
అమ్మ జ్ఞాపకాల కబుర్లు
చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం
మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు
నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్
ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..
నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.
సోమవారం, డిసెంబర్ 03, 2012
కృష్ణం వందే జగద్గురుం
సోమవారం, అక్టోబర్ 29, 2012
శుభసంకల్పం-ఈనాడు కథ
బుధవారం, అక్టోబర్ 17, 2012
బ్రదర్స్-లెంత్ తో బెదుర్స్

మంగళవారం, అక్టోబర్ 16, 2012
RGV 3D బూచి !!
సోమవారం, అక్టోబర్ 08, 2012
అవును !!!
ఆదివారం, అక్టోబర్ 07, 2012
ENగ్LISH VINGLIష్
సోమవారం, జులై 30, 2012
ఓనమాలు
కథ విషయానికి వస్తే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కొడుకుదగ్గర నివాసముండే నారాయణరావు మాష్టారు (రాజేంద్రప్రసాద్) తన ఊరు గురించిన జ్ఞాపకాలతో బ్రతుకుతూ చనిపోయేలోపు మళ్ళీ ఒక్కసారి తనఊరు చూసిరావాలని అనుకుంటూ ఉంటారు. అయితే నగర జీవితంలో క్షణం తీరికలేకుండ బ్రతుకుతున్న మాష్టారి కొడుకు ఆయనను ఇవ్వాళా రేపు తీసుకువెళ్తానంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాడు. ఇలాలాభంలేదని ఒంటరిగా ఇండియా వచ్చేస్తారు నారాయణరావు మాష్టారు. ఎయిర్ పోర్ట్ నుండి తన పల్లెకు వెళ్ళే దారిలో ఊరిగురించి, తన విధ్యార్దుల గురించి, ఊరిప్రజల మధ్యన ఆప్యాయతలను గురించిన అందమైన జ్ఞాపకాలలో ప్రయాణించిన మాష్టారు ఊరు చేరుకునేసరికి అక్కడ పరిస్థితులన్నీ మారిపోయి, అప్పటిమనుషులంతా చెల్లాచెదురై, ఊరు పట్నపు పోకడలకు పూర్తిగా అలవాటుపడలేక పాత పద్దతులను మిగుల్చుకోలేక సతమౌతుండడం చూసి బాధపడతారు. ఎంతో ప్రతిభ ఉన్న తన విధ్యార్ధులు సైతం మారుతున్న విలువలకు తలవంచలేక సరైన ఉపాధిలేక ఇబ్బందులు పడుతుండడం చూసి మనసు విరిగి వారికోసం ఊరుకోసం తనపరిధిలో సాధ్యమైన పరిష్కారం ఏంచేశారనేది ముగింపు.
సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు పల్లె అందాలను చక్కని పచ్చదనంతో తెరకెక్కించారు. సినిమా అంతా కూడా కంటికి ఆహ్లాదంగా హాయైన అనుభూతినిచ్చింది. కోటి నేపధ్యసంగీతం సంధర్బోచితంగా ఉంది, పాటలలో పల్లెలో మేలుకొలుపు గురించి సాగే “సూరీడు ఒచ్చిండు సూడయ్యో” హుషారుగా అలరిస్తే, క్లైమాక్స్ లో వచ్చే “పిల్లలూ బాగున్నారా” పాట తన పిల్లలగురించి పడుతున్న పల్లె ఆవేదనను ప్రతిబింబించింది. “అరుదైన సంగతి” భార్యా భర్తలమధ్య అనురాగాన్ని చూపిస్తే “పండుగ అంటే పచ్చదనం పచ్చదనం మా పల్లెధనం” పాట పల్లెల్లోని పండుగ సందడినంతా చూపిస్తుంది. చాలారోజుల తర్వాత ఈసినిమాలోని పాటలన్నీ సీతారామశాస్త్రిగారే రాశారు. ఎడిటింగ్ కానీ కొరియోగ్రఫీకానీ ఇతర విభాగాలేవీ నన్ను ఎక్కడా ఇబ్బందిపెట్టలేదు. ఖదీర్ బాబు ప్రాసకోసం పంచ్ లకోసం ప్రాకులాడకుండా అవసరమైనమేరకు చక్కని సంభాషణలు అందించారు. మాష్టారి పాత్రకు రాసిన కొన్నిమాటలు మనుషులమధ్య ఆప్యాయతల ఆవశ్యకతను, మతసామరస్యాన్ని చూపిస్తే మరికొన్ని మాటలు మారిన ప్రస్తుత విలువలను పరిస్థితులను సూటిగా ఎత్తి చూపిస్తాయి.
