సోమవారం, అక్టోబర్ 08, 2012

అవును !!!

కామం ప్రధానాంశంగా కల చిత్రాలను ఎంత బాగా తెరకెక్కించినా ఆస్వాదించడంలో ఎప్పుడూ ఓ చిన్న ఇబ్బంది ఉంటునే ఉంటుంది. ఆ ఇబ్బందే అరుంధతిలాంటి సినిమాలను సైతం మనల్ని ఎంకరేజ్ చేయనివ్వదు. ఈ సినిమాలోని ప్రధానాంశం కూడా అదే కనుక కుటుంబంతో చూడడానికి ఇబ్బంది పడచ్చు, పద్దెనిమిదేళ్ళలోపు పిల్లలను ఈ సినిమానుండి దూరంగా ఉంచడమే బెటర్. సబ్జెక్ట్ పై ఎంత అయిష్టత ఉన్నా ఇలాంటి వ్యక్తులకు సమాజంలో కొదవలేదు కనుక ఆ విషయాన్ని అంగీకరించి సినిమా చూస్తే 45లక్షల లోబడ్జెట్ తో క్వాలిటీ చిత్రం తీసినందుకుగానూ, టేకింగ్ విషయమై మంచిప్రయత్నంగా దర్శకుడిని అభినందించవచ్చు.

టైటిల్స్ లోని సృజనాత్మకత ఖచ్చితంగా ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఆర్ట్ డైరెక్షన్ (ఇల్లు, ఇంటీరియర్, కలరింగ్ స్కీం, లైట్స్), సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం సినిమాను చాలా ఎలివేట్ చేశాయి. పాటలు లేకుండా రెండుగంటలు తీయడం వల్ల అక్కడక్కడ కథ ముందుకు జరగడంలేదు, భయపెట్టే సంఘటనలు రాడంలేదు ఏం జరుగుతుంది అని కొంచెం అసహనానికి గురి అవుతాం. విక్కి పాత్రలో నటించిన చిన్నపిల్లాడిని ఎక్కడినుండి తెచ్చాడోగానీ నాకు భలే నచ్చాడు, వాడూ వాళ్ల తాతగారికి సంబందించిన త్రెడ్ నాకు నచ్చింది. అంతర్జాతీయ చిత్రాలు చూసే అలవాటున్న ప్రేక్షకులకు ఈ చిత్రంలోని కొన్ని ప్రధాన సన్నివేశాలలో కొత్తదనం లోపించి అంతగా అలరించకపోవచ్చు. కథలో కొత్తదనం లేకున్నా కథనంతో టేకింగ్ తో రవిబాబు పాస్ మార్కులేయించుకుంటాడు.

ఈ చిత్రం పిచ్చిజుట్టు, కరిగించిన మైనం, ఎర్ర రంగులతో జుగుప్స కలిగించేలా మేకప్ వేసిన దెయ్యాన్ని చూపించి భయపెట్టే హార్రర్ సినిమా కాదు. కనపడని దెయ్యాన్ని చూపిస్తూ భయపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్. ఈ ఇన్విజిబుల్ విలన్ సీన్స్ కి భయపడాలంటే ఆయా సన్నివేశాల్లో సందర్భాలలో మనల్ని ఊహించుకొంటే భయమేయచ్చు కానీ ఈ ఇన్విజిబుల్ కాన్సెప్ట్ ప్రేమికుడు సినిమా నుండి సబ్బుల అడ్వర్టైజ్మెంట్స్ లో సైతం బాగా అరగదీసినదే కనుక ఆయా సన్నివేశాల్లో నవ్వు వచ్చే అవకాశాలూ లేకపోలేదు.

