సోమవారం, అక్టోబర్ 29, 2012

శుభసంకల్పం-ఈనాడు కథ

నిన్న(అక్టోబర్-28-2012) ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైన సి.ఎన్.చంద్రశేఖర్ గారి “శుభ సంకల్పం” కథ నాకు నచ్చింది. కథనం, శిల్పం, అలంకారం వగైరాలు నాకు తెలియవు కనుక వాటి గురించి నేను వ్యాఖ్యానించే సాహసం చేయలేను. ఒక సామాన్య పాఠకుడిగా చదివినపుడు కథలో ఇన్వాల్వ్ అయి చదివగలిగాను, ముఖ్యంగా కథలో చెప్పాలనుకున్న విషయం నన్ను ఆకట్టుకుంది. ఈకాలం కుర్రకారుకి కొంచెం ప్రీచింగ్ స్టోరీలాగా అనిపించవచ్చు కానీ కొన్ని పనులు చేసేముందు నిర్ణయాలు తీసుకునేముందు దుందుడుకుగా కాక జాగ్రత్తగా ఆలోచించి చేయమని చెప్పడం
నచ్చింది. విప్లవాత్మక భావాలకు విపరీత ధోరణులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించమని చెప్పినతీరు బాగుంది. సాధన రమణిలమద్య సంభాషణలు బాగున్నాయ్. కుదిరితే ఈ కథను ఈ కాలం కుర్రకారు ప్రతిఒక్కరి చేతా చదివించాలనిపించింది, అది కుదిరినా లేకపోయినా నా బ్లాగ్ మిత్రులతోనైనా చదివించాలని ఇలా పోస్ట్ చేస్తున్నాను :-)

కథలోని చలపతిలాంటి వాళ్ళకు సమాజంలో కొదవలేదు, ఎవరికి ఎపుడు ఎలాంటి కబుర్లు చెప్పి ఎలా బుట్టలో వేసుకోవాలో క్షుణ్ణంగా తెలిసినవాళ్ళు చాలామందే ఉంటారు. అలాంటి అబ్బాయిలనేకాదు పర్సెంటేజ్ తక్కువవచ్చు కానీ అమ్మాయిలు కూడా ఉంటారు. కథలో డీల్ చేసిన ముఖ్యాంశం శారీరక అవసరమే కానీ ఒక్కొక్కరి అవసరాలు ఒక్కొక్కరకంగా ఉండవచ్చు, శారీరక, ఆర్ధిక, మానసిక అవసరాలకోసం కొంతకాలం పబ్బం గడుపుకోవాలని చూసేవాళ్ళు మీకు ఎక్కడో అక్కడ ఎదురవుతూనే ఉంటారు. కొందరు కొద్దిపరిచయంతోనే సరదాకోసమో టైంపాస్ కోసమో బుజ్జీ బంగారం అంటూ మురిపెంగా కబుర్లు చెప్పి పాతబడగానే మరో బంగారాన్ని వెతుక్కుంటూ వెళ్ళవచ్చు. ఫేస్బుక్ లాంటి చోట్ల కేవలం నా ఫ్రెండ్స్ లిస్ట్ ఇంత అని చూపించుకోవడానికే స్నేహాలు చేస్తుండవచ్చు. ఇది నేను ఒకటి రెండు సంఘటనలు చూసి చెప్తున్నది కాదు, ఈమెయిల్ తో మొదలుకొని దదాపు పుష్కరకాలం ఇంటర్నెట్ ప్రపంచాన్ని విస్తృతంగా ఉపయోగించిన అనుభవంతో చెప్తున్నాను.

ఒకప్పుడంటే కాలేజ్, ఇల్లు, ఆఫీస్ ఇలా మనకి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశమున్న పరిధి పరిమితంగా ఉండేది. కానీ ఇపుడు ఇంటర్నెట్ తో హద్దులులేని సోషల్ నెట్వర్కింగ్ తో ఆ పరిధి విస్తృతమైంది, ఒక కంప్యూటర్ ఉంటే చాలు ప్రపంచంలో ఏమూల ఉన్న వ్యక్తితో అయినా మనం స్నేహం చేయగలం, అ అవతలి వ్యక్తి హిడెన్ ఎజెండాని మనం సరిగా అంచనా వేయలేక పోవచ్చు. అందుకే ఈకాలంలో మరింత జాగ్రత్త వహించవలసిన ఆవశ్యకత ఉంది, ఇలా అణుక్షణం అనుమానిస్తూ బ్రతకడం దుర్బరంగానే అనిపించవచ్చు కానీ ఇలా ఎప్పటికపుడు చెక్ పాయింట్స్ పెట్టుకుని, అవతలి వారి ప్రవర్తనని గమనిస్తూ క్రాస్ వెరిఫై చేస్తూ అప్రమత్తంగా ఉండడం వల్ల అనవసర తలనొప్పులనుండి దూరంగా ఉండవచ్చు ముఖ్యంగా సున్నిత మనస్కులు ఖచ్చితంగా చాలా లాభపడతారు. సరేలెండి కథకన్నా నా ప్రీచింగ్ ఎక్కువవుతుంది ఇక ఆపేస్తాను :-)
  