రొటీన్ ఫాక్షన్ / ప్రేమ కథా సినిమాలకు భిన్నంగా, నిజాయితీతో ప్రస్తుత పరిస్థితులకు అద్దంపడుతూ, చూసిన ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసే ఓ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించిన క్రాంతిమాధవ్ అభినందనీయుడు. తెలుగుదనమున్న మంచి సినిమాలు వైవిధ్యమైన సినిమాలు తెలుగులో రావడంలేదని బాధపడే ప్రతిఒక్కరూ తప్పక చూసి ప్రోత్సహించవలసిన చిత్రం “ఓనమాలు”.
నాకు నచ్చిన కొన్ని మాటలు, చిత్రం చూసే అవకాశమున్నవారు దయచేసి చదవకండి.
“స్కూల్ బస్సులో పడుకున్న పిల్లల్ని ఉద్దేశించి: బళ్ళో ఉపాధ్యాయులు పుస్తకాల మధ్య బాదేస్తారు ఇంట్లో తల్లిదండ్రులు ర్యాంకుల కోసమంటూ ఉతికేస్తారు. ఇంటికీ బస్సుకీ మధ్య ఉండే ఈ గంటే పిల్లలకి రెస్టు, ఇక ఆడుకోడానికి పాడుకోడనికి పిల్లలకి టైమెక్కడుంటుందిసార్, నెమలిపిల్లలు జూలో బతికినట్టే.”
“అసలు మనిషికూడా ఒక పశువేనయ్యా కాకపోతే జ్ఞానం నేర్చుకుని మనిషయ్యాడు, మానవత్వం మర్చిపోయి పశువవుతున్నాడు.”
“కూర్చుని తింటే కొండలైనా కరుగుతయ్యేమో కానీ పెడితే కరగవయ్యా ఆ, పెట్టడం పల్లె సంస్కృతి అదీగాక పెట్టేవాడి చేతిని పరమాత్మ ఎప్పుడూ వదలడంటారు.”
“పొద్దునలేస్తే సవాలక్ష వ్యవహారాల్లో మునిగితేలే మగాళ్ళకి కాస్తంత మురిపెం కావాలి ఎందుకంటే మగాళ్ళుకూడా మీసం వచ్చిన పసిపిల్లలే.”
భార్య: “మొగుడికి పట్టని అందం ఏం అందమండీ?”
భర్త: “భార్య అందాన్ని భర్తప్రత్యేకంగా చూడడు ఆమె అందం అతని మనసులో ఉంటుంది, ఆమె కదిలినా, తిరిగినా, పూలుకోసినా, నీళ్ళుచేదినా, పిల్లాడికి జోలపాడినా ఇలా ప్రతి సంధ్రర్భంలోనూ భార్య భర్తకి అందంగానే కనిపిస్తుంది.”
“మతం అంటేనే మంచి, అది దేవుడి చేతిలో బెత్తం.”
“వాడికి గళ్లచొక్క తీస్కురాకురోయ్ ఆడా చొక్కామీదున్న గడికీ గడికీ మధ్య కూడా తగాదా పెడతాడు.”
“ప్రతి గురువుకీ మూడులక్షణాలుండాలి మంచి కంఠం, మంచి రూపం, మంచి ఆహార్యం.”
“మాష్టారంటే పిల్లలకు సహాయకుడు మాత్రమే, అటువెళ్ళు ఇటువెళ్ళు అని దారిచుపించేవాడు మాత్రమే, నేర్పించేవాళ్ళకన్నా సహాయం చేసే వారే ఉత్తమ ఉపాధ్యాయుడు, నేర్పిస్తే పిల్లలు ఆధారపడిపోడానికి అలవాటుపడతారు, అదేనేర్చుకోడంలో సహాయం చేస్తే స్వతంత్రంగా నిలబడతారు.”
మాష్టారు మరణశయ్యపైనున్న భార్యతో : “రుక్మిణీ నన్ను ఒంటరివాడ్ని చేసి వెళ్ళద్దు, పుస్తకాలు పరీక్షపేపర్లు తప్ప నా అన్నం ఎక్కడుందో నా బట్టలెక్కడున్నాయో తెలియని వాడ్ని నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళకు.”
“పరాయి భాషకి కిరీటం పెట్టడానికి మాతృభాష శిరస్సు ఖండించడం ఎంత పొరపాటు.”
“ఏమోయ్ వాళ్ళింట్లో పదారు రకాల స్వీట్లు మరో పదారు రకాల హాట్లు ఉంటాయ్ మన స్వీట్లు అవసరమా?” "ఎన్నున్నా ఐనవాళ్ళు పెట్టిన స్వీట్ కే తీపెక్కువ, తీపి పంచితే ప్రేమ పెరుగుతుంది.”
“పోయే ముందు కానీ ప్రాణం విలువ తెలియదు.”
“లీగల్ గా చేస్తే స్కీము ఇల్లీగల్ గా చేస్తే స్కాము.”
“అమెరికాలో తాగాలనుకున్నా యజ్ఞం చేసినట్లుగా అందరూ ఇలా కూర్చుని మగ్గులు మగ్గులుగా తాగరు కాలం విలువ కష్టం విలువ తెలిసి పని చేస్తారూ, వీకెండ్లో ఏదో ఒక పెగ్గు పుచ్చుకుంటారు.”