కథ విషయానికి వస్తే... మోహిని (పూర్ణ) కొత్తగా పెళ్ళిచేసుకుని భర్త రాణ(హర్షవర్ధన్ రాణ) తో హైదరాబాద్ సిటీకి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక అధునాతనమైన విల్లాలోకి కాపురానికి వస్తుంది. ఆ గేటెడ్ కమ్యునిటీ కొత్తగా కట్టినది వంద విల్లాలున్న దానిలో కేవలం మూడు కాపురాలే ఉంటుంటాయి. మోహిని వాళ్ల ఇంటికి ఎదురు ఇంట్లో రాణా కొలీగ్ కాపురముంటుంటాడు, అతని కొడుకు విక్కీకి కొద్దిరోజులుగా చనిపోయిన అతని తాతగారు కనిపిస్తున్నాడని చెప్తూ తాత గారితో ఆటలు ఆడుకుంటూ ఉంటాడు. ఓరోజు మోహిని ఇంటికి డిన్నర్ కి వచ్చిన విక్కీ ఆ ఇంట్లో కెప్టెన్ రాజుతో మాట్లాడానని చెప్తాడు. మోహినికి ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గరనుండి కేవలం తనకి మాత్రమే ఆల్కహాల్ వాసన వస్తూ ఉంటుంది. ఇక  అక్కడనుండి మోహిని జీవితంలో మూడు రోజులపాటు జరిగిన సంఘటనల సమాహారమే “అవును” చిత్రం.

ఇకముందు రాయబోయే విషయాలు చదివితే సినిమాలో ఉన్న థ్రిల్ మిస్సయ్యే అవకాశం ఉంది కనుక సినిమా చూడాలనుకున్నవాళ్ళు ఇకపై చదవకండి.

రవిబాబు హాలీఉడ్ చిత్రాలనుండి సీన్స్ నుండి బాగా ప్రేరణపొంది సినిమాలు తీస్తుంటాడనడంలో ఏమాత్రం సందేహంలేదు కానీ ఆ కాపీనో ప్రేరణనో తాను చెప్పాలన్న కథకు అణుగుణంగా వాడుకోవడంలోనే అతని ప్రతిభ అంతా తెలుస్తుంది. ఈ సినిమా సైతం కొన్ని హాలీఉడ్ చిత్రాలను గుర్తుచేస్తుంది. కొన్ని సీన్స్ లో లాజిక్ మిస్ అయినా భయపెట్టగలిగాడు సినిమా చూసినపుడు వెన్నులో వణుకు పుట్టించడానికి సినిమాటోగ్రఫీకి తోడు నేపధ్య సంగీతాన్ని చాలాచక్కగా వినియోగించుకున్నాడు. ఇక చిత్రంలో విలన్ కనిపించడు కనుక అతని ప్రజన్స్ ని చూపించడానికి గదిలో మనుషులు(ఆత్మలు) ఉన్నపుడు మాత్రమే వెలిగే ఆటోమాటిక్ లైట్స్ ను మనిషి దగ్గరకు వచ్చినపుడు తెరచుకునే డస్ట్ బిన్ ను బాగా ఉపయోగించుకున్నాడు. ఒక సాధారణ దెయ్యానికి వస్తువులను కదిలించగల శక్తులు ఎలా వచ్చాయో లాజిక్ కు అందదు అలాగే పెద్ద పెద్ద అల్మారాలను టేబుళ్ళను కదిలించి హీరోయిన్ ని ముట్టుకుని తడమగలిగిన దెయ్యానికి కోరిక తీర్చుకోడానికి మాత్రం మనిషి శరీరం ఎందుకో అర్ధం కాదు, దీనికి ఏదో వివరణ ఇచ్చాడు కానీ నేనంగీకరించలేకపోయాను.

భార్గవి కొడుకు విక్కీ పాత్రకి ఆత్మలు కనిపించడాన్ని యోగాలో చెప్పే నాడీవ్యవస్థలోని సహస్రార చక్రం తో కలిపి ఒక చైల్డ్ సైకాలజిస్ట్ వివరించిన పద్దతి నాకు చాలా నచ్చింది. అలాగే విక్కీ తాతగారు అసలు ఎందుకు వాళ్ళ ఇంటికి మళ్ళీవచ్చారు అనేది, విక్కీవాళ్ళనాన్న వాడికి వాళ్ళ తాతగారు నిజ్జంగా కనిపిస్తున్నారని కన్విన్స్ అయే సీన్ నాకు బాగా నచ్చింది. ఒకోసారి ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య సమస్యలని పిల్లలు తమ బిజీ స్కేడ్యూల్ లో మునిగి ఉండి చిన్నవనుకుని ఎలా తేలికగా తీస్కుంటున్నారో ఆ నిర్లక్ష్యం పర్యవసానాలెలా ఉంటున్నాయో చక్కగా చూపించాడు. ఆపాయింట్ మన మనసులను స్పృశిస్తుంది.

