సోమవారం, ఏప్రిల్ 23, 2012

దేవస్థానం సినిమా గురించి

శ్రీమన్నారాయణ(కె.విశ్వనాథ్) గారికి దేవస్థానమే ఇల్లు, జీవిత చరమాంకంలో ఎవరూతోడులేని ఆయన ఎక్కువ సమయం దైవసన్నిధిలోనే గడుపుతూ ఉంటారు, సాగరమల్లే తొణకని నిండైన వ్యక్తిత్వం, పురాణాలపై ఆధ్యాత్మిక విషయాలపై పట్టు, భారతీయ కళల పట్ల మక్కువ ఆయన సొంతం. సాంబమూర్తి(బాలసుబ్రహ్మణ్యం)కి ఇల్లే దేవస్థానం పెళ్ళై ఇరవైఏళ్ళైనా పిల్లలులేక భార్యలోనే కూతురును కూడా చూసుకుంటూ ఇల్లూ తానుపనిచేసే షాపు తప్ప మరో లోకం తెలియకుండా చంటిపిల్లాడిలా సరదాగా చలాకీగా ఉండే మనిషి. సాంబమూర్తి భార్య(ఆమని) భర్తని ప్రేమగా చూసుకుంటూ ఆయనకు అన్నివిధాలుగా చేదోడువాదోడుగా నిలిచే అనుకూలవతి అయిన ఇల్లాలు.
“ప్రతి మనిషినీ కంటిపాపతో కాక పాపకంటితో సందర్శించాలి, ప్రతిమనిషిని ప్రేమించాలి ప్రపంచాన్ని ప్రేమించాలి. అపుడందరూ నీవాళ్ళవుతారు.” 
ఓరోజు గుడిలో ఉచితంగా నాట్యంనేర్పించే ఓ అమ్మాయి సందేహ నివృత్తిలో భాగంగా “జననం ఎలా ఉన్నా జీవనం గొప్పగా ఉండాలి మరణం అంతకన్నా మహోన్నతంగా ఉండాలి” అని చెప్పి గుడినుండి ఇంటికి వెళ్ళే దారిలో శ్రీమన్నారాయణ గారు ఓ అనాథ శవాన్ని చూస్తారు. ఆ శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు చెత్తతోపాటు ఊరిచివరకు తీసుకు వెళ్ళి తగలబెట్టటం చూసి ఆయన మనసు వికలమౌతుంది. ఎవరూలేని తాను మరణించిన తరువాత తనగతీ ఇంతే అవుతుందనే దిగులుతో తనకి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించుకోడానికి డబ్బు నిలువచేసి అన్ని ఘనంగా ఎలా చేయాలో ప్లాన్ చేసుకుని తలకొరివి పెట్టే వారికోసం అన్వేషణ మొదలెడతారు. అలాంటి సమయంలో సాంబమూర్తి మన శ్రీమన్నారాయణ గారి కంట పడతాడు. తనకి తలకొరివి పెట్టడానికి సాంబమూర్తే సరైన వ్యక్తని నిర్ణయించుకుని అతనిని ప్రాధేయపడటం మొదలు పెడతారు. అయితే సాంబమూర్తి ఈ వింతకోరికని విని మొదట తిరస్కరించినా భార్య నచ్చచెప్పడంతో అంగీకరిస్తాడు.

 