“కుక్కను చంపాలంటే పిచ్చిదని పేరుపెట్టాలి, సాంప్రదాయాన్ని చంపాలంటే ఛాదస్తమని పేరుపెట్టాలి, అంతేకదా? పనైపోయిందికదా అని పాల సీసాను పారేయచ్చు అమ్మని పారేయలేం కదా?”
“నా మిసెస్ మాష్టారూ, తనన్న ప్రతిదానికీ ఓఎస్ అన్నాలి లేదంటే వాయిస్ పెంచుతుంది.”
“పిల్లలు ఏదడిగితే అదివ్వడం కాదమ్మా, వాళ్ళ అవసరాన్ని గుర్తించి ఏది కావాలో అదివ్వాలి.”
“మనిషి ప్రమేయాన్నీ మనిషి ఉపాధినీ అడ్రస్ లేకుండా చేసే టెక్నాలజీని ఒప్పుకోకూడదు.”
“ఈ ఊరంటే నాకు గౌరవం, ఈ ఊరు నేర్పించిన సంస్కారమంటే నాకు గౌరవం, ఊరంటే కొందరు ఉండే సమూహం కాదు, ఊరు ఒక క్వాలిటీ కంట్రోలర్, మన క్యారెక్టర్ కి ఎప్పటికప్పుడు మార్కులేసే ఒక టీచర్, అలాంటి ఊరు ముందు నేను ఫెయిల్ కాలేను.”
“మా తరానికి అడ్వైస్ ఇచ్చే వాళ్ళుకావాలి, వార్నింగ్ ఇచ్చే వాళ్ళు కావాలి అలాంటి ఊరికి మేం వెళ్ళం ఊరు మాదగ్గరికి రాదు ఇట్సె బిగ్ గ్యాప్”
“పాలు ప్యాకెట్లనుంచి వస్తాయని, బియ్యం బస్తాల్లో పండుతాయనీ, కూరగాయలు ఫాక్టరీల్లో తయారవుతాయని నమ్మే హైటెక్ పిల్లలకి మనదేశపు మట్టివాసన గురించి, మన కన్నీటి సువాసన గురించీ తెలియాలంటే అది పల్లెటూళ్ళనుండే నేర్పించాలి.”
బుధవారం, జూన్ 13, 2012
శ్రీశ్రీనివాసం శిరసా నమామి - 2

ఇక్కడ గుండు ఉచితంగా చేస్తారు “ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు, అంతా ఉచితం” అని అంతటా బోర్డులు ఉంటాయి కానీ మీరు ఆ టోకెన్ అతని చేతిలో పెట్టేప్పుడే దానితో పాటు కొంత డబ్బులు కలిపి ఇవ్వండి. నాకు ఈ సూక్ష్మం తెలియక కేవలం టోకెన్ మాత్రమే ఇచ్చాను. ఆయన ఎడాపెడా గుండంతా మంట పుట్టేలా గీకేయడమే కాక అక్కడక్కడ పూర్తిగా చేయకుండా వదిలేస్తే, నేను తడుముకుని చూస్కుని మళ్ళీ చెప్పి చేయించుకోవాల్సి వచ్చింది. అంతా అయ్యాక గట్టుమీద భద్రంగా పెట్టిన బ్యాగ్ తీసుకుని వచ్చేస్తుండగా “ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు తోచినంత ఎంతోకొంత ఇవ్వండి సార్” అని ఆపేశాడు. “అదేంటోయ్ అంతటా ఇవ్వద్దని బోర్డులున్నాయ్ సి.సి. కెమేరాలు కూడా ఉన్నట్లున్నాయ్ కదా?” అని నేను అంటే “అవంతే ఉంటాయ్ సార్ మీరు కిందనుండి ఇచ్చేయండి, మాకు అలవాటే తీస్కుంటాం” అని చెప్పాడు. అతనికి కొంత చదివించుకుని పక్కన ఉన్న స్వామివారి ఫోటోకి భక్తిపూర్వకంగా ఒక నమస్కారం చేసుకుని ఇవతలికి వస్తుండగా ఎవరినో “ఏంది దొరలాగా గుండు చేయించుకుని వెళ్తున్నావ్ పైసల్దీయ్” అని అదిలించడం వినిపించింది.

