శనివారం, డిసెంబర్ 26, 2020

సోలో బ్రతుకే సో బెటర్...

ఈ పోస్ట్ ని నా స్వరంతో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link

సాధారణంగా సాయిధరమ్ తేజ్ సినిమాల నుండి మనం ఏం ఆశిస్తామో అవన్నీ ఉన్న సినిమా "సోలో బ్రతుకే సో బెటరు". మిస్సవకుండా చూడాల్సినదో పాత్ బ్రేకింగ్ సిన్మానో కాదు కానీ తొమ్మిది నెలలుగా థియేటర్ లో అడుగుపెట్టని ప్రేక్షకులకి, బిగ్ స్క్రీన్ కోసం మొహం వాచిపోయి ఉన్న సగటు సినీ అభిమానికి ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ని అందించి ఇంటికి పంపిస్తుంది. 

ఇక కథ విషయానికి వస్తే మనం కాలేజ్ లో నానా రకాల ఫిలాసఫీలు కనిపెట్టేస్తుంటాం. బేసిగ్గా ఆ వయసలాంటిది వాటిలో కొన్నిటిని అక్కడే తుంగలో తొక్కేస్తే మరికొన్నింటిని కాలేజ్ బయటికి కూడా మోసుకొచ్చేస్తాం. కొన్ని ఐడియాలుగా మన మనసులోనె పుట్టి మరణిస్తె మరికొన్నిటికి మంచి రూపాన్నిచ్చి మరికొందరికి అంటిస్తాం. అలా కాలేజ్ రోజుల్లో విరాట్ (సాయి తేజ్) మనసులో రూపుదిద్దుకున్న ఫిలాసఫీ నే సోలో లైఫే సో బెటరు. 

ఎంతైనా మనాడు హీరో కాబట్టి ఓ సంఘం పెట్టి దీనికి కొన్ని శ్లోకాలు రాసేసి వాటిని ఓ పుస్తకంగా కూడా అచ్చేయించేసి పెళ్ళి ప్రేమ ఎమోషన్స్ లాంటివాటికి దూరంగా బ్రతకాలని మీటింగులు పెట్టి వాజ్ పేయి, (మూర్తన్న)ఆర్.నారాయణమూర్తి, అబ్దుల్ కలాం ల కటౌట్లు పెట్టి ప్రచారం చెసేస్తుంటాడు.  

ఐతే కాలేజొదిలేసి ఉద్యోగం బాట పట్టాక, తనతో ఉన్న బాచిలర్ ఫ్రెండ్స్ ఒకొక్కరు మెల్లగా సంసారులవడం మొదలు పెట్టాక, వయసైపోయి తెల్ల వెంట్రుకలు రావడం మొదలెట్టేక, ఆఖరికి చివరి వరకు తోడుగా ఉంటుందనుకున్న కుక్క కూడా ఓ తోడును వెతుక్కున్నాక, తను ఆరాద్య దైవంగా కొలిచే మూర్తన్న కూడా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెళ్ళి చేస్కోవాలని సలహాలిచ్చేకా తప్పని సరై అప్పుడు మన హీరో గారి కళ్ళకి కమ్మిన సోలో పొరలు ఒక్కొక్కటిగా కరిగిపోవడం మొదలౌతుంది.  

ఆఖరికి ఊరంతటికీ శకునం చెప్పే బల్లి ఇంటెనకాల కుడితి తొట్లో పడినట్లు మన వీరో గారు కూడా వీరోయిన్ తో ప్రేమలో పడతాడు. అక్కడ మన వాడికి ఓ పెద్ద ట్విస్ట్ ఎదురౌతుంది. తెలుగు సినిమాల్లో పండిపోయిన ఆడియన్స్ ఆ ట్విస్టేంటో ఈజీగానే ఊహించగలరు కానీ నేను చెప్పదలచుకోవడం లేదు. 