సినిమా మొదట్లో రవిబాబు పోలీస్ గెటప్ లో కనిపిస్తాడు కానీ కాస్త పరిశీలించి చూస్తే ఖాకీ డ్రెస్ మాత్రమే వేస్కున్నాడు తప్ప గెటప్ పూర్తిగా పోలీస్ డ్రస్ కాదని గుర్తించవచ్చు. ఇలా క్లూలు ఇస్తూ చిన్నచిన్న విషయాలను కూడా వదలకుండా అన్నివివరిస్తూ ప్రతి అంశాన్ని ఉపయోగించుకుని రవిబాబు స్క్రీన్ ప్లే రాసుకున్న తీరు నాకు బాగానచ్చింది. నటీనటులలో పూర్ణ పర్ఫెక్ట్ కాస్టింగ్ తన పెద్ద కళ్ళు, నటన expressions ఈ చిత్రానికి చాలా ప్లస్ అయ్యాయి అన్ని భావాలని  బాగా పలికించింది, అలాగే స్తబ్దుగా ఉన్న ఓ కామాంధుడిని రెచ్చగొట్టగల శరీర సౌష్టవం తనసొంతం. తన మొహం దూరం నుండి చూస్తే కొన్నిసార్లు శ్రేయని కొన్ని క్లోజప్ expressions జెనీలియాని తలపించాయి. తన తర్వాత విక్కీగా చేసిన పిల్లాడు నాకు బాగా నచ్చాడు, రాణా, భార్గవి, చలపతిరావు, రాజేశ్వరి ఇంకా మిగిలిన పాత్రధారులంతా తమ తమ పరిధిలో బాగా చేశారు.

సాధారణంగా దెయ్యం సినిమాలనగానే చీకటి, విపరీతమైన కెమేరా కదలికలు, ట్రాలీలతో పాత్రల చుట్టూ కెమేరాని తిప్పేస్తూ మొహం మీదకి జూం చేసేస్తూ ప్రేక్షకుడిని కన్ఫూజ్ చేసి భయపెట్టడానికి ముప్పాతిక వంతు హార్రర్ సినిమాలు ప్రయత్నిస్తుంటాయి అయితే రవిబాబు ఈ సినిమా సినిమాటోగ్రఫీకి పూర్తి వెలుతురు, ఇంకా స్టడీ కెమేరా ఉపయోగించాడు. ట్రాలీ షాట్స్, జూంలు, క్రేన్ షాట్స్ లాంటివేమీ ఉండవు ప్రతి సీన్ లోనూ  కెమేరాని ఒక చోట కదలకుండా ఫిక్స్ చేసి మనమే ఆ ఇంట్లో అక్కడనుంచుని చూస్తున్నట్లుగా అనిపించేలా షూట్ చేశాడు. అలాగని సినిమా అంతా ఒక నాటకం చూస్తున్నట్లనిపించదు. భిన్నమైన కెమేరా యాంగిల్స్ ఎన్నుకోవడం ద్వారా అసలిలా స్టడీ కెమేరా ఉపయోగించినట్లు టెక్నిక్ గురించి తెలిసినవారికి తప్ప సగటు ప్రేక్షకులు గుర్తించలేనట్లుగా బాగా తీశాడు. ఇంకా మనమే స్క్రీన్ మీద ఏ మూల ఏం జరుగుతుందో అన్నటెన్షన్ తో వెతుక్కునేలా చేశాడని చెప్పచ్చు. సినిమా క్లైమాక్స్ గురించి ఇన్ కంక్లూజివ్ గా తీశాడని విమర్శలొచ్చాయి కానీ నాకు ఈ క్లైమాక్స్ బాగా నచ్చింది, ఇలాంటి కథలకి ఇదే సరైన క్లైమాక్స్ అనిపించింది.  