సాంబమూర్తితో “ప్రతి ఉదయం వచ్చి పలకరించి ప్రసాదం ఇచ్చివెళ్తాను ఏ ఉదయమైతే నేను రాలేదో ఆరోజు నేను లేనట్టు భావించి నీకర్తవ్యం నిర్వర్తించు” అని చెప్తారు శ్రీమన్నారాయణ. అలా మొదలైన వారి చెలిమి కొనసాగుతుండగా సాంబమూర్తికి శ్రీమన్నారాయణ గారు హరికథాభాగవతులనీ వారి వంశమంతా తరతరాలుగా హరికథలు చెప్పడంలో పేరుపొందిన వారనీ తెలుస్తుంది. నాకోసం దసరా ఉత్సవాలకు గుడిలో హరికథ చెప్పాలని  ఒత్తిడి చేసిన సాంబమూర్తికి అతను ఈతరానికి సరిపోయేలా హరికథ రాస్తేనే చెప్తానని కండీషన్ పెడతారు శ్రీమన్నారాయణ గారు. హరికథ వ్రాయించడంలో గురువు పాత్రపోషించి సాంబమూర్తితో చక్కని హరికథలు రాయించి గానం చేస్తారు. వారి హరికథలూ, వారు భక్తుల సందేహాలకు ఇచ్చిన సమాధానాలను విని ప్రభావితమైన ఓ లాయర్ ఐదుకోట్ల నిధితో “సర్వేజనా సుఖినోభవంతు” ట్రస్ట్ ఏర్పాటు చేసి దేవస్తాన పునరుద్దరణకూ అర్చకులకు సహాయం చేయడానికి, ఆదరణ కోల్పోతున్న కళారూపాల ప్రాచుర్యానికీ పాటుపడాలని కోరుతూ వీరిద్దరినీ ట్రస్టీలుగా నియమిస్తారు. వారిద్దరూ ఈ హరికథలను స్కూళ్ళలోనూ ప్రతిఊరిలోనూ చెప్తూ ప్రాచుర్యం కల్పిస్తారు.
“మనిషి మారడానికి గొప్ప గ్రంథాలు చదవక్కర్లేదు, పెద్ద సంఘటనలు జరగక్కర్లేదు. మంచి మనుషులు చెప్పే ఒక్క మంచి మాట చాలు”
అలా తన స్వార్ధం తన సరదా తప్ప సమాజం గురించి ఆలోచించని సాంబమూర్తి శ్రీమన్నారాయణ చెలిమితో జీవి యొక్క పరమార్ధాన్ని కనుగొని తనకా బ్రహ్మోపదేశం చేసిన శ్రీమన్నారాయణ గారిని తండ్రిగా గౌరవించి తలకొరివి పెడతాననడంతో.. శ్రీమన్నారాయణ గారు కూడా లాయరూ, సాంబమూర్తి అందరూ తనమాటలు విని మారుతున్నారు కానీ తనకే ఇంకా జ్ఞానోదయం కాలేదని తెలుసుకుని “పరోపకారార్ధం ఇదం శరీరం” అని గుర్తుచేసుకుని, మనిషి చనిపోయినపుడు అంత్యక్రియలకు ఘనంగా పెట్టే ఖర్చు మరొక మనిషి బ్రతకడానికి ఉపయోగపడటంకన్నా పరమార్ధం లేదని గ్రహించి తన అంత్యక్రియలకోసం దాచుకున్న డబ్బును కూడా ట్రస్టుకు ఇచ్చివేసి సాంబమూర్తితో కలిసి మానవసేవలో ముందుకు వెళుతున్న తరుణంలో ఓ అనూహ్యమైన మలుపుతో సినిమా ముగుస్తుంది.