ఆ ట్విస్టేంటీ? హీరో గారు ఒంటరిగానే మిగిలి పోయారా? లేక హీరోయిన్ తో జంట కట్టారా? ఒకవేళ కడితే మరి కాలేజ్ లో ఈయన స్థాపించిన సంఘం దాన్ని ఫాలో అయిన స్టూడెంట్స్ ఏం చేశారు? అనేది తెలుసుకోవాలంటే సుబ్బు దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయితేజ్(ఇదే పేరు వేస్కున్నారండీ థరమ్ ని ఎత్తేశారు టైటిల్స్ లో బహుశా ఏ న్యూమరాలజిస్టో చెప్పుంటారేమో) నటించిన "సోలో బ్రతుకే సో బెటరు" సినిమా చూడాల్సిందే. 

ఇచ్చిన పబ్లిసిటీ పెట్టిన కౌటౌట్లు చూసి ఇదేదో బ్రహ్మచారి గా ఉండడం వల్ల పొందే లాభాల పై తీసిన సినిమా అని వెళ్ళే సోలో బ్రదర్స్ ని నిరుత్సాహ పరుస్తూ అరగంట కూడా గడవక ముందే వాళ్ళ కళ్ళల్లో కారంగొట్టి మూడొందలరవై డిగ్రీస్ లో యూటర్న్ కొట్టి ఫ్యామిలీ లైఫే సో బెటరూ పెళ్ళి చేసుకోండిరా అబ్బాయిలూ అని చెప్పి పంపించే సినిమా ఇది. ఈ దెబ్బతో సాయితేజ్ అన్న మమ్మల్ని మోసం చేశాడు అని వాళ్ళంతా ఫీలైనా ఆశ్ఛర్యం లేదనమాట :-)

సినిమాలో సంగీతం సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా సినిమాకి తగినట్లే ఉన్నాయ్ నథింగ్ స్పెషల్ అలా అని నథింగ్ బాడ్ అలా అలా వాటి పని అవి చేసుకుంటూ పోయాయి. ముఖ్యంగా సినిమా నిడివి విషయంలొ జాగ్రత్త పడడం సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది. డైలాగ్స్ అక్కడక్కడా బావున్నాయ్ ఎమోషన్స్ పై రాసిన కొన్ని డైలాగ్స్ బావున్నాయ్. కొత్త దర్శకుడు సుబ్బు ఐడియాస్ బానే ఉన్నాయి కానీ ఆచరణలో కాస్త తడాబడ్డాడా అనిపించింది. ఫస్ట్ సినిమా సాధారణంగా అద్భుతంగా రాస్కుంటూ ఉంటారు దర్శకులు అది మిస్సింగ్ అనిపించిందనమాట.

సత్య సుదర్శన్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా గోవింద గౌడ గా కన్నడ యాస తో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ బావుంది. ఉన్నంత కాలం భార్య విలువ తెలుసుకోకుండా సెటైర్లు జోకులు వేస్తూ తిడుతూ టైం పాస్ చేసి తను దూరమయ్యాక తన విలువ తెలుసుకుని కుప్పకూలిపోయే సగటు భర్త గా రావురమేష్ త్రెడ్ బావుంది. 

సాయితేజ్ కి ఇలాంటి రోల్స్ కేక్ వాక్.. అవలీలగా చేస్కుంటూ పోయాడు. సెకండాఫ్ లో తన ఫిలాసఫీనే పచ్చివెలక్కాయలా తన గొంతుకి అడ్డంపడి మింగలేక కక్కలేక తను పడే అవస్థను చూస్తే నవ్వొస్తుంటుంది. ఇతను ఫిట్నెస్ మీద మరికాస్త శ్రద్ద పెట్టాలి. నభానటేష్ తన రోల్ కి బాగా సూట్ అయింది తగినట్లుగా బాగా చేసింది. కమర్షియాలిటీ కోసం కావాలని ఇరికించిన ఫైట్ సీన్స్ ని కథకి వాడుకోవడంలో దర్శకుడు సుబ్బు ఇంటిలిజెన్స్ బావుంది. రాజేంద్రప్రసాద్, నరేష్ గార్ల టాలెంట్ ని పూర్తిగా ఉపయోగించుకోలేదు అనిపించింది ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు. 