వరాహ స్వామి గుడి వెనక పుష్కరిణి పక్కన మహిళలకి మగవారికి ఎవరికి వారికే ప్రత్యేకంగా కట్టిన స్నానపు గదులు చాలా శుభ్రంగా సౌకర్యంగా ఉన్నాయ్. విశాలమైన ఆవరణ, గ్రానైట్ రాళ్ళతో ఫినిషింగ్ ఇచ్చిన గోడలు అంతే చక్కని మెయింటెనెన్స్, ఒక్కో బాత్రూములోనూ బక్కెట్టు మగ్గు, తలుపుకు బట్టలు తగిలించుకోడానికి హ్యాంగర్స్, సబ్బు షాంపూ ఇతరత్రాలు పెట్టుకోవడానికి చిన్న అర, బాత్రూముల మధ్య కొంచెం ఎత్తులో నీళ్ళుపడకుండా బ్యాగులు పెట్టుకోడానికి ఒక గట్టు అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయ్. వీటన్నిటికి తోడు పుష్కరిణి నుండి పంప్ చేస్తున్న నీరు పుష్కరిణిలో స్నానమాచరించిన తృప్తిని కూడా మిగిల్చింది.
అక్కడ స్నానం ముగించి తిరిగి గుడి ముందుకు వచ్చి స్వామివారికి ఒక టెంకాయ కొట్టి అప్పటికే సర్వ దర్శనం ఒక రోజు పడుతుందని టాక్ స్ప్రెడ్ అవడంతో ప్రత్యేక దర్శనం(300)క్యూ వెతుక్కుంటూ బయల్దేరాను. మంగళ బుధవారాల్లో ఈ లైన్లోకూడా దర్శనం ఆరుగంటల పైనే పడుతుందట మిగిలిన రోజుల్లో మూడు నాలుగు గంటల్లో ముగుస్తుందని తెలిసింది ఆరోజు గురువారం. టిక్కెట్లు క్యూలోనే ఇస్తారు కానీ క్యూలైన్స్ లో ప్రవేశించేముందే సెల్ ఫోన్స్, లగేజ్, చెప్పులను క్లోక్ రూంలో సరండర్ చేయాలి. కళ్యాణకట్టనుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 దగ్గరకు వెళ్ళే దారిలో మొదట నడిచి వచ్చినవారికి ఇచ్చే లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. మరికొంచెం ముందుకు వెళ్తే అదనంగా మరో రెండు కౌంటర్లు లగేజ్ సెల్ ఫోన్స్ చెప్పులు డిపాజిట్ చేసుకునేందుకు ఉన్నాయ్. తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా ఈ కౌంటర్లలో అంత రద్దీలేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది ఒకరిద్దరిని మించి క్యూ పెరగకుండా సిబ్బంది జాగ్రత్తగా చూస్తున్నారు. అలాగే రోజంతా ఒకటే పని చేస్తూ వందలమంది భక్తులను డీల్ చేసినా అక్కడి సిబ్బంది విసుక్కోకుండా ప్రతి ఒక్కరికి ఓపికగా సమాధానాలు చెప్పడం బాగా నచ్చింది.

ఈ క్యూలైన్స్ లో దదాపు మూడుగంటలకు పైగా ఎదురు చూశాక మెటల్ డిటెక్టర్ ద్వారా టిక్కెట్ కౌంటర్స్ వద్దకూ, ఆపై క్యూ కాంప్లెక్స్ లోకి వదిలారు. ఈ కాంప్లెక్స్ లు చాలా శుభ్రంగా మంచినీరు, టాయిలెట్స్ ఇతరత్రా సౌకర్యాలతో కూర్చోడానికి బల్లలతో పెద్ద పెద్ద ఫాన్స్ తో ఒక కాఫీ వెండింగ్ మెషీన్ తో చాలా సౌకర్యవంతంగా ఉన్నాయ్. అక్కడ అందరు సెటిల్ అయాక ఒక్కొక్కరు పులిహోర పొట్లాలు జంతికలు ఇతరత్రా తినుబండారాలు తెరవడం మొదలెట్టారు. అప్పటి వరకూ దర్శనమెప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్న నాకు సిక్స్ ట్రాక్ స్ట్రీరియో ఫోనిక్ ఎఫెక్ట్స్ తో కరకర నమిలే శబ్దాలు, పులిహోరల ఘుమఘుమలు ఇవి చాలవన్నట్లు టి.టి.డి వారు ఉచితంగా సరఫరా చేసిన బిసిబేళబాత్ పులియోగరే సువాసనలు నా కళ్ళు ముక్కు చెవుల ద్వారా ముప్పేట దాడిచేయడంతో అప్పటికి ఇరవైనాలుగ్గంటలుగా పొద్దున్న ఒక టీ, మంచినీళ్ళు తప్ప ఏమీ తినలేదన్న విషయం గుర్తువచ్చింది. అంతలోనే మరికొన్ని గంటలు ఓపికపడితే దర్శనం అయ్యాక తినచ్చులే అని అనిపించడమే తడవు ఆటోమాటిక్ గా ధ్యాస స్వామివారివైపు మరలింది.