గంటాయాభై నిముషాల నిడివిగల ఈ చిత్రం నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు. అందుకు ఒక కారణం చిత్రం నిడివి మరొక కారణం వీనుల విందైన సంగీతం అయితే అసలు కారణం బాలు విశ్వనాథ్ ల మీదున్న అమితమైన ప్రేమ. సాంబమూర్తి పాత్ర స్వభావానికి తగ్గట్టుగా బాలు కాస్త అల్లరిగా ఉండటం ఆమనితో సరసాలు మాములుగా సినిమా చూసేవారికి కాస్త ఇబ్బంది కలిగిస్తాయి ఈ వయసులో ఏంటి ఈయన వేషాలు అని. కానీ సాంబయ్య చిన్నపిల్లాడి మనస్తత్వం ఆ ఆలూమగల మధ్య అనురాగాన్ని అర్ధం చేసుకోగలిగితే నాకు ఎబ్బెట్టుగా అనిపించలేదు. నాకు ఆయన మీదున్న అమితమైన ఇష్టం కూడా ఒకకారణం కావచ్చు. ఈ ఒక్క విషయాన్ని భరించగలిగితే ఓ కమ్మటి సినిమా చూసిన అనుభూతిని మిగులుస్తుంది. నటీనటుల నటన గురించి చెప్పనే అక్కర్లేదు సినిమా పూర్తయ్యాక కొందరు మనుషుల జీవితాల్లోకి తొంగి చూసిన అనుభూతి కలిగింది. లొకేషన్స్ సెట్టింగ్స్ హంగులూ ఆర్భాటాలు లేని ఈ సినిమా చూడటం కంటికి హాయిగా ఉంది.
"స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మాగాంధీ లేదా ఎక్కడినుండో ఈ దేశంవచ్చి ఎందరికో సేవ చేసి తరించిన మదర్ థెరిసా అంత ఘనంగా ప్రతి ఒక్కరు చేయలేకపోవచ్చు. చీమకు రెండు చక్కెరపలుకులు వాడిపోతున్న మొక్కకి రెండు నీటిచుక్కలు చల్లితే చాలు అదే ధన్యత."
ఇతర సాంకేతిక శాఖలన్నీ ఎవరి విధి వారు నిర్వర్తించినట్లుగా సరిగ్గా సరిపోయాయి అనిపించినా స్వరవీణాపాణి సంగీతం గురించి మాత్రం ఒక్కసారి ప్రస్థావించి తీరాల్సిందే.. చాలారోజులకు హాయైన సంగీతం విన్న అనుభూతి ఈ ఆడియో విన్నపుడు కలిగింది ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ ఆ సంగీతమే. నేపధ్యసంగీతం సన్నివేశాలకు తగ్గట్టు మూడ్ ని ఎలివేట్ చేస్తే మధ్య మధ్య వచ్చే ఐదు పాటలు రెండు హరికథలు అద్భుతంగా అనిపిస్తాయి. ఈ పాటల గురించి ప్లస్ సాహిత్యం కోసం నా పాటల బ్లాగ్ లో ఇక్కడ చూడండి.
“మనిషి జీవించినంతకాలం పరులకోసమే బ్రతకాలి”
“జననం ఎలా ఉన్నా జీవనం గొప్పగా ఉండాలి”
"జీవించి ఉన్న కాలంలో మనిషిచేసే మంచి పనుల పరిమళం మాత్రమే శాశ్వతం." 
“అతనికి ఊరినిండా స్థలాలే.. పెళ్ళాంగుండెలో తప్ప.”
“ఎందుకు ఏడుపు? ఎవడు పోయాడటా??.. పక్కింటి వాడు ఎదిగి పోయాడట.”
మనిషి మనసే దేవస్థానం అయితే ప్రతిదానిలోనూ దేవుని దర్శించుకోగలడనీ, మన శరీరంలోని ప్రతి అవయవం ఎంత విలువైనవో వాటిని సక్రమంగా వినియోగించుకోగలిగిన మనిషిని మించిన అదృష్టవంతుడు లేడంటూ చెప్పిన సంభాషణలు, ఇంకా సినిమా అంతటా అక్కడక్కడా సందేహ నివృత్తి ద్వారా చిలకరించిన సూక్తులు కొన్ని చాలా నచ్చాయి. సినిమా అయ్యాక ఒక మంచి ప్రయత్నాన్ని నావంతు బాధ్యతగా టిక్కెట్టుకొని థియేటర్లో చూసి ప్రోత్సహించానన్న తృప్తితో ఓ మంచి సినిమా చూశానన్న సంతోషంతో బయటకి వచ్చాను. హాలు మొత్తానికి ఒక ఇరవై మందికి మించి లేకపోవడం కాస్త నిరాశ పరిచినా వారం తర్వాత అదీ సెకండ్ షోకు గుంటూరులో ఆ మాత్రమైనా జనం వచ్చి చూసినందుకు ఆనందించాను.

13 కామెంట్‌లు:

  1. చూడబోతే చూడాల్సిన సినిమాలా ఉంది ..

    రిప్లయితొలగించండి
  2. మొదట్లో ఆసక్తి కనబరిచినా ఆ తర్వాత తగ్గిందీ సినిమా పట్ల.
    ఇప్పటీవరకూ నేనయితే నెగటివ్ ఒపీనియన్ తోనే ఉన్నానండీ.
    మీ రివ్యూ చదివాక చూడాల్సిన సినిమాలా అనిపిస్తుంది.
    బంగారు మురుగులు కధలో నానమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయ్ నాకు కొన్ని డైలాగ్స్ కి.

    బెంగుళూర్ ఎప్పుడొస్తుందో ఏమో..
    చక్కని రివ్యూ అండీ

    రిప్లయితొలగించండి
  3. చాల చక్క గా ఓపికగా ఒక మంచి అంశాన్ని ప్రతిపాదించారు, ఈ post ద్వారా! కృతజ్ఞుడను.
    దేవస్థానం Title నాన్ను inspire చేసింది తొలుత, next TV లో promo చూసి వెళ్ళాలి చూడాలి అని నిశ్చయించుకున్నాను,
    కాని నేను ఇప్పట్లో ఆ చిత్రం చూసే భాగ్యం లేకపోయింది. (వేరే చోట ఉంటున్న)
    కాని మీ ఈ వ్యాసం తో మమేకం అయ్యాక సినిమా చూసినంత పని అయ్యింది.
    అవకాశం ఉన్నప్పుడు వచ్చినప్పుడు తప్పని సరిగా చూస్తాను,
    ఇలాంటి ఉన్నతమైన అంశాలున్నవి మీ పరిగణ లోనికి వచ్చినప్పుడు జాగు చేయక ఎరుక పరుస్తూ ఉండండి,,, pls
    నాకు విశ్వనాథ వారి పట్ల బాలసుబ్రహ్మణ్యం గారి పట్ల ఆత్మీయ భావం వుంటుంది,
    చిన్న నాటి నుండీ ప్రతి వారానికో మారు TV ల పుణ్యమా అని మా ఇటికోచ్చే వాళ్ళు బుల్లె పెట్టెలో
    అంచేత వాళ్ళ మనో భావాలు, ఆదర్శ వంతమైన మనోచిన్తన శైలి నా ఆలోచనా దృక్పథం పై కొంత ప్రభావాన్ని చూపాయి కూడా!
    ఇలాంటి వాళ్ళు ఉండాలి,
    ఇటువంటి చిత్రాలు రావాలి,
    మీ సహన యుక్త సమీక్షకు నెనర్లు....!!

