సోమవారం, డిసెంబర్ 03, 2012

కృష్ణం వందే జగద్గురుం

ఒక నటుడిగా, రచయితగా, దర్శకుడిగా సురభి నాటక రంగానికి తన జీవితాన్ని అంకితం చేసి తన ఇంటి పేరుగా మార్చుకున్న సురభి సుబ్రహ్మణ్యం(కోటా శ్రీనివాసరావు) గారి మనవడై ఉండి కూడా ఆయన సిద్దాంతాలని ఏమాత్రం లెక్కచేయకుండా కళారంగం తిండిపెట్టదనీ, మోసం చేసైనాసరే తను అమెరికా వెళ్ళి స్థిరపడితే చాలనీ, ఎవడి బతుకు వాడు బతకాలని నమ్మే బి.టెక్.బాబు(రాణా) తన అభిప్రాయం తప్పనీ, మనిషి సంఘజీవి అనీ, తోటి మనిషికి సాయం చేయడమే దైవత్వమనీ, భగవంతుడి దశావతారాల సారం ఇదేననీ స్వానుభవంతో తెలుసుకుని మైనింగ్ మాఫియా గుప్పిట చిక్కుకున్న ఒక ప్రాంతానికి ఎలా సాయం చేశాడో తెలియజెప్పే కథే “కృష్ణం వందే జగద్గురుం”. ఈ సింగిల్ లైన్ చదివితే మీకు దైవం మానుషరూపేణా అని ఖలేజా సినిమా లైన్ గుర్తొస్తుంది కదా. ఇదే లైన్ తో తీసినా దానిచుట్టూ కథా కథనాలను అల్లుకోవడంలోనే దర్శకుడుగా క్రిష్ ప్రతిభ మనకు స్పష్టంగా తెలుస్తుంది. 

ఫార్ములా కథలకు భిన్నంగా ’గమ్యం’, ’వేదం’ లాంటి సినిమాలు తీసి తనదైన ప్రత్యేకతను చాటుకున్న క్రిష్ ఆ ప్రత్యేకతను నిలుపుకుంటూనే మరిన్ని కమర్షియల్ విలువలు జోడించి ఎక్కువమంది ప్రేక్షకులను మెప్పించాలని చేసిన ప్రయత్నం “కృష్ణం వందే జగద్గురుం”. అతని గత చిత్రాలలో లేని వయొలెన్స్ అక్కడక్కడా కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా అవకాశముంది కదా అని వెగటుపుట్టేలా కాక వయొలెన్స్ ని కూడా సరైన మోతాదులో ఉపయోగించుకున్న క్రిష్ ఈ కమర్షియల్ ఫార్మాట్ తీసే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఐతే ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసే దర్శకులు తెలుగులో చాలామంది ఉన్నారు కనుక క్రిష్ ఇలా తీసినా అభిరుచిగల దర్శకుడుగా తనదైన ప్రత్యేకతను నిలుపుకోవడం మాత్రం మరువకుండా ఉండటం ముఖ్యమనిపించింది.

క్రిష్ సినిమాలలో కథా కథనాల తర్వాత నాకు బాగా నచ్చే అంశం నటీనటుల ఎంపిక, తన పాత్రలకి ఎలాంటి వాళ్లు కావాలో అలాంటివాళ్ళని తీసుకోడంలోను నటులను బట్టి పాత్రని టైలర్ చేయడంలోనూ, వాళ్లనుండి కావాలసిన నటనను కరెక్ట్ గా రాబట్టు కోవడంలోనూ తను సిద్దహస్తుడు. ఈ సినిమాలో ఈమధ్య అంతగా కనిపించని అన్నపూర్ణ, రూపాదేవి(టీవీ ఆర్టిస్ట్) లాంటి నటులు కనిపిస్తారు, అలాగే ట్రూప్ లో సురభి కళాకారులను ఎన్నుకోడం, గ్రామీణులుగా చేసిన వాళ్లని కోటా తమ్ముడిగా చేసిన నటుడిని ఎన్నుకోడం కూడా మంచి ఎంపిక వాళ్ళంతా సినిమాకు సహజత్వాన్ని తీసుకు వచ్చారు. రఘుబాబు, సత్యం రాజేష్, హేమ పాత్రలని ప్రధానంగా  హాస్యానికి ఉపయోగించుకున్నా కొన్ని సన్నివేశాలలో ఎమోషన్ ని కూడా ప్రదర్శింపచేయడం బాగుంది. ఎల్బీ శ్రీరాం కోటా శ్రీనివాసరావులు ఉన్నది కాసేపే అయినా ముఖ్యమైన పాత్రలు చేసి మెప్పించారు. రం.పం గా బ్రహ్మానందంకూడ బాగానే నవ్వించారు, ఇక పోసాని కృష్ణమురళి ని క్రిష్ ఉపయోగించుకున్నంత బాగా ఇంకెవరూ ఉపయోగించుకోలేరు. వేదంలో పోలీస్ ఆఫీసర్ గా సరిపోయే పాత్ర ఇచ్చిన క్రిష్ ఇందులో కాబ్ డ్రైవర్ టిప్పుసుల్తాన్ గా గుర్తుండిపోయే పాత్ర ఇచ్చారు.
 