ఆ కాంప్లెక్స్ లో ఎదురు చూసిన మూడుగంటలూ ఫోన్ కూడా చేతిలో లేకపోవడంతో స్వామి సన్నిధిలో ఇతర ఆలోచనలు అన్నీ వదిలేసి ఎప్పుడు ఆయన దర్శనమౌతుందా అని ఎదురు చూస్తూ కూర్చోవడం ఆహ్హా నాకు చాలా నచ్చింది. ఇదికూడా అదృష్టమే కదా ఇందుకే ఈ సదవకాశాన్ని నాకు కల్పించేందుకే ఎపుడూ దర్శనం ఆలశ్యమౌతుంటుందేమో అని అనిపించింది. ఆ కాంప్లెక్స్ నుండి వదిలేశాక ఇక ఎక్కడా ఆగకుండా స్వామి దర్శనమేనని తెలుసుకుని ఆనందంతో ఎదురు చూస్తుండగా క్యూ కాంప్లెక్స్ తలుపులు తీయడమాలశ్యం ఆ ప్రదేశమంతా గోవిందా గోవిందా అంటూ గోవిందనామాలతో ప్రతిద్వనించింది. మెల్లగ క్యూకదలనారంభించింది, క్యూ మధ్యలో ఇరుకుదారుల్లో వెంటిలేషన్ సరిగా లేని చోట ఏసీ బ్లోయర్స్ ఏర్పాటు చేయడం బాగుందనిపించింది. మళ్ళీ మరోసారి మెటల్ డిటెక్టర్ గుండా తనిఖీ చేయించుకుని గుడి ముందుకు వెళ్ళాను. ముఖద్వారం వద్ద కింద ఏర్పాటు చేసిన పారేనీటిలో పాదాలు తడుపుకుని పరమ పవిత్రమైన గుడి ఆవరణలోకి అడుగుపెట్టాను.
నా ప్రయత్నంగా అడుగు తీసి అడుగేసుకుంటూ నడచి వెళ్ళడం నాకు అక్కడివరకే గుర్తుంది. ఇక అక్కడినుండి ఎలా నడిచానో నాకేమీ గుర్తులేదు అంతా ఆ స్వామి ఇతర భక్తులు కలిసి నడిపించినదే. నా పిచ్చిగానీ ఆ దేవదేవుని దయలేకుంటే అక్కడివరకూ మాత్రం రాగలనా ? నేవేసే ప్రతి అడుగూ ఆ స్వామి కనుసన్నలలో వేసేదే అని నాకూ తెలుసుననుకోండి కాకపోతే ముఖద్వారం దాటాక చాలా చిత్రంగా ఇహలోకపు స్పృహ పూర్తిగా కోల్పోయాను. ఎవరు తగులుతున్నారో ఎవరు లేదో ఎవరు కాళ్ళుతొక్కుతున్నారో ఎవరు ముందుకు తోస్తున్నారో ఎవరు వెనకకు నెడుతున్నారో ఇవేమీ తెలియని ఒక అలౌకికమైన స్థితిలోకి చేరుకున్నాను. పెదవులు నిర్విరామంగా గోవింద నామాన్ని పలుగుతుంటే చూపులు బంగారు వాకిలి పై నిలిచాయి. సకలదేవతలు, మహర్షులు, యోగి పుంగవులు, అన్నమయ్య వెంగమాంబ వంటి మహాభక్తులు, రాజులు చక్రవర్తులు సమస్త ప్రాణికోటీ ఆ స్వామి దర్శనానికి వేచిచూసిన అదే వాకిలి గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి నేను ఎంత అదృష్టవంతుడినో కదా.. ఎంత పుణ్యం చేస్కుంటే ఈ మహద్భాగ్యం నాకు దక్కుతుందోకదా.. అని ఆలోచిస్తూ ఎప్పుడు ఆ మహద్వారం గుండా నా స్వామి దర్శనమౌతుందా అని తల ఎత్తి చూస్తూ ’గోవిందా.. గోవిందా..’ అని తన్మయత్వంగా పిలుస్తూ నడుస్తుంటే... క్యూ మలుపు తిరిగింది...
ఆహ్హ... అడుగో నా స్వామి... వజ్రకిరీటపు ధగధగలూ, తొడిగిన బంగారు ఆభరణాల తళుకులూ ఆ దివ్యమంగళ మూర్తి చిరునవ్వు వెలుగుల ముందు వెలతెలా పోతున్నాయ్ కదా... అవిగో నాస్వామి దుష్టశిక్షణకు శిష్టరక్షణకూ ఉపయోగించే శంఖు చక్రాలవిగో... అదిగో ఆ విశాలమైన హృదయముపైనే కదా లక్ష్మీదేవి విశ్రమించేది, అవునూ ఏదీ నా స్వామి వరద హస్తమేదీ? కౌస్తుభ మేదీ... అయ్యో ఇదేమి చిత్రం? ఎనిమిదడుగుల నిలువెత్తు స్వామి నిండువిగ్రహాన్ని దర్శించుకోనివ్వకుండా మొహం మాత్రమే కనిపించేలా లైట్లు పెట్టారా ? స్వామి పూర్తిగా నిండైన రూపంతో దర్శనమివ్వరా ? అయ్యో ఇదెక్కడి చోద్యమయ్యా ఇన్నినాళ్ళ తర్వాత నిన్ను చూద్దామని వస్తే దర్శనభాగ్యాన్ని కలిగించకపోతే ఎలా స్వామీ అని ఆలోచిస్తూ రెప్పలార్పి మళ్ళీ చూద్దునుకదా నా స్వామి నిండైన రూపంతో వరద హస్తంతో పద్మ పాదాలతో సహా దరిశనమిచ్చాడు. ఆ రూపాన్ని కనులనిండుగా నింపుకునేలోపు లిప్తలో మాయమయ్యాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా పులకింతకు గురైంది ఏదో తెలియని శక్తి ఆవహించినట్లై ఒక దివ్యమైన అనుభూతికి లోనయ్యాను.