    చాల తృప్తిగా ఉన్నది sir మీ post చూసిన తరువాత

    I like this
    http://youtu.be/4CUwBg_5yag
    Song too!
    ఇక ఉంటానండి
    సాయిరాం
    ?!

    రిప్లయితొలగించండి
  4. వేణుగారూ....మీ సమీక్ష చూశాక ఎంత త్వరగా ఈ సినిమా చూద్దామా అని ఉంది....ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. “మనిషి మారడానికి గొప్ప గ్రంథాలు చదవక్కర్లేదు, పెద్ద సంఘటనలు జరగక్కర్లేదు. మంచి మనుషులు చెప్పే ఒక్క మంచి మాట చాలు”....avunu venu ilaanti manchi cinimaalu haal lo choosi encourage cheyyali...chaalaa chakkagaa vraasaavu

    రిప్లయితొలగించండి
  6. అర్జెంట్ గా వెళ్లి సినిమాని చూడాలనిపిస్తుంది:)) రివ్యూ చాలా బాగుంది వేణు గారు..

    రిప్లయితొలగించండి
  7. ఎంత వివరం గా రాసారు వేణు జీ ! Nice !

    రిప్లయితొలగించండి
  8. nE emta chUddAmanukunnAnO..avakASam lEdu..manasu PIkutOndi chUDaalani vEnu..adbhutamgA vrASaav..nuvvannadi nijanE edigins pillalunna dampatula madhya alaamti sannivESaalu kashTam kaanii okarinokaru pillalaa bhAvistunna dampatula madhya parlEdu..adi samamjasamE purtigaa

    రిప్లయితొలగించండి
  9. nE emta chUddAmanukunnAnO..avakASam lEdu..manasu PIkutOndi chUDaalani vEnu..adbhutamgA vrASaav..nuvvannadi nijanE edigins pillalunna dampatula madhya alaamti sannivESaalu kashTam kaanii okarinokaru pillalaa bhAvistunna dampatula madhya parlEdu..adi samamjasamE purtigaa

    రిప్లయితొలగించండి
  10. దేవుడిపై నమ్మకం, తెలుగుపై అపారమైన మక్కువ ఇవే మీతో దేవస్థానం సినిమా గురించి ఇంత బాగా వ్రాయటానికి కారణాలు అనుకుంటున్నా. నేను ఈ సినిమాకి editorగా చేసాను ఇంత మంచి సినిమా తీసినందుకు జనార్ఢన మహరిషి గారికి ప్రతిఫలం ఆర్దికంగా వెనకబడటం.

    రిప్లయితొలగించండి
  11. విజయమోహన్ గారు, వాసుగారు ధన్యవాదాలు పెద్దగా అంచనాలు లేకుండా చూడండి.
    థ్యాంక్స్ రాజ్ మరీ బొత్తిగా అంచనాలు పెట్టేసుకోకు లోటుపాట్లు లేకపోలేదు కానీ హాయైన సినిమా.
    ’ఎందుకో ఏమో’ గారు మీ కామెంట్ చూసి చాలాసంతోషం వేసిందండీ. తప్పకుండా నాదృష్టిలో పడిన మంచి ప్రయత్నాన్ని ప్రోత్సహించకుండా వదలను.
    థ్యాంక్స్ జ్యోతీర్మయి గారు, శశిగారు, ఫోటాన్, మనసుపలికే, శ్రావ్య.
    థ్యాంక్స్ శైలు నిజమే నువ్వు చెప్పినట్టు వారిద్దరు ఒకరికొకరుగా బ్రతుకుతున్నారుకనుక సహజమే అనిపిస్తుంది.
    రమేష్ గారు వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలండీ.. ఈ సినిమాకు వ్యాపార పరంగా వచ్చిన ఫలితాల గురించి నేనూ విని బాధపడ్డాను..

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.