బుధవారం, అక్టోబర్ 17, 2012

బ్రదర్స్-లెంత్ తో బెదుర్స్

ఏదైనా ఒక సినిమా మనకి విపరీతంగా నచ్చడం ఆ సినిమా దర్శకుడికి హీరోకి ఒక రకంగా శాపమనే చెప్పచ్చు. “రంగం” లాంటి సినిమా తీసిన దర్శకుడు కె.వి.ఆనంద్ నుండి ఎప్పుడు అంతటి ప్రత్యేకత ఉన్న సినిమాలు, ప్రతి సినిమాకి అలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేనే ఆశించడం మన తప్పేనని నిరూపిస్తూ మనల్ని పూర్తిగా నిరాశ పరిచే సినిమా అతని కొత్త సినిమా ’బ్రదర్స్’.

అతని గత చిత్రం “రంగం”లా ఉండకూడదని కావాలనే ఇలా రాసుకున్నారేమో తెలియదు కానీ అదే పద్దతిలో స్క్రీన్ ప్లే రాసుకుని, ఫైట్స్ పాటలు తగ్గించడం ద్వారా సినిమా నిడివిని ఒక అరగంట పాటు తగ్గించగలిగి ఉంటే ఈ సినిమా మరింతగా ఆకట్టుకునేది. రెండు గంటల సినిమాలకి అలవాటుపడుతున్న ఈ రోజుల్లో ఇంచుమించు మూడుగంటలు అదీ బోరింగ్ ఫైట్స్ సన్నివేశాలతో సాగదీయడం విసిగిస్తుంది. కథని ఎన్నుకోడంలో చూపిన శ్రద్దని కథనంలో కూడా పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి ఆలోచించకుండా ఉంటే బాగుండేది.
మనుషులను తన ప్రయోగశాలలోని ఎలుకలతో సమానంగా చూస్తూ వాళ్ళ ప్రాణానికి ఏమాత్రం విలువ ఇవ్వక సొంత భార్యపై సైతం ప్రయోగాలు చేయగల ఒక జీనియస్ జెనెటిక్స్ సైంటిస్ట్(సచిన్ ఖడేఖర్) కథే ఈ సినిమా. ఆ సైంటిస్ట్ తన భార్యపై చేసిన ప్రయోగం వికటించి ఆమెకి కంజాయింట్ ట్విన్స్(సూర్య&సూర్య) పుడతారు. వాళ్ళ చిన్నతనంలో తన రీసెర్చ్ కి తగిన గుర్తింపు దొరకక అందరూ ఎద్దేవా చేస్తున్నారన్న బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకునే సమయంలో భార్య నగలు పెట్టుబడిగా పెట్టి ఎనర్జియాన్ అనే పిల్లల ఎనర్జీ డ్రింక్ తయారుచేసే కంపెనీ మొదలు పెడతాడు. పిల్లలకు అసాధారణమైన శక్తిని అందించే ఆ డ్రింక్ ఫార్ములా ఏంటి అని కనుగొనడానికి దేశ విదేశాల నుండి కుట్రలు మొదలవుతాయి. ఆ కంపెనీ చుట్టూ జరిగిన వివిధ సంఘటనల నేపధ్యంలో ఆ ట్విన్స్ జీవితాలు వారికుటుంబం అంతా ఎలా అల్లకల్లోలానికి గురయ్యింది, అసలా ఫార్ములా వెనుక రహస్యమేమిటి అనేది మిగిలిన కథ.

కథ తర్వాత కాస్త మెచ్చుకోదగినది సనిమాటోగ్రఫీ, పాటలలో కూడా భరించగలిగేది అదొక్కటే. ఒకటి అరా పాటలు మాంచి థియేటర్ లో చూసినపుడు ఆ సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ వల్ల కొంచెం భరించగలం మిగిలిన పాటల్లో అది కూడా ఉండదు. సూర్య నటన బాగుంది రెండు పాత్రలమధ్య వేరియేషన్ చాలా బాగా చూపించాడు. మూడు గంటల సినిమా ఐతే సేఫ్ గా వదిలేయచ్చు కానీ థియేటర్లో అరగంట పాటు కట్ చేశారని విన్నాను అలా రెండున్నరగంటల సినిమా మాత్రమే అయితే కనుక వైవిధ్యమైన కథ కోసం ఒక సారి చూడచ్చు. లేదంటే డివిడి వచ్చాక చక్కగా పాటలు ఫైట్లు ఫార్వార్డ్ చేస్కుంటూ చూడడం అన్నిటికన్నా సేఫ్.

7 కామెంట్‌లు:

  1. ఏంటండి ఇంత పాలిష్డ్ గా రాశారు? ఇది నమ్మి ఎవరైనా సినిమా చూసొస్తే వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. :)

    రిప్లయితొలగించండి
  2. హహహహ రవి గారు ఉసురు తగులుద్దంటారా :-) నాకు లెంత్ ఫైట్స్ తప్ప మరీ అంత ఘోరంగా ఏమీ అనిపించలేదండీ... అస్సలు భరించలేనంత ఘోరమేమీ కాదు. స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం జాగ్రత్తపడి ఉంటే అంటే విలన్ ఎవరో ముందే మనకి చెప్పకుండా మరికొంచెం జాగ్రత్తగా రాస్కుని ఉంటే సినిమా మరింత బాగుండేది.

    రిప్లయితొలగించండి
  3. కొంచెం తగ్గించారు.ఇప్పుడు చూడొచ్చు

    రిప్లయితొలగించండి
  4. కెవ్వ్!
    ఇప్పుడు సినిమా లో ముప్పై నిమిషాలు తగ్గించారు అని ఈరోజు పేపర్ లో వేసాడు ఎలా ఉంటుందో మరి
    రవి గారు ప్లస్ లో రివ్యూ రాసినప్పుడే సినిమా చూసేయాల్సింది ఇప్పుడు చూస్తే రెబల్ ఆత్మ క్షోభిస్తుంది :))

    కే.వి.ఆనంద్ రాబోయే సినిమా ఎలా ఉంటుందో చూడడమే బెటర్

    రిప్లయితొలగించండి
  5. ఒకప్పుడు ఏం సినిమాలో చూడాలో అర్ధం కాక చాలా తికమకగా ఉండేది. మీ సమీక్షల మూలంగా ఆ బాధ తీరిపోయింది. థాంక్యు వేణు గారు.

    రిప్లయితొలగించండి
  6. @ జ్యోతిర్మయి: సమీక్షలు చూసి సినిమా కి వెళ్తే అంతే సంగతులు!!!! సమీక్ష రాసే వాళ్ళ అభిప్రాయాలూ అవి అంతే.... , మనకి నచ్చవచ్చు, నచ్చక పోవచ్చు...

    రిప్లయితొలగించండి
  7. శశిగారు థాంక్స్ అదే అనుకుంటున్నానండీ :)

    ధాంక్స్ హరే మనలాంటి కరడుగట్టిన ;) సినీ ప్రేక్షకులు కూడా చూడ్డానికి భయపడితే ఎలా ధైర్యం చేసేయడమే :-)

    జ్యోతిర్మయి గారు థాంక్సండీ.. నా సమీక్షలని అన్నిసార్లు నమ్ముకోకండిలే నాకోసారి కొన్ని చిత్రమైన సినిమాలు కూడా నచ్చుతాయి, కొన్ని హిట్ సినిమాలు కూడా ఒకోసారి నాకు నచ్చవు :)

    కరెక్ట్ వంశీకృష్ణ గారు బాగా చెప్పారు. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.