బి.టెక్.బాబు పాత్ర దక్కడం రాణా అదృష్టమనే చెప్పాలి. తన ప్లస్ పాయింట్స్ అయిన గొంతునీ శరీరాకృతిని చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగించుకున్నారు. సురభి నాటకాల నేపధ్యం ఉండటంతో అభిమన్యుడిగా, ఘటోత్కచుడిగా, తోటరాముడిగా(పాతాళభైరవి), నరసింహ స్వామిగా నాటకాలలో వేషాలతో స్పష్టమైన ఉచ్చారణతో మెప్పించడమేకాక సినిమా అంతట విభిన్నమైన సన్నివేశాలలో నవరసాలను బాగా ప్రదర్శించాడు. ఇంకా ఇంప్రూవ్ చేస్కోవాల్సి ఉన్నప్పటికీ తను ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నిటిలోకీ ఇందులోనే తనలో ఒక నటుడ్ని కూడా చూడ గలుగుతాము. దీనికి పూర్తి క్రెడిట్ క్రిష్ కే ఇవ్వాలేమో మరి రాణా రాబోయే సినిమాలు కూడా చూస్తేకానీ చెప్పలేం. ఇక ఫైట్స్ లో అయితే రాణా ఒక హీమాన్ లాగా కనిపించాడు ఒక్కడే ఒంటిచేత్తో ఎదుటివాళ్ల కాళ్ళూ చేతులు విరిచేసే సన్నివేశాలు పోరాటాలు ఇంత నమ్మదగినట్లుగా ఇంకే హీరో చేసినపుడూ అనిపించలేదు. ఫైట్స్ చిత్రీకరించిన తీరు అద్భుతం. ఒకటిరెండు పాటలలో డాన్సులు కూడా ప్రయత్నించాడు పర్వాలేదనిపించింది తన ఎత్తుకు తగిన స్టెప్స్ ఎన్నుకుంటే ముందుముందు బాగానే ఉండచ్చు.
 
దేవికగా నయనతార నటన బాగుంది చూడటానికి కూడా బాగుంది ఆ ముక్కుపుడక లేకపోతేనే బాగుండేదేమో, సొంతగొంతుతో చెప్పుకున్న డబ్బింగ్ అక్కడక్కడ కొన్ని ఉచ్చారణ దోషాలు తప్ప బాగుంది. తన గొంతులో జలుబు చేసినపుడు మాట్లాడుతున్నట్టు ఒక జీర ఉంది కానీ నాకు అది అందంగానే అనిపించింది. మిలింద్ గునాజి విలన్ గా బాగున్నాడు కానీ అంతగా మెప్పించలేకపోయాడు. సినిమాలో ఇతని క్రూరత్వాన్ని చూపే సన్నివేశాలు సెన్సార్ కట్స్ కి బలయ్యాయేమో తెలీదు కానీ అంత భయంగొలిపే విలన్ గా అనిపించడు. అలాగే వజ్రదేహుడైన హీరో ముందు మరీ తేలిపోయాడు ఇద్దరూ ఎదురుపడినపుడు మన హీరో వీడ్ని అగ్గిపుల్లని విరిచినట్లుగా విరిచేయచ్చు అన్నఫీలింగ్ వస్తుంది తప్ప బలమైన విలన్ అనిపించడు.

దర్శకుడు క్రిష్ రాసిన స్క్రీన్ ప్లే తన దర్శకత్వం సినిమాకి ప్రాణం పోస్తే, మణిశర్మ నేపధ్య సంగీతం ఊపిరూదింది, తూటాల్లా పేలిన సాయిమాధవ్ సంభాషణలు చైతన్యాన్నిచ్చి ఒక మంచి వైవిధ్యమైన సినిమా చూసిన ఫీలింగ్ ని మనసొంతం చేస్తాయి. తెలుగు తెరకి పూర్తిగా కొత్తదైన సురభి నాటకాలు, మైనింగ్ మాఫియా నేపధ్యం చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చాయి. నాటకాల నేపధ్యంతో కనెక్ట్ అవలేని వారికి అక్కడక్కడా సినిమా విసుగు కలిగించే అవకాశం లేకపోలేదు. కమర్షియల్ పంథాలో పయనించాలనే ప్రయత్నంలో కొంత తడబడినా హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ సన్నివేశాలకి తగిన ప్రాధాన్యత మాత్రమే ఇచ్చి, హీరో విలన్ ల మధ్య కూడా అనవసర వాగ్యుద్దాలు ముష్టి యుద్దాలు పెట్టకుండా కథకు మాత్రమే ప్రాముఖ్యతను ఇచ్చినందుకు క్రిష్ ని మెచ్చుకుని తీరాలి. రెండుగంటల పదిహేను నిముషాల సినిమా నిడివి ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం వేగంగా సాగడానికి దోహద పడిందని చెప్పచ్చు.