ఇవన్నీ చెప్పానని ఈ కథ ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ గురించనుకుంటే మీరు పొరబడినట్లేనండోయ్, ఏదో సంధర్బం వచ్చిందని చెప్పాను అంతే. సరే ఇంకా కబుర్లెందుకు ఈ కథ ఈనాడు వెబ్ సైట్ లో ఇక్కడ క్లిక్ చేసి చదవచ్చు. కాకపోతే ఈ లింక్ ఒక వారం మాత్రమే అంటే వచ్చే శనివారం(నవంబర్-3-2012) వరకూ మాత్రమే పని చేస్తుంది కనుక ఇ-పేపర్ నుండి సేవ్ చేసిన ఇమేజెస్ ఇక్కడ ఇస్తున్నాను తప్పక చదవండి... చదివించండి.
మొదటి పుట

రెండవ పుట

చివరి పుట

6 కామెంట్‌లు:

  1. బాగుందండీ..
    కధలో విషయం నచ్చింది. దానికన్నా ముందు మీరు రాసిన ఇంట్రడక్షన్ ఇంకా నచ్చింది.

    రిప్లయితొలగించండి
  2. హ్మ్మ్.. చిన్న కథ కాబట్టి dramatic గా చుట్టేసినట్టు అనిపించినా మీరు ప్రస్తావించిన విషయం మాత్రం నిజం. ఏంటో.. ఎన్ని సూక్తులూ, క్లాసులూ చెప్పినా సరే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనిషి మనసు కోతి లాంటిది.. ఎవరింట్లో కోతిని వాళ్ళే కట్టడి చెయ్యాలి మరి.. అదంతా సులువైన పని కాదుగా.. :))

    రిప్లయితొలగించండి
  3. నాక్కూడా కధ కంటే మీ పరిచయమే బావుంది, వేణూ.. మధుర చెప్పిన విషయం ఇంకా బాగా నచ్చింది, ఎవరింటి కోతిని వాళ్ళే అతి జాగ్రత్తగా కట్టడి చేయాలి :-)

    రిప్లయితొలగించండి
  4. కధ,పరిచయం రెండూ బావున్నాయ్.సాధన,రమణిల వాదోపవాదాలు బావున్నాయి.మనింటి కోతి ప్రేమ మత్తులో ఎవరెన్ని చెప్పిన వినదు. వినేలోపల చేతులుకాలిపోతాయి.

    రిప్లయితొలగించండి
  5. రాజ్ కుమార్, మధుర, నిషి, అజ్ఞాత గారు వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

    అసలు చిత్రమైన విషయమెంటంటే మధురా& నిషి అసలు మనింట్లో కోతి ఉందని గుర్తించడానికే చాలా మంది ఇష్టపడరు. ఆ ఇంపల్స్ అలాంటిది ఆమత్తులో ఎవరికి వారు తాము అనుకునేదే/చేసేదే కరెక్ట్ అనే ఊహలో బతికేస్తుంటారు. ఇక కట్టేసే ప్రస్తావన ఎక్కడినుండి వస్తుంది. ప్రాక్టికల్ గా ఆలోచించగల వాళ్ళు మాయమాటలని గుర్తించగలిగే వాళ్ళు అరుదు.

    అజ్ఞాత గారు మీరన్నది కరెక్టే వినేలోపల చేతులుకాలతాయి కానీ సరిదిద్దుకోడానికి ఆలశ్యమనేది ఉండదు ఎలాంటి టైములోనయినా సరే తెలుసుకున్నాక వీలైనంత త్వరగా బయటపడడానికి ప్రయత్నించాలండీ. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నారు కదా. కాకపోతే అది చాలా పరామీటర్స్ పై ఆధారపడి ఉంటుందనుకోండి.

    రిప్లయితొలగించండి
  6. ee katha inthamunde chadivina inko sari mee valla chadiva galiganu .. nice post.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.