అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

మంగళవారం, అక్టోబర్ 01, 2019

నానీ’స్ గ్యాంగ్ లీడర్...

వరలక్ష్మి (శరణ్య) ప్రపంచంలో అందరి ఆకలి తన పులిహోరతో తీర్చేయచ్చని నమ్మే ఓ అమాయకపు అమ్మ. ఏడాది క్రితమే చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోయి ఒంటరి జీవితం గడుపుతూ ఉంటుంది. ప్రియ (ప్రియాంక అరుల్ మోహన్) చదువుకుని ఉద్యోగం చేస్తున్న తెలివైన అమ్మాయి. తనకి ఎంగేజ్మెంట్ అయి పెళ్ళి చేస్కోవాల్సిన అబ్బాయి ఏడాదిక్రితమే దూరమైనా మర్చిపోలేకా ముందుకు వెళ్ళలేకా ఆలోచనలతో సతమతమయ్యే అమ్మాయి. స్వాతి (శ్రియ రెడ్డి) అన్న చాటు చెల్లెలు, ఉన్న ఒక్క అన్నయ్య ఏడాది క్రితమే చనిపోయాడు. తన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని అన్నయ్య ఫోన్ కు మెసేజ్ చేస్తూ తనని ఊహలలో బతికించుకుంటూ ఉంటుంది. చిన్ను (ప్రాణ్య పి.రావ్) మాటలు రాని ఓ చిన్నారి. తను కూడా ఏడాది క్రితమే తండ్రిని కోల్పోయి ఓ అనాధ శరణాలయంలో పెరుగుతూ ఉంటుంది.

ఈ నలుగురికీ ఓ రోజు లక్కీడ్రాలో బహుమతి వచ్చిందని అది కలెక్ట్ చేస్కోడానికి ఫలానా అడ్రస్ కు రమ్మంటూ ఉత్తరాలు వస్తాయి. బహుమతి ఏమిటో చూద్దామని ఉత్సాహంగా బయల్దేరిన ఆ నలుగురు ఒక మధ్యతరగతి అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ దగ్గర కలుస్తారు. అందులో ఉన్నావిడే సరస్వతమ్మ (లక్ష్మి). తనే ఆ నలుగురికి ఉత్తరాలు రాసి రప్పించినది. ముదిమి వయసులో తనకున్న ఒక్కగానొక్క ఆసరా తన మనవడు కూడా ఏడాదిక్రితమే చనిపోతే అతని చావుకు కారణమైన వాళ్ళని కనిపెట్టి పగ తీర్చుకోవాలని ఏడాదిగా ఎదురు చూస్తుంటుంది.
ఈ ఐదుగురు ఆడవాళ్ళ జీవితాల్లో ఉన్న ఐదుగురు మగ వాళ్ళు మరొకడితో కలిసి ఏడాదిక్రితం ఒక బ్యాంక్ దోపిడీకి ప్లాన్ చేస్తారు. ఆ  ఆరోవాడు వీళ్ళందరినీ చంపేసి మూడొందల కోట్లతో పారిపోయి హాయిగా బతుకుతుంటాడు. అలాంటి వాడిని కనిపెట్టి చంపడం ఆడవాళ్ళమైన మనవల్లేం అవుతుంది అని అడిగిన వాళ్ళకు పెన్సిల్ పార్థసారధి (నాని) గురించి చెప్తుంది సరస్వతమ్మ. అతను మొత్తం ఇరవై ఎనిమిది రివెంజ్ నవలలు రాశాడనీ, అన్నీ అద్భుతమైనవనీ. అన్ని నవలలు రాశాడంటే అతని బుర్రలో ఎన్ని రివెంజ్ ఐడియాలుండి ఉంటాయో అనీ, అతనే ఈ గ్యాంగ్ కు సహాయం చేయగల సమర్ధుడనీ నిర్ణయించుకుని అతన్ని కలవడానికి బయలుదేరుతారు ఈ ఐదుగురు.