మొత్తంమీద హాలీఉడ్ చిత్రాలతో పెద్దగా పరిచయం లేనివారిని ఈ చిత్రం చాలా ఆకట్టుకుంటుంది అలాగే రవిబాబు మొదటినుండి చెప్తున్నట్లుగానే సినిమా చూస్తున్నపుడు భయపడినదానికన్నా సినిమా చూసి వచ్చాక పట్టపగలు కూడా ఒంటరిగా ఇంట్లో ఉన్నపుడు ఈ సినిమా గుర్తొస్తే ప్రతి చిన్న శబ్దానికి కదలికకి భయపడే ఆవకాశాలున్నాయి. “అవును” థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులు తప్పక చూడవలసిన చిత్రం.

18 కామెంట్‌లు:

 1. బావుంది వేణు...

  అరుంధతి లాంటి మూవికే సీట్ లో ఉండాల్సిన మా అమ్మాయి నా వొళ్ళో అనే కన్నా దాదాపుగా నా భుజాలు ఎక్కి తొక్కినంత పని చేసింది... అయితే ఈ సినిమా కి వెళ్తే నన్ను ఎక్కి, తొక్కి నార తీస్తుందేమో??

  రిప్లయితొలగించు
 2. Thanks Sree, హహహ ఈ సినిమా చూసినపుడుకన్నా ఇంటికొచ్చిన తర్వాత ఎక్కువ అల్లాడిస్తారు పిల్లలు :) ఐనా ఈ సినిమా పిల్లలకి చూపించద్దులే.

  రిప్లయితొలగించు
 3. చాలా బావుందన్నారు కానీ భయం వేస్తుందని వెళ్లలేదండి..:(

  రిప్లయితొలగించు
 4. కథ కన్నా అతను తీసిన విధానమే నచ్చింది నాకు. క్లైమాక్స్ గురించి మీ అభిప్రాయమే నాదీను.

  రిప్లయితొలగించు
 5. ధన్యవాదాలు తృష్ణగారు, డిఫరెంట్ గా తీశాడండీ అలా అని సగటు దెయ్యాల సినిమాల్లోలా భయంవేయదు. టీవీలో వచ్చినపుడు చూసేయండిలే అపుడైతే ఛానల్ మార్చేసుకోవచ్చు :)

  శిశిర గారు ధన్యవాదాలండీ. నిజమే రవిబాబు మేకింగ్ కోసమే చూడాలి ఈ సినిమా.

  రిప్లయితొలగించు
 6. మీరు యెంత వ్రాసినా మేము దెయ్యం సినిమాలు చూడము :(

  రిప్లయితొలగించు
 7. హహహహ శశిగారు అలాగే చూడద్దులెండి :) Thanks for the comment.

  రిప్లయితొలగించు
 8. బాగుందన్నమాట సినిమా! హేవిటొ, శిశిర మాటలకి భయపడిపోయాను:) మీరు ఇంత బాగ చెప్పాక తప్పకుండా చూడాలనిపిస్తుంది. కళ్ళు మూసుకొని చూసేసి వొస్తాను.

  రిప్లయితొలగించు
 9. నిజంగానే చాలా బాగుంది సినిమా..మీ రివ్యూ కూడా..ముఖ్యంగా sound effects తోనే భయం వేస్తుంది...:)

  రిప్లయితొలగించు
 10. ధన్యవాదాలు జయగారు :-) హహహ కళ్ళుమూసుకుని చూసి వస్తారా ఈ ఐడియా బాగుందండీ కానీ శేఖర్ చంద్ర నేపధ్య సంగీతమే సగం బయపెడుతుంది సో చెవులు మూసుకుని చూసేయండి :-))

  ధన్యవాదాలు ధాత్రిగారు, అవునండీ శేఖర్ చంద్ర రీరికార్డింగ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ సినిమాకి.