సురభినాటకాల ప్రదర్శనని చూపించిన తీరు చాలా ఆకట్టుకుంది, స్టేజ్ పై అగ్ని, నీరు, నటులు భూమి నుండి రావడం లాంటి ఇతర స్పెషల్ ఎఫెక్ట్స్ ను ఎలా ప్రదర్శిస్తారో బాగా చూపించారు. అలాగే ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో నాటకాలంటే హాస్యానికి మాత్రమే వాడుకున్నారు కనుక దానికి తగ్గట్లే మేకప్ లోనూ ఆహార్యంలోను అతి ఎక్కువ కనిపించేది చూడగానే నవ్వొచ్చేట్లు అయితే ఈ సినిమాలో అలా కాక నాటకం ఒక చక్కని కళగా చూపించారు దానికి తగినట్లే మేకప్ ఆహార్యం స్టేజ్ డెకరేషన్ ఇతరత్ర ఉండేవిధంగా జాగ్రత్త తీసుకున్నారు. నేను వాటికోసమే సినిమా రెండు సార్లు చూశాను. సురభి వారి ప్రతిభగురించి ఇప్పటికే చాలా సార్లు విని ఉన్నాకూడా ఈ సినిమా చూశాక సాధ్యమైనంత త్వరలో సురభి నాటక ప్రదర్శనని డైరెక్ట్ గా చూడాలని అనిపించింది.

మణిశర్మ నేపధ్య సంగీతాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి, Main theme ను "Hans Zimmer" compose చేసిన "The Dark Knight Rises" అనే ఆంగ్ల చిత్రం నుండి సంగ్రహించినా దానిని సినిమాకి సమర్ధవంతంగా వాడుకున్న తీరును మెచ్చుకోవాల్సిందే. ఈ నేపద్యసంగీతమే సినిమా లోని ఎమోషన్స్ ని నెక్స్ట్ లెవల్ కి హైలైట్ చేసింది. వీటికి తోడు చాలా రోజుల తర్వాత బాలు గొంతులో "జరుగుతున్నది జగన్నాటకం" పాట క్లిప్స్ ను నేపద్యసంగీతంగా వాడుకోవడంకూడా చాలా ఎఫెక్టివ్ గా అనిపించింది. పాటలలో "రంగ మార్తాండ", "సై అంద్రె నాను" కాచీ ట్యూన్స్ తో సాగితే దశావతారాల గురించి రాసిన "జరుగుతున్నది జగన్నాటకం" గుర్తుండి పోతుంది. "అరెరె పసివయసా" మాంచి మెలొడిగా ఆకట్టుకుంటుంది. "స్పైసీ స్పైసీ" పాట చిత్రీకరణ వెరయిటీగా బాగుంది కానీ పాట అంతగా అలరించదు. "చల్ చల్" పాటలోని లిరిక్స్ కొద్దిగా బాగున్నాయ్ కానీ సినిమాలో దీని ప్లేస్మెంట్ చాలా చిరాకు తెప్పించింది బహుశా అలా ఒకపాట పెట్టడమ్ కమర్షియల్ అనుకున్నాడేమో క్రిష్. "సైఅంద్రెనాను" పాటలో రెండవ చరణానికి 'విక్టరీ వెంకటేష్' సమీర రెడ్డి తో కలిసి నర్తించి మాస్ తో విజిల్స్ వేయించాడు.       

ఎంత మధురమైన ఫలమైనా మనం ఆస్వాదించలేని/తినలేని గింజలు కూడా ఉన్నట్లు ఈ సినిమాలో కూడా ఒకటీ అరా పంటి కిందపడే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాకూడా, ఆ గింజల్ని ఊసేసి పండుని ఎంజాయ్ చేసినట్టు వాటిని వదిలేసి సినిమాని ఎంజాయ్ చేయవచ్చు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక్కసారైనా చూడాల్సిన సినిమా కృష్ణం వందే జగద్గురుం, డోంట్ మిస్ ఇట్.

ఈ సినిమాకోసం సాయిమాధవ్ రాసిన అద్భుతమైన సంభాషణలలో కొన్ని..

“బువ్వనేకపోతే మట్టినడిగితే పెట్టుద్ది. మట్టేనేకపోతే ??... దోచుకు పోతున్నారు కొడుకులు...”

“న్యాయంకంటే అన్యాయం ఒక అక్షరం పెచ్చుగదా అదే గెలుస్తుది.”

"అరవై ఆర్మోనియం పెట్టెలు ఒకేసారి ఆరున్నర శ్రుతిలో పాడితే ఎట్టా ఉండుద్దీ.. ఆడు కొడితే అట్టాగే ఉండుద్ది"

"కళంటే బతుకునిచ్చేదే అనుకోకు బతుకు నేర్పేది కూడా.”