అహా అక్కడున్నది రాతి విగ్రహం కాదు కోరిన వరాలిచ్చి పాపాలను ప్రక్షాళనగావించి మోక్షాన్నిప్రసాదించే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కదా. అందుకే అభిషేక సమయాన ఆ స్వామికి చెమటపడుతుంది, పుష్పాలంకరణ చేసే అర్చకులకు కఱకురాతి స్పర్శ కాక మృదువైన మనుషశరీర స్పర్శ అనుభూతిలోకొస్తుంది. ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా గోవిందా అని అనుకుంటూ ఇవతలకి వచ్చేశాను. శ్రీవారి పోటు వద్ద వకుళమాతను దర్శించుకుని ఆ పక్కన తీర్ధప్రసాదాలారగించి పరకామణిని మరోమారు ఆశ్చర్యంగా పరికించి చూసి విమాన వేంకటేశ్వరుని దర్శించుకుని భక్తితో మొక్కి, ఆ పక్కన ఉన్న హుండీలో శక్తికొద్ది సమర్పించుకుని ఆనందనిలయ ప్రాంగణం నుండి బయటికి వచ్చి అక్కడ ఇచ్చిన చిన్నలడ్డు ప్రసాదాన్ని స్వీకరించాను. శ్రీవారి దర్శనమై బయటికి రాగానే పక్కన రెండు స్టీలు హుండీలు పెట్టారు కానీ గుడి చుట్టి ప్రదక్షిణ చేసి విమాన వెంకటేశ్వరుని దర్శించుకున్నాక ఎప్పటినుండో ఉంటున్న ఖజానాకు సంబంధించిన హుండీ ఉంటుంది. సాధారణంగా స్వామికి సమర్పించుకునే మొక్కులు ఈ హుండీలోనే వేస్తారు.
అలా స్వామి దివ్యదర్శనాన్ని ముగించుకుని మనసులో ఆ రూపాన్ని మళ్ళి మళ్ళీ గుర్తు చేసుకుంటూ లడ్డూ ప్రసాదాల కౌంటర్ వైపు నడిచాను మిగిలిన వివరాలు మూడో టపాలో.
సోమవారం, జూన్ 04, 2012
శ్రీశ్రీనివాసం శిరసా నమామి - 1
సోమవారం, ఏప్రిల్ 23, 2012
దేవస్థానం సినిమా గురించి
“ప్రతి మనిషినీ కంటిపాపతో కాక పాపకంటితో సందర్శించాలి, ప్రతిమనిషిని ప్రేమించాలి ప్రపంచాన్ని ప్రేమించాలి. అపుడందరూ నీవాళ్ళవుతారు.”
“మనిషి మారడానికి గొప్ప గ్రంథాలు చదవక్కర్లేదు, పెద్ద సంఘటనలు జరగక్కర్లేదు. మంచి మనుషులు చెప్పే ఒక్క మంచి మాట చాలు”
"స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మాగాంధీ లేదా ఎక్కడినుండో ఈ దేశంవచ్చి ఎందరికో సేవ చేసి తరించిన మదర్ థెరిసా అంత ఘనంగా ప్రతి ఒక్కరు చేయలేకపోవచ్చు. చీమకు రెండు చక్కెరపలుకులు వాడిపోతున్న మొక్కకి రెండు నీటిచుక్కలు చల్లితే చాలు అదే ధన్యత."
“మనిషి జీవించినంతకాలం పరులకోసమే బ్రతకాలి”
“జననం ఎలా ఉన్నా జీవనం గొప్పగా ఉండాలి”
"జీవించి ఉన్న కాలంలో మనిషిచేసే మంచి పనుల పరిమళం మాత్రమే శాశ్వతం."
“అతనికి ఊరినిండా స్థలాలే.. పెళ్ళాంగుండెలో తప్ప.”
“ఎందుకు ఏడుపు? ఎవడు పోయాడటా??.. పక్కింటి వాడు ఎదిగి పోయాడట.”
