాడుతున్న బ్యాగ్ సరిచేసుకుంటూ తిట్టుకుంటూ బయటకి అడుగు పెడదాం అని చూద్దును కదా, బయట మంచు అంతా కరిగి పోయి ఫెళ్ళున ఎండ కాస్తూ అందమైన ఉదయం కనిపించింది దాన్తో ఆనందం పట్టలేక "వావ్ వాటే డే!! అని ఆనందిస్తూ బస్ కి లేట్ అవుతుంది అని అనుకుంటూ తలుపు తీయగానే చల్లని గాలి స్వాగతించింది. హ్మ్ ఇదేమీ ఈ అపశృతి అని అనుకుంటూ హడావిడిగా నడక మొదలు పెట్టాను చుట్టూ అంతా క్లియర్ గా ఉంది కదా అని కాస్త రిలాక్స్ అవడం తో కింద ఉన్న చిన్న ఐస్ లేయర్ (పై ఫోటో లోనిది) ని గమనించ లేదు దాంతో దాని మీద కాలు వేయడం, బ్యాలన్స్ తప్పడం తో రక రకాల యోగాసనాలు వరుసగా వేసేసి చివరిగా ఇదిగో ఈ పక్క ఫోటో లో ఉన్నట్లు శలభాసనం లో సెటిల్ అయ్యాను ఏదో ఆగిపోయాను కానీ అసలు ఓ రెండు రౌండ్లు ఫల్టీలు కొట్ట వలసింది. కాస్త మడమ బెణకడం తప్పించి ఏమీ దెబ్బలు తగల లేదు లేండి. ఈ సాకు ను అడ్డం పెట్టుకుని రెండ్రోజులు ఇంటి నుండి పని చేసాను అది వేరే విషయం.


అసలు మీరు ఎప్పుడైనా జారి కింద పడ్డారా :) చెప్తే నవ్వుతారు, వీడెవడండీ బాబు అంటారేమో కానీ, కింద పడుతున్నపుడు భలే ఉంటుంది అంతా మనకు తెలుస్తూనే ఉంటుంది కానీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వేగంగా జరిగిపోతాయ్ అంటే మన మెదడు గ్రహించి రియాక్ట్ అయ్యే లోపలే తరువాతది జరుగుతుంటుంది. హ హ అంతా మనకి తెలుస్తుంది కానీ ఏదీ మన కంట్రోల్ లో ఉండదు భలే చిత్రమైన స్తితి లే, తర్వాత ఒక సారి అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తే ఇదంతా గుర్తొచ్చి భలేగా అనిపించింది. చికాగో వచ్చిన కొత్త లో ఊరు నడి బొడ్డున ఇలాంటి ఓ చిన్న ఫీట్ చేసాను. పోయిన సంవత్సరం తప్పించుకున్నాను అలాగే ఈ ఏడు కూడా ఎస్కేప్ అనుకున్నాను కాని మొన్న సరండర్ అవక తప్పలేదు. చిన్నపుడు స్కూల్ నుండి వచ్చే దారిలో నో స్కూల్ లోనో ఇలాంటి ఫీట్ లు బాగానే చేసే వాడ్ని. ఎలా పడినా పర్లేదు కానీ తల నేల కి ఆనితే మాత్రం అమ్మ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పసుపు, సున్నం కలపిన ఎఱ్ఱనీళ్ళ లో కాసిన్ని ఎండు మిఱపకాయలు వేసి దిష్టి తీసి పడిన చోట బోర్లించకుండా వదిలేది కాదు. సరే ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వింటర్ ముగిసింది కదా అని రిలాక్స్ అవకుండా నడిచేప్పుడూ డ్రైవ్ చేసేప్పుడూ కాస్త ఇలాంటి బ్లాక్ ఐస్ గురించి చూసుకోండి.

సరే నండీ మరి అవి ఈ రోజుకి కబుర్లు మళ్ళీ మరో టపా లో త్వరలో కలుద్దాం అంత వరకూ శలవా మరి.

10 కామెంట్‌లు:

  1. బావుందండీ మీ బ్లాగోతం :)
    పడటమే కాకుండా అక్కడ వేసిన అడుగు కూడా కనబడేలా ఫోటో కూడా తీసారూ.....
    యోగాసనం తో పోలిక బావుంది .....

    రిప్లయితొలగించండి
  2. భలే పడ్డారు వేణు గారు! నవ్వొస్తోంది. అదేంటో ఎవరైనా ఇలా జారి పడ్డప్పుడు తర్వాత చేయిచ్చి లేపినా ముందు మాత్రం చచ్చేంత నవ్వొస్తుంది.ఫొటోలతో సహా బాగా వర్ణించారు.