  రిప్లయితొలగించు
 11. జంపు సీన్ల తొ జనాలని భయపెట్టడం చీప్ ట్రిక్. కంటెంట్ భయపెట్టాలి. సినిమా చూసినప్పుడే కాదు తరువాత గుర్తుకు తెచ్చుకుని భయపడాలి. అలాంటి మరొక సినిమా 13B . రివ్యూ బాగుంది. తప్పక చూస్తాను.

  రిప్లయితొలగించు
 12. Nice post Venu!
  నేనెలాగూ హర్రర్ సినిమాలు చూడను కాబట్టి.. ఎంచక్కా మీ రివ్యూ మొత్తం చదివేసాను.. :D
  ఆ ఏనుగు పోస్టర్ భలే ఉంది కదా.. ఇలాంటివాటిల్లో రవిబాబు క్రియేటివిటీని మెచ్చుకోవాలనిపిస్తుంది. మీరు పెట్టిన ఫోటోలలో వాళ్ళ బట్టలు, ఇంట్లో (కిచెన్) రంగులు.. అవన్నీ గమనించారా.. రవిబాబుకి ఈ కలర్ స్కీం బాగా ఇష్టం అనుకుంటా.. 'నచ్చావులే..' సినిమా కూడా దాదాపు ప్రతీ ఫ్రేమూ ఈ రంగులోనే ఉంటుంది..
  హీరోయిన్ ఎవరో గానీ బావున్నట్టుంది.. ఇదివరకు ఎక్కడైనా కనిపించిందా ఈ అమ్మాయి?

  రిప్లయితొలగించు
 13. థాంక్స్ మధురా.. హా నాక్కూడా ఆ ఏనుగు పోస్టర్ చాలా నచ్చింది. కానీ మనవాళ్ళు గూగుల్ అంతా వెతికేసి ఏదో ఫారెన్ యాడ్ ఫిల్మ్ లో ఉపయోగించిన పోస్టర్ అని తేల్చేశారు. రవిబాబు అదే ఉపయోగించాడో సొంత క్రియేటివిటీనో తెలీదు. అవును ఇలాంటి లైట్ కలర్ స్కీంస్ తను బాగా ఉపయోగిస్తాడు. సినిమాకి ఒక డిఫరెంట్ ఫీల్ ని యాడ్ చేసింది ముఖ్యంగా ఈసినిమాకి. ఈ అమ్మాయిపేరు పూర్ణ ఇదివరకు సీమటపాకాయ్ అనే అల్లరి నరేష్ సినిమాలో చేసింది.

  రిప్లయితొలగించు
 14. హా.. అదీ సంగతి.. ఎక్కడో చూసినట్టుందే అని చాలా అనిపించింది. ఇప్పుడు గుర్తొచ్చింది.. నేనా సినిమా చూసాను. అమ్మాయి బావుందని కూడా అనుకున్నా.. థాంక్స్ వేణూ గుర్తు చేసినందుకు.. :D

  రిప్లయితొలగించు
 15. హహహ కదా మధురా.. బాగా ఉండటమే కాదు నటన కూడాబాగా చేస్తుంది, కొంచెం జాగ్రత్తగా సినిమాలు ఎన్నుకుంటే మంచి భవిష్యత్తుంటుంది.

  రిప్లయితొలగించు
 16. ఎవరో ఇచ్చారని ఈ సినిమా సిడీ తెచ్చారు.సినిమా రిలీజైందికాని టాక్ ఏమీ తెలీలేదని చూడలేదు.ఈ సినిమా గురించి మీరు రాసిందంతా చదివితే చుడాలనిపిస్తుంది కానీ నాకు సస్పెన్స్ ,త్రిల్లర్ సినిమాలంటే భయం కాబట్టి మీరు రాసిన దానితో సరిపెట్టేస్తున్నాను :))

  రిప్లయితొలగించు
 17. ధాంక్స్ రాధిక గారు. ఇది పిచ్చి మేకప్స్ తో భయపెట్టే సినిమాకాదండీ. సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కనుక చూడ్డానికి ప్రయత్నించవచ్చు :)

  రిప్లయితొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.