శనివారం, ఫిబ్రవరి 25, 2012
ఇష్క్ సినిమా గురించి చిత్రమాలికలో
ఆదివారం, ఫిబ్రవరి 12, 2012
పదాలకు సరదా అర్ధాలు
దుర్గతి = దుర్గకి పట్టిన గతి
బీట్ రూట్ = బీటేసే రూటు
మేనత్త = మే నెల్లో పుట్టిన నత్త
--సొంతం సినిమా నుండి..
ఇంకా ఇలాంటి సరదా అర్ధాలు మీరు విన్నవీ అన్నవీ ఏమైనా ఉంటే చెప్పండి.. సరదాగా కలెక్ట్ చేద్దారి :-)
ఇంజనీర్ :: ఇంజన్లో నీరు పోసేవాడు
సైక్లోన్ :: సైకిల్ కొనడానికి తీసుకునే లోన్..
బాట్‌మేన్ :: బాట్ పట్టుకుతిరిగేటోడు...
భీరుడు :: బీరు తాగేటోడు
చందమామ :: చందాలు అడిగే మామ
సీతమ్మతల్లి :: సీత వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి.
సైలెన్స్ :: సైలు పెట్టుకునే లెన్స్.
భారతీయుడు :: భారతీ నువ్వు చెయ్యి. (భారతీ you do)
క్యాపిటలిస్టు :: క్యాప్ పెట్టుకునేవాడు
మార్క్సిస్ట్ :: మార్కులు వేసేవాడు
జీనియస్ :: జీన్స్ వేసుకున్న వాడు
లైట్ హౌస్ :: తేలికైన ఇల్లు
పంచ పాండవులు :: పంచె కట్టుకునే పాండవులు
డ్రాయర్ :: డ్రా చేసేవాడు
మార్క్సి(ర్క్స్+ఇ)స్ట్ :: మార్కులు ఇష్టపడి వాటికోసం కష్టపడేవాడు
మావోయిస్టులు :: మా ఆవుకి ఇష్టులు (కుమ్మడానికి)
షోలే :: (ఈరోజు) షో లేదు.
బ్లాగరు :: (వెబ్ లాగరు) - వెబ్బుని లాగే వాడు
ప్రసాదు :: ప్రభుత్వ.సారాయి.దుకాణం
వెదవ :: వెయ్యేళ్ళు దరిద్రంతో వర్ధిల్లు.
వెధవ :: వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లు
షేక్స్పియర్ :: షేకు S పీరు సాయెబ్బు గారు
సాంబార్ :: సాములోరి బార్
కుక్కరు :: కుక్క అరుపు
రాంబస్ :: రాము గాడి బస్సు
దోమ :: రెండు 'మ' లు
బెంగాలి :: బెంగ పెట్టుకున్న ఆలి
బిల్ గేట్స్ :: బిల్లు కట్టకుండా గేట్ దూకి పారిపోయే వాడు.
దూర దర్శన్ :: దర్శనానికి దూరంగా ఉండవలసినది.
బుక్‌మార్క్ :: బుక్ షాప్ మార్క్ గాడు
డయేరియా :: చచ్చే ఏరియా or చచ్చిన జనాల ఏరియా (స్మశానం)
సోదరా :: సోది ఆపరా :-)
వైఫ్ :: వైట్ బ్లఫ్ (అంటే white lies అంటారు కదా, అలా అన్న మాట :-))
దూర్వాసుడు :: దూరంనుంచే వాసనొచ్చేవాడు...(బహుశ కోపం వాసననుకోవచ్చేమో)
కాంతారావు :: కాంతా రావూ?
హర్ నాథ్ :: హర్ (ప్రతీ ఒక్క) నాథుడు
బ్లాగు :: బాబు లాగు
ముంతాజ్ :: తాజాగా ఉన్న ముంత
బ్లాగ్ ఫ్రెండ్స్ చెప్పిన లిస్ట్ :
హోమియోపతి :: హోమ్ లోనే ఉండే పతి
కులాసా :: కుమారుడి వల్ల లాసు
కవి :: కనపడదు వినపడదు
పంచ దార :: ఐదుగురి భార్య
శ్రీకాంత్ :: శ్రీ కి అంతం
పాణి గ్రహణం :: పాణి కి గ్రహణం పట్టడం
పల్లె టూరు :: పల్లెకు టూరు వెళ్ళడం
సైకాలజీ :: సైకిలు గురించి చెప్పే శాస్త్రం
శిశుపాలుడు :: శిశువులకి పాలిచ్చేవాడు
ప్రియానందభోజా :: ప్రియ పచ్చడితో ఆనందంగా భోజనం చేసే వాడు
ఎగ్జాం :: ఎగ్గ్+జాం
లేపాక్షి :: పాక్షికంగా లేచినది.
మెడల్ :: మేడలో వేసుకోనేది.
ఆల్జీబ్రా :: అన్ని జీబ్రాలు
శ్రీశ్రీ గారు చెప్పిన అర్ధం
నిర్మాత :: మాత లేనివాడు.
ఆదివారం, జనవరి 22, 2012
అమ్మ లేని మరో ఏడాది.