    రిప్లయితొలగించండి
  3. ఇదేం ఇరకాటమండీ.. పడిపోతే అయ్యో పాపం అనుకునే బదులు హ హ హ అని నవ్వుకునేలా రాసారు టపా ,,, హ హ నేను మా ఫ్లోర్ తో రోజూ ఈ విషయంలో యుద్దం చేస్తునే ఉంటాను ..అంత జారుగా ఉంటాయి టైల్స్ .. చాలావరకు తప్పించుకుని ఒక్కోసారి మా దాన్నే గెలిపిస్తాను :(

    రిప్లయితొలగించండి
  4. :)) భలే టపా!
    నిజంగానే ఇలా జారిపడిపోయేప్పుడు మనకి తెలీకుండానే నవ్వొచ్చేస్తుంది..
    అయినా ఇప్పుడు కూడా స్నోయింగా!

    VERY glad to see you back! :-)

    రిప్లయితొలగించండి
  5. పడిలేచిన కడలి తరంగం అన్నమాట.

    కానీ ఆ నల్ల ఐస్ (నల్లదే) ఫోటో మాత్రం ఒక్కసారి పడినా సరే దాన్ని చూడాలనిపించేలా ఉంది.

    ఓకే ఫ్రెండ్... సే లవ్.


    http://wimbledonweekly.blogspot.com/2009/03/blog-post_29.html

    రిప్లయితొలగించండి
  6. వేణు శ్రీ గారూ !నేనూ ఏదో కళ్ళను గురించిన టపా అనుకున్నా ! వచ్చాక తెలిసింది అసలు విషయం ....హ హ హ :) :)

    రిప్లయితొలగించండి
  7. Thanks నేను గారు :) పడ్డవెంటనే కాస్త మైండ్ బ్లాంక్ అయినా, తర్వాత మయ సభ లో అన్న గారి లెవెల్ లో "ఇహ్హీ !! ఆ సుందర సువర్ణ కాంతులను విరజిమ్ము అట్టి హిమవత్శకలము పై మేమేల కాలు మోప వలె ! మోపితిమి పో... మా పాదపద్మమేల అపభ్రంశమందవలె హా హతవిధి.. హా హతవిధి.." అని ఓ చిన్న డైలాగేసుకొని, ఎలాగూ ఆఫీస్ కి వెళ్డం లేదు కదా నిదానంగా ఓ ఫోటో తీసుకుందాం అని క్లిక్ మనిపించాను. అదీ మ్యాటరు :).

    నెనర్లు సుజాత గారు :) నిజమే నవ్వు రాక మానదు, కొన్ని సార్లు చాలా కష్ట పడి నవ్వకుండా ఉండాల్సిన సందర్బాలు కూడా రాక పోవు.

    నెనర్లు నేస్తం. గెలిపిస్తే గెలిపించారు కానీ జాగ్రత్తండీ బాబు టైల్స్ మహా డేంజర్. అందులో అయ్యో అనుకునేంత లేదు లెండి నాకే నవ్వొచ్చింది అందుకే ఈ టపా ఇలా..

    నిషిగంధ గారు నెనర్లు, ఇంకా స్నోయింగా ఏంటండీ బాబు పొయినేడో అంతకు ముందో గుర్తు లేదు కాని మే లో లేబర్ డే కి స్మోకీస్ లో బాగా ఎంజాయ్ చేసి ఇక్కడ ఫ్లైట్ దిగగానే మంచు స్వాగతం పలికింది." చీ చికాగో... మా తాత గాని అలా చేసుండక పోతే నాకీ గతి పట్టుండేది కాదు.." అని అనుకున్నాను :) మీతాత ఏం చేసారు అని అనుమానం వచ్చిందా అయితే అర్జంట్ గా "చిత్రంభళారే విచిత్రం" సినిమా నో, అందులో బ్రహ్మం క్లిప్పింగో చూడండి.

    గీతాచార్య గారు నెనర్లు. నిజమేనండీ నేను కార్టూన్ కోసం వెతుకుతుంటే ఈ ఫోటో దొరికింది బాగా నచ్చేసి వెంటనే పెట్టేశాను.

    పరిమళం గారు నెనర్లు :) అందుకే గదండీ ముందే చెప్పేసాను.

    శివ గారు నెనర్లు. నేను చాలా కాలం నరసరావుపేట లో ఉన్నానండీ, ప్రస్తుతం చికాగో లో పని చేస్తున్నాను. మా కుటుంబం కూడా అక్కడ నుండి వచ్చేసి గుంటూరు లో స్థిరపడ్డాం. మీది ఏ ఊరు, వీలైతే మెయిల్ చేయండి (venusrikanth@gmail.com)

    రిప్లయితొలగించండి
  8. మావూరు మీకు దగ్గరే కనుక ఇంచుమించుగా మావీ అవే అనుభవాలు. కాకపోతే ఇంకా పడే భాగ్యం కలుగలేదు, పడ్డవార్ని చూసి నవ్వటమో, పడిన వారిని పరామర్శించి రావటమో జరిగింది. కాకపోతే మీ టపా చదివి నవ్వలేక అవే భంగిమల్లో మా కార్పెట్ మీద పడ్డాను, అదీ విచిత్రం ఇక్కడ! ;)

    రిప్లయితొలగించండి
  9. హ హ మీకా భాగ్యం కలగ కూడదని కోరుకుంటున్నాను ఉషగారు :) వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.