ఐతే పెన్సిల్ పార్థసారధి ఓ కాపీ రైటర్.. అందరూ నవలలను సినిమాలుగా తీస్తుంటే ఇతను ఇంగ్లీష్ సినిమాలను చూస్తూ మక్కీకి మక్కీ వాటినే నవలలుగా రాస్తుంటాడు. ఆ నవలలను బాల్య స్నేహితుడైన ఓ పబ్లిషర్ (ప్రియదర్శి) ని మొహమాట పెట్టేసి పబ్లిష్ చేయించుకుంటూ ఉంటాడు. ఆ నవలలు అన్నిటిని కొన్న ఒకే ఒక పాఠకురాలు సరస్వతి గారు. వీరి రివెంజ్ కథంతా విన్న పెన్సిల్ డబ్బులు లేకుండా ఫ్రీగా సహాయం చేయడానికి మొదట నిరాకరిస్తాడు. కానీ వీళ్ళ రివెంజ్ తీర్చుకోవడానికి సహాయం చేసి ఆ రియలిస్టిక్ కథనే ఒక నవలగా రాయమని ఎంత ఖర్చైనా తను పెట్టుకుంటానని చెప్పిన పబ్లిషర్ ప్రోత్సాహంతో రంగంలోకి దిగుతాడు. 
తన సినిమా నాలెడ్జితో పెన్సిల్ వీళ్ళకు ఏమాత్రం సహాయం చేయగలిగాడూ, అందరూ కలిసి రివెంజ్ తీర్చుకోగలిగారా, అసలు సగటు మధ్యతరగతి నేపధ్యం గల ఆ ఐదుగురూ ప్రాణాలకి తెగించి బ్యాంక్ దోపిడీకి ఎందుకు ప్లాన్ చేశారు. ఆ ఆరో వ్యక్తి ఎవరు ఎందుకలా అందరిని చంపేశాడు, అతనిని మన రివెంజర్స్ ఎలా పట్టుకున్నారూ ఇత్యాది విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి. 
విక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మనం, 24 చిత్రాలతో పోల్చుకుంటే ఆ స్థాయిని అందుకోదేమో కానీ "గ్యాంగ్ లీడర్" సగటు తెలుగు సినిమాలకన్నా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. విక్రమ్ మార్క్ స్టోరీ టెల్లింగ్ అండ్ కొన్ని సీన్స్ చప్పట్లు కొట్టిస్తాయ్. ముఖ్యంగా చివరిలో వచ్చే శ్రావణి థ్రిల్ చేస్తుంది. 
అలాగే ఇంటర్వెల్ కార్డ్ పడిన గీతా టీవీ షాట్ కూడా బ్రిలియంట్ గా ఉండి చప్పట్లు కొట్టిస్తుంది. రాబరీ సీన్ చాలా చక్కగా ఎక్సిక్యూట్ చేశారు. అలాగే ఏ సన్నివేశాన్నీ వృథా పోనివ్వకుండా స్క్రీన్ ప్లేలో డాట్స్ కెనెక్ట్ చేసిన విధానం మెప్పిస్తుంది. సినిమా అంతా సునిశితమైన హాస్యం తో, ఫ్యామిలీ ఎమోషన్స్ తో చక్కని డైలాగ్స్ తో ఆద్యంతం ఆహ్లాదంగా నడిపించారు.

నటీనటులలో అందరూ తమ పాత్రలకు చక్కగా సూట్ అయ్యారు. నానీకి ఇలాంటి రోల్ కేక్ వాక్, తన టైమింగ్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మరో లీడ్ రోల్ ’లక్ష్మి’ గారిదే తన పెర్ఫార్మెన్స్ గుర్తుండి పోతుంది. మొన్న "ఓ బేబీ" ఇపుడీ సినిమా రెండిటిలోను లక్ష్మిగారికి ముఖ్యమైన పాత్రలు దక్కాయి. 
ఇక హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ క్యూట్ గా ఉంది. అమ్మాయిలు ఇంత అందంగా ఉండటం క్రైమ్ అన్న డైలాగ్ కి అచ్చంగా సూటైందనిపించింది. మూగమ్మాయిగా చేసిన ప్రాణ్య ఆకట్టుకుంది. శరణ్య గారు, శ్రియ రెడ్డి, అనిష్ కురువిల్ల, జబర్దస్త్ సత్య అందరూ బాగా చేశారు. "సంతూర్ శనక్కాయల" గా చేసిన వెన్నెలకిషోర్ ’ఊప్స్...’ అంటూ నవ్వించేసి ఇకపై ఆ పదం వాడడానికి సంకోచించేలా చేశాడు. 
కార్తికేయ హీరోగా కన్నా విలన్ గానే బావున్నాడు అనిపించింది, ముఖ్యంగా ఈ సినిమాలో తన రోల్ కి సరిగ్గా సరిపోయాడు. టెక్నికాలిటీస్ లో సినిమాటోగ్రఫీ బావుంది, రాబరీ సీన్ బాగా తీశారు. అలాగే కొన్ని షాట్స్ గుర్తుండిపోయేలా ఉన్నాయి. అనిరుధ్ నేపధ్య సంగీతం సినిమాకి తగినట్లుగా ఉంది. పాటలలో రారా జగతిని, హొయనా హొయనా నాకు బాగా నచ్చాయి మిగిలినవి నెరేషన్ కి అడ్డం పడవు అలాగని గుర్తూ ఉండవు.

ఇంటిల్లిపాదీ కాసేపు హాయిగా నవ్వుకుంటూ చూసేయగలిగిన సినిమా నానీ’స్ గ్యాంగ్ లీడర్. రొటీన్ మాస్ మసాల సినిమాలు కాకుండా వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే వాళ్ళకి తప్పక నచ్చుతుంది. నాని మార్క్ టిపికల్ ఎంటర్టైన్మెంట్ కి ఏ లోటూ ఉండదు. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూసి నిర్ణయించుకోండి.   

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.