ఓవరాల్ గా మిస్సవకూడని గొప్ప సినిమా ఏం కాదు గానీ బొత్తిగా సినిమాలు మిస్సవుతున్నాం అని ఫీలవుతున్న సినిమా పిచ్చోళ్ళని కాస్త రొటీన్ అనిపించినా రెండు గంటల పాటు అలరించే ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సోలో బ్రతుకే సో బెటర్. 

6 కామెంట్‌లు:

  1. మూవీ కంటే మీ ఆర్టికలే బావుందండీ.

    రిప్లయితొలగించు
  2. // "లేక హీరోయిన్ తో జంట కట్టారా?" //
    జత కట్టే ఉంటాడు లెండి. ఎన్ని సినిమాలు చూడలేదు (ఏదో ఈ మధ్య వచ్చిన ఒక సినిమా లాంటివి తప్ప .. ఇంకా చూడనివారి శ్రేయస్సు దృష్ట్యా సినిమా పేరు చెప్పను, పేరు మీకు తెలుసుగా).

    రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడా? ఆయనే హీరోగా బ్రహ్మచర్యాన్ని ఎత్తేస్తూ ఒక సినిమా ఎప్పుడో వచ్చింది కదా (సినిమా పేరు గుర్తుకు రావడం లేదు).

    ఇటువంటి మంచిమాటలు ఎన్ని చెప్పినా దూకుదామనుకునే బ్రహ్మచారులు మారరండీ.

    ఇంతకీ ఈ సినిమా OTT లో వచ్చిందా? లేక సినిమా హాలుకి వెళ్ళి చూడాలా (అలా అయిన పక్షంలో నేను ఔట్)?

    రిప్లయితొలగించు
    రిప్లయిలు
    1. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ విన్నకోట వారు.. హహహా అదీ నిజమేలెండి.. జతకట్టకుంటే సినిమా చూడరు కదా మరీ ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు :-)
      రాజేంద్రప్రసాద్ ది వివాహభోజనంబు అనుకుంటానండీ..
      ఏమాటకామాటే థీమ్/టైటిల్ ఏదైనా కానీ అల్టిమేట్ గా జతకట్టమనే చెప్తాయండీ ఈ సినిమాలన్నీ కూడా బొత్తిగా మోసం చేస్తుంటాయ్ అమాయక బ్రహ్మచారులని :-)
      ప్రస్తుతానికి థియేటరేనండీ.. అతిత్వరలో జీ ఫైవ్ లోనో మరో ఓటీటీలోనో విడుదలవచ్చు.

      తొలగించు
  3. నభా నటేష్ ..సుధీర్ బాబుతో ఒక సినిమా ఎక్ట్ చేసింది వేణు..నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి నటన అందులో...మీరు చెప్పిన స్టోరీ చూస్తుంటే ఆ అమ్మాయి కోసం అయినా చూడాలి...బట్ దియేటర్ కి వెళ్ళే ఛాన్స్ లేదు గానీ ఓటీటి లో అయితే చూస్తా..:) మీరు అయితే తెగించి సినిమాలకు వెళ్లిపోతున్నారు అన్నమాట... కానివ్వండి...సోలో బ్రతుకే సో బెటర్ అని ఊరికే అన్నారా:)

    రిప్లయితొలగించు
    రిప్లయిలు
    1. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ నేస్తం గారు.. అవునండీ "నన్ను దోచుకుందువటే" అనే సినిమా చేసింది ఇస్మార్ట్ శంకర్ కన్నా నాకూ అందులో నచ్చుతుంది తను. ఈ సినిమా త్వరలోనే ఓటీటీకి వచ్చేస్తుందండీ.

      తొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.