“అవసరమున్నోడికేమో అవకాశముండదు అవకాశమున్నోడికేమో అవసరముండదు.”

“కళాకారుల అస్థికలు శివుడి నుదుటన అడ్డబొట్టుతో సమానం”

“మీడియా అనేది పెద్ద సర్కస్.. అదే సర్కస్ లో బఫూన్లుంటారు.. ఇక్కడ చూసేవాళ్ళందరూ బఫూన్లవుతారు”

“కడుపుమంట కనపడదు కానీ మంటపెట్టినోడి చితిమండేదాకా మండుతూనే ఉంటుంది"

"పశువులూ పక్షులూ ఏడోచోట బతికేస్తాయ్ బాబు.. కానీ మనం మనుషులం, మనమేకాదు మనముండే చోటూ బతకాలా, మన తోటోడూ బతకాలా"

“కొన్ని చావులు చూసి జాలి పడకూడదు గర్వపడాలి.”

"రోజూ పేపర్ చూస్తే కోపమొస్తుంది. ఈరోజు పేపర్ రేపు రాదు.. ఈ రోజు కోపం రేపుండదు. వేరే న్యూస్ వేరే కోపం.”

“అమ్మ తొమ్మిదినెల్లు కష్టపడితే మనం పుట్టాం అనుకుంటారు కొందరు. కాదూ నాన్నపక్కన పదినిముషాలు సుఖపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే కానీ పురిటినొప్పులు చూసినవాడు మనిషవుతాడు పడక సుఖాన్ని చూసినవాడు పశువవుతాడు.”

"దేవుడంటే సాయం..ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడన్నారు..
ఒక పంది సాయం చేస్తే వరాహ మూర్తన్నారు..మహావిష్ణువు అవతారం అన్నారు..
తాత రాసింది దేవుడి గురించి కాదు సాయం గురించి.”

“చచ్చాక ఏడ్చేవాళ్ళుంటే చచ్చినా బతికినట్టే.. అదే చావుకోసం ఎదురు చూసే వాళ్ళెక్కువైతే బతికినా చచ్చినట్టే”

31 కామెంట్‌లు:

 1. గ్రేట్ రివ్యూ అండీ...
  క్రిష్ కీ, రానా కీ అభినందనలు..
  ఇలాంటి మంచి సినిమాలని ప్రజలు ఆదరించాలి. ఇంతకంటే మంచి సినిమాలు క్రిష్ చేసే అవకాశం ఇవ్వాలి..

  రిప్లయితొలగించండి
 2. హ్మ్ ! మీ రివ్యూ చదివాక సినిమా చూడాలి అనిపిస్తుంది . మా ఊర్లో స్క్రీనింగ్ ఉండే ఉంటుంది ట్రై చేయాలి ! బాగా రాసారు వేణు గారు !

  రిప్లయితొలగించండి
 3. Splendid వేణూ గారు
  మీకు అభినందనలు
  సినిమాకి డైలాగులు రాసిన సాయి మాధవ్ బుఱ్ఱ కి హాట్స్ ఆఫ్

  రిప్లయితొలగించండి
 4. రెండు రోజులుగా (ఈ సినిమా విడుదులయ్యాక) రక రకాల రివ్యూస్ చదివి, సినిమా చూసిన వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుని వెళదామా , వద్దా అని సందేహిస్తూ ఉన్నాను. మీ రివ్యు లో మీరు రాసిన ఈ రెండు లైన్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. "మనిషి సంఘజీవి అనీ, తోటి మనిషికి సాయం చేయడమే దైవత్వమనీ, భగవంతుడి దశావతారాల సారం". తప్పకుండా ఈ వారం ఈ సినిమా చూస్తాను.
  మీరు చాలా బాగా రాసారండి ఈ రివ్యు.

  రిప్లయితొలగించండి
 5. మాఊరు కూడా ఈ సినిమా రిలీజ్ చేసారండి.ఆ రోజే చాలా ఏళ్లతరువాత మా కజిన్స్ అందరం ఇరవై మంది వెళ్ళాము.అందరం కలసి వెళ్లినందుకు ,మంచి సినిమా చూసినందుకు చాలా ఆనందించాము.

  మీరు రాసే రివ్యు కోసం చూస్తున్నాను.రానా యాక్టింగ్ ,డైలాగ్స్ ,ఫైట్స్ విషయంలో సేం మీ ఫీలింగ్స్ నావిను .క్రిష్ రానా ఆరున్నరఅడుగుల కటౌట్ ని బాగా వాడుకున్నారు.

  ఎంత మధురమైన ఫలమైనా మనం ఆస్వాదించలేని/తినలేని గింజలు కూడా ఉన్నట్లు ఈ సినిమాలో కూడా ఒకటీ అరా పంటి కిందపడే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాకూడా, ఆ గింజల్ని ఊసేసి పండుని ఎంజాయ్ చేసినట్టు వాటిని వదిలేసి సినిమాని ఎంజాయ్ చేయవచ్చు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక్కసారైనా చూడాల్సిన సినిమా కృష్ణం వందే జగద్గురుం, డోంట్ మిస్ ఇట్....


  రిప్లయితొలగించండి
 6. Good ones (both movie and the review). Thanks to Krish and Rana for making this.

  Hope we get more stuff like this one rather than the regular trash.

  రిప్లయితొలగించండి
 7. సినిమా రివ్యూలలో మీదో బ్రాండ్ వేణూ గారూ :). క్రిష్ సినిమాల గురించి కొన్ని మంచి గమనికలు వ్రాశారు. అలాంటివే నిజానికి దర్శకులను ప్రత్యేకంగా నిలబెట్టేవి.
  వేదంలో కూడా ఆ ముసలాయన పాత్ర నాకు భలే ఇష్టం. ఈ రోజు ఈనాడు ఇంటర్వ్యూలో క్రిష్ అంటాడు - "నాకు అవార్డులూ కావాలి, నా సినిమాలకు డబ్బులూ కావాలి" అని. దురదృష్టవశాత్తూ తెలుగు పరిశ్రమకు సంబంధించి రెండూ ఒకే సినిమా ద్వారా పొందడం బహు కష్టం కనుక, ఆయన నిర్మాతల తరఫున ఆలోచించడం మానేస్తే ఎంత బాగుండునో అనిపించింది. అయినా ప్రతిభ పుష్కలంగా ఉన్న దర్శకుడి ఆశ కనుక, తప్పకుండా ఫలిస్తే బాగుండుననే కోరుకుందాం!

  రిప్లయితొలగించండి
 8. ఈ సినిమా హిట్టా? ఇక చచ్హాం. వరసపెట్టి ఈ చక్క మొహం గాడి సినిమాలు మన మీద వదుల్తారు కాబోలు....

  రిప్లయితొలగించండి
 9. పేరు వింటేనే సినిమా ఎంత గొప్పగా ఉండచ్చో ఊహించాను...అంచనాలకు తగ్గకుండ తీసారని మీ రివ్యూ చదివాక తెలిసింది. రివ్యూ చాలా బాగా రాసారు. మంచిని పంచే ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను.
  -దీరూ

  రిప్లయితొలగించండి
 10. బావుంది వేణూ మీ రివ్యూ! సినిమా చూడొచ్చన్న ధరియం వచ్చింది నాకు. ఆ రాణా ఏవిటో నా కళ్ళకి ఫ్రాంకెన్ స్టెయిన్ లాగానో, హల్క్ లాగానో కనిపిస్తాడు. నేను నా రాక్షసి తర్వాత జడిసి పోయాను. ట్రైలర్ చూశాను,, మీ రివ్యూ చదివాను. చూడొచ్చు అయితే

  రిప్లయితొలగించండి
 11. మరో మంచి సినిమా అన్నమాట. మీ రివ్యూ చదివిన వెంటనే సినిమా చూసెయ్యలనిపిస్తుంది వేణు గారు.

  రిప్లయితొలగించండి
 12. కృష్ణం వందే జగద్గురుం..సినిమా చాలా చాలా బావుంది..క్రిష్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు..రాణా నటన కూడా అద్భుతంగా ఉంది..రాణాది చక్కమొహం అని ఒకరు తమ అభిప్రాయాన్ని చెప్పారు..ఆ అభిప్రాయం తప్పు అని నేను చెప్పను..కానీ..రాణాలో నటించే సత్తా ఉంది..కానీ సెలక్ట్ చేసుకునే సినిమాలు సరిగా లేవు..ఈ సినిమా తరువాతనైనా..ఆచితూచి అడుగులు వేస్తే బాగానే నిలదొక్కుకునే సత్తా రాణాలో ఉంది..ఎందుకంటే ఎప్పుడు ఎవర్నీ తక్కువగా అంచనా వేయలేం..ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్రలోనూ నటన ఉంది..అలా నటింపంచేయడం వెనుక క్రిష్ కష్టం కూడా ఉంది..అందరూ చూడదగ్గ ఒక మంచి చిత్రం కృష్ణం వందే జగద్గురుం..


  రిప్లయితొలగించండి
 13. The dialogues on illegal mining are excellent.if we don't respect and protect land vis-a-vis panchabhootalu we will be extinct.

  రిప్లయితొలగించండి
 14. థాంక్స్ రాజ్, హిట్ అయిందనే అనుకుంటున్నాను.

  చిన్ని గారు ధన్యవాదాలండీ తక్కువ అంచనాలతో చూడండి సినిమా మీకు నచ్చుతుంది.

  థాంక్స్ శ్రావ్యా తప్పక చూడండి మిస్ అవ్వద్దు.

  థాంక్స్ హరే నిజమే సినిమాకి ఆ డైలాగులే ఆయువుపట్టు.

  ధాంక్స్ వెన్నెల గారు, తప్పకుండా చూడండి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా క్రిష్ డిజప్పాయింట్ చేయడు.

  ధాంక్స్ రాధిక గారు, ఓ అవునా ఫామిలి అందరితో కలిసి ఎంజాయ్ చేయగలిగారనమాట వెరీగుడ్ అండీ.

  థాంక్స్ ఇండియన్ మినర్వా గారు, క్రిష ఇంకా ఇలాంటి మంచి సినిమాలే తీస్తాడని ఆశిద్దాం.

  థాంక్స్ మానస గారు, అవునండీ వేదంలోముసలాయన పాత్ర నాక్కూడా ఇష్టం. మీరన్నట్లు ప్రతిభ ఉన్న దర్శకుడు కనుక తన కోరిక తీరాలని కోరుకుందాం.

  రిప్లయితొలగించండి
 15. వేణు గారూ, మీ రివ్యూ చదివుంటే నేను రాసుండే వాన్ని కాదు. హీరో డయిలాగు డెలివరీతో సహా .. చాలా విషయాలలో మీతో ఏకీభవించేస్తున్నా, మీ భాషా పాండిత్యం బావుంది.. (సాధ్యమైనన్ని తక్కువ ఇంగ్లీషు పదాలతో).. :-)

  రిప్లయితొలగించండి
 16. San గారు ధన్యవాదాలండీ... హిట్ కాకపోయినా వారసులనుండి మనకి తప్పించుకునే అవకాశాలు లేవండీ వాళ్ళదగ్గర డబ్బు పలుకుబడి ఉన్నాయ్ కనుక సినిమాలు తీసి వదుల్తూనే ఉంటారు. కనీసం ఇలాంటి మంచి సినిమాలు హిట్ అయితేనన్నా ముందు ముందు ఇలాంటి సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి.

  ధీరు గారు ధన్యవాదాలండీ అవును ఈ సినిమా హిట్ అయి ఇలాంటి మరిన్ని సినిమాలు తీయాలనే ప్రోత్సాహాన్నివ్వాలని కోరుకుంటున్నానండీ...

  హహహ సుజాత గారు థాంక్స్.. నిజమేనండీ మీరన్నట్లే ఉంటాడు రాణా అయితే ఈ సినిమాలో ఆ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకున్నాడు క్రిష్. నాకైతే ఇదివరకు అతన్ని చూస్తే హీరోగా కన్నా విలన్ గా చాలా పవర్ ఫుల్ గా ఉంటాడు అని అనిపించేది.

  జ్యోతిర్మయి గారు థాంక్స్.. తప్పక చూడాల్సిన సినిమా అండీ చూసేయండి.

  12:50 అజ్ఞాత గారు ధన్యవాదాలండీ చాలా చక్కగా చెప్పారు రాణా గురించి క్రిష్ గురించీనూ.. క్రిష్ కి ఈ సినిమా మంచి విజయాన్నిచ్చి ఇంకా ఇలాంటి సినిమాలు తీసే అవకాశాలు రావాలని కోరుకుందాం.

  శశిగారు థాంక్స్.. తప్పకుండా చూడండి దశావతారాలు పాట ఉన్నంత బాగా చిత్ర్రీకరణ లేదండీ చివరిలో ఎక్కువ చూపించే అవకాశం లేక కట్ చేశాడనిపించింది.

  ధన్యవాదాలు శ్రీరంగ గారు కరెక్ట్ గా చెప్పారు పంచబూతాలనూ ప్రకృతిని గౌరవించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మనం.

  ధన్యవాదాలు ప్రసన్న గారు.

  హహహ శ్రీకాంత్ భలేవారే సాధ్యమైనన్ని ఎక్కువ రివ్యూలు రావాలి, మంచి సినిమా సాధ్యమైనంత ఎక్కువమందికి చేరాలి. నచ్చినవి నచ్చనవి అంటూ మీరు చక్కగా విశ్లేషించిన తీరు బాగుందండీ.

  రిప్లయితొలగించండి
 17. పుట్టిన రోజు శుభాకాంక్షలండి వేణు గారు.

  రిప్లయితొలగించండి
 18. వేణు గారు..పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ఇలాగే బ్లాగ్ పోస్ట్ లతో..అలరించాలని కోరుకుంటూ..

  రిప్లయితొలగించండి
 19. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వేణు గారూ! మీరిలాగే మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!

  రిప్లయితొలగించండి
 20. వేణు గారు, మీకు హార్ధిక జన్మ దిన శుభాకాంక్షలు!
  May all your dreams come true!!

  -దీరు

  రిప్లయితొలగించండి
 21. ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు శ్రీకాంత్ గారు :)
  మీ రివ్యూ చదివాక వీలైనంత త్వరగా ఈ మూవీ చూసేయాలని ఉంది. బాగా రాసారు.

  రిప్లయితొలగించండి
 22. వనజ గారు, రసజ్ఞ గారు, ధీరు గారు, ప్రియ గారు శుభాకాంక్షలందించినందుకు వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలండీ.

  రిప్లయితొలగించండి
 23. సినిమా చూశాక నాకు బాగా నిరాశ కల్గింది వేణూ! క్రిష్ సినిమాల్లో మంచి సినిమాగా ఒక్క గమ్యం మాత్రమే నిలుస్తుందేమో అనిపించింది.
  ఒక తీరూ తెన్నూ లేని కథ, దాన్ని సన్నివేశాల పరంగా ఆర్డర్ లో పెట్టడం ఎక్కడా అతకలేదు అనిపించింది.
  నాటకం బళ్లారి లో ఆడటమేనా, లేక మేనమామ మీద పగ తీర్చుకోవాలనే కర్తవ్యం బోధించాడా, క్లియర్ గా చెప్పడు దర్శకుడు. బాబు స్థోమత, నాటక సమాజం స్థోమత ఏమిటో తాతకు తెలుసు కాబట్టి , రెడ్డప్ప లాంటి వాడి మీద పగ తీర్చుకోమని చెప్పే అవకాశం లేదు. పోనీ అతడే నీ మేనమామ అని బాబుకి చెప్పాలంటే...ఆ రెడ్డప్ప గురించి తాతకు ఏమైనా తెలుసో లేదో తెలీదు. అతని ఐడెంటిటీ ఏమిటో తెలీదు.

  పోనీ ఇదే నీ జన్మస్థం కాబట్టి అక్కడ నాటకం ఆడాలి అని చెప్పాడు అనుకోవాలా? దాని వల్ల బాబుకి కానీ తాతకి గానీ ఒరిగేదేమిటి? ఎందుకంటే బాబుకి పుట్టుకతో, కళాకారుల వారసత్వం ఏమీ లేదు.

  చక్రవర్తి, రెడ్డప్పల్ ఐడెంటిటీలు మార్చుకోవడం ఎపిసోడ్ ఎందుకైనా ఉపకరిస్తుందా ఈ స్టోరీకి? ఆ చక్రవర్తి పాత్ర ఎందుకు అసలు?

  ఇక కథనం విషయానికొస్తే,...అక్కడి జనాలతో కలవని మోడరన్ వేషంలో నయన తార తిరుగుతూ ఉంటే..రెడ్డప్ప మనుషులకు ఆమె ఎవరనే సందేహం రావాలి. ఆమెను వదిలేసి "లేడీ జర్నలిస్టు ని ఎలాగైనా పట్టుకోవాలి" అని వెదకటం హాస్యాస్పదం. అలాగే హీరోయిన్ ఏకంగా అదేగో గుట్టమీదికి వెళ్ళి, కరుడు గట్టిన విలన్ స్థావరాలను, వాళ్ళ మొహాల్లో కెమెరాలు పెట్టి ఫొటోలు తీయడం అంతకంటే కామెడీ! ఆ స్థాయి కరప్షన్ మీద ఆపరేషన్ చేసే జర్నలిస్టులు అక్కడి మనుషుల్లో కల్సి పోయి వివరాలు సేకరిస్తారే తప్ప, ఇలా పబ్లిగ్గా కెమెరాలు పట్టుకుని బయలు రేరరు. ఈ విషయం క్రిష్ ప్రేక్షకులకు తెలీదనుకున్నాడా?

  కథ మొత్తానికి మూలమైన నాటకం చివరలో ఎలా ఉండాలి. రెండు నిమిషాల్లో మూడు అవతారాలు తేలికలో అవగొట్టారు. అసలు డెప్తే లేకుండా పోయింది.

  రెడ్డప్ప లాంటి బలమైన వ్యక్తి,, లక్ష కోట్లకు అధిపతి ఎవరికి పడితే వాళ్ళకు చంపడానికి యాక్సెసిబుల్ గా ఉండటం....వాడి స్థావరంలోకి చక్రవర్తి మనుషులు బారెడు గన్లు పట్టుకుని మాటేసి చపడానికి ప్రయత్నించడం....ఇవన్నీ కొంచెం కూడా రియలిస్టిక్ గా లేవు.

  సినిమాకి దిష్టి చుక్కలా ఐటం సాంగ్స్! యాక్, ఆ సమీరా రెడ్డిని చూస్తే పారి పోవాలనిపించింది. సంగీతం అంతంత మాత్రం!

  అలాగే ఆ మట్టి రాజు , ఆ పల్లె,...ఇవన్నీ కథకు పనికొచ్చేవి కావు. కథకు పనికిరావాలంటే ఆ పల్లె ఎపిసోడ్ ఇంకా కథకు బలంగా అనుగుణంగా ఉండాలి.

  కమర్షియల్ సినిమాలు తీయడం క్రిష్ మానేసి, గమ్యం లాంటి మనిషిని కదిలించే సినిమాలు తీస్తే బెటర్.

  రిప్లయితొలగించండి
 24. ఈ బ్లాగులో రివ్యు చదివి ఆసినేమాకి వెళ్ళాను. కొంచెం నిరాశాకు గురయ్యాను. కారణాలు సుజాత గారు వివరంగా చెప్పారు. ఇక హీరో గారిని చూసి ఇతను ఎమీటి ఇలా ఉన్నాడు, ఇతనొక హీరో నా అని అనుకొనేలోపే, అతనిని గ్రీకు శిల్పం తో పోలుస్తూ డైలాగులు వినిపిస్తారు.
  ఈ సినేమా చూసిన ముందు రోజు తలాష్, లై ఆఫ్ పై సినేమాలు చూడటంవలన ఈ సినేమా మరింత తేలిపోయింది.

  రిప్లయితొలగించండి
 25. మీ రివ్యూలు తరచుగా చూస్తుంటాను(చదువుతుంటాను) వేణూ. చక్కగా విశ్లేషిస్తారు.

  ఈ సినిమా గురుంచి మొదటి నుంచీ ఒకరకమైన ఆసక్తి రేకెత్తించారు డైరెక్టర్ క్రిష్. దానికి తోడు, సిరివెన్నల గారు వ్రాసిన పాటలు, ప్రొమోస్ ఇంకొంచెం అంచనాలను రేకెత్తించాయి. మీ రివ్యూ ఆ అగ్ని కి కొంచెం ఆజ్యం పోసినందుకోండి. రివ్యూలు అనేవి సొంత అభిప్రాయాలైనా ఆ reviewer ఆలోచనలు, వారి విశ్లేషణ చాలా మంది interests తో కలిసి, ఎక్కువమందికి నచ్చటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పారని వెళ్ళామండి, బుక్కైపోయాను చెప్పటానికి కాదు కాని, ఈ సినిమా నన్ను పూర్తిగా నిరాశపర్చింది. ఎందుకు ఈ డైరెక్టర్ కి అంత హైప్ చేస్తారో మీడియా తెలీదు కాని, అంత సీన్ లేదనిపిస్తుంది.

  ఈ సినిమా కధ మంచిదే కాని దాన్ని తీయటం కుదరలేదనిపించింది. స్క్రీన్ ప్లే అతుకులబొంత. పాటలు పంటికింద రాళ్ళు. నిజ జీవితానికి దగ్గరగా, సహజత్వం తో తీసానని డైరెక్టర్ ఫీల్ అయ్యారు కానీ, చాలా అసహజం గా ఉంది. హీరో పాత్రని సరిగా మలచలేదనిపించింది. పాసివ్ గా అనిపిస్తుంది. తనట్రూప్ లో ని మనిషిని గాయపర్చారు, ఇంటికొచ్చి గందరగోళం చేసారని, ఆవేసం గా వెళ్ళి ఎవరో ఒకరిని బాదేస్తాడు, అసలు మనిషిని వదిలేస్తాడు. ఆ ఎమోషన్స్ కి తారాస్తాయికి తీసుకెళ్ళలేదు. ఇంక ఆ అడవిలోని మట్టిరాజు పాత్రేంటో, అక్కడ వాళ్ళ చేత కుండలు పగలగొట్టించటమేంటో సిల్లీగా అనిపించింది. సినిమాలో ప్రతిపాత్రా వేదాంతం వల్లిస్తుంది కానీ, అర్ధవంతం గా లేవు. చివరి 30 నిముషాలతే మరీ ఘోరం, typical 80s లో చిరజీవి యాక్షన్ సినిమాల్లా అనిపించింది. సరే ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని లోపాలున్నాయి కాని, సినిమా అయితే అస్సలు నచ్చలేదు:)

  రిప్లయితొలగించండి
 26. ఈ సినిమాను నేను ఏ దూకుడు లానో అనుకుని చూసి ఉంటే బావుండేది. అయితే దురదృష్టవశాత్తూ సిరివెన్నెల ఇంటర్వ్యూ, క్రిష్ ఇంటర్వ్యూ, దశావతారాల గురించిన మోత ఇవన్నీ తలలో పెట్టుకుని వెళ్ళి బాగా తిట్టుకున్నాను.

  కమర్షియల్ సినిమాను కమర్షియల్ అని చెబితే క్రిష్ సొమ్మేం పోతుందో తెలీదు. పెద్ద కళాఖండం గా కలర్ ఇచ్చి మామూలు స్థాయిలో తీయటం పెద్ద నిరాశ.

  రిప్లయితొలగించండి
 27. Friends, Thanks for sharing your views, Sorry to disappoint you with my review. I am away from my computer right now with minimal connectivity. I will give a detailed reply as soon as i get my connectivity back.

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.