గడచిన ఈ మూడేళ్ళలోనూ ఏరోజుకారోజు రేపటికన్నా అలవాటౌతుందిలే అని అనుకుంటూ పడుకుంటానే కానీ ఇంతవరకూ ఏ ఒక్కరోజూ ఆ అమ్మలేని తనం ఇంకా నాకు అలవాటు కాలేదు... ఇక ఎప్పటికైనా అలవాటు అవుతుందన్న నమ్మకం కూడా రాను రాను సన్నగిల్లుతుంది. తను లేదన్న నిజం అప్పుడప్పుడు గుచ్చుకుంటున్నట్లుగా తెలిసే కొద్దీ కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉన్నాయి...

అమ్మ మమ్మల్ని వదిలివెళ్ళి నేటికి మూడేళ్ళు(జనవరి22, 2009) అయిన సంధర్భంగా "అమ్మా మేమిక్కడ నీ ఙ్ఞాపకాలతో నీవు నిర్దేశించిన మార్గంలో పయనిస్తూ సంతోషంగా ఉన్నాము.. నువ్వుకూడా ఏలోకాన ఉన్నా నీ ఆత్మకు సుఖశాంతులు చేకూరాలని మనసారా కోరుకుంటున్నాము" అని తనకు చెప్పాలని ఈ పోస్ట్.
ఆదివారం, జనవరి 15, 2012
సంక్రాంతి శుభాకాంక్షలు
ఆదివారం, జనవరి 01, 2012
నూతన సంవత్సర శుభాకాంక్షలు..
గింజా గింజా ఏరకుంటే కూత తీరదూ..
ఓ గురువా సోమరిగా ఉంటే ఎలా?
బద్దకమే ఈ జన్మకు వదిలి పోదా..?
గురకలలో నీ పరువే చెడును కద...
దుప్పటిలో నీ బతుకే చిక్కినదా?
సుందర.. సుందరా..
“తంతానొరేయ్..”
చాలు రా నిద్దరా..
“థూ..ఈ సారినిద్దర్లేపావంటే సంపేత్తానొరేయ్”
"అదుగో ఇందుకే నిన్ను ఆ కుంగ్ ఫూ సినిమాలు ఎక్కువ చూడద్దనేది ఇదివరకూ ఎంత స్వీట్ గా క్యూట్ గా ఉండేవాడివి ఇపుడేమో ఇలా రౌడీలా తయారయ్యావ్..."
"సరే సరే లే ఇక సాగింది చాలు గానీ ఇంద ఈ కేక్ తినేసి మన ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేసి బయల్దేరితే నేను నా పని చూసుకుంటా.."
"ఏంటో బాసు బొత్తిగా అలవాటై పోయింది నీ బ్లాగ్ వదిలి వెళ్ళాలనిపించడంలేదు పోనీ నీకు అడ్డం రాకుండా అప్పుడప్పుడూ అవసరమైతే సాయం చేస్తూ ఇక్కడే ఓపక్కన తిరుగుతూ ఉండనా.. ఎంతైనా మనం మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా నీ బ్లాగ్ ఫ్రెండ్స్ అందరికీ నన్ను కూడా పరిచయం చేయ్..."
"హ్మ్ సరే రోజూ వచ్చి నిన్ను చూస్కోడం నాకు కూడా అలవాటైపోయింది నువ్ లేకపోతే వెలితిగానే ఉంటుందేమో. సో అలా సైడ్ బార్ లో ఓ పక్కన తిష్టవేసేయ్ కానీ మళ్ళీ బద్దకమంటూ నిద్రొస్తుందంటూ నాకు అడ్డం రాకూడదు సరేనా.."
"అలాగే గురూ నేను అస్సలు అడ్డంరాను నువ్వు హాయిగా కబుర్లు చెప్పుకో" (మనసులో:హు! వీడి బద్దకానికి నిద్రకీ నన్ను బాధ్యుడిని చేస్తున్నాడు.. దొంగమొహం..)
"నేస్తాలూ కొంచెం దగ్గిరగా రండి మా బాసు వినకుండా మీకో విషయం చెప్పాలి.. ఈ రోజు నుండీ ఈ బ్లాగ్ వాడు మళ్ళీ మీకు సుత్తేయడం మొదలు పెడతాడుట, మా గురువుగారు శ్రీశ్రీ బుడుగు గారు ఆర్డర్ వేస్తే సర్లేకదా అని పాపం ఇన్ని రోజులూ ఏదో ఒకలా మిమ్మల్ని నేను రష్చించేశాను ఇకపై మీకు భరించక తప్పదు... నేను కూడా ఆ పక్కనే ఉండి మనవాడ్ని కాస్త అదుపులో పెడతాలెండి."
అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ప్రతిరోజూ ప్రతిక్షణం అవధులులేని ఆనందం మీ సొంతమవాలని కోరుకుంటున్నాను...
నేను ???

- వేణూశ్రీకాంత